New budget
-
Budget 2025: వ్యక్తిగత ఆదాయపన్ను తగ్గింపు!
న్యూఢిల్లీ: రానున్న కేంద్ర బడ్జెట్లో (Budget 2025) మూలధన వ్యయాలు, పన్ను చట్టాల సరళతరం, వ్యక్తిగత ఆదాయపన్ను (income taxe) తగ్గింపు ప్రతిపాదనలకు చోటు కల్పించొచ్చని ఈవై ఇండియా అంచనా వేసింది. ముఖ్యంగా తక్కువ ఆదాయ వర్గాలకు పన్నుల ఉపశమనం తప్పనిసరి అని పేర్కొంది.2025–26 ఆర్థిక సంవత్సరం బడ్జెట్‌ను వచ్చే నెల 1న పార్లమెంట్లో ప్రవేశపెట్టనుండడం తెలిసిందే. దీంతో బడ్జెట్ అంచనాలతో ఈవై ఇండియా ఒక నోట్‌ను విడుదల చేసింది. 2023–24 ఆర్థిక సంవత్సరం చివరి నాటికి రూ.31 లక్షల కోట్ల మేర ఆదాయపన్ను వివాదాల రూపంలో చిక్కుకుపోయినట్టు చెప్పింది. ఆదాయపన్ను కమిషనర్ (అప్పీళ్లు) సత్వరమే వీటిని పరిష్కరించాలని, ప్రత్యామ్నాయ పరిష్కార యంత్రాంగాలను తీసుకురావాలని సూచించింది.‘‘ప్రత్యక్ష పన్నుల కోడ్ సమగ్ర సమీక్షకు సమయం తీసుకోవచ్చు. కాకపోతే ఈ దిశగా ఆరంభ నిర్ణయాలకు బడ్జెట్లో చోటు ఉండొచ్చు. వ్యక్తిగత ఆదాయపన్నును సైతం తగ్గించొచ్చు. తక్కువ ఆదాయ వర్గాలకు ఉపశమనంతోపాటు డిమాండ్‌కు ఊతం ఇచ్చేందుకు వీలుగా చర్యలు ఉండొచ్చు’’అని ఈవై ఇండియా నేషనల్ ట్యాక్స్ లీడర్ సమీర్ గుప్తా తెలిపారు.ఆర్థిక వ్యవస్థను ముందుకు నడిపించే విధంగా వ్యూహాత్మక సంస్కరణలపై బడ్జెట్లో దృష్టి సారించొచ్చన్నారు. ద్రవ్య స్థిరీకరణకు ప్రాధాన్యం ఇవ్వడం ద్వారా స్థిరమైన ఆర్థిక వృద్ధికి తగిన నిర్మాణాత్మక చర్యలు ఉండొచ్చన్నారు.పన్ను చెల్లింపుదారులకు మెరుగైన సేవలు.. ముఖ్యంగా పన్నుల విధానాన్ని సులభంగా మార్చడం, కస్టమర్ల సేవలను మెరుగుపరచడం, వివాదాలను తగ్గించడం, పన్ను నిబంధనల అమలును పెంచడం దిశగా ప్రభుత్వం చర్యలు ప్రకటించొచ్చని ఈవై ఇండియా అంచనా వేస్తోంది. పన్ను చట్టాల సులభీకరణ కోసం ప్రభుత్వం ఇప్పటికే ప్రజల నుంచి సూచనలను ఆహ్వానించిన విషయాన్ని గుర్తు చేసింది.ప్రైవేటు రంగ పెట్టుబడులను ప్రోత్సహించడం, వ్యాపార ఆవిష్కరణలను ప్రోత్సహించడంపై కీలకంగా దృష్టి సారించాలని పేర్కొంది. గత బడ్జెట్లో కేంద్ర ప్రభుత్వం మూలధన లాభాల విధానాన్ని హేతుబద్దీకరించడానికి ప్రాధాన్యం ఇచ్చినట్టు చెబుతూ.. ఈ దిశగా మరిన్ని చర్యలు రాబోయే బడ్జెట్లో ఉండొచ్చని తెలిపింది. ముఖ్యంగా ఎస్ఎంఈలకు పన్నుల సంక్లిష్టతను తగ్గించడం ఎంతో అవసరమని అభిప్రాయపడింది. -
వచ్చే బడ్జెట్లో భారీ శుభవార్త! ట్యాక్స్ తగ్గుతుందా?
రాబోయే 2025-26 బడ్జెట్లో ( 2025-26 Budget ) కేంద్ర ప్రభుత్వం ( Govt ) భారీ శుభవార్త చెప్పబోతోంది. మధ్యతరగతి ప్రజలకు ఉపశమనం కలిగించేందుకు రూ. 15 లక్షల వరకు వార్షిక సంపాదనపై ఆదాయపు పన్నును ( Income Tax ) తగ్గించే అవకాశం ఉందని రెండు ప్రభుత్వ వర్గాలను ఉటంకిస్తూ రాయిటర్స్ నివేదిక పేర్కొంది. వృద్ధి మందగమనం మధ్య ఆర్థిక వ్యవస్థలో వినియోగాన్ని పెంచడం లక్ష్యంగా ప్రభుత్వం ఈ చర్య తీసుకోనున్నట్లు వివరించింది.పౌరులపై భారాన్ని తగ్గించేందుకు ఆదాయపు పన్ను రేట్లను తగ్గించాలని ప్రముఖ ఆర్థికవేత్తలు కూడా ప్రధాని నరేంద్ర మోదీని ( Narendra Modi ) కోరారు. రాబోయే బడ్జెట్‌పై వారి అభిప్రాయాలు సూచనలను వినడానికి నీతి ఆయోగ్‌లో ( NITI Aayog ) ప్రఖ్యాత ఆర్థికవేత్తలు, వివిధ రంగాల నిపుణులతో ప్రధాని మోదీ ఇటీవల సమావేశమయ్యారు. ఈ సమావేశంలో ఆదాయపు పన్నును తగ్గించాలని, కస్టమ్స్ టారిఫ్‌లను హేతుబద్ధీకరించాలని, రాబోయే బడ్జెట్లో ఎగుమతులకు మద్దతు ఇచ్చే చర్యలను ప్రవేశపెట్టాలని ఆర్థికవేత్తలు, నిపుణులు ప్రభుత్వాన్ని కోరినట్లు సమాచారం.కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ( Nirmala Sitharaman ) 2025-26 సంవత్సరానికి బడ్జెట్‌ను 2025 ఫిబ్రవరి 1న లోక్‌సభలో ప్రవేశపెట్టనున్నారు. కాగా గత జులైలో 2024-25 బడ్జెట్ సందర్భంగా ఆదాయపు పన్ను చట్టంపై సమగ్ర సమీక్షను ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఆదాయపు పన్ను శాఖ చీఫ్ కమిషనర్ వీకే గుప్తా నేతృత్వంలో సమీక్ష కమిటీని ఏర్పాటు చేశారు. 2025-26 బడ్జెట్‌కు ముందు ప్యానెల్ తన నివేదికను సమర్పించాల్సి ఉంది.అయితే కొత్త ఐటీ చట్టం రాబోయే బడ్జెట్ సెషన్లో ఉండదని, ఇది అమలులోకి రావడానికి ఏడాదికిపైగా సమయం పడుతుందని మనీ కంట్రోల్ రిపోర్ట్ పేర్కొంది. ‘మార్పులకు అనుగుణంగా వ్యవస్థలు మారాలి. ఇది పూర్తిగా కొత్త చట్టం కాబట్టి, చాలా క్లిష్టంగా ఉంటుంది. అన్ని నియమాలు కొత్త ఫారమ్‌లను ప్రారంభించాలి. పరీక్షించాలి.. సిస్టమ్-ఇంటిగ్రేట్ చేయాలి దీనికి సమయం కావాలి’ అని సీనియర్ ప్రభుత్వ అధికారిని ఉటంకిస్తూ నివేదించింది. -
కొత్త బడ్జెట్‌కు ముందు కీలక డాక్యుమెంట్
కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ (Finance Minister Nirmala Sitharaman ) ఫిబ్రవరి 1వ తేదీన లోక్‌సభలో 2025–26 వార్షిక బడ్జెట్‌ను (Budget 2025) ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో ఆర్థికశాఖ (Finance Ministry) కీలక డాక్యుమెంటును ఆవిష్కరించింది. బడ్జెట్ లక్ష్యాలను ఈ డాక్యుమెంట్లో సూచించింది. 4.5 శాతం వద్ద ద్రవ్యలోటు ( fiscal deficit) కట్టడి, పేదల అవసరాలకు అనుగుణంగా సామాజిక భద్రతా చర్యలకు పెద్దపీట వేయడం.. ఇందులో కీలక అంశాలుగా ఉన్నాయి.వచ్చే రెండేళ్లు భారత్ వృద్ధి 6.5 శాతం భారత్ ఆర్థిక వ్యవస్థ ప్రస్తుత (2024–25) వచ్చే ఆర్థిక సంవత్సరంలో (2025–26) 6.5 శాతం వృద్ధి చెందే అవకాశం ఉందని సేవల దిగ్గజ సంస్థ– ఎర్నెస్ట్ అండ్ యంగ్ (ఈవై) నివేదిక పేర్కొంది. ప్రైవేట్ వినియోగ వ్యయం, అలాగే మూలధన వ్యయాలు అంచనాలకన్నా తగ్గడం వృద్ధికి బ్రేకులు వేస్తున్న అంశంగా ఈవై వివరించింది. ఈ కారణంగానే సెప్టెంబర్ త్రైమాసికంలో వృద్ధి రేటు ఏడు త్రైమాసికాల కనిష్ట స్థాయిలో 5.4 శాతంగా నమోదయ్యిందని విశ్లేషించింది.ప్రపంచ పరిస్థితులు అనిశ్చితంగా ఉండటం, ప్రపంచ వాణిజ్య పరిస్థితుల వంటి అంశాల నేపథ్యంలో దేశీయ డిమాండ్, సేవల ఎగుమతులపై భారత్ ఎక్కువగా ఆధారపడవలసి ఉంటుందని ఈవై పేర్కొంది. రోడ్లు, స్మార్ట్ సిటీలు, రైల్వేలు, విద్యుత్, పునరుత్పాదక ఇంధనంసహా ప్రాధాన్యతా రంగాల పురోగతికి 2030 వరకు వర్తించే తాజా నేషనల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పైప్‌లైన్ (ఎన్ఐపీ) ఆవిష్కరణ అవసరమని పేర్కొంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మొత్తం అప్పులు స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ)లో 60 శాతానికి మించకూడదని పేర్కొన్న ఈవై, ఈ 60 శాతం భారం కేంద్రం, రాష్ట్రాలపై సమానంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించింది. -
పన్ను రేట్లు తగ్గించాలి.. వచ్చే బడ్జెట్‌పై కోర్కెల చిట్టా
న్యూఢిల్లీ: వచ్చే ఆర్థిక సంవత్సర బడ్జెట్‌కి సంబంధించి కేంద్రానికి కార్పొరేట్లు తమ వినతులను అందజేశారు. కస్టమ్స్‌కి సంబంధించి వన్–టైమ్ సెటిల్మెంట్ రూపంలో గత బాకీలను చెల్లించేసేందుకు ఆమ్నెస్టీ పథకాన్ని ప్రకటించాలని పరిశ్రమల సమాఖ్యలు ఫిక్కీ, అసోచాం కోరాయి.బాకీ పరిమాణాన్ని బట్టి పాక్షికంగా సుంకాలను తగ్గించడం లేదా వడ్డీ అలాగే పెనాల్టీని పూర్తిగా మినహాయించడం రూపంలో ఊరటనివ్వొచ్చని పేర్కొన్నాయి. దీనితో పరిశ్రమపై లిటిగేషన్ల భారం తగ్గుతుందని తెలిపాయి.మరోవైపు, వ్యక్తులు, లిమిటెడ్ లయబిలిటీ పార్ట్నర్షిప్ సంస్థల ట్యాక్సేషన్ విషయంలో పన్ను రేట్లను తగ్గించాలని, ఫేస్‌లెస్ అప్పీళ్లను ఫాస్ట్ ట్రాక్ చేయాలని పీహెచ్‌డీసీసీఐ విజ్ఞప్తి చేసింది. -
కీలక రైల్వే ప్రాజెక్టులు కొలిక్కి..
సాక్షి, హైదరాబాద్: వరసగా రెండేళ్లలో కేంద్రప్రభుత్వం కీలక రైల్వే ప్రాజెక్టులకు భారీగా నిధులు కేటాయిస్తుండటంతో వాటి పనులు ఒక్కసారిగా వేగాన్ని పుంజుకున్నాయి. ఇదే ఊపు కొనసాగిస్తూ కొత్త బడ్జెట్ కాలపరిధిలో వాటిని పూర్తి చేయాలని రైల్వే శాఖ నిర్ణయించింది. గత సంవత్సరం బడ్జెట్ కాలపరిధిలో రాష్ట్రంలో మెదక్–అక్కన్నపేట, మహబూబ్‌నగర్ డబ్లింగ్ పనులను రైల్వే శాఖ పూర్తి చేసి అందుబాటులోకి తెచి్చంది. కొన్నేళ్లుగా కాగితాలకే పరిమితమైన గుంటూరు–బీబీనగర్ డబ్లింగ్ ప్రాజెక్టును ఈ సంవత్సరం ఫిబ్రవరిలో ప్రవేశపెట్టిన మధ్యంతర బడ్జెట్‌తో పట్టాలెక్కించింది. ఈనెల 23న ప్రవేశపెట్టబోయే ఈ ఆర్థిక సంవత్సరపు పూర్తి కాల బడ్జెట్లో ఆ నిధులను కొంత సవరించే అవకాశం ఉంది. ఆ నిధులతో అవి ఈ ఆర్థిక సంవత్సరంలో తుదిదశకు చేరే అవకాశం ఉంది. కాజీపేట–బల్లార్షా మూడో లైన్ పనుల్లో వేగం ఉత్తర–దక్షిణ భారత్‌లను రైల్వే పరంగా జోడించే ప్రధాన లైన్లో ఇది కీలకం. నిత్యం 275 వరకు ప్రయాణికుల రైళ్లు, 180 వరకు సరుకు రవాణా రైళ్లు పరుగుపెట్టే ఈ మార్గంలో మూడో లైన్ అత్యవసరం. అది అందుబాటులోకి వస్తే కనీసం మరో 150 రైళ్లను కొత్తగా నడిపే వీలు చిక్కుతుంది. ఈ మార్గంలో తెలంగాణకు సంబంధించి దీన్ని రెండు ప్రాజెక్టులుగా చేపట్టారు.ఇందులో మహారాష్ట్ర– తెలంగాణల్లో కొనసాగే ప్రాజెక్టు ఇది. ఈ ప్రాజెక్టు 2015–16లో మంజూరైంది. దీని నిడివి 202 కి.మీ.. ప్రాజెక్టు అంచనా వ్యయం రూ.2,063 కోట్లు. గత రెండేళ్లుగా పనుల్లో వేగం కారణంగా చాలా సెక్షన్లలో పనులు పూర్తయ్యాయి. ఇప్పటివరకు 151కి.మీ. పనులు పూర్తయ్యాయి. గతేడాది బడ్జెట్లో ఈ ప్రాజెక్టుకు రూ.450 కోట్లు కేటాయించగా, గత మధ్యంతర బడ్జెట్లో రూ.300 కోట్లు ప్రతిపాదించారు. ఈసారి ఆ మొత్తాన్ని కొంత సవరించే అవకాశం ఉంది.కాజీపేట– విజయవాడ మూడో లైన్ పనులకూ మోక్షం దశాబ్దాలుగా కాగితాలకే పరిమితమైన ఆ ప్రాజెక్టు ఎట్టకేలకు 2012–13లో మంజూరైంది. కానీ, పనుల నిర్వహణ మాత్రం మందకొడిగా సాగుతూ అది ఇప్పటికీ పూర్తి కాలేదు. కానీ, గత రెండేళ్ల కాలంలో ఈ ప్రాజెక్టుకు ఏకంగారూ.647 కోట్లçను కేటాయించటంతో ఎట్టకేలకు ప్రాజెక్టు ఓ రూపునకు వచి్చంది. పూర్తి నిడివి 219 కి.మీ. ఇప్పటివరకు 100కి.మీ. పనులు పూర్తయ్యాయి. దీని అంచనా వ్యయం రూ.1,952 కోట్లు.’మనోహరాబాద్–కొత్తపల్లి’.. వచ్చే ఏడాదికి కొలిక్కిసిద్దిపేట మీదుగా హైదరాబాద్–కరీంనగర్‌ను రైల్వే ద్వారా అనుసంధానించే కీలక ప్రాజెక్టు ఇది. 2006–07లో మంజూరైనా ఐదేళ్ల క్రితం పనులు ప్రారంభమయ్యాయి. దీని నిడివి 151 కి.మీ. కాగా ఇప్పటి వరకు 76 కి.మీ. పనులు పూర్త య్యాయి. ప్రాజెక్టు అంచనా వ్యయం రూ. 1375 కోట్లు. గతేడాది బడ్జెట్లో దీనికి రూ.185 కోట్లు కేటాయించగా, గత మధ్యంతర బడ్జెట్లో రూ.350 కోట్లు ప్రతిపాదించారు. నిధులకు కొరత లేనందున వచ్చే ఏడాది కాలంలో పనులు దాదాపు కొలిక్కి వచ్చే అవకాశం ఉంది. ’బీబీనగర్– గుంటూరు’ పనులు ఇక స్పీడే సికింద్రాబాద్–విజయవాడ మార్గానికి ప్రత్యామ్నాయ లైన్ గా నడికుడి మీదుగా బీబీనగర్– గుంటూరు మార్గాన్ని అభివృద్ధి చేయాలని 2019లో నిర్ణయించారు. రూ.2,853 కోట్ల అంచనా వ్యయంతో ప్రతిపాదించిన ఈ ప్రాజెక్టుకు గత మధ్యంతర బడ్జెట్లో రూ.200 కోట్లు ప్రతిపాదించారు. కుక్కడం–నడికుడి సెక్షన్ల మధ్య భూసేకరణ పను లు మొదలయ్యాయి. -
కొత్త బడ్జెట్‌పై ఆర్బీఐ మాజీ గవర్నర్ విమర్శలు
న్యూఢిల్లీ: ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈ నెల మొదట్లో ప్రవేశపెట్టిన 2023–24 ఆర్థిక సంవత్సరం బడ్జెట్ ఉపాధి కల్పనకు ‘తగినంత ప్రాధాన్యత’ ఇవ్వలేదని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) మాజీ గవర్నర్ దువ్వూరి సుబ్బారావు పేర్కొన్నారు. వృద్ధిరేటు ఉద్యోగాలను సృష్టిస్తుందనే విశ్వాసం అయితే ఉందికానీ, నిరుద్యోగ సమస్యను అధిగమించడానికి ఈ విశ్వాసం ఒక్కటే దోహదపడబోదని ఆయన అభిప్రాయపడ్డారు. కోవిడ్‌కు ముందు కూడా నిరుద్యోగ సమస్య తీవ్రంగా ఉందని ఆయన పేర్కొంటూ, మహమ్మారి ఫలితంగా ఇది మరింత ఆందోళనకరంగా మారిందని ఒక ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. దువ్వూరి అభిప్రాయాలు ఆయన మాటల్లోనే.. ఉద్యోగాలపై (2023–24 బడ్జెట్లో) తగినంత ప్రాధాన్యత లేకపోవడంతో నేను నిరాశ చెందాను. కేవలం వృద్ధితోనే ఉపాధి కల్పనను సాధించలేము. మనకు ఉపాధి కల్పనే ధ్యేయంగా జరిగే వృద్ధి అవసరం. ప్రతి నెలా దాదాపు లక్ష మంది శ్రామిక శక్తిలో చేరుతున్నారు. అయితే వారిలో సగానికి కూడా భారత్ ఉద్యోగాలను కూడా సృష్టించలేకపోతోంది. ఫలితంగా నిరుద్యోగ సమస్య పెరగడమే కాకుండా సంక్షోభంగా మారుతోంది. భారీ సంఖ్యలో యువతకు తగిన ఉపాధి అవకాశాలు కల్పించగలిగినప్పుడే, దేశంలోని అధిక యువత ద్వారా ప్రయోజనం ఉంటుంది. ఎన్నికల కారణంగా 2023–24 బడ్జెట్ ప్రజాకర్షక చర్యలతో ఉంటుందని భావించారు. అయితే ఇందుకు భిన్నంగా వృద్ధి, ద్రవ్యలోటు కట్టడిపైనా బడ్జెట్ దృష్టి సారించడం కొంత హర్షణీయ అంశం. ఉపాధికి బడ్జెట్ ప్రోత్సాహం: ఆర్థికశాఖ కాగా, ఆర్థిక మంత్రిత్వశాఖ గురువారం నెలవారీ సమీక్షను విడుదల చేస్తూ, బడ్జెట్లో చేసిన ప్రకటనలు వృద్ధిని, ఉపాధి అవకాశాలను సృష్టిస్తాయని పేర్కొనడం గమనార్హం. మూలధన పెట్టుబడుల పెంపు, గ్రీన్ ఎకానమీకి ప్రోత్సాహం, ఫైనాన్షియల్ మార్కెట్ల పటిష్టానికి చొరవలు వంటి అంశాలు వృద్ధి, ఉపాధి అవకాశాల పెంపునకు దోహదపడతాయని ఆర్థికశాఖ సమీక్ష పేర్కొంది. (ఇదీ చదవండి: G20 ministerial meeting: క్రిప్టోల కట్టడికి అంతర్జాతీయ విధానం అవసరం) -
అదిరిపోయే ఫీచర్స్ తో జియో కొత్త స్మార్ట్ ఫోన్
-
ఆర్బీఐ సమీక్ష, ఆర్థికాంశాలే దిక్సూచి..!
ముంబై: గతేడాది నాలుగో త్రైమాసికంలో జీడీపీ వృద్ధి రేటు 5.8 శాతానికి పరిమితమైంది. ఇది అయిదేళ్ల కనిష్ట స్థాయికాగా, 2018–19 పూర్తి ఆర్థిక సంవత్సరానికి జీడీపీ వృద్ధి 6.8 శాతంగా నమోదైంది. శుక్రవారం మార్కెట్ ముగిసిన తరువాత వెల్లడైన జీడీపీ గణాంకాలు నిరాశపరిచినప్పటికీ.. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) కీలక వడ్డీరేట్లను తగ్గించ వచ్చనే అంచనాలు మార్కెట్లను నిలబెట్టే అవకాశం ఉందని దలాల్ స్ట్రీట్ వర్గాలు భావిస్తున్నాయి. వృద్ధి రేటు ఐదేళ్ల కనిష్ట స్థాయికి పడిపోయిన నేపథ్యంలో లిక్విడిటీ పెంపు చర్యల్లో భాగంగా ఆర్బీఐ ఎంపీసీ గురువారం ప్రకటనలో రెపో రేటును 25 బేసిస్ పాయింట్లు తగ్గించే అవకాశం ఉందని ఎస్ఎమ్సీ ఇన్వెస్ట్మెంట్స్ అండ్ అడ్వైజర్స్ చైర్మన్ డీ కే అగర్వాల్ అన్నారు. మరోవైపు కేంద్రంలో రెండోసారి అధికారాన్ని చేపట్టిన నరేంద్రమోడీ ప్రభుత్వంపై అంచనాలు పెరుగుతున్నాయి. ఈయన క్యాబినెట్లో కొత్తగా ఆర్థిక మంత్రిత్వ శాఖను చేపట్టిన నిర్మలా సీతారామన్ 2019–20 సంవత్సర పూర్తి స్థాయి బడ్జెట్‌ను జూలై 5న ప్రవేశపెట్టనున్నారు. ఈ బడ్జెట్ ప్రధాన ఎజెండా ఉద్యోగ కల్పన, ప్రభుత్వ వ్యయం పెంపు, మౌలిక సదుపాయాల కల్పన.. తయారీ, ఎగుమతులకు ప్రోత్సాహాన్నివ్వడంతోపాటు పన్నుల తగ్గింపుకు బడ్జెట్ ప్రాధాన్యత ఇవ్వనుం దనే అంచనాలు ఉన్నట్లు జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ పరిశోధనా విభాగం చీఫ్ వినోద్ నాయర్ విశ్లేషించారు. మొత్తంగా మార్కెట్‌కు ఈవారం కదలికలు అత్యంత కీలకంగా మారనున్నాయని సామ్కో సెక్యూరిటీస్ సీఈఓ జిమీత్ మోదీ అన్నారు. ఇక రంజాన్ సందర్భంగా బుధవారం మార్కెట్లకు సెలవు అయినందున ఈ వారంలో ట్రేడింగ్ 4 రోజులకే పరిమితంకానుంది. ముడిచమురు ధరల ప్రభావం.. గతవారంలో బ్యారెల్ బ్రెంట్ క్రూడ్ ఫ్యూచర్స్ మూడు నెలల కనిష్టస్థాయికి పడిపోయాయి. మెక్సికోపై టారిఫ్‌లను అనూహ్యంగా పెంచుతూ అమెరికా తన నిర్ణయాన్ని ప్రకటించిన నేపథ్యంలో శుక్రవారం ఒకదశలో క్రూడ్ ధరలు 6% మేర పతనమయ్యాయి. వారాంతాన బ్రెంట్ క్రూడ్ ఫ్యూచర్స్ 5.57% తగ్గి 61.69 డాలర్లకు పడిపోగా.. నైమెక్స్ క్రూడ్ 5.69% పతనమై 53.37 డాలర్ల వద్ద ముగిసింది. ఈ పతనం ఇలానే కొనసాగి.. అమెరికా–చైనాల మధ్య వాణిజ్య యుద్ధం మళ్లీ వేడెక్కకుండా ఉంటే, దేశీ మార్కెట్ ర్యాలీ కొనసాగుతుందనే ఆశావాదంతో ఉన్నట్లు బీఎన్పీ పారిబా అడ్వైజరీ విభాగం హెడ్ హేమంగ్ జానీ అన్నారు. స్థూల ఆర్థిక అంశాలపై దృష్టి నికాయ్ ఇండియా తయారీ రంగ ఇండెక్స్ మేనెల గణాంకాలు సోమవారం వెల్లడికానున్నాయి. సేవల డేటా బుధవారం వెల్లడికానుంది. ఇక గత వారాంతాన వెల్లడైన ఆటో రంగ అమ్మకాలు నిరాశపరిచిన నేపథ్యంలో ఈ అంశంపై ఇన్వెస్టర్లు దృష్టిసారించినట్లు దలాల్ స్ట్రీట్ వర్గాలు చెబుతున్నాయి. విదేశీ నిధుల వెల్లువ భారత్ కాపిటల్ మార్కెట్లో విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్ల(ఎఫ్‌పీఐ) పెట్టుబడుల పరంపర కొనసాగుతోంది. వరుసగా నాల్గవ నెల్లోనూ వీరు నికర కొనుగోలుదారులుగా నిలిచారు. మే నెలలో మొదటి 3 వారాలు అమ్మకాలకు పాల్పడినప్పటికీ.. బీజేపీ ఘనవిజయంతో కొనుగోళ్లు వెల్లువెత్తాయి. నికరంగా మే 2–31 కాలంలో ఈక్విటీ మార్కెట్లో రూ.7,920 కోట్లు.. డెట్ మార్కెట్లో రూ.1,111 కోట్లను ఇన్వెస్ట్‌చేశారు. మొత్తంగా మే నెలలో రూ.9,031 కోట్లను వీరు పెట్టుబడిపెట్టారు. -
ఎంబీసీ చిట్టా.. తేలేదెట్టా?
సాక్షి, హైదరాబాద్: బీసీల్లో అత్యంత వెనుకబడిన కులాలకు (ఎంబీసీలు) చెందిన వారెవరన్న అంశంలో ఇప్పటికీ స్పష్టత రాలేదు. గత బడ్జెట్ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం తొలిసారిగా ఎంబీసీ కులాల అభివృద్ధి, సంక్షేమానికి ప్రత్యేక చర్యలు తీసుకుంటామని ప్రకటించింది. కానీ ఏడాది గడిచినా ఏయే కులాలను ఎంబీసీ జాబితాలో చేర్చాలో నిర్ణయించలేదు. బీసీల్లో మొత్తం 113 కులాలు ఉండగా.. వీటిలో 96 కులాలను ఎంబీసీలుగా పరిగణించాలని పలుమార్లు సీఎం సమక్షంలో జరిగిన సమావేశాల్లో ప్రస్తావనకు వచ్చింది. కానీ ఏయే కులాలను చేర్చాలి, వేటిని మినహాయించాలనేది ప్రభుత్వం వెల్లడించలేదు. ఈ బాధ్యతను తెలంగాణ బీసీ కమిషన్‌కు అప్పగించినా... కమిషన్ సైతం ఈ దిశగా తమ నివేదికను అందించలేదు. గతేడాది బడ్జెట్లో బీసీ సంక్షేమానికి ప్రభుత్వం పెద్దపీట వేసింది. ఎంబీసీ కార్పొరేషన్‌కు రూ.వెయ్యి కోట్లు కేటాయించింది. నాయీ బ్రాహ్మణులు, రజకులకు రూ.250 కోట్ల చొప్పున కేటాయించింది. బడ్జెట్ తర్వాత ఎంబీసీ కార్పొరేషన్ ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. కానీ బీసీల సమగ్రాభివృద్ధి పేరుతో జాప్యం జరగడంతో ఈ నిధులు ఇప్పటికీ ఖర్చు కాలేదు. ఈ లోగా యాదవులకు గొర్రెల పంపిణీ, మత్స్యకారులకు చేపల పంపిణీ, నేతన్నలకు ప్రోత్సాహకాలను ప్రభుత్వం అమల్లోకి తెచ్చింది. వచ్చే బడ్జెట్లో నాయీ బ్రాహ్మణులు, రజకులకు కులవృత్తులకు వీలుగా రాయితీతో ఆధునిక పనిముట్లు అందించాలని, విశ్వకర్మలు, శాలివాహనులు, సంచార జాతులకు ప్రత్యేక పథకాలు అమలు చేయాలని భావిస్తోంది. సంచార జాతులను ఎంబీసీలుగా పరిగణిస్తారనే విషయం ప్రచారంలో ఉంది. కానీ తమను ఎంబీసీల్లో చేర్చవద్దని, ప్రత్యేకంగా గుర్తింపు ఇవ్వాలని సంచార జాతులు డిమాండ్ చేస్తున్నాయి. -
శాంసంగ్, ఎల్జీలకు వియూ చెక్ పెడుతుందా?
న్యూఢిల్లీ: స్మార్ట్ టీవీల రంగంలో శాంసంగ్, ఎల్జీ కు పోటీగా వియూ శరవేగంగా ముందుకొస్తోంది. తాజాగా వియూ టెక్నాలజీస్ మూడు టీవీలను మార్కెట్ లో లాంచ్ చేసిన మిగిలిన పోటీ సంస్థలకు భారీ షాక్ ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. స్మార్ట్ ఫీచర్స్ తో, తక్కువ ధరకే బడ్జెట్ స్మార్ట్ టీవీలతో వియూ వినియోగదారులను ఊరిస్తోంది. స్మార్ట్ ఫీచర్స్ ద్వారా అటు వినోదాన్ని, ఇటు సోషల్ మీడియాను టీవీ తెరపై వినియోగదారులకు అందుబాటులోకి తెస్తూ, టీవీ మార్కెట్ లో హల్ చల్ చేయడానికి సిద్ధమౌతోంది. 32 అంగుళం నుంచి 55 అంగుళాల పరిధిలో మూడు స్మార్ట్ టీవీలను విడుదల చేసింది. వీటిధరలను రూ .20,000 నుంచి, రూ.52,000 గా నిర్ణయించింది. 32 అంగుళాల టీవీని అతి తక్కువ ధరలో రూ .20,000 లకే అందిస్తున్నట్టు వియు ప్రకటించింది. ప్రఖ్యాత వీడియో చానల్స్ యప్ టీవీ, రెడ్ బుల్ సహా, మిగిలిన అన్ని యాప్ లను ఈ టీవీలో అనుసంధానం చేసుకోవచ్చని సంస్థ తెలిపింది. అలాగే ఫేస్ బుక్, ట్విట్టర్, లింక్డ్ ఇన్, లాంటి సోషల్ మీడియా లకు కనెక్ట్ అవడమే కాకుండా, స్ర్కీన్ షేరింగ్ అవకాశం కూడా ఉందని తెలిపింది. క్వాడ్-కోర్ ఇంటర్నెట్ వీడియో ప్రాసెసర్ తో పూర్తి హెచ్‌డిలో కంటెంట్ తో రెండు టీవీలను అందుబాటులోకి తెచ్చినట్టు స్పష్టం చేసింది. ఆన్ లైన్ లో ఫ్లిప్ కార్ట్ ద్వారా ఈ రోజు నుంచే ఈ టీవీలను బుక్ చేసుకోవచ్చు. -
సిక్కోలు ఆశలపై నీళ్లు
ఎన్నో ఆశలను రేకెత్తించిన రైల్వే బడ్జెట్ నిరుత్సాహపర్చింది. జిల్లా ప్రజల ఆశలపై నీళ్లుచల్లింది. రైల్వేపరంగా ఒక్క సమస్యకూ పరిష్కారం లభించలేదు. కనీసం జిల్లా డిమాండ్లపై కన్నెత్తయినా చూడలేదు. కొత్త రైలు కూత కూడా వినిపించలేదు. ఏళ్ల తరబడి ఎదురుచూసిన రైళ్లను పొడించనూ లేదు. ఎంతో ఊరించిన రైల్వే జోన్ ప్రస్తావన లేకపోవడం నిరుద్యోగ యువతను నీరుగార్చింది. ఈ ప్రాంతం నుంచి లోక్‌సభకు ప్రాతినిధ్యం వహించిన నేతలు ఒక్క హామీని కూడా నెరవేర్చుకోలేకపోయారు. ప్రతిపాదనల సమర్పణకే పరిమితమయ్యారని జిల్లాప్రజానీకం నిరసిస్తోంది. సదుపాయాల విషయంలో ప్రకటించిన అంశాలు ఆచరణలో కనిపించవని గతం నిరూపించింది. అదే పునరావృతమవుతుందని ప్రయాణికులు పెదవి విరుస్తున్నారు. కనీసం వెనుకబడిన జిల్లాపై కూడా కరుణ చూపకపోవడంపై నిరసన ధ్వనులు వినిపిస్తున్నాయి. శ్రీకాకుళం టౌన్: కేంద్రరేల్వేమంత్రి సురేష్ ప్రభు పార్లమెంటులో గురువారం ప్రవేశపెట్టిన రేల్వేబడ్జెట్‌లో ఉత్తరాంధ్రకు మరోసారి మొండిచేయి చూపారు. విశాఖ రేల్వేజోన్ ఊసేలేకుండా కొత్తబడ్జెట్‌ను ప్రవేశపెట్టి ప్రయాణికుల ఆశలపైనీళ్లు చల్లారు. దీనికి తోడు శ్రీకాకుళం జిల్లాకు ఈసారి కొత్తగా ఎటువంటి మంజూర్లు తీసుకురాలేకపో యారు. కేంద్రమంత్రిగా అశోక్‌గజపతిరా జు, ఎంపీలుగా కింజరాపు రామ్మోహననాయు డు, కొత్తపల్లి గీతలు ప్రాతినిథ్యం వహిస్తున్న ఈ జిల్లాలో ప్రజల అవసరాలకు తగ్గట్టుగా కొత్తగా ఏ ఒక్క ప్రాజెక్టును సాధించుకోలేక పోయారు. విశాఖ జోన్ ఏర్పాటైతే కొత్తగా 6 వేలమందికి ఉద్యోగాలు వస్తాయని ఆశపడ్డ నిరుద్యోగులకు నిరాశ మిగిలింది. జిల్లాలను ఉత్తరాది రాష్ట్రాల్లో కలపడం వల్ల ఇక్కడున్న నిరుద్యోగులకు అవకాశాలు రాకుండా పోయాయి. ఉత్తరాది యువకులకు జిల్లా వ్యాప్తంగా గ్యాంగ్ మెన్లు, ట్రాక్మెన్లు, గేట్‌మెన్‌లుగా నియమించుకున్నారు. ఈప్రాంతంలో పెద్దసంఖ్యలో వారే విధులు నిర్వర్తిస్తున్నారు. ఇక స్టేషన్ మాస్టరు, టీటీ, రేల్వేకానిస్టేబుళ్లు అంతా వారే పనిచేస్తున్నారు. కొత్తజోన్ వస్తే ఆ అవకాశాలన్నీ తెలుగువారికే దక్కుతాయని ఆశపడ్డా రేల్వే మంత్రి నెరవేర్చలేదు. కొత్త రైళ్ల జాడే లేదు... ఉత్తరాది రాష్ట్రాలను కలుపుతూ కొత్తరైళ్లకు ఈ బడ్జెట్లో కేటాయింపులు జరగలేదు. నౌపడా- రాయఘడ్ మార్గాన్ని కలిపేందుకు పర్లాకిమిడినుంచి కొత్తలైన్ మార్గం ఏర్పాటుకు కేటాయింపులు జరగలేదు. జి.సిగడాం నుంచి రాజాం మీదుగా విజయనగరంకు రైలు మార్గం ఏర్పాటు కలగానే మిగిలిపోయింది. జిల్లాలో కొత్త రేల్వేహాల్ట్‌లు ఇవ్వలేదు. కేవలం రేల్వేస్టేషన్లలో సీసీ కెమెరాలు ఏర్పాటు, ఎల్సీడీ టీవీలు ఏర్పాటుకు బడ్జెట్లో కేటాయింపులు చేశారు. పలాస, బెండిగేటు, పొందూరు రేల్వే క్రాసింగ్‌ల వద్ద నిర్మాణంలో ఉన్న ఫ్లైఓవర్ల పనులు పూర్తిచేసేందుకు మాత్రమే నిధులు కేటాయించారు. రేల్వేస్టేషన్ల ఆధునీకరణ ఊసేలేదు. కొత్తరైళ్ల మంజూరు లేనట్టే.. జిల్లా మీదుగా ప్రయాణించేందుకు పాతరైళ్లు మినహా కొత్తరైళ్లు ఈ బడ్జెట్లో కేటాయించలేదు. పాతవాటికి హాల్ట్‌లైనా మంజూరవుతాయని ఆశపడ్డ ప్రయాణికులకు నిరాశే మిగిలింది. రైళ్ల వేగం పెంచుతామని మంత్రి ప్రకటించినప్పటికి ఏఏ రైళ్లు వేగం పెరుగుతాయో అందులో పొందుపరచలేదు. కొత్తగా లైన్ల ఏర్పాటు లేకుండా వేగం పెంచడానికి ఎలా వీలౌతుందని రేల్వే ఉద్యోగులే ప్రశ్నిస్తున్నారు. -
బడ్జెట్ వస్తోంది... వీటి సంగతేంటి?
వచ్చే ఆర్థిక సంవత్సరానికి గాను ఈ నెలాఖరులో కొత్త బడ్జెట్ ప్రవేశపెడతారు. ఏమైనా మార్పులుంటే అవన్నీ కూడా 2016-17వ ఆర్థిక సంవత్సరం నుంచి అమల్లోకి వస్తాయి. ఏ మార్పులు వస్తున్నాయో బడ్జెట్ ప్రతిపాదనల ద్వారా మనకు ముందే తెలుస్తుంది. ఈ నేపథ్యంలో ఈ ఆర్థిక సంవత్సరంలో మీరు చేయవలసిన కొన్ని పనులు ఈ రోజు ట్యాక్స్ కాలమ్‌లో... * సెక్షన్ 80(సీ) కింద అర్హత ఉన్న సేవింగ్స్, పెట్టుబడులు తదితర వాటి మీద గరిష్ట పరిమితి రూ.1,50,000. ఈ రోజు వరకు ఎంత ఇన్వెస్ట్ చేశారో లెక్కించండి. ఇంకా అవకాశం ఉంటే వెంటనే రంగంలోకి దిగండి. * మెడిక్లెయిమ్కి వాయిదాలు చెల్లించండి. * ఇంటి రుణం మీద అసలు, వడ్డీ చెల్లించకపోతే వెంటనే చెల్లించండి. * అడ్వాన్స్ ట్యాక్స్ చెల్లింపులు సెప్టెంబర్ నుంచే మొదలవుతాయి. మార్చి 15 చివరి తేదీ. అవకాశం ఉంటే త్వరగా చెల్లించండి. చివరి క్షణం వరకు నిరీక్షణ వద్దు. * టీడీఎస్ వివరాలు తెలుసుకోండి. డిడక్టర్తో మాట్లాడండి. యజమానిని సంప్రదించండి. బ్యాంక ర్లు వారి పని ఒత్తిడి వల్ల మన పని చేయకపోవచ్చు. మీరే వారిని కలిసి టీడీఎస్ సమస్యను పరిష్కరించుకోండి. * మీ కేసులో టీడీఎస్ జరిగినప్పటికీ.. ఆ మొత్తంలో పూర్తి పన్ను భారం చెల్లించలేం. ఉదాహరణగా బ్యాంకర్లు కేవలం 10 శాతం చెల్లిస్తారు. మీ ఆదాయం 30 శాతం శ్లాబ్‌లో ఉందనుకోండి. మీరింకా 20 శాతం చెల్లించాలి. దీన్ని అడ్వాన్స్ ట్యాక్స్ ద్వారా చెల్లించాలి. చాలా మంది టీడీఎస్ అయిపోయింది కాదా.. ఇక అదనంగా ఏమీ చెల్లించాల్సిన అవసరం లేదనుకుంటారు. ఇది పొరపాటు. ఇటువంటివి ఇప్పుడే చూసుకోండి. * మీకున్న అన్ని బ్యాంకు అకౌంట్లలో బ్యాంకర్లు సంవత్సరంలో రెండు సార్లు కానీ నాలుగు సార్లు కానీ వడ్డీని క్రెడిట్ చేస్తారు. ఇటువంటి మొత్తం 10 వేల రూపాయలు దాటితే పన్ను భారం పడుతుంది. అటువంటి సమాచారాన్ని పరిగణనలోకి తీసుకోండి. * బ్యాంకు అకౌంట్లలో ప్రతి క్రెడిట్‌కి, ప్రతి డెబిట్‌కు వివరణ రాసుకోండి. * మార్చి 15 తర్వాత ఊహించని విధంగా ఆదాయం వస్తే దాన్ని పరిగణనలోకి తీసుకొని పన్నుభారం లెక్కించండి. * కొన్ని విషయాలను మీరు ఇప్పుడే ప్లాన్ చేసుకోవచ్చు. బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాత ప్రతిపాదనల వల్ల బేసిక్ లిమిట్ , శ్లాబ్ మారవచ్చు. మినహాయింపుల పరిమితి పెరగొచ్చు. ఈ ప్రభావం పన్ను మీద పడుతుంది. * అందుకే బడ్జెట్ ప్రతిపాదనలు తెలియగానే పన్ను భారం గురించి వృత్తి నిపుణులను సంప్రదించండి. ట్యాక్సేషన్ నిపుణులు: కె.సీహెచ్.ఎ.వి.ఎస్.ఎన్ మూర్తి, కె.వి.ఎన్ లావణ్య -
మా హామీల భారం మీదే: చంద్రబాబు
* అధికారులు నిరంతరం పనిచేయాలి * ప్రీ బడ్జెట్ సమావేశంలో అధికారులతో సీఎం చంద్రబాబు * సంక్షేమం, అభివృద్ధి బ్యాలెన్స్ చేసుకోవాలి * రాష్ట్రంలో సాగు దెబ్బతింది * రైతులు అప్పుల ఊబిలో కూరుకుపోయారు సాక్షి ప్రతినిధి, విజయవాడ: ఎన్నికల్లో తామిచ్చిన హామీలు నెరవేర్చడం కోసం నిరంతరం పనిచేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులను కోరారు. బుధవారం విజయవాడలోని ఒక స్టార్ హోటల్లో రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రీ బడ్జెట్ సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రజాస్వామ్యంలో రాజకీయ పార్టీలు హామీలివ్వడం, వాటి ద్వారా ఓట్లు కోరడం సాధారణమని చెప్పారు. ఇచ్చిన హామీలన్నీ పూర్తి చేశామని మళ్లీ ప్రజల ముందుకు వెళ్తామని చెప్పారు. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకుని అధికారులు బాధ్యతాయుతంగా పనిచేయాలని కోరారు. నూతన రాష్ట్రానికి నూతన బడ్జెట్ రూపకల్పన చేసుకుంటున్నామన్నారు. తాను సీఎంగా ప్రమాణ స్వీకారం చేసి రేపటికి ఏడు నెలలు పూర్తవుతుందన్నారు. ఈ కాలంలో విజయాలు చెప్పుకొని, లోటుపాట్లు సరిదిద్దుకోవాల్సిన అవసరం ఉందన్నారు.సంక్షేమం, అభివృద్ధి రెండూ బ్యాలెన్స్ చేసుకుని ముందుకు పోవాలన్నారు. ఈ సందర్భంగా వ్యవసాయం గురించి మాట్లాడుతూ.. రాష్ట్రంలో సాగు దెబ్బతిన్నదన్నారు. దేశ వ్యాప్తంగా చూస్తే అప్పుల ఊబిలో ఉన్న రైతులు 51 శాతం అయితే, ఆంధ్రప్రదేశ్‌లో మాత్రం 93 శాతం ఉన్నారన్నారు. పంటలకు గిట్టుబాటు ధరలు రావడం లేదని, అందువల్లే రైతులు అప్పులపాలవుతున్నారన్నారు. కోట య్య కమిటీ నివేదికలో రూ.లక్ష వరకు రుణమాఫీ చేయాలని సూచించారని, దానివల్ల సమస్య పరిష్కారం కాదన్నారు. కేబినెట్లో రూ. 1.50 లక్షలు రుణమాఫీ కుటుంబానికి చేస్తామని నిర్ణయం తీసుకున్నామన్నారు. అన్ని శాఖలు ఆధార్‌తో అనుసంధానం.. రేషన్ కార్డు, పెన్షన్, స్కాలర్షిప్, భూమి సర్వే.. ఏదైనా ఆధార్‌తో అనుసంధానం చేయడానికి సంకల్పించామన్నారు. రుణమాఫీకి బ్యాంకులు, ఆర్బీఐ సహకరించకపోయినా ఫేజ్ వన్ విజయవంతంగా చేశారని అధికారులను అభినందించారు. రూ. 50 వేలు పైన రుణం తీసుకున్న వారికి రుణమాఫీలో స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ వల్ల తక్కువ మాఫీ అయివుంటే వాళ్లకు వన్‌టైమ్ సెటిల్మెంట్ ద్వారా రుణవిముక్తి కల్పించాలని ఆదేశించారు. డైనమిక్ రాజధాని కోసమే.. రాష్ట్రం మధ్య భాగంలో డైనమిక్ సిటీ ఉండే విధంగా రాజధాని ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందన్నారు. భూ సేకరణ విషయంలో కొంతమంది అడ్డంపడుతున్నా రైతులు విజ్ఞతతో వ్యవహరించారన్నారు. ఇక్కడే మాకు రాజధాని కావాలన్న రైతులు భూములు ఇవ్వడానికి సిద్ధమయ్యారని చంద్రబాబు తెలిపారు. రాజధాని ప్రాంతంలో ల్యాండ్ పూలింగ్ ద్వారా భూములు తీసుకోవడం వల్ల సింగపూర్ ప్రభుత్వం మాస్టర్ ప్లాన్ ఇచ్చేందుకు ముందుకు వచ్చినట్లు సీఎం చెప్పారు. ఈనెల 12న సింగపూర్ టీం మళ్లీ ఇక్కడికి వస్తున్నట్లు చెప్పారు. వాళ్ల మంత్రితో పాటు హైలెవెల్ టీం కూడా వస్తోందన్నారు. జపాన్ ప్రభుత్వం పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వస్తోందన్నారు. నూతన రాజధాని నిర్మాణం త్వరగా కావాల్సి ఉందని, దీనికోసం యాక్షన్‌ప్లాన్ తయారు చేసినట్లు చెప్పారు. విభజన జరిగిన మూడు నెలల నుంచే 24 గంటల విద్యుత్ ఇస్తున్నామన్నారు. బొగ్గును కూడా దిగుమతి చేసుకున్నట్లు చెప్పారు. ఇసుక రీచ్‌లు డ్వాక్రా మహిళలకు ఇచ్చి వారి ద్వారా ఇసుకను అడిగిన వారందరికీ ఇప్పిస్తున్నట్లు చెప్పారు. ఇక, సంక్రాంతికి ఉచితంగా ఇచ్చే ఆరు నిత్యావసర వస్తువులను 11వ తేదీ సాయంత్రానికి పంపిణీ చేయాలని ఆదేశించారు. ఎప్పుడూ పనే కాకుండా సంక్రాంతి సంబరాలు కూడా పెద్ద ఎత్తున జరపాలని సీఎం పిలుపునిచ్చారు. గవర్నమెంట్ వీక్‌గా ఉందంటే సమాజంలో ఉన్న వ్యక్తులు ఆడుకునే ప్రయత్నం చేస్తారని కలెక్టర్లతో సీఎం అన్నారు. గవర్నమెంట్ గట్టిగా ఉందంటే జాగ్రత్తగా ఉంటారని చెప్పారు. జూన్ నాటికి రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ స్కూళ్లలో మరుగుదొడ్లు నిర్మించాలని ముఖ్యమంత్రి మున్సిపల్, పట్టణాభివృద్ధి శాఖ అధికారులను ఆదేశించారు. సైంటిఫిక్ బడ్జెట్.. ఈసారి సైంటిఫిక్ వే ద్వారా బడ్జెట్ రూపొం దించాలని నిర్ణయించినట్లు చెప్పారు. 2019 ఫేజ్వన్, 2022 ఫేజ్ టూ బడ్జెట్ల ద్వారా భారత దేశంలో రాష్ట్రం అగ్రభాగాన ఉండే విధంగా బడ్జెట్ రూపకల్పన చేశామన్నారు. 2029లో దేశంలో అగ్ర రాష్ర్టంగా ఉండాలని చెప్పారు. ఈ సమావేశంలో డిప్యూటీ సీఎంలు కేఈ కృష్ణమూర్తి, నిమ్మకాయల చినరాజప్ప, మంత్రులు యనమల రామకృష్ణుడు, పి.మాణిక్యాలరావు, అయ్యన్నపాత్రుడు, అచ్చెన్నాయు డు, రావెల కి శోర్బాబు, నారాయణ, దేవినేని ఉమామహేశ్వరరావు, కొల్లు రవీంద్ర, ప్రత్తిపాటి పుల్లారావు, కామినేని శ్రీనివాసరావులతో పాటు సీఎస్ ఐవైఆర్ కృష్ణారావు, డీజీపీ రాము డు, ఆర్థిక కార్యదర్శి టక్కర్, కలెక్టర్లు, అధికారులు పాల్గొన్నారు. సమావేశం ప్రారంభంలో అనంతపురం జిల్లాలో జరిగిన ప్రమాదంలో మృతి చెందిన విద్యార్థులకు సంతాపం ప్రకటించి రెండు నిమిషాలు మౌనం పాటించారు.