అణు విద్యుత్తు ఆశలు... బారెడు | Sakshi Guest Column On Nuclear power | Sakshi
Sakshi News home page

అణు విద్యుత్తు ఆశలు... బారెడు

Published Tue, Feb 11 2025 12:16 AM | Last Updated on Tue, Feb 11 2025 5:55 AM

Sakshi Guest Column On Nuclear power

విశ్లేషణ

కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్  ఈ ఏడాది బడ్జెట్‌లో టెక్నాలజీ రంగంలో పెద్ద ప్రతిపాదనలే చేశారు. వాటిల్లో ప్రధానంగా చెప్పుకోవాల్సినవి ‘అణుశక్తి’ మిషన్, ‘కృత్రిమ మేధ’ మిషన్‌. వీటితోపాటు ప్రైవేట్‌ రంగంలో టెక్నాలజీల అభివృద్ధికి శాస్త్ర, సాంకేతిక పరిజ్ఞాన మంత్రిత్వ శాఖ కేటాయింపులు పెంచారు. ఇండియన్ ఇన్‌స్టిట్యూట్స్‌ ఆఫ్‌ టెక్నాలజీ (ఐఐటీ)ల్లో మౌలిక వసతులను, ఎంబీబీఎస్‌ సీట్లను గణణీయంగా పెంచుతామని కూడా ప్రతిపాదించారు. ఇవన్నీ స్వాగతించదగ్గ ఆలోచనలే. కానీ వీటి అమలుకు నిర్దేశించుకున్న కాలావధులు, ఆర్థిక అంశాల విషయంలో మాత్రం సందేహాలు వ్యక్తమవుతాయి. ఎందు కంటే, ఈ అంశాలేవీ కొత్తవి కావు, నిరుటి బడ్జెట్‌లో ప్రస్తావించినవే. 

పేరు మార్చితే కొత్త పథకమా?
అణు శక్తి మిషన్  సంగతి చూద్దాం. స్మాల్‌ మాడ్యులర్‌ రియాక్టర్ల (ఎస్‌ఎంఆర్‌) అభివృద్ధికి పరిశోధనలు చేపట్టడం ఈ మిషన్  ఉద్దేశం. భారీ అణు విద్యుత్‌ కేంద్రాల స్థానంలో ఎస్‌ఎంఆర్‌లను ఎందుకు ఎంచుకున్నారు అన్నదానికి శిలాజ ఇంధనాల మీద ఆధారపడటం తగ్గించుకునేందుకు అన్న సమాధానం వినిపిస్తోంది. ఆర్థిక మంత్రి చెప్పినట్లు, ‘2047 నాటికి వంద గిగావాట్ల అణు విద్యుత్‌ ఉత్పత్తిని’ లక్ష్యంగా నిర్దేశించుకున్నారు. 

సుమారు రూ. 20,000 కోట్లతో పూర్తి స్వదేశీ టెక్నాలజీ ఆధారంగా ఐదు ఎస్‌ఎంఆర్‌లు నిర్మిస్తామనీ, 2033 నాటికల్లా వీటితో విద్యుదుత్పత్తి ప్రారంభిస్తామనీ మంత్రి వివరించారు. ఇందుకోసం అణుశక్తి విభాగానికి స్పష్టమైన బడ్జెట్‌ కేటాయింపులు మాత్రం చేయలేదు. గతేడాది మొత్తమే ఈ ఏడాదీ ఉండనుంది. దీన్నిబట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఎస్‌ఎంఆర్‌లపై ఆర్థిక శాఖ మంత్రి కేవలం తన ఉద్దేశాన్ని మాత్రమే వ్యక్తం చేశారూ అని!

వాస్తవానికి ఎస్‌ఎంఆర్‌ల ఆలోచన కొత్తది కాదు. 2024 బడ్జెట్‌ ప్రసంగంలోనూ అణుశక్తి విస్తృత వినియోగం కోసం ఎస్‌ఎంఆర్‌ల నిర్మాణం చేపడతామని ప్రకటించారు. భారత్‌ స్మాల్‌ రియాక్టర్స్, భారత్‌ స్మాల్‌ మాడ్యులర్‌ రియాక్టర్స్‌ అని నామకరణం కూడా చేశారు. భారత్‌ స్మాల్‌ మాడ్యులర్‌ రియాక్టర్ల అభివృద్ధి ప్రక్రియ మొదలైందని 2024 డిసెంబరులో ప్రభుత్వం పార్లమెంటులో ఒక ప్రకటన కూడా చేసింది. ‘వీటి తయారీలో భాగస్వాములవుతామని చాలా దేశాలు ఆసక్తి చూపాయి’ అని కూడా చెప్పింది. 

ఈ రియాక్ట ర్లను అక్కడికక్కడే విద్యుత్తు ఉత్పత్తి చేసుకోగల రంగాల్లో ఉపయోగి స్తారని చెప్పారు. అణుశక్తి విభాగం ఎస్‌ఎంఆర్‌ల అభివృద్ధి ప్రక్రి యను ఇప్పటికే ప్రారంభించి ఉంటే, వాటికి ఈ ఏడాది బడ్జెట్‌లోనే నిధుల కేటాయింపు జరిగి ఉండాలి. కానీ 2025 బడ్జెట్‌ ప్రసంగంలో నిర్మలా సీతారామన్  ఎస్‌ఎంఆర్‌కు ముందు జోడించిన భారత్‌ను వదిలేశారు. బీఎస్‌ఎంఆర్‌ అని కాకుండా ఎస్‌ఎంఆర్‌ అనడం ద్వారా కొత్త అణు రియాక్టర్ల అభివృద్ధికి నాంది పలికినట్లు ధ్వనించారు.

ఎస్‌ఎంఆర్‌లను 2023లో నీతి ఆయోగ్‌ ప్రచురించిన ఒక విధాన ప్రకటనలో ప్రతిపాదించారు. సుమారు 220 మెగావాట్ల విద్యుత్తును ఉత్పత్తి చేయగల, అది కూడా ప్రస్తుతం అందుబాటులో ఉన్న ప్రెష రైజ్డ్‌ హెవీ వాటర్‌ టెక్నాలజీతో పనిచేసే వాటిని చిన్నస్థాయి అణు రియాక్టర్లుగా పరిగణిస్తున్నారు. ఎస్‌ఎంఆర్‌ల విషయానికి వస్తే అవి 30 మెగావాట్ల సామర్థ్యం, కొత్త డిజైన్  కలిగినవి. ఫ్యాక్టరీల్లో తయారు చేసుకుని అవసరమైన చోట అమర్చుకోగల వీటి వినియోగం వల్ల ఖర్చులు తగ్గుతాయని అంచనా. 

చిన్న రియాక్టర్లు కావడం వల్ల తరచూ ఇంధనం మార్చాల్సిన అవసరం ఉండదు. నిర్ణీత సమయం తరువాత వీటిని థర్మల్‌ విద్యుత్‌ కేంద్రాల్లో వాడుకునే వీలుంటుంది. పెద్ద రియాక్టర్లతో పోలిస్తే వీటి భద్రత, పర్యావరణపరమైన అంశాలు, అనుమతులు భిన్నంగా ఉంటాయి. ఒత్తిడి పెద్దగా ఉండక పోవడం, ఉత్పత్తి కూడా తక్కువగా ఉండటం... ఇందుకు కారణం. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా కొద్ది సంఖ్యలో మాత్రమే ఎస్‌ఎంఆర్‌ల అభివృద్ధి జరుగుతోంది. 

వ్యయం–కాలయాపన
స్వాతంత్య్రం అనంతరమే అణువిద్యుత్తు ఉత్పత్తి ప్రయత్నాలు ప్రారంభమయ్యాయి. స్వశక్తితో ఎంతో పురోభివృద్ధి సాధించింది కూడా. అణ్వాస్త్రాల తయారీకి అవసరమైన ఇంధనాన్ని సమకూర్చు కునేలా వ్యూహాత్మకంగా అణుశక్తి కార్యక్రమం నడిచింది. అయినా వాణిజ్య స్థాయి అణు విద్యుత్‌లో దేశం వెనుకబడి ఉంది. ప్రస్తుతం భారత్‌లో 24 అణు రియాక్టర్లు ఉమ్మడిగా 8,180 మెగవాట్ల సామ ర్థ్యంతో పనిచేస్తున్నాయి. ఇంకో 15,300 మెగావాట్ల సామర్థ్యం కలి గిన మరో 21 అణురియాక్టర్లు వివిధ దశల్లో నిర్మాణంలో ఉన్నాయి. 

కేంద్ర అణుశక్తి విభాగం సుదీర్ఘ లక్ష్యాలను నిర్దేశించుకుంటుంది. 1970లలో దేశంలో రెండే అణువిద్యుత్‌ ప్లాంట్లు ఉన్న సమయంలో 1990 నాటికల్లా 10,000 మెగావాట్ల విద్యుదుత్పత్తి చేస్తామని ప్రక టించింది. 1980లలో 2000 నాటికల్లా సామర్థ్యాన్ని 20 వేల మెగా వాట్లకు పెంచుతామని చెప్పింది. తరువాత గడువును 2020కి మార్చారు. తాజాగా గతేడాది లక్ష్యాన్ని 2047 నాటికి లక్ష మెగావాట్లు అని ప్రకటించింది. రెండంటే రెండు దశాబ్దాల్లో ఎకా యెకిన 92,000 మెగావాట్ల సామర్థ్యాన్ని జోడించడం అత్యాశే అవుతుంది. 

అణువిద్యుత్తు ఉత్పత్తికి మూలధన వ్యయం చాలా ఎక్కువ.ఇంధన సరఫరా సమస్యలున్నాయి. పర్యావరణ, భద్రతలకు సంబంధించిన ఖర్చులూ ఎక్కువే. హరియాణాలోని ఫతేబాద్‌ జిల్లాలోని గోరఖ్‌పూర్‌ అణువిద్యుత్‌ కేంద్రం విషయమే చూద్దాం. 700 మెగా వాట్ల సామర్థ్యమున్న నాలుగు రియాక్టర్లు ఇక్కడ ఏర్పాటవు తున్నాయి. 2013లో ఈ కేంద్రానికి సంబంధించి పర్యావరణ అంచ నాలు నిర్ధారించారు. తొలి దశకు 2014 ఫిబ్రవరిలో అనుమతులు వచ్చాయి. ఆ తరువాతి ఏడాది అణుశక్తి నియంత్రణ బోర్డు నుంచి అనుమతులు లభించాయి. 

అదే ఏడాది జూన్ లో నిర్మాణం ప్రారంభ మైంది. 2021 నాటికి తొలి యూనిట్‌ పని ప్రారంభించాల్సి ఉన్న ప్పటికీ 2020 నాటికి కానీ దీంట్లో భద్రతకు సంబంధించిన కాంక్రీట్‌ పోయడం మొదలుకాలేదు. 2022లో వేసిన లెక్కల ప్రకారం దీని నిర్మాణం 2028కి పూర్తి కావాలి. కానీ ప్రస్తుత పరిస్థితిని గమనిస్తే 2032 నాటికి రెండు యూనిట్లు పనిచేయడం ప్రారంభం కావచ్చు. ప్రాజెక్టు ఖర్చు రూ.40 వేల కోట్లు. ఇంధన భద్రతకు అణుశక్తి మేలని అనుకునేవాళ్లు ఈ విషయాలను పరిగణనలోకి తీసుకోవాలి.

బాధ్యత ఎవరిది?
నిర్మలా సీతారామన్  తన బడ్జెట్‌ ప్రసంగంలో లక్ష మెగావాట్ల అణుశక్తి ఉత్పత్తి సామర్థ్యాన్ని సాధించే లక్ష్యంలో ప్రైవేట్‌ రంగాన్ని భాగస్వాములను చేస్తున్నట్లు ప్రకటించారు. ఇందుకోసం చట్టాలను సవరిస్తున్నట్లు చెప్పారు. అణువిద్యుత్‌ కేంద్రాల్లో జరిగే ప్రమాదాల బాధ్యత విషయంలో ప్రైవేట్‌ కంపెనీలు తటపటాయిస్తున్నాయి. 2010లో ఆమోదం పొందిన చట్టం ప్రకారం, ప్రమాదాలకు బాధ్యత ఆ కేంద్రం నిర్వాహకులది అవుతుంది. నష్ట పరిహారం మొత్తం రూ. 1500 కోట్లకు పరిమితం చేశారు. 

ఒకవేళ ప్రమాదం ప్లాంట్‌ లోపం కారణంగా జరిగితే (భోపాల్‌ గ్యాస్‌ దుర్ఘటనలో మాదిరి) సరఫరా దారు మీద నిర్వాహకులు కోర్టుకు వెళ్లవచ్చు. ఈ అంశాల కారణంగానే అణుశక్తి రంగానికి సంబంధించి విదేశీ కంపెనీలు భారత మార్కెట్‌లో ప్రవేశించేందుకు వెనుకడుగు వేస్తున్నాయి. ఏమైనా బాధ్యత అనేది సీరియస్‌ వ్యవహారం. ప్రభుత్వం నష్ట పరిహారం విషయంలో పునరాలోచన చేయాలి. కేవలం ఉన్నత లక్ష్యాలను నిర్దేశించుకున్నంత మాత్రాన అణు విద్యుదుత్పత్తి జరిగిపోదు.


దినేశ్‌ సి. శర్మ 
వ్యాసకర్త సైన్స్‌ అంశాల వ్యాఖ్యాత
(‘ద ట్రిబ్యూన్‌’ సౌజన్యంతో)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement