అణు విద్యుత్‌లో ఏపీ, తెలంగాణ కీలకం
* విశాఖలో బార్క్-2 ఏర్పాటు
* నల్లగొండ యురేనియం నిక్షేపాలు నాణ్యమైనవి
* బార్క్ డెరైక్టర్ శేఖర్ బసు వెల్లడి
సాక్షి, హైదరాబాద్: దేశ అణు విద్యుత్ రంగంలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు కీలకపాత్ర పోషించే అవకాశముందని బాబా అటామిక్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ (బార్క్) డైరెక్టర్ డాక్టర్ శేఖర్ బసు అభిప్రాయపడ్డారు. ఏపీలోని విశాఖపట్నంలో రెండో బార్క్ కేంద్రం నిర్మాణానికి ఏర్పాట్లు జరుగుతుండటం, ఇటు తెలంగాణలోని నల్లగొండ జిల్లాలో యురేనియం నిక్షేపాలను వెలికితీసేందుకు తాము సిద్ధంగా ఉండటం దీనికి కారణాలని పేర్కొన్నారు. దేశంలో అణు విద్యుదుత్పత్తి అవకాశాలు-సవాళ్లు అన్న అంశం పై మంగళవారమిక్కడ ఇంజనీరింగ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియా ఏర్పాటు చేసిన వర్క్‌షాప్‌కు ముఖ్యఅతిథిగా హాజరైన శేఖర్ బసు ఆ తరువాత విలేకరులతో మాట్లాడారు. నల్లగొండలోని పెద్దగట్టు, లంబాపూర్ ప్రాంతాల్లో వైఎస్సార్ జిల్లాలోని తుమ్మలపల్లి క్షేత్రం కంటే నాణ్యమైన యురేనియం నిక్షేపాలు ఉన్నాయన్నారు. తుమ్మలపల్లిలో దాదాపు లక్ష టన్నుల నిక్షేపాలుంటే.. నల్లగొండలో ఇది 18,000 టన్నుల వరకూ ఉంటుం దని చెప్పారు.
కొవ్వాడ అణువిద్యుత్ కేంద్రం కోసం భూ సేకరణ కొనసాగుతోందని తెలిపారు. భూసేకరణ పూర్తయిన తరువాత ఆరు అణు రియాక్టర్లతో కూడిన కొవ్వాడ కేంద్రం నిర్మాణంపై అంచనా వస్తుందన్నారు. దేశంలో అణువిద్యుత్‌పై అనేక అపోహలు ఉన్నాయని, విదేశీ నిధులతో పనిచేస్తున్న కొన్ని స్వచ్ఛంద సంస్థలు తప్పుడు ఆరోపణలు చేస్తున్నాయని చెప్పారు. విశాఖపట్నంలో దాదాపు నాలుగు వేల ఎకరాల విస్తీర్ణంలో ఏర్పాటు చేయబోయే రెండో బార్క్ కేంద్రం అత్యాధునిక టెక్నాలజీకి నిలయంగా ఉం టుందని శేఖర్ బసు తెలిపారు. కేన్సర్‌తోపాటు వైద్య చికిత్సల్లో ఉపయోగపడే రేడియో ఐసోటోప్ రియాక్టర్, పలు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాలను ఇక్కడ ఏర్పాటు చేస్తామన్నారు. బార్క్ ప్రజా చైతన్య విభాగం ఉన్నతాధికారి ఎస్.కె.మల్హోత్రా భావని, చైర్మన్, ఎండీ డాక్టర్ చెల్లపాండీ, అడ్వాన్స్డ్‌మెటీరియల్స్ డివిజన్ డెరైక్టర్ పరి హార్, ఇంజనీరింగ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియా డెరైక్టర్ డాక్టర్ యు.చంద్రశేఖర్, ఐఎన్‌ఎస్‌ఏ సీనియర్ సైంటిస్ట్ డాక్టర్ సి.గంగూలీ తదితరులు పాల్గొన్నారు.