N.Venugopal
-
మెస్సయ్య దాటిపోయాక...
ఆస్పత్రి ప్రారంభోత్సవానికి పెద్దాయన వచ్చాడు. ఆయన రాకముందే రంగస్థలాన్ని చాలా శ్రద్ధగా సిద్ధం చేశారు. ఎంతగానంటే రెండు గంటల ముందు నుంచే ఫొటోగ్రా ఫర్లు మండుటెండలో ఎదురు చూసేట్లు. తీరా ఆయనొచ్చాక ఎడమ వైపు ఫొటోగ్రాఫర్ల బృందాన్ని చూసి చీదరించుకున్నాడు. ఎందుకంటే అక్కడనుంచి ఫొటోలు తీస్తే ఆయన ముఖం కనపడదు. నీడలు మాత్రమే వస్తాయి. ఆగమేఘాల మీద అది కూడా సరి చేశారు. అపుడు తీరిగ్గా ‘ప్రాచీన భాష లిపిలో, లోహపు కడ్డీకి చుట్టుకున్న పాములాగా కనిపించే మతచిహ్నం’ ఉన్న శిలాఫలకానికి మొక్కి, లేచి నిలబడి హటాత్తుగా చెట్టు కూలినట్లు నేల మీద పడిపోయాడు. ఆ పడిపోవడం ఉద్దేశపూర్వకంగా చేశాడేమో అన్నట్లు చేతులు రెండూ రెండు వైపులా కచ్చితంగా పెట్టినట్లు పడి పోయాయి. ఆయన ఆస్పత్రికి ప్రణామం చేస్తున్నాడేమో, కొత్త తంతు రిహార్సల్ ఏమో అనుకున్నారు. కానీ పెద్దా యన చచ్చిపోయాడు. మెస్సయ్య దాటిపోయాడు. అతి పెద్ద ప్రజాస్వామ్య దేశానికి ప్రధాని అయిన పెద్దాయన అంతమై పోయాడు. ఆ తర్వాత ఏం జరిగింది?2023లో ఆకార్ పటేల్ ఇంగ్లిష్‌లో ‘ఆఫ్టర్ మెస్సయ్య’ (after messiah) నవల రాశారు. దాన్ని తెలుగులోకి ‘నియంత అంతం’ పేరుతో ఎన్. వేణుగోపాల్ అనువాదం చేస్తే ‘మలుపు’సంస్థ ప్రచురించింది. ఈ నవల అంతా కల్పనే. కానీ వాస్తవ భ్రాంతిని కలిగించే కల్పన. ‘జరుగుతున్నది ఇదే కదా!’ అని విస్తుపరిచే సంభావ్యత ఉన్న కల్పన. నియంత పాలించే కాలంలో ఆయన వైభవ కాంతి ముందు మిగతా లోకమంతా మసకలు కమ్ముతుంది. దేశభక్తి, మత రాజకీయాలు వినా ప్రజలకి గత్యంతరం ఉండదు. అభివృద్ధికి నిర్వచనాలు మారిపోతాయి. ప్రభుత్వాలను, వ్యవస్థలను, ప్రజలను తోలుబొమ్మలు చేసి ఆడించిన సూత్రగాడి తాళ్ళు పుటుక్కున తెగి దేశమంతా సంక్షోభపు చీకట్లలో మునిగి నపుడు, ‘ఆయన తర్వాత ఎవరు?’ అన్న ప్రశ్న పుట్టిన చోట కొత్త రాజకీయాలు మొదలవుతాయి.రాజకీయ పార్టీలలో నియంతృత్వ ధోరణుల వల్ల నాయకుల మరణం తర్వాత ప్రత్యామ్నాయం అంత తొందరగా తేలదు. దానికోసం కుమ్ములాటలు దేశానికి కొత్త కాదు. నియంతకి కుడిభుజంగా ఉండే జయేష్ భాయి, మత రాజకీయాల ద్వారా నూతనశక్తిగా ఎదిగే స్వామీజీల మధ్య పదవి కోసం జరిగే పోరు భారత రాజకీయ చరిత్ర పొడుగూతా జరిగిన అక్రమాలను స్ఫురింపజేస్తుంది. రిసార్టు డ్రామాలూ, కార్పొరేట్లతో లావాదేవీలూ, తమ ప్రయోజనాలకి అనుగుణమైన వాస్తవాలను నిర్మించే మీడియాల ‘పెనవేత రాజకీయాలూ’ అన్ని వ్యవస్థలనూ ప్రభావితం చేసి చట్టాన్నీ, న్యాయాన్నీ తమకి అను గుణంగా ఎలా మలుచుకుంటాయో చదివినపుడు దేశపౌరులుగా అభద్ర తకి లోనవుతాము. రాజ్యం ఎపుడూ తన మీద ఎవరో దాడి చేయ బోతున్నారనీ, తను బలహీనమైనదనీ ఊహించుకుంటుంది. అందుకోసం తన సమస్త శక్తులతో ఆ దాడిని ముందుగానే నిర్మూలించాలని అనుకుంటుంది. స్వతహాగా క్రూరమైన బలం ఉండడం వల్ల రాజ్యస్వభావం హింసతో కూడినదనీ, ప్రభుత్వాల హృదయమూ, ఆత్మా హింసేననీ నవల మొత్తం చెబుతుంది. అంతేకాదు ‘రాజ్యం అనేది ఒక హింసాత్మక రాజకీయ జంతువు’. ఈ జంతువుని చెడ్డవారు అధిరోహించినా అది హింసే. మంచివారు అధిరోహించినా హింసేనని తెలిసినపుడు కొంత వెలుగు మన ఆలోచనల మీద ప్రసరించి ఎరుక, దిగులూ కలుగుతాయి.ఆదివాసుల హక్కుల కోసం పనిచేసే మీరా – పార్టీలో ఒక సీనియర్ నాయకుని కూతురు. అనివార్య పరిస్థితుల్లో ఆపద్ధర్మ ప్రధాని అవుతుంది. పీడిత ప్రజలకోసం పనిచేసే మంచి వ్యక్తి ప్రధాని అయినా రాజ్యస్వభావం మారదు. ఆదివాసీ హక్కులను పరిరక్షించే ఒక చిన్న చట్టం అమలు లోకి తేవడానికి మీరా, అనేక అడ్డంకులను ఎదుర్కుని, తన విలువలను పణంగా పెట్టాల్సి వచ్చినపుడు అంబేడ్కర్ గుర్తుకు వస్తారు. రాజ్యాంగం... హింస నుంచి పీడితులకు రక్షణ కల్పిస్తుందని నమ్మి, ఆ సాధనలోనూ, హిందూ కోడ్ బిల్లుని ఆమోదింపజేసే సందర్భంలోనూ అంబేడ్కర్ రాజ్యం పెట్టిన ఒత్తిడికీ, హింసకూ లోనయ్యి కూడా ఎంత గట్టిగా నిలబడ్డారో, దానికోసం ఎంత త్యాగం చేశారో, ఎంత రాజీపడ్డారో చరిత్ర చెబుతుంది.ఆ ఒక్క చట్టం కోసం ప్రత్యర్థి ముఠాలకి మీరా ప్రయోజనాలు సమకూర్చాల్సి వస్తుంది. ఆదివాసీల మేలు కోసం చట్టం చేయడానికి మీరా రాజ్య హింసకు లోబడి పని చేసిందని తెలుసు కున్న ఆదివాసీ ప్రతినిధి బృందంవారు ఆమె ప్రతిపాదనలను తిరస్కరిస్తూ ఒక మాట అంటారు. ‘పీడనకు గురయ్యాము కనుక పీడనను తిరస్కరించడం కాదు, అసలు పీడన అనేదే చెడ్డది కనుక దాన్ని మొత్తంగా తిరస్కరించాలని, ఒక పీడనను తొలగించడం కోసం మరో చోట మరో సమూహాన్ని పీడనకు గురి చేయడం భావ్యం కాదని’ చెబుతారు. చివరికి పదవి నుంచి దిగిపోయి ఆదివాసీ పోరాటాలలో భాగం కావాలని కోరుకుంటుంది మీరా.చదవండి: ప్రధాని మోదీ పేరిట గణాంక విన్యాసం.. అసలు కథ ఇదే!ఉనికిలో ఉన్న రాజ్య వ్యవస్థే హింసాత్మకం అయినపుడు, ఎంత మంచి వ్యక్తీ దాన్ని మార్చలేనపుడు, మరి ఎటువంటి పరిపాలనా ప్రత్యామ్నాయాన్ని ఈ నవల సూచించింది! బహుశా ఈ చర్చ పాఠకులలో జరగాలని రచయిత కోరుకుని ఉండొచ్చు. లేదా మీరా ఎంచుకున్న మార్గాన్ని మనకు సూచనప్రాయంగా అందించి ఉండొచ్చు. ‘ఏ రాయి అయి తేనేమి’ అన్న నిర్లిప్తత పెరిగిపోయిన వర్తమానంలో భిన్న రాజకీయ శ్రేణుల మధ్య ప్రత్యామ్నాయ రాజకీయాల మీద చర్చ జరగాలి. ‘గమ్యమే మార్గాన్ని సమర్థిస్తుంది’ అన్న సూత్రాన్ని డీ కోడ్ చేయాలి.- కె.ఎన్. మల్లీశ్వరి‘ప్రరవే’ ఏపీ కార్యదర్శిmalleswari.kn2008@gmail.com -
సుతిమెత్తని హృదయపు మేరునగధీరుడు
అస్తమయం తొమ్మిదో తరగతి విద్యార్థిగా, 1947 మార్చి నవయుగలో 'ఓ విద్యార్థి సోదరుడా, సమ్మెయే మన ఆఖరాయుధమోయ్' అని రాసి, ఇతరులకు ఇచ్చిన ఉద్యమ జీవిత పిలుపును ఆయన ఆ తర్వాత డెబ్భై సంవత్సరాల పాటు ఒక్క క్షణం కూడ మరిచిపోకుండా పాటించారు. నిత్యవర్తమానమూ నిరంతర చలనశీలీ చలసాని ప్రసాద్ గురించి గతం అన్నట్టుగా రాయడమంటే విశాఖ సముద్రపు విషాదఘోష వినిపించడం తప్ప మరేమీ కాదు. ఆయనలోని ఎన్నెన్నో కోణాలను ఆయన బహుముఖ ప్రజ్ఞను చూసిన నాలుగున్నర దశాబ్దాల పరిచయంలో, స్నేహంలో, ప్రేమలో, వాత్సల్యంలో, ఆలోచనాచరణల సాహచర్యంలో ఏ శకలాన్ని తీసి చూపితే ఆయనను అర్థం చేయించగలను? విశాఖ సముద్రంలో ఏ ఒక్క అలను చూపి కడలిని రూపుకట్టించగలను? నలభై ఐదేళ్లుగా నన్నాయన పేరు పెట్టి పిలవడం కూడ దూరమే అనుకుని బాబూ అని పిలిచేవాడు. అంతరాంతర రహస్యాల్నీ, దుఃఖాల్నీ, ఆలోచనల్నీ, ఆనందాల్నీ ఎన్నిటినో పంచుకున్న ఆయనను ప్రసాద్‌గారూ అని పిలిచినా, చివరి రోజుల్లో చాదస్తం వస్తున్నదని విసుక్కున్నా ఆయన నా హృదయంలోని ఒక అవిభాజ్యమైన భాగం. ఇది నా ఒక్కడి అనుభవం మాత్రమే కాదు. బహుశా ఆయన గురించి అలా అనుకోగలిగినవాళ్లు తెలుగు సమాజంలో కొన్ని వేలమంది ఉండి ఉంటారు. ఈ కాలంలో అజాతశత్రువులూ, అందరికీ కావలసినవాళ్లూ ఉండే అవకాశం లేదు గాని, బహుశా ఆయన అటువంటి అసాధారణ జీవి. లోకమంతా తప్పుడు మనిషని విమర్శించే మనిషిని కూడ ఆయన ‘మంచాడే’ అనగలిగేవాడు. నాకు తెలిసి ఇద్దరే ఇద్దరి పేర్లు వింటేనే అసహ్యించుకునేవాడు తప్ప ఆయన తప్పుపట్టిన మూడో మనిషి పేరు నేను వినలేదు. తనకు ద్రోహం చేసినవాళ్లను కూడ ఆ ద్రోహం ఆనవాలు కూడ తాను చూడలేదన్నంతగా ప్రేమించాడు. కృష్ణా జిల్లా దివి తాలూకా నాదెళ్లవారిపాలెంలో 1932 డిసెంబర్ 8న పుట్టిన చలసాని ప్రసాద్ తన ప్రాంతాన్నీ కులాన్నీ వయసునూ కూడ అధిగమించి వేలాది మందికి స్నేహం పంచాడు. వేలాది మంది ప్రేమను చూరగొన్నాడు. ఒకవైపు తండ్రి చల్లపల్లి జమీందారు దగ్గర పనిచేస్తుండినా, 1930లలోనే కుటుంబంలోకి కమ్యూనిస్టు భావజాలం ప్రవేశించింది. అందుకే తానే ఒక ఇంటర్వ్యూలో చెప్పుకున్నట్టు, తన ఐదో ఏట, 1937 ఎన్నికల్లో భూస్వాముల జస్టిస్ పార్టీకి వ్యతిరేకంగా కమ్యూనిస్టులు బలపరచిన కాంగ్రెస్ అభ్యర్థుల ప్రచార ఊరేగింపులలో పాల్గొనడం తన తొలి జ్ఞాపకం. ఆ తర్వాత దశాబ్దం కృష్ణాతీరంలో మరిన్ని విప్లవ ప్రభంజనాలు వీచాయి. ఆయన కుటుంబమంతా కమ్యూనిస్టు పార్టీ కార్యకర్తలై, జమీందారీ వ్యతిరేక పోరాటాల్లో, తెలంగాణ సాయుధ పోరాటంలో భాగమయ్యారు. ఆ ఉద్యమాల మీద కాంగ్రెస్ ప్రభుత్వాల నిర్బంధంలో భాగంగా ఆయన పినతండ్రి జగన్నాథరావు, అన్న వాసుదేవరావు, బావ పాపారావు ముగ్గురినీ 1940 దశకం చివరిలో పోలీసులు కాల్చిచంపారు. అంటే ఆయన సరిగ్గా యవ్వన దశలో ప్రవేశిస్తున్న సమయానికే ఆయన ఏ మార్గంలో నడవవలసి ఉన్నదో నిర్ణయమైపోయింది. తొమ్మిదో తరగతి విద్యార్థిగా, స్టూడెంట్స్ ఫెడరేషన్ సభ్యుడిగా, 1947 మార్చి సంచిక నవయుగలో ‘ఓ విద్యార్థి సోదరుడా, సమ్మెయే మన ఆఖరాయుధమోయ్’ అని రాసి, ఇతరులకు ఇచ్చిన ఉద్యమ జీవిత పిలుపును ఆయన ఆ తర్వాత డెబ్భై సంవత్సరాల పాటు ఒక్క క్షణం కూడ మరిచిపోకుండా పాటించారు. ఆ ఉద్యమ జీవితమే ఆయనను సహజంగా సాహిత్యాభిమానంలోకి, సాహిత్యంలోకి నడిపించింది. 1955 ఎన్నికల ప్రచారంలో శ్రీశ్రీని వెన్నంటి ఉన్న సహచరుడిగా ఆయన శ్రీశ్రీకి అత్యంత సన్నిహితుడయ్యారు. శ్రీశ్రీ స్వయంగా ‘నా ఏకైక కైక’ అని సంబోధిస్తూ ప్రసాద్‌కు ఉత్తరాలు రాసేవారంటే, వాళ్లిద్దరి అవినాభావ సంబంధం అర్థమవుతుంది. ఈ ఉద్యమ జీవితం వల్ల నియతమైన చదువు సాగకపోయినా ప్రాచీన, ఆధునిక సాహిత్యమంతా ఆయనకు మేధలో మాత్రమే కాదు, హృదయమంతా నిండింది. ఎప్పుడు పిలిస్తే అప్పుడు నోటిమీద పలికే ధారణాశక్తీ వచ్చింది. ఆయన సొంత గ్రంథాలయం బహుశా తెలుగు సమాజంలో వ్యక్తిగత గ్రంథాలయాలలో అతిపెద్ద వాటిలో ఒకటి కావచ్చు. నియతమైన చదువు లేకపోవడం వల్ల కాజీపేట రైల్వేస్టేషన్ క్యాంటీన్లో ఉద్యోగం దగ్గరి నుంచి మిత్రులు తీసిన సినిమాలకు ప్రొడక్షన్ మేనేజర్ దాకా అనేక ఉద్యోగాలు చేసి చిట్టచివరికి ఎంఏ పొలిటికల్ సైన్స్ చదువుకుని 1960ల చివర విశాఖపట్నం మిసెస్ ఏవీఎన్ కాలేజీలో రాజనీతి శాస్త్ర అధ్యాపకుడిగా చేరి, మూడు దశాబ్దాలకు పైగా అక్కడే ఉన్నారు. తెలంగాణ రైతాంగ సాయుధపోరాట కాలం నుంచీ రావి నారాయణరెడ్డి, బద్దం ఎల్లారెడ్డి, సుందరయ్య, బసవపున్నయ్య వంటి ఎందరితోనో సాన్నిహిత్యం ఉన్నప్పటికీ, 1960ల మధ్య కాజీపేటలో ఉన్న రోజులనుంచే ఆయన కొండపల్లి సీతారామయ్య, కె.జి.సత్యమూర్తి ఆలోచనలకు దగ్గరయ్యారు. ఇక విశాఖపట్నం జీవితం, పొరుగున ఉన్న శ్రీకాకుళ విప్లవోద్యమంతో, నక్సల్బరీతో సంబంధాన్ని ఇచ్చింది. శ్రీశ్రీ అరవయ్యో పుట్టినరోజు సందర్భంగా ‘రచయితలారా, మీరెటువైపు’ అని విశాఖ విద్యార్థులు విసిరిన సవాలులో, ఆ సవాలుకు ప్రతిస్పందనగా జరిగిన పరిణామాలలో, శ్రీశ్రీని విప్లవ రచయితల సంఘం వైపు తీసుకురావడంలో చలసాని ప్రసాద్ పాత్ర ఇంకా పూర్తిగా చరిత్రకు ఎక్కవలసే ఉంది. ఆయనే చాలాసార్లు 1970 గురించి చెపుతూ రెస్ట్ ఈజ్ హిస్టరీ అన్నట్టు ఆ తర్వాత గడిచిన నలభై ఐదు సంవత్సరాలలో ఆయన ఇంకా ఎక్కువ చరిత్రను రచించారు, చరిత్రను నిర్మించారు. శ్రీశ్రీ సమగ్ర సాహిత్యం ఇరవై సంపుటాలనూ, కొడవటిగంటి కుటుంబరావు సాహిత్య సర్వస్వం పద్దెనిమిది సంపుటాలనూ ఒక్కచేతిమీద ప్రచురించడంలోగాని, వక్తగా, కార్యకర్తగా, నాయకుడిగా, సాహిత్య ప్రేమికుడిగా, పుస్తక ప్రేమికుడిగా, స్నేహశీలిగా రాష్ట్రంలోనూ, దేశంలోనూ వేలాది మంది హృదయాలలో తన సుతిమెత్తని హృదయంతో, నిరాడంబర ఆత్మీయతతో విద్యుత్తేజం నింపడంలో గానీ ఆయన మేరునగధీరుడు. మరొక కమ్యూనిస్టు సంప్రదాయపు కుటుంబం నుంచి వచ్చిన సహచరి విజయలక్ష్మి ఒక దశాబ్దం కింద మరణించినా పుస్తకాలతో, స్నేహితులతో, విశాఖ సమాజంతో కొనసాగిన ఆయన సాహచర్యం శనివారం ఉదయం ముగిసిపోయింది. ఎన్.వేణుగోపాల్ (వ్యాసకర్త ‘వీక్షణం’ సంపాదకుడు). -
వాన పడతాది జాన... ఎట్ట బొమ్మందునో...
జ్ఞాపకం ‘‘నేను హనుమకొండకు వచ్చిన తర్వాత వెలువడిన ‘సృజన’ సంచిక జూలై 1973. అప్పటికే ఎన్.కె, జనసేన, కానూరి వెంకటేశ్వరరావుల పాటలు విని, వాటిలో కవిత్వం కొంతైనా అనుభవించి ఉన్నానుగాని ఆ సంచికలోనే మొదటిసారిగా వి.బి. గద్దర్ పాటలు చూశాను. అప్పటికే లయ ఉన్న కవిత్వం, గొంతెత్తి చదువుకునే కవిత్వం రుచి దొరికి ఉన్న నాకు ఆ సంచికలో అచ్చయిన నాలుగు గద్దర్ పాటలు కొత్త కవిత్వాన్ని పరిచయం చేశాయి. ‘నీవు నిజం దెలుసుకోవరో కూలన్న నీవు నడుం గట్టి నడవాలి రైతన్నా’... ‘రిక్షాదొక్కేరహీమన్న రాళ్లుగొట్టే రామన్న డ్రైవర్ మల్లన్న హమాలి కొమ్రన్న’... ‘వాన పడతాది జాన ఎట్టబొమ్మందునో’ ‘కల్లుముంతో మాయమ్మ నిన్ను మరువజాలనే’... అనే పాటలు చదువుతుంటే ఒళ్లు పులకించింది. ఇంత మామూలు మాటలతో ఇంతగా ఉద్రేకపరిచే కవిత్వం ఉంటుందా అని ఆశ్చర్యం వేసింది. ఆ తర్వాత మూడు నెలలకు ఆ పాటలు గద్దర్ నోటి వెంట విన్నప్పుడు కలిగిన ఉత్తేజం నిజంగా చెప్పడం అసాధ్యం. నిజానికి గద్దర్ పాటలు అచ్చుకెక్కడం అదే మొదటిసారి. అందుకే అవి అచ్చవుతున్నప్పుడు సృజన సంపాదకీయ వ్యాఖ్య కూడా రాసింది. ‘ఈ సంచికలోనూ రాగల వొకటి రెండు సంచికల్లోనూ ఎక్కువ సంఖ్యలో వేయనున్న వి.బి.గద్దర్ పాటలు త్వరలో పుస్తకరూపంలో కూడా వస్తాయి. హైదరాబాద్ జిల్లా మాండలికాలు, అక్కడి ప్రజాజీవితం మాత్రమే కాదు- ఈ పాటలన్నీ ఆ చుట్టుపట్ల పల్లెల్లో ప్రజలు పాడుకునే బాణీల్లో వచ్చినవే. కొన్ని పాటల మకుటాలు చరణాలు కూడా ప్రజలు పడుకునే పాటల నుంచే తీసుకుని విప్లవభావాలకు అనుగుణంగా మలచినవి. ఈనాడివి హైదరాబాద్ చుట్టూ దాదాపు ఇరవై గ్రామాల్లో విరివిగా పాడుకోబడుతున్నాయి’ అని సృజన రాసింది. అప్పటికి ఎంత అర్థమయ్యాయో చెప్పలేనుగాని ఆ తర్వాత నాలుగు నెలలు నిజంగా జీవితం మారిపోయిన రోజులు. ఆ తర్వాత వెలువడిన ఆగస్ట్ 1973 సంచికలో ‘వీడేనమ్మో డబ్బున్న బాడుకావు’, ‘పోదామురో జనసేనలో కలిసి’, సెప్టెంబర్ 1973 సంచికలో ‘రెక్కబొక్క వొయ్యకుండ సుక్కసెమ్ట వొడ్వకుండ బొర్ర బాగా బెంచావురో దొరోడో’, ‘పిల్లో నేనెల్లిపోతా’, ‘నిజం తెలుసుకోవరో కూలన్న’... గద్దర్ పాటల ప్రభంజనం. - ఎన్. వేణుగోపాల్ ఫేస్బుక్ గ్రూప్ ‘కవి సంగమం’లో ‘కవిత్వంతో ములాకాత్’ పేరిట వస్తున్న వ్యాస పరంపర నుంచి