అవలోకనం
కేంద్ర బడ్జెట్‌లో ప్రకటించిన జాతీయ ఆరోగ్య పరిరక్షణ పథకం(ఎన్‌హెచ్‌పీఎస్) ప్రశంసనీయమైనది. అద్భుతమైనది. దీని అమలుకు ఎన్నో అవాంతరాలున్నాయని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా మౌలిక సదుపాయాల లేమిని బీమా ఆధారిత పథకం పరిష్కరించలేదని అంటున్నారు. ఇది నిజమే అయినా ఈ పథకం అమలు మొదలైతే అత్యంత బలహీనుల, అభాగ్యుల ఆరోగ్య సమస్యలను ఇది వెలుగులోకి తెస్తుంది. ఆరోగ్య పరిరక్షణ అంశాన్ని జాతీయ స్థాయి చర్చగా మారుస్తుంది.
కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ ప్రవేశపెట్టిన బడ్జెట్‌కు ఆశ్చర్యకరమైన, ఊహకం దని కోణాలు కొన్ని ఉన్నాయి. అందులో మొదటిది రక్షణ వ్యయం అనుకున్నం తగా లేకపోవడం. ఇది రక్షణ నిపుణులను అసంతృప్తికి గురిచేసింది. మన దేశం ఏటా సైన్యంపై రూ. 4 లక్షల కోట్లు వ్యయం చేస్తుంది. జనాభాలో 50 కోట్ల మందికి ప్రయోజనం కలిగించదల్చుకున్న ఆరోగ్య బీమాకు ఖర్చయ్యేది రూ. 10,000 కోట్లు మాత్రమే. పింఛన్ కింద సైన్యానికిచ్చేది దీనికన్నా పది రెట్లు ఎక్కువ.
ఆ వ్యయం ఇంచుమించు లక్ష కోట్లు. ఒకే ర్యాంక్–ఒకే పింఛన్ అనేది పోస్టుమాన్, స్వీపర్ లేదా టీచర్ వంటి మరే ఇతర ప్రభుత్వోద్యోగి పొందని సౌకర్యం. రిటైరైన సైనికులు మాత్రమే ఈ పేద దేశంలో అలాంటి ప్రయోజనాలు సాధించుకోగలిగారు. రక్షణకు చేసే ఈ రూ. 4 లక్షల కోట్ల వ్యయంలో సీఆర్పీఎఫ్, ఇతర దళాలకు మన దేశం ఖర్చుచేసే రూ. 30,000 కోట్లు చేరదు. ఈ దళాలు కశ్మీర్‌లోనూ, ఈశాన్య రాష్ట్రాల్లోనూ శాశ్వత ప్రాతిపదికన రక్షణ బాధ్యతలు నిర్వ ర్తిస్తుంటాయి. సాయుధ బలగాల ప్రత్యేకాధికారాల చట్టం(ఏఎఫ్‌ఎస్‌పీఏ) కింద ఇవి కూడా ‘సాయుధ బలగాల’ నిర్వచనం కిందికొస్తాయి. ఆ చట్టం కింద రక్షణ పొందుతాయి.
నిజానికి నరేంద్ర మోదీ ప్రభుత్వం రక్షణ వ్యయాన్ని తగ్గించలేదు. ఆ వ్యయాన్ని 2014 నుంచీ ఏటా దాదాపు 6 శాతం మాత్రమే పెంచుతూ వస్తోంది. ద్రవ్యోల్బణం రేటుతో పోలిస్తే ఇది స్వల్పంగా ఎక్కువ. అంటే కాస్త హెచ్చు తగ్గులతో వాస్తవ వ్యయం ఎప్పుడూ ఒకేలా ఉంటోందన్న మాట. ఒకపక్క చైనా దూకుడుగా వ్యవహరిస్తున్న ఈ దశలో మన దేశం ఆ సవాలును ఎదుర్కొనడానికి సిద్ధపడటం లేదని నిపుణులు ఆందోళన చెందుతున్నారు. మాటలు తీవ్రంగా ఉన్నా చేతల్లో సాదాసీదాగా ఉండే మోదీ ఈ వైఖరిని నావరకైతే తెలివైనదిగానే భావిస్తాను. మనం నిరాయుధ దేశంగానో, ఒక చెంప కొడితే మరో చెంప చూపే విధంగా ఉండాలనో నేను అనడం లేదు. దేశాలు సైన్యాన్ని నిర్వహించుకోవడంపై నాకేం అభ్యంతరం లేదు.
కానీ మన భద్రతకు సంబంధించి సరైన దృష్టికోణం ఉండాలి. అందుకు తగినట్టుగా ప్రాముఖ్యతనీయాలి. సగటు భారతీయ పౌరుడు చైనా దురాక్రమణ బెడద కంటే వ్యాధుల వల్ల లేదా పేదరికం వల్ల ఎక్కువ ప్రభావితమవుతాడు. అలా చూస్తే మనం రక్షణకు చెల్లించే మూల్యం రూ. 4 లక్షల కోట్లు, రక్షణ దళాల పింఛన్ కోసం చేసే లక్ష కోట్ల వ్యయం మరీ ఎక్కువనిపిస్తుంది. ఇతర నిపుణులు ఏమైనా అనుకోవచ్చుగానీ ఇలా పరిమితి పెట్టుకోవడం లేదా చడీ చప్పుడూ లేకుండా తగ్గించడం ద్వారా మోదీ చాలా మంచి పని చేశారనిపిస్తుంది.
ఇక మోదీ కేర్‌గా అభివర్ణిస్తున్న ఆరోగ్యబీమా గురించి మాట్లాడుకుందాం. ఇది పది కోట్లమందికి బీమా సౌకర్యం కల్పిస్తుంది. ఒక్కో కుటుంబంలో అయిదు గురు ఉంటారనుకుంటే దీనివల్ల 10 కోట్లమంది ప్రజానీకం లాభపడతారని భావించవచ్చు. ఈ కుటుంబాలన్నీ ఏడాదికి గరిష్టంగా రూ. 5 లక్షల చొప్పున లబ్ధి పొందుతాయి. ఈ పథకం గురించి నిపుణులకు కొన్ని అభ్యంతరాలున్నాయి. అందులో మొదటిది– ఆ పథకానికి జైట్లీ తగినంత కేటాయింపు చేయలేదన్నదే. అందుకు కేవలం రూ. 2,000 కోట్లు మాత్రమే ఆయన కేటాయించారు. వాస్తవానికి అంతకన్నా చాలా ఎక్కువ అవుతుంది. ఒక్కో కుటుంబానికి ఏడాదికి రూ. 5 లక్షల వరకూ ఆరోగ్యబీమా కల్పించడమంటే కుటుంబంలో ఒక్కొక్కరికి రూ. 1,100– రూ. 1,400 మధ్య చికిత్స కోసం ఖర్చు చేయదల్చుకున్నట్టు. అంటే ఆ పథకానికి ఏటా దాదాపు రూ. 11,000– రూ. 14,000 కోట్ల మధ్య ఖర్చవుతుంది. రెండోది– ఇప్పుడు జైట్లీ చేసింది కేవలం ప్రకటన మాత్రమే.
ఆ పథకం గురించి, దాని అమలు గురించి విధివిధానాలు రూపొందించడానికి మరో ఆర్నెల్లు పడుతుంది. ఆ తర్వాతే పథకాన్ని అమలు చేస్తారు. ఇవన్నీ ముందు ఖరారు చేసుకుని ప్రకటించి ఉంటే బాగుండేది. మూడోది–పథకానికయ్యే వ్యయంలో సగం మొత్తాన్ని రాష్ట్ర ప్రభుత్వాలు భరిస్తాయని కేంద్రం భావిస్తోంది. ఇందుకు సంబంధించి ఇంకా రాష్ట్రాలతో మాట్లాడవలసి ఉంది. నాలుగు–ఈ తరహా పథకాలు కొన్ని రాష్ట్రాల్లో ఇప్పటికే ఉన్నాయి. అవి ప్రభావవంతంగా లేవు. అయిదు–ప్రామాణికమైన ఆస్పత్రి సదుపాయం లేకపోవడమన్నది చాలామంది ఎదుర్కొంటున్న సమస్య. దేశంలో చాలాచోట్ల మంచి వైద్య సౌకర్యాలు లేవు. మౌలిక సదుపాయాల లేమిని బీమా ఆధారిత పథకం పరిష్కరించలేదు. ఆరు– వైద్య సదుపాయాల విషయంలో మన ప్రభుత్వాసుపత్రులు ప్రపంచంలోనే అత్యంత నాసిరకమని అధ్యయనాలు చెబుతున్నాయి. ఈ ఆస్పత్రుల్లో పని ఎగ్గొట్టే తత్వం, జవాబుదారీతనం లేమి అధికం. సారాంశంలో ఇది పాలనకు సంబంధించిన సమస్య కూడా. దీన్ని ఉపే క్షించి బీమా పథకాలను రూపొందించడం బాధ్యత నుంచి తప్పించుకోవడమే అవుతుంది.
ఈ అభ్యంతరాలు పరిగణనలోకి తీసుకోదగ్గవే. పరిష్కరించవలసినవే. అయినా ఈ ఆరోగ్య పథకం అద్భుతమైనదే. ఇప్పటికిది ప్రకటన మాత్రమే అయినా ఏదో దశలో ప్రభుత్వం వ్యయం చేయకతప్పనిది. ఈ పథకం దేశంలో అత్యంత బలహీనుల, అభాగ్యుల ఆరోగ్య సమస్యలను వెలుగులోకి తెస్తుంది. ఆరోగ్య పరిరక్షణను జాతీయ స్థాయి చర్చలోకి తెస్తుంది. రక్షణ, ఒకే ర్యాంక్–ఒకే పింఛన్ వంటి అంశాల్లా ఇన్నాళ్లూ ఇది చర్చకు రాలేదు. ప్రజల నుంచి ఒత్తిడి ఉన్నంతకాలం ఈ పథకానికి అవసరమైన నిధులు లభిస్తాయి. ఆ నిధులు వచ్చాక పేద రోగులు సౌకర్యాల కోసం డిమాండు చేయడం ప్రారంభిస్తారు. రూ. 5 లక్షల పరిమితి సరిపోతుందా లేదా అన్నది కూడా చూడాల్సి ఉంది.
ఈ కారణాలన్ని టివల్లా ఈ నిర్ణయం అద్భుతమైనదని నేననుకుంటున్నాను. మోదీ తన రాజకీయ జీవితంలో అవలంబిస్తూ వచ్చిన మెజారిటీ మతతత్వ విధానాలపై నాకు ప్రేమ గానీ, సానుభూతిగానీ లేవు. ఆయన ఏలుబడిలో జరిగినవి అత్యంత భయానకమై నవి, భీతిగొలిపేవి. అయితే మంచి చేసినప్పుడు ప్రశంసించడానికి అవి అడ్డు రాకూడదు. ఈ ఆరోగ్యపథకం జాతీయ స్థాయి సంభాషణను మార్చేసింది. అందుకే దీనికి మద్దతునివ్వాల్సిన అవసరం ఉంది.
- ఆకార్ పటేల్
వ్యాసకర్త కాలమిస్టు, రచయిత ‘ aakar.patel@icloud.com
Comments
Please login to add a commentAdd a comment