nuclear power
-
అణువిద్యుత్ కేంద్రంపై దాడి రష్యా పనే: జెలెన్స్కీ
కీవ్: తమ దేశంలోని జపోర్జియా అణువిద్యుత్ కేంద్రంపై రష్యా దళాలు పేలుళ్లకు పాల్పడ్డాయని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ ఆరోపించారు. తమను బ్లాక్ మెయిల్ చేసేందుకే వారు ఈ చర్యకు పాల్పడ్డారన్నారు. మరోవైపు రష్యా మాత్రం ఉక్రెయిన్ సైన్యం జరిపిన దాడుల వల్లే మంటలు వ్యాపించాయని చెబుతోంది. యూరప్‌లోనే అతిపెద్ద అణువిద్యుత్ కేంద్రాల్లో ఒకటైన జపోర్జియా న్యూక్లియర్ పవర్‌ప్లాంటులో ప్రస్తుతం మంటలు ఎగిసిపడుతున్నాయి. అయితే ఇక్కడ ఎలాంటి రేడియేషన్ లీక్ కాలేదని అంతర్జాతీయ అణుశక్తి సంస్థ సిబ్బంది తెలిపారు. మంటలు వ్యాపించిన ప్రదేశానికి తమను అనుమతించాలని వారు కోరుతున్నారు.కాగా, రష్యా, ఉక్రెయిన్ యుద్ధం మొదలైన 2022లోనే ఈ అణువిద్యుత్ కేంద్రాన్ని రష్యాదళాలు తమ ఆధీనంలోకి తీసుకున్నాయి. అప్పటి నుంచి ఇక్కడ విద్యుత్ ఉత్పత్తిని నిలిపివేశారు. తాజాగా ఈ విద్యుత్కేంద్రం కూలింగ్టవర్లపై డ్రోన్ దాడి జరిగింది. -
భవిష్యత్తులో కరెంట్ కష్టాలు తీరేనా..?
అభివృద్ధి చెందుతున్న దేశంలో ప్రధానంగా కరెంట్ అవసరాలు కూడా పెరుగుతాయి. ఇండియా 2027 నాటికి దాదాపు 8 ట్రిలియన్ డాలర్ల ఎనానమీ మార్కును తాకనుందని అంచనాలు వెలువడుతున్నాయి. అందుకు పారిశ్రామిక రంగం ఎంతో చేయూతనందిస్తుంది. అయితే దానికి చాలా విద్యుత్ అవసరం అవుతుంది. దాంతోపాటు దాదాపు అన్ని రంగాల్లో విద్యుత్ ప్రధానపాత్ర పోషిస్తుంది. కానీ దాని తయారీకి ప్రభుత్వాలు, యంత్రాంగం ఎన్నో సవాళ్లు ఎదుర్కొంటుంది. సమర్థంగా కరెంట్ తయారు చేసి వినియోగించేలా పరిశోధనలు జరుగుతున్నాయి. అందులో అణు విద్యుత్‌కే పెద్దపీట వేస్తున్నారు. అణు విద్యుత్ రంగంలో 26.50 బిలియన్ డాలర్ల (సుమారు రూ.2.10 లక్షల కోట్ల) పెట్టుబడులను ఆకర్షించేందుకు దిగ్గజ కార్పొరేట్ కంపెనీలతో ప్రభుత్వం సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలుస్తోంది. అణు విద్యుదుత్పత్తిని భారీగా పెంచడమే దీని వెనక ఉద్దేశమని విశ్వసనీయ వర్గాలను ఉటంకిస్తూ కొన్ని మీడియా కథనాల ద్వారా తెలుస్తుంది. అణు విద్యుత్ వల్ల కర్బన ఉద్గారాలు వెలువడవు. ప్రస్తుతం చూస్తే, దేశీయంగా జరుగుతున్న మొత్తం విద్యుదుత్పత్తిలో అణు విద్యుత్ వాటా 2% కంటే తక్కువగానే ఉంది. అందుకే తొలిసారిగా ఈ రంగంలోకి ప్రైవేట్ పెట్టుబడులను ప్రభుత్వం ఆహ్వానిస్తోందని చెబుతున్నారు. దేశ విద్యుత్తు ఉత్పత్తిలో సంప్రదాయేతర ఇంధనాల ద్వారా జరుగుతోంది 42% కాగా, దీనిని 2030 కల్లా 50 శాతానికి పెంచుకోవాలని ప్రభుత్వం భావిస్తోంది. ప్రముఖ కంపెనీలతో చర్చలు అణు విద్యుత్ రంగంలో ప్రైవేట్ పెట్టుబడుల వల్లే ఈ లక్ష్యాలను చేరుకోవచ్చని అంచనా వేస్తున్నారు. దాంతో రిలయన్స్ ఇండస్ట్రీస్, అదానీ పవర్, వేదాంతా, టాటా పవర్లతో ప్రభుత్వం చర్చలు జరుపుతోందని తెలిసింది. ఒక్కో సంస్థ సుమారు రూ.44,000 కోట్ల (5.30 బిలియన్ డాలర్లు) వరకు పెట్టుబడులు పెట్టేలా ప్రోత్సహిస్తుంది. ఏడాదికాలంగా ఈ సంస్థలతో డిపార్ట్మెంట్ ఆఫ్ అటామిక్ ఎనర్జీ, న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (ఎన్పీసీఐఎల్)లు పలు దఫాలుగా సంప్రదింపులు జరిపినట్లు వివరించింది. 1.300 మెగావాట్ల సామర్థ్యం పెరిగే అవకాశం.. ప్రస్తుతం దేశంలో 7,500 మెగావాట్ల సామర్థ్యంతో అణు విద్యుత్ ప్లాంట్లను ఎన్పీసీఐఎల్ నిర్వహిస్తోంది. మరో 1,300 మెగావాట్ల సామర్థ్యాన్ని అభివృద్ధి చేసేందుకు పెట్టుబడులు పెట్టాలన్నది ఆ సంస్థ ప్రణాళిక. ప్రైవేట్ సంస్థలు పెట్టుబడులు పెడితే, 2040 కల్లా 11,000 మెగావాట్ల మేర అణు విద్యుదుత్పత్తి సామర్థ్యం సమకూరుతుందని అంచనా. -
ఆవు పేడతో కట్టిన ఇళ్లతో అణుధార్మికత నుంచి రక్షణ
వియారా(గుజరాత్): ఆవు పేడతో నిర్మించిన ఇళ్లు అణుధార్మికత నుంచి రక్షణ ఇస్తాయనే విషయం సైన్సు నిరూపించిందని గుజరాత్‌లోని తాపి జిల్లా సెషన్స్ జడ్జి సమీర్ వ్యాస్ పేర్కొన్నారు. గో మూత్ర ఎన్నో వ్యాధుల నుంచి కాపాడుతుందని తెలిపారు. అందుకే దేశంలోని గోవులను, వధించడం మానేసి రక్షించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. గోవుల అక్రమ రవాణాకు పాల్పడిన ఓ వ్యక్తికి శిక్ష విధిస్తూ ఇచ్చిన తీర్పులో ఈ విషయాలను ఆయన పేర్కొన్నారు. గత ఏడాది నవంబర్‌లో ఇచ్చిన తీర్పు వివరాలు తాజాగా వెల్లడయ్యాయి. ప్రపంచంలోని అన్ని సమస్యలకు గోవధే కారణమని ఆయన పేర్కొన్నారు. మహారాష్ట్రకు చెందిన మహ్మద్ అమిన్ అంజుమ్(20) 2020లో గుజరాత్ నుంచి ఆవులను తరలిస్తూ పట్టుబడ్డాడు. -
నయా అణుకేంద్రం ‘నాట్రియం’
ముప్పై కోట్ల నుంచి.. మూడు వందల కోట్లు.. భూమి ఉష్ణోగ్రత రెండు డిగ్రీల సెల్సియస్ పెరిగితే వచ్చే వాతావరణ మార్పుల ప్రభావం వల్ల మరణించే వారి సంఖ్య ఇది! బొగ్గు, చమురు ఉత్పత్తుల వాడకం వల్ల కార్బన ఉద్గారాలు పెరిగి ఉష్ణోగ్రతలు మండిపోతున్నాయి.. వాటిని తగ్గించి, కాలుష్యం లేని విద్యుత్ ఉత్పత్తి కోసం అంతర్జాతీయంగా చాలా ప్రయత్నాలే జరుగుతున్నాయి నాట్రియం కూడా అలాంటిదే.. ఇదేంటి కొత్త అనుకుంటున్నారా? చాలా సింపుల్ మనం నిత్యం వాడే ఉప్పులో ఉండే సోడియం. సోడియంతో అణుశక్తి రంగంలో సరికొత్త విప్లవాన్ని సృష్టించే ప్రయత్నమే ‘నాట్రియం’ ప్రాజెక్టు సాక్షి హైదరాబాద్: బొగ్గు, చమురు వాడకంతో భూవాతావరణంలో పేరుకుపోతున్న విష వాయువులను తగ్గించాలన్నది అందరి ప్రయత్నం. కాలుష్యం లేని విద్యుత్ ఉత్పత్తి చేయాలన్నది లక్ష్యం. సౌర, పవన, జియో థర్మల్, తరంగ శక్తి వంటి అన్నిరకాల సంప్రదాయేతర ఇంధన వనరులను ఉయోగించినా అది సాకారం కావాలంటే ఏండ్లకేండ్లు పడతాయి. పైగా వీటి వాడకంలో బోలెడన్ని చిక్కులూ ఉన్నాయి. ఈ క్రమంలోనే ‘నాట్రియం’ తెరపైకి వచ్చింది. ఓవైపు వాతావరణంలోని కార్బన్‌డయాక్సైడ్‌ను తగ్గిస్తూనే.. మరోవైపు నిరంతరం విద్యుత్తు ఉత్పత్తి చేసేందుకు నాట్రియం ఉపయోగపడుతుందని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. ఈ దిశగానే మైక్రోసాఫ్ట్ అధినేత బిల్‌గేట్స్‌కు చెందిన టెరాపవర్, అంతర్జాతీయ సంస్థలు జనరల్ ఎలక్ట్రిక్, హిటాచీ, అమెరికా ప్రభుత్వ డిపార్ట్మెంట్ ఆఫ్ ఎనర్జీ కలిసి.. సోడియం ఆధారిత అణు విద్యుత్ కేంద్రాలను అభివృద్ధి చేస్తున్నారు. సాంకేతికత పరంగా నాలుగో తరంగా చెప్పుకుంటున్న ఈ అత్యాధునిక న్యూక్లియర్ రియాక్టర్ తయారీ వెనుక దశాబ్దాల శ్రమ దాగి ఉంది. అమెరికాలోని ఓ రహస్య ప్రాంతంలో ఈ నమూనా అణు విద్యుత్ కేంద్రం నిర్మాణం పూర్తయింది కూడా. అన్నీ సవ్యంగా సాగితే.. మరికొన్ని నెలల్లోనే దాని నుంచి 345 మెగావాట్ల విద్యుత్తు అమెరికాకు అందనుంది. చవక, భద్రత కూడా.. నాట్రియం అణువిద్యుత్ కేంద్రాల వల్ల ఎన్నో లాభాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. అణువిద్యుత్ అనగానే రేడియేషన్ భయం మొదలవుతుంది. అయితే బొగ్గు, చమురు వంటి సంప్రదాయ ఇంధనాలతో జరిగే విద్యుదుత్పత్తిలో ప్రతి టెరావాట్ ఉత్పత్తికి 24.6.. 18.1 చొప్పున మరణాలు సంభవిస్తోంటే.. అణువిద్యుత్ కారణంగా జరుగుతున్న మరణాలు 0.07 మాత్రమేనని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. ఇన్నేండ్ల అణువిద్యుత్ ఉత్పత్తి చరిత్రలో చెర్నోబిల్, ఫుకుషిమా వంటి రెండు ప్రమాదాలు మాత్రమే జరగాయని గుర్తు చేస్తున్నారు. అయితే నాట్రియం డిజైన్‌లో హైడ్రోజన్, ఆక్సిజన్ ఉత్పత్తి అసలే లేనందున ఫుకుషిమా వంటి సంఘటనలు జరిగే అవకాశమే ఉండదని చెబుతున్నారు. వంద శాతం ఉత్పత్తి నాట్రియం డిజైన్‌లోని అణువిద్యుత్ కేంద్రాలు పూర్తి ఉత్పత్తి సామర్థ్యంతో పనిచేస్తాయి. అదికూడా రోజంతా. ఈ ఏడాది అమెరికాలో ప్రారంభం కానున్న నాట్రియం అణువిద్యుత్ కేంద్రం సామర్థ్యం 345 మెగావాట్లు. ఎండాకాలంలోగానీ, ఎప్పుడైనా అత్యవసర పరిస్థితుల్లోగానీ అకస్మాత్తుగా విద్యుత్‌కు డిమాండ్ పెరిగితే.. నాట్రియం అణువిద్యుత్ కేంద్రాల నుంచి ఆరేడు గంటల పాటు ఏకంగా 550 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేయవచ్చు. ఒక్కో నాట్రియం అణువిద్యుత్ కేంద్రం ద్వారా సుమారు 2.25 లక్షల ఇండ్లకు నిరంతర విద్యుత్ సరఫరా చేయవచ్చునని నిపుణులు అంచనా వేశారు. నాట్రియం విజయవంతమైతే అతితక్కువ స్థలంలోనే ఈ కొత్త తరహా అణువిద్యుత్ కేంద్రాలను ప్రపంచవ్యాప్తంగా ఎక్కడైనా ఏర్పాటు చేసుకోవచ్చునని అంటున్నారు. నీటికి బదులు ఉప్పు! నాట్రియంకు, సంప్రదాయ అణువిద్యుత్ కేంద్రాలకు మధ్య ఉన్న ప్రధానమైన తేడా ఉప్పు వాడకమే. యురేనియం అణువులను న్యూట్రాన్లతో ఢీకొట్టించడం ద్వారా పుట్టే శక్తితో నీటిని ఆవిరిగా మార్చడం, ఆ ఆవిరి సాయంతో టర్బయిన్లను తిప్పి విద్యుదుత్పత్తి చేయడం సంప్రదాయ అణువిద్యుత్ కేంద్రాల్లో జరిగే ప్రక్రియ. నాట్రియంలోనూ ఇదే తరహాలో జరుగుతుంది. కానీ నీటికి బదులు ఉప్పును ఉపయోగిస్తారు. ఇక నీరు వంద డిగ్రీల సెల్సియస్‌లో ఆవిరిగా మారితే.. ఉప్పు 500 డిగ్రీల ఉష్ణోగ్రతలో ఆవిరిగా మారుతుంది. పైగా నీళ్లు వేడయ్యాక హైడ్రోజన్, ఆక్సిజన్లుగా విడిపోయినట్టు ఉప్పు విడిపోదు. ఐదురెట్లు ఎక్కువ వేడిని నిల్వ చేసుకున్న ఉప్పును రియాక్టర్‌కు దూరంగా తీసుకెళ్లి నిల్వ చేయడం, అవసరానికి తగ్గట్టు నీటిని వేడి చేసి విద్యుత్‌ను ఉత్పత్తి చేసుకోవడం ‘నాట్రియం’ అణు విద్యుత్తు కేంద్రాల డిజైన్‌లోని ప్రధాన విశేషం. -
అమెరికా అణుశక్తి విభాగం చీఫ్‌గా రీటా
వాషింగ్టన్: భారత సంతతికి చెందిన రీటా బరన్వాల్ త్వరలో అమెరికా అణుశక్తి విభాగం అధిపతి కానున్నారు. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గత వారం ఈమెను ఈ పదవికి నామినేట్ చేశారు. ఈ ప్రతిపాదనపై సెనెట్ ఆమోదముద్ర వేస్తే రీటా ఇంధన విభాగం సహాయ మంత్రి హోదాలో నియమితులవుతారు. ఈ హోదాలో అణు సాంకేతికత పరిశోధన, నిర్వహణ, అభివృద్ధి బాధ్యతలను రీటా చేపడతారు. ప్రస్తుతం అణు విభాగంలోని గేట్‌వే ఫర్ యాక్సిలరేటెడ్ ఇన్నోవేషన్‌కు డైరెక్టర్‌గా ఉన్న రీటా.. గతంలో అమెరికా నావికాదళ రియాక్టర్లలో వాడే అణు ఇంధన పదార్థాల పరిశోధన, అభివృద్ధి విభాగానికి నేతృత్వం వహించారు. రీటా బరన్వాల్ మసాచుసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నుంచి బీఎస్సీ డిగ్రీ, మిచిగాన్ యూనివర్సిటీ నుంచి ఎమ్మెస్సీ, పీహెచ్డీ పొందారు. -
అణుశక్తి బ్యాటరీలు వచ్చేస్తున్నాయి!
మీ స్మార్ట్‌ఫోన్‌ను ఓ పదేళ్లపాటు ఛార్జ్ చేయాల్సిన అవసరం లేదని ఎవరైనా చెప్పారనుకోండి.. అసాధ్యమని తల అడ్డంగా ఊపేస్తాం. కానీ అణుశక్తి ద్వారా దీన్ని సుసాధ్యం చేసేందుకు ప్రయత్నిస్తున్నారు మాస్కో ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫిజిక్స్ శాస్త్రవేత్తలు. అణువిద్యుదుదత్పత్తికి ప్రస్తుతం కోటానుకోట్లు ఖర్చుపెట్టి నిర్మిస్తున్న భారీసైజు విద్యుత్ కేంద్రాల స్థానంలో చిన్న చిన్న బ్యాటరీల్లాంటివి వాడతారన్నమాట. నికెల్ – 63 అనే మూలకం ద్వారా రష్యా శాస్త్రవేత్తలు ఇప్పటికే అణుబ్యాటరీను డిజైన్ చేశారు కూడా. దీంట్లో ప్రస్తుతం మనం వాడుతున్న బ్యాటరీల కంటే ఎక్కువ మోతాదులో విద్యుత్తును నిల్వ చేయగలిగారు శాస్త్రవేత్తలు. రేడియోధార్మిక లక్షణమున్న పదార్థాలు నశించిపోతూ చాలా నెమ్మదిగా ఎలక్ట్రాన్లు/పాసిట్రాన్లను విడుదల చేస్తాయి. ఇలా విడుదలయ్యే ఎలక్ట్రాన్లు/పాసిట్రాన్లను సిలికాన్ వంటి అర్ధ వాహకపు పొరలోకి పంపిస్తే కరెంటు ఉత్పత్తి అవుతుంది. నికెల్ – 63తో సిద్ధం చేసిన నమూనా బ్యాటరీ ప్రతి ఘనపు సెంటీమీటర్లోనూ దాదాపు పది వాట్ల వరకూ విద్యుత్తును నిల్వ చేయవచ్చు. నికెల్ –63 అర్ధాయుష్షు వందేళ్లను పరిగణలోకి తీసుకుంటే ఈ బ్యాటరీ సాధారణ ఎలక్ట్రో కెమికల్ బ్యాటరీల కంటే పది రెట్లు ఎక్కువ కాలం పాటు విద్యుత్తును అందివ్వగలవు. -
టెక్నో ఇండియా
సాంకేతిక భారతం స్వాతంత్య్రం వచ్చే నాటికి భారతదేశం రసం పీల్చేసిన చెరకు గెడ! వనరులన్నింటినీ ఊడ్చేసి పాలకులు బ్రిటన్‌కు తరలిస్తే.. మనకు మిగిలింది దరిద్రం.. ఆకలి! పాలపొడి, గోధుమలు, పోషకాహారం, టీకాలు.. ఇలా అప్పట్లో మనం దిగుమతి చేసుకోని వస్తువు లేదు. మరి ఇప్పుడు.. మన తిండి మనమే పండించుకుంటున్నాం. పాల ఉత్పత్తిలో ఒకటవ స్థానానికి ఎదిగాం. హాలీవుడ్ సినిమా బడ్జెట్ కంటే తక్కువ ఖర్చుతో కోటానుకోట్ల మైళ్ల దూరంలో ఉన్న అరుణ గ్రహాన్ని అందుకోగలిగాం! శాస్త్ర, పరిశోధన రంగాలపై నాటి పాలకులు దూరదృష్టితో పెట్టిన నమ్మకమిప్పుడు ఫలితాలిస్తోంది. ప్రపంచస్థాయి విశ్వవిద్యాలయాల జాబితాలో భారతీయ సంస్థలకు స్థానం లేకపోవచ్చునేమోగానీ... టాప్ –5 టెక్ కంపెనీలను నడుపుతున్నది మాత్రం మనవాళ్లే! అణు విద్యుత్తు... దేశ విద్యుదుత్పత్తిలో అణుశక్తి వాడకం నాలుగైదు శాతానికి మించకపోవచ్చుగానీ.. దేశ రక్షణ అవసరాల దృష్ట్యా చూస్తే ఈ రంగంలో మన సాధన ఆషామాషీ ఏం కాదు. శాంతియుత ప్రయోజనాలకు మాత్రమే అణుశక్తిని వాడతామని అంతర్జాతీయ వేదికలపై ఎన్ని వాగ్దానాలు చేసినా పాశ్చాత్య దేశాలు మనల్ని నమ్మకపోవడమే కాదు.. వీళ్ల చేతిలో అణుశక్తి పిచ్చోడి చేతిలో రాయి చందమన్న తీరులో హేళన చేసిన సందర్భాలూ అనేకం. ఈ నేపథ్యంలోనే హోమీ జహంగీర్ బాబా వంటి దార్శనికుల కృషి ఫలితంగా భారత అణుశక్తి కార్యక్రమం మొదలైంది. దేశంలో విస్తృతంగా అందుబాటులో ఉన్న థోరియం నిల్వలను సమర్థంగా వాడుకోవడం లక్ష్యంగా ఈ మూడంచెల కార్యక్రమం మొదలైంది. పరిమితస్థాయిలో ఉన్న సహజ యురేనియం నిల్వలతో ప్రెషరైజ్డ్ హెవీవాటర్ రియాక్టర్లను అభివృద్ధి చేసి విద్యుత్తు అవసరాలు తీర్చుకోవడం మొదటి దశ కాగా.. ఈ దశలో వ్యర్థంగా మిగిలిపోయే ప్లుటోనియంను మెటల్ ఆౖక్సైడ్ల రూపంలో ఫాస్ట్ బ్రీడర్ రియాక్టర్ల ద్వారా విద్యుదుత్పత్తికి వాడుకోవడం రెండో దశ. ప్రపంచ నిల్వలో నాలుగోవంతు ఉన్న థోరియం ఇంధనంగా పనిచేసే అడ్వాన్స్డ్ హెవీ వాటర్ రియాక్టర్లను అందుబాటులోకి తేవడం మూడోదశ. అణు ఒప్పందంతో ప్రస్తుతం మనకు ఇతరదేశాల నుంచి యురేనియం చౌకగా అందుతున్న నేపథ్యంలో మూడోదశ అణు కార్యక్రమం అమలయ్యేందుకు ఇంకో 15 ఏళ్లు పట్టవచ్చు. సమాచార రహదారిపై రయ్యి మంటూ.. ‘‘అరువు తెచ్చుకున్న టెక్నాలజీల ఆధారంగా గొప్ప దేశాలను తయారు చేయలేము’’ ఈ మాటన్న శాస్త్రవేత్త పేరు విజయ్ పురంధర భట్కర్! ఈయన ఎవరో మనలో చాలామందికి తెలియకపోవచ్చుగానీ.. ‘పరమ్ 8000’ పేరుతో దేశంలోనే మొట్టమొదటి సూపర్‌కంప్యూటర్‌ను తయారు చేసి ఒకరకంగా ఐటీ రంగానికి బాటలు వేసిన వ్యక్తి అని చెప్పుకోవచ్చు. 1960లలోనే పాశ్చాత్యదేశాల్లో కంప్యూటర్లు అందుబాటులోకి వచ్చేశాయి.. మనకు మాత్రం 80లలోగానీ తెలియలేదు. అయితే ఆ తరువాతి కాలంలో మాత్రం ఈ రంగంలో మనం అపారమైన ప్రగతినే సాధించాం. 1967లో టాటా సంస్థ తొలి సాఫ్ట్వేర్ ఎగుమతుల కంపెనీని మొదలుపెట్టినా.. 1991లో డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికాం దేశవ్యాప్తంగా సాఫ్ట్‌వర్ టెక్నాలజీ పార్కుల ఏర్పాటుతో ఐటీ ప్రస్థానం వేగమందుకుంది. 1998 నాటికి స్థూల జాతీయోత్పత్తిలో ఐటీ వాటా కేవలం 1.2 శాతం మాత్రమే ఉండగా.. 2015 నాటికి ఇది 9.5 శాతానికి పెరిగిపోయిందంటేనే పరిస్థితిని మనం అర్థం చేసుకోవచ్చు. దేశంలోని యువతకు ఈ రంగం సృష్టించిన ఉపాధి అవకాశాల గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరమే లేదు. అరచేతిలో ప్రపంచం.. సెల్‌ఫోన్! ఇంటికి టెలిఫోన్ కావాలంటే.. నెలల తరబడి వెయిటింగ్ లిస్ట్‌లో ఉండాల్సిన కాలం నుంచి అనుకున్నదే తడవు ప్రపంచాన్ని మన ముందు తెచ్చే సెల్ఫోన్ల వరకూ టెలికమ్యూనికేషన్ల రంగంలో దేశం సాధించిన ప్రగతి అనితర సాధ్యమంటే అతిశయోక్తి కాదు. దేశ జనాభా 130 కోట్ల వరకూ ఉంటే.. మొబైల్‌ఫోన్ కనెక్షన్లు 118 కోట్ల వరకూ ఉండటం గుర్తించాల్సిన విషయం. కేవలం సమాచార సాధనంగా మాత్రమే కాకుండా.. ఉత్పాదకతను పెంచుకునేందుకు తద్వారా ఎక్కువ ఆదాయం ఆర్జించేందుకు అవకాశం కల్పించిన సాధనంగా మొబైల్‌ఫోన్‌ను సామాన్యుడు సైతం గుర్తిస్తున్నాడు. ఆర్థిక సరళీకరణల వరకూ ప్రభుత్వం అధిపత్యంలోనే నడిచిన టెలికమ్యూనికేషన్ల శాఖ.. ఆ తరువాత కార్పొరేటీకరణకు గురికావడం.. ప్రైవేట్ సంస్థలు రంగంలోకి దిగడంతో వినియోగదారులకు మేలు జరిగింది. అంతరిక్షాన్ని జయించాం... 1963 నవంబరు 21వ తేదీకి ఓ ప్రత్యేకత ఉంది. తిరువనంతపురం సమీపంలోని తుంబా ప్రాంతంలోని ఒక చర్చి కార్యశాలగా... ఆ పక్కనే ఉన్న బిషప్ రెవరెండ్ పీటర్ బెర్నర్డ్ పెరీరియా ఇల్లే ఆఫీసుగా.. సైకిళ్లు, ఎద్దుల బండ్లే రవాణా వ్యవస్థలుగా భారత అంతరిక్ష ప్రయోగాలకు శ్రీకారం పడింది ఈ రోజునే. సాంకేతిక పరిజ్ఞానం విషయంలో విదేశీ సాయం ఏమాత్రం లేకుండా... విక్రం సారాభాయ్, ఏపీజే అబ్దుల్ కలాం వంటి దిగ్గజాలు మొదలుపెట్టిన ఈ కార్యక్రమం నేడు ఎంత బహుముఖంగా విస్తరించిందో.. విస్తరిస్తూ ఉందో మన కళ్లముందు కనిపిస్తూనే ఉంది. అంతరిక్ష ప్రయోగాలను ఆధిపత్య పోరు కోసం కాకుండా జన సామాన్యుడి అవసరాలు తీర్చేందుకు మాత్రమే ఉపయోగిస్తామన్న గట్టి వాగ్దానంతో మొదలైన ఇస్రో దశలవారీగా ఎస్ఎల్వీ, పీఎస్ఎల్వీ, జీఎస్ఎల్వీ రాకెట్ల దశకు చేరుకుంది. టెలిఫోన్లు, టీవీ కార్యక్రమాలు, ప్రకృతి వనరుల నిర్వహణ, విపత్తు సమయాల్లో ఆదుకునేందుకు ఇలా.. అనేక రంగాల్లో అంతరిక్ష ప్రయోగాలు మనకు అక్కరకొస్తున్నాయి. ఇవన్నీ ఒక ఎత్తు అయితే.. చంద్రయాన్ –1, మంగళ్యాన్ ప్రయోగాలు మరో ఎత్తు. సాంకేతిక పరిజ్ఞానం విషయంలో మనం ఎవరికీ తీసిపోమని ప్రపంచానికి చాటి చెప్పినవి ఇవే. పోఖ్రాన్ అణు పరీక్షలను నిరసిస్తూ అమెరికా క్రయోజెనిక్ ఇంజిన్ల టెక్నాలజీ మనకు దక్కకుండా రష్యాను నిలువరించినా.. కొంచెం ఆలస్యంగానైనా అదే ఇంజిన్‌ను మనం సొంతంగా అభివృద్ధి చేసుకోవడం భారతీయులుగా గర్వించదగ్గ విషయమే. హేతువుకు చోటు కావాలి! శాస్త్ర, సాంకేతిక రంగాల్లో దేశం సాధించిన ప్రగతి మనందరికీ గర్వకారణమే. అందులో సందేహమేమీ లేదు. అయితే అదే సమయంలో మన రాజ్యాంగం నిర్దేశించిన ఆదేశిక సూత్రాల్లో ఒకటైన శాస్త్రీయ దక్పథం లేమి పౌరులుగా మనకు అంత శోభనిచ్చేది మాత్రం కానేకాదు. భారతీయ శాస్త్రవేత్తలకు గత 85 ఏళ్లలో నోబెల్ బహుమతి రాకపోయేందుకు ఇదే ప్రధాన కారణమని పద్మభూషణ్.. దివంగత పుష్ప మిత్ర భార్గవ వ్యాఖ్యానించడం వాస్తవ పరిస్థితికి అద్దం పడుతుంది. మనిషి తయారు చేసే కంప్యూటర్ను తొలిసారి ఆన్ చేస్తూ కొబ్బరికాయలు కొట్టడం.. రాకెట్ ప్రయోగాలకు ముందు దేవాలయాల్లో పూజలు ఈ శాస్త్రీయ దృక్పథ లేమికి అద్దం పట్టేవి. మతం ఒక విశ్వాసం. దానికి శాస్త్రాన్ని జోడించడం అంత సరికాదన్నది కొంతమంది శాస్త్రవేత్తల అభిప్రాయమైతే.. మత విశ్వాసం తమకు సానుకూల దక్పథాన్ని అలవరచి.. చేసే పని విజయవంతమయ్యేందుకు దోహదపడితే ఎలా తప్పు పడతారని ఇంకొందరు అంటూ ఉంటారు. అవయవ మార్పిడి పురాణాల్లోనే ఉందని.. కౌరవులు కుండల్లో పుట్టారు కాబట్టి.. అప్పటికే టెస్ట్‌ట్యూబ్ బేబీల టెక్నాలజీ ఉందని వాదించడం శాస్త్రీయ దృక్పథం ఎంతమాత్రం అనిపించుకోదు. పురాణ కాలంలోనే విమాన నిర్మాణ శాస్త్రం ఉందని 102వ జాతీయ సైన్స్ కాంగ్రెస్‌లో ఒక పరిశోధన వ్యాసం ప్రచురితమవడం ఎంత దుమారానికి దారితీసిందో తెలియంది కాదు. ఒకవేళ ఇవన్నీ నిజంగానే ఉన్నాయని కొందరు నమ్మితే.. వాటిని ఈ కాలపు ప్రమాణాలతో రుజువు చేయాల్సిన బాధ్యతా వారిపైనే ఉంటుంది. అలా కాకుండా కేవలం ప్రకటనలకు పరిమితమవడం.. తర్కబద్ధమైన విశ్లేషణకు తావివ్వకపోవడం సరికాదు. – ప్రణవ మహతి -
ఉత్తర కొరియా యుద్ధానికి దిగుతుందా?
-
ఉత్తర కొరియా యుద్ధానికి దిగుతుందా?
న్యూయార్క్: నేడు ఉత్తర కొరియా మాటి మాటికి అణు బాంబులు ప్రయోగిస్తామంటూ ప్రపంచ దేశాలను భయపెడుతోంది. అమెరికా, ఆస్ట్రేలియా దేశాలు కూడా భయపడాల్సి వస్తోంది ? ఆ దేశం వద్ద అన్ని అణ్వస్త్రాలు ఉన్నాయా ? ఉన్నా అన్నంత పనిచేస్తుందా? ఉత్తర కొరియా వద్ద శక్తివంతమైన అణ్వస్త్రాలు ఉండడమే కాకుండా ఆ దేశ నియంత కిమ్ జాంగ్ ఉన్ అన్నంత పనిచేసే దుందుడుకు స్వభావి అవడం కూడా భయానికి కారణం అవుతుంది. 2006, 2009, 2012 సంవత్సరాల్లో వరుసగా అణ్వస్త్ర ప్రయోగాలు నిర్వహించిన ఉత్తర కొరియా ఒక్క 2016లోనే రెండోసార్లు అణ్వస్త్ర ప్రయోగాలను నిర్వహించింది. అంతేకాకుండా హైడ్రోజన్ బాంబును కూడా విజయవంతంగా ప్రయోగించి చూసింది. సుదూర లక్ష్యాలను ఛేదించే ఖండాంతర క్షిపణలు కలిగిన ఈ దేశం వద్ద అపార సైనిక శక్తి ఉంది. వరుసగా దక్షిణ కొరియాతో యుద్ధాలు జరుగుతుండడం వల్ల ఈ దేశం అపార సైనిక సంపత్తిని సమకూర్చుకుంది. ‘ఉత్తర కొరియా నుంచి మున్నెన్నడూ లేనంతగా ముప్పు పొంచి ఉంది. ఆ దేశం బెదిరింపులను మా ప్రభుత్వం మాత్రం తీవ్రంగానే పరిగణిస్తోంది’ ఆస్ట్రేలియా ప్రధాని మాల్కమ్ టర్న్‌బుల్ వ్యాఖ్యానించారు. ఉత్తర కొరియాతో అతిపెద్ద యుద్ధం జరిగే అవకాశం పూర్తిగా ఉందని అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ కూడా ఇటీవల తన ఓవల్ ఆఫీసు నుంచి రాయిటర్స్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు. ఉత్తర కొరియా అన్నంత పనిచేస్తుందన్నది వీరిద్దరి మాటల్లో వ్యక్తం అవుతోంది. మాజీ సోవియట్ యూనియన్ సహకారంతో ఉత్తర కొరియా తన అణు పరిశోధనలు 1950 దశకం నుంచే ప్రారంభించింది. ప్రచ్ఛన్న యుద్ధం ముగిసిన రెండేళ్ల తర్వాత, అంటే 1993లో ప్రపంచ అణ్వస్త్ర వ్యాప్తి నిరోధక ఒప్పందం (ఎన్పీటీ) నుంచి ఉత్తర కొరియా తప్పుకుంది. అప్పటి నుంచి అమెరికా, ఇతర ప్రపంచ దేశాలతోని ఉత్తర కొరియా సంబంధాలు క్షీణిస్తూ వచ్చాయి. -
అణు విద్యుత్‌లో ఏపీ, తెలంగాణ కీలకం
* విశాఖలో బార్క్-2 ఏర్పాటు * నల్లగొండ యురేనియం నిక్షేపాలు నాణ్యమైనవి * బార్క్ డెరైక్టర్ శేఖర్ బసు వెల్లడి సాక్షి, హైదరాబాద్: దేశ అణు విద్యుత్ రంగంలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు కీలకపాత్ర పోషించే అవకాశముందని బాబా అటామిక్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ (బార్క్) డైరెక్టర్ డాక్టర్ శేఖర్ బసు అభిప్రాయపడ్డారు. ఏపీలోని విశాఖపట్నంలో రెండో బార్క్ కేంద్రం నిర్మాణానికి ఏర్పాట్లు జరుగుతుండటం, ఇటు తెలంగాణలోని నల్లగొండ జిల్లాలో యురేనియం నిక్షేపాలను వెలికితీసేందుకు తాము సిద్ధంగా ఉండటం దీనికి కారణాలని పేర్కొన్నారు. దేశంలో అణు విద్యుదుత్పత్తి అవకాశాలు-సవాళ్లు అన్న అంశం పై మంగళవారమిక్కడ ఇంజనీరింగ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియా ఏర్పాటు చేసిన వర్క్‌షాప్‌కు ముఖ్యఅతిథిగా హాజరైన శేఖర్ బసు ఆ తరువాత విలేకరులతో మాట్లాడారు. నల్లగొండలోని పెద్దగట్టు, లంబాపూర్ ప్రాంతాల్లో వైఎస్సార్ జిల్లాలోని తుమ్మలపల్లి క్షేత్రం కంటే నాణ్యమైన యురేనియం నిక్షేపాలు ఉన్నాయన్నారు. తుమ్మలపల్లిలో దాదాపు లక్ష టన్నుల నిక్షేపాలుంటే.. నల్లగొండలో ఇది 18,000 టన్నుల వరకూ ఉంటుం దని చెప్పారు. కొవ్వాడ అణువిద్యుత్ కేంద్రం కోసం భూ సేకరణ కొనసాగుతోందని తెలిపారు. భూసేకరణ పూర్తయిన తరువాత ఆరు అణు రియాక్టర్లతో కూడిన కొవ్వాడ కేంద్రం నిర్మాణంపై అంచనా వస్తుందన్నారు. దేశంలో అణువిద్యుత్‌పై అనేక అపోహలు ఉన్నాయని, విదేశీ నిధులతో పనిచేస్తున్న కొన్ని స్వచ్ఛంద సంస్థలు తప్పుడు ఆరోపణలు చేస్తున్నాయని చెప్పారు. విశాఖపట్నంలో దాదాపు నాలుగు వేల ఎకరాల విస్తీర్ణంలో ఏర్పాటు చేయబోయే రెండో బార్క్ కేంద్రం అత్యాధునిక టెక్నాలజీకి నిలయంగా ఉం టుందని శేఖర్ బసు తెలిపారు. కేన్సర్‌తోపాటు వైద్య చికిత్సల్లో ఉపయోగపడే రేడియో ఐసోటోప్ రియాక్టర్, పలు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాలను ఇక్కడ ఏర్పాటు చేస్తామన్నారు. బార్క్ ప్రజా చైతన్య విభాగం ఉన్నతాధికారి ఎస్.కె.మల్హోత్రా భావని, చైర్మన్, ఎండీ డాక్టర్ చెల్లపాండీ, అడ్వాన్స్డ్మెటీరియల్స్ డివిజన్ డెరైక్టర్ పరి హార్, ఇంజనీరింగ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియా డెరైక్టర్ డాక్టర్ యు.చంద్రశేఖర్, ఐఎన్ఎస్ఏ సీనియర్ సైంటిస్ట్ డాక్టర్ సి.గంగూలీ తదితరులు పాల్గొన్నారు. -
4 వారాలు
అణు వ్యతిరేక ఉద్యమకారులపై కేసుల ఎత్తివేతలో జాప్యాన్ని మద్రాసు హైకోర్టు తీవ్రంగా పరిగణించింది. కేసులు ఎత్తివేయడానికి ప్రభుత్వానికి నాలుగు వారాల గడువు ఇస్తూ గురువారం మద్రాసు హైకోర్టు ప్రధాన బెంచ్ ఆదేశాలు జారీ చేసింది. సాక్షి, చెన్నై : తిరునల్వేలి జిల్లా కూడంకులంలో అణు విద్యుత్ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఈ కేంద్రానికి వ్యతిరేకంగా మూడేళ్ల పాటు భారీఎత్తున ఉద్యమం సాగింది. నేటికీ కొసాగుతూనే ఉంది. ఉద్యమం ఉధృతంగా సాగుతున్న సమయంలో అటు రాష్ట్ర ప్రభుత్వం, ఇటు కేంద్రం ఉద్యమకారుల్ని టార్గెట్ చేశారుు. ఉద్యమాన్ని నీరుగార్చడం లక్ష్యంగా తీవ్ర సెక్షన్లతో కేసులు నమోదు చేశాయి. ఈ ఉద్యమంలో అత్యధికంగా సముద్ర తీరాల్లోని జాలర్ల గ్రామాల ప్రజలు పాలు పంచుకున్నారు. ప్రతి ఒక్కరిపై ఏదో ఒక కేసు నమోదు అయింది. ఉద్యమ నేతలపై పదుల సంఖ్యలో కేసులు పెట్టారు. ఎట్టకేలకు ఆ ఉద్యమాన్ని ప్రభుత్వం నీరుగార్చింది. తమ పంతాన్ని నెగ్గించుకునే రీతిలో కూడంకులంలో గత ఏడాది అణు విద్యుత్ ఉత్పత్తి ఆరంభం అయింది. ఉద్యమం చతికిల బడింది. కూడంకులంలో ఏదేని చిన్న పాటి శబ్దం వచ్చినా ఈ ఉద్యమ నేతలు తమ గళాన్ని విప్పడం ఆ తర్వాత మిన్నుకుండిపోవడం పరిపాటిగా మారింది. ఈ నేపథ్యంలో తమ మీద పెట్టిన కేసుల్ని ఎత్తి వేయాలంటూ కోర్టును ఉద్యమకారులు ఆశ్రయించారు. తమతో సాగిన చర్చల్లో కేసుల ఎత్తివేత అంశం ఉందని, అయితే, ఇంత వరకు ఒక్కరిపై కూడా కేసులు ఎత్తి వేయలేదంటూ హైకోర్టును ఆశ్రయించారు. ఇందుకు సానుకూలంగా స్పందించిన న్యాయస్థానం కేసుల ఎత్తివేతకు చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. గడువు :కేసుల ఎత్తి వేత ఆదేశాలు వెలువడి నెలలు గడుస్తున్నా, ప్రభుత్వం మాత్రం అందుకు తగ్గ చర్యలు తీసుకోలేదు. దీంతో అణు వ్యతిరేక ఉద్యమకారుల తరపున మళ్లీ కోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి. కేసుల ఎత్తి వేతలో జాప్యం జరుగుతోందని, నిర్లక్ష్యం వహిస్తున్నారని కోర్టు దృష్టికి తెచ్చారు. ఈ పిటిషన్ విచారణ గురువారం ప్రధాన న్యాయమూర్తి సంజయ్ కిషన్ కౌల్, న్యాయమూర్తి సత్యనారాయణల నేతృత్వంలోని ప్రధాన బెంచ్ ముందుకు వచ్చింది. వాదనల అనంతరం కేసుల ఎత్తివేత విషయమై నాలుగు వారాల్లోపు ఉత్తర్వులు జారీ చేయాలని ప్రభుత్వాన్ని బెంచ్ ఆదేశించింది. ఇందుకు తగ్గ వివరాల్ని, ఉత్తర్వుల్ని బెంచ్ దృష్టికి తీసుకురావాలని సూచించారు. తదుపరి విచారణను డిసెంబర్ ఐదో తేదీకి వాయిదా వేశారు. -
2030 నాటికి పదింతల అణువిద్యుత్!
సాక్షి, హైదరాబాద్: దేశ అణువిద్యుత్తు రంగంలో పెనుమార్పులకు రంగం సిద్ధమైందని. పెరుగుతున్న విద్యుత్ అవసరాలను తీర్చే లక్ష్యంతో స్థాపిత అణు శక్తి సామర్థ్యాన్ని పదింతలు పెంచేందుకు ప్రణాళికలు సిద్ధమయ్యాయని బాబా అణు పరిశోధన సంస్థ (బార్క్) డెరైక్టర్ శేఖర్ బసు తెలిపారు. హైదరాబాద్‌లో మంగళవారం జరిగిన అణు ఇంధన సముదాయం (నూక్లియ ర్ ఫ్యూయెల్ కాంప్లెక్స్, ఎన్ఎఫ్సీ) 41వ వార్షికోత్సవానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, దేశంలో ప్రస్తుత అణువిద్యుత్ సామర్థ్యం 4,700 మెగావాట్లు కాగా, 2030 నాటికి ఇది 50 వేల మెగావాట్లకు పెరగనుందని అన్నారు. కుడంకుళం విద్యుత్ కేంద్రం వెయ్యి మెగావాట్ల సామర్థ్యానికి చేరుకుందని, భావని రియాక్టర్ నిర్మాణ పనులు కూడా 98 శాతం వరకూ పూర్తయ్యాయని ఆయన వివరించారు. దేశం మొత్తమ్మీద ప్రస్తుతం 5,300 మెగావాట్ల ఉత్పత్తి సామర్థ్యమున్న అణువిద్యుత్ కేంద్రాలు నిర్మాణంలో ఉన్నాయని, 12, 13వ పంచవర్ష ప్రణాళికల కాలం పూర్తయ్యేసరికి మరో 17 వేల మెగావాట్లు ఉత్పత్తి చేయాలన్నది లక్ష్యమని వివరించారు. అయితే కొత్త రియాక్టర్ల నిర్మాణానికి అనువైన స్థలాన్ని ఎం చుకోవడంలోనూ, నిధులు సమీకరించడంలోనూ కొన్ని ఇబ్బం దులున్నాయని ఆయన చెప్పారు. మోడీ నేతృత్వంలో ఏర్పడ్డ కొత్త ప్రభుత్వం మౌలిక సదుపాయాల కల్పనకు పెద్దపీట వేస్తున్న నేపథ్యంలో ఈ ఇబ్బందులు తొలగిపోతాయని ఆశిస్తున్నట్లు ఆయన చెప్పారు. సైనిక, పౌర అవసరాల కోసం చిన్నస్థాయి అణురియాక్టర్ల తయారీకి ప్రయత్నాలు చేస్తున్నామని, పరిశోధనల దశను దాటిన తరువాత వచ్చే పంచవర్ష ప్రణాళిక సమయానికి దీన్ని ప్రతిపాదిస్తామని వివరించారు. ఎన్ఎఫ్సీ పదింతలు కావాలి.. దేశంలో భారీ ఎత్తున అణువిద్యుత్తు ఉత్పత్తి జరగనున్న నేపథ్యంలో కొత్త రియాక్టర్లన్నింటికీ ఇంధనాన్ని సరఫరా చేసేందుకు ఎన్ఎఫ్సీని పదింతలు విస్తరించాల్సి ఉంటుందని భారత అణుశక్తి సంస్థ అదనపు కార్యదర్శి సీబీఎస్ వెంకట రమణ తెలిపారు. ఎన్ఎఫ్సీ వార్షికోత్సవంలో ఆయన మాట్లాడుతూ పెరుగుతున్న విద్యుత్ అవసరాలను అణుశక్తి ద్వారా మాత్రమే తీర్చగలమని అభిప్రాయపడ్డారు. అణువిద్యుత్తు వల్ల ప్రమాదాలు జరుగుతాయనడం కేవలం అపోహ మాత్రమేనని అన్నారు. ఎన్ఎఫ్సీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ డాక్టర్ సాయిబాబా మాట్లాడుతూ, అణు ఇంధన ఉత్పత్తి విషయంలో ఎన్ఎఫ్సీ గత ఆర్థిక సంవత్సరం రికార్డు సృష్టించిందని తెలిపారు. మొత్తం 961 టన్నుల అణు ఇంధనాన్ని శుద్ధీకరించి సరఫరా చేశామని, దీంతోపాటు 14 లక్షల ఫ్యూయెల్ ట్యూబులు, 561 టన్నుల ఇన్గాట్స్ను అణురియాక్టర్లకు అందించామని అన్నారు. సృజనాత్మక ఆవిష్కరణల ద్వారా అణు ఇంధన ఉత్పత్తిని మరింత పర్యావరణ అనుకూలంగా మార్చేందుకు చర్యలు తీసుకుంటున్నామని వివరించారు. -
అణువిద్యుత్‌కు గ్రీన్‌సిగ్నల్
చెన్నై, సాక్షి ప్రతినిధి:ప్రజా సంఘాలకు, ప్రభుత్వాలకు మధ్య పదేళ్లుగా సాగుతున్న పోరాటానికి సుప్రీం కోర్టు తన తీర్పుతో తెరదించింది. అణువిద్యుత్ కేంద్రం తీరుపై అభ్యంతరాలు లేవనెత్తుతూ పర్యావరణ ప్రేమికులు, ప్రజా సంఘాలు వేసిన పిటిషన్లను కొట్టివేస్తున్నట్లు సుప్రీంకోర్టు గురువారం తీర్పుచెప్పింది. ఎటువంటి అదనపు భద్రతా చర్యలు అవసరం లేకుండానే విద్యుత్ ఉత్పత్తిని చేసుకోవచ్చని గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. తిరునెల్వేలీ జిల్లా కూడంకుళంలో రూ.13,500 కోట్ల వ్యయంతో అణువిద్యుత్ కేంద్రం నిర్మాణానికి భారత్-రష్యాల మధ్య ఒప్పందం జరిగింది. ఒక్కో యూనిట్ నుంచి వెయ్యి మెగావాట్ల చొప్పున రెండు యూనిట్లను నిర్మించాలని నిర్ణయించారు. 2002 మార్చిలో నిర్మాణ పనులకు శ్రీకారం చుట్టగా 2007 డిసెంబరు నాటికి మొదటి యూనిట్, 2008 డిసెంబరు నాటికి రెండో యూనిట్ నిర్మాణాన్ని పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. అయితే, అనుకున్న లక్ష్యానికి అనేక అడ్డంకులు ఎదురయ్యూయి. అణువిద్యుత్ కేంద్రం వల్ల పర్యావరణానికి ముప్పు వాటిల్లుతుందని, స్థానిక ప్రజలు అనారోగ్యానికి గురై ప్రాణాలు కోల్పోయే ప్రమా దం ఉందన్న ఆందోళనలు ప్రారంభమయ్యూరుు. జపాన్ లో జరిగిన అణువిద్యుత్ ప్రమాదాన్ని ఆందోళనకారులు ఉదహరించారు. కూడంకుళం పరిసర గ్రామాల ప్రజలు, ప్రధానంగా మత్స్యకారులు సైతం మద్దతుపలకడంతో పోరాటాలకు బలం చేకూరింది. ఈ పరిణామాలతో నిర్మాణ పనుల్లో జాప్యం ఏర్పడింది. ఇదిలా ఉండగానే 2010లో విద్యుత్ కేంద్రంలో రసాయనాలు నింపే పనులు ప్రారంభమయ్యూయి. దీంతో మళ్లీ ఆందోళనలు ఉధృతరూపం దాల్చాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు చెందిన అధికారులు, అణువిద్యుత్ నిపుణులు కూడంకుళంలో పర్యటించి సంతృప్తి వ్యక్తం చేశారు. అణువిద్యుత్ కేంద్రంలో పనులు కొనసాగించుకోవాలని 2012 మార్చి 19వ తేదీన రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించడంతో సెప్టెంబరు నుంచి రసాయనాలు నింపే ప్రక్రియ మళ్లీ ప్రారంభమై అక్టోబరు 2 వ తేదీన పూర్తయింది. అనేక అడ్డంకులు, ఆందోళనలను అధిగమించి ఎట్టకేలకూ గత ఏడాది అక్టోబరు 22వ తేదీన తొలియూనిట్లో ఉత్పత్తి ప్రారంభమైంది. అణువిద్యుత్ కేంద్రం భద్రతపై సుప్రీంకోర్టు సూచించిన నియమ నిబంధనలు, భద్రతా చర్యలను ఏమాత్రం అమలు చేయకుండానే ఉత్పత్తిని ప్రారంభించారని పర్యావరణ ప్రేమికుల సంఘం తరపున సుందరరాజన్ అనే వ్యక్తి సుప్రీంకోర్టులో మరో పిటిషన్ దాఖలు చేశాడు. ఈ పిటిషన్లపై విచారణ పూర్తి చేసిన సుప్రీం కోర్టు వాటన్నింటినీ కొట్టివేస్తున్నట్లు తీర్పుచెప్పింది. అణువిద్యుత్ కేంద్రంలో అదనపు రక్షణ చర్యలు అవసరం లేదని అందులో పేర్కొంది. కోర్టులో కేసులు, ఆందోళనలు సాగుతుండగానే తొలియూనిట్లో మొదట 160 మెగావాట్ల ఉత్పత్తి ఆ తరువాత 900 మెగావాట్లకు చేరుకుంది. త్వరలో యూనిట్ పూర్తి సామర్థ్యానికి తగినట్లుగా వెయ్యి మెగావాట్ల ఉత్పతిని సాధిస్తామని అధికారులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ప్రజల్లోకి వెళతాం : ఉదయకుమార్ అణువిద్యుత్ కేంద్రంపై సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పు తీవ్ర అభ్యంతరకరమని ఉద్యమనేత ఉదయకుమార్ వ్యాఖ్యానించారు. నాగర్‌కోవిల్‌లో గురువారం మీడియాతో మాట్లాడుతూ, భద్రతా చర్యలు సంతృప్తికరమని సుప్రీం కోర్టు అభిప్రాయపడింది, అయితే ఆ భద్రతా చర్యలు ఏమిటో వివరించలేదని అన్నారు. ఉద్యమకారులపై ప్రభుత్వం పెట్టిన 101 కేసులను ఎత్తివేయాలని సుప్రీంకోర్టు ఆదేశించినా ప్రభుత్వం పట్టించుకోలేదని తెలిపారు. తాజా తీర్పుపై తాము అప్పీల్ చేయబోమని, అయితే ఉద్యమాన్ని మరోసారి ప్రజల్లోకి తీసుకెళతామని తెలిపారు. 2016 లో రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఈ అంశాన్ని ప్రధానంగా అన్నిపార్టీల వద్ద ప్రస్తావిస్తామని, ప్రభుత్వాన్ని నిలదీస్తామని పేర్కొన్నారు. -
భవిష్యత్‌లో న్యూక్లియర్ అవసరం
డెంకాడ, న్యూస్‌లైన్: భవిష్యత్‌లో దేశ ప్రజలకు విద్యుత్, ఇతర అవసరాలు తీరాలంటే అణుశక్తి (న్యూక్లియ ర్ పవర్) తప్పదని న్యూక్లియర్ రీ సైకిల్ గ్రూప్ డెరైక్టర్ పికె వత్తల్ అన్నారు. ‘జాతీయ అభివృద్ధిలో అణుశక్తి పాత్ర’ అనే అంశంపై చింతలవలస ఎంవీజీఆర్ ఇంజినీరింగ్ కళాశాలలో రెండు రోజులుగా జరుగుతున్న జాతీయ సదస్సు ముగింపు కార్యక్రమం శుక్రవారం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన ఆయన మాట్లాడుతూ అణుశక్తి వినియోగంపై ప్రజల్లో ఉన్న అనుమానాలను తీర్చేందుకు రెండు రోజులుగా జరుగుతున్న సదస్సు ఉపకరించి ఉంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు. సదస్సులో ఏర్పాటు చేసిన ప్రదర్శన కూడా చైతన్యం కలిగించిందన్నారు. కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ కేవీఎల్ రాజు మాట్లాడుతూ ఎంవీజీఆర్ ఇంజినీరింగ్ కళాశాలలో ఇంత పెద్దస్థాయిలో అణుశక్తిపై సదస్సు నిర్వహించడం హర్షణీయమన్నారు. దీని ద్వారా యువత, విద్యార్థులు, అధ్యాపకుల్లో కూడా అవగాహన వచ్చిందన్నారు. కార్యక్రమంలో బార్క్ మీడియా రిలేషన్ హెడ్ ఆర్కే సింగ్, వైస్ ప్రిన్స్‌పాల్ డీజేఏ రామచంద్రరాజు, అసిస్టెంట్ ప్రిన్సిపాల్ రంగరాజు, పలు విభాగాల అధిపతులు పాల్గొన్నారు. క్విజ్ విజేతలకు బహుమతులు రెండు రోజుల అణుశక్తి సదస్సుపై విద్యార్థుల కు శుక్రవారం క్విజ్ పోటీలు నిర్వహించారు. ఈ పోటీల్లో విజయనగరంలోని సన్ స్కూల్‌కు చెందిన ఎంఎన్ఎస్ నాగేంద్ర మొదటి స్థానం లో నిలిచారు. అలాగే శ్రీప్రకాష్ విద్యాసంస్థకు చెందిన జి సాయికార్తీక్, జి సాయిసాగర్లు ద్వితీయ, తృతీయ స్థానాల్లో నిలిచారు. విజేతలకు నగదు బహుమతితో పాటు ప్రశంసా పత్రాలు అంజేశారు. ప్రతిభ కనబరిచిన మరి కొందరు విద్యార్థులకు కూడా ప్రశంసాపత్రాలు అందించారు. వీరిని త్వరలో బార్క్‌కు ఆహ్వానిస్తారు. -
శరవేగం
సాక్షి, చెన్నై: తిరునల్వేలి జిల్లా కూడంకుళంలో భారత్, రష్యా సంయుక్త ఆధ్వర్యంలో అణు విద్యుత్ కేంద్రాన్ని నెలకొల్పిన విషయం తెలిసిందే. తొలియూనిట్ పనులు ముగి శాయి. రెండో యూనిట్ పనులు ముగింపు దశకు చేరుకున్నాయి. ఈ కేంద్రానికి వ్యతిరేకంగా ఇడిందకరై వేదిక గా పెద్ద ఉద్యమమే సాగుతోంది. ఈ ఉద్యమం కారణం తో తొలి యూనిట్లో అధికారిక ఉత్పత్తికి కొన్నాళ్లు బ్రేక్‌పడింది. ఎట్టకేలకు అక్టోబరు 22న చడీ చప్పుడు కాకుం డా శ్రీకారం చుట్టేశారు. తొలుత 160 మెగావాట్ల మేర కు విద్యుత్ ఉత్పత్తి లభించగా, దాన్ని కేంద్ర గ్రిడ్‌కు పం పించారు. అక్కడ పరిశీలనానంతరం విద్యుత్ ఉత్పత్తి మరింత వేగవంతం చేశారు. అణువిద్యుత్ వ్యతిరేకులు ఉద్యమానికి నిర్ణయించడంతో చాప కింద నీరులా ఉత్పత్తి ప్రక్రియను క్రమంగా పెంచే పనిలో అధికారులు పడ్డారు. అణు కేంద్రంలో ఉత్పత్తి ఆగినట్టుగా, జరుగుతున్నట్టుగా రకరకాల ప్రచారం గత కొద్దిరోజులుగా సాగుతోంది. దీంతో ఉత్పత్తి క్రమంగా పెరుగుతున్న విషయాన్ని అధికారులు ఆదివారం ప్రకటించారు. 400 మెగావాట్లు: అణు కేంద్రంలో 500 మెగావాట్ల వరకు విద్యుత్ ఉత్పత్తికి అణు విద్యుత్ క్రమబద్ధీకరణ కమిషన్ అనుమతి ఇచ్చింది. దీంతో క్రమంగా ఉత్పత్తిని 500 మెగావాట్లకు దరి చేర్చే పనుల్లో శాస్త్రవేత్తలు, ఇంజనీర్లు ఉన్నారు. ఈ నెలాఖరులోపు ఆ లక్ష్యాన్ని చేరుకునే అవకాశాలు ఎక్కువగా కన్పిస్తున్నాయి. ఇక కొత్త ఏడాదిలో అదనంగా మరో 250 మెగావాట్ల ఉత్పత్తికి శ్రీకారం చుట్టనున్నారు. 750 మెగావాట్లు: మదురైలో ఆదివారం జరిగిన ఓ కార్యక్రమంలో అణు విద్యుత్ కేంద్రం డెరైక్టర్(ఉత్పత్తి విభాగం) సుందర్ మీడియాతో మాట్లాడుతూ, అణు విద్యుత్ కేంద్రంలో ఉత్పత్తి వేగవంతం అయిందన్నారు. అణు వ్యతిరేకుల ఆందోళనల కారణంగా తరచూ ఉత్పత్తికి ఆటకం ఏర్పడుతోన్నదన్నారు. అన్ని అడ్డంకుల్ని అధిగమించి 400 మెగావాట్లకు ఉత్పత్తి చేరిందన్నారు. ఇదులో యాభై శాతం తమిళనాడుకు, మిగిలిన విద్యుత్ పుదుచ్చేరి, కూడంకులం పరిసర ప్రాంతాలకు విని యోగిస్తున్నామని వివరించారు. జనవరి లో 750 మెగావాట్ల ఉత్పత్తి లక్ష్యంగా చర్యలు చేపట్టామన్నారు. విద్యుత్ ఉత్పత్తి మరి కొద్ది రోజుల్లో పూర్తి స్థాయి చేరుకోబోతున్నదని ధీమా వ్యక్తం చేశారు. విద్యుత్ కొరత ఒక్క తమిళనాడులోనే లేదని, అన్ని రాష్ట్రాలు ఎదుర్కొంటున్నాయన్నారు.