కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ (Finance Minister Nirmala Sitharaman ) ఫిబ్రవరి 1వ తేదీన లోక్‌సభలో 2025–26 వార్షిక బడ్జెట్‌ను (Budget 2025) ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో ఆర్థికశాఖ (Finance Ministry) కీలక డాక్యుమెంటును ఆవిష్కరించింది. బడ్జెట్ లక్ష్యాలను ఈ డాక్యుమెంట్‌లో సూచించింది. 4.5 శాతం వద్ద ద్రవ్యలోటు ( fiscal deficit) కట్టడి, పేదల అవసరాలకు అనుగుణంగా సామాజిక భద్రతా చర్యలకు పెద్దపీట వేయడం.. ఇందులో కీలక అంశాలుగా ఉన్నాయి.
వచ్చే రెండేళ్లు భారత్ వృద్ధి 6.5 శాతం
భారత్ ఆర్థిక వ్యవస్థ ప్రస్తుత (2024–25) వచ్చే ఆర్థిక సంవత్సరంలో (2025–26) 6.5 శాతం వృద్ధి చెందే అవకాశం ఉందని సేవల దిగ్గజ సంస్థ– ఎర్నెస్ట్ అండ్ యంగ్ (ఈవై) నివేదిక పేర్కొంది. ప్రైవేట్ వినియోగ వ్యయం, అలాగే మూలధన వ్యయాలు అంచనాలకన్నా తగ్గడం వృద్ధికి బ్రేకులు వేస్తున్న అంశంగా ఈవై వివరించింది. ఈ కారణంగానే సెప్టెంబర్ త్రైమాసికంలో వృద్ధి రేటు ఏడు త్రైమాసికాల కనిష్ట స్థాయిలో 5.4 శాతంగా నమోదయ్యిందని విశ్లేషించింది.
ప్రపంచ పరిస్థితులు అనిశ్చితంగా ఉండటం, ప్రపంచ వాణిజ్య పరిస్థితుల వంటి అంశాల నేపథ్యంలో దేశీయ డిమాండ్, సేవల ఎగుమతులపై భారత్ ఎక్కువగా ఆధారపడవలసి ఉంటుందని ఈవై పేర్కొంది. రోడ్లు, స్మార్ట్ సిటీలు, రైల్వేలు, విద్యుత్, పునరుత్పాదక ఇంధనంసహా ప్రాధాన్యతా రంగాల పురోగతికి 2030 వరకు వర్తించే తాజా నేషనల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ పైప్‌లైన్ (ఎన్‌ఐపీ) ఆవిష్కరణ అవసరమని పేర్కొంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మొత్తం అప్పులు స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ)లో 60 శాతానికి మించకూడదని పేర్కొన్న ఈవై, ఈ 60 శాతం భారం కేంద్రం, రాష్ట్రాలపై సమానంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించింది.
Comments
Please login to add a commentAdd a comment