అభిప్రాయం
బడ్జెట్ అంటే కేవలం ఆదాయ వ్యయాల సమాహారం కాదు. దేశ ప్రగతికి, ప్రజల సమస్యలకు దర్పణం పట్టే ఒక దిక్సూచి. బడ్జెట్ ప్రవేశపెడుతున్నప్పుడు రైతులు, వేతన జీవులు, సామాన్యులు, పేదలు, పెట్టుబడి దారులు, యువత, మహిళలు వంటి వివిధ వర్గాలు ప్రభావితం అవుతాయి. మోదీ సర్కార్ కేంద్రంలో మూడోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత 48 లక్షల కోట్ల రూపాయలతో ఉపాధి కల్పనకు అగ్ర తాంబూలం ఇస్తూ... రైతులు, మహిళలు, పేదలు, యువత లక్ష్యంగా 9 అంశాలకు ప్రాధాన్య మిస్తూ పూర్తిస్థాయి బడ్జెట్‌ను 2024–25 ఆర్థిక సంవత్సరానికి గాను ప్రవేశ పెట్టింది. ఫిబ్రవరిలో 2025–26 బడ్జెట్‌ను ఆర్థిక మంత్రి ప్రవేశపెట్టబోతున్నారు. ఈ బడ్జెట్‌పై ప్రజలు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు.
నిరుద్యోగం, ద్రవ్యోల్బణం, రూపాయి పతనం, ఆశాజనకంగా లేని వృద్ధిరేటు, రైతాంగ సమస్యలు దేశ ఆర్థిక వ్యవస్థకు సవాళ్లుగా నిలుస్తున్న నేపథ్యంలో విత్త మంత్రి నిర్మలా సీతారామన్ ఈ సవాళ్లను అధిగమించడానికి బడ్జెట్‌లో ఏ ప్రతిపాదనలు చేయబోతున్నారనే దానిపై ఆసక్తి నెలకొన్నది. 2024– 25 బడ్జెట్‌లో నిర్దేశించుకున్న తొమ్మిది అత్యంత ప్రాధాన్యత కల అంశాలలో ఉద్యోగ కల్పన, నైపుణ్య శిక్షణ ప్రధానమైనవి. ఉద్యోగాల కల్పన కోసం మూడు, నైపుణ్యాల అభివృద్ధి కోసం రెండు ప్రోత్సాహక పథకాలను ప్రకటించారు. రాబోయే ఐదేళ్లలో 4.1 కోట్ల మంది యువతకు ప్రయోజనం కలిగేలా రెండు లక్షల కోట్ల రూపాయలు ఖర్చు చేయాలని నిర్ణయించారు.
కొత్తగా ఉద్యోగాలు ఇచ్చే సంస్థలకు అనేక ప్రోత్సాహకాలను నిరుటి బడ్జెట్‌లో ప్రకటించారు. యువత సులభంగా ఉద్యోగాలను సాధించటానికి ‘ఇంటర్న్ షిప్’ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. అయితే ‘మోడల్ స్కిల్ లోన్ స్కీం’ కింద యువతకు రుణాలు, ‘ముద్ర’ రుణాల పెంపు లాంటి చర్యలు ఉపాధి – ఉద్యోగాల కల్పనకు పెద్దగా దోహదపడలేదనే చెప్పాలి. ఉద్యోగ ఉపాధి కల్పనలో ప్రభుత్వం చేపట్టిన చర్యలు సత్ఫలితాలు ఇవ్వక పోవడం వలన దేశంలో గడిచిన సంవత్సరంలో నిరుద్యోగితా రేటు ఏడు శాతం నుండి 9.2 శాతానికి పెరిగిందని ‘సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమీ’ సంస్థ అంచనా వేసింది.
రైతాంగం కూడా బడ్జెట్‌పై పెద్దగానే ఆశలు పెట్టుకుంది. గత కొంత కాలంగా కనీస మద్దతు ధరలకు చట్టబద్ధత కల్పించాలని ‘సంయుక్త కిసాన్ మోర్చా’ ఆధ్వర్యంలో రైతాంగం ఉద్యమిస్తోంది. కాబట్టి ఎమ్‌ఎస్‌పీకి చట్టబద్ధత కల్పించే విషయం, ‘ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ యోజన’ కింద రైతుకి పెట్టుబడి సహాయం 6,000 నుండి 10,000 రూపాయలకు పెంపు నిర్ణయాలు ఈ బడ్జెట్‌లో తీసుకుంటారని రైతాంగం ఆశిస్తోంది. ఆదాయ పన్ను పరిమితి పెంపు, 80(సి) కింద రాయితీల పరిమితిని పెంచా లని వేతన జీవులు కోరుకుంటున్నారు.
ద్రవ్య లోటు అదుపులో ఉన్నదని చెప్తున్నా ఆహార ద్రవ్యోల్బణం పెరగటం, ఫాస్ట్ మూవింగ్ కన్జ్యూమర్ గూడ్స్ ధరలు పెరగటం సామాన్యులను ఇబ్బందులకు గురి చేస్తున్న సందర్భంలో ద్రవ్యోల్బణం, రూపాయి విలువ పత నాన్ని నియంత్రణ చేసే చర్యలు చేపట్టాలని అన్ని వర్గాల ప్రజలూ కోరుకుంటున్నారు. ‘ఆత్మ నిర్భర భారత్’, ‘సబ్ కా సాథ్ సబ్ కా వికాస్’, ‘వికసిత్ భారత్’ లాంటి భవిష్యత్తు లక్ష్యాలను సాధించేందుకు దోహదం చేసేలా 2025–26 బడ్జెట్ ఉంటుందని ఆశిద్దాం.
డా‘‘ తిరుణహరి శేషు
వ్యాసకర్త కాకతీయ విశ్వవిద్యాలయం అసిస్టెంట్ ప్రొఫెసర్
మొబైల్: 98854 65877
Comments
Please login to add a commentAdd a comment