ఆస్పత్రి ప్రారంభోత్సవానికి పెద్దాయన వచ్చాడు. ఆయన రాకముందే రంగస్థలాన్ని చాలా శ్రద్ధగా సిద్ధం చేశారు. ఎంతగానంటే రెండు గంటల ముందు నుంచే ఫొటోగ్రా ఫర్లు మండుటెండలో ఎదురు చూసేట్లు. తీరా ఆయనొచ్చాక ఎడమ వైపు ఫొటోగ్రాఫర్ల బృందాన్ని చూసి చీదరించుకున్నాడు. ఎందుకంటే అక్కడనుంచి ఫొటోలు తీస్తే ఆయన ముఖం కనపడదు. నీడలు మాత్రమే వస్తాయి. ఆగమేఘాల మీద అది కూడా సరి చేశారు. అపుడు తీరిగ్గా ‘ప్రాచీన భాష లిపిలో, లోహపు కడ్డీకి చుట్టుకున్న పాములాగా కనిపించే మతచిహ్నం’ ఉన్న శిలాఫలకానికి మొక్కి, లేచి నిలబడి హటాత్తుగా చెట్టు కూలినట్లు నేల మీద పడిపోయాడు. ఆ పడిపోవడం ఉద్దేశపూర్వకంగా చేశాడేమో అన్నట్లు చేతులు రెండూ రెండు వైపులా కచ్చితంగా పెట్టినట్లు పడి పోయాయి. ఆయన ఆస్పత్రికి ప్రణామం చేస్తున్నాడేమో, కొత్త తంతు రిహార్సల్ ఏమో అనుకున్నారు. కానీ పెద్దా యన చచ్చిపోయాడు. మెస్సయ్య దాటిపోయాడు. అతి పెద్ద ప్రజాస్వామ్య దేశానికి ప్రధాని అయిన పెద్దాయన అంతమై పోయాడు. ఆ తర్వాత ఏం జరిగింది?
2023లో ఆకార్ పటేల్ ఇంగ్లిష్‌లో ‘ఆఫ్టర్ మెస్సయ్య’ (after messiah) నవల రాశారు. దాన్ని తెలుగులోకి ‘నియంత అంతం’ పేరుతో ఎన్. వేణుగోపాల్ అనువాదం చేస్తే ‘మలుపు’సంస్థ ప్రచురించింది. ఈ నవల అంతా కల్పనే. కానీ వాస్తవ భ్రాంతిని కలిగించే కల్పన. ‘జరుగుతున్నది ఇదే కదా!’ అని విస్తుపరిచే సంభావ్యత ఉన్న కల్పన. నియంత పాలించే కాలంలో ఆయన వైభవ కాంతి ముందు మిగతా లోకమంతా మసకలు కమ్ముతుంది. దేశభక్తి, మత రాజకీయాలు వినా ప్రజలకి గత్యంతరం ఉండదు. అభివృద్ధికి నిర్వచనాలు మారిపోతాయి. ప్రభుత్వాలను, వ్యవస్థలను, ప్రజలను తోలుబొమ్మలు చేసి ఆడించిన సూత్రగాడి తాళ్ళు పుటుక్కున తెగి దేశమంతా సంక్షోభపు చీకట్లలో మునిగి నపుడు, ‘ఆయన తర్వాత ఎవరు?’ అన్న ప్రశ్న పుట్టిన చోట కొత్త రాజకీయాలు మొదలవుతాయి.
రాజకీయ పార్టీలలో నియంతృత్వ ధోరణుల వల్ల నాయకుల మరణం తర్వాత ప్రత్యామ్నాయం అంత తొందరగా తేలదు. దానికోసం కుమ్ములాటలు దేశానికి కొత్త కాదు. నియంతకి కుడిభుజంగా ఉండే జయేష్ భాయి, మత రాజకీయాల ద్వారా నూతనశక్తిగా ఎదిగే స్వామీజీల మధ్య పదవి కోసం జరిగే పోరు భారత రాజకీయ చరిత్ర పొడుగూతా జరిగిన అక్రమాలను స్ఫురింపజేస్తుంది. రిసార్టు డ్రామాలూ, కార్పొరేట్లతో లావాదేవీలూ, తమ ప్రయోజనాలకి అనుగుణమైన వాస్తవాలను నిర్మించే మీడియాల ‘పెనవేత రాజకీయాలూ’ అన్ని వ్యవస్థలనూ ప్రభావితం చేసి చట్టాన్నీ, న్యాయాన్నీ తమకి అను గుణంగా ఎలా మలుచుకుంటాయో చదివినపుడు దేశపౌరులుగా అభద్ర తకి లోనవుతాము.
రాజ్యం ఎపుడూ తన మీద ఎవరో దాడి చేయ బోతున్నారనీ, తను బలహీనమైనదనీ ఊహించుకుంటుంది. అందుకోసం తన సమస్త శక్తులతో ఆ దాడిని ముందుగానే నిర్మూలించాలని అనుకుంటుంది. స్వతహాగా క్రూరమైన బలం ఉండడం వల్ల రాజ్యస్వభావం హింసతో కూడినదనీ, ప్రభుత్వాల హృదయమూ, ఆత్మా హింసేననీ నవల మొత్తం చెబుతుంది. అంతేకాదు ‘రాజ్యం అనేది ఒక హింసాత్మక రాజకీయ జంతువు’. ఈ జంతువుని చెడ్డవారు అధిరోహించినా అది హింసే. మంచివారు అధిరోహించినా హింసేనని తెలిసినపుడు కొంత వెలుగు మన ఆలోచనల మీద ప్రసరించి ఎరుక, దిగులూ కలుగుతాయి.
ఆదివాసుల హక్కుల కోసం పనిచేసే మీరా – పార్టీలో ఒక సీనియర్ నాయకుని కూతురు. అనివార్య పరిస్థితుల్లో ఆపద్ధర్మ ప్రధాని అవుతుంది. పీడిత ప్రజలకోసం పనిచేసే మంచి వ్యక్తి ప్రధాని అయినా రాజ్యస్వభావం మారదు. ఆదివాసీ హక్కులను పరిరక్షించే ఒక చిన్న చట్టం అమలు లోకి తేవడానికి మీరా, అనేక అడ్డంకులను ఎదుర్కుని, తన విలువలను పణంగా పెట్టాల్సి వచ్చినపుడు అంబేడ్కర్ గుర్తుకు వస్తారు. రాజ్యాంగం... హింస నుంచి పీడితులకు రక్షణ కల్పిస్తుందని నమ్మి, ఆ సాధనలోనూ, హిందూ కోడ్ బిల్లుని ఆమోదింపజేసే సందర్భంలోనూ అంబేడ్కర్ రాజ్యం పెట్టిన ఒత్తిడికీ, హింసకూ లోనయ్యి కూడా ఎంత గట్టిగా నిలబడ్డారో, దానికోసం ఎంత త్యాగం చేశారో, ఎంత రాజీపడ్డారో చరిత్ర చెబుతుంది.
ఆ ఒక్క చట్టం కోసం ప్రత్యర్థి ముఠాలకి మీరా ప్రయోజనాలు సమకూర్చాల్సి వస్తుంది. ఆదివాసీల మేలు కోసం చట్టం చేయడానికి మీరా రాజ్య హింసకు లోబడి పని చేసిందని తెలుసు కున్న ఆదివాసీ ప్రతినిధి బృందంవారు ఆమె ప్రతిపాదనలను తిరస్కరిస్తూ ఒక మాట అంటారు. ‘పీడనకు గురయ్యాము కనుక పీడనను తిరస్కరించడం కాదు, అసలు పీడన అనేదే చెడ్డది కనుక దాన్ని మొత్తంగా తిరస్కరించాలని, ఒక పీడనను తొలగించడం కోసం మరో చోట మరో సమూహాన్ని పీడనకు గురి చేయడం భావ్యం కాదని’ చెబుతారు. చివరికి పదవి నుంచి దిగిపోయి ఆదివాసీ పోరాటాలలో భాగం కావాలని కోరుకుంటుంది మీరా.
చదవండి: ప్రధాని మోదీ పేరిట గణాంక విన్యాసం.. అసలు కథ ఇదే!
ఉనికిలో ఉన్న రాజ్య వ్యవస్థే హింసాత్మకం అయినపుడు, ఎంత మంచి వ్యక్తీ దాన్ని మార్చలేనపుడు, మరి ఎటువంటి పరిపాలనా ప్రత్యామ్నాయాన్ని ఈ నవల సూచించింది! బహుశా ఈ చర్చ పాఠకులలో జరగాలని రచయిత కోరుకుని ఉండొచ్చు. లేదా మీరా ఎంచుకున్న మార్గాన్ని మనకు సూచనప్రాయంగా అందించి ఉండొచ్చు. ‘ఏ రాయి అయి తేనేమి’ అన్న నిర్లిప్తత పెరిగిపోయిన వర్తమానంలో భిన్న రాజకీయ శ్రేణుల మధ్య ప్రత్యామ్నాయ రాజకీయాల మీద చర్చ జరగాలి. ‘గమ్యమే మార్గాన్ని సమర్థిస్తుంది’ అన్న సూత్రాన్ని డీ కోడ్ చేయాలి.
- కె.ఎన్. మల్లీశ్వరి
‘ప్రరవే’ ఏపీ కార్యదర్శి
malleswari.kn2008@gmail.com
Comments
Please login to add a commentAdd a comment