చెన్నై, సాక్షి ప్రతినిధి:ప్రజా సంఘాలకు, ప్రభుత్వాలకు మధ్య పదేళ్లుగా సాగుతున్న పోరాటానికి సుప్రీం కోర్టు తన తీర్పుతో తెరదించింది. అణువిద్యుత్ కేంద్రం తీరుపై అభ్యంతరాలు లేవనెత్తుతూ పర్యావరణ ప్రేమికులు, ప్రజా సంఘాలు వేసిన పిటిషన్లను కొట్టివేస్తున్నట్లు సుప్రీంకోర్టు గురువారం తీర్పుచెప్పింది. ఎటువంటి అదనపు భద్రతా చర్యలు అవసరం లేకుండానే విద్యుత్ ఉత్పత్తిని చేసుకోవచ్చని గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. తిరునెల్వేలీ జిల్లా కూడంకుళంలో రూ.13,500 కోట్ల వ్యయంతో అణువిద్యుత్ కేంద్రం నిర్మాణానికి భారత్-రష్యాల మధ్య ఒప్పందం జరిగింది. ఒక్కో యూనిట్ నుంచి వెయ్యి మెగావాట్ల చొప్పున రెండు యూనిట్లను నిర్మించాలని నిర్ణయించారు. 2002 మార్చిలో నిర్మాణ పనులకు శ్రీకారం చుట్టగా 2007 డిసెంబరు నాటికి మొదటి యూనిట్, 2008 డిసెంబరు నాటికి రెండో యూనిట్ నిర్మాణాన్ని పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. అయితే, అనుకున్న లక్ష్యానికి అనేక అడ్డంకులు ఎదురయ్యూయి. అణువిద్యుత్ కేంద్రం వల్ల పర్యావరణానికి ముప్పు వాటిల్లుతుందని, స్థానిక ప్రజలు అనారోగ్యానికి గురై ప్రాణాలు కోల్పోయే ప్రమా దం ఉందన్న ఆందోళనలు ప్రారంభమయ్యూరుు.
జపాన్ లో జరిగిన అణువిద్యుత్ ప్రమాదాన్ని ఆందోళనకారులు ఉదహరించారు. కూడంకుళం పరిసర గ్రామాల ప్రజలు, ప్రధానంగా మత్స్యకారులు సైతం మద్దతుపలకడంతో పోరాటాలకు బలం చేకూరింది. ఈ పరిణామాలతో నిర్మాణ పనుల్లో జాప్యం ఏర్పడింది. ఇదిలా ఉండగానే 2010లో విద్యుత్ కేంద్రంలో రసాయనాలు నింపే పనులు ప్రారంభమయ్యూయి. దీంతో మళ్లీ ఆందోళనలు ఉధృతరూపం దాల్చాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు చెందిన అధికారులు, అణువిద్యుత్ నిపుణులు కూడంకుళంలో పర్యటించి సంతృప్తి వ్యక్తం చేశారు. అణువిద్యుత్ కేంద్రంలో పనులు కొనసాగించుకోవాలని 2012 మార్చి 19వ తేదీన రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించడంతో సెప్టెంబరు నుంచి రసాయనాలు నింపే ప్రక్రియ మళ్లీ ప్రారంభమై అక్టోబరు 2 వ తేదీన పూర్తయింది. అనేక అడ్డంకులు, ఆందోళనలను అధిగమించి ఎట్టకేలకూ గత ఏడాది అక్టోబరు 22వ తేదీన తొలియూనిట్‌లో ఉత్పత్తి ప్రారంభమైంది.
అణువిద్యుత్ కేంద్రం భద్రతపై సుప్రీంకోర్టు సూచించిన నియమ నిబంధనలు, భద్రతా చర్యలను ఏమాత్రం అమలు చేయకుండానే ఉత్పత్తిని ప్రారంభించారని పర్యావరణ ప్రేమికుల సంఘం తరపున సుందరరాజన్ అనే వ్యక్తి సుప్రీంకోర్టులో మరో పిటిషన్ దాఖలు చేశాడు. ఈ పిటిషన్లపై విచారణ పూర్తి చేసిన సుప్రీం కోర్టు వాటన్నింటినీ కొట్టివేస్తున్నట్లు తీర్పుచెప్పింది. అణువిద్యుత్ కేంద్రంలో అదనపు రక్షణ చర్యలు అవసరం లేదని అందులో పేర్కొంది. కోర్టులో కేసులు, ఆందోళనలు సాగుతుండగానే తొలియూనిట్‌లో మొదట 160 మెగావాట్ల ఉత్పత్తి ఆ తరువాత 900 మెగావాట్లకు చేరుకుంది. త్వరలో యూనిట్ పూర్తి సామర్థ్యానికి తగినట్లుగా వెయ్యి మెగావాట్ల ఉత్పతిని సాధిస్తామని అధికారులు ధీమా వ్యక్తం చేస్తున్నారు.
ప్రజల్లోకి వెళతాం : ఉదయకుమార్
అణువిద్యుత్ కేంద్రంపై సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పు తీవ్ర అభ్యంతరకరమని ఉద్యమనేత ఉదయకుమార్ వ్యాఖ్యానించారు. నాగర్‌కోవిల్‌లో గురువారం మీడియాతో మాట్లాడుతూ, భద్రతా చర్యలు సంతృప్తికరమని సుప్రీం కోర్టు అభిప్రాయపడింది, అయితే ఆ భద్రతా చర్యలు ఏమిటో వివరించలేదని అన్నారు. ఉద్యమకారులపై ప్రభుత్వం పెట్టిన 101 కేసులను ఎత్తివేయాలని సుప్రీంకోర్టు ఆదేశించినా ప్రభుత్వం పట్టించుకోలేదని తెలిపారు. తాజా తీర్పుపై తాము అప్పీల్ చేయబోమని, అయితే ఉద్యమాన్ని మరోసారి ప్రజల్లోకి తీసుకెళతామని తెలిపారు. 2016 లో రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఈ అంశాన్ని ప్రధానంగా అన్నిపార్టీల వద్ద ప్రస్తావిస్తామని, ప్రభుత్వాన్ని నిలదీస్తామని పేర్కొన్నారు.
అణువిద్యుత్‌కు గ్రీన్‌సిగ్నల్
Published Thu, May 8 2014 11:34 PM | Last Updated on Sun, Sep 2 2018 5:20 PM
Advertisement