
రాబోయే 2025-26 బడ్జెట్‌లో ( 2025-26 Budget ) కేంద్ర ప్రభుత్వం ( Govt ) భారీ శుభవార్త చెప్పబోతోంది. మధ్యతరగతి ప్రజలకు ఉపశమనం కలిగించేందుకు రూ. 15 లక్షల వరకు వార్షిక సంపాదనపై ఆదాయపు పన్నును ( Income Tax ) తగ్గించే అవకాశం ఉందని రెండు ప్రభుత్వ వర్గాలను ఉటంకిస్తూ రాయిటర్స్ నివేదిక పేర్కొంది. వృద్ధి మందగమనం మధ్య ఆర్థిక వ్యవస్థలో వినియోగాన్ని పెంచడం లక్ష్యంగా ప్రభుత్వం ఈ చర్య తీసుకోనున్నట్లు వివరించింది.
పౌరులపై భారాన్ని తగ్గించేందుకు ఆదాయపు పన్ను రేట్లను తగ్గించాలని ప్రముఖ ఆర్థికవేత్తలు కూడా ప్రధాని నరేంద్ర మోదీని ( Narendra Modi ) కోరారు. రాబోయే బడ్జెట్‌పై వారి అభిప్రాయాలు సూచనలను వినడానికి నీతి ఆయోగ్‌లో ( NITI Aayog ) ప్రఖ్యాత ఆర్థికవేత్తలు, వివిధ రంగాల నిపుణులతో ప్రధాని మోదీ ఇటీవల సమావేశమయ్యారు. ఈ సమావేశంలో ఆదాయపు పన్నును తగ్గించాలని, కస్టమ్స్ టారిఫ్‌లను హేతుబద్ధీకరించాలని, రాబోయే బడ్జెట్‌లో ఎగుమతులకు మద్దతు ఇచ్చే చర్యలను ప్రవేశపెట్టాలని ఆర్థికవేత్తలు, నిపుణులు ప్రభుత్వాన్ని కోరినట్లు సమాచారం.
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ( Nirmala Sitharaman ) 2025-26 సంవత్సరానికి బడ్జెట్‌ను 2025 ఫిబ్రవరి 1న లోక్‌సభలో ప్రవేశపెట్టనున్నారు. కాగా గత జులైలో 2024-25 బడ్జెట్ సందర్భంగా ఆదాయపు పన్ను చట్టంపై సమగ్ర సమీక్షను ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఆదాయపు పన్ను శాఖ చీఫ్ కమిషనర్ వీకే గుప్తా నేతృత్వంలో సమీక్ష కమిటీని ఏర్పాటు చేశారు. 2025-26 బడ్జెట్‌కు ముందు ప్యానెల్ తన నివేదికను సమర్పించాల్సి ఉంది.
అయితే కొత్త ఐటీ చట్టం రాబోయే బడ్జెట్ సెషన్‌లో ఉండదని, ఇది అమలులోకి రావడానికి ఏడాదికిపైగా సమయం పడుతుందని మనీ కంట్రోల్ రిపోర్ట్ పేర్కొంది. ‘మార్పులకు అనుగుణంగా వ్యవస్థలు మారాలి. ఇది పూర్తిగా కొత్త చట్టం కాబట్టి, చాలా క్లిష్టంగా ఉంటుంది. అన్ని నియమాలు కొత్త ఫారమ్‌లను ప్రారంభించాలి. పరీక్షించాలి.. సిస్టమ్-ఇంటిగ్రేట్ చేయాలి దీనికి సమయం కావాలి’ అని సీనియర్ ప్రభుత్వ అధికారిని ఉటంకిస్తూ నివేదించింది.