ఎక్కువ ఉద్యోగాలు... తక్కువ పన్ను | Sakshi Guest Column On More jobs Low Taxes | Sakshi
Sakshi News home page

ఎక్కువ ఉద్యోగాలు... తక్కువ పన్ను

Published Sat, Jan 4 2025 12:06 AM | Last Updated on Sat, Jan 4 2025 4:42 PM

Sakshi Guest Column On More jobs Low Taxes

విశ్లేషణ

భారత ఆర్థిక సవాళ్లను అధిగమించే మూడు ఐడియాలు
ప్రతి ఆర్థిక సంవత్సరంలో ఉద్యోగుల సంఖ్యను పెంచుతూ పోయే కంపెనీలకు రాయితీలు ఇవ్వాలి. ‘ఎక్కువమందిని నియ మించండి... తక్కువ పన్ను చెల్లించండి’ అన్నది విధానం కావాలి.

⇒ ప్రాథమిక విద్య నాణ్యత పెంచాలి. నాణ్యమైన విద్యమీద పెట్టుబడి పెట్టాలి. ప్రభుత్వం తన పెట్టుబడి వ్యయం రెట్టింపు చేయదగిన రంగం ఇది తప్ప మరొకటి ఉండదు.

⇒ నైపుణ్య శిక్షణ ద్వారా కోట్లమంది జీవితాలను మార్చవచ్చు. పాఠశాలల్లో మరీ ముఖ్యంగా పేదపిల్లలు చదువుకొనే ప్రభుత్వ పాఠశాలల్లో నైపుణ్య శిక్షణను ఒక ప్రధానాంశం చేయాలి.

భారత ఆర్థిక వ్యవస్థ మందగించింది. వృద్ధి రేటు రెండేళ్ల కనిష్ట స్థాయికి పడింది. మహ మ్మారి అనంతరం మనం చూసిన ఎకనామిక్‌ రికవరీ ఇక ముగిసినట్లే అనడానికి ఇది స్పష్టమైన సంకేతం. కోవిడ్‌ అనంతరం పరిస్థితి మెరుగుపడింది; వృద్ధి రేటు గణాంకాలు ఉత్తేజకరంగా నమోదు అయ్యాయని చాలా మంది సంబరపడ్డారు. 

నిజానికి ఇదో ‘కె – షేప్డ్‌’ రికవరీ అన్న వాస్తవాన్ని వారు విస్మరించారు. ఆర్థిక వ్యవస్థ దెబ్బ తిని తిరిగి కోలుకునే సమయంలో ఆ కోలుకోవటం ఒక్కో ప్రాంతంలో, ఒక్కో వర్గంలో ఒక్కో రకంగా ఉంటుంది. ధనికులు మరింత ధనవంతులవుతారు. కానీ పేద ప్రజలు అలాగే ఉంటారు లేదంటే ఇంకా కుంగిపోతారు. ఆంగ్ల అక్షరం ‘కె’లో గీతల మాదిరిగానే ఈ రికవరీ ఉంటుంది.

కొత్త కేంద్ర బడ్జెట్‌ రాబోతోంది. తన రాబడి పెంచుకోడానికి వీలుగా గత బడ్జెట్‌లో ప్రభుత్వం క్యాపిటల్‌ గెయిన్స్‌ మీద పన్నులు పెంచింది. స్టాక్‌ మార్కెట్‌ జోరు మీద ఉండటంతో ఇన్వెస్టర్లు దీన్ని అంతగా పట్టించుకోలేదు. అయితే ప్రాపర్టీ విక్రయాల మీద క్యాపిటల్‌ గెయిన్స్‌ పన్ను విధింపు విధానంలో చేసిన మార్పులపై వ్యతిరేకత పెల్లుబికింది. దీంతో ప్రభుత్వం వెనుకడుగు వేసింది.  

ఉద్యోగాలు లేవని, వేతనాలు తక్కువగా ఉన్నాయని పేద ప్రజలు విలవిల్లాడుతున్నారు. ధనికులు కూడా అధిక పన్నుల పట్ల గుర్రుగా ఉన్నారు. నరేంద్ర మోదీ ప్రభుత్వానికి ఇదొక సంకట స్థితి. వృద్ధిరేటు పెరగాలంటే పట్టణాల్లో వినియోగాన్ని పెంచాలి. అలాచేస్తే ఆహార ధరలు రెక్కలు విప్పుకుంటాయి. ద్రవ్యోల్బణం పేదలకు అశనిపాతం అవుతుంది. ప్రభుత్వానికి ఇది కత్తిమీద సాము. 

ఫిబ్రవరిలో ప్రవేశపెట్టే కొత్త బడ్జెట్‌ ఆనవాయితీకి భిన్నంగా ఉండాలి. భారత ఆర్థిక వ్యవస్థ ఇప్పుడు నాలుగు రోడ్ల కూడలిలో ఉంది. ఒకటి మాత్రం వాస్తవం. ‘ఇంక్రిమెంటల్‌ కంటిన్యూటీ’కి అవకాశం లేదు. అంటే అదనపు వ్యయాలు, అదనపు రాబడులు దృష్టిలో ఉంచుకొని నిర్ణయాలు తీసుకోవడం కుదరదు. 

ఇంక్రిమెంటల్‌ ప్రిన్సిపుల్‌ అంటే వ్యయం పెంచే ఏ నిర్ణయం అయినా అంత కంటే ఎక్కువ ఆదాయం సమకూర్చాలి. ఈ దఫా నిర్ణయాలకు దీన్ని వర్తింప చేయడం కష్టం. కాబట్టి బడ్జెట్‌ నిర్ణయాలు జన జీవితాల్లో సమూల మార్పులు తెచ్చేవిగా ఉండాలి. ఈ దిశగా ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌కు మూడు ఐడియాలను ఇస్తాను. 

ఉద్యోగాలు కల్పిస్తే ప్రోత్సాహకాలు
పారిశ్రామిక రంగం చేస్తున్న దీర్ఘకాలిక డిమాండుకు తలొగ్గి, 2019 బడ్జెట్లో కార్పొరేట్‌ పన్నును 30 నుంచి 25 శాతానికి తగ్గించారు. కార్పొరేట్‌ సంస్థలు ఈ ప్రోత్సాహకంతో మిగిలే నిధులతో కొత్త పెట్టుబడులను పెంచుతాయన్నది దీని ఉద్దేశం. అయితే జరిగిందేమిటి? పరిశ్రమలు తమ పన్ను తగ్గింపు లాభాలను బయటకు తీయలేదు. 

కొత్త పెట్టుబడులు పెట్టలేదు. సిబ్బంది వేతనాలు పెంచలేదు. పెట్టుబడులు పెట్టకపోవడానికి డిమాండ్‌ లేదన్న సాకు చూపించాయి. రెండోదానికి అవి చెప్పకపోయినా కారణం మనకు తెలుసు. చవకగా మానవ వనరులు దొరుకుతున్నప్పుడు కంపెనీల వారు వేతనాలు ఎందుకు పెంచుతారు? 

ఎగువ మధ్యతరగతి ప్రజలు అప్పటికే 30 శాతం పన్ను చెల్లిస్తున్నారు. అలాంటప్పుడు కార్పొరేట్‌ సంస్థల పన్నురేటు 25 శాతానికి తగ్గించటం అన్యాయం. ఈ సారి బడ్డెట్లో కంపెనీల గరిష్ట పన్నురేటు ఇంకా తగ్గించే సాహసం ఆర్థిక మంత్రి చేయలేరు. పేద ప్రజల నుంచి వ్యతిరేకత వెల్లువెత్తుతుందనే భయం ఉంటుంది. 

కార్పొరేట్‌ పన్ను రేట్లను అన్నిటికీ ఒకేమాదిరిగా కాకుండా వాటిలో మార్పులు చేర్పులు చేయవచ్చు. ప్రతి ఆర్థిక సంవత్సరంలో ఉద్యోగుల సంఖ్యను పెంచుతూ పోయే కంపెనీలకు రాయితీలు ఇవ్వాలి. ఎక్కువ మందిని నియమించండి... తక్కువ పన్ను చెల్లించండి అన్నది విధానం కావాలి. వస్తూత్పత్తిని పెంచే విధంగా ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహకాలు కల్పిస్తున్నప్పుడు, అదే తరహాలో జాబ్‌ క్రియేషన్‌ లింక్డ్‌ ఇన్సెంటివ్స్‌ మాత్రం ఎందుకు ఉండకూడదు? 

విద్యానాణ్యతతోనే దేశ పురోభివృద్ధి నాణ్యమైన విద్యమీద కూడా ఇన్వెస్ట్‌ చేయాలి. ముఖ్యంగా ప్రాథమిక విద్య నాణ్యత పెంచాలి. ప్రభుత్వం తన పెట్టుబడి వ్యయం రెట్టింపు చేయదగిన రంగం ఇది తప్ప మరొకటి ఉండదు. దీన్ని ఓ డబ్బు సమస్యగా చూడకూడదు. విధానపరమైన సమస్య గానూ పరిగణించకూడదు. పేద పిల్లలు చదువుకునే ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలన్నింటిలోను విద్యానాణ్యత లోపించడం దేశ పురో భివృద్ధికి ఒక ప్రధాన అవరోధం. 

భారత్‌ సామర్థ్యం దిగువ స్థాయి ఉత్పత్తిలో కాకుండా సేవల రంగంలోనే ఉందని రఘురామ్‌ రాజన్‌ వంటి ఆర్థికవేత్తలు అభిప్రాయపడుతున్నారు. ప్రభుత్వం ఉద్యోగాల కల్పనను ముఖ్య అంశంగా భావించినట్లయితే, సేవల రంగాన్ని ప్రోత్సహించడానికి తానేం చేయగలదో ప్రశ్నించుకోవాలి. దీనికి సమాధానం నాణ్యమైన విద్య అందించడమే. 

అయితే ఎలా? పేద పిల్లల కోసం బళ్లు పెట్టే ప్రైవేట్‌ విద్యా వ్యాపారవేత్తలకు ప్రోత్సాహకాలు అందించటం ఇందుకు ఒక సులభ మార్గం. ప్రాథమిక పాఠశాల విద్యార్థి వాస్తవంగా ఎంత నేర్చుకుంటు న్నాడో తెలుసుకునేందుకు అఖిల భారత స్థాయిలో కేంద్ర ప్రభుత్వం ఒక స్వచ్ఛంద పరీక్షను ప్రవేశపెట్టాలి. 

ఈ ఫలితాల ఆధారంగా స్కూళ్లకు రేటింగ్‌ ఇవ్వాలి. దీనివల్ల తల్లిదండ్రులకు ఏ స్కూలు ఎంత మంచిదో తెలుసుకునే వీలు కలుగుతుంది. అలాగే నాణ్యమైన బోధన మీద పెట్టుబడి పెట్టే పాఠశాలలకు ప్రోత్సా హకాలు ఇవ్వడానికి ఈ టెస్ట్‌ ఉపయోగపడుతుంది. 

నైపుణ్యాలపై పెట్టుబడి 
నైపుణ్య శిక్షణ (స్కిల్‌ ట్రైనింగ్‌) ద్వారా కోట్లమంది జీవితాలను సమూలంగా మార్చేసే వీలుంది. ఈ దిశగా భారత్‌ ప్రయత్నాలు ఇప్పటికీ ప్రారంభం కాలేదని చెప్పాలి. పేదపిల్లలు చదువుకొనే ప్రభుత్వ పాఠశాలల్లో నైపుణ్య శిక్షణను ఒక ప్రధానాంశం చేసినపుడు మాత్రమే ప్రభుత్వం ఈ దిశగా ముందడుగు వేయగలదు. మౌలిక సదుపాయాలపై చేసే వ్యయాన్ని కేవలం 10 శాతం తగ్గిండం ద్వారా అపారమైన నిధులు అందుబాటులోకి వస్తాయి. 

వీటిని ఉద్యోగాలకు ఉపయోగపడే విద్య మీద పెట్టుబడి పెట్టి భారీ సంఖ్యలో ఉద్యోగా లను సృష్టించవచ్చు. వైద్య కళాశాలలతో పాటు కొత్త నర్సింగ్‌ కళా శాలలను విరివిగా పెట్టాలి. ఫార్మసిస్టులు, మెడికల్‌ టెక్నీషియన్లు పెద్ద సంఖ్యలో తయారయ్యే విధంగా విద్యాసంస్థలు ప్రారంభం కావాలి. తద్వారా దేశీయంగాను, అంతర్జాతీయంగాను వైద్యసిబ్బంది కొరతను భారత్‌ పూడ్చగలదు. 

మానవ వనరులపై పెట్టుబడితో – ప్లంబర్ల నుంచి డాక్టర్ల వరకు – ప్రపంచానికి పనికొచ్చే భారతీయ ఉద్యోగుల సంఖ్య విశేషంగా పెరుగుతుంది. వారి నుంచి దేశంలోకి ఇబ్బడిముబ్బడిగా నిధులు ప్రవహిస్తాయి. దేశంలో నిరుద్యోగ సమస్య తగ్గడానికి వీలవుతుంది. ఈ ఐడియాలతోనే అన్ని సమస్యలూ పరిష్కారం అవుతాయా? కావు. 

భారత్‌ ఆర్థిక వ్యవస్థకు ఒక ‘న్యూ డీల్‌’ కావాలి. (1929 నాటి మహా మాంద్యం నుంచి దేశాన్ని కాపాడేందుకు 1933–38 కాలంలో అప్పటి అమెరికా అధ్యక్షుడు రూజ్వెల్ట్‌ న్యూడీల్‌ పేరిట శరపరంపరగా అనేక కార్యక్రమాలు, సంస్కరణలు చర్యలు చేపట్టారు.)

శివమ్‌ విజ్‌ 
వ్యాసకర్త జర్నలిస్ట్, రాజకీయాంశాల వ్యాఖ్యాత
(‘గల్ఫ్‌ న్యూస్‌’ సౌజన్యంతో)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement