aakar patel
-
మెస్సయ్య దాటిపోయాక...
ఆస్పత్రి ప్రారంభోత్సవానికి పెద్దాయన వచ్చాడు. ఆయన రాకముందే రంగస్థలాన్ని చాలా శ్రద్ధగా సిద్ధం చేశారు. ఎంతగానంటే రెండు గంటల ముందు నుంచే ఫొటోగ్రా ఫర్లు మండుటెండలో ఎదురు చూసేట్లు. తీరా ఆయనొచ్చాక ఎడమ వైపు ఫొటోగ్రాఫర్ల బృందాన్ని చూసి చీదరించుకున్నాడు. ఎందుకంటే అక్కడనుంచి ఫొటోలు తీస్తే ఆయన ముఖం కనపడదు. నీడలు మాత్రమే వస్తాయి. ఆగమేఘాల మీద అది కూడా సరి చేశారు. అపుడు తీరిగ్గా ‘ప్రాచీన భాష లిపిలో, లోహపు కడ్డీకి చుట్టుకున్న పాములాగా కనిపించే మతచిహ్నం’ ఉన్న శిలాఫలకానికి మొక్కి, లేచి నిలబడి హటాత్తుగా చెట్టు కూలినట్లు నేల మీద పడిపోయాడు. ఆ పడిపోవడం ఉద్దేశపూర్వకంగా చేశాడేమో అన్నట్లు చేతులు రెండూ రెండు వైపులా కచ్చితంగా పెట్టినట్లు పడి పోయాయి. ఆయన ఆస్పత్రికి ప్రణామం చేస్తున్నాడేమో, కొత్త తంతు రిహార్సల్ ఏమో అనుకున్నారు. కానీ పెద్దా యన చచ్చిపోయాడు. మెస్సయ్య దాటిపోయాడు. అతి పెద్ద ప్రజాస్వామ్య దేశానికి ప్రధాని అయిన పెద్దాయన అంతమై పోయాడు. ఆ తర్వాత ఏం జరిగింది?2023లో ఆకార్ పటేల్ ఇంగ్లిష్‌లో ‘ఆఫ్టర్ మెస్సయ్య’ (after messiah) నవల రాశారు. దాన్ని తెలుగులోకి ‘నియంత అంతం’ పేరుతో ఎన్. వేణుగోపాల్ అనువాదం చేస్తే ‘మలుపు’సంస్థ ప్రచురించింది. ఈ నవల అంతా కల్పనే. కానీ వాస్తవ భ్రాంతిని కలిగించే కల్పన. ‘జరుగుతున్నది ఇదే కదా!’ అని విస్తుపరిచే సంభావ్యత ఉన్న కల్పన. నియంత పాలించే కాలంలో ఆయన వైభవ కాంతి ముందు మిగతా లోకమంతా మసకలు కమ్ముతుంది. దేశభక్తి, మత రాజకీయాలు వినా ప్రజలకి గత్యంతరం ఉండదు. అభివృద్ధికి నిర్వచనాలు మారిపోతాయి. ప్రభుత్వాలను, వ్యవస్థలను, ప్రజలను తోలుబొమ్మలు చేసి ఆడించిన సూత్రగాడి తాళ్ళు పుటుక్కున తెగి దేశమంతా సంక్షోభపు చీకట్లలో మునిగి నపుడు, ‘ఆయన తర్వాత ఎవరు?’ అన్న ప్రశ్న పుట్టిన చోట కొత్త రాజకీయాలు మొదలవుతాయి.రాజకీయ పార్టీలలో నియంతృత్వ ధోరణుల వల్ల నాయకుల మరణం తర్వాత ప్రత్యామ్నాయం అంత తొందరగా తేలదు. దానికోసం కుమ్ములాటలు దేశానికి కొత్త కాదు. నియంతకి కుడిభుజంగా ఉండే జయేష్ భాయి, మత రాజకీయాల ద్వారా నూతనశక్తిగా ఎదిగే స్వామీజీల మధ్య పదవి కోసం జరిగే పోరు భారత రాజకీయ చరిత్ర పొడుగూతా జరిగిన అక్రమాలను స్ఫురింపజేస్తుంది. రిసార్టు డ్రామాలూ, కార్పొరేట్లతో లావాదేవీలూ, తమ ప్రయోజనాలకి అనుగుణమైన వాస్తవాలను నిర్మించే మీడియాల ‘పెనవేత రాజకీయాలూ’ అన్ని వ్యవస్థలనూ ప్రభావితం చేసి చట్టాన్నీ, న్యాయాన్నీ తమకి అను గుణంగా ఎలా మలుచుకుంటాయో చదివినపుడు దేశపౌరులుగా అభద్ర తకి లోనవుతాము. రాజ్యం ఎపుడూ తన మీద ఎవరో దాడి చేయ బోతున్నారనీ, తను బలహీనమైనదనీ ఊహించుకుంటుంది. అందుకోసం తన సమస్త శక్తులతో ఆ దాడిని ముందుగానే నిర్మూలించాలని అనుకుంటుంది. స్వతహాగా క్రూరమైన బలం ఉండడం వల్ల రాజ్యస్వభావం హింసతో కూడినదనీ, ప్రభుత్వాల హృదయమూ, ఆత్మా హింసేననీ నవల మొత్తం చెబుతుంది. అంతేకాదు ‘రాజ్యం అనేది ఒక హింసాత్మక రాజకీయ జంతువు’. ఈ జంతువుని చెడ్డవారు అధిరోహించినా అది హింసే. మంచివారు అధిరోహించినా హింసేనని తెలిసినపుడు కొంత వెలుగు మన ఆలోచనల మీద ప్రసరించి ఎరుక, దిగులూ కలుగుతాయి.ఆదివాసుల హక్కుల కోసం పనిచేసే మీరా – పార్టీలో ఒక సీనియర్ నాయకుని కూతురు. అనివార్య పరిస్థితుల్లో ఆపద్ధర్మ ప్రధాని అవుతుంది. పీడిత ప్రజలకోసం పనిచేసే మంచి వ్యక్తి ప్రధాని అయినా రాజ్యస్వభావం మారదు. ఆదివాసీ హక్కులను పరిరక్షించే ఒక చిన్న చట్టం అమలు లోకి తేవడానికి మీరా, అనేక అడ్డంకులను ఎదుర్కుని, తన విలువలను పణంగా పెట్టాల్సి వచ్చినపుడు అంబేడ్కర్ గుర్తుకు వస్తారు. రాజ్యాంగం... హింస నుంచి పీడితులకు రక్షణ కల్పిస్తుందని నమ్మి, ఆ సాధనలోనూ, హిందూ కోడ్ బిల్లుని ఆమోదింపజేసే సందర్భంలోనూ అంబేడ్కర్ రాజ్యం పెట్టిన ఒత్తిడికీ, హింసకూ లోనయ్యి కూడా ఎంత గట్టిగా నిలబడ్డారో, దానికోసం ఎంత త్యాగం చేశారో, ఎంత రాజీపడ్డారో చరిత్ర చెబుతుంది.ఆ ఒక్క చట్టం కోసం ప్రత్యర్థి ముఠాలకి మీరా ప్రయోజనాలు సమకూర్చాల్సి వస్తుంది. ఆదివాసీల మేలు కోసం చట్టం చేయడానికి మీరా రాజ్య హింసకు లోబడి పని చేసిందని తెలుసు కున్న ఆదివాసీ ప్రతినిధి బృందంవారు ఆమె ప్రతిపాదనలను తిరస్కరిస్తూ ఒక మాట అంటారు. ‘పీడనకు గురయ్యాము కనుక పీడనను తిరస్కరించడం కాదు, అసలు పీడన అనేదే చెడ్డది కనుక దాన్ని మొత్తంగా తిరస్కరించాలని, ఒక పీడనను తొలగించడం కోసం మరో చోట మరో సమూహాన్ని పీడనకు గురి చేయడం భావ్యం కాదని’ చెబుతారు. చివరికి పదవి నుంచి దిగిపోయి ఆదివాసీ పోరాటాలలో భాగం కావాలని కోరుకుంటుంది మీరా.చదవండి: ప్రధాని మోదీ పేరిట గణాంక విన్యాసం.. అసలు కథ ఇదే!ఉనికిలో ఉన్న రాజ్య వ్యవస్థే హింసాత్మకం అయినపుడు, ఎంత మంచి వ్యక్తీ దాన్ని మార్చలేనపుడు, మరి ఎటువంటి పరిపాలనా ప్రత్యామ్నాయాన్ని ఈ నవల సూచించింది! బహుశా ఈ చర్చ పాఠకులలో జరగాలని రచయిత కోరుకుని ఉండొచ్చు. లేదా మీరా ఎంచుకున్న మార్గాన్ని మనకు సూచనప్రాయంగా అందించి ఉండొచ్చు. ‘ఏ రాయి అయి తేనేమి’ అన్న నిర్లిప్తత పెరిగిపోయిన వర్తమానంలో భిన్న రాజకీయ శ్రేణుల మధ్య ప్రత్యామ్నాయ రాజకీయాల మీద చర్చ జరగాలి. ‘గమ్యమే మార్గాన్ని సమర్థిస్తుంది’ అన్న సూత్రాన్ని డీ కోడ్ చేయాలి.- కె.ఎన్. మల్లీశ్వరి‘ప్రరవే’ ఏపీ కార్యదర్శిmalleswari.kn2008@gmail.com -
నైతిక సందిగ్ధతల అంతస్సంఘర్షణ
సరైన ఫలితాన్ని సాధించడానికి సరైనవి కాని మార్గాలను అనుసరించడం ఆమోదయోగ్యమేనా? ‘‘అర్థవంతమైన దానిని సాధించడం కోసం మనం నమ్మిన సిద్ధాంతాలు, మనం పాటించే విలువలు, మనం అనుసరించే ప్రమాణాలలో కొన్నింటిని త్యాగం చెయ్యడం కూడా గౌరవనీయమే’’ అనే వాదన రాజకీయాలలో ఉంది. ఒక శక్తిమంతమైన నిర్ణయం తీసుకోడానికి ప్రధాని తన కార్యాలయానికి ఉన్న అపారమైన అధికారాలను ఎలాంటి నైతికపరమైన సంకోచాలూ లేకుండా ఉపయోగించడం ఆత్మ సమ్మతం అవుతుందా? కాలమిస్ట్ ఆకార్ పటేల్ తొలి నవల ‘ఆఫ్టర్ మెస్సయ’... గొప్ప ఉద్విగ్నతకు లోను చేసే సాంప్రదాయిక రాజకీయ రచనల మాదిరిగా కాకుండా... రాజకీయాల సహజ స్వభావాన్ని, గొప్ప విజయాలు తరచు సిగ్గుచేటు సర్దుబాట్ల నుంచి సంప్రాప్తించడంలోని వైరుద్ధ్యాన్ని ప్రతిబింబిస్తోంది. నిజం చెప్పొద్దూ... తనొక నవల రాశానని ఆకార్ పటేల్ నాతో అన్నప్పుడు నేను ఆశ్చర్యచకితుణ్ణే అయ్యాను. పటేల్‌ను ఒక దృష్టికోణం గల పత్రికా రచయితగా, మోదీ ప్రభుత్వాన్ని తూర్పార పట్టే ఒక గట్టి రాజకీయ వ్యాసకర్తగా, ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్‌కు ధీశాలి అయిన ఛైర్మన్‌గానే నేను ఎరుగుదును. అంతే తప్ప, కాల్పనికత అయన అజ్ఞాత బలం అయి ఉంటుందని నేను ఏ కోశానా అనుకోలేదు. ఇంతేనా నాకు పటేల్ గురించి తెలిసింది! కథనానికి లోతైన నైతిక కోణాన్ని అందించే అంతస్సంఘర్షణతో పాత్రలను సృష్టించగల సామర్థ్యంతో పాటుగా ఆయన ఊహాశక్తిలోని ప్రతిభను, కదలనివ్వని కథన పటిమను ఆయన తాజా రచన ‘ఆఫ్టర్ మెస్సయ’ బహిర్గతం చేస్తోంది. గొప్ప ఉద్విగ్నతకు లోను చేసే సాంప్రదాయిక రాజకీయ రచనల మాదిరిగా కాకుండా ఈ పుస్తకం రాజకీయాల సహజ స్వభావాన్ని, గొప్ప విజయాలు తరచు సిగ్గుచేటు సర్దుబాట్ల నుంచి సంప్రా ప్తించడంలోని వైరుధ్యాన్ని ప్రతిబింబిస్తోంది. ఈ నవలొక వాస్తవ ఘటనల అల్లికగా ప్రారంభం అవుతుంది. నిజమైన వ్యక్తులు ఉంటారు. అయితే వారికి పెట్టుడు పేర్లు ఉంటాయి. ప్రధాన మంత్రిని ‘ది బిగ్ మ్యాన్’ అంటారు పటేల్. పుస్తకంలో ఎక్కడా ప్రధాని పేరు కనిపించదు. కానీ ఆ బిగ్ మ్యాన్ మాట్లాడే టప్పుడు ‘‘ప్రజాస్వామ్యం యొక్క భాష, చిహ్నాలు... పాలకుడు తన గురించి తను మూడో వ్యక్తిగా వ్యక్తం చేసుకుంటున్న ప్రస్తావనలతో కలిసి ఉంటాయి.’’ అది మొదటి గుర్తు. ఆ బిగ్ మ్యాన్ ప్రారంభోత్సవాలను కూడా ఇష్టపడతారు కనుక, ‘‘బిగ్ మ్యాన్ అధ్యక్షత వహించేందుకు వీలైనంతగా అత్యుత్తమమైన ఒక కార్యక్రమాన్ని లేదా వేడుకను అందించడంపై మంత్రిత్వశాఖలు దృష్టి పెడతాయి.’’ అది రెండవ గుర్తు. ఇక మూడోది... ‘‘రాజకీయ వ్యతిరేకత. అదేదో అంతర్గత శత్రువైనట్లుగా దానిపై హింసాత్మక దాడులు జరుగుతుంటాయి. ప్రభుత్వం, దర్యాప్తు సంస్థలు ఆ శత్రువును చావనివ్వని, బతకనివ్వని వాస్తవ రాజకీయా లకు అతీతమైన ఒక నిరంతర స్థితిలో ఉంచడంలో పూర్తిగా నిమగ్నం అయి ఉంటాయి’’. ఇప్పుడీ పుస్తకంలోని అబ్బుర పరుస్తూ చదివించే సంతోష దాయకమైన సృజనాత్మక ముగింపు గురించి తప్ప మరింకేదీ బహిర్గతం చేయడం నాకు ఇష్టం లేదు. బదులుగా ఇందులో పటేల్ కథనానికి పునాదిగా జరిగిన శక్తిమంతమైన రాజకీయ... నిజానికి నైతికపరమైన చర్చ గురించి మీకు చెబుతాను. పటేల్ పుస్తకంలో బిగ్ మ్యాన్ చాలా త్వరగా చనిపోతాడు. ఆయన తర్వాత మీరా అనే మహిళ అధికారంలోకి వస్తారు. ‘లాయర్స్ కలెక్టివ్’ అనే ఎన్జీవోకు పని చేస్తుంటారు మీరా. ఆమె అవివాహిత.ఒంటరి తల్లి. ఆమె కుమార్తె జైల్లో ఉంటుంది. బిగ్ మ్యాన్, ఆయన పార్టీ అనుసరించిన రాజకీయ విధానాలపై మీరాకు తృణీకారభావం ఉంటుంది. అనిష్టంగానే ప్రధాని అవుతారు. అయ్యాక మాత్రం గతంలోని క్రూరమైన చట్టాలను రద్దు చేయడం కోసం అపారమైన తన కార్యాలయ అధికారాలను ఉపయోగించు కోవాలనుకుంటారు. పేదల ఆత్మగౌరవాన్ని పునరుద్ధరించే ప్రయత్నంగా ప్రభుత్వాన్ని బాధ్యతాయుతంగా, జవాబుదారీగా మార్చేయబోతారు. అయితే సమస్య ఎక్కడొస్తుందంటే ఆమె తన కార్యాలయ అపరిమిత అధికారాలను అభ్యంతరం, అనైతికం అయిన మార్గాలలో ఉపయోగించవలసి రావడం. ఇక్కడ జనించే ప్రశ్న: సరైన ఫలితాన్ని సాధించడానికి సరైనవి కాని మార్గాలను అనుసరించడం ఆమోదయోగ్యమేనా? అన్నది. ఆమె ముఖ్య సలహాదారు... ఆ సలహాదారుకు పేరేం ఉండదు... ‘హౌస్ మేనేజర్’ అంతే. ఆ మేనేజర్‌కు ఇది ఆమోదయోగ్యమే అనిపి స్తుంది. ‘‘అర్థవంతమైన దానిని సాధించడం కోసం మీరు నమ్మిన సిద్ధాంతాలు, మీరు పాటించే విలువలు, మీరు అనుసరించే ప్రమాణాలలో కొన్నింటిని త్యాగం చెయ్యడం గౌరవనీయం,ప్రశంసనీయం అయిన సంగతే’’ అంటారు హౌస్ మేనేజర్. కానీ అందువల్ల ప్రయోజనం పొందగలిగిన సగటు ప్రజలు దానిని అంగీకరించరు. మీరా వారిని సంప్రదించినప్పుడు ఒక వృద్ధురాలు... తరచు నిరాకరణకు గురవుతుండే, అదే సమయంలో సర్వకాలాలకు అమోదయోగ్యమైనదిగా ఉండే యుగాల వివేకాన్ని వ్యక్తపరుస్తుంది. ‘‘చేయవలసిన సరైనది ఒకే ఒకటి ఉంటుంది. అదే సరైనది’’ అని అంటుంది. ఈ విధంగా పటేల్ పుస్తకం ముగింపునకు చేరుకుంటున్న కొద్దీ భారత రాజకీయాల స్వభావం గురించి; ఒకవైపు ఎత్తుగడలూ వ్యూహాలకూ, మరోవైపు సిద్ధాంతాలూ నైతికతలకూ మధ్య జరుగు తుండే ఘర్షణలతో ఒక శక్తిమంతమైన కథగా అభివృద్ధి చెందుతుంది. ప్రధాని కార్యాలయానికి ఉండే అపారమైన అధికారాలను నైతిక పరమైన సంకోచాలు లేకుండా, అనుకున్న దానిని సాధించేందుకు మీరా ఏకచిత్తంతో దృష్టి సారించినందున పుస్తకంలోని ఈ భాగం కేవలం చదివించేలా మాత్రమే కాదు, ఒక వెల్లడింపుగానూ ఉంటుంది. మీరా తనలోని సందేహాలను అణిచివేస్తారు. అయితే ఆశించిన ఫలితాన్ని సాధించడానికి ఇదే ఏకైకమార్గం అని హౌస్ మేనేజర్ తనకు నచ్చజెప్పేందుకు ఆమె అనుమతిస్తారు. అందువల్లనే ముగింపులో ఫలితం అనేది ఫలితం కోసం అనుసరించిన మార్గాలపై విజయం సాధించడం కనిపిస్తుంది. అయితే చర్చ మాత్రం ముగింపు దశకు చేరకనే ఉండిపోతుంది. అది ఆమె మనస్సాక్షిని కృంగదీస్తూ ఉంటుంది. నిజంగా రాజకీయాల్లో తరచు ఇలా జరుగుతుంటుందన్నది వాస్తవం. పటేల్ ‘బిగ్ మ్యాన్’పై ఇదేమీ ప్రభావం చూపకపోవచ్చు కానీ ఇతర రాజకీయ నాయకులు తరచుగా ఇబ్బంది పడుతుంటారు. కొన్నిసార్లయితే దానివల్ల నలిగిపోతుంటారు కూడా. భారతదేశంలోనే కాదు, చాలా ప్రజాస్వామ్య దేశాలలో ఇలాగే జరుగుతుంటుంది. అందుకే రాజకీయాల సారాంశం అన్నది రాజకీయపరమైన దాని కన్నా చాలా ఎక్కువైనది. ఎందుకంటే అది నిర్ణయాలకు, ఎంపికలకు, అంతిమంగా సైద్ధాంతికతల్ని మించిన అంశాలకు సైతం సంబంధించినది. అలాగే నైతికపరమైన వాటికి కూడా. పటేల్ ఆ సంగతిని స్పష్టంగా అర్థం చేసుకున్నారు. కరణ్ థాపర్ వ్యాసకర్త సీనియర్ జర్నలిస్ట్ -
బెంగళూరు ఎయిర్‌పోర్ట్‌లో ఆకార్ పటేల్ అడ్డగింత
బెంగళూరు: ప్రముఖ పాత్రికేయుడు, చరిత్రకారుడు, ఆమ్మెస్టీ ఇంటర్నేషనల్ ఇండియా మాజీ అధ్యక్షుడు ఆకార్ పటేల్‌కు బుధవారం బెంగళూరు విమానాశ్రయంలో చేదు అనుభవం ఎదురైంది. అమెరికా పయనమైన ఆయనను ఇమిగ్రేషన్ అధికారులు అడ్డుకున్నారు. విదేశాలకు వెళుతున్న తనను అడ్డుకోవడంపై ట్విటర్లో ఆకార్ పటేల్ స్పందించారు. ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ ఇండియాపై మోదీ ప్రభుత్వం దాఖలు చేసిన కేసు కారణంగా తాను లుక్ అవుట్ సర్క్యులర్‌లో ఉన్నట్టు సీబీఐ అధికారి ఫోన్ చేసి చెప్పారని వెల్లడించారు. అమెరికా పర్యటన కోసం గుజరాత్ కోర్టు నుంచి అనుమతి పొందానని, కోర్టు ఆర్డర్‌తో తన పాస్‌పోర్ట్‌ను కూడా తిరిగి తీసుకున్నానని తెలిపారు. అయితే ఆకార్ పటేల్‌పై లుక్అవుట్ నోటీసు ఉందని సీబీఐ వర్గాలు వెల్లడించాయి. రూ. 36 కోట్ల విదేశీ నిధులకు సంబంధించి.. విదేశీ విరాళాల నియంత్రణ చట్టం(ఎఫ్సీఆర్ఏ) నిబంధనలు ఉల్లంఘించారన్న నేపథ్యంలో ఆమ్మెస్టీ ఇంటర్నేషనల్ ఇండియా, ఇతరులపై గతంలో సీబీఐ కేసు నమోదు చేసింది. ఈ నేపథ్యంలోనే లుక్అవుట్ నోటీసు జారీ అయింది. అయితే గతేడాది గుజరాత్ పోలీసులు నమోదు చేసిన కేసులో విచారణ ఎదుర్కొంటున్న ఆకార్ పటేల్.. అమెరికా వెళ్లేందుకు సూరత్ కోర్టు అనుమతి ఇచ్చిందని స్పష్టం చేశాయి. తాజా పరిణామాల నేపథ్యంలో తనపై జారీ చేసిన లుక్ అవుట్ సర్క్యులర్‌ను తొలగించేలా ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ ఢిల్లీలోని సీబీఐ కోర్టును ఆకార్ పటేల్ ఆశ్రయించారు. దీనిపై స్పందన తెలియజేయాలని సీబీఐని కోర్టు ఆదేశించింది. ఆకార్ పటేల్ పిటిషన్‌పై గురువారం ఉదయం విచారణ జరిగే అవకాశముంది. -
అలాంటి నిరసనలు మన దేశంలోనూ జరగాలి
బెంగళూరు: ప్రముఖ జర్నలిస్టు, మానవ హక్కుల కార్యకర్త ఆకార్ పటేల్‌పై బెంగుళూరు పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. అమెరికాలో నల్లజాతీయుడు జార్జ్ ఫ్లాయిడ్ హత్యపై పెద్ద ఎత్తున ఆందోళనలు చేపట్టిన విషయం తెలిసిందే. ఈ నిరసనలు దేశంలోని పలు నగరాలకు పాకాయి. ఈ నేపథ్యంలో పటేల్ అగ్రరాజ్యంలో చేపట్టిన అల్లర్ల వీడియోలను మే 31న ట్విటర్లో పోస్ట్ చేశారు. మన దేశంలోనూ మైనారిటీ ప్రజలు ఇలాంటి నిరసన కార్యక్రమాలు నిర్వహించాలంటూ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు. దీనికి మైనారిటీలు, వెనుకబడినవారు, పేదలు, మహిళలు అందరూ ముందుకు రావాలని పిలుపునిచ్చారు. (ఉద్యమ నినాదం.. 8.46) దీంతో అతనిపై ఐపీసీ సెక్షన్ 505 (1) (బి) - ప్రజలను భయాందోళనకు గురి చేయడం లేదా ఏదేని విభాగానికి, వ్యక్తులకు లేదా ప్రజల ప్రశాంతతకు భంగం కలిగేందుకు ప్రయత్నించడం, 153- అల్లర్లు జరిపేందుకు ఉద్దేశపూర్వకంగా రెచ్చగొట్టడం, 117 - పదిమందిని లేదా ప్రజలను నేరానికి ఉసిగొల్పడం కింద అతనిపై ఎఫ్ఐఆర్ నమోదైంది. దీనిపై ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ ఇండియా ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అవినాష్ కుమార్ మాట్లాడుతూ.. ఆకార్ పటేల్‌పై పోలీసుల వేధింపులు ఆపాలన్నారు. భావ ప్రకటనా స్వేచ్ఛ కింత అతనికి మాట్లాడే హక్కు ఉందని తెలిపారు. దేశంలో ప్రతి ఒక్కరూ నిర్భయంగా తమ భావాలు వెల్లడించే అవకాశం ఉందన్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా శాంతియుతంగా నిరసనలు చేపట్టడం నేరమేమీ కాదన్నారు. కాగా ఆకార్ పటేల్ గతంలో ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ ఇండియా ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా పని చేశారు. (ఊపిరాడకుండా చేసి ఫ్లాయిడ్ హత్య) -
సమస్యలున్నప్పుడు సమైక్యత సాధ్యమేనా?
హిందువులందరినీ రాజకీయంగా, సాంస్కృతికంగా ఏకం చేయడం బీజేపీ ప్రధానోద్దేశం. కానీ అది ఆచరణ సాధ్యమేనా? అందుకు అడ్డుపడుతున్న అంశాలేమిటి? బీజేపీకి సహజ మిత్రులైన ఆధిపత్య కులాలే ఇందుకు ప్రధాన అడ్డంకి. దళితులకు రిజర్వేషన్ల సదుపాయం కల్పించడం ఆ వర్గాల రక్షణకు చట్టం ఉండటం ఆధిపత్య కులాలకు సమ్మతం కాదు. దళితులతో సాన్నిహిత్యం పెంచుకోవాలని తన పార్టీ ఎంపీలను ప్రధాని నరేంద్ర మోదీ ప్రోత్సహిస్తున్నారు. అంబేడ్కర్ జయంతి రోజైన ఈ నెల 14 సమయానికి దళితులు అధికంగా ఉండే గ్రామాల్లో ప్రతి ఎంపీ రెండు రాత్రుళ్లు ఉండాలని ఆయన కోరుకుంటున్నారు. అంబేడ్కర్‌ను గౌరవించడానికి అవసరమైన చర్యలు తీసుకుంటున్నది బీజేపీయేననే విషయం పార్టీ ఎంపీలందరూ వారికి చెప్పాలని కూడా మోదీ విజ్ఞప్తి చేశారు. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా దళితులు వీధుల్లోకి రావడాన్ని దృష్టిలో పెట్టుకునే ఆయన ఈ విధమైన సూచన చేస్తున్నారని వేరే చెప్పనవసరం లేదు. హిందుత్వ గత మూడేళ్లుగా వ్యాప్తి చెందుతున్న తీరు పర్యవ సానంగానే తమ రక్షణకు ఉద్దేశించిన ప్రత్యేక చట్టాన్ని సుప్రీంకోర్టు నీరుగార్చిందని దళితులు విశ్వసిస్తున్నారు. పార్టీ హృదయంలో వారి ప్రయోజనాలపట్ల ప్రత్యేక శ్రద్ధ ఉన్నదని ప్రతీకాత్మకంగా తేటతెల్లం చేయడానికి ఈ కార్యక్రమం తోడ్పడుతుం దన్నది మోదీ ఆలోచన. ఇది సరిపోతుందా? సమస్యల పరిష్కర్తలుగా, శ్రేయోభి లాషులుగా భావించుకుంటున్న బీజేపీ దృక్కోణం నుంచే దీన్ని పరిశీలిద్దాం. హిందువులందరినీ రాజకీయంగా, సాంస్కృతికంగా ఏకం చేయడం బీజేపీ ప్రధా నోద్దేశం. ఇది ఆ పార్టీ సిద్ధాంతం. దీన్ని అది సంపూర్ణంగా విశ్వసిస్తోంది. మరి దీన్నెలా ముందుకు తీసుకుపోవాలి? హిందువుల ‘సంఖ్య’ ఎంతన్నది స్పష్టంగా చెప్పడం అంత సులభం కాదు. ఎందుకంటే, సిక్కులు, జైనులు(బహుశా ఇప్పుడు లింగాయత్‌లు కూడా) తమను తాము హిందువులుగా భావించుకోరు. అయినా వారందరినీ హిందువులనుకుందాం. అలా అనుకుంటే దేశంలో 85 శాతం జనా భాను అది ఏకం చేయాల్సి ఉంటుంది. పదిహేను శాతంగా ఉన్నవారికి వ్యతిరేకంగా 85 శాతంమందిని ఏకం చేయ డం చాలా సులభం. ఉపఖండంలో సాధారణంగా జరుగుతున్నది అదే. దక్షిణా సియా దేశాల్లోని మైనారిటీలందరూ ఐక్యతతో వ్యవహరించే 85 శాతంమంది చేతుల్లో వేధింపులకు గురవుతున్నారు. పాకిస్తాన్, బంగ్లాదేశ్, భారత్ లేదా శ్రీలంక దేశాల్లో మైనారిటీలకు చట్టసభల్లో, ప్రభుత్వాల్లో, సాయుధ దళాల్లో, ఆఖరికి ప్రైవేటు రంగ ఉద్యోగాల్లో ప్రాతినిధ్యం చాలా తక్కువుంటుంది. అందరూ వారిని శత్రువులుగా పరిగణిస్తారు గనుక ఇళ్లు దొరకడం కూడా కష్టమే. ఇక అంతర్గతంగా ఎన్నో అంతరాలుండే 85 శాతం మందిని ఏకం చేయడంలోని సమస్యలేమిటో చూద్దాం. దళిత ఉద్యమం దీన్నే ముందుంచింది. భాష, ఆహారం, సంగీతంలాంటి కనీస అంశాల్లో కూడా ఏకత సాధించడం అంత సులభమేమీ కాదన్నది వాస్తవం. మనం లతా మంగేష్కర్‌ను సులభంగా ఈ దేశానికి ప్రతీకగా చూడగలం తప్ప ఎమ్మెస్ సుబ్బలక్ష్మిని కాదు. బాలీవుడ్, క్రికెట్ ఈశాన్య భారతీయులకు అంత ఆసక్తికరమైనవి కాదు. జాతీయ వాదం మనల్ని ఏకం చేస్తుంది. కానీ బయటివారికి వ్యతిరేకంగా మాత్రమే అది ఏకం చేయగలదు. మరి మనమధ్య సమస్యలున్న ప్పుడు ఏం జరుగుతుంది? హిందుత్వ హిందువులందరినీ తన షరతుల ప్రాతి పదికన మాత్రమే ఏకం చేయాలనుకుంటున్నది. ఉదాహరణకు దాని దృష్టిలో ‘హిందు’ అంటే గొడ్డు మాంసం తిననివారు... ఇంకా చెప్పాలంటే శాకాహారులు. మాంసాన్ని భుజించే గుజరాతీ కులం నుంచి నరేంద్ర మోదీ వచ్చారు. ఆయన ఆ సంస్కృతిని విడనాడి ఆరెస్సెస్ ఛత్రఛాయలోకి రావడం వల్ల మోదీకి ఆమోదనీ యత లభించింది. ఆయన గొడ్డు మాంసం తినే ఆదివాసీ అయివుంటే మోదీని గుజరాత్ సీఎంగా చేయడం ఆరెస్సెస్‌కు సులభం కాదు. కెబి హెడ్గేవార్, లక్ష్మణ్ పరంజపే, గురూజీ గోల్వాల్కర్, బాలాసాహెబ్ దేవరస్, రాజేంద్ర సింగ్, కెఎస్ సుదర్శన్ ఆరెస్సెస్ చీఫ్లుగా పనిచేశారు. ఆ సంస్థకు ప్రస్తుత చీఫ్ మోహన్ భాగ వత్. వీరిలో ఠాకూర్ అయిన రాజేంద్రసింగ్ మినహా మిగిలినవారంతా బ్రాహ్మ ణులు. ఒక దళితుణ్ణో, ఒక ఆదివాసీ మహిళనో సర్‌సంఘ్‌చాలక్‌గా నియమించ మని బీజేపీ ఆరెస్సెస్‌కు సూచించగలిగితే మంచిది. హిందువులను ఏకం చేయడంలో బీజేపీ ఎదుర్కొనే మరో సమస్య దానికి సహజమిత్రులైన ఆధిపత్య కులాలే. ఇవి మౌలికంగా దళితుల హక్కులకు వ్యతి రేకం. ఈ కులాలు దళితుల, ఆదివాసీల రిజర్వేషన్లకు మద్దతిస్తాయా? ‘కాదు’ అన్నదే జవాబు. ఎందుకంటే ఈ రిజర్వేషన్లు వీరి ప్రయోజనాలను దెబ్బతీస్తు న్నాయి. ఈ ప్రాథమిక అంతరాన్ని హిందూ ఐక్యత మాటున దాచి ఉంచడం సాధ్యం కాదు. రిజర్వేషన్లను తీసేస్తామంటే బీజేపీలోని దళిత లేక ఆదివాసీ ఎంపీల్లో ఒక్కరు కూడా మద్దతు ఇవ్వరు. షెడ్యూల్ కులాల, తెగల (అత్యాచారాల నిరోధక) చట్టం మూలాల్లోనూ ఇదే సమస్య ఉంది. సుప్రీంకోర్టు ధైర్యంగా ఈ అంశంలోకెళ్లి తీర్పునిచ్చింది. దీనికి వ్యతిరేకంగా దళితులు, ఆదివాసీలు తిరగ బడ్డారు. ఆధిపత్య హిందూ కులాల వేధింపుల నుంచి ఈ చట్టం తమకు రక్షణగా నిలుస్తుందని వారు భావిస్తున్నారు. ఈ చట్టం సరిగా అమలు కావడం లేదన్నది, పోలీసులతో కేసు నమోదు చేయించడం కూడా ఓ పట్టాన సాధ్యం కావడం లేద న్నది వాస్తవం. అయినా కూడా ఇది కాగితంపై ఉండటం అవసరం. కానీ న్యాయ స్ధానమిచ్చిన తీర్పు దాన్ని బలహీనపరిచింది. ఈ విషయంలో కూడా పైనుంచి కిందివరకూ చీలిక ఉంది. ఆధిపత్య కులాల్లో ఎంతమంది ఈ తీర్పును వ్యతిరేకి స్తారు? చట్టం అమలు వల్ల బాధిత వర్గాలు ఆధిపత్య కులాలే గనుక చాలా తక్కు వమంది మాత్రమే వ్యతిరేకిస్తారు. ఈ చట్టం దళితులకు, ఆదివాసీలకు బలాన్ని చ్చింది. మనలో చాలామందికి అది అభ్యంతరకరం. ఇలాంటి పరిస్థితుల్లో ‘సబ్ కా వికాస్’ (అందరి వికాసం) సాధ్యం కాదు. బలమైనవారు రాయితీలకు అంగీకరి స్తేనే బలహీనులు ప్రగతి సాధించగలుగుతారు. కానీ ఇలా జరగటం లేదు. ఆరె స్సెస్ చీఫ్ లేదా మరొకరు రిజర్వేషన్లకు వ్యతిరేకంగా చేసిన వ్యాఖ్యానాలు ఎన్ని సార్లు బీజేపీని ఇరకాటంలో పడేశాయో చూడండి. సుప్రీం కోర్టులో రివ్యూ పిటిషన్ దాఖలు చేస్తానని కేంద్రం చెప్పింది. కానీ ఇందులో దృఢ సంకల్పం లేదు. పరిస్థి తుల్ని చూసి కలవరపడుతున్నది గనుక ఇలా చేసిందన్నది సుస్పష్టం. సుప్రీంకోర్టు తీర్పునకు వ్యతిరేకంగా ఈ వారం వివిధ సంస్థలు నిర్వహించిన సదస్సులో నేను పాల్గొన్నాను. ప్రసంగించినవారిలో ఒకరైన సీపీఐ ఎంపీ డి. రాజా... అంబేడ్కర్‌ను గౌరవించిన పార్టీ బీజేపీయేనని మోదీ చేసిన వ్యాఖ్యను ప్రస్తావించారు. ‘అంబేడ్కర్‌కు కొత్తగా మీరెలాంటి గౌరవమూ ఇవ్వనవసరం లేదు. దళితులకు చేస్తున్నదేమిటో చెప్పాల’ని నిలదీశారు. ఇది నేరుగా తాకే ప్రశ్న. ప్రభుత్వం నిజంగా దళితుల పక్షాన ఉండదల్చుకుంటే చేయాల్సిందేమిటో దానికి తెలుసు. ఎంపీలు రెండు రాత్రుళ్లు ఒక పల్లెలో గడపవలసిన అవసరం లేదు. ఆకార్ పటేల్, వ్యాసకర్త కాలమిస్టు, రచయిత aakar.patel@icloud.com -
కూటమి సర్కార్లు చేటు కలిగిస్తాయనడం భ్రమ
అవలోకనం ఎందుకనో మన మార్కెట్ విశ్లేషకులకు కూటమి ప్రభుత్వాలపై దురభిప్రాయాలున్నాయి. ఆ ప్రభుత్వాలు ఆర్థిక వ్యవస్థలకు మంచివికాదని, అవి నిర్ణయాత్మకంగా వ్యవహరించలేవని వారి భావన. కానీ వెనక్కెళ్లి చూస్తే సుస్థిరమైన మెజారిటీ ఉన్న ప్రభుత్వాలకంటే కూటమి ప్రభుత్వాల హయాంలోనే దేశం ప్రయోజనం పొందింది. దినదినగండంగా బతుకీడ్చిన ప్రభుత్వాలే అత్యంత కీలకమైన నిర్ణయాలు తీసుకోగలిగాయి. ప్రపంచబ్యాంకు పాలనా సూచికలు కూడా ఈ విషయాలనే చాటుతున్నాయి. ‘హంగ్ పార్లమెంటు’ అనే పదబంధం వింటేనే స్టాక్ మార్కెట్ వణుకుతుంది. మన ఆర్థిక వ్యవస్థకు పటిష్టమైన, నిర్ణయాత్మకమైన నాయకత్వం అవసరమని, ఒకే పార్టీకి మెజారిటీ లభించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయకపోతే ఇది అసాధ్యమనుకో వడమే ఇందుకు కారణం. ఏక పార్టీ పాలన లేకపోతే సరైన ఆర్థిక నిర్దేశం ఉండదని, అందువల్ల స్థూల దేశీయోత్పత్తి(జీడీపీ)లో వృద్ధి కొరవడుతుందని, కేబినెట్లో స్వప్రయోజనపరులు పెరుగుతారని, నాయకత్వం చేసే పనులకు అడ్డుతగులుతా రని అటువంటివారు అంటారు. మెజారిటీ పార్టీ ప్రభుత్వానికి అనుకూలంగా, కూటములకు వ్యతిరేకంగా సాగే వాదనలకు స్థూలంగా ఇదీ ప్రాతిపదిక. అయితే ఇటీవలి సంవత్సరాల్లోని ఆధారాలు ఈ ఆలోచనను బలపరిచేలా లేవు. యూపీఏ తొలి దశ పాలనాకాలం(2004–09)లో మొదటి అయిదేళ్లూ జీడీపీ వృద్ధి 8.5 శాతం. ఇది దేశ చరిత్రలో ఏ అయిదేళ్ల పాలనను తీసుకున్నా అత్యధికమని చెప్పాలి. కేవలం 145 స్థానాలు మాత్రమే ఉన్న కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం దీన్ని సాధించింది. సమాచార హక్కు చట్టంవంటి అత్యుత్తమ చట్టాలు ఈ కాలంలోనే రూపొందాయి. అదే కూటమి తదుపరి ఎన్నికల్లో సైతం 200 స్థానాలు గెల్చుకుని అధికారంలోకొచ్చింది. లెక్కప్రకారం యూపీఏ–2 ప్రభు త్వానికి మరింత స్వేచ్ఛ లభించింది గనుక అది లోగడకంటే ఎక్కువ నిర్ణయాత్మ కంగా ఉండాలి. కానీ జీడీపీ గణాంకాలు దీన్ని ప్రతిఫలించవు. ఈసారి సగటున 7 శాతం వార్షిక జీడీపీ మాత్రమే నమోదైంది. అయితే ఈ కాలం ఆర్థిక సంక్షోభం నుంచి ప్రపంచం కోలుకుంటున్న దశ అని, అందువల్ల అధిక వృద్ధి సాధించడానికి అనువైన మద్దతు వెలుపలి నుంచి లభించలేదని మనం గుర్తించాలి. నిజానికి ప్రభుత్వానికి తిరుగులేని మెజారిటీ ఉన్న ఈ తరుణంలో, ప్రపంచ ఆర్థిక వ్యవస్థ బ్రహ్మాండంగా ఉన్న ఈ సమయంలో గత పదిహేనేళ్లలో ఎన్నడూ లేనంత బలహీనమైన ఆర్థిక వృద్ధి నమోదైంది. ప్రభుత్వ పనితీరును వ్యాఖ్యా నించడం నా ఉద్దేశం కాదు. స్టాక్ మార్కెట్, ఆర్థిక విశ్లేషకులు భయపడుతున్నట్టు కేంద్ర ప్రభుత్వానికుండే మెజారిటీకీ, నమోదయ్యే జీడీపీ వృద్ధికీ సంబంధం లేదని చెప్పడమే నా వివరణలోని అంతరార్థం. కూటమి ప్రభుత్వాలు ప్రధానమైన సంస్కరణలను తీసుకురాలేవన్నది మరో భయం. కానీ దినదినగండంగా బతు కీడ్చిన మైనారిటీ ప్రభుత్వాలున్న కాలంలోనే దేశంలో అత్యంత పెద్ద ఆర్థిక సంస్క రణలు ప్రారంభమయ్యాయి. అందరూ ‘డ్రీమ్ బడ్జెట్’గా చెప్పుకునే 1998నాటి బడ్జెట్‌ను అతి తక్కువ కాలం అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వమే ప్రవేశ పెట్టింది. ఆ ప్రభుత్వానికి కాంగ్రెస్ వెలుపలినుంచి మద్దతిచ్చింది. కనుక ఈ చరి త్రంతా గమనిస్తే కూటమి ప్రభుత్వాలు మంచివి కావని మార్కెట్లు ఎందుక నుకుంటాయో ఎవరికీ బోధపడదు. ప్రపంచబ్యాంకు వివిధ సంవత్సరాల్లో విడుదల చేసిన ప్రపంచవ్యాప్త పాలనా సూచికల ఆధారంగా యూపీఏ–1, యూపీఏ–2, ఎన్డీఏ ప్రభుత్వాలను పాత్రికేయుడు టీఎన్ నైనన్ పోల్చిచూపారు. అవినీతి నియంత్రణ అంశంలో మన పర్సంటైల్ ర్యాంకు 2013లో 37.0 నుంచి 2016లో 47.1కు మెరుగైంది. కానీ దీనికీ, మన్మోహన్ హయాంలో సాధించిన పర్సంటైల్ 46.8కీ పెద్దగా తేడాలేదు. ప్రభుత్వ పనితీరులో మన దేశం ర్యాంకు 2014లో 45.2 ఉండగా 2016లో అది 57.2, అంతకు చాలాముందు అంటే యూపీఏ–1 హయాం(20017)లో అది 57.3. నియంత్రణలకు సంబంధించి 2012నాటి స్కోరు 35.1 అయితే, 2016లో అది 41.3. కానీ 2006లో అది అత్యధికంగా నమోదైంది. ఆనాటి స్కోరు 45.1. రాజకీయ సుస్థిరత, హింస లేకపోవడం విషయంలో మన ర్యాంకు ఎప్పుడూ అల్పమే. 2005లో అది 17.5... 2014లో 13.8...2015లో 17.1...ఆ మరుసటి ఏడాది 14.3(అంటే 2005నాటి కంటే ఘోరం). శాంతిభద్రతల విషయంలో 2016 (52.4)... 2013 (53.1) కన్నా స్వల్పంగా తక్కువ. కానీ 2006 (58.4)తో పోలిస్తే బాగా తక్కువ. ఈ ర్యాంకుల్లో ఆఖరి సూచిక అభిప్రాయ వ్యక్తీకరణ, జవాబు దారీతనంలో చూస్తే 2013నాటి 61.5 ర్యాంకు 2016 కల్లా 58.6కు దిగింది. ఈ డేటా స్పష్టంగానే ఉంది. మార్కెట్లు, విశ్లేషకులు భయపడుతున్నట్టుగా ‘పటి ష్టమైన, నిర్ణయాత్మకమైన’ ప్రభుత్వం సాధించగలిగేదీ, ‘బలహీనమైన’ ప్రభుత్వం సాధించలేనిది అంటూ ఏదీ ఉండదని ఈ గణాంకాలు చెబుతున్నాయి. ఇది నాయ కత్వపటిమకూ, దాని గురికి సంబంధించింది. అంతేతప్ప కీలకమైనదిగా కనబడే లోక్‌సభ అమరికతో దీనికి సంబంధం లేదు. ప్రభుత్వానికి మెజారిటీ లేకున్నా కీలకమైన జాతీయ ప్రయోజనానికి సంబంధించిన అంశం చర్చకొచ్చినప్పుడు అన్ని పార్టీలనూ ఏకతాటిపైకి తీసుకురావడం కష్టమేమీ కాదు. నిజానికి స్పష్టమైన ఆధిక్యత మనకు అంత మంచిది కాదని నేను వాదిస్తాను. మన దేశంలాంటి వైవి ధ్యభరిత దేశంలో సాహసవంతమైన నిర్ణయం తీసుకుని అది కాస్తా వికటిం చడంకంటే... ఎంతో అప్రమత్తతతో, మధ్యే మార్గం ఎంచుకోవడమే శ్రేయస్కరం. ముందే ఏర్పర్చుకున్న కొన్ని అభిప్రాయాల కారణంగానే ఏదో ఒక పార్టీకి మెజారిటీ ఉండటం మంచిదన్న ఆలోచన ఏర్పడుతుందని మనం ఒప్పుకోవాలి. ఉదా హరణకు ప్రాంతీయ పార్టీలన్నీ అవినీతికరమైనవి, స్వప్రయోజనాలతో కూడిన వని, కుల ప్రాతిపదికన ఏర్పడే పార్టీలు తెలివైన నిర్ణయాలు తీసుకోవడానికి అనువైన అధునాతన భావాలతో ఉండవని కొందరంటారు. కానీ ఇందులో విశ్లేషణకంటే ప్రతికూల భావమే ఉంది. మన ప్రజాస్వామ్యంలో ఏ ఒక్క పార్టీ మరో పార్టీ కంటే ఏ విషయంలోనూ ఉన్నతమైనదని చెప్పుకోలేదు. ఉత్తర భార తంలోని ఇటీవలి పరిణామాలు 2019లో హంగ్ పార్లమెంటు ఏర్పడవచ్చునని లేదా పాలకపక్షానికి తగినంత మెజారిటీ రాకపోవచ్చునని సూచిస్తున్న నేపథ్యంలో దీన్ని నేను రాయాల్సివచ్చింది. ‘హంగ్’ రావడం లేదా పాలకపక్షానికి మెజారిటీ తగ్గడం తథ్యమని మున్ముందు సర్వేలు వెల్లడిస్తే మన మార్కెట్ విశ్లేషకులు, బిజి నెస్ పత్రికలు దేశ ఆర్థిక వ్యవస్థకూ, సుస్థిరతకూ అది మంచిదికాదని ఊదర గొడతారు. కానీ చరిత్ర మాత్రం అదొక సమస్యే కాదని చెబుతోంది. నిజానికి అలా ‘హంగ్’ ఏర్పడటం స్వాగతించదగ్గదని మాబోటివాళ్లం అనుకుంటున్నాం. - ఆకార్ పటేల్ వ్యాసకర్త కాలమిస్టు, రచయిత ‘ aakar.patel@icloud.com -
హక్కుల పరిరక్షణ చట్టాలను నీరుగార్చొద్దు!
అవలోకనం శిక్షల రేటు తక్కువగా ఉన్నదన్న కారణంతో ఒక చట్టం దుర్వినియోగమవుతున్నదని నిర్ధారించడం సబబు కాదు. అపహరణలు, ఫోర్జరీ, మోసం, బలవంతపు వసూళ్ల కేసుల్లో శిక్షల శాతం తక్కువగా ఉంటున్నది. కనుక ఆ చట్టాలు దుర్వినియోగమవుతున్నట్లేనా? దుర్బల వర్గాల పరిరక్షణకు ఉద్దేశించిన చట్టాలు మాత్రమే దురుపయోగమవుతున్నాయని నిర్ణయించడం సబబేనా? చట్టాల ‘దుర్వినియోగానికి’ వ్యతిరేకంగా మన సుప్రీంకోర్టు తీసుకుంటున్న చర్యలు ఇంకా సాగుతూనే ఉన్నాయి. ఈమధ్యే జస్టిస్ ఏకే గోయెల్, జస్టిస్ యు యు లలిత్‌ల నేతృత్వంలోని ధర్మాసనం ఎస్సీ, ఎస్టీ(అత్యాచారాల నిరోధక) చట్టం ‘అడ్డూ ఆపూ లేకుండా దుర్వినియోగం’ అవుతున్నదని చెప్పి దాన్ని నిరోధించడం కోసం మార్గదర్శకాలు జారీచేసింది. వీటి ఫలితంగా...దళితులు, ఆదివాసీల హక్కుల పరిరక్షణలో కీలకపాత్ర పోషిస్తున్న చట్టం కాస్తా బలహీనపడుతుంది. తీర్పులో చాలాభాగం నిష్పాక్షిక విచారణ జరగాలని కోరడానికి నిందితులకుగల హక్కును కాపాడటానికి ఉద్దేశించిందే. కానీ ఈ తీర్పు విచిత్రమైన తర్కం చేసింది. కొన్ని హైకోర్టుల తీర్పుల్ని, జాతీయ క్రైం రికార్డుల బ్యూరో గణాంకాలను పరిగణనలోకి తీసుకుంటూ ఎస్సీ, ఎస్టీ (అత్యాచారాల నిరోధక) చట్టం ‘దోపిడీ, అణచివేత’ శాసనంగా మారిందన్న నిర్ణయానికొచ్చింది. ఇది ‘బ్లాక్మెయిల్ చేయడానికి, వ్యక్తిగత ప్రతీకారాన్ని తీర్చు కోవడానికి’ ఉపయోగపడటంతో పాటు కులతత్వాన్ని శాశ్వతీకరిస్తున్నదని భావిం చింది. వాటికి విరుగుడుగా అనేక మార్గదర్శకాలిచ్చింది. అందులో అన్నిటికన్నా విధ్వంసకరమైనది కుల వివక్షకు సంబంధించి వచ్చిన ఫిర్యాదు విషయంలో ఎఫ్ఐ ఆర్ దాఖలు చేసే ముందు ‘ప్రాథమిక విచారణ’ను తప్పనిసరి చేయడం. ఈ న్యాయమూర్తులిద్దరూ పరిరక్షణ చట్టాల దుర్వినియోగంపై ఆదేశాలివ్వడం ఇది తొలిసారి కాదు. గత జూలైలో భారత శిక్షాస్మృతిలోని 498ఏ సెక్షన్ (వరకట్న వేధింపుల నిరోధక చట్టం) ‘దుర్వినియోగం’ కాకుండా ఆదేశాలిచ్చారు. వరకట్న వేధింపులకు సంబంధించిన ఫిర్యాదులొచ్చినప్పుడు వాటిని పరిశీలించడానికి ‘కుటుంబ సంక్షేమ సంఘాలు’ ఏర్పాటు చేయాలని, ఆ తర్వాతే నిందితులను అరెస్టు చేయాలని ఆదేశించారు. ఎలాంటి చట్టాలు దుర్వినియోగమవుతున్నాయని ఫిర్యాదులొస్తాయో ఆలో చించండి. వాటిలో–లైంగిక వేధింపుల నిరోధక చట్టం (పని స్థలాల్లో మహిళల పరి రక్షణకు ఉద్దేశించిన చట్టం), వరకట్న నిరోధక చట్టం (వివాహితల పరిరక్షణకోసం వచ్చిన చట్టం), కుల వివక్షనూ, అఘాయిత్యాలనూ నిరోధించే చట్టం ( దళితులు, ఆదివాసీలకు ఉద్దేశించింది) ఉన్నాయి. చిత్రమేమంటే దుర్బల వర్గాల పరిరక్షణకు ఉద్దేశించిన చట్టాల విషయంలోనే దుర్వినియోగం ఆరోపణలు వస్తాయి. ఇంత క్రితం ప్రస్తావించిన రెండు తీర్పుల విషయంలో నాకు రెండు ప్రశ్నలున్నాయి. ఒకటి–ఇతర చట్టాలకంటే ఇవే దుర్వినియోగానికి అనువుగా ఉన్నాయా? రెండు– ధర్మాసనం సూచించిన చర్యలు నిష్పాక్షిక విచారణకు దోహదపడేవేనా? మొదటి ప్రశ్నలోకి వద్దాం. ఎస్సీ, ఎస్టీ (అత్యాచారాల నిరోధక) చట్టానికి సంబంధించిన తీర్పులో ధర్మాసనం ఉటంకించిన గణాంకాలు చూద్దాం. 2015 జాతీయ క్రైం రికా ర్డుల బ్యూరో(ఎన్సీఆర్బీ) ప్రకారం ఎస్సీ కేసుల్లో 5,347, ఎస్టీ కేసుల్లో 912 తప్పుడు కేసులని నిర్ధారణ అయింది. దళిత సంఘాలు చెబుతున్న ప్రకారం ఆధి పత్య కులాలకు చెందిన పోలీసు సిబ్బంది దళితుల ఫిర్యాదులను స్వీకరించడానికి విముఖంగా ఉంటారు. అది తప్పుడు ఫిర్యాదని అప్పటికప్పుడే తేల్చేస్తారు. 2016 నాటి ఎన్సీఆర్బీ నివేదికలోని గణాంకాలను పరిశీలిద్దాం. ఆ ఏడాది మొత్తంగా ఎస్సీలకు సంబంధించి 56,299, ఎస్టీలకు సంబంధించి 9,096 ఫిర్యాదులు రావ డమో, దర్యాప్తు పెండింగ్‌లో ఉండటమో జరిగిందని ఆ నివేదిక తెలిపింది. అంటే మొత్తం కేసుల్లో 10 శాతం లేదా ప్రతి పది కేసుల్లో ఒకటి తప్పుడు కేసు అని అను కోవచ్చు. దానర్థం పదిలో తొమ్మిది నిజమైన కేసులేనన్నమాట! దీన్ని ‘అడ్డూ ఆపూ లేకుండా దుర్వినియోగం’ అవుతున్నట్టు భావించడం సబబేనా? ఈ గణాంకాలను ఇతర నేరాలతో పోల్చి చూద్దాం. కిడ్నాపింగ్ కేసుల్లో 9 శాతం, ఫోర్జరీ కేసుల్లో 12 శాతం తప్పుడువని పోలీసులు చెబుతున్నారు. అంత మాత్రాన కిడ్నాపింగ్, ఫోర్జరీల నిరోధానికి ఉద్దేశించిన చట్టాలను రద్దు చేయాలని ఎవరైనా అంటారా? 2015లో న్యాయస్థానాలు మొత్తం 15,638 కేసుల్లో తీర్పునిస్తే అందులో 11,024 కేసుల్లో నిందితులు నిర్దోషులని తీర్పులొచ్చాయని, 495 కేసుల్ని ఉపసంహరించుకున్నారని, 4,119 కేసుల్లో శిక్షలు పడ్డాయని సుప్రీంకోర్టు ధర్మా సనం ఉటంకించింది. సుప్రీంకోర్టు తాజా తీర్పు ఎస్సీ, ఎస్టీ (అత్యాచారాల నిరోధక) చట్టం కేసుల్లో ‘కేవలం’ 26 శాతం కేసుల్లో మాత్రమే శిక్షపడిన సంగతిని గుర్తు చేసింది. వాటి ఆధారంగా ఆ చట్టం దుర్వినియోగమవుతున్నదని అభిప్రాయపడింది. దర్యాప్తు, విచారణల్లో చోటు చేసుకుంటున్న జాప్యం.. బాధితులు, సాక్షుల వేధింపు.. దళితులకు, ఆదివాసీలకు న్యాయం లభించడానికి ఎదురవుతున్న వ్యవ స్థాపరమైన అడ్డంకులు... ఫలితంగా తగ్గుతున్న శిక్షల రేటు గురించి కాసేపు మరిచి పోదాం. వీటిని ‘దుర్వినియోగానికి’ ప్రమాణంగా తీసుకోదల్చుకుంటే ఎన్సీఆర్బీ తాజా గణాంకాల ప్రకారం మోసం కేసుల్లో 20 శాతం, బలవంతపు వసూళ్లలో 19 శాతం, దహనకాండల్లో 16 శాతం మేరకు మాత్రమే శిక్షలు పడుతున్నాయి. ఈ చట్టాలు దుర్వినియోగమవుతున్నాయని ఎవరూ చెప్పినట్టు లేదు. కానీ కేవలం కొన్ని చట్టాల పనితీరుపైనే దృష్టిపెట్టి అవి మాత్రమే దుర్వినియోగమవుతున్నాయ నడం సబబేనా. ఇక న్యాయబద్ధమైన విచారణ కోసం ధర్మాసనం జారీచేసిన మార్గ దర్శకాలను పరిశీలిద్దాం. మన దేశంలో బాధితులు లేదా సాక్షుల పరిరక్షణకు సంబంధించిన విధానమేదీ లేదు. కనుక ఇలాంటివారు నిందితుల నుంచి వేధిం పులు, బెదిరింపులు ఎదుర్కొంటారు. దీనికితోడు పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదుకు సిద్ధపడరు. ఇలాంటి స్థితిలో కుటుంబ సంక్షేమ సంఘాల ఏర్పాటు, ఎఫ్ఐఆర్ నమోదుకు ముందు ‘ప్రాథమిక విచారణ’ ఇప్పుడున్న పలురకాల అడ్డంకులకు అదనంగా వచ్చి చేరతాయి. నిరుడు ఛత్తీస్‌గఢ్‌లోని రాయ్‌గఢ్ ఆదివాసీలు వంద మంది ఎదుర్కొన్న సమస్యను ఉదహరిస్తాను. కొన్ని ప్రైవేటు సంస్థలు ఏజెంట్ల ద్వారా బెదిరించి తమ భూములు కబ్జా చేయడంపై ఎస్సీ, ఎస్టీ చట్టం కింద వారు ఫిర్యాదు చేశారు. రాయ్‌గఢ్ పోలీసులు ఆ ఫిర్యాదు తీసుకుని ‘ప్రాథమిక దర్యాప్తు’ పేరిట జాప్యం చేసి కొన్ని వారాల తర్వాత ఎఫ్ఐఆర్ నమోదుకు నిరాకరించారు. తప్పుడు కేసుల నుంచి రక్షణకు మన చట్టాల్లో ఇప్పటికే పలు ఏర్పాట్లున్నాయి. ఎవరికైనా హాని కలిగించే ఉద్దేశంతో తప్పుడు కేసులు పెట్టిన వ్యక్తికి ఏడేళ్ల వరకూ జైలు శిక్ష విధించవచ్చు. తప్పుడు సాక్ష్యాలు, వాటిని తారుమారు చేయడం నేర పూరిత చర్యలు. వీటిని పోలీసులు, న్యాయవ్యవస్థ సమర్థవంతంగా ఎదుర్కొంటే తప్పుడు ఫిర్యాదులు ఆగిపోతాయి. దుర్బల వర్గాల కోసం పార్లమెంటు చేసిన చట్టా లను మొద్దు బార్చే మరిన్ని తీర్పులు మనకు అవసరం లేదు. - ఆకార్ పటేల్ వ్యాసకర్త కాలమిస్టు, రచయిత ‘ aakar.patel@icloud.com -
వచ్చే ఎన్నికల్లో ‘అయోధ్యే’ ప్రధానాంశం?!
అవలోకనం జనాన్ని ఆకట్టుకునే రీతిలో ఎన్నికల ప్రచారాన్ని రూపొందించడానికి అడ్వర్టయిజింగ్ ఏజెన్సీలనూ, మార్కెటింగ్ సంస్థలనూ నియమించుకోవడమనే సంప్రదాయానికి మన దేశంలో శ్రీకారం చుట్టినవారు రాజీవ్‌గాంధీ. సార్వత్రిక ఎన్నికల సమయంలో రూపొందించుకునే నినాదాలు జనాన్ని ఆకర్షించగలిగితే పార్టీలు విజయం సాధించగలుగుతాయి. లేనిపక్షంలో పేలవమైన ఫలితాలు వస్తాయి. అయోధ్య విషయంలో సుప్రీంకోర్టు త్వరలో ఇవ్వబోయే తీర్పు ఎలాంటిదైనా వచ్చే ఎన్నికల్లో అదే ప్రధాన ప్రచారాస్త్రంగా మారే అవకాశం ఉంది. వచ్చే ఏడాది జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో ఏ అంశంపై హోరాహోరీ పోరు ఉంటుంది? ఇప్పటినుంచి రానున్న నెలల్లో పార్టీలు, కూటములు ఏం చేయాలో, ఎటుండాలో ఖరారు చేసుకుంటాయి. అందరినీ ఆకట్టుకునేలా సందేశాలను రూపొందించి ప్రజలకు అందించేందుకు అడ్వర్టయిజింగ్ ఏజెన్సీలనూ, మార్కె టింగ్ నిపుణులను ఆశ్రయిస్తాయి. ఈ పని కోసం 2014లో బీజేపీ ఓగిల్వీ అండ్ మాథెర్ (ఓ అండ్ ఎం) సంస్థను నియమించుకోగా కాంగ్రెస్ డెంట్సూ సంస్థకు అప్పగించింది. నాకు తెలిసి దేశ రాజకీయాల్లో ఎన్నికల ప్రచార కార్యక్రమాన్ని ఒక అడ్వర్టయిజింగ్ ఏజెన్సీకి అప్పగించడం 1985లోనే మొదలైంది. ఆ ఏడాది రాజీవ్ గాంధీ కాంగ్రెస్ ప్రచార బాధ్యతల కోసం రెడీఫ్యూజన్ సంస్థను నియమించుకు న్నారు. ఈసారి కూడా రాజకీయ నాయకులు సూటూ బూటుల్లో వచ్చే నిపుణు లతో సమావేశమవుతారు. ఆ నిపుణులు ఆకట్టుకునే సందేశాలతో పవర్‌పాయింట్ ప్రజంటేషన్లు ఇస్తారు. ‘యే దిల్ మాంగే మోర్’, ‘యే అందర్ కి బాత్ హై’, ‘అచ్ఛేదిన్ ఆనేవాలే హై’ లాంటి ఆకర్షణీయ నినాదాలను రూపొంది స్తారు. 2014 అనుభవాలతో ఈసారీ సామాజిక మాధ్యమాల్లోనూ, టెక్నాలజీ లోనూ భారీ పెట్టుబడులు పెడతారు. ఈ ఎన్నికల్లో చాలా మంది దండిగా డబ్బు గడిస్తారు. 2014 ఎన్నికల ప్రచారంలో రూ. 714 కోట్లు ఖర్చు చేశామని బీజేపీ ఎన్నికల సంఘానికి తెలిపింది. తాము రూ. 516 కోట్లు వ్యయం చేశామని కాంగ్రెస్ లెక్క లిచ్చింది. శరద్ పవార్ నాయకత్వంలోని ఎన్సీపీ రూ. 51 కోట్లు ఖర్చు చేసినట్టు నివేదిక సమర్పించింది. 2019 ఎన్నికల నాటికల్లా ఈ ఖర్చు రెట్టింపు నుంచి మూడురెట్లు పెరుగుతుందని భావించవచ్చు. అభ్యర్థులు చేసే ఖర్చు, పార్టీల తర ఫున వేర్వేరు కంపెనీలు చేసే ఖర్చు దీనికి అదనం. ఇదంతా మన దేశంలో సాధార ణమే. ప్రధాన అభ్యర్థులు ఒక్కొక్కరు రూ. 15 కోట్ల వరకూ సులభంగా ఖర్చుచే స్తారు. పార్టీ టిక్కెట్ రావడానికి వీరు చేసే ఖర్చు అదనం. మొత్తంగా 2019 ఎన్నికల్లోగా రూ. 25,000 కోట్ల వరకూ చేతులు మారుతుంది. ఇది మరీ అతి శయోక్తని మీరనుకుంటే నిరుడు జరిగిన ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు రూ. 5,500 కోట్లు ఖర్చయిందని ‘ఎకనామిక్ టైమ్స్’ ప్రచురించిన అంచనాను గమనిం చండి. వార్తాపత్రికలు, టీవీ చానెళ్లు రాజకీయ ప్రకటనల రూపంలో అదనపు ఆదా యాన్ని సంపాదించుకుంటాయి. ఇందులో చాలా భాగం వార్తా కథనాల రూపంలో ఉంటాయి. చాలా లావాదేవీలుంటాయి. నీరవ్ మోదీ కుంభకోణం చూపినట్టు అవినీతి రహిత నేతతో అవినీతి ప్రారంభం కాదు. అక్కడే ముగియదు కూడా. ఏ కూటమివైపు మొగ్గితే గరిష్ట ప్రయోజనం ఉంటుందో ఎలాంటి భావోద్వేగాలకూ తావు లేకుండా రాజకీయ పార్టీలు మదింపు వేసుకుంటాయి. అవసరాన్నిబట్టి కొత్త కూటములకు సిద్ధపడతాయి. కొందరు నేతలు తొందరపడకుండా వేచిచూసే ధోరణి అవలంబించి, చివరిలో మరింత రాబట్టుకోవచ్చునన్న అంచనాలతో ఉంటారు. 2019కి ముందు మధ్యప్రదేశ్, కర్ణాటక, రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతాయి. రాహుల్‌కి ఎంత దూరంగా ఉండాలో, లేదా ఎంత దగ్గరగా ఉండాలో ఈ నాలుగు రాష్ట్రాల్లోని ప్రాంతీయ పార్టీలూ నిర్ధారించు కోవడానికి ఇవి దోహదపడతాయి. బీజేపీ ఎన్నికల్లో ఎలా విజయం సాధించగలు గుతున్నదో, అందుకు దోహదపడుతున్న కారణాలేమిటో దాని ప్రత్యర్థులు తెలుసు కున్నారు. అందుకు తగ్గట్టుగా తమ వ్యూహాలకు పదును పెట్టుకుం టారు. ఉత్తర ప్రదేశ్‌లో ఈమధ్య జరిగిన రెండు ఉప ఎన్నికల కోసం మాయావతి, అఖిలేష్ యాదవ్లమధ్య కుదిరిన ఒప్పందాల వంటివి మనం చాలా చూస్తాం. వచ్చే ఎన్ని కలు ఏ అంశం ప్రాతిపదికన జరగనున్నాయన్న మొదటి ప్రశ్న దగ్గరకు మళ్లీ వెళ్దాం. మొత్తం ఆ ఎన్నికల తీరుతెన్నుల్ని ఎవరు నిర్దేశించగలుగుతారన్నదానిపై అది ఆధారపడి ఉంటుంది. 2014లో ప్రతిపక్షానికి చెందిన నాయకుడు ఆ ఎన్నికలను నిర్దేశించారు తప్ప అధికార పక్షం కాదు. బీజేపీ తన సారథికి ఉందంటున్న శక్తి సామర్థ్యాలను ముందుంచి బరిలోకి దిగితే కాంగ్రెస్ పార్టీ తనపై వచ్చిన అవినీతి ఆరోపణలకు సంజాయిషీ ఇచ్చుకోక తప్పని స్థితిలో పడింది. 2009లో బీజేపీ తన ప్రచార సారథి ఎల్కే అద్వానీని పటిష్టమైన నాయకుడిగా చూపేందుకు ఫ్రాంక్ సిమోస్, టాగ్ అండ్ ఉటోపియా అనే రెండు ఏజెన్సీలను ఉపయోగించుకుంది. ‘దృఢమైన నేత–నిర్ణయాత్మక ప్రభుత్వం’ అనేది అప్పటి నినాదం. మన్మోహన్ సింగ్ నిర్ణయరాహిత్యంతో కొట్టుమిట్టాడుతున్న నేతగా చూపడం ఆ ప్రచారం వెన కున్న ఉద్దేశం. ఆ ఏడాది కాంగ్రెస్ జే వాల్టర్ థాంప్సన్(జే డబ్ల్యూ టీ) అనే ఏజెన్సీ సాయం తీసుకుంది. ఆ సంస్థ ‘ఆమ్ ఆద్మీ’ నినాదానికి రూపకల్పన చేసింది. అయితే దాన్ని అనంతరకాలంలో అరవింద్ కేజ్రీ వాల్ సొంతం చేసుకున్నారను కోండి. 2004లో వాజపేయి గ్రే వరల్డ్‌వైడ్ సంస్థ రూపొందించిన ‘ఇండియా షైనింగ్’ నినాదాన్ని స్వీకరించి బరిలోకి దూకారు. ఎవరూ ఊహించని రీతిలో బీజేపీ ఓడిపోయింది. అలా ఓడిపోవడానికి దారితీసిన పరిస్థితులేమిటో ఇప్పటికీ ఎవరికీ పూర్తి అవగాహనకు రాలేదు. 2019లో జరిగే ఎన్నికలు అనుకూలాంశ (పాజిటివ్) ప్రచారంతో ఉండవు. నా ఉద్దేశం ప్రకారం అటు పాలకపక్షం నుంచి గానీ, ప్రతిపక్షం నుంచిగానీ ‘అచ్ఛేదిన్’ మాదిరి నినాదంతో ప్రచారం ఉండదు. మన ఆర్థిక వ్యవస్థ అంత ప్రత్యేకత చూపే స్థాయిలో ఏమీ పనిచేయలేదు. పౌరు లుగా మన బతుకులు 2014కూ, ఇప్పటికీ గమనించే స్థాయిలో ఏం మారలేదు. కొద్దిరోజుల క్రితం నేను ఒక బీజేపీ నేతతో మాట్లాడాను. 2019నాటికి అయోధ్య అంశాన్ని ప్రధానంగా లేవనెత్తుతామని ఆయన చెప్పారు. ఇప్పటికైతే బీజేపీ దాని జోలికి పోలేదు. కానీ ఇదంతా మారొచ్చు. సుప్రీంకోర్టు అయోధ్య కేసును విచారిస్తోంది. త్వరలో ఆ కేసులో తీర్పు వెలువడొచ్చు. దీన్లో తమను కూడా కక్షిదారులుగా చేర్చాలంటూ సుబ్రహ్మణ్యస్వామి తదితరులు కొద్ది రోజులక్రితం కోరితే సుప్రీంకోర్టు తిరస్కరించింది. సంప్రదింపుల ద్వారా దీనికి పరిష్కారం వెదకాలన్న ప్రతిపాదనను కూడా అది ఒప్పుకోలేదు. ‘భూ వివాదంలో మధ్యేవాద పంధా ఎలా సాధ్యమ’ని ప్రశ్నించింది. అదెలాంటి తీర్పయినా ఆ అంశం వచ్చే ఎన్నికల్లో ప్రధానమవుతుంది. అయితే ఆ ప్రచారం ద్వారా జనంలోకెళ్లే సందేశం ఏమిటన్నది ఊహించడానికే నాకు వణుకొస్తోంది. - ఆకార్ పటేల్ వ్యాసకర్త కాలమిస్టు, రచయిత aakar.patel@icloud.com -
ఈ సప్త అంశాలూ అత్యంత కీలకం
అవలోకనం మన దేశంలో సొంత ప్రచారం కోసం ప్రభుత్వాలు వాణిజ్య ప్రకటనల రూపంలో చేసే ఖర్చు అంతా ఇంతా కాదు. అన్నిటికన్నా భారీయెత్తున ప్రచారానికి వ్యయం చేసేది కేంద్ర ప్రభుత్వమే. గత ఏడాది కేంద్రం ఇందుకోసం చేసిన వ్యయం రూ. 1,280 కోట్లు. డియోడరెంట్లు మొదలుకొని లక్స్ సబ్బు, తాజ్‌మహల్ టీ వరకూ అన్నిటినీ ఉత్పత్తి చేసే హిందూస్తాన్ యూనీలీవర్ సంస్థ వార్షిక ప్రకటనల వ్యయం రూ. 900 కోట్లు మాత్రమే. రాష్ట్ర ప్రభుత్వాలు సైతం స్వీయ ప్రచారానికి బాగానే నిధులు కేటాయిస్తున్నాయి. ఈశాన్య రాష్ట్రాల ఎన్నికలపై ఈ వారంలో కనబడినంత ఆసక్తి దేశంలో మును పెన్నడూ లేదు. అలవాటు ప్రకారం నేను శనివారం వేకువజామునే లేచి 7 గంట లకు న్యూస్‌చానెళ్లను గమనించేసరికి ఆశ్చర్యం కలిగింది. అందరూ వారి వారి నిపు ణులతో త్రిపుర, మేఘాలయ, నాగాలాండ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల కోసం సిద్ధంగా ఉన్నారు! ఇదొక మంచి పరిణామం. కొన్నేళ్లక్రితం ‘ఇండియా టుడే’ మాగజిన్ రాసిన సంపాదకీయ వ్యాఖ్య నాకు గుర్తుంది. మన దేశం ఈశాన్య భారతాన్ని ఏవిధంగా నిర్లక్ష్యం చేస్తున్నదో చెప్పడం ఆ వ్యాఖ్య సారాంశం. చిత్రమే మంటే ఎనిమిది రాష్ట్రాల అసెంబ్లీలకు జరిగే ఎన్నికల గురించిన కథనాలున్న ఆ సంచిక ముఖపత్రంపై కేవలం అయిదు పెద్ద ఉత్తరాది రాష్ట్రాల ఎన్నికలకు సంబం ధించిన వివరాలున్నాయితప్ప అదే సమయంలో జరుగుతున్న ఈశాన్య రాష్ట్రాల ప్రస్తావనే లేదు. ఇప్పుడు ఈ వైఖరి మారుతున్న సూచనలు కనిపిస్తున్నాయి. అందువల్లే దీన్ని మంచి పరిణామమని అన్నాను. ఈ ఫలితాలు... ముఖ్యంగా త్రిపుర ఫలితాలు ఆసక్తిదాయకమైనవి. ప్రపం చంలోని ప్రధాన ప్రజాస్వామ్య వ్యవస్థల్లో క్రియాశీల కమ్యూనిస్టు పార్టీలు పనిచే స్తున్న దేశాల్లో మనది ఆఖరుదని చెప్పుకోవాలి. ఇంతక్రితంతో పోలిస్తే ఒక శక్తిగా కమ్యూనిస్టుల ప్రాధాన్యం తగ్గి ఉండొచ్చుగానీ వారి వల్ల రాజకీయాలకు విలువ పెరుగుతోంది. అయితే నేనివాళ కాంగ్రెస్‌పై కేంద్రీకరిస్తాను. గత నెలలో రాజస్థా న్లో వెలువడిన కొన్ని ఉప ఎన్నికల ఫలితాల తర్వాత కాంగ్రెస్ నాయకుడు సచిన్ పైలట్ మాట్లాడుతూ ‘రాష్ట్రాలు గెలుచుకోవాలంటే మీరు మున్సిపల్ ఎన్నికల్లో, వార్డు ఎన్నికల్లో నెగ్గాలి. ఆ ఎన్నికలు ఒక సంస్థకు పునాదిలాంటివి. మనం రాష్ట్రాలు నెగ్గాలి. రాష్ట్రాల్లో మంచి సంఖ్యలో సీట్లు గెల్చుకోకుండా ఏ పార్టీ కూడా జాతీయ స్థాయిలో న్యూఢిల్లీని గెల్చుకోవాలన్న ఆలోచన చేయలేదు’ అన్నారు. జాతీయ పార్టీలకు రాష్ట్రాల్లో గెలుపు ఎందుకంత ముఖ్యం? ప్రాంతీయంగా ఉండే అధికారానికి ఉండే ప్రాముఖ్యతేమిటి? చరిత్రలో ఎన్నడూ లేనంతగా ఇప్పుడు రాష్ట్రాల్లో కాంగ్రెస్‌కు అధికారం లేకుండా పోయింది గనుక వీటి గురించి పరిశీలించక తప్పదు. అయితే మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్ తదితర రాష్ట్రాల్లో జరగబోయే ఎన్నికల తర్వాత ఇందులో కొంత మార్పు ఉండొచ్చు. ఈ ఎన్నికలు కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్‌గాంధీకి ఎందుకు కీలకమైనవి? మొదటి ప్రయోజనం స్పష్టమైనదే. అధికారంలో ఉండటమే రాజకీయాల పర మార్ధం. అధికారంలో ఉండే పార్టీ తన సిద్ధాంతంలోని నిర్దిష్టతలను అమల్లోకి తెచ్చి ఎజెండాను నిర్ణయిస్తుంది. ఉదాహరణకు బీజేపీ హర్యానా, మహారాష్ట్రల్లో పశు మాంసాన్ని, పశువధను నిషేధించడం ద్వారా దాన్ని జాతీయ స్థాయి అంశంగా మార్చింది. కార్పొరేషన్లు, రాష్ట్ర అసెంబ్లీల్లో అధికారం ఉంటే రాజకీయ నాయ కులకు తమ తమ నియోజకవర్గాల్లో ప్రజలకు సేవ చేసే అవకాశం లభించడం రెండో ప్రయోజనం. పొద్దస్తమానం ప్రజలు విద్యుత్ కనెక్షన్లు మొదలుకొని తమ పిల్లల అడ్మిషన్ల వరకూ ఎన్నో అంశాల కోసం రాజకీయ నాయకులపై ఒత్తిళ్తు తెస్తుంటారు. అధికారంలో ఉన్న పార్టీ ఇవన్నీ చేయగలదు తప్ప ప్రతిపక్షం చేయ లేదు. మూడోది–నిధుల సేకరణ. ఇది రెండు మార్గాల్లో పనిచేస్తుంది. వాస్తవం ఏమంటే రాజకీయ నాయకులు వ్యక్తిగతంగా అవినీతిపరులు కాకపోయినా తమ పార్టీ కోసం విరాళాలు తీసుకుంటారు. ప్రముఖ జర్నలిస్టు స్వర్గీయ ధీరేన్ భగత్ మాజీ ప్రధాని వీపీ సింగ్‌పై తాను రాసిన ‘కాంటెంపరరీ కన్సర్వేటివ్’ పుస్తకంలో దీన్ని గురించి చక్కగా చెప్పారు. అధికారంలో ఉన్న పార్టీకి కార్పొరేట్ల నుంచి అధి కారికంగానే నిధులు ప్రవహిస్తాయి. అలా ఎందుకు జరుగుతుందో ఎవరికీ తెలియ నిది కాదు. నాలుగో అంశం– ఆ వచ్చిన నిధుల్ని అభ్యర్థులు ఖర్చు పెట్టడానికి సంబంధించిన విషయం. ప్రతిపక్షంలో ఉన్న పార్టీల తరఫున ఎన్నికల్లో పోటీచేసే వారు ఇతోధికంగా నిధులు ఖర్చు పెట్టలేరు. ఇది వారిని రంగంలో తగిన పోటీ దారుగా నిలపలేదు. అయిదో అంశం– అధికారంలో ఉన్నవారికి సమాచారాన్ని చేరేసే ప్రక్రియను నియంత్రించే శక్తి ఉండటం. ఉదాహరణకు ప్రభుత్వాలు వాణిజ్య ప్రకటనలకు చేసే వ్యయం. దేశంలో భారీగా ఖర్చు చేసే ప్రకటనకర్త కేంద్ర ప్రభుత్వం. గత ఏడాది అది ప్రధాని, ఆయన పథకాల ప్రచారం కోసం రూ. 1,280 కోట్లు వ్యయం చేసింది. దీన్ని మరింత స్పష్టంగా చెప్పాలంటే... డియోడరెంట్లు మొదలుకొని లక్స్ సబ్బు, తాజ్‌మహల్ టీ వగైరాల వరకూ అన్నిటినీ ఉత్పత్తి చేసే హిందూస్తాన్ యూనిలీవర్ సంస్థ వార్షిక వాణిజ్య ప్రకటనల వ్యయం రూ. 900 కోట్లు. దేశంలోని టెలికాం సంస్థలు అన్నీ కలిసి వాణిజ్యప్రకటన కోసం చేసే ఖర్చు కేంద్ర వ్యయం కన్నా చాలా తక్కువ. రాష్ట్ర ప్రభుత్వాలన్నీ సొంత ప్రచారం కోసం తగిన నిధుల్ని కేటాయిస్తుంటాయి. ఢిల్లీలోని అరవింద్ కేజ్రీవాల్ ప్రభుత్వం 2015లో ప్రచారం కోసం రూ. 526 కోట్లు ఖర్చు చేసింది. ఇక ఆరోది–ఇలా ప్రచారం కోసం భారీ యెత్తున చేసే వ్యయమంతా మీడియాను పాలకపక్షం వైపు నిలుపుతోంది. ముఖ్యంగా ప్రాంతీయ పత్రికల విషయంలో ఇది వాస్తవం. ఉదాహరణకు దేశంలో కోటిన్నరమంది పాఠకులుండి ఏడో స్థానంలో నిలిచిన ‘రాజస్థాన్ పత్రిక’ వసుం ధర రాజే ప్రభుత్వం తమకు వాణిజ్య ప్రకటనలు ఇవ్వడం లేదంటూ సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. బహుశా ఆ ప్రభుత్వానికి ‘రాజస్థాన్ పత్రిక’ అనుకూలంగా లేకపోవడమే ప్రకటనలు ఆపడానికి కారణం కావొచ్చు. ఏడోది, ఆఖరుది–ప్రభుత్వ యంత్రాంగాన్ని ఉపయోగించుకోవడం. ఎన్నికల సంఘం దీనిపై కొంతవరకూ కన్నేసి ఉంచుతోంది. కానీ ఎన్నికల తేదీలు ప్రకటించాకే అది మొదలవుతుంది. మిగిలిన అయిదేళ్లూ అధికారంలో ఉన్న పార్టీ పోలీసుల్ని ఉపయోగించుకోవచ్చు. అస్మదీయులకు పదవులు పంచిపెట్టొచ్చు. ప్రభుత్వ విభాగాల న్నిటినీ వినియోగించుకోవచ్చు. దుర్వినియోగం కూడా చేయొచ్చు. అడిగేవారుం డరు. రాజకీయ పార్టీలను పోషించే, నిలబెట్టే అంశాలు మన దేశంలో ఇంకా చాలా ఉన్నాయి. స్థానిక అధికారం ద్వారా కాంగ్రెస్ పార్టీ నిలకడగా, క్రమబద్ధంగా శక్తి పుంజుకుని కొనసాగనట్టయితే 2019లో రాహుల్‌గాంధీ జాతీయ స్థాయిలో స్వత స్సిద్ధమైన పోటీదారుగా మారడం కష్టం. వ్యాసకర్త కాలమిస్టు, రచయిత ఆకార్ పటేల్ aakar.patel@icloud.com -
అధునాతన యుద్ధతంత్రమూ... కర్రసామూ!
అవలోకనం ఆర్ఎస్ఎస్ శాఖలు తమ క్యాడర్‌తో క్రమం తప్పకుండా శారీరక వ్యాయామం చేయించటమే కాకుండా దేశభక్తికి సంబంధించిన పాటలు పాడిస్తుంటాయి. అయితే నేటి యుద్ధాలను మర్చిపోండి. వందేళ్ల క్రితం జరిగిన యుద్ధానికి కూడా ఇలాంటి శిక్షణా కార్యక్రమం ఎందుకూ కొరగాదనే చెప్పాలి. పదాతి దళానికి ఇచ్చే ఆధునిక సైనిక శిక్షణా కార్యక్రమం 400 ఏళ్ల క్రితం ప్రారంభమైంది. శతాబ్దాల క్రమంలో అది ఒక రూపు తీసుకుంటూ వచ్చింది. ఇప్పుడు ఈ 2018లో గైడెడ్ మిస్సైల్స్ శకంలో అది సైతం ఎందుకూ పనికిరాదనే చెప్పాలి. రెండు దేశాల మధ్య కీలకమైన యుద్ధం జరిగి 15 ఏళ్లయింది. ఏకపక్షంగా జరిగిన ఆ దురాక్రమణ యుద్ధంలో సద్దాం హుస్సేన్‌ను అమెరికా అధ్యక్షుడు జార్జ్ బుష్ ఓడించాడు. ఇరాకీ సైన్యం వద్ద ఉన్న కాలం చెల్లిన ట్యాంకులు, యుద్ధ విమానాలు అమెరికన్ సైనిక శక్తి ముందు ఎందుకూ కొరగాకుండా పోయాయి. ఇరు దేశాల సైన్యాలు దాదాపు సమాన సంఖ్యలో –3,50,000 మంది సైనికులు– యుద్ధంలో పాల్గొన్నప్పటికీ అమెరికా సైన్యంలో మరణాల శాతం ఇరాకీ సైన్యంతో పోలిస్తే 110వ వంతు మాత్రమే. అమెరికన్ల యుద్ధ సామగ్రి చాలా అధునాతనమైంది. ఆయాదేశాలు సైనిక సామగ్రిపై పెట్టే వ్యయాన్ని ప్రధానంగా ట్యాంకులు, యుద్ధ ఓడలు, యుద్ధవిమానాలకే వెచ్చిస్తుంటారు. ఈ సంవత్సరం భారత ప్రభుత్వం కేటాయించిన రక్షణ బడ్జెట్లో దాదాపు లక్ష కోట్ల రూపాయలను ఈ హర్డ్‌వేర్ పైనే వెచ్చిస్తున్నారు. అయితే ఇంత డబ్బు వెచ్చించి కొంటున్న ఆయుధ సామగ్రిని రిపబ్లిక్ డే పెరేడ్ వంటి సందర్భాల్లో తప్ప ఎన్నడూ ఉపయోగించడం జరగదని చాలామంది సైనిక వ్యూహ నిపుణులు స్పష్టం చేస్తున్నారు. రెండు ప్రధాన దేశాల మధ్య భవిష్యత్తులో జరగబోయే యుద్ధం 2003లో జరిగిన ఇరాక్ యుద్ధం కంటే భిన్నంగా ఉంటుంది. ఇరాక్ యుద్ధాన్ని 1757లో జరిగిన ప్లాసీ యుద్ధంతో పోల్చి చెప్పవచ్చు. ఒక పక్షం మరొక పక్షాన్ని బలప్రయోగంతో ఒప్పించి తను కోరిందల్లా సాధించుకోవచ్చని అభిప్రాయపడినప్పుడే యుద్ధం జరుగుతుంది. అయితే ఒక్కోసారి హింసతో పనిలేకుండానే ఎదుటి పక్షం మెడలు వంచడం సాధ్యపడవచ్చు. 2016లో జరిగిన అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రష్యా జోక్యం చేసుకుందని అమెరికన్ నిఘా సంస్థలు పేర్కొన్నాయి. హిల్లరీ క్లింటన్ ఆ ఎన్నికల్లో ఓడిపోయి, డొనాల్డ్ ట్రంప్ గెలుపొందాలని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ భావించారట. ఈ వ్యవహారంలో రష్యన్లతో ట్రంప్ చేతులు కలిపారని ఆరోపణలు వచ్చాయి కూడా. పుతిన్ అతడి గూఢచారులు అమెరికన్ ఎన్నికల్లో జోక్యం చేసుకుని ప్రభావితం చేశారని నిశ్చయంగా చెప్పవచ్చు. ఫిబ్రవరి 16న ట్రంప్ న్యాయ శాఖ 13 మంది రష్యన్లపై నేరారోపణ చేసింది. వీరిలో చాలావరకు రష్యాలోని సెయింట్స్ పీటర్స్బర్గ్ నగరంలోని ఇంటర్నెట్ రీసెర్చ్ ఏజెన్సీ అనే బృందానికి చెందినవారు. వీరు వర్చువల్ ప్రైవేట్ నెట్‌వర్క్‌పై సోషల్ మీడియా ఖాతాలను తెరిచారు. వాస్తవానికి వాటిని రష్యా నుంచి నిర్వహిస్తున్నప్పటికీ అమెరికా నుంచి నిర్వహిస్తున్నట్లు కనిపించేవి. ఈ ఖాతాలు ట్రంప్‌కు అనుకూలంగా ఎన్నికల ఫలితాలను నిర్ణయించడంలో సహాయపడ్డాయని అమెరికన్లు నమ్ముతున్నారు. ట్రంప్ గెలవాలని రష్యా ఎందుకు భావించిందంటే, ప్రపంచంలో రష్యా ప్రభావాన్ని పరిమితం చేసేలా హిల్లరీ క్లింటన్ ఆంక్షలను, విధించవచ్చని అనుమానించడమే. అమెరికాతో ఎలాంటి యుద్ధానికి వెళ్లకుండానే పుతిన్ తాననుకున్నది నెరవేర్చుకున్నారు. సరిహద్దుల్లో యుద్ధమే వస్తే ఆర్ఎస్ఎస్ కేవలం మూడురోజుల్లోపలే సైనిక బలగాలను మోహరింప జేయగలుగుతుందని, అదే భారత సైన్యానికి ఆరునెలల సమయం పడుతుందని ఆ సంస్థ అధిపతి మోహన్ భాగవత్ అన్నారు. భాగవత్ తన మిలీషియాను సరిహద్దులకు పంపిన తర్వాత అక్కడ అది ఏం చేస్తుందన్నదే నా ఆలోచన. చైనా సైనికులు పర్వతాల మీది నుంచి రైఫిళ్లను చేతుల్లో పట్టుకుని వస్తున్నట్లుగా 1962 నాటి యుద్ధ డాక్యుమెంటరీలను చూసిన తర్వాత భాగవత్ అలా ప్రకటించి ఉంటారా? మదర్ ఇండియాను రక్షించడానికి సంఘ్ అనుయాయులు ఏం చేస్తారనే అంశంపై భాగవత్ ఊహ ఏమిటి? ఆర్ఎస్ఎస్ శాఖలు తమ క్యాడర్‌తో క్రమం తప్పకుండా శారీరక వ్యాయా మం చేయించటమే కాకుండా దేశభక్తికి సంబంధించిన పాటలు పాడిస్తుంటాయి. అయితే నేటి యుద్ధాలను మర్చిపోండి. వందేళ్ల క్రితం జరిగిన యుద్ధానికి కూడా ఇలాంటి శిక్షణా కార్యక్రమం ఎందుకూ కొరగాదనే చెప్పాలి. పదాతి దళానికి ఇచ్చే ఆధునిక సైనిక శిక్షణా కార్యక్రమం 400 ఏళ్ల క్రితం ప్రారంభమైంది. శతాబ్దాల క్రమంలో అది ఒక రూపు తీసుకుంటూ వచ్చింది. ఇప్పుడు ఈ 2018లో గైడెడ్ మిస్సైల్స్ శకంలో అది సైతం ఎందుకూ పనికిరాదనే చెప్పాలి. ఆధునిక రాజ్యానికి వ్యతిరేకంగా జరిగే యుద్ధంలో మనకు కలిగే ముప్పు ఏదైనా ఉందంటే అది పోరాడే స్వచ్ఛంద సైనికులు లేకపోవడం వల్ల కాదు. ఎందుకంటే ప్రపంచంలోని అతి పెద్ద సైన్యాలలో భారత్ సైన్యం ఒకటి. ఇక యుద్ధ సామగ్రి కొరత అసలే కాదు. ఎందుకంటే మనకు చాలినన్ని ట్యాంకులు, యుద్ధ విమానాలు లేవనడానికీ వీల్లేదు. తగిన టెక్నాలజీ లేకపోవడమే మన అసలు సమస్య. నిజానికి ఇదే ప్రాణాంతకమైన సమస్య. నేటి ఆధునిక రాజ్యం శత్రువు కమ్యూనికేషన్లను నిర్వీర్యం చేయడంమీదే ప్రధానంగా దృష్టి పెడుతుంది. ఇంటర్నెట్ను విచ్ఛిన్నపర్చి, బ్యాంకింగ్ వ్యవస్థను కుప్పగూలిస్తే గంటల్లోపే ఒక దేశాన్ని ముంగాళ్లమీదికి తీసుకురావచ్చు. సైనిక పరంగా చూస్తే కూడా, సరిహద్దుల అవతలినుంచి మన కమ్యూనికేషన్లపై దాడి జరిగితే చాలు దేశం రెక్కలు విరిగిపడినంత స్థితి నెలకొంటుంది. ఉదాహరణకు అమెరికన్ల ఆజమాయిషీలో ఉన్న గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్స్‌పై ఆధారపడుతున్నాం. దీన్ని అందుబాటులో లేకుండా చేస్తే మన యుద్ధ విమానాలు, క్షిపణులు కీలక సమయంలో పనికిరాకుండా పోయే ప్రమాదం ఉంది. ఇలాంటి సంక్లిష్ట పరిస్థితుల్లో లక్షలాదిమంది తమ ప్రాణాలు ధారపోయడానికి సంసిద్ధత తెలిపినా పెద్దగా ప్రయోజనం ఉండదు. అధునాతన సంపత్తి లేని దేశాన్ని శత్రువు ఎలాంటి హింసా లేకుండానే సులువుగా లొంగదీసుకోవచ్చు. నేడు యుద్ధతంత్రం మొత్తం దీనిపైనే నడుస్తోంది. దీన్ని అర్థం చేసుకోకపోవడం అనేది సమాచార లేమికి కాకుండా మన పరమ నిర్లక్ష్యానికి నిదర్శనంగా ఉంటుంది. ఆర్ఎస్ఎస్, మన ప్రధానమంత్రితో సహా ఆ సంస్థ నుంచి తయారవుతున్న వ్యక్తుల ఆలోచనల నాణ్యతపై మనం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం వల్లే నేను ఇలా రాయాల్సి వస్తోంది. ఈ ఆలోచన చాలా పురాతనమైనది. మరీ తేలికగా తీసుకుంటున్నారనిపిస్తుంది. దేశభక్తిని ఇలాంటి ఆలోచనలు, ప్రకటనలు రగుల్కొల్ప వచ్చు. దాని లక్ష్యంపట్ల సందేహించనవసరం లేదు. కానీ అలాంటి ఆలోచనల నాణ్యత ప్రమాద హెచ్చరికలు పంపుతోంది. అదే నన్ను భయపెడుతోంది కూడా. వ్యాసకర్త కాలమిస్టు, రచయిత aakar.patel@icloud.com ఆకార్ పటేల్ -
మనమంతా బాధపడవలసిన మరో సంగతి..
కల్లోల కశ్మీర్లో ఎవరి హక్కులు గల్లంతవుతున్నాయి? మనమంతా బాధపడవలసిన సంగతి మరొకటుంది– మన సైన్యం ఇతర భారతీయుల నుంచి తనకు రక్షణ కల్పించమని పిల్లలను ఉపయోగించుకుని డిమాండ్ చేస్తోంది. ఈ దేశ పౌరులు ఈ దేశ పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదు చేస్తే, ఇక్కడి పోలీసులే కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తే, ఈ దేశ న్యాయస్థానాల్లో ఇక్కడి న్యాయమూర్తులే విచారణ జరుపుతుంటే మన సైన్యం భయసందేహాలు వ్యక్తం చేస్తోంది. నిజానికిది బాధపడాల్సిన విషయం కాదు... కలవరపడాల్సిన విషయం. ఈసారి నేను కశ్మీర్ హింసపై రాస్తున్నాను. ఆ హింస గురించి కేవలం ఒక కోణంలో మాత్రమే తెలిసిన పిల్లలనుద్దేశించి దీన్ని రాస్తున్నాను. కశ్మీర్లో ముగ్గురు పౌరులను కాల్చి చంపిన సైనికులపై ఎఫ్ఐఆర్లు దాఖలు కావడంపై ఆగ్రహావే శాలు పెల్లుబుకుతున్నాయి. ఆ సైనికుల పిల్లలు కూడా కొన్ని చర్యలు తీసుకు న్నారు. ఇందుకు సంబంధించి వెలువడిన కథనం వివరాలివి: సైనికులపై ఎఫ్ఐ ఆర్ దాఖలైన సమయంలో రాళ్లు విసిరిన ఆందోళనకారులపై కేసులు ఉపసంహ రించుకోవడంపై జమ్మూ–కశ్మీర్లో తీవ్ర చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో సైనికుల పిల్లలు జాతీయ మానవ హక్కుల సంఘాన్ని ఆశ్రయించారు. ఆందోళన కారులవల్ల సైనికులు కోల్పోతున్న మానవ హక్కుల్ని కాపాడాలని కోరారు. ఇద్దరు లెఫ్టినెంట్ కల్నల్ హోదా అధికారుల పిల్లలు ప్రీతి, కాజల్, ప్రభవ్, రిటైర్డ్ నాయబ్ సుబేదార్ హక్కుల సంఘం చైర్మన్ హెచ్ఎల్ దత్తుకు ఈ ఫిర్యాదు ఇచ్చారు. కల్లోలిత ప్రాంతాల్లో స్థానికుల హక్కుల కోసం ‘అలుపెరుగక శ్రమిస్తున్నందుకు’ సంఘాన్ని, ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్‌ను అందులో ప్రశంసించారు. కానీ రాళ్లు విసిరే గుంపు వల్ల హక్కులు కోల్పోతున్న సైన్యం దీన స్థితి గురించి కళ్లు మూసుకుం టున్నాయని ఆరోపించారు. స్వాతంత్య్రం వచ్చిన నాటినుంచి అక్కడ చిన్నపాటి యుద్ధం జరుగుతున్నదని, ప్రభుత్వ యంత్రాంగానికి సాయపడేందుకు సైన్యాన్ని రప్పించి వారి కోసం సాయుధ దళాల ప్రత్యేకాధికారాల చట్టం(ఏఎఫ్ఎస్పీఏ)ను అమలు చేయాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ణయించాయని ఆ ఫిర్యాదులో వారు వివరించారు. వీటిని ఇంతకుమించి వివరించనవసరం లేదు. ఈ సందర్భంగా మరికొన్ని సంగతులు తెలుసుకోవాలని కోరుతున్నాను. గత నెలలో పార్లమెంటులో అడిగిన ఒక ప్రశ్న వివరాలు చూద్దాం. ఏ) ఏఎఫ్ఎస్పీఏ కింద సాయుధ దళాలను ప్రాసి క్యూట్ చేయాలంటూ కేంద్రానికి ఎన్ని ఫిర్యాదులు వచ్చాయి? బి) ఎన్నిటికి అను మతి మంజూరు చేశారు, ఎన్నిటిని తిరస్కరించారు, ఎన్ని పెండింగ్‌లో ఉన్నాయి? సి) ప్రతి ఒక్క ఫిర్యాదు విషయంలోనూ విడివిడిగా– ఫిర్యాదు వచ్చిన సంవ త్సరం, ఆరోపించిన నేరాలు, వాటిపై జరిగిన దర్యాప్తు ఫలితాలు, అనుమతి మంజూరుపై ప్రస్తుత స్థితి. డి) ప్రాసిక్యూషన్‌కు నిరాకరించిన లేదా పెండింగ్‌లో ఉంచిన పక్షంలో అందుకు గల కారణాలు. ఈ ప్రశ్నకు రక్షణ శాఖ సహాయమంత్రి ఇచ్చిన జవాబు ఇలా ఉంది: ఏ) సైనికులపై మొత్తం 50 కేసుల విషయంలో ఏఎఫ్ ఎస్పీఏకింద ప్రాసిక్యూషన్‌కు అనుమతి మంజూరు చేయమని రాష్ట్ర ప్రభుత్వం నుంచి వినతులు వచ్చాయి. బి,సి) సంవత్సరాలవారీగా కేసుల సంఖ్య, వాటిలో పేర్కొన్న ఆరోపణలు, ఆ కేసుల ప్రస్తుత స్థితిగతులు–అవి పెండింగ్‌లో ఉన్నాయా, అనుమతి మంజూరైందా, తిరస్కరించారా అన్న వివరాలు ఈ జవాబుతో జత చేశాం. డి) ప్రాసిక్యూషన్‌కు అనుమతి నిరాకరించడం లేదా పెండింగ్‌లో ఉంచడానికి వాటిల్లో తగిన ప్రాథమిక సాక్ష్యాధారాలు లేకపోవడమే కారణం. జవాన్లపై వచ్చిన కేసుల వివరాలివి: 2001–కాల్చి చంపిన కేసులో ఒక ఎఫ్ఐఆర్(ప్రాసిక్యూషన్‌కు అనుమతి నిరాకరణ). 2005– కాల్చిచంపిన ఘటనల్లో 2 ఎఫ్ఐఆర్లు(అనుమతి నిరాకరణ). 2006–మొత్తం 17 ఎఫ్ఐఆర్లు. ఒక అత్యాచారం, మహిళలతో అసభ్య ప్రవర్తన కేసు, ఆరుగురి అపహరణ, హత్య ఘటన, మిగిలినవన్నీ కాల్చిచంపిన కేసులు(ఒక అపహరణ కేసు మినహా మిగిలిన వాటికి అనుమతి నిరాకరణ. ఆ ఒక్క కేసు పెండింగ్‌లో ఉంది). 2007–మొత్తం 13 ఎఫ్ఐఆర్లు. ఒక అత్యాచారం, చిత్రహింసలతో ఒకరి హత్య, మిగిలినవన్నీ కాల్చి చంపిన ఘటనలు(అన్నిటికీ అనుమతి నిరాకరణ). 2008– 3 ఎఫ్ఐఆర్లు. ఒక అత్యాచారం, దొంగతనం, హత్య కేసులు(అన్నిటికీ అనుమతి నిరాకరణ). 2009– 2 ఎఫ్ఐఆర్లు. ఒక హత్య కేసు, ఒక అపహరణ కేసు(రెండింటికీ అనుమతి నిరాకరణ). 2010– 4 ఎఫ్ఐఆర్లు. అన్నీ హత్య కేసులు(అన్నిటికీ అనుమతి నిరా కరణ). 2011– 2 ఎఫ్ఐఆర్లు. ఒకటి హత్య కేసు(అనుమతి నిరాకరణ), రెండోది అపహరణ కేసు(పెండింగ్). 2013– 3 ఎఫ్ఐఆర్లు. అన్నీ హత్య కేసులు(అన్నిటికీ అనుమతి నిరాకరణ). 2014– 2 ఎఫ్ఐఆర్లు. ఈ రెండూ కాల్చిచంపిన కేసులు (ఒక కేసులో అనుమతి నిరాకరణ, మరొకటి పెండింగ్). 2016– కాల్చి చంపిన కేసులో ఒక ఎఫ్ఐఆర్ (అనుమతి నిరాకరణ). ఏతావాతా కశ్మీర్లో జరిగిన నేరాలకు విచారణను ఎదుర్కొన్న సైనికుల సంఖ్య–సున్నా. జవాన్లపై ఎఫ్ఐఆర్లు దాఖలు చేయడం వల్ల వారి పిల్లల మనో భావాలు దెబ్బతిని ఉండొచ్చు. కేవలం వాటివల్ల అయ్యేదేమీ లేదని, కశ్మీర్ పౌరు లకు న్యాయం లభించడంలేదని పై వివరాలు గమనిస్తే అర్థమవుతుంది. ఇందుకు మనమంతా బాధపడాలి. తన సైనిక న్యాయస్థానాల్లో బాధితులకు న్యాయం చేస్తు న్నట్టు సైన్యం వాదించవచ్చు. కానీ వాటిల్లో బాధితులకు, వారి కుటుంబాలకు ప్రవేశం ఉండదు. ఈ మార్గంలో జవాన్లు ఎలా నిర్దోషులవుతున్నారో తెలుసుకోవా లన్న ఆసక్తి ఉంటే పత్రిబల్, మాఛిల్ కేసుల్లో ఏమైందో తెలుసుకోండి. మనమంతా బాధపడవలసిన విషయం మరొకటుంది. మన సైన్యం ఇతర భారతీయుల నుంచి తనకు రక్షణ కల్పించమని పిల్లలను ఉపయోగించుకుని డిమాండ్ చేస్తోంది. ఈ దేశ పౌరులు ఈ దేశ పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదు చేస్తే, ఇక్కడి పోలీసులే కేసులు నమోదు చేసి దర్యాప్తుచేస్తే, ఈ దేశ న్యాయస్థానాల్లో, ఇక్కడి న్యాయమూర్తులే విచారణ జరుపుతుంటే మన సైన్యం భయసందేహాలు వ్యక్తం చేస్తోంది. నిజానికిది బాధపడాల్సిన విషయం కాదు... కలవరపడాల్సిన విషయం. ఎలాంటి నేరారోపణలొచ్చినా, కేంద్రంలో ఎవరు అధికారంలో ఉన్నా మన సైన్యం విచారణ నుంచి తప్పించుకుంటోంది. జవాన్లు అత్యాచారం చేసినా, హత్యలు చేసినా, కిడ్నాప్‌లకు పాల్పడినా, పౌరుల్ని చిత్రహింసలకు గురిచేసినా, వాటిపై ఫిర్యాదులొచ్చినా ప్రభుత్వాలు ‘నిరాకరణ’ లేదా ‘పెండింగ్’లో ఉంచుతాయి తప్ప ‘అనుమతి’ మంజూరు చేయవు. ఆ పిల్లలు, వారితోపాటు మనమంతా అసలు వేలాదిమంది కశ్మీర్ పౌరులు రాళ్లెందుకు విసురుతున్నారో అప్పుడప్పుడైనా ఆలోచించకతప్పదు. - ఆకార్ పటేల్ వ్యాసకర్త కాలమిస్టు, రచయిత ‘aakar.patel@icloud.com -
అభాగ్యులకు అద్భుతమైన వరం ‘మోదీ కేర్’
అవలోకనం కేంద్ర బడ్జెట్లో ప్రకటించిన జాతీయ ఆరోగ్య పరిరక్షణ పథకం(ఎన్‌హెచ్‌పీఎస్) ప్రశంసనీయమైనది. అద్భుతమైనది. దీని అమలుకు ఎన్నో అవాంతరాలున్నాయని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా మౌలిక సదుపాయాల లేమిని బీమా ఆధారిత పథకం పరిష్కరించలేదని అంటున్నారు. ఇది నిజమే అయినా ఈ పథకం అమలు మొదలైతే అత్యంత బలహీనుల, అభాగ్యుల ఆరోగ్య సమస్యలను ఇది వెలుగులోకి తెస్తుంది. ఆరోగ్య పరిరక్షణ అంశాన్ని జాతీయ స్థాయి చర్చగా మారుస్తుంది. కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ ప్రవేశపెట్టిన బడ్జెట్‌కు ఆశ్చర్యకరమైన, ఊహకం దని కోణాలు కొన్ని ఉన్నాయి. అందులో మొదటిది రక్షణ వ్యయం అనుకున్నం తగా లేకపోవడం. ఇది రక్షణ నిపుణులను అసంతృప్తికి గురిచేసింది. మన దేశం ఏటా సైన్యంపై రూ. 4 లక్షల కోట్లు వ్యయం చేస్తుంది. జనాభాలో 50 కోట్ల మందికి ప్రయోజనం కలిగించదల్చుకున్న ఆరోగ్య బీమాకు ఖర్చయ్యేది రూ. 10,000 కోట్లు మాత్రమే. పింఛన్ కింద సైన్యానికిచ్చేది దీనికన్నా పది రెట్లు ఎక్కువ. ఆ వ్యయం ఇంచుమించు లక్ష కోట్లు. ఒకే ర్యాంక్–ఒకే పింఛన్ అనేది పోస్టుమాన్, స్వీపర్ లేదా టీచర్ వంటి మరే ఇతర ప్రభుత్వోద్యోగి పొందని సౌకర్యం. రిటైరైన సైనికులు మాత్రమే ఈ పేద దేశంలో అలాంటి ప్రయోజనాలు సాధించుకోగలిగారు. రక్షణకు చేసే ఈ రూ. 4 లక్షల కోట్ల వ్యయంలో సీఆర్పీఎఫ్, ఇతర దళాలకు మన దేశం ఖర్చుచేసే రూ. 30,000 కోట్లు చేరదు. ఈ దళాలు కశ్మీర్‌లోనూ, ఈశాన్య రాష్ట్రాల్లోనూ శాశ్వత ప్రాతిపదికన రక్షణ బాధ్యతలు నిర్వ ర్తిస్తుంటాయి. సాయుధ బలగాల ప్రత్యేకాధికారాల చట్టం(ఏఎఫ్ఎస్పీఏ) కింద ఇవి కూడా ‘సాయుధ బలగాల’ నిర్వచనం కిందికొస్తాయి. ఆ చట్టం కింద రక్షణ పొందుతాయి. నిజానికి నరేంద్ర మోదీ ప్రభుత్వం రక్షణ వ్యయాన్ని తగ్గించలేదు. ఆ వ్యయాన్ని 2014 నుంచీ ఏటా దాదాపు 6 శాతం మాత్రమే పెంచుతూ వస్తోంది. ద్రవ్యోల్బణం రేటుతో పోలిస్తే ఇది స్వల్పంగా ఎక్కువ. అంటే కాస్త హెచ్చు తగ్గులతో వాస్తవ వ్యయం ఎప్పుడూ ఒకేలా ఉంటోందన్న మాట. ఒకపక్క చైనా దూకుడుగా వ్యవహరిస్తున్న ఈ దశలో మన దేశం ఆ సవాలును ఎదుర్కొనడానికి సిద్ధపడటం లేదని నిపుణులు ఆందోళన చెందుతున్నారు. మాటలు తీవ్రంగా ఉన్నా చేతల్లో సాదాసీదాగా ఉండే మోదీ ఈ వైఖరిని నావరకైతే తెలివైనదిగానే భావిస్తాను. మనం నిరాయుధ దేశంగానో, ఒక చెంప కొడితే మరో చెంప చూపే విధంగా ఉండాలనో నేను అనడం లేదు. దేశాలు సైన్యాన్ని నిర్వహించుకోవడంపై నాకేం అభ్యంతరం లేదు. కానీ మన భద్రతకు సంబంధించి సరైన దృష్టికోణం ఉండాలి. అందుకు తగినట్టుగా ప్రాముఖ్యతనీయాలి. సగటు భారతీయ పౌరుడు చైనా దురాక్రమణ బెడద కంటే వ్యాధుల వల్ల లేదా పేదరికం వల్ల ఎక్కువ ప్రభావితమవుతాడు. అలా చూస్తే మనం రక్షణకు చెల్లించే మూల్యం రూ. 4 లక్షల కోట్లు, రక్షణ దళాల పింఛన్ కోసం చేసే లక్ష కోట్ల వ్యయం మరీ ఎక్కువనిపిస్తుంది. ఇతర నిపుణులు ఏమైనా అనుకోవచ్చుగానీ ఇలా పరిమితి పెట్టుకోవడం లేదా చడీ చప్పుడూ లేకుండా తగ్గించడం ద్వారా మోదీ చాలా మంచి పని చేశారనిపిస్తుంది. ఇక మోదీ కేర్‌గా అభివర్ణిస్తున్న ఆరోగ్యబీమా గురించి మాట్లాడుకుందాం. ఇది పది కోట్లమందికి బీమా సౌకర్యం కల్పిస్తుంది. ఒక్కో కుటుంబంలో అయిదు గురు ఉంటారనుకుంటే దీనివల్ల 10 కోట్లమంది ప్రజానీకం లాభపడతారని భావించవచ్చు. ఈ కుటుంబాలన్నీ ఏడాదికి గరిష్టంగా రూ. 5 లక్షల చొప్పున లబ్ధి పొందుతాయి. ఈ పథకం గురించి నిపుణులకు కొన్ని అభ్యంతరాలున్నాయి. అందులో మొదటిది– ఆ పథకానికి జైట్లీ తగినంత కేటాయింపు చేయలేదన్నదే. అందుకు కేవలం రూ. 2,000 కోట్లు మాత్రమే ఆయన కేటాయించారు. వాస్తవానికి అంతకన్నా చాలా ఎక్కువ అవుతుంది. ఒక్కో కుటుంబానికి ఏడాదికి రూ. 5 లక్షల వరకూ ఆరోగ్యబీమా కల్పించడమంటే కుటుంబంలో ఒక్కొక్కరికి రూ. 1,100– రూ. 1,400 మధ్య చికిత్స కోసం ఖర్చు చేయదల్చుకున్నట్టు. అంటే ఆ పథకానికి ఏటా దాదాపు రూ. 11,000– రూ. 14,000 కోట్ల మధ్య ఖర్చవుతుంది. రెండోది– ఇప్పుడు జైట్లీ చేసింది కేవలం ప్రకటన మాత్రమే. ఆ పథకం గురించి, దాని అమలు గురించి విధివిధానాలు రూపొందించడానికి మరో ఆర్నెల్లు పడుతుంది. ఆ తర్వాతే పథకాన్ని అమలు చేస్తారు. ఇవన్నీ ముందు ఖరారు చేసుకుని ప్రకటించి ఉంటే బాగుండేది. మూడోది–పథకానికయ్యే వ్యయంలో సగం మొత్తాన్ని రాష్ట్ర ప్రభుత్వాలు భరిస్తాయని కేంద్రం భావిస్తోంది. ఇందుకు సంబంధించి ఇంకా రాష్ట్రాలతో మాట్లాడవలసి ఉంది. నాలుగు–ఈ తరహా పథకాలు కొన్ని రాష్ట్రాల్లో ఇప్పటికే ఉన్నాయి. అవి ప్రభావవంతంగా లేవు. అయిదు–ప్రామాణికమైన ఆస్పత్రి సదుపాయం లేకపోవడమన్నది చాలామంది ఎదుర్కొంటున్న సమస్య. దేశంలో చాలాచోట్ల మంచి వైద్య సౌకర్యాలు లేవు. మౌలిక సదుపాయాల లేమిని బీమా ఆధారిత పథకం పరిష్కరించలేదు. ఆరు– వైద్య సదుపాయాల విషయంలో మన ప్రభుత్వాసుపత్రులు ప్రపంచంలోనే అత్యంత నాసిరకమని అధ్యయనాలు చెబుతున్నాయి. ఈ ఆస్పత్రుల్లో పని ఎగ్గొట్టే తత్వం, జవాబుదారీతనం లేమి అధికం. సారాంశంలో ఇది పాలనకు సంబంధించిన సమస్య కూడా. దీన్ని ఉపే క్షించి బీమా పథకాలను రూపొందించడం బాధ్యత నుంచి తప్పించుకోవడమే అవుతుంది. ఈ అభ్యంతరాలు పరిగణనలోకి తీసుకోదగ్గవే. పరిష్కరించవలసినవే. అయినా ఈ ఆరోగ్య పథకం అద్భుతమైనదే. ఇప్పటికిది ప్రకటన మాత్రమే అయినా ఏదో దశలో ప్రభుత్వం వ్యయం చేయకతప్పనిది. ఈ పథకం దేశంలో అత్యంత బలహీనుల, అభాగ్యుల ఆరోగ్య సమస్యలను వెలుగులోకి తెస్తుంది. ఆరోగ్య పరిరక్షణను జాతీయ స్థాయి చర్చలోకి తెస్తుంది. రక్షణ, ఒకే ర్యాంక్–ఒకే పింఛన్ వంటి అంశాల్లా ఇన్నాళ్లూ ఇది చర్చకు రాలేదు. ప్రజల నుంచి ఒత్తిడి ఉన్నంతకాలం ఈ పథకానికి అవసరమైన నిధులు లభిస్తాయి. ఆ నిధులు వచ్చాక పేద రోగులు సౌకర్యాల కోసం డిమాండు చేయడం ప్రారంభిస్తారు. రూ. 5 లక్షల పరిమితి సరిపోతుందా లేదా అన్నది కూడా చూడాల్సి ఉంది. ఈ కారణాలన్ని టివల్లా ఈ నిర్ణయం అద్భుతమైనదని నేననుకుంటున్నాను. మోదీ తన రాజకీయ జీవితంలో అవలంబిస్తూ వచ్చిన మెజారిటీ మతతత్వ విధానాలపై నాకు ప్రేమ గానీ, సానుభూతిగానీ లేవు. ఆయన ఏలుబడిలో జరిగినవి అత్యంత భయానకమై నవి, భీతిగొలిపేవి. అయితే మంచి చేసినప్పుడు ప్రశంసించడానికి అవి అడ్డు రాకూడదు. ఈ ఆరోగ్యపథకం జాతీయ స్థాయి సంభాషణను మార్చేసింది. అందుకే దీనికి మద్దతునివ్వాల్సిన అవసరం ఉంది. - ఆకార్ పటేల్ వ్యాసకర్త కాలమిస్టు, రచయిత ‘ aakar.patel@icloud.com -
నకిలీ వార్తల్ని మించిన పెను సమస్య!
అవలోకనం మన దేశంలో డేటా వినియోగం గత కొన్ని సంవత్సరాలుగా అయిదు రెట్లు మించి పెరిగింది. అనేకులు స్మార్ట్ఫోన్లవైపు మొగ్గడం, వాట్సాప్‌లో వచ్చే అంశాలను అందరికీ పంపే ధోరణి పెరగడం ఇందుకు రుజువు. ఈ కారణంగా మాధ్యమం విస్తృతి ఎంతగానో పెరిగింది. ఇలాంటపుడు సహజంగానే నకిలీవార్తల బెడద ఎక్కువగా ఉంటుంది. అయితే మనకు దీన్ని మించిన మరో సమస్య ఉంది. నిజమైన వార్తలపై ఆసక్తి కొరవడటమన్నదే ఆ పెను సమస్య. కోల్‌కతాలో జరిగే సాహితీ సంరంభానికి వచ్చి ఈ వ్యాసం రాస్తున్నాను. గత పదేళ్లుగా ఇలాంటి పండుగలు దేశవ్యాప్తంగా జరుగుతున్నాయి. ఇతర దేశాలకంటే మన దేశంలోనే ఇవి ఎక్కువ. నాకిది అసాధారణమే అనిపిస్తుంది. ఏదైనా రాయడం, సాహిత్యాన్ని చదవడం అనే సంస్కృతి మనకుంది. అలాగని మన సమాజంపై రచయిత ప్రభావం పెద్దగా ఉండదు. చెక్ రిపబ్లిక్ తొలి అధ్యక్షుడిగా ఎన్నికైన వాక్లవ్ హావెల్ లాంటివారు ఇక్కడ ఉద్భవించే అవకాశం లేదు. ఉపా ధ్యాయుల్లాగే రచయితలపై కూడా అందరికీ గౌరవం ఉంటుంది. కానీ వారిని అనుసరించే తత్వం ఎక్కడా ఉండదు. మరి ఇన్ని సాహితీ సంరంభాలెందుకు? ఒక్కో సంరంభానికి ఇన్ని వేలమంది, వారిలో అత్యధికంగా యువతే ఎందు కుంటున్నారు? నా పరిశీలనలో తేలిందేమంటే, ఇతరచోట్ల... ప్రత్యేకించి విశాల ప్రజానీకంలో చర్చించడానికి సాధ్యపడని అంశాలకు ఇలాంటి సమూహాల్లో చోటుండటమే అందుకు కారణం. కనుకనే చాలా సాహితీ ఉత్సవాల్లో పుస్తకాల గురించి, రచయితల గురించి కాక సమకాలీన ఘటనలపైనా, మారుతున్న సమాజ స్వభావంపైనా చర్చించడమే ఎక్కువ కనబడుతుంది. ఈ వారం నేను నకిలీ వార్తల (ఫేక్ న్యూస్)పై జరిగిన బృంద చర్చలో పాల్గొన్నాను. ఈ నకిలీవార్తలను మనం రెండు రకాలుగా చెప్పుకోవచ్చు. ఒకటి– అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ దాన్ని అర్ధం చేసుకున్న తీరులో. ఆయనకు న్యూయార్క్ టైమ్స్, వాషింగ్టన్ పోస్ట్, సీఎన్‌ఎన్‌లు ఆ కోవలో కనిపిస్తాయి. మిగిలిన ప్రపంచం, ప్రత్యేకించి పాత్రికేయ లోకం ఈ పత్రికలనూ, చానెళ్లనూ ప్రశంసించ దగ్గవిగా, సాధికారమైనవిగా భావిస్తాయి. తనను విమర్శిస్తాయి గనుక ట్రంప్ దృష్టిలో ఇవి నకిలీవార్తలను తయారుచేసేవే. ఈ ఫేక్‌న్యూస్‌ను మనం మరో రకంగా చెప్పొచ్చు. తప్పుడు వార్తగా, వండివార్చిన వార్తగా తెలిసినా దాన్ని దురు ద్దేశంతో ప్రత్యేకించి సామాజిక మాధ్యమాల ద్వారా ప్రచారంలో పెట్టే వార్తల్ని నకిలీ వార్తలని అనొచ్చు. ప్రపంచంలో ఒక మూల జరిగిన హింసాత్మక ఘటన తాలూకు ఫొటోను మరొకచోట జరిగినట్టుగా చూపే ప్రయత్నం చేయడాన్ని ఇందుకు ఉదాహరణగా తీసుకోవచ్చు. అలాగే ఒక పరి స్థితిని లేదా ఒకరి వ్యక్తి త్వాన్ని వివరించే పేరిట అవాస్తవాలను ‘నిజాలు’గా ప్రచారం చేయడం కూడా ఈ కోవకిందికే వస్తుంది. వాట్సాప్ ద్వారా ఇలాంటి సరుకు అందరికీ వస్తూనే ఉంటుంది కనుక ఇంతకుమించి దీని లోతుల్లోకి వెళ్లను. ఫేక్‌న్యూస్ చర్చలో పాల్గొన్న బృందంలో నాతోపాటు అహ్మదాబాద్‌కు చెందిన ప్రతీక్ సిన్హా కూడా ఉన్నారు. ఆయన ఆల్ట్‌న్యూస్ డాట్ ఇన్(altnews.in) అనే వెబ్‌సైట్‌ను నడుపుతున్నారు. జనబాహుళ్యంలో ప్రచారంలో ఉన్నవాటిని ఎప్పటికప్పుడు పరిశీలించి అవి తప్పుడు వార్తలో, నిజమైనవో తేల్చడం ఆయన పని. దేశ పౌరులను తప్పుడు వార్తలతో, నిర్ధారణ కాని వార్తలతో చీల్చడానికి ప్రయత్నించేవారిని బట్టబయలు చేయడంలో ఆ వెబ్సైట్ ప్రశంసనీయమైన పాత్ర పోషిస్తోంది. గత మే నెలలో పిల్లల కిడ్నాపర్ల గురించి ప్రచారంలోకొచ్చిన ఒక తప్పుడు వార్త పర్యవసానంగా జార్ఖండ్‌లో ఏడుగురిని ప్రజలు కొట్టిచంపారు. ప్రతీక్సిన్హా కొన్ని ఆసక్తికరమైన విషయాలు చెప్పారు. మన దేశంలో డేటా విని యోగం గత కొన్ని సంవత్సరాల్లో అయిదు రెట్లు మించి పెరిగింది. ప్రజల్లో అనేకులు స్మార్ట్ఫోన్ల వైపు మొగ్గడం, వాట్సాప్‌లో వచ్చే అంశాలను అందరికీ పంపే ధోరణి పెరగడం ఇందుకు రుజువు. మాధ్యమం విస్తృతి పెరిగి అది ఎన్నో రకాలుగా రూపాంతరం చెందడం వల్ల చిన్న స్థాయి సంస్థలు, వ్యక్తులు కూడా ప్రచురణకర్తలుగా మారారు. ఇలాంటి పరిస్థితుల్లో దేన్నయినా ధ్రువీకరించగలిగే వర్గాల సంఖ్య కూడా పెరగాలి. అయితే మనకున్న పెద్ద సమస్య తప్పుడు వార్తలు కాదు... నిజమైన వార్తలపై ఆసక్తి కొరవడటమేనని నాకనిపిస్తుంది. ఉదాహరణకు మన దేశం ఆరోగ్య రంగానికి కేటాయించే మొత్తానికి పదిరెట్లు ఎక్కువగా రక్షణపై వ్యయం చేస్తుంది (ఆరోగ్యానికి చేసే ఖర్చు రూ. 40,000 కోట్లయితే... రక్షణ వ్యయం రూ. 4లక్షల కోట్లు). ఇది ఇటీవలి సంగతి కాదు. మనమెప్పుడూ ఆసు పత్రులు, వైద్యులు, మందుల కంటే శతఘ్నులు, విమానాలు, నౌకలు కొనడానికి ఎక్కువ ఖర్చుపెడుతుంటాం. అన్ని ప్రభుత్వాలూ ఇలాగే చేస్తాయి. ఏ పార్టీ కూడా దీన్ని వ్యతిరేకించదు. ఈశాన్య భారతంలో ఆంతరంగిక భద్రత కోసం సైన్యాన్ని ఉపయోగించడం ప్రారంభించి ఈ ఏడాదితో అరవైయ్యేళ్లవుతుంది. ఇంత సుదీర్ఘకాలం దేశ పౌరులు సైనిక పాలనలో ఎందుకుండాలని మనం ప్రశ్నించలేమా? పదాల గారడీని పక్కన బెట్టి మాట్లాడుకోవాలంటే సాయుధ బలగాల ప్రత్యేకాధికారాల చట్టం కింద బల వంతంగా ఒక జనాభా మొత్తాన్ని ఉంచడం సైనిక పాలన అనే అనాలి. కానీ దీనిపై మన రాజకీయ పార్టీలకు లేదా దేశంలోని ఇతర ప్రాంతాలకు చెందిన పౌరులకు ఆసక్తే ఉండదు. నేను చెప్పబోయే మూడో ఉదాహరణ ఇటీవలికాలానిదే. మన పాలక పార్టీ జాతీయవాదానికి తాను కట్టుబడి ఉన్నానని చెప్పుకుంటుంది. కానీ ఆచరణలో రాజకీయ వివక్షను పాటిస్తుంది. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ముస్లిం ఎమ్మెల్యేల సంఖ్యను ఒకసారి చూద్దాం: గుజరాత్–సున్నా, ఉత్తరప్రదేశ్–సున్నా, మహారాష్ట్ర–సున్నా, మధ్యప్రదేశ్–సున్నా, చత్తీస్‌గఢ్–సున్నా, జార్ఖండ్–సున్నా. ఇతరచోట్ల నామమాత్రం. మత ప్రాతిపదికన భారతీయుల్ని విడగొట్టడం మన కళ్లముందే జరుగుతోంది. మరి ఎందుకని అందరూ దాన్ని ఉపేక్షిస్తారు? ఎందుకని చర్చించరు? ఎందుకంటే అసమ్మతి స్వరాలు వినబడవు గనుక. అవి కేవలం సాహితీ ఉత్సవాల వంటి చోటే లేవనెత్తుతారు గనుక. ట్రంప్‌కూ, పాశ్చాత్య ప్రపం చానికీ నకిలీ వార్తల బెడద అంత ముఖ్యమూ కాదు. వాటికి పర్యవసానాలూ ఉండవు. కానీ భారత్‌లో అలాంటి వార్తలు ప్రాణాలు తీసే పరిస్థితులు కూడా ఉన్నాయి. అయితే నకిలీ వార్తల బెడద ఇక్కడ ఉన్నా లేకున్నా మన సమస్యలు ఎప్పటికీ ఇలాగే ఉంటాయని మాత్రం మనం అంగీకరించితీరాలి. - ఆకార్ పటేల్ వ్యాసకర్త కాలమిస్టు, రచయిత ‘ aakar.patel@icloud.com -
సంస్కరణల చుట్టూ మోదీ చక్కర్లు
♦ అవలోకనం చెత్త పారేయడం అనేది వికారమైనది, చికాకు పరిచేది. అయితే ప్రజారోగ్య సమస్య వలే ఇది జాతీయ సమస్యేమీ కాదు. ప్రజారోగ్య లోపంతో మన పిల్లల్లో 38 శాతంమందికి రెండేళ్ల వయసులోనే ఎదుగుదల ఆగిపోతోంది. కానీ మోదీ దృష్టి, ఆయనిచ్చిన సందేశం పూర్తిగా చెత్త వేయడం వల్ల కలిగే అనర్ధాలపైనే కేంద్రీకరించి ఉంది. దేశ పౌరుల వ్యక్తిత్వంలో మార్పు తీసుకురావాలన్నదే ఆయన ఉద్దేశం. అందుకు ప్రవర్తనాపరమైన మార్పు...అంతర్గతమైన పరివర్తన అవసరమన్నది ఆయన భావన. ‘మీరు విప్లవ నాయకుడు. భారతదేశంలో విప్లవాత్మక మార్పు తెస్తున్నారు. ఈ మహత్తరమైన దేశాన్ని భవిష్యత్కాలానికి తీసుకెళ్తున్నారు’. ఈ వారం మన దేశా నికొచ్చిన ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు మన ప్రధాని నరేంద్ర మోదీని ఉద్దేశించి మాట్లాడిన మాటలివి. ఆయన మాటల్లోని అంతరార్ధం ఏమై ఉంటుంది? నా దగ్గరున్న నిఘంటువు ‘ఒక సంపూర్ణమైన, ఆకస్మికమైన పరివర్తన ఇమిడి ఉండేదానినే’ విప్లవంగా చెబుతోంది. సుస్థాపితమైన వ్యవస్థకు, ప్రత్యేకించి ఒక రాజ్యానికి వ్యతిరేకంగా తిరుగుబాటువంటి చర్యను ఈ విప్లవ నాయకులు కోరుకుంటారు. భారత రాజ్యాన్ని నెతన్యాహు ‘మహత్తరమైనద’ంటున్నారు గనుక (ఆయన ఎందుకలా అనుకుంటున్నారన్నది నాకు ఆసక్తికరం) మోదీ ఆ వ్యవస్థను «కూలదోస్తున్నారని నెతన్యాహు అనుకోవడం లేదని మనం అర్ధం చేసుకోవచ్చు. మరి ఆయన చెప్పదల్చుకున్నదేమిటి? ఆ సంగతి నిజంగా తెలియదు, ఊహించే ప్రయత్నం కూడా చేయను. ప్రశంసలకు సులభంగా పడిపోయే ఒక కొనుగోలు దారుకు ఆయుధాలు అమ్మేందుకు నెతన్యాహు వచ్చారనే వాస్తవాన్ని కాసేపు పక్కన పెడదాం. ఒక రకంగా వ్యవస్థలో విప్లవాత్మక మార్పును మోదీ తీసుకు రాదల్చుకున్నారన్నది వాస్తవం. ఏమిటా మార్పు? నేను దీన్ని సంస్కరణ అంటాను... అలాగని దాన్ని వాడుకలో ఉన్న అర్ధంతో నేను ఉపయోగించడం లేదు. ఉదాహరణకు మోదీ పథకాల్లో ఒకటైన స్వచ్ఛభారత్ అభియాన్ తీసు కుందాం. అది ఎంత ఆర్భాటంగా ప్రారంభమైందో అందరికీ గుర్తుండే ఉంటుంది. మోదీ స్వయంగా చీపురు పట్టుకుని రోడ్డును పరిశుభ్రపరిచారు. ఇతరుల్ని కూడా అలా చేయమని ప్రోత్సహించారు. వాటిపై ట్వీట్లు చేశారు. స్వచ్ఛ భారత్ పర మార్ధమేమిటో, అది ఏ ప్రయోజనాన్ని ఆశిస్తున్నదో ఆయన వెబ్సైట్ వివరిం చింది. ‘2019లో జరగబోయే మహాత్మా గాంధీ 150వ జయంతికి మనం అర్పించ గల అత్యుత్తమ నివాళి స్వచ్ఛ భారత్... మహాత్మా గాంధీ కలలుగన్న స్వచ్ఛమైన, ఆరోగ్యకరమైన భారతదేశాన్ని సాకారం చేయడానికి ముందుకు రావాలని ప్రజ లకు ప్రధాని ఉద్బోధించారు. మందిర్ మార్గ్ పోలీస్‌స్టేషన్ వద్ద నరేంద్ర మోదీయే స్వయంగా ఈ కార్యక్రమానికి అంకురార్పణ చేశారు. చెత్తను ఊడ్చడానికి చీపురు పట్టుకుని ఈ దేశవ్యాప్త ప్రజా ఉద్యమాన్ని ప్రారంభించారు. చెత్తాచెదారాన్ని వేయొద్దు, ఎవరినీ వేయనీయొద్దు అని ఆయన పిలుపునిచ్చారు. ‘చెత్తవేయను, ఎవరినీ వేయనీయను’ అనే మంత్రోపదేశం చేశారు’ అని ఆ వెబ్సైట్ చెబుతోంది. పీఠికలో ఆయన పరిశుభ్రత, స్వచ్ఛత, చెత్త, చెత్త పారేయడం అనే పదాలను 21 సార్లు ఉపయోగించారు. మరుగుదొడ్డి, ప్రజారోగ్య పరిరక్షణ పదాలు మాత్రం ‘భారతీయ కుటుంబాల్లో దాదాపు సగభాగం ఎదుర్కొంటున్న ఆరోగ్య సమస్య లకు కారణం వారి ఇళ్లలో మరుగుదొడ్లు లేకపోవడమే...’ అని చెప్పిన సందర్భంలో ఒక్కసారి వచ్చాయి. తొలుత నిర్ణయించుకున్న కార్యక్రమాలకు కొన సాగింపుగా దీన్ని చేర్చాలని తర్వాత అనుకోవడం వల్లే ఇలా జరిగి ఉండొచ్చు. చెత్త పారేయడం అనేది వికారమైనది, చికాకు పరిచేది. ప్రజారోగ్య పరిరక్షణ వలే ఇది జాతీయ సమస్యేమీ కాదు. ప్రజారోగ్య లోపంవల్ల మన పిల్లల్లో 38 శాతం మందికి రెండేళ్ల వయసులోనే ఎదుగుదల ఆగిపోతోంది. కానీ మోదీ దృష్టి, ఆయని చ్చిన సందేశం పూర్తిగా చెత్తపైనే కేంద్రీకరించి ఉంది. దేశ పౌరుల వ్యక్తిత్వంలో మార్పు తీసుకురావాలన్నదే ఆయన ఉద్దేశం. అందుకు ప్రవర్తనాపరమైన మార్పు.. అంతర్గతమైన పరివర్తన అవసరమన్నది ఆయన భావన. ఇది ఆధ్యాత్మికవేత్తలు, మత నాయకులు చెప్పే సంస్కారం లాంటిది. ఇది అందరికీ తెలిసిన రాజకీయా లకు సంబంధించింది కాదు. పెద్ద నోట్ల రద్దు వంటి విపరీత నిర్ణయాలకు స్ఫూర్తి ఇలాంటి సంఘ సంస్కరణ కోణం నుంచే ఎవరైనా చూడాల్సి ఉంటుంది. భారతీ యులను నల్లడబ్బుకు దూరం చేసితీరాలి. ఇది చేయాలంటే బలవంతంగానైనా వారి ప్రవర్తనను మార్చడం, వారి దగ్గరున్న డబ్బు గుంజుకోవడమే మార్గం. ఇది అంతిమంగా ప్రభావశీలమైనదైనా, కాకపోయినా... ఇది లక్షలాదిమందిపై వ్యతి రేక ప్రభావం చూపినా, చూపకపోయినా... ఈ కఠినమైన విధానంవల్ల జనం ప్రాణాలు పోగొట్టుకునే పరిస్థితి ఏర్పడినా–వాటన్నిటినీ ఆ తర్వాత నిపుణులు చర్చించుకుంటారు. ఆయన చేసి తీరాలనుకున్నారు. తాను సరైనదని అనుకున్నదా నిని ప్రజలతో బలవంతంగా చేయించారు. జనాదరణ ఉన్న మోదీ లాంటి నేత అమలుచేసిన సంస్కరణ ఇది. బాలీవుడ్ దర్శకుడు మాధుర్ భండార్కర్ ఈమధ్య ‘ఒక ప్రధాని సంఘ సంస్కర్తగా మారినప్పుడు’ అనే శీర్షికతో ఒక పత్రికలో వ్యాసం రాస్తూ ఇలాంటి కోణాలనే స్పృశించారు. ‘మన సమాజం ఎంత గొప్ప పరివర్తనకు లోనవుతున్నదో చెప్పడానికి అనేక ఉదాహరణలున్నాయి. యోగాను ప్రజల వద్దకు తీసుకెళ్లడం, వీఐపీ సంస్కృతిని అంతం చేయడం కోసం కార్లపై ఎర్రరంగు లైట్లను నిషేధిం చడం, దివ్యాంగులకు ప్రత్యేక పథకాలు తీసుకురావడం, వారి అవసరాల గురించి ప్రజల్లో అవగాహన ఏర్పర్చడం, గెజిటెడ్ అధికారుల నుంచి ధ్రువీకరణ పత్రాలు పొందడానికి వారి సంతకాల కోసం తిరిగే స్థితి లేకుండా చేయడం, కంపోస్టింగ్ ద్వారా సొంతంగా ఎరువు తయారుచేసుకోమని ప్రజలకు ఉద్బోధించడం– ఇలాంటి పథకాలన్నీ చిన్నవిగానే కనబడొచ్చు. కానీ అవి కలగజేసే ప్రభావం తీవ్రమైనది’ అని భండార్కర్ రాశారు. ఇవి దేశ ప్రధాని స్థాయిలోనివారు పట్టించు కోవాల్సినవా అన్న కోణంలో నేను దీన్ని చూడటం లేదు. మోదీ ఇలాంటి సామా జిక మార్పుపై ఆరాటపడుతున్నారన్నదే నా వాదన. ఏదైనా అంశం విషయంలో పొరబడి ఉండొచ్చు లేదా తొందరపాటుతో చేసి ఉండొచ్చని కొన్నిసార్లు ఆయనకు అనిపించవచ్చు. ఇవ్వాళ్టి స్వచ్ఛభారత్ వెబ్సైట్లలో మరుగుదొడ్లు, ప్రజారోగ్య పరి రక్షణ ప్రాధాన్యతా స్థానంలో ఉన్నాయి. చెత్త పారేయడం గురించి చెప్పడం చాలా స్వల్పంగా ఉంటుంది. నెతన్యాహు ప్రశంసకు మోదీ జవాబిస్తూ ‘ఫలితాల సాధన విషయంలో చాలా అసహనంతో ఉంటానని నాకు పేరొచ్చింది. మీరు కూడా అంతే’ అన్నారు. మనల్ని సంస్కరించాలన్న ఆయన ప్రయత్నాలు ఇకపై కూడా కొనసాగుతాయని మనం భావించాలి. ఆకార్ పటేల్ వ్యాసకర్త కాలమిస్టు, రచయిత aakar.patel@icloud.com -
భీకర రికార్డులు – ఘోర పరాజయాలు
స్వదేశంలో ప్రపంచ రికార్డులనే బద్దలు చేసి పడేసే మన బ్యాట్స్‌మెన్ విదేశాల్లో బౌన్సీ వికెట్ల ముందు సాగిలపడిపోతుంటారు. కారణం మనం బ్యాటింగ్ పిచ్‌లను రూపొందించుకోవడమే. మేటి బ్యాట్స్మెన్లకు నెలవుగా ఉండే భారత జట్టు మేటి బౌలర్ల విషయంలో వెనుక చూపు చూస్తుండటం తెలిసిందే. రెండో తరగతి పౌరులుగా దిగజార్చివేసినప్పటికీ, మన బౌలర్లు చక్కటి ప్రదర్శన చేసినప్పుడే మనకు విదేశీ విజయాలు లభిస్తుంటాయి. బలహీన బౌలింగ్ పరిస్థితిని మార్చాలంటే మన మౌలిక వ్యవస్థలో మార్పుతోటే ప్రారంభించాల్సి ఉంది. దక్షిణాఫ్రికాతో జరిగిన తొలి టెస్టు మ్యాచ్‌ను నేను అంత ఎక్కువగా చూడలేకపోయాను. అది ఒకందుకు మంచిదే అయింది. నేను క్రికెట్ ప్రేమికుడిలా నటిస్తుం టాను కానీ నా జాతీయవాదమే నన్ను ఆటను చూసేలా చేస్తుంటుంది. భారత్ ఓడిపోతున్నప్పుడు నేను ఆటను చూడలేను. మన జట్టు ఇప్పుడు అంత బలహీనమైన జట్టేమీ కాదు. జట్టు పని తీరుకు ఏమాత్రం తగని విధంగా జాతీయ జట్టుకు మనం పూర్తి మద్దతు ఇచ్చిన రోజులు నాకు గుర్తున్నాయి. ఇప్పుడు అలాంటి స్థితి లేదు. తొలి టెస్టు మ్యాచ్‌లో నాలుగో రోజు ఆటలో కొన్ని సందర్భాల్లో మనమే గెలి చినట్లు కనిపించిది. కానీ బౌన్సీ వికెట్ ముందు మన బ్యాట్స్‌మెన్ తలవంచారు. దక్షిణా్రíఫికాలో బౌన్సీ వికెట్ ఉండటం కొత్తేమీ కాదు. రెండో టెస్టు కూడా ప్రారంభమైనందున కొన్ని అంశాలను పరిశీలిద్దాం. అతి ముఖ్యమైన విషయం ఏమిటంటే భారత్ ఎల్లప్పుడూ బ్యాటింగ్ ప్రాతిపదిక గల జట్టుగానే ఉంటూ వచ్చింది. మన మేటి క్రికెటర్ల పేర్లు చెప్పాల్సి వస్తే, గవాస్కర్, టెండూల్కర్, కోహ్లీ లను ప్రస్తావించాలి. పాకిస్తానీయులు కూడా ఇమ్రాన్, వసీమ్, వకార్ గురించి చెప్పుకుంటారు. కానీ గొప్ప బ్యాట్స్‌మెన్‌తో పోలిస్తే గొప్ప బౌలర్లు అరుదుగానే ఉంటారు. ఆయా దేశాల జట్లకు చెందిన 11మంది ఆల్‌టైమ్ ఆటగాళ్ల జాబితాను రూపొందించడానికి ప్రయత్నించినప్పుడు ఇది స్పష్టమవుతుంది. ఉపఖండానికి పరిమితమైతే.. నేను పాక్ జట్టును ఇలా చూస్తాను: హనీఫ్ ముహమ్మద్, సయీద్ అన్వర్, జహీర్ అబ్బాస్, జావిద్ మియాందాద్, ఇంజమామ్ ఉల్ హక్, యూనిస్ ఖాన్, రషీద్ లతిఫ్, ఇమ్రాన్ ఖాన్, వసీమ్ అక్రమ్, వకార్ యూనిస్, షోయబ్ అక్తర్. ఇక భారత్ జట్టు కూర్పును నేను ఇలా చూస్తాను: గవాస్కర్, సెహ్వాగ్, కోహ్లీ, టెండూల్కర్, ద్రావిడ్, గంగూలీ, ధోనీ, కపిల్ దేవ్, కుంబ్లే, శ్రీనాథ్, జహీర్. ఈ రెండు జట్లలో మరింత సమతుల్యతతో, ఆడేందుకు కష్టమైన జట్టు ఏది? (కనీసం కాగితంమీద అయినా) మనది మాత్రం కాదు. రెండు జట్ల మధ్య తేడా ఏమిటంటే, మన బౌలింగ్ బలహీనమైనది. భారత్‌లో బ్యాట్స్‌మెన్ కంటే శ్రమించే బౌలర్లు తక్కువగా ఉంటారు. ఇక్కడ ఆట ఆడే విషయంలో రెండో అంశం కూడా ఉంది. ఎందుకంటే మనది బ్యాటింగ్ ప్రధాన జట్టు. మనం బ్యాట్స్‌మెన్‌కి అనుకూలమైన వికెట్లను, పిచ్‌ని తయారు చేస్తాము. 2009లో క్రిక్ఇన్ఫో వెబ్సైట్ కోసం రాసిన వ్యాసంలో ఎస్. రాజేష్ మన వికెట్లు క్రీడాస్ఫూర్తిని ప్రదర్శించవంటూ గణాంకాలతో సహా వివరించారు. భారత్‌లో 40 శాతం టెస్టులు డ్రాగా ముగుస్తాయి. కాగా, దక్షిణాప్రికాలో మాత్రం 7 శాతం టెస్టులు మాత్రమే డ్రాగా ముగుస్తాయి. ఆస్ట్రేలియాలో చూసినా డ్రాలు 11 శాతం మాత్రమే. భారత్‌లో భారీ స్కోర్లు అసాధారణం కాదు. దక్షిణాఫ్రికాతో తొలి టెస్టులో రెండు పక్షాలూ తమ తొలి ఇన్నింగ్స్‌లో తలొక 200 పరుగులు చేశాయి. మన గడ్డపై తొలి ఇన్నింగ్స్‌లో ఇలాంటిది ఎన్నడూ సంభవించదు. మన మైదానాల్లో బౌలర్లు ఇలాంటి ఫలితాన్ని సాధించే అవకాశమే ఉండదు. అందుకే తొలి టెస్టులో మనం ఓడిపోయిన తరహా పిచ్‌లను స్పోర్టింగ్ వికెట్లు అంటుంటారు. బౌలర్లకు కూడా ఫలితాలు చూపే అవకాశం ఇస్తాయి కాబట్టే వాటిని స్పోర్టింగ్ వికెట్లు అంటుంటారు. ఉదాహరణకు 2000–2010 మధ్య దశాబ్ద కాలంలో టెస్టులలో బౌలర్లకు చక్కగా ఉపయోగపడిన 10 మైదానాలను లెక్కించినట్లయితే, వీటిలో ఒక్కటంటే ఒక్క భారతీయ మైదానం కూడా లేదు. మరోవైపున, తొలి ఇనింగ్స్‌లో సగటున భారీ స్కోరు సాధించిన 10 మైదానాల్లో భారత్‌కి చెందినవి మూడు ఉన్నాయి: కోల్‌కతా, బెంగళూరు, మొహాలి. ఈ పరిస్థితులే భారత జాతీయ జట్టును బౌలింగ్‌లో బలహీనంగానూ, బ్యాటింగులో బలమైన జట్టుగానూ రూపొందించాయి. కానీ ఆ బ్యాటింగ్ బలం కూడా సొంత మైదానాల్లోనే ఉంటుంది. భారతీయులలో అనేకమంది స్పిన్నర్లను, మందకొడి వికెట్లను చూసేందుకు ఇష్టపడరని చెప్పగలను. కానీ నాతోపాటు చాలామందిని తొలి సెషన్ పూర్తిగా, ఆ తర్వాత కూడా బౌన్సీ వికెట్‌పై దూసుకొచ్చే బంతులను చూస్తుండటమే బాగా ఉద్వేగపరుస్తుంటుంది. మరొక అంశమేదంటే, నిజమైన ఫాస్ట్ బౌలర్ మంచి బ్యాట్స్‌మెన్‌ని ఇబ్బంది పెడుతుండటం. శ్రీలంక లేదా భారత్‌లో మ్యాచ్‌ను చూడటం కంటే ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికాల్లో ప్రమాదకరంగా ఉండే బౌన్సీ వికెట్‌ను చూడటం పూర్తి భిన్నంగా ఉంటుంది. బ్యాట్స్‌మెన్ గాయపడటాన్ని నేను చూడాలనుకోను ఆటలో ఉద్వేగం తీసుకొచ్చేది ఇదే. కానీ భారత్‌లో ఇలాంటిది అస్సలు కనబడదు. ఒక అంశంలో మనం నిజాయితీగా ఉందాం. భారత్‌లో టెస్టు క్రికెట్ చూడటం విసుగ్గానూ, చాలావరకు చూడటానికి అననుకూలంగానూ ఉంటుంది. ఈ పరిస్థితిని మార్చాలంటే మన మౌలిక వ్యవస్థలో మార్పుతోటే ప్రారంభించాలి. బీసీసీఐ ప్రపంచంలోనే అతి సంపన్నమైన సంస్థ అయినప్పటికీ దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా, ఇంగ్లండ్‌తో పోలిస్తే మన స్టేడియంలు పరమ చికాకును కలి గిస్తాయి. ఢిల్లీలోని ఫిరోజ్ షా కోట్లా గ్రౌండ్ అయితే ప్రపంచంలో అత్యంత భయంకరమైన స్టేడియం. ఇది పూర్తిగా సిమెంట్ దూలాలతో ఉండటమే కాకుండా ప్రతి చోటా ప్రకటనలే కనిపిస్తుంటాయి. మనకు ఎలాంటి క్రికెట్ కావాలో వికెట్లే నిర్ణయిస్తుంటాయి. మనం మీడియం పేస్ బౌలర్లు లేక స్పిన్నర్లను కోరుకుంటున్నామా లేక ఊపిరిని బిగబట్టేలా చేసే ఫాస్ట్ బౌలర్లను కోరుకుంటున్నామా లేక వాంఖడే, ఈడెన్ గార్డెన్స్‌లో రికార్డులను భీకరంగా బద్దలు చేస్తూనే, దక్షిణాఫ్రికా బౌలింగ్‌లో కొన్ని ఓవర్లను కూడా తట్టుకోలేని బ్యాట్స్‌మెన్‌ను కోరుకుంటున్నామా? మొదటే చెప్పినట్లుగా, నేను భారత క్రికెట్ జట్టు ప్రేమికుడినే కాని క్రికెట్ ఆట ప్రేమికుడిని కాదు కాబట్టే నేను క్రికెట్ ఆటను చూస్తుంటానని నా అనుమానం. ఏదేమైనా ఇప్పుడు జరుగుతున్న రెండో టెస్టును, అలాగే సిరీస్‌ను కూడా మనం గెలుచుకుంటామని ఆశిస్తాను. కానీ అలా గెలిచినప్పటికీ, అదెలా సాధ్యపడుతుం దంటే, రెండో తరగతి పౌరులుగా దిగజార్చివేసినప్పటికీ, మన బౌలర్లు చక్కగా ఆడినందుకే అయి ఉంటుంది. వ్యాసకర్త కాలమిస్టు, రచయిత ఆకార్ పటేల్ aakar.patel@icloud.com -
ఒబామా మాటలు – ముత్యాల మూటలు
అవలోకనం ఆన్లైన్లో కనబడే స్థాయి కశ్మలం, రోత మన నిత్య జీవితాల్లో ఎక్కడా కనబడవన్నది నిజం. రాజకీయాలు, మతం వగైరాలపై ముఖాముఖీ కలుసుకున్నప్పుడు వాదించుకుంటే ఇంత చేటు దూషణలు, అవమానకరంగా మాట్లాడటం ఉండనే ఉండదు. ఇంటర్నెట్ మనల్ని గోప్యంగా ఉంచుతుందన్న భావనే ఇష్టానుసారం ఏమైనా మాట్లాడవచ్చునన్న ఆత్మ విశ్వాసాన్ని మనలో ఏర్పరుస్తుంది. వ్యక్తిగతంగా మనమంతా సమ్యక్ దృష్టితో మెలగుతాం. ఎవరో మనల్ని గమనిస్తున్నారన్న భావన వల్లే ఇలా ఉండగలుగుతాం. మన మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మాదిరే అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా కూడా ప్రపంచం గుర్తించి గౌరవించే మేధావి. వీరిద్దరూ విఫల నేతలేనని కొందరనుకుంటారు. అందుకు ఒక కారణం ఉంది. మన్మోహన్ వలే జనాకర్షణ శక్తిగానీ, సొంతబలంగానీ లేకపోవడం... ఒబామాలా జాతిపరంగా మైనారిటీ నేతలన్న భావం వీరిపట్ల ఉండటం ఆ కారణమని నేననుకుంటాను. అయితే ఈ నాయకులిద్దరూ ఇతర నేతల్లా తరచు మాట్లాడకపోవచ్చుగానీ చాలా తెలివైన వారు. వారు మాట్లాడినప్పుడు వినడం అనివార్యంగా మనకు ప్రయోజనకరమవు తుంది. కొన్ని రోజులక్రితం బ్రిటన్ యువరాజు ప్రిన్స్ హ్యారీకి ఒబామా అద్భుత మైన ఇంటర్వ్యూ ఇచ్చారు. అందులో ఆయన సామాజిక మాధ్యమాల గురించి, ఆధునిక ప్రపంచంపై దాని ప్రభావం గురించి ఎంతో చక్కగా మాట్లాడారు. ఉమ్మడి ప్రయోజనాలుండే వారందరూ ఒకరి గురించి ఒకరు తెలుసుకోవడానికీ, సంబంధబాంధవ్యాలు నెలకొల్పుకోవడానికీ ఈ మాధ్యమాలు నిజంగా శక్తివం తమైన ఉపకరణాలన్న సంగతిని ఆయన అంగీకరించారు. ‘అయితే ఇలాంటి వారంతా ఏ పబ్‌లోనో, ప్రార్థనాలయం వద్దనో, మరెక్కడైనా కలుసుకోవాలి. ఒకరి గురించి మరొకరు తెలుసుకోవాలి’ అని ఆయన అభిప్రాయపడ్డారు. ఇందుకు గల కారణం కూడా చెప్పారు. ‘ఇంటర్నెట్లో ఏర్పడ్డ సంబంధాల్లో అంతా సూక్ష్మంగా, సాధారణంగా కనిపిస్తుంది. కానీ ముఖాముఖీ కలిసినప్పుడు మాత్రమే అవ తలివారెంత సంక్లిష్టమైనవారో అర్ధమవుతుంది’ అని ఆయన వివరించారు. ‘ఇంటర్నెట్తో ఉన్న మరో ప్రమాదమేమంటే తమకు దానిద్వారా పరిచయమయ్యే వారిలో వేరే రకమైన వాస్తవాలు దాగి ఉండొచ్చు. పర్యవసానంగా వారు తమ కుండే దురభిప్రాయాలను బలపర్చుకునే సమాచారంలోనే కూరుకుపోతారు’ అని కూడా ఒబామా అభిప్రాయపడ్డారు. మనం ఇంటర్నెట్ ఉపయోగించే తీరుకు సంబంధించి ఆయనొక ముఖ్యమైన, అవసరమైన విషయాన్ని పట్టుకున్నారని నాకనిపిస్తుంది. వ్యక్తిగతంగా నేను ఏ సామాజిక మాధ్యమాల్లో లేను. ఎందుకంటే అవి మన ఏకాగ్రతను భంగపరుస్తాయి. నా ఆన్లైన్ వ్యాసాలపై వచ్చే వ్యాఖ్యలను గమనించినప్పుడు నా మనసెంతో వ్యాకులపడుతుంది. ఆ వ్యాఖ్యల్లో కనబడే ఆగ్ర హమూ, దుర్మార్గమూ, మితిమీరిన భాష గమనిస్తే ఎవరినైనా దూరం పెట్టక తప్ప దనిపిస్తుంది. ఆన్లైన్లో కనబడే స్థాయి కశ్మలం, రోత మన నిత్య జీవితాల్లో ఎక్కడా కన బడవన్నది నిజం. రాజకీయాలు, మతం వగైరాలపై ముఖాముఖీ కలుసు కున్నప్పుడు వాదించుకుంటే ఇంత చేటు దూషణలు, అవమానకరంగా మాట్లా డటం ఉండనే ఉండదు. ఇంటర్నెట్ మనల్ని గోప్యంగా ఉంచుతుందన్న భావనే ఇష్టానుసారం ఏమైనా మాట్లాడవచ్చునన్న ఆత్మ విశ్వాసాన్ని మనలో ఏర్పరు స్తుంది. వ్యక్తిగతంగా మనమంతా సమ్యక్ దృష్టితో మెలగుతాం. ఎవరో మనల్ని గమనిస్తున్నారన్న భావన వల్లే ఇలా ఉండగలుగుతాం. ఒబామా చెప్పిన మరో ముఖ్యాంశమేమంటే మనం ప్రత్యేకించి ఎంపిక చేసుకుంటే తప్ప లేదా కోరుకుంటే తప్ప అతడు/ఆమె వైఖరేమిటో మనకు తెలిసే అవకాశం లేదు. నిజజీవితంలో ఎవరితోనైనా మనం వ్యవహరిస్తున్నప్పుడు వారు చెప్పేది కూడా మనం విని తీర వలసి వస్తుంది. అది మన నిశ్చయాన్ని, మన ప్రతికూల అభిప్రాయాలను పల్చ బారుస్తుంది. ఒబామా మనకిచ్చిన లోచూపు నుంచి మనం కొన్నిటిని గ్రహిం చవచ్చు. అందులో మొదటిది–తమ పని ద్వారా మార్పునాశించే క్రియాశీలవా దులు, రాజకీయ నాయకులు ఇంటర్నెట్ ద్వారా కాక నేరుగా ప్రజలను కలుసు కోవాలి. వారితో సంబంధాలు నెలకొల్పుకోవాలి. నేను పనిచేసే చోటుకు కొన్ని వారాల క్రితం దళిత నాయకుడు జిగ్నేశ్ మేవానీ వచ్చారు. ఆయన తన దృక్కో ణాన్ని, ఆశలను వివరించారు. ఎన్నికల రాజకీయాల గురించి మాట్లాడినప్పుడు అది తన స్వల్ప కాల లక్ష్యమేమీ కాదని, పదిపదిహేనేళ్లుగా అందులో విజయం కోసం ఎదురుచూస్తున్నానని చెప్పారు. రెండు ప్రధాన పార్టీలు మాత్రమే బలంగా ఉండే గుజరాత్‌లాంటి రాష్ట్రంలో స్వతంత్ర అభ్యర్థిగా సులభంగా నెగ్గుతానని ఆయన ఎప్పుడూ అనుకుని ఉండరు. పైగా ఆయనకు బాగా ప్రాచుర్యంలో ఉన్న ఎన్నికల గుర్తు లేదు. కేవలం తన సొంత విశ్వసనీయతే ఆధారం. మరి ఇదెలా సాధ్యమైంది? తెలివిగా మాట్లాడటం, ఒప్పించే గుణం ఉండే ప్రసంగాలు చేయ డం... వేలాదిమందిని వ్యక్తిగతంగా కలవడం వల్లే మేవానీ గెలుపు సాధించగలి గారని నేననుకుంటున్నాను. నావంటి మానవ హక్కుల కార్యకర్త కూడా ఇదేవిధంగా జనాన్ని కలుసు కోవాలి. ఇది నేనెందుకు చెబుతున్నానంటే క్రియాశీల ప్రపంచం సామాజిక మాధ్యమాలపైనే దృష్టి పెడుతుంది. దానిద్వారా భారీ సంఖ్యలో ప్రజలకు చేరువ కావొచ్చునన్నది అందులో పనిచేసేవారి అభిప్రాయం. కానీ ఒబామా చెప్పినట్టు ఆ మాధ్యమాలు కృత్రిమంగా విభజితమై ఉంటాయి. నిరాదరణకు లోనయ్యే ముస్లింలు, దళితులు, ఆదివాసీలు లేదా కశ్మీరీ ప్రజల హక్కుల కోసం పనిచేసే వారికి మీరు సైనికుల హక్కుల గురించి మాట్లాడరేమన్న ప్రశ్న తరచుగా ఎదుర వుతుంది. ఇంటర్నెట్లో అయితే ఇలాంటి తప్పుడు ద్వంద్వాలను సులభంగా కొనసాగేలా చూడొచ్చు. ముఖాముఖీలో అవతలి వ్యక్తి ఆందోళనల్ని కొట్టిపారే యడం అంత సులభం కాదు. మనం మన చుట్టూ ఉన్న పరిస్థితుల్ని చూసి నిరాశ పడనవసరం లేదని (తరచు నాకు అలా అనిపిస్తుంటుంది) ఒబామా అంతర్దృష్టి చెబుతుంది. అంతమాత్రాన సామాజిక మాధ్యమాలు ఉత్త చెత్త అని ఒబామా అన్నారని మనం అర్ధం చేసుకోకూడదు. ‘బహుళ విధ స్వరాలను అనుమతించేలా, అదే సమయంలో సమాజంలో చీలికలు తీసుకు రాకుండా, ఒక ఉమ్మడి భూమికను కనుగొనేలా రూపొందడం కోసం మనం ఈ సాంకేతికతను ఎలా నియంత్రణలోకి తెచ్చుకుంటామన్నదే ప్రశ్న’ అని ఆయన చెప్పిన సంగతిని గుర్తుచేసుకోవాలి. అత్య ద్భుతమైన ఈ మాటలు మన దేశానికి ఎంతో కీలకమైన ఈ కొత్త సంవత్సరంలో గుర్తుంచుకోదగ్గవి. ఆకార్ పటేల్ వ్యాసకర్త కాలమిస్టు, రచయిత aakar.patel@icloud.com -
ఆర్థికరంగంలో మోదీ విఫలుడు
అవలోకనం మనమిప్పుడు 2018లోకి ప్రవేశించబోతున్నాం. ఎన్నికల ముందు సంవత్సరమిది. ఆర్థికరంగంలో మోదీ పనితీరుకు సంబంధించిన డేటా ఆయన విఫలుడని చెబుతోంది. తన పదేళ్ల పాలనాకాలంలో సాధించిన సగటు వార్షిక వృద్ధి రేటుకు సరితూగగల వృద్ధి రేటును మోదీ సాధించలేకపోయారని మాజీ ప్రధాని మన్మోహన్సింగ్ ఎత్తిచూపారు. మోదీని అభిమానించే కార్పొరేట్ రంగంలో త్రైమాసిక ఫలితాల ఆధారంగా చీఫ్ ఎగ్జిక్యూటివ్ పనితీరును నిర్ణయిస్తారు. ఆ ప్రమాణాల ప్రకారమైతే కార్పొరేట్ రంగం మోదీని విఫలుడిగా నిర్ధారిస్తుంది. ప్రధాని నరేంద్ర మోదీ మన కాలపు ప్రతిభావంతుడైన రాజకీయవేత్త. జనా మోదం పొందే నేతల్లో సుప్రసిద్ధులైనవారి పేర్లు చెప్పడం అంత సులభం కాదు. రష్యాలో పుతిన్, టర్కీలో ఎర్డోగాన్ ఈ కోవలోకి వస్తారనిపిస్తుంది. అయితే ఆ దేశాల్లోని రాజకీయాలపై నాకు లోతైన అవగాహన లేదు. కానీ వారికి లభిస్తున్న మద్దతు మోదీకుండే మద్దతుకు దగ్గరగా అనిపిస్తుంది. ఈ ముగ్గురూ వారి వారి పార్టీలకు మించి ప్రజాదరణ ఉన్నవారు. ఆ పార్టీలకున్న సంప్రదాయ పునాదిని మించి ఆ ప్రజాదరణ విస్తరించడమే ఇందుకు కారణం. ఎప్పుడు సర్వే చేసినా మోదీ రేటింగ్ 70 శాతానికి మించి ఉంటుంది. ఆ సర్వేలు అంత ఖచ్చితమైనవి కాదని, అందులో అశాస్త్రీయత పాలు ఎక్కువని నేను గుర్తించాను. అయినప్పటికీ ఆయన నిలకడగా దీన్ని సాధించగలగడం విశేషమని చెప్పుకోవాలి. ఎందుకంటే ఆయన పార్టీ జాతీయ స్థాయిలో ఇంతవరకూ గరిష్టంగా సాధించిన ఓట్ల శాతం 31 శాతం మాత్రమే. అది కూడా 2014లో. నేను మాట్లాడినవారిలో చాలామంది ఈ విషయంలో నాతో ఏకీభవించారు. మోదీ గురించే తీసుకుంటే ఆయన పట్ల, ఆయన రాజకీయాలపట్ల ఆకర్షితు లవుతున్న వర్గాలవారెవరో గ్రహించగలం. అగ్రకులాలు, మధ్యతరగతి, పట్టణ ప్రాంత ఓటర్లలో ఆయనకున్న పునాది అతి ముఖ్యమైనది. మొన్నటి గుజరాత్ ఎన్నికల్లో నగర ప్రాంతాల్లో కనబడ్డ బీజేపీ ప్రభంజనం ఈ విశ్లేషణను ధ్రువీ కరిస్తుంది. గ్రామసీమల్లో, ఓ మాదిరి గ్రామీణ ప్రాంతాల్లో పార్టీ విధానాలు విఫలమైనా నగరాల్లోని ఈ పునాదే బీజేపీ వెనకా, వ్యక్తిగతంగా మోదీ వెనకా దృఢంగా నిలబడింది. ఈ మద్దతుకు గల కారణాలు అనేకం. ఈ దేశం దుర్బలంగా ఉన్నదని, సమూలమైన చర్యల ద్వారా మాత్రమే ఇది సరి అవుతుందని మధ్య తరగతి నమ్ముతోంది. గట్టి నాయకుడు అవసరమనే భావన ఈ వర్గాలను ఎప్పుడూ ఆకర్షిస్తుంది. యాభైయ్యేళ్లవాడిగా మూడు దశాబ్దాలుగా ఇదే జరుగు తోందని నేను చెప్పగలను. ఈ దృక్పథం ఉన్న పరిస్థితిని సూక్ష్మీకరించడం, తగ్గించి చెప్పడం కావొచ్చు. ఆరెస్సెస్ రిజర్వేషన్ల వ్యతిరేక వైఖరి, సంస్కృతికి సంబంధించి దానికున్న బ్రాహ్మణీయ వైఖరి, ఈ వర్గాలు తమ చుట్టూ ఉండే ప్రపంచాన్ని చూసే తీరుకు సరిపోతాయి. ఈ వర్గాల్లో నిలువెల్లా ఉండే శక్తివంతమైన జాతీయవాదానికి బీజేపీ సరిగ్గా అతుకుతుంది(విదేశాల్లో మోదీ పాల్గొనే సభల్లో కనబడే ప్రవాస భారతీయులంతా ఈ వర్గాలవారే). పాకిస్తాన్, చైనాలకు సంబంధించిన అంశాల్లో వారి మానసిక ధోరణి వేరేగా ఉంటుంది. ఆర్థికంగా ఈ వర్గాలవారు మంచి జీడీపీ వృద్ధిపైనా, దానివల్ల సమకూరే ఉన్నతోద్యోగాలు, ఆధునిక మౌలిక వసతుల్లో వచ్చే పెట్టుబడులుపైనా (ఉదా:గ్రామీణ ప్రాంత రోడ్ల మెరుగుదలకు బదులు బుల్లెట్ రైళ్లు, ప్రజా రవాణా వ్యవస్థ పటిష్టానికి బదులు విమానాశ్రయాల విస్త రణపై దృష్టిపెట్టే విధానాలు) ఆధారపడతారు. మైనారిటీల హక్కుల విషయాన్ని సాధారణీకరించి చెప్పడం సులభం కాదు. దక్షిణాసియా ప్రజల్లో మైనారిటీలపై అయిష్టత ఉండటమన్నది నిజమే కావొచ్చుగానీ ఇక్కడి బీజేపీ అనుకూల దృక్పథం ఉన్నవారికి ఆ మైనారిటీ వర్గాలకు భారత్ పట్ల ఉండే వైఖరితో సమస్య ఉంది. లౌకికవాదానికి సంబంధించిన స్వచ్ఛ భావన వీరికి ఎంతమాత్రమూ నచ్చదు. భారతీయుల్లో చాలామంది సెక్యులరిజానికి ఓటేయలేదు. మధ్యతరగతి కనుక వీరిలో చాలామంది నెలవారీ జీతాలపై ఆధారపడతారు. ‘ప్రతిభ’ సమృద్ధిగా ఉండే వీరికి వంశ పారంపర్యతపై ఆధారపడిన రాహుల్‌కన్నా స్వశక్తితో ఎదిగిన మోదీ నచ్చుతారు. మోదీ మద్దతుదార్లలో ఉండే రెండో కేటగిరి వ్యక్తులు బీజేపీకి కూడా మద్దతుదార్లు. ఎందుకంటే వారు కర్ణాటకలో లింగాయత్‌లు, గుజరాత్లో పాటీదార్లు, రాజస్థాన్‌లో రాజ్పుట్ల వలే ఆధిపత్య కులానికి చెందినవారు. మూడో కేటగిరి వ్యక్తులు హిందుత్వకు ఆకర్షితులయ్యే పౌరులు. శత్రువు అంతర్గ తంగానే ఉన్నాడని, దేశం ప్రగతి సాధించాలంటే ఈ శత్రువును ఏరిపారేయాలని వీరనుకుంటారు. ఈ చివరి రెండు కేటగిరీలూ అంత ముఖ్యమైనవి కాదు. ఎందు కంటే మోదీ ఉన్నా, మరెవరున్నా... ఇప్పుడైనా, ఎప్పుడైనా వీరు బీజేపీతోనే ఉంటారు. మొదటి కేటగిరి అలా కాదు... వ్యక్తిగతంగా మోదీకి ఉండే సమ్మోహనా శక్తి, ఆయనపై ఉండే నమ్మకం మిగిలిన రెండు కేటగిరిలనుంచి వీరిని వేరు చేస్తుంది. మనమిప్పుడు 2018లోకి ప్రవేశించబోతున్నాం. ఎన్నికల ముందు సంవ త్సరమిది. ఆర్థికరంగంలో మోదీ పనితీరుకు సంబంధించిన డేటా ఆయన విఫలుడని చెబుతోంది. తన పదేళ్ల పాలనాకాలంలో సాధించిన సగటు వార్షిక వృద్ధి రేటుకు సరితూగగల వృద్ధి రేటును మోదీ ఇంతవరకూ సాధించలేక పోయారని మాజీ ప్రధాని మన్మోహన్సింగ్ ఎత్తిచూపారు. మోదీని అభిమానించే కార్పొరేట్ రంగంలో త్రైమాసిక ఫలితాల ఆధారంగా చీఫ్ ఎగ్జిక్యూటివ్ పనితీరును నిర్ణయిస్తారు. ఆ ప్రమాణాల ప్రకారమైతే కార్పొరేట్ రంగం మోదీని విఫలుడిగా నిర్ధారిస్తుంది. నా వరకూ ముఖ్యమైన అంశమేమంటే... 2009లో విత్త సంక్షోభం కారణంగా ప్రపంచ ఆర్థిక వ్యవస్థ కుంచించుకుపోయింది. అదిప్పుడు అనూ హ్యంగా 3 శాతం వృద్ధితో పెరుగుతోంది. ఈ వాతావరణంలో కూడా మన వృద్ధి సంతృప్తికరంగా లేదు. పెద్దనోట్ల రద్దు వంటి దుందుడుకు చర్యల వల్లే ఈ పరిస్థితి ఏర్పడిందంటాను. 2019 ఎన్నికల బరిలోకి దిగినప్పుడు మోదీని, బీజేపీని కూడా ఈ వైఫల్యం ప్రభావితం చేస్తుంది. ఇప్పుడు ఆర్థికంగా సాధించిందని చెప్పుకోవ డానికేమీ లేదు(‘త్వరితగతిన ఎదుగుతున్న దేశం’ అనే మాట మీరు విని ఎన్నాళ్ల యింది?). 2014 ఎన్నికలప్పుడున్న ‘అచ్ఛేదిన్’లాంటి అనుకూల ప్రచారం ఆ ఎన్నికల్లో ఉంటుందని నేననుకోను. అది గర్హనీయమైన, వేర్పాటువాద ధోరణుల తోనే ఉంటుంది. ఒక భారతీయుడిగా ఇది నన్ను కలవరపెడుతుంది. కానీ వ్యక్తిగ తంగా మోదీకి మద్దతు పలికే మొదటి కేటగిరిలోనివారు ఇలాంటి పరిస్థితుల్లో ఎలా ప్రతిస్పందిస్తారనేది ఒక రచయితగా, సామాజిక పరిశీలకుడిగా నాకు ఆసక్తిదాయ కమైనది. ఆకార్ పటేల్ వ్యాసకర్త కాలమిస్టు, రచయిత ఈమెయిల్: aakar.patel@icloud.com -
మత జాతీయవాద ఉన్మాదంపై వ్యతిరేకత
అవలోకనం ఇప్పుడు మనం తరచుగా చూడాల్సి వస్తున్న వీధుల్లోని హింస, మీడియాలోని హింస మత జాతీయవాద భౌతిక వ్యక్తీకరణలే. మనలో చాలా మంది విస్మరించలేని ఈ సమస్యకు సంబంధించి అత్యవసర స్థితిని కల్పించినది ఇదే. జాతీయవాదం పేరిట భారతీయులెవరికీ హాని జరుగని విధంగా, నిజమైన జాతీయ ప్రాధాన్యాలైన పేదరికం, ఆరోగ్యం, విద్యపై దృష్టిని కేంద్రీకరించగలిగే విధంగా ఇది ముగిసిపోవాలని మనం కోరుకుంటాం. మరే ఇతర అంశం కంటే ఇదే చాలా మంది బీజేపీ మరోసారి గుజరాత్లో గెలవకూడదని అనుకోవడానికి కారణం. గుజరాత్ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ స్పష్టమైన విజయాన్నే సాధించింది. అందుకు కారణాలేమిటా అని మనం ఊహాగానాలు సాగించవచ్చు. కానీ, ఫలితా లలో అస్పష్టతేమీ లేదు. గత 20 ఏళ్లుగా గుజరాతీ ప్రజలు మాట్లాడుతున్నదానికి అనుగుణంగానే వారు తీర్పు చెప్పారు. కాంగ్రెస్ ఓట్ల శాతం పెరిగింది. కానీ, అది దేశవ్యాప్త ధోరణి అనగలిగేంత పెద్దదో కాదో చెప్పాలంటే మరింత సమాచారం కావాలి. ఇతర రాష్ట్రాల నుంచి మరిన్ని ఫలితాలు రావాలి. ఏదిఏమైనా గుజరా త్లో బీజేపీ విజయం సాధించింది. దీన్ని స్పష్టపరచుకున్నాం కాబట్టి, ఇక కాంగ్రెస్ ఈ ఎన్నికల్లో మంచి ఫలితాలను సాధించాలని చాలా మంది ఎందుకు ఆశించారనే అంశాన్ని, లేకపోతే మరింత కచ్చితంగా చెప్పాలంటే మళ్లీ బీజేపీ గెలవకూడదని ఎందుకు కోరుకున్నారనే దాన్ని పరిశీలిద్దాం. వంశపారంపర్య రాజకీయాలను పూర్తిగా సమర్థించే వారు ఎంతో మంది నాకు కనబడలేదు. కాబట్టి బీజేపీ గెలుపు గురించి ఆందోళన చెందిన ప్రజల్లో చాలా మంది కాంగ్రెస్ సమర్థకులు కారని అను కోవచ్చు. అంటే వారు మరి దేని కోసమో మాత్రమే ఆందోళన చెందారు. అదేమిటి? బీజేపీ ఉద్దేశపూర్వకంగా ముందుకు నెట్టిన మత జాతీయవాదమే. జాతీ యవాదం ఎన్నో రకాలుగా ఉండొచ్చు. అది, దేశంలోని అన్ని మతాల, అన్ని ప్రజా విభాగాల, అన్ని ప్రాంతాల భారతీయులందరినీ కలుపుకున్న సమగ్ర జాతీయ వాదంగా ఉండొచ్చు. బీజేపీ పెంపొదింపజేయాలని అనుకుంటున్నది ఇది కాదు. ఒక నాగా లేదా మిజో తన భారతీయ గుర్తింపును సగర్వంగా అనుభూతి చెందగ లరా? బీజేపీ నిర్వచించిన విధంగా తమ భారతీయతను నొక్కి చెప్పుకోగలగా లంటే వారు భారత్ మాతాకీ జై వంటి హిందీ నినాదాల ద్వారా, గొడ్డు మాంసం తినడాన్ని మానేయడం ద్వారా మాత్రమే చేయగలుగుతారు. గొడ్డు మాంసం వేల ఏళ్లుగా వారి సాంప్రదాయక ఆహారం అయినా మానేయాలి. కేరళ లోని ఓ ముస్లిం తన భారతీయ అస్తిత్వాన్ని చాటుకోగలడా? ఓ హిందూ స్త్రీతో ప్రేమలో పడనని వాగ్దానం చేస్తేనే సాధ్యం. బీజేపీ చెప్పే జాతీయవాదం భారతీయులందరి జాతీ యవాదం కాదు. అది ఒక ప్రత్యేక రకమైన భారతీయులకే సంబంధించినది. కొన్ని రకాల భారతీయులకు అది నచ్చకపోయినా సరే అది వారి దృష్టిలో జాతీయ వాదమే. నేను ఉత్తర భారతదేశానికి చెందిన హిందువును అయినా నాకు ఇతర భారతీయులను దూరంగా ఉంచే ఆ జాతీయవాదం నాకు అక్కర్లేదు. సాధారణంగా చెప్పాలంటే నాకు అన్ని జాతీయవాదాలతోనూ పేచీ ఉంది. ఎందుకంటే వాటిని ఒక ప్రజాసమూహానికి వ్యతిరేకంగా మరో ప్రజాసమూహాన్ని సమీకరించడానికి ప్రయోగిస్తుంటారు. నాకు చీదర పుట్టించే విధంగా ఎదుటి సమూహాన్ని ఎగతాళి చేసి, దుష్టులుగా క్రూరులుగా చిత్రీకరిస్తుంటారు. సాధార ణంగా జాతీయవాదం హింసకు దారితీస్తుంటుంది. కాబట్టి దానితో చాలా జాగ్ర త్తగా వ్యవహరించాలి. అన్ని రకాల జాతీయవాదాల్లోకి మతపరమైన, జాతిపర మైన జాతీయవాదాలు ప్రత్యేకించి కంపరమెత్తించేవి. పాకిస్తాన్ ముస్లిం జాతీయ వాదం అన్నా, చైనా హాన్ జాతీయవాదమన్నా కూడా నాకు ఇష్టం లేదు. చాలా మంది భారతీయులు నాలాగే భావిస్తుంటారు. కాబట్టే వారు బీజేపీని ఆందోళనతో చూస్తుంటారు. నాలాగా మీరు మతం ప్రాతిపదికగా గల జాతీయవాదాన్ని వ్యతి రేకిస్తూ, బీఎస్పీకి ఓటు చేసేవారు కావచ్చు. లేదంటే తృణమూల్ కాంగ్రెస్ ఓటర్ లేక ఆమ్ ఆద్మీ పార్టీ మద్దతుదారు లేదా ఎన్సీపీ, టీడీపీ, పీడీపీ, జేడీయూ, సీపీఎం లేదా ఎక్కడ ఏ పార్టీకి మద్దతుదారైనా కావచ్చు. కానీ మీరే గనుక మత జాతీయవాదానికి మద్దతుదారైనట్టయితే దేశంలో ఎక్కడున్నా గానీ బీజేపీని సమ ర్థిస్తారు. దీన్ని ప్రధాన ఎజెండాగా ముందుకు నెడుతున్న పార్టీ దేశంలో ఒకే ఒక్కటి ఉంది. కాబట్టే దాని చర్యలపట్ల, మాటల పట్ల, అది మన దేశానికి కలిగిస్తున్న నష్టం పట్ల ఆందోళన చెందుతారు. కాబట్టే తమ పార్టీ అనుబంధాలు ఏవైనాగానీ గుజరాత్లో ఆ పార్టీ ప్రాబల్యం క్షీణించాలని వారు కోరుకుని ఉంటారు. మత జాతీయవాదాన్ని తొలగించినట్టయితే బీజేపీ విధానాలు ఇతర పార్టీల విధానలకంటే భిన్నమైనవేమీ కావనే అనిపిస్తుంది. ఈ పార్టీలన్నిటి ఉమ్మడి విధా నాలు మంచివని నేను చెప్పడం లేదు. వాస్తవానికి అవి మంచివి కావు కూడా. నేను పనిచేసే మానన హక్కుల సంస్థ చూస్తున్న సమస్యలు దాదాపుగా అన్నీ కాంగ్రెస్ పాలనలో సృష్టించినవే. ఉదాహరణకు, సాయుధ బలగాల ప్రత్యేక అధికారాల చట్టాన్ని (ఏఎఫ్ఎస్పీఏ) ప్రయోగించడం, ఆదివాíసీ భూములను నేరపూరితంగా ఉపయోగించడం. వీటిలో ఏవీ బీజేపీ లేదా మోదీ సృష్టించినవి కావు. బీజేపీ వీటిని తగ్గించకపోగా మరిన్నిటిని జోడిస్తోంది. దూకుడుగా అది మత జాతీయవాదాన్ని ముందుకు నెడుతుండటం వల్ల కలిగే పర్యవసానాలను మనం రోజూ వార్తల్లో చూస్తూనే ఉన్నాం. ప్రస్తుతం గోమాంసం పేరిట కొట్టి చంపేయడం వంటి హింసాత్మక ఘటనలు తరచుగా సంభవిస్తున్నాయి. అవి బీజేపీ ఉద్దేశ పూర్వకంగా సృష్టించినవని మనం చదువుతున్నాం. వారు గనుక ఇలా భారతీ యులను ప్రధానంగా మత ప్రాతిపదికపైనే చీల్చడానికి బదులుగా కులం, లింగం, ప్రాంతం ప్రాతిపదికపై చీల్చాలని చూసి ఉంటే వీటిలో చాలా ఘటనలు జరిగి ఉండేవే కావు. ఇప్పుడు మనం తరచుగా చూడాల్సి వస్తున్న వీధుల్లోని హింస, మీడియా లోని హింస (వ్యక్తులను పాకిస్తాన్ ‘దళారుల’ని పిలవడం) మత జాతీయవాదపు భౌతిక వ్యక్తీకరణలే. మనలో చాలా మంది విస్మరించలేని ఈ సమస్య గురించిన అత్యవసర స్థితిని కల్పించినది ఇదే. జాతీయవాదం పేరిట భారతీయులెవరికీ హాని జరుగని విధంగా, నిజమైన జాతీయ ప్రాధాన్యాలైన పేదరికం, ఆరోగ్యం, విద్యపై దృష్టిని కేంద్రీకరించగలిగే విధంగా ఇది ముగిసిపోవాలని మనం కోరుకుంటాం. మరే ఇతర అంశం కంటే ఇదే చాలా మంది బీజేపీ మరోసారి గుజరాత్లో గెలవ కూడదని అనుకోవడానికి కారణం. మనం ఆ విషయాన్ని అంగీకరించి, ఆ పార్టీ మద్దతుదార్లతో సంవాదాన్ని తిరిగి ప్రారంభించడానికి ప్రయత్నించాలి. తద్వారా వారు మన దృక్పథాన్ని అర్థం చేసుకునేలా చేయాలి. వ్యాసకర్త కాలమిస్టు, రచయిత aakar.patel@icloud.com ఆకార్ పటేల్ -
సెంచరీకి చేరువలో కాంగ్రెస్ వారసత్వ పరంపర!
అవలోకనం వాస్తవానికి వంశపారంపర్యత అవసరం లేని పార్టీగా రూపుదిద్దుకోవడానికి, ఆ పార్టీ సీనియర్లలో ఎవరో ఒకరు సారథ్యం స్వీకరించడానికి కాంగ్రెస్‌కు అంతకన్నా మంచి అవకాశం దొరకదు. కానీ బాబ్రీ మసీదు వివాదం... దానితోపాటు సమాజంలోకి, రాజకీయాల్లోకి వచ్చి చేరిన హింస కాంగ్రెస్‌లో అభద్రతాభావాన్ని ఏర్పరచి, దాన్ని నెహ్రూ–గాంధీ కుటుంబం చెంతకు చేర్చాయి. పార్టీ నాయకత్వాన్ని తన చేతుల్లోకి తీసుకోవాలనుకున్నప్పుడు అప్పటికి అధ్యక్షుడిగా ఉన్న సీతారాం కేసరిని ఆమె సులభంగా పక్కకు నెట్టగలిగారు. కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడిగా రాహుల్‌గాంధీ శనివారం బాధ్యతలు స్వీకరిం చారు. ఈ పీఠం ఎక్కిన కుటుంబసభ్యుల్లో ఆయన ఆరో వ్యక్తి. మొదట మోతీలాల్ నెహ్రూ, ఆ తర్వాత ఆయన కుమారుడు జవహర్లాల్ నెహ్రూ కాంగ్రెస్ అధ్యక్షు లుగా పనిచేస్తే అనంతరం వరుసగా ఇందిరాగాంధీ, రాజీవ్‌గాంధీ, సోనియా గాంధీ ఆ పదవిని చేపట్టారు. 1919లో తొలిసారి మోతీలాల్ నెహ్రూ ఆ బాధ్యతలు స్వీకరించారు. కనుక ఆ కుటుంబం కనుసన్నల్లో కాంగ్రెస్ పనిచేయడం ప్రారం భించి 2019నాటికి శతాబ్దం అవుతుంది. వీరంతా ఒకరి తర్వాత ఒకరు అవిచ్ఛి న్నంగా పార్టీని ఏలినవారు కాదు. మధ్యలో నలుగురైదుగురు వేరే నాయకులు ఆ పదవిలో ఉన్నారు. కానీ మోతీలాల్ తర్వాత ఆయన కుమారుడు అధ్యక్షుడైనప్పుడే దేశంలో కుటుంబ రాజకీయ వారసత్వం అనే భావన మొగ్గ తొడిగింది. నెహ్రూకు ముందు పార్టీ అధ్యక్ష పదవిలో ఎవరైనా ఒక్క ఏడాదే ఉండేవారు. ఆయన ప్రధాని అయ్యాక ఇది మారింది. ఇందిరాగాంధీ ప్రాధాన్యత బాగా పెరగడం మొదలయ్యాకే ఒక వ్యక్తి దాదాపు శాశ్వతంగా పార్టీ అధ్యక్ష స్థానంలో ఉండటం అనే సంప్రదాయం అంకురించింది. చెప్పాలంటే పార్టీ చరిత్రలో సోనియాగాంధీ పదవీకాల అవధే దీర్ఘమైనది. ఆమె 20 ఏళ్లు ఆ పదవిలో ఉన్నారు. ఈ రెండు దశాబ్దాలనూ పార్టీ రూపాంతరం చెందిన కాలంగా దేశ ప్రజలు గుర్తుంచుకుంటారు. కాంగ్రెస్ సుదీర్ఘకాలం హిందూ పార్టీ గానే మనుగడ సాగించిందని చెబితే యువ పాఠకులు బహుశా ఆశ్చర్యపోతారు. ఆ పార్టీ నాయకత్వ స్థానాల్లో పనిచేసిన చాలామంది కరుడుగట్టిన ఛాందసవా దులే. అలాంటివారంతా ఇప్పుడు బీజేపీలో ఉన్నారు. బెనారస్ హిందూ విశ్వ విద్యాలయం సంస్థాపకుడు పండిట్ మదన్ మోహన్ మాలవీయ కాంగ్రెస్‌వాదే. కాంగ్రెస్ హయాం మొదలైతే మైనారిటీలకు న్యాయం లభించదని మహమ్మదాలీ జిన్నా నేతృత్వంలోని ముస్లింలీగ్ భావించడం, అది చివరకు దేశ విభజనకు దారి తీయడం చరిత్ర. పార్టీని ఆ ముద్ర నుంచి బయటపడేసి, అది హిందూ వ్యతిరేకి అన్న అభిప్రాయం అందరిలో ఏర్పడటానికి సోనియాగాంధీ కారణమని అనుకుం టారుగానీ అది నిజం కాదు. ఆమె పదవీకాలంలో దేశంలో ఆసక్తికరమైన పరిణా మాలు సంభవించాయి. రాజీవ్ హత్యానంతరం సోనియా ఛత్ర ఛాయలో పనిచే యక తప్పని పార్టీ అధ్యక్షుడిగా పీవీ నరసింహారావు చివరకు ఎవరికీ అంతుబట్టని వ్యక్తిగా, మేధావిగా మిగిలిపోయారు. ఇప్పటితో పోలిస్తే ఆరోజుల్లో సోనియా ప్రైవేటు వ్యక్తి. చాలా అరుదుగా మాత్రమే కనబడేవారు, మాట్లాడేవారు. అందు వల్లే ఆమె ప్రతి కదలికనూ ఆ రోజుల్లో పత్రికలు విశ్లేషించేవి. అందువల్లే తప్పో ఒప్పో... తనకంటూ ఎలాంటి పదవి లేకుండానే ఆమె అధికార కేంద్రంగా మారా రన్న అభిప్రాయం జనంలో ఏర్పడింది. వాస్తవానికి వంశపారంపర్యత అవసరం లేని పార్టీగా రూపుదిద్దుకోవడానికి, ఆ పార్టీ సీనియర్లలో ఎవరో ఒకరు సారథ్యం స్వీకరించడానికి కాంగ్రెస్‌కు అంత కన్నా మంచి అవకాశం దొరకదు. కానీ బాబ్రీ మసీదు వివాదం... దానితోపాటు సమాజం లోకి, రాజకీయాల్లోకి వచ్చి చేరిన హింస కాంగ్రెస్‌లో అభద్రతాభావాన్ని ఏర్పరచి, దాన్ని నెహ్రూ–గాంధీ కుటుంబం చెంతకు చేర్చాయి. పార్టీ నాయకత్వాన్ని తన చేతుల్లోకి తీసుకోవాలనుకున్నప్పుడు అప్పటికి అధ్యక్షుడిగా ఉన్న సీతారాం కేసరిని ఆమె సులభంగా పక్కకు నెట్టగలిగారు. సోనియా వస్త్రధారణ ఎప్పుడూ చీరెలే. కానీ ఆమె ఇప్పుడు దాన్నొక యూనిఫాంగా మార్చేసుకున్నారు. ఆమె కట్టూ బొట్టూలో ఉండే ప్రత్యేకతను తెలివైన జనం సులభంగానే గుర్తుపడతారు. మన రాజకీయాల్లో అలాంటి ప్రత్యేకత అరుదు. ఆమె హిందీలో మాత్రమే మాట్లాడటం మొదలు పెట్టారు. ఇంగ్లిష్ అక్షరాల్లో రాసుకున్న హిందీ ప్రసంగపాఠాలను ఆమె చదువుతుం డగా తీసిన ఫొటోలు పత్రికల్లో వచ్చినప్పుడు చాలామంది గేలిచేశారు. అనంతర కాలంలో దేవనాగర లిపిలో రాసుకున్న ప్రసంగాన్ని చదివే ఫొటోలు వచ్చాయి. ఆ తర్వాత ఆమెకు రాసుకోవాల్సిన అవసరమే లేకపోయింది. ఏ విషయంపైన అయినా సమర్థవంతంగా, ఆకర్షణీయంగా ఆమె మాట్లాడగలుగుతున్నారు. ప్రజా జీవనరంగంలో ఆమెకంటూ రెండు విశిష్టమైన సందర్భాలున్నాయి. అందులో మొదటిది–రాజ్యాంగం ప్రకారం ఆమెకు అర్హత ఉన్నా 2004లో ప్రధాని పదవి స్వీకరించడానికి విముఖత చూపడం. సోనియా విదేశీ వనిత గనుక ఆ పదవికి ఆమె అనర్హురాలని, ఆమె ప్రధాని అయితే శిరోముండనం చేయించుకుంటానని సుష్మా స్వరాజ్ హెచ్చరించారు. తన యూరోపియన్ పౌరసత్వాన్ని రద్దు చేసుకోవ డానికి సోనియా కొంత వ్యవధి తీసుకున్నారన్నది అలాంటివారి ఆరోపణ. ఇది నాకు వింతగా అనిపిస్తుంది. గ్రీన్ కార్డు కోసం వెంపర్లాడే ఈ దేశంలో దేశభక్తితో కాగి పోయి మనలో ఎందరు అమెరికా, యూరోపియన్ పౌరసత్వాలను వదులుకుంటున్నారు? నాకైతే అలాంటివారెవరూ తారసపడలేదు. కానీ ఆమె మాత్రం అందుకు భిన్నంగా ఉండి కూడా ఆ మాటలు పడాల్సివచ్చింది. కెనడా పౌరసత్వం కోసం ఈ దేశ పౌరసత్వాన్ని వదులుకున్నా అక్షయ్‌కుమార్ దేశభక్తిని ప్రేరేపిస్తూ చానెళ్లలో కనబడుతుంటారు. ఇక రెండో సందర్భం–పీవీ హయాంలో కేంద్ర ఆర్థికమంత్రిగా పనిచేసి ఆర్ధిక సంస్కరణలు ప్రవేశపెట్టిన మన్మోహన్‌ను ప్రధానిగా తీసుకురావడం. ఆయన రెండు దఫాల ప్రభుత్వాలూ ప్రజల దృష్టిలో అవినీతి చిహ్నాలుగా మిగిలి పోయాయిగానీ ఆ కాలం పరివర్తనా దశ అని గుర్తుంచుకోవాలి. సమాచార హక్కు చట్టం, మహాత్మాగాంధీ గ్రామీణ ఉపాధి కల్పన పథకం, ఇతర మానవీయ చట్టాలు ప్రభుత్వానికి ‘వామపక్ష’ లేదా ‘సామ్యవాద’ ముద్రను ఏర్పరచాయి. కానీ మన్మోహన్ చెప్పినట్టు ఆయన పదేళ్ల పదవీకాలమూ కూటమిలోనే గడిచిపోవడం వల్ల పరిమిత స్థాయిలోనే ఆయన వ్యవహరించాల్సివచ్చింది. ఫలితంగా సగటు వృద్ధి రేటు మాత్రమే నమోదైంది. ప్రస్తుత ఎన్డీఏ సర్కారు ఎంతగా ఆర్భాటం చేస్తున్నా దానితో సమం కాలేకపోతోంది. ఆమె హయాంలో జరిగిన చివరి సార్వత్రిక ఎన్నికలు కాంగ్రెస్‌కు ఘోరమైన ఫలితాలు తెచ్చిపెట్టి ఉండొచ్చు. కానీ చరిత్ర మాత్రం సోనియాను ఉన్నత వ్యక్తిత్వం కలిగిన, విజయాలు సాధించిన నేతగా సానుకూలంగానే పరిగణిస్తుంది. వ్యాసకర్త కాలమిస్టు, రచయిత aakar.patel@icloud.com ఆకార్ పటేల్ -
ప్రతికూల ప్రచారం తప్ప గత్యంతరం లేదా?
వార్తా ప్రసార మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్న అన్ని, లేదా దాదాపు అన్ని వార్తా కథనాలూ కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా మీడియా మద్దతుతో బీజేపీ ప్రచారంలో ప్రవేశపెట్టినవేనని కనబడుతూనే ఉంది. బీజేపీ సాగిస్తున్నది దూషణలు, భయాలతో కూడిన ప్రతికూల ప్రచారం. 2014లో వలే సుపరిపాలన, అచ్చేదిన్ నినాదాలతో సానుకూల ప్రచారాన్ని చే యాలన్న కోరికే దానికి లేకపోవడం నేడు కొట్టవచ్చినట్టు కనిపిస్తున్న విషయం. ఇది దురదృష్టకరం. ఉపఖండంలో రాజకీయాలు సాగే పద్ధతి కూడా ఇదే. మణిశంకర్ అయ్యర్ ఏదో అన్నంత మాత్రాన అదో సమస్యగా, గుజరాత్ ఎన్ని కల సమస్యగా మారుతుందని ఎవరు అనుకుంటారు? నేనైతే కచ్చితంగా అనుకో లేదు. గజరాతీలు తమకేమీ సంబంధంలేనిదిగా భావించే ఈ అంశం గుజరాత్ ఎన్నికల్లో చెప్పుకోదగినంత పెద్ద సమస్య అవుతుందని నేను అనుకోవడం లేదు కూడా. అయ్యర్ వాడిన అప్రతిష్టాకరమైన పదం గురించి నేను గుజరాతీ నిఘం టువును శోధించాను. ‘నీచ్’కు గుజరాతీ అనువాదం ‘దుష్ట్’. ఇంగ్లిష్ అనువాదాలు ‘వంచనాత్మక’, ‘దుష్ట’, ‘తుచ్ఛ’ అనేవి. అయ్యర్ ఆ పదాన్ని వాడి ఉండాల్సిందా? లేదు. రాజకీయ చర్చ, అసలు ఏ చర్చయినాగానీ నాగరికమైనదిగా ఉండి తీరాలి. అయితే ఇంతకూ ఆ మాటకూ, కులానికి ఏమైనా సంబంధం ఉన్నదా? లేదు. ఇక రెండవది మోదీ కులానికి సంబంధించిన సమస్య. ప్రధాని, ఘాంచి అనే బాగానే అభివృద్ధిచెందిన కులానికి చెందినవారు. వాళ్లు కిరాణా దుకాణాలు నడ పడం, నూనె తియ్యడం చేస్తారు. దుకాణాల్లో ధాన్యం (టీ కూడా) అమ్ముతారు. మోదీ అంటేనే, గాంధీలాగా పరిసర ప్రాంతంలోని కిరాణా దుకాణదారు అని అర్థం. గుజరాతీలు ఘాంచీలను వెనుకబడిన కులంగా చూడరు. 1999లో వాజ్ పేయి హయాంలోనే అది వెనుకబడిన కులంగా లేదా ఓబీసీగా మారింది. కాబట్టి గుజరాతీలలో చాలా మందికి సంబంధించి ‘నీచ్’ అంటే వెంటనే ప్రధాని కులాన్ని కించపరిచే మాటని అనిపించదు. ఈ కారణాల వల్లనే నేను దీన్ని ఉద్దేశపూర్వకంగానే పెద్దదిగా చేశారని, ప్రత్యే కించి ఎన్నికల ప్రచారంలో ప్రభావశీలమైన ఆయుధం కాగలదని భావించి అలా చేశారని అనుకుంటున్నాను. బీజేపీ విజయానికి (బీజేపీ గెలుస్తుందని నా అంచనా. గత వారం కాలమ్‌లో కూడా అదే రాశాను) నిర్దిష్టంగా దారితీసిన అంశం ఏదో, మీడియా సృష్టించిన గాలి కబుర్లు ఏవో కాలమే తేల్చాలి. సోమనాథ ఆలయం రిజిస్టర్లో రాహుల్ గాంధీ సంతకం చేయడం వ్యవ హారం కాంగ్రెస్‌కు నష్టం కలిగించే అంశం అవుతుందేమోనని అనుకున్నా. కానీ ఆ తర్వాతి వార్తలను బట్టి చూస్తే అలాంటిదేమీ జరగలేదని తేలింది. రాహుల్ తనను హిందూయేతరునిగా నమోదు చేయించుకోవాలనుకుంటే గుజరాతీలు తప్పక ఆస క్తిని చూపేవారే. కానీ ఆయన ఆ పని చేయలేదు. అయితే ఆ కథనం ఇప్పుడు గతించిన చరిత్రగా మారిపోయింది. మీడియా ఆసక్తి మరో వైపునకు మరలింది. రాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్టీ పగ్గాలు చేపట్టడాన్ని మణిశంకర్ అయ్యర్ షాజహాన్, ఔరంగజేబులు అధికారంలోకి రావడంతో పోల్చారనే అంశం ముందుకు వచ్చింది. ఆ విషయంపై వ్యాఖ్యానించిన వారిలో చాలా మంది ఆయన చెప్పినదాన్ని పూర్తిగా ఉల్లేఖించలేదనేది స్పష్టమే. అలా వ్యాఖ్యానించిన వారిలో నేనూ ఉన్నాను. రాహుల్ గాంధీ, ఔరంగజేబులను ఒకచోట చేర్చి ఏమి మాట్లాడినా దాన్ని మోదీ ఉపయోగించుకుంటారని అయ్యర్‌కు తెలిసి ఉండా ల్సింది. అలాగే మోదీ వాడుకున్నారు కూడా. ఇది ఓటర్లును ఎంతగా ప్రభావితం చేసే అంశం? ఇలాంటి ఏ ఒక్క విషయంపైనో ఆధారపడి ప్రజలు ఓటు చేస్తారని అనుకోను. కానీ, రెండు దశాబ్దాలు తాము పాలించిన రాష్ట్రంలో బీజేపీ తమ ప్రభుత్వం పనితీరును గురించి గాక, కాంగ్రెస్ గురించి మాట్లాడే అవకాశాన్ని కల్పించింది. అంతకు ముందు బీజేపీ, అహ్మద్‌పటేల్ ఒక ఆసుపత్రికి ట్రస్టీగా ఉన్నారని వెల్లడించింది. అలాగే ఉగ్రవాద ఆరోపణలున్న ఒక వ్యక్తి అహ్మద్ పటేల్ వద్ద ఉద్యోగిగానో లేక మాజీ ఉద్యోగిగానో ఉన్నారని ఆరోపించారు. పటేల్‌కు, ఆ ఆరోపణలకు గురైన వ్యక్తికి ఎలాంటి సంబంధమూ లేదు. కాబట్టి అదో బూటకపు కథనం. ఉగ్రవాదం విషయంలో కాంగ్రెస్‌ది మెతక వైఖరి అని చూపడం ద్వారా సాధారణంగా బీజేపీకి లబ్ధి కలుగుతుంది. కాబట్టే ఆ కథనాన్ని ముందుకు తెచ్చారు. కానీ చరిత్ర, గణాంకాలు అందుకు విరుద్ధమైన ఫలితాలనే చూపు తున్నాయి. ఇక ఆ తర్వాత, కొద్ది రోజుల క్రితమే కపిల్ సిబల్ కథనం ముందుకు వచ్చింది. కాంగ్రెస్ నేత, న్యాయవాది అయిన ఆయన 2019 ఎన్నికల వరకు బాబ్రీ మసీదు కేసు తీర్పును వెలువరించరాదని సుప్రీం కోర్టును కోరారు. ఇలా పూర్తిగా సిద్ధం చేసి ఇచ్చిన సమాచారంతో మరో దఫా వార్తల్లో చక్కెర్లు కొట్టి వచ్చే అవ కాశాన్ని ఇది మోదీకి కల్పించింది. అయోధ్య వివాదం బీజేపీని జాతీయపార్టీని చేసింది. అయితే అదిప్పుడు రాజకీయంగా కాలం చెల్లిన అంశం. అయినా దాన్ని కూడా ఉద్దేశపూర్వకంగానే ప్రముఖమైన దాన్ని చేశారు. మణిశంకర్ అయ్యర్ ఇప్పటికే తనకు నోరు మూసుకుని ఉండటం చేతకాదని నిరూపించుకున్నారు. తనను చంపడానికి ‘సుపారీ’ తీసుకోవాలని అయ్యర్ పాకిస్తానీలను కోరారని మోదీ మరో ఆరోపణ చేశారు. అయితే అది నిజం కాదను కోండి. ప్రధాని దాన్ని నిజమని విశ్వసిస్తూ ఉండాలి. అలా జరిగితే అది ఆందో ళనకరమైన విషయమే. లేకపోతే అది ఎన్నికల్లో ఉపయోగపడే అంశమని అను కోవడమైనా జరిగి ఉండాలి. ఇలా జరిగినా గానీ అది ఆందోళన చెందవలసిన విషయమే. వార్తా ప్రసార మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్న అన్ని, లేదా దాదాపు అన్ని వార్తా కథనాలూ కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా బీజేపీ మీడియా మద్దతుతో ప్రవేశ పెట్టినవేనని కనబడుతూనే ఉంది. బీజేపీ సాగిస్తున్నది దూషణలు, భయాలతో కూడిన ప్రతికూల ప్రచారం. 2014లో సుపరిపాలన, అచ్చేదిన్ నినాదాలతో చేప ట్టిన సానుకూల ప్రచారాన్ని చేయాలనే కోరికే బీజేపీకి నేడు లేకపోవడం కొట్టవచ్చి నట్టు కనిపిస్తున్న విషయం. ఇది దురదృష్టకరం. ఉపఖండంలో రాజకీయాలు సాగే పద్ధతి కూడా ఇదే. ఈ ఎత్తుగడలను ఉపయోగించాలనుకున్న ప్రతిచోటా బీజేపీ వాటిని ప్రయోగించ వచ్చు. మీడియా ముందుకు నెట్టాలని భావించే విధంగా దాన్ని ఆకట్టుకునే అంశా లను కాంగ్రెస్ పట్టుకోవాల్సి ఉంటుంది. ఈ ఎన్నికల్లో చేస్తున్నట్టుగా ఉద్దేశ పూర్వక మైన తప్పులు చేయకుండా చూసుకోవాల్సినది కాంగ్రెస్ పార్టీయే. - ఆకార్ పటేల్ వ్యాసకర్త కాలమిస్టు, రచయిత ‘ aakar.patel@icloud.com -
ప్రచారంలో ముందున్నా హోరాహోరీ పోరేనా?
గుజరాత్ ఎన్నికలలో నిజమైన సమస్యలు ఉద్యోగాలు, అర్థవంతమైన ఆర్థికాభివృద్ధి. అధికార పార్టీ ఆ అంశాలపైనే పోరాడుతున్నట్టు నటిస్తున్నా, అవి దానికి వ్యతిరేకంగా ఉన్నాయి. బీజేపీకి పెద్ద ఓటర్ల పునాది ఉన్నా, అది సాగిస్తున్నది రక్షణాత్మక ప్రచారం. కాంగ్రెస్ ఓటర్ల పునాది చిన్నదే, అయినా వారు ఆగ్రహంతో ఉన్నారు. ఊపందుకుంటున్న గుజరాత్ ఎన్నికల ప్రచార కార్యక్రమంలో ముందుకు వస్తున్న సమస్యలు ఏమిటి? ఇరవై రెండేళ్లుగా అధికార పార్టీగా ఉన్న భారతీయ జనతా పార్టీ అభివృద్ధి గురించి మాట్లాడుతోంది. అభివృద్ధి అంటే బీజేపీ, అది కూడా నరేంద్ర మోదీ నేతృత్వంలోని బీజేపీ మాత్రమే అందించగలిగినది అన్న ట్టుగా, అది ఆ పార్టీకి కాపీ రైటున్న పదంలా అనిపిస్తోంది. బీజేపీ చేసేది ఏదైతే అది అభివృద్ధి, ఇతరుల పార్టీలు చేసేది అవినీతి, వంశపారంపర్య పాలన వగైరా. ఈ సూత్రీకరణ అతి సాదాసీదాది. కాకపోతే ఇలాంటి సూత్రీకరణ చేసిన బీజేపీని దాని ప్రత్యర్థులు తప్పించుకు పోనివ్వడమే విశేషం. ఒకవేళ బీజేపీ అభివృద్ధి గురించి మాట్లాడాలనే అనుకున్నా, అంటే గణాం కాలు, విధానాలు, ఆర్థిక, సామాజిక వృద్ధి వంటి అంశాలను చర్చించాలనే అను కున్నా... ఆ పార్టీ దృష్టి మరలింది. అది రాహుల్ గాంధీ మతం ఏదో తెలుసు కోవాలని అనుకుంటోంది. హఫీజ్ సయీద్‌కు బెయిల్ లభించినందుకు కాంగ్రెస్ సంబరాలు చేసుకుందని ప్రధానమంత్రి అబద్ధమాడారు. అయినా దానికీ అభివృ ద్ధికి ఉన్న సంబంధం ఏమిటి? ఏమీ లేదనుకోండి. బీజేపీ తాను అభివృద్ధికి కట్టుబడి ఉన్నానని చెప్పుకుంటుంటే, ఈ ఎన్నికల్లో అసలు సమస్య ఏమిటనే దానిపైన సైతం కాంగ్రెస్‌కు స్పష్టత లేదు. లేదా బీజేపీకి అభివృద్ధిలా చెప్పుకోడా నికి దానికి ఒక్క అంశమైనా లేదు. కాంగ్రెస్ పార్టీ యువరాజు రాహుల్ గాంధీ ఒక రోజు రాఫేల్ ఒప్పందానికి సంబంధించిన అవినీతి గురించి చర్చించాలనుకుంటే (దానికి మీడియా మద్దతు లభించలేదు), మరుసటి రోజు చర్చనీయాంశం జీఎస్టీ, పెద్ద నోట్ల రద్దు కావచ్చు. ఇలా దృష్టి కేంద్రీకరణ లోపించడానికి అర్థం బీజేపీకి వ్యతిరేకంగా కాంగ్రెస్ చెల్లా చెదురు సందేశాలను పంపుతున్నదనే. రెండవది, సమస్యల తర్వాతది పార్టీ నిర్మాణం. ఈ విషయంలో బీజేపీ బలీయమైన శక్తి. ప్రజాస్వామిక ప్రపంచంలోని అత్యంత శక్తివంతమైన పార్టీలలో ఒకటి. అట్టడుగు స్థాయిలో సైతం ఆ పార్టీ ఉనికిలో ఉంది. లక్షలాదిమంది సభ్యులతో ప్రపంచంలోనే అతి పెద్ద ప్రభుత్వేతర సంస్థగా ఉన్న రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ఆ నిర్మాణాన్ని నడుపుతోంది. దానికి అంకితభావంగల, సుశిక్షితులైన వ్యక్తులున్నారు. ఇటీవలి కాలంలో వారు నరేంద్ర మోదీ ఆకర్షణీయమైన నాయ కత్వంతో బాగా ఉత్తేజితులై ఉన్నారు. గుజరాత్లో జరగబోయేవి పోటాపోటీగా సాగే ఎన్నికలో కాదో తెలియదు. కానీ హోరాహోరీగా సాగే ఎన్నికలు వేటిలోనైనా బీజేపీకున్న నిర్మాణపరమైన శక్తులు విజయాన్ని సంపాదించి పెడతాయి. మరోవంక, ఇది రెండు పార్టీల రాష్ట్రం కాబట్టి మనం కాంగ్రెస్ వైపు మాత్రమే చూడగలం. ఆ స్థాయి పోటీ అయితే కనబడటం లేదని అంగీకరించక తప్పదు. సేవాదళ్ లేదా యువజన కాంగ్రెస్‌ల నుంచి వచ్చిన పాత కాంగ్రెస్ కార్యకర్తలు ఇప్పుడు లేరు. ఆ నిర్మాణం విచ్ఛిన్నమైపోయింది. వ్యక్తిగత కాంగ్రెస్ అభ్యర్థులే పనిచేసే కార్యకర్తలను సమకూర్చాల్సి ఉంటుంది. దీనికి చాలా డబ్బే ఖర్చవు తుంది. కానీ పార్టీ వరుసగా ఓడిపోతూ ఉండటంతో ఎన్నికల కోసం పెద్దగా డబ్బును పెట్టుబడిగా పెట్టగల నేతలు ఆ పార్టీలో ఎందరో లేరు. ఇక సమస్యలు, నిర్మాణాల విషయానికి వస్తే, బీజేపీయే ముందుందని నా అభిప్రాయం. దాని బలం లేదా కాంగ్రెస్ బలహీనత లేదా ఆ రెండూ కూడా అందుకు కారణం కావచ్చు. మూడవది, ప్రచార వ్యూహం. డజన్ల కొద్దీ బహిరంగ సభలలో బీజేపీ తన అత్యంత శక్తివంతమైన పావు ప్రధాన మంత్రిని ప్రయో గించింది. చాలా ఏళ్లుగా, గుజరాత్లో సైతం హిందీలోనే ప్రసంగిస్తూ వస్తున్న ఆయన ఇటీవల గుజరాతీలో ప్రసంగించడం ప్రారంభించారు. నాకైతే అది, ఆయన తన సందేశాన్ని మరింత శక్తివంతంగా ఇవ్వాలనుకుంటున్నారనడానికి, అభిప్రాయ సేకరణలు చెబుతున్నదానికంటే హోరాహోరీ పోటీ జరుగుతుందని భావిస్తున్నారనడానికి సంకేతమేమోనని అనిపిస్తున్నది. మోదీ అసాధారణమైన ఉపన్యాసకులు, రాహుల్వల్ల కాని విధంగా ఆయన తన అజెండాను ప్రజల ముందు ఉంచగలరు. సుదీర్ఘంగా ఉపన్యసించేటప్పుడు ఆయన... సాధారణంగా పాత సమస్యనే కొత్త పద్ధతిలో ఎంత చక్కగా లేవనెత్తుతారంటే... మరుసటి రోజు పత్రికల్లో అది పతాక శీర్షికలకు ఎక్కక తప్పదు. ఉదాహరణకు, ‘నేను టీ అమ్ము కున్నానే కానీ దేశాన్ని అమ్మేయలేదు’ అనే మాటనే తీసుకోండి. అలాంటి స్పష్టత, సరళత గల పద పొందిక గల నాయకుడు ఉండటం ఆ పార్టీకి వరం. మరోవంక, కాంగ్రెస్ తన అజెండాను ప్రజల ముందుంచలేదు. అంతే కాదు, ఓ హాస్పిటల్లో అహ్మద్ పటేల్ ట్రస్టీగా ఉండటం తప్పా కాదా, రాహుల్ కాథలిక్కా కాదా అనే అనవసర సమస్యల్లో కూడా అది రక్షణ స్థితిలో ఉండక తప్పడం లేదు. అయితే కాంగ్రెస్ ఒక్క పనిని మాత్రం సమర్థవంతంగా చేసింది. మూడు అసమ్మతి బృందాలను సంఘటితం చేయగలిగింది. పాటీదార్లు, దళితులు, ఓబీసీ క్షత్రియులను అది ఐక్యం చేయగలిగింది. వారివి పరస్పర విరుద్ధమైన డిమాండ్లు. కాబట్టి ఇదేమీ సులువుగా చేయగల పని కాదు. అయినా కాంగ్రెస్ అ పని చేయ గలిగింది. ఇది ప్రధానంగా అహ్మద్ పటేల్ వల్లే జరిగిందని అని నా అంచనా. ఈ పరిణామం వల్ల బీజేపీ కలవరపడుతోంది. ఆ పార్టీ నేతలు చేసే పలు ప్రకటనల్లో, ప్రత్యేకించి ఆ కూటమిని విచ్ఛిన్నం చేసే లక్ష్యంతో ముఖ్యమంత్రి చేసే ప్రకటనల్లో అది కనబడుతుంది. బీజేపీని ఓడించడానికి ఇది సరిపోతుందా? అనేదే ప్రశ్న. అన్నిటికన్నా ఎక్కు వగా ఈ ఎన్నికలను నిర్ణయించేది పోలింగ్ శాతం ఎంత అనేదే. గుజరాత్, ఓటింగ్ శాతం ఎక్కువగా ఉండే రాష్ట్రం. అభిప్రాయ సేకరణల్లో బీజేపీ ముందున్నా, అది తన పునాది ఓటర్లు వచ్చి ఓటు వేసేట్టు చేయగలగాలి. అది సాగిస్తున్నది రక్షణా త్మకమైన ప్రచారం కాబట్టి అది ఏమంత తేలిక కాకపోవచ్చు. కాంగ్రెస్ ఓటర్ల పునాది చిన్నదే, అయినా వారు ఆగ్రహంతో ఉన్నారు. కాబట్టి ఓటు వేయడానికి వస్తారని కాంగ్రెస్ ఆత్మవిశ్వాసంతో ఉండగలుగుతుంది. ఆ అర్థంలో గుజరాత్లో నిజమైన సమస్యలు ఉద్యోగాలు, అర్థవంతమైన ఆర్థికాభివృద్ధి. అధికార పార్టీ ఆ అంశాలపైనే పోరాడుతున్నట్టు నటిస్తున్నా, అవి దానికి వ్యతిరేకంగా ఉన్నాయి. - ఆకార్ పటేల్ వ్యాసకర్త కాలమిస్టు, రచయిత ‘ aakar.patel@icloud.com -
చెరసాలలో ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్
టర్కీ ప్రభుత్వం ఆమ్నెస్టీ కార్యకర్తలపై మోపిన ఉగ్రవాద కేసు ఉత్త డొల్ల. విచారణను చూస్తే తీర్పు సత్యానికి అనుకూలంగా వస్తుందనిపించింది. కానీ తనెర్కు బెయిల్‌ను నిరాకరించారని విని నిర్ఘాంతపోయాం. చాలా ఏళ్లుగా నేను కోర్టు విలేకరిగా పని చేస్తున్నా మానవహక్కులు, భావవ్యక్తీకరణ స్వేచ్ఛకోసం పోరాడుతున్నవారిని ఇంత నిస్సిగ్గుగా అణచివేయడాన్ని ఎన్నడూ చూడలేదు. నేనీ వ్యాసాన్ని టర్కీలోని ఇస్తాంబుల్ నుంచి రాస్తున్నాను. ఇక్కడి కోర్టులోని ఉగ్రవాద సంబం«ధమైన ఒక కేసు విచారణకు పరిశీలకునిగా నేను వచ్చాను. అంత ర్జాతీయ మానవహక్కుల సంస్థ ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ టర్కీ శాఖ చైర్‌పర్సన్‌కు, డైరెక్టర్‌కు వ్యతిరేకంగా జరుగుతున్న విచారణ అది. నేను కూడా ఈ అంతర్జాతీయ ఉద్యమంలో భాగంగా ఉన్నానని, ఆమ్నెస్టీ ఇండియా ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌నని పాఠ కుల్లో కొందరికి తెలిసి ఉండొచ్చు. ఇదిల్ ఆసెర్, తనెర్ కిలిక్ అనే నా సహచరులు ఒక ఉగ్రవాద సంస్థకు చెందిన సభ్యులనే ఆరోపణతో ఆ విచారణ జరుగుతోంది. కొన్ని వారాల క్రితం బెయిల్ లభించిన ఇదిల్ను కోర్టు బయట కలుసుకున్నాను. తనెర్, జూన్ నుంచి ఇస్తాంబుల్‌కు 500 కిలోమీటర్ల దూరంలోని ఇజ్మిర్ జైల్లో బందీగానే ఉన్నాడు. అక్కడి నుంచే అతడు వీడియో లింకు ద్వారా విచారణలో పాల్గొన్నాడు. డిజిటల్ భద్రతపై ఒక హోటల్లో జరిగిన వర్క్‌షాప్‌కు ఈ కార్యకర్తలిద్దరూ హాజరైన తర్వాత వారిపై ఈ ఆరోపణలను మోపారు. ఆ హోటల్ జరిగినది, గూఢ చార కార్యకలాపాలు, కుట్రలో పాల్గొనడం కోసం జరిపిన రహస్య సమావేశమని ప్రభుత్వం మూర్ఖంగా వాదిస్తోంది. జర్మనీ, స్వీడన్లకు చెందిన ఇద్దరు విదేశస్తులు కూడా ఈ వ్యవహారంలో విచారణను ఎదుర్కొంటున్నారు. అయితే వారు బెయి ల్‌పై బయటే ఉన్నారు. ఈ కేసు మొత్తంగా ఉత్త డొల్ల. తన ఫోన్లోకి బైలాక్ అనే ఒక ఆప్‌ను డౌన్లోడ్ చేసుకున్నాడనేది తనెర్పై మోపిన ప్రధాన ఆరోపణ. ఎన్క్రిప్టెడ్ (నిక్షిప్త) సమాచార మార్పిడికి వాడే ఆప్ (వాట్సాప్ లాంటిది) అది. గత ఏడాది తిరుగుబాటుకు జరిగిన కుట్రకు ముందు, దాని మద్దతుదార్లు రహస్య సమాచా రాన్ని చేరవేయడానికి బైలాక్ను ఉపయోగించారని ప్రభుత్వ అరోపణ. తనెర్ ఆ ఆప్‌ను వాడాడనే ఆరోపణకు ఎలాంటి ఆధారమూ లేదు. ఆమ్మెస్టీ తనెర్ ఫోన్‌ను రెండు సార్లు ఫోరెన్సిక్ పరీక్షలకు పంపింది. రెండూ ఆ ఫోన్లో బైలాక్ ఉనికికి సంబంధించిన ఆనవాళ్లు సున్నా అన్ని తేల్చాయి. ఈ పరీక్షల్లో ఒకటి అంతర్జాతీయ సాంకేతిక సంస్థ సెక్యూర్ వర్క్స్ నిర్వహించినది. కోర్టు విచారణలో ఒక నిపుణుడు ఈ విషయాన్ని ధ్రువీకరించాడు. ఆ రోజు ఉదయాన్నే మేం జస్టిస్ ప్యాలెస్ అని పిలిచే ఆధునిక వర్తులాకార భవనం ముందు నిరసన ప్రదర్శన నిర్వహించాం. ఆ భవనంలో చాలా కోర్టు గదు లున్నాయి. విపరీతంగా చలి, గాలులు ఉన్నా, మా నిరసనకు పలు పౌర సమాజ బృందాలు, వ్యక్తులు హాజరయ్యారు. విదేశీ పరిశీలకులలో ఆమ్నెస్టీ బ్రెజిల్, బ్రిటన్ శాఖల చైర్పర్సన్లు, యూరోపియన్ యూనియన్, ఐక్యరాజ్య సమితి దౌత్యవే త్తలు కూడా ఉన్నారు. ఆ మానవహక్కుల పరిరక్షకులకు మద్దతుగా చేసిన ప్రకట నను చదివి వినిపించారు. మాతోపాటూ తనెర్ 19 ఏళ్ల కుమార్తె గుల్నిహల్ కూడా ఉంది. మేమంతా చాలా ఉత్సాహంగా ఉన్నాం. కోర్టులో లాయర్లు తదితర అధికా రులుగాక, 120 మంది పడతారు. గదంతా నిండిపోగా, చాలా మంది బయట నిల బడాల్సి వచ్చింది. కోర్టులో ముగ్గురు న్యాయమూర్తులున్నారు. వారికి ఒక పక్కన ప్రాసిక్యూటర్ కూడా కూర్చొని ఉండటం అసక్తికరంగా ఆనిపించింది. ఆరు గంట లకుపైగా సాగిన ఆ విచారణలో అతను ఒకే ఒక్క సారి, అదీ కొద్ది సేపే మాట్లాడాడు. ఎక్కువ సమయం తీసుకున్నది తనెర్ తర ఫు న్యాయవాదే. డిఫెన్స్ తరఫున నిపుణుడైన సాక్షి బైలాక్ ఆప్ సమస్య గురించి వివరంగా మాట్లాడాడు. తనెర్ ఫోన్ లోని సాఫ్ట్‌వేర్‌ను కాపీ చేసుకున్నాక పోలీసులు తిరిగి ఇచ్చేశారు. తనెర్ ఎన్నడూ బైలాక్ను డౌన్లోడ్ చేసుకుని ఉండే అవకాశమే లేదని అతను నిర్ధారించాడు. కుట్ర యత్నం తర్వాతి వరకు తాను బైలాక్ గురించి వినలేదని తనెర్ సాక్షిగా చేసిన ప్రక టనలో తెలిపాడు. అయినా. మొదటి విచారణలో కోర్టు అతనికి బెయిల్ మంజూరు చేయలేదు. ఆ విచారణ పూర్తయ్యాక నా సహచరుడు జాన్ డల్ హూసెన్ ‘‘ఏ ఆధా రాలూ లేకుండా రావడానికి ప్రాసిక్యూటర్‌కు మూడు నెలలకు పైగా పట్టింది. ఈ కేసును కొట్టి పారేయడానికి న్యాయమూర్తికి అరగంట కూడా పట్టదు’’ అన్నాడు. కానీ కేసును కొట్టేయలేదు. నేను ఇప్పుడు వర్ణిస్తున్నది రెండో దఫా విచా రణనే. మధ్యలో కూచున్న సీనియర్ న్యాయమూర్తి, నిపుణుణ్ని కొన్ని ప్రశ్నలు అడిగాడు. విచారణ జరుగుతున్నంత సేపూ సత్యానికి అనుకూలంగానే తీర్పు వస్తుందనే మాకు అనిపించింది. విచారణంతా టర్కిష్ భాషలోనే జరిగింది. నిపుణుడు చెప్పిన సాక్ష్యం కలిగించిన ప్రభావం ఎలాంటిదో అంచనా వేయడం కష్టం కాలేదు. తనెర్ సూటిగా, ఉద్వేగరహితంగా తనకు వ్యతిరేకంగా ఎలాంటి సాక్ష్యాలు లేనందున బెయిల్‌పై తనను విడుదల చేయాలని విజ్ఞప్తి చేశాడు. రోజంతటిలో ప్రాసిక్యూటర్ మాట్లాడిన ఏకైక వాక్యాన్ని విన్నాం. ప్రభుత్వం బెయిల్‌ను వ్యతిరేకిస్తున్నది అని చెప్పాడు. ఆరు గంటలకు పైగా సాగిన విచారణ తర్వాత న్యాయవాదులు, నిందితులు తప్ప మిగతా అంతా ఖాళీ అయిపోయింది. మమ్మల్ని బయట వేచి ఉండమ న్నారు. ఆ తర్వాత బెయిల్ నిరాకరించారని మాకు చెప్పారు. ఆ వార్త మాకు అందరికీ దిగ్భ్రాంతిని కలుగచేసింది, చిన్న పిల్ల గుల్నిహల్ ఆ మాటకు గుండె చెదిరిపోయింది. చాలా ఏళ్లుగానే నేను కోర్టు విలేకరిగా పనిచేస్తున్నా మానవ హక్కుల కోసం, భావవ్యక్తీకరణ స్వేచ్ఛ కోసం పోరాడుతున్నవారిని ఉగ్రవాదంతో ముడి పెట్టి ఇంత నిస్సిగ్గుగా అణచివేయడాన్ని మాత్రం ఎన్నడూ చూడలేదు. మన ప్రభుత్వం కూడా ఒక ప్రతినిధిని పంపి ఉంటే బావుండేదని నా అభిప్రాయం. తదుపరి విచారణకైనా అ పనిచేస్తారని ఆశిస్తాను. ఇది, టర్కీతో మనం తప్పక ప్రస్తావించాల్సిన సమస్య. ఒక భారతీయునిగా, చరిత్ర విద్యార్థిగా నాకు టర్కీలో జరిగింది నిరుత్సాహం కలిగించింది. వెయ్యేళ్ల క్రితం తురుష్కులు మన దేశానికి రావడానికి ముందు నుంచీ టర్కీ ప్రజలతో మనకు సాంస్కృతిక సంబంధాలున్నాయి. మన దేశ ముస్లిం పాల కులలో పలువురు టర్కీకి చెందినవారు. మొహమ్మద్ గజినీ తురుష్క మూలాలు న్నవాడు. బాబర్, చంగ్తార్ తురుష్కుడు. మైసూర్ పాలకుడు టిప్పు కూడా తన పూర్వీకులు తురుష్కులేనని తనను ‘సుల్తాన్’గా పిలిపించుకునేవాడు. అటువంటి గొప్ప, సుప్రసిద్ధులైన ప్రజలకు ప్రాతినిధ్యం వహించే టర్కీ ప్రభుత్వం నా సహచ రులపై విచారణను మరింత మెరుగైన పద్ధతిలో నిర్వహిస్తుందని ఆశిస్తున్నాను. నా సహచరులు టర్కీ ప్రజల హక్కుల కోసం, వారి బాగు కోసం పనిచేస్తున్నవారు. - ఆకార్ పటేల్ వ్యాసకర్త కాలమిస్టు, రచయిత‘ aakar.patel@icloud.com -
మతిమాలిన వారి గతి తప్పిన తర్కం
పాపిష్టి, చెడ్డ వస్తువులనే 28% శ్లాబు కింద ఉంచాలని జీఎస్టీ కౌన్సిల్ ఏకాభిప్రాయానికి వచ్చింది అంటూ, వాటి జాబితాను ఇంచుమించు 50కి తగ్గించారు. ప్రైవేటు విమానాలు, కార్లు, ద్విచక్ర వాహనాలపై 28% పన్ను విధించారు. ద్విచక్ర వాహనం ఉండటం ఏ విధంగా పాపిష్టిది లేదా చెడ్డది? విలాసవంతమైన పెద్ద కారు టైరుపైన, సైకిల్ వాలా టైరుపైన కూడా 28% పన్నే. ఎయిర్ కండిషనర్లు, ఫ్రిజ్‌లు, వాషింగ్ మెషీన్లు, వాటర్ హీటర్లు అన్నీ విలాస వస్తువులే అనవచ్చేమో. ‘చెడ్డ’ వస్తువుల ఎంపికలో బుర్రను ఉపయోగించకపోవడమే పెద్ద సమస్యని అనిపిస్తుంది. ఈ వారం, మళ్లీ ఒకసారి కొన్ని వస్తువులపై పరోక్ష పన్నులను తగ్గించారు. ఇది సాధారణంగా మూడు కారణాల వల్ల జరుగుతుంటుంది. ఒకటి, కొన్ని వస్తువులు రాజకీయంగా సున్నితమైనవి కావడం వల్ల. ఉదాహరణకు, గుజరాత్లో ఖాక్రా (కరకరలాడే రొట్టెలాంటి ఉపాహారం) వంటి వస్తువులను మరింత ఖరీదైనవిగా చేస్తే, ప్రతికూలమైన పతాక శీర్షికలను చూడాల్సి వస్తుంది. రెండు, కొన్ని వస్తువులు మరింత ఖరీదైనవిగా మారడం వల్ల వాటి అమ్మకాలు తగ్గి, ఆర్థిక వ్యవస్థను ప్రభా వితం అవుతుందని ప్రభుత్వం భావించడం వల్ల. మూడు, ఫలానా వస్తువులను ఎక్కువ పన్ను విధించాల్సినవిగా పొరపాటున వర్గీకరించామని భావించడం వల్ల. పరోక్ష పన్నులన్నీ సంపన్నులపైన, పేదలపైన ఒకే విధంగా ఉంటాయి. కాబట్టి అవి చెడ్డవి. నేను, మా డ్రైవర్ ఇద్దరమూ కోకా కోలాకు ఒకే ధర చెల్లిస్తాం. కాబట్టి, ఆదాయం పన్ను వంటి ప్రత్యక్ష పన్నులే మంచి ప్రభావాన్ని చూపుతాయి. వస్తు సేవల పన్ను(జీఎస్టీ)లో 0%, 0.25%, 3%, 5%, 12%, 18%, 28% అనే ఏడు శ్లాబులున్నాయి. వీటిలో ఏ వస్తువుపై ఏ రేటున పన్ను విధించాలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రాతినిధ్యం ఉన్న జీఎస్టీ కౌన్సిల్ నిర్ణయిస్తుంది. ఏ వస్తువులను 0% శ్లాబు కింద, ఏ వస్తువులను 28% శ్లాబు కింద ఎందుకు ఉంచారో తెలుసుకోవాలని నాకు చాలా ఆసక్తి. గత శుక్రవారం వరకు 28% శ్లాబులో 227 వస్తువులు ఉండేవి. చూయింగ్ గమ్ నుంచి వాక్యూం ఫ్లాస్కులు, బట్టల దుకా ణాల్లో వస్త్ర ప్రదర్శనకు వాడే బొమ్మల వరకు అందులో చేర్చారు. జీఎస్టీ కౌన్సిల్ తాజా సమావేశం తదుపరి ఆ విభాగంలో కేవలం 50 వస్తువులే ఉన్నట్టున్నాయి. ఏ వస్తువుపై మనం ఎక్కువ పన్నును చెల్లించాలో జీఎస్టీ కౌన్సిల్ ఎలా నిర్ణయిస్తుంది? ప్రభుత్వం దీన్ని తన సొంత తర్కం ప్రాతిపదికపైనే నిర్ణయిస్తుంది. అది వస్తువు లను ‘పాపిష్టి’ వస్తువులు లేదా చెడ్డ వస్తువులుగా గుర్తిస్తుంది. ఈ చెడ్డ వస్తువుల జాబితాను తగ్గిస్తున్నట్టు ప్రకటిస్తూ బిహార్ ఉప ముఖ్య మంత్రి సుశీల్ మోదీ... 28% శ్లాబు కింద ఉన్న చూయింగ్ గమ్, చాక్లెట్లు, షేవింగ్ వస్తువులు, బట్టలు ఉతికే పౌడర్లను 18% శ్లాబులోకి మారుస్తున్నట్టు తెలిపారు. ‘‘పాపిష్టి, చెడ్డ వస్తువులు మాత్రమే 28% వర్గం కింద ఉండాలని (కౌన్సిల్) ఏకా భిప్రాయం’’ అని కూడా చెప్పారు. భారత ప్రభుత్వం, రాజకీయ వేత్తలు ఏది పాపిష్టి లేదా చెడ్డ వస్తువు అని ఎలా నిర్ణయిస్తారనేది ఆసక్తికరమైన ప్రశ్న. ఒకటి, క్రైస్తవ సాంప్రదాయానికి చెందిన ‘పాపం’ అనే భావన హిందూ మతంలో లేదు. బైబిల్లోని పాపం దేవునికి వ్యతిరేకంగా చేసిన నేరం. క్రెస్తవంలోని పాపం కిందకు సోమరితనం, భోగలాలసత కూడా వస్తాయి. హిందువులలో ఈ భావన లేదు. అయితే, సామాన్యార్థంలో పాపం అంటే అనైతికమైనది లేదా అనైతికతను పెంపొందింపజేసేది లేదా అలా అనిపించేది... మద్యం వంటివి. కానీ మద్యం జీఎస్టీ జాబితాలో లేనే లేదు. రాష్ట్రాలు తమకు ఇష్టమొచ్చిన రేటుతో మద్యంపై పన్ను విధించవచ్చు. ఈ వాస్తవం మూలంగా మద్యం చౌకగా దొరికే వీలుండటమే విచిత్రమైన సంగతి. ముంబైలోని ఏ రెస్టారెంట్‌కు వెళ్లినా,ఆహారంపై 18%, మద్యంపై 10% విలువ ఆధారిత పన్ను చెల్లించాలి. ఇది మన çపన్నుల వ్యవస్థ లోప రహితమైనది కాదని తెలుపుతుంది. ఇక చెడ్డ వస్తువు విషయం మరింత జటిలమైనది. ఏ వసువులను లేదా సేవ లను వినియోగించడం సామాజికంగా అవాంఛనీయం అని భావిస్తే అవన్నీ చెడ్డవే. మద్యం వీటిలో భాగమే. పొగాకును, ప్రత్యేకించి ఇటీవలి కాలంలో జంక్ ఫుడ్‌ను కూడా అలాగే భావిస్తున్నారు. అందువల్లనే మనం పాపిష్టి, చెడ్డ వస్తువుల జాబితా వైపు ఓసారి దృష్టి సారించడం అవసరం. మీ ఇళ్లకు, కార్యాలయాలకు వేసే రంగు లను, కళాకారులు వాడే రంగులను, షూ పాలిష్‌ను కూడా అందులో చేర్చారు. అతి నిరుపేద వీధి కార్మికులు కూడా షూ పాలిష్‌ను కొని, ఉపయోగిస్తారు. అలాంటి వారిని శిక్షించడం దేనికి? ఇవి పాపిష్టివి అని లేదా చెడ్డవి అని అనడానికి ప్రాతి పదిక ఏమిటో ఊహకు అందేది కాదు. ఇకపోతే ఆ జాబితాలో టపాసులు ఉన్నాయి. అవెలాగూ పేదలకు అందుబాటులోనివి కావు. కానీ అగ్నిమాపక సాధ నాలను కూడా ఈ జాబితాలో చేర్చారు. ఇది చూసి నేను నిర్ఘాంతపోయాను. భద్రతా ప్రమాణాలు ప్రపంచంలోనే అతి తక్కువ స్థాయిలో ఉన్న దేశంలో... ఆ ప్రమాణాలకు కట్టుబడటాన్ని ఖరీదైనదిగా ఎందుకు మార్చినట్టు? ప్రైవేటు విమా నాలు, కార్లు, ద్విచక్రవాహనాలపై 28% పన్ను విధించారు. ద్విచక్ర వాహనం ఉండటం ఎలా పాపిష్టిది లేదా చెడ్డది. టైర్లపైనా అదే పన్ను. అంటే విలాసవంత మైన పెద్ద కారున్న వ్యక్తిలాగే సైకిల్ వాలా కూడా టైరుపై అంతే పన్ను చెల్లించాలి. ఎయిర్ కండిషనర్లు, ఫ్రిజ్‌లు, వాషింగ్ మెషీన్లు, వాటర్ హీటర్లు అన్నీ ఈ వర్గం కిందనే చేర్చారు. మనలాంటి దేశంలో అవన్నీ విలాస వస్తువులేనని మరో సారి వాదించవచ్చు. కానీ, ఈ వస్తువులను ఎంపిక చేసేటప్పుడు బుర్రను ఉప యోగించకపోవడమే పెద్ద సమస్యని నాకు అనిపిస్తుంది. పాన్ మసాలాపై 28% పన్ను. కానీ తమలపాకుల మీద పన్ను 0%. రెండూ ఒకే అలవాటను ప్రోత్సహిం చేవే. వీటిలో ఒకటి ఎలా చెడ్డ వస్తువు అయ్యిందో స్పష్టత లేదు. జీఎస్టీ శ్లాబు లన్నిటినీ ఓసారి చూడాల్సిందిగా పాఠకులను ప్రోత్సహిస్తున్నాను (ఆన్లైన్లో ఛిb్ఛఛి.జౌఠి.జీn వంటి వెబ్సైట్లలో లభిస్తుంది). తద్వారా జీఎస్టీ వర్గీకరణ తర్క బద్ధంగా ఉందో లేదో వారు తమంతట తామే నిర్ణయించుకోగలుగుతారు. అసలు విషయం ప్రభుత్వాన్ని తప్పుపట్టాలనేది కాదు. ప్రతిపక్షాల పాలన లోనివి సహా అన్ని రాష్ట్ర ప్రభుత్వాలూ జీఎస్టీ కౌన్సిల్లో భాగంగా ఉన్నాయి. ప్రజలు నిర్వచించిన పాపం లేదా చెడు అనే విషయాలపై ఎలాంటి చర్చా లేకుండా పౌరులను వారు నామమాత్రమైన వారుగా భావించారా లేదా అనేదే సమస్య. దీన్ని ముగిస్తూ ఓ విషయాన్ని చెప్పాలి. కాలమిస్టులు, స్వతంత్ర పాత్రికేయులు ఆర్జించే డబ్బుపై జీఎస్టీ లేదు. - ఆకార్ పటేల్ వ్యాసకర్త కాలమిస్టు, రచయిత‘ aakar.patel@icloud.com -
ఆర్థిక భావజాలం పూర్తిగా కొరవడిందా?
♦ అవలోకనం బీజేపీకి ఆర్థిక తాత్విక భావజాలం లేదని చిదంబరం అన్నారు. బీజేపీ వెబ్సైట్ మోదీ భావజాలంగా పేర్కొన్న ‘హిందుత్వ’ అంటే గోవధ, ఆలయం సమస్య, లవ్ జిహాద్, అడపాదడపా ఆర్థిక, విదేశాంగ విధానాలకు సంబంధించి యథాలాపంగా ఏవో చర్యలు చేపట్టడం మాత్రమే అయితే... మనం అనుకుంటున్న దానికంటే ఎక్కువ లోతైన సమస్యలో ఇరుక్కుపోయాం. మన ప్రధానికి ఏదైనా భావజాలం అంటూ ఉన్నదా? ఆయన పార్టీ వెబ్సైట్ ఆయనది హిందుత్వ భావజాలంగా పేర్కొని, ప్రచారం చేస్తోంది. అయినా ఈ ప్రశ్న అడగడం విడ్డూరంగా అనిపించవచ్చు. మనకున్న అత్యంత వివేచనాపరు లైన రాజకీయవేత్తల్లో మాజీ ఆర్థిక మంత్రి పి. చిదంబరం ఒకరు. ఆయన, ప్రధాని పార్టీౖయెన బీజేపీకి భావజాలమని చెప్పుకోదగ్గది ఏమీ లేదని అన్నారు. కాబట్టే ఈ ప్రశ్న అడగాల్సి వస్తోంది. ‘‘ప్రభుత్వం, ప్రజా సంక్షేమం, ఆరోగ్యం, విద్యా సదుపాయాలను పెంపొందింపజేసి సమానత్వ లక్ష్యాన్ని ముందుకు తీసుకుపోవడానికి కృషిచేసేదిగా ఉండటమా? లేక పూర్తి స్వేచ్ఛా విపణి వైఖరిని చేపట్టడమా? అనే అంశంపై తీసుకునే తాత్విక వైఖరికి సంబం ధించి బీజేపీ స్థానం ఎక్కడని మీరు అనుకుంటున్నారు?’’ అని ఒక వ్యాపార దిన పత్రిక చిదంబరాన్ని అడిగింది. జవాబు చెప్పడానికి ఇది సరళమైన ప్రశ్నేమీ కాదు. స్వేచ్ఛా విపణి వైఖరి అంటే ప్రభుత్వం ఆర్థికవ్యవస్థలో జోక్యం చేసుకోదు. ప్రతిదీ పైవేటు పాత్రధారులకే వదిలేస్తుంది. ఇంచుమించుగా దీన్ని ఆన్ రాండ్ లాంటి వారు రాసిన సమాజం వంటిదని అభివర్ణించవచ్చు. వారు చెప్పిన సమాజంలో ధీరోదాత్తులైన పెట్టుబడిదారులు తమ మధ్య పోటీ ద్వారా ప్రపం చాన్ని మరింత మెరుగైనదిగా మారుస్తారు, అసమర్థ ప్రభుత్వం అందులోకి తల దూర్చదు. విద్య, వైద్యం సహా సకల రంగాలను అది ప్రైవేటు రంగానికే వది లేస్తుంది. పౌరులు తమంతట తాముగానే ఆ అవసరాలను తీర్చుకోవాలని చేతులు దులుపుకుంటుంది. 2014 ఎన్నికల ప్రచారంలో మోదీ అలాంటి స్వేచ్ఛా విపణి వ్యవస్థ సమర్ధ్థకు లని అనుకునేవారు. కాంగ్రెస్‌కు ‘సోషలిజం’ వైపు మొగ్గు చూపేదిగా గుర్తింపు ఉంది. స్వేచ్ఛావిపణి వ్యవస్థ దానికి భిన్నమైనది. అయితే గత మూడేళ్లుగా మహా త్మాగాంధీ గ్రామీణ ఉపాధి హామీ చట్టం (ఎమ్జీఎన్ఆర్ఈజీఏ) తదితర ‘సోష లిస్టు’ పథకాలు కొనసాగుతూనే ఉన్న మాట నిజమే. ఎమ్‌జీఎన్‌ఆర్‌ఈజీఏను రద్దు చేస్తామని మోదీ అన్నారు. కానీ ఆర్థిక వ్యవస్థలో ప్రభుత్వం పాత్రకు సంబంధించి నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్(ఎన్డీఏ)కి, మన్మోహన్సింగ్ నేతృత్వంలోని యునై టెడ్ ప్రోగ్రెసివ్ అలయన్స్(యూపీఏ)కి మధ్య తేడా ఏమీ లేనట్టే కనిపిస్తోంది. చిదంబరం తన సమాధానంలో విసిరిన సవాలు ఇదే.‘‘బీజేపీకి తనదైన కీలక ఆర్థిక భావజాలం లేదా తాత్వికచింతన ఏదీ లేదు. హిందుత్వ, ఆధికసంఖ్యాకవాద ప్రభుత్వం మాత్రమే బీజేపీ కీలక భావజాలంగా ఉన్నాయి. ఏ ప్రభుత్వానికైనా తనకంటూ ఓ కీలక ఆర్థిక తాత్వికత ఉండాలి. అప్పుడే అటు వామపక్షం నుంచి ఇటు మితవాదపక్షం వరకు ఉండే విభిన్న భావజాలాల వర్ణమాలికలో దాని స్థానం ఏదో తెలుస్తుంది. అది లేదు కాబట్టే అది అంతటా తారట్లాడుతోంది’’ అన్నారు ఆయన. కటువైన ఈ మాటలను ప్రత్యర్థి ఆరోపణలుగా తేలికగా తీసేయవచ్చు. కానీ నేను కాంగ్రెస్ ఓటర్ని కాను. అయినా నాకు, చిదంబరం ఈ వాదనను ఎక్క డికి తీసుకుపోతున్నారో తెలుసుకోవడం ముఖ్యమనే అనిపిస్తోంది. బీజేపీ వైఖరిని ‘‘కాంగ్రెస్ వైఖరితో పోల్చి చూడండి. ఈ (పైన చెప్పిన) పథకాల అమలులో ఎన్నో లోటుపాట్లు ఉన్నాయని నేనే మొదట అంగీకరిస్తాను. అయితే, కాంగ్రెస్ మూడు లేదా నాలుగు అంశాలను తన కీలక తాత్వికసారంగా నిర్వచించుకుంది. వాటిలో మొదటిది, ఎవరూ ఆకలితో లేదా పస్తులతో చావరాదు. అందుకే మేం ఎమ్జీఎన్ ఆర్ఈజీఏ, జాతీయ ఆహార భద్రతా చట్టం తెచ్చాం.’’ తమ పార్టీ కీలక భావజాలాన్ని నిర్వచించేవిగా ఆయన ఇతర అంశాలను సైతం పేర్కొన్నారు. గర్భిణులు, బాలింత తల్లులు, ఐదేళ్లలోపు పిల్లల సంక్షే మమూ, రోగనిరోధక కార్యక్రమం సహా ప్రజారోగ్యం కోసం కృషిచేయడమూ, జాతీయ గ్రామీణ ఆరోగ్య కార్యక్రమం తదితరాలను ఆయన ఉదహరించారు. ఆర్థికవ్యవస్థలో ‘‘ఈ ప్రభుత్వ జోక్యాలు.. కాంగ్రెస్ భావజాల సారానికి సంబంధిం చిన విశ్వాసాలు, తాత్వికత’’ అని చిదంబరం అన్నారు. మోదీ దృక్పథంలో అలాంటి నిర్దిష్ట దిశ అనేది ఏదీ కనబడదని చెప్పారు. గోరఖ్‌పూర్‌లో 282 మంది పిల్లల మృతిని ప్రస్తావిస్తూ ‘‘అది, కేంద్ర ప్రభు త్వంపైన ప్రభావాన్ని చూపడం లేదు. ఉత్తరప్రదేశ్ ప్రభుత్వంపైనా ప్రభావం చూపడం లేదు. అది ఎవరి హృదయాన్నీ కదలించడం లేదు... దీపావళి రోజున వారణాసిని దీపాలతో దేదీప్యమానం చేయడం, హిందుత్వ తాత్వికతకు సంకే తంగా నిలిచే ఆలయ నిర్మాణం... వారికి శిశు/మాతా మరణాల రేటు కంటే, పోషకాహారలోపం లేదా ఆకలి కంటే ఎక్కువ ముఖ్యమైనవి.’’ బీజేపీకి, ప్రత్యే కించి మోదీకి తమ చర్యలన్నిటికీ హేతువుగా నిలిచే భావజాలం లేదా దృక్పథం అంటూ ఏదైనా నిర్దిష్టంగా ఉన్నదా? అదే అసలు ప్రశ్న. లేకపోతే చిదంబరం చెప్పినట్టు వారు చేపట్టిన మేక్ ఇన్ ఇండియా, స్వచ్ఛ భారత్, పెద్ద నోట్ల రద్దు, మెరుపు దాడులు, బుల్లెట్ ట్రైన్, స్టార్టప్ ఇండియా, జీఎస్టీ వంటి బృహత్ చర్యలన్నీ చర్యలన్నిటినీ ఒకదానితో మరో దాన్ని అనుసంధానించే పొంతన గల సమగ్ర భావజాల కథనం ఏదీ లేకపోవడం నిజమేనా? లేక ఇవన్నీ ఒక గొప్ప, పరిపూర్ణతలో భాగమా? లేక అవి ఒకదానితో మరోదానికి సంబంధం లేని, అర్థం లేని విడి విడి భాగాలేనా? బీజేపీ ఓటర్లు సహా మనల్ని అందరినీ వేధిస్తున్న ప్రశ్న, అందరం అడగాల్సిన ప్రశ్న ఇదే. కాంగ్రెస్, తాను కొన్ని నిర్దిష్ట సమస్యలపై దృష్టిని కేంద్రీకరించడానికి ప్రయ త్నించానని చెబుతోంది. వాటి ఉద్దేశాలు మంచివే. అయినా, వాటిని అమలు చేయగల సామర్థ్యం తనకు ఉందని అది మనల్ని ఒప్పించ లేదు నిజమే. అయినా అది గత ప్రభుత్వం. ఇప్పుడు ఇక బీజేపీనే తాను ఏమి చేయాలని కోరుకుంటోంది, దాని బృహత్ కథనం (సమగ్ర ప్రణాళిక) ఏమిటో వివరించాల్సి ఉంది. వ్యక్తిగ తంగా నేనైతే, చిదంబరం చెప్పింది తప్పు కావాలనే కోరుకుంటాను. ఐదేళ్లలో లేదా పదేళ్లలో తాము సాధించాల్సినవి ఏమిటి? అనే విషయంపై దృష్టిని కేంద్రీ కరించి ఎన్డీఏ ఆలోచిస్తూ ఉండి ఉండాలని ఆశిస్తాను. మోదీ భావజాలంగా బీజేపీ వెబ్సైట్ పేర్కొన్న ‘హిందుత్వ’ అంటే గోవధ, ఆలయం సమస్య, లవ్ జిహాద్, వీటికి తోడుగా అడపాదడపా ఆర్థిక, విదేశాంగ విధానాలకు సంబంధించి యథాలాపంగా ఏవో చర్యలు చేపట్టడం మాత్రమే అయితే... మనం అనుకుం టున్న దానికంటే ఎక్కువ లోతైన సమస్యలో ఇరుక్కుపోయాం. ఆకార్ పటేల్ వ్యాసకర్త కాలమిస్టు, రచయిత aakar.patel@icloud.com -
పౌరుల దృష్టి మళ్లించే ఈ–దర్బార్లు ఆపండి!
అవలోకనం మన విదేశాంగ విధానపరమైన కృషిలో చాలా వరకు ప్రధాని కార్యాలయం నుంచే సాగుతోంది. దీంతో సుష్మా స్వరాజ్ ట్విటర్ ద్వారా ‘చురుగ్గా పనిచేసే’ మంత్రిగా కనిపిస్తున్నారు. ఒకటి రెండు కేసులను పరిష్కరించడం ద్వారా ఆమె నిజానికి వ్యవస్థాపరమైన మెరుగులపై నుంచి, దాని పనితీరుపై నుంచి దృష్టిని మరలిస్తున్నారు. మొగలాయిలు భారతదేశాన్ని జయించాక, అంతకు మునుపటి రాజుల రివాజైన రాజదర్శనాన్ని కొనసాగించారు. మొగల్ చక్రవర్తి పర్యటనలో ఉన్నప్పుడు తప్ప, ప్రతి రోజూ ప్రజలు తనను ‘చూడటానికి’ బాల్కనీలో నిల్చునేవాడు. ఈ దర్శనం, విగ్రహాన్ని చూడటం లాంటిదే. ఆ దర్శనం సామ్రాజ్యం పదిలంగా ఉన్నదని పౌరు లకు భరోసా కలిగించడం కోసమే. చక్రవర్తి గైర్హాజరీలో రాజ్యమంతటా వెంటనే పుకార్లు వ్యాపించి, అరాచకం నెలకొనేది. అందువల్లనే ఈ దర్శనం ముఖ్యమైనదిగా మారింది. 1627లో, జహంగీర్ చనిపోయినప్పుడు నేరస్తులు నగరాలను ఆక్రమిం చారని, వర్తకులు తమ వస్తువులను నేలలో పాతిపెట్టాల్సి వచ్చిందని జైన వర్తకుడు బనారసీదాస్ తన స్వీయ జీవిత చరిత్ర అర్థకథానక్లో రాశారు. మొగల్ రాకుమా రుడు కుర్రం వారసత్వ యుద్ధంలో నెగ్గి, షాజహాన్ పేరుతో చక్రవర్తి అయ్యాడనే వార్త దేశవ్యాప్తంగా వ్యాపించే వరకు ఈ గందరగోళం అలాగే ఉండి పోయింది. నిజానికి జహంగీర్ చక్రవర్తుల్లోకెల్లా ఎక్కువ సోమరి. అతిగా మద్యం లేదా నల్లమందు సేవించడం వల్ల సాయంత్రం దర్బారు అర్ధంతరంగా ముగుస్తుండేదని యూరోపియన్ పర్యాటకులు నమోదు చేశారు. జహంగీర్ చక్రవర్తి దర్శన కార్యక్ర మానికి న్యాయమనే కొత్త అంశాన్ని చేర్చారు. రాజప్రాసాదంలో ఒక గొలుసును వేలాడదీసి ఉంచేవారని, సమస్యలున్న సామాన్య పౌరులెవరైనా దాన్ని లాగవచ్చని చెప్పేవారు. ఆ గొలుసుకు ఓ గంట కట్టి ఉండేదని, అది మోగినప్పుడల్లా చక్రవర్తి, వ్యవస్థ నుంచి పొందలేకపోయిన న్యాయాన్ని చేయడానికి బయటకు వచ్చేవారని అంటారు. దీన్ని అదిల్ ఎ జహంగీర్ లేదా జహంగీర్ న్యాయం అనేవారు. అది పౌరులందరికీ తక్షణ న్యాయాన్ని అందించేది. అయితే ఇదంతా ఉత్త బూటకమే. చక్రవర్తులెవరికీ, ప్రత్యేకించి జహంగీర్‌కు అంతటి తీరిక ఉండేది కాదు. నేనింతకు ముందే చెప్పినట్టు అతడు సోమరి, స్వార్థపరుడు. న్యాయం చేయడంలో ఆసక్తికి అతడు ఆమడ దూరంలో ఉండటమే కాదు, మహా క్రూరుడు. ఇద్దరు వ్యక్తుల కాలి వెనుక పిక్కలను కోసేయించి, వారికి శాశ్వత వైకల్యాన్ని కల్పించిన వాడు. అడవిలో వాళ్లు చేసిన అలజడికి, జహంగీర్ తుపాకీ గురిపెట్టి చంపాలని చూస్తున్న పులి భయ పడి పారిపోయింది. అదే వాళ్లు చేసిన నేరం. తుజుక్ ఎ జహంగీరి అనే తన స్వీయ జీవిత చరిత్రలో ఈ విషయాన్ని రాసుకున్నాడు కాబట్టే ఇది మనకు తెలిసింది. కాబట్టి అదిల్ ఎ జహంగీర్ తెరచాటున భారతదేశంలో నెలకొని ఉండిన సర్వ సాధారణ పరిస్థితి అదే. అది నేటికీ కొనసాగుతోంది. పాలకులు, ప్రత్యక్ష జోక్యం ప్రదర్శనను రక్తి కట్టించడంలో ఆసక్తిని చూపవచ్చు. అంతేగానీ, ప్రపంచం లోని అత్యధిక భాగంలో జరుగుతున్నట్టుగా వ్యవస్థాగతంగా అందుతున్న సహా యానికి, సేవలకు హామీని కల్పించడంపై మాత్రం ఆసక్తిని చూపరు. సుష్మా స్వరాజ్ ట్విటర్ ఖాతా అదిల్ ఎ జహంగీర్‌కు ఆధునిక అవతారం కావడం వల్లే ఇది రాస్తున్నాను. ఆమె ట్విటర్ ఖాతా నుంచి ఇటీవల పతాక శీర్షికలకు ఎక్కిన కొన్ని ఇవి. ‘బిడ్డ అస్వస్థత గురించి సుష్వా స్వరాజ్‌కు ట్వీట్ చేసి మెడికల్ వీసాను పొందిన పాకిస్తానీ’ (జూన్ 2). ‘లాహోర్ పసి బిడ్డ గుండె ఆపరేషన్‌కు సుష్మా స్వరాజ్ ఆపన్న హస్తం’ (జూన్ 11). ‘సౌదీ అరేబియా నుంచి కర్కలా నర్సు తిరిగి వచ్చే ఆశ లను పెంచిన సుష్మా స్వరాజ్ ట్వీట్’ (జూన్ 25). రియాద్‌లోని భారత రాయబార కార్యాలయపు ట్విటర్ ఖాతాకు స్వరాజ్ పంపిన ఈ ప్రత్యేక ట్వీట్లో ఆమె, ‘‘జావెద్: ఈ మహిళను కాపాడటానికి దయచేసి సహాయం చేయండి’’ అని రాశారు. ఒక వార్తా కథనం నుంచి ఆమె ఆ మహిళను గుర్తించారు. అక్టోబర్ 27, శుక్రవారం రోజున స్వరాజ్ దుబాయ్‌లోని భారత కాన్సల్‌కు ‘‘విపుల్ – దయచేసి అతను తన తల్లి అంత్య క్రియలకు చేరుకునేలా సహాయపడండి’’ అనీ, మరెవరి ప్రయాణ పత్రాలనో భోపా ల్లోని భారత పాస్‌పోర్ట్ ఆఫీసుకు పంపమని రాశారు. ఆమె చేస్తున్న ఈ ట్వీటింగ్‌ను మీడియా క్రియాశీలమైన, సానుభూతిగల రాజ కీయవేత్త చర్యలుగా చూపుతోంది. ట్విటర్ ద్వారా ఒకటి రెండు కేసులను పరి ష్కరించడం ద్వారా ఆమె నిజానికి వ్యవస్థాపరమైన మెరుగులపై నుంచి, దాని పనితీరుపై నుంచి దృష్టిని మరలుస్తున్నారు. పౌరులు తమ సమస్యలకు పరి ష్కారం భారత విదేశాంగ మంత్రి చూపే వ్యక్తిగత శ్రద్ధ మాత్రమేనని నమ్మేలా తప్పు దోవ పట్టిస్తున్నారు. మేడమ్ ట్వీట్లపై శ్రద్ధ చూపడం కోసం దౌత్యవేత్తలు, ఉన్నతాధికారవర్గం వ్యవస్థాగతమైన తమ పనులను వదిలిపెట్టాల్సివస్తోంది. పాకిస్తాన్‌పై పొందికైన విదేశాంగ విధానమే మనకు లేదు. నేపాల్, శ్రీలంక, బంగ్లాదేశ్ లేదా మయన్మార్ విషయంలోనూ అంతే. అయితే, ఈ–దర్బార్ లేదా ఈ–దర్శన్.. వ్యవస్థకు మరమ్మతులు చేసే గొప్ప నిపుణులు ఒకరు తలమునకలై పనిచేస్తున్న భ్రమను కలిగిస్తుంది. వ్యాధిగ్రస్తురాలైన పాకిస్తానీ బిడ్డకు శస్త్ర చికిత్స! ఊబకాయమున్న ఈజిప్ట్ మహిళకు బేరియాటిక్ శస్త్రచికిత్స! ఇలాంటి వీసాలకు ఒక కేంద్ర మంత్రి జోక్యం ఎందుకవసరమౌతోంది? ఏ నాగరిక దేశమైనా ఇలా ట్విటర్ ద్వారా వీసాలకు హామీని కల్పిస్తుందా? అమెరికా లేదా బ్రిటన్లు ఇలాగే చేస్తాయా? లేదు. వాటికి అందుకు తగ్గ యంత్రాంగాలున్నాయి. మనకు దర్బార్లున్నాయి. మన మంత్రులకు చేయడానికి మరే పనీ లేదా? నాకో క్రమబద్ధమైన ఉద్యోగం ఉంది. దానితో పాటే నా రాత పనీ చూసుకుంటా. అయినా నాకు ట్విటర్ కోసం సమయం చిక్కడం లేదు. ఆమెకు ఎలా దొరుకుతోంది? మన విదేశాంగ విధానంలో చాలావరకు ప్రధాని కార్యాలయం నుంచే సాగుతోందనే మాట నిజమే. చైనా, పాకిస్తాన్, ఇజ్రాయెల్ వ్యవహారాలన్నీ జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ పరిధిలోకి వస్తాయి. భారత విదేశాంగ విధానం మన నాగరికతా విలువల ప్రాతి పదికపై సాగాలనేది నెహ్రూవాద దృష్టి. అందుకు భిన్నంగా మోదీ ప్రధానంగా రక్షణ, ఉగ్రవాద దృక్కోణం నుంచి విదేశాంగ విధానాన్ని చూస్తుండటమే అందుకు కారణం. ఈ విధంగా తన వృత్తిపరమైన బాధ్యతలలో అత్యధిక భాగాన్ని ఇతరులు హస్తగతం చేసుకోవడంతో స్వరాజ్ తాను చేయదగిన ఇతర పనులను వెతుక్కో వాల్సి వస్తోంది. ట్విటర్ వాటిలో ఒకటనేది స్పష్టమే. అది, ‘చురుగ్గా పనిచేసే’ మంత్రిగా ఆమె ప్రముఖంగా కనిపించేలా చేస్తుంది. కనీసం మీడియాలోనైనా అలా కనిపిస్తారు. కానీ అలాంటి దర్శనం అవసరమేమీ లేదని ఆమెకు చెప్పాల్సి ఉంది. అది చేసేదేమైనా ఉందంటే దర్బారీ సంస్కృతిని పెంపొందింపజేయడమే. కొందరు వ్యక్తులకు అది ఉపయోగం చేకూర్చవచ్చు, కానీ వ్యవస్థకు ప్రతిబంధకమౌతుంది. ఆకార్ పటేల్ వ్యాసకర్త కాలమిస్టు, రచయిత‘ ఈమెయిల్ : aakar.patel@icloud.com