న్యూఢిల్లీ: హిందుస్తాన్ జింక్‌లో కేంద్రానికి మిగిలిన 29.5 శాతం వాటా విక్రయానికి లైన్‌క్లియర్ అయ్యింది. ఇందుకు న్యాయమూర్తులు జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ బీవీ నాగరత్నలతో కూడిన సుప్రీంకోర్టు డివిజనల్ బెంచ్ గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. అయితే హిందుస్తాన్ జింక్ 2002 పెట్టుబడుల ఉపసంహరణ (డిజిన్వెస్ట్‌మెంట్) వ్యవహారాల్లో అవకతవకలు జరిగాయన్న ఆరోపణలపై కేసు నమోదుచేసి, విచారణ జరపాలని సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ)ను ధర్మాసనం ఆదేశించింది. దాదాపు 20 సంవత్సరాల క్రితం 2002లో హిందుస్తాన్ జింక్ నుంచి కేంద్ర పెట్టుబడుల ఉపసంహరణ జరిగిన సంగతి తెలిసిందే.
పేర్లు వ్యాఖ్యానించడానికి నిరాకరణ
‘మేము కొన్ని కీలకమైన వాస్తవాలు, ప్రమేయం ఉన్న వ్యక్తుల పేర్లపై వ్యాఖ్యానించడాన్ని నిరాకరిస్తున్నాము. తద్వారా ఈ విషయంపై దర్యాప్తునకు ఎటువంటి పక్షపాతం కలుగకుండా ఉంటుంది‘ అని కూడా అత్యున్నత స్థాయి ధర్మాసనం ఈ సందర్భంగా వ్యాఖ్యానించడం గమనార్హం. 2002లో జరిగిన హిందుస్తాన్ జింక్ డిజిన్వెస్ట్‌మెంట్ అవకతవకలపై ప్రాథమిక విచారణను సాధారణ కేసుగా మార్చాలని సీబీఐకి చెందిన పలువురు అధికారుల సిఫారసులను ధర్మాసనం ఈ సందర్భంగా ప్రస్తావిస్తూ, ఆరోపణలకు ఈ అంశం బలాన్ని ఇస్తోందని పేర్కొంది. 2002లో పెట్టుబడుల ఉపసంహరణలో జరిగిన అవకతవకలపై ప్రాథమిక విచారణను ముగించి, సీబీఐని తక్షణమే రెగ్యులర్ కేసు నమోదు చేయాలని, అలాగే కేసు విచారణ పురోగతిపై త్రైమాసికం వారీగా లేదా కోర్టు సమయానుకూల ఆదేశాలకు అనుగుణంగా అత్యున్నత న్యాయస్థానానికి నివేదిక అందజేయాలని ఆదేశించింది.
ప్రస్తుతం వాటాలు ఇలా...
హిందుస్తాన్ జింగ్‌లో తనకున్న వాటా 100 శాతంలో 24.08 శాతాన్ని దేశీయ మార్కెట్లో కేంద్రం తొలుత 1991–92లో విక్రయించింది. ఈ పెట్టుబడుల ఉపసంహరణతో కేంద్రం వాటా 75.92 శాతానికి తగ్గింది. అతల్ బిహారీ వాజ్‌పేయి నేతృత్వంలో ఎన్‌డీఏ ప్రభుత్వం మొదటిసారి అధికారంలో ఉన్న 2002 సమయంలో అప్పట్లో ‘మినీ రత్న’ హోదా హిందుస్తాన్ జింక్‌లో 26 శాతాన్ని వ్యూహాత్మక భాగస్వామి– ఎస్‌ఓవీఎల్‌కు (అనిల్ అగర్వాల్ నడుపుతున్న స్టెరిలైట్ ఆపర్చునిటీస్ అండ్ వెంచర్స్ లిమిటెడ్) కేంద్రం విక్రయించింది.
2002 ఏప్రిల్ 10న ఎస్‌ఓవీఎల్ ఓపెన్ మార్కెట్‌లో మరో 20 శాతాన్ని కొనుగోలు చేసింది. 2003 ఆగస్టులో కేంద్రంతో జరిగిన షేర్‌హోల్డర్ అగ్రిమెంట్ ద్వారా మరో 18.92 శాతం కొనుగోలు చేసింది. వెరసి ప్రస్తుతం ఎస్‌ఓవీఎల్ వద్ద హిందుస్తాన్ జింక్‌లో 64.92 శాతం వాటా ఉంది. కేంద్రం వద్ద 29.5 శాతం వాటా ఉంది. ఈ వాటా విక్రయానికి కూడా 2012లో కేంద్రం నిర్ణయం తీసుకుంది. గురువారం ట్రేడింగ్ ముగిసే నాటికి ఎస్‌ఓవీఎల్ వాటా 64.92 శాతం కాకుండా, డీఐఐ, ఎఫ్‌ఐఐ, రిటైల్ ఇన్వెస్టర్ల వద్ద వరుసగా 32.32 శాతం, 0.83 శాతం, 1.93 శాతం చొప్పున వాటాలు ఉన్నాయి. ఎన్‌ఎస్‌ఈలో షేర్ ధర క్రితంలో పోల్చితే 2.92 శాతం (రూ.9.70) తగ్గి రూ.322.95 వద్ద ముగిసింది.
Comments
Please login to add a commentAdd a comment