
భారత్ 100 గిగావాట్ల అణువిద్యుత్ సామర్థ్యం లక్ష్యాన్ని సాధించడానికి న్యూక్లియర్ ఎనర్జీ మిషన్(Nuclear Energy Mission) ద్వారా సమగ్ర రోడ్ మ్యాప్‌ను సిద్ధం చేస్తోంది. 2070 నాటికి నికర జీరో కర్బన ఉద్గారాలను సాధించాలనే దీర్ఘకాలిక లక్ష్యానికి అనుగుణంగా ఈ చర్యలకు పూనుకుంది. దేశీయంగా పెరుగుతున్న ఇంధన డిమాండ్లను పరిష్కరించడానికి మార్చి చివరి నాటికి న్యూక్లియర్ ఎనర్జీ మిషన్ ద్వారా సమగ్ర రోడ్ మ్యాప్‌ను అధికారికంగా వెల్లడిస్తారని నిపుణులు అంచనా వేస్తున్నారు.
ఇంటర్ మినిస్టీరియల్ కమిటీ ఏర్పాటు
అణుశక్తి విభాగం, విద్యుత్ మంత్రిత్వ శాఖ అధికారులు, ఇతర కీలక భాగస్వాములతో కూడిన ఇంటర్ మినిస్టీరియల్ కమిటీ ఈ రోడ్ మ్యాప్‌ను రూపొందిస్తోంది. భారత్ అణుశక్తి సామర్థ్యాన్ని పెంచేందుకు తీసుకోవాల్సిన చర్యలను వివరించే బాధ్యతను ఈ కమిటీకి అప్పగించారు. స్మాల్ మాడ్యులర్ రియాక్టర్ల (SMR-చిన్న అణువిద్యుత్ కేంద్రాలు) అభివృద్ధి, దేశీయ, అంతర్జాతీయ భాగస్వాములతో జాయింట్ వెంచర్లను ప్రోత్సహించడం ఇందులో ప్రధానాంశాలుగా ఉండనున్నాయి. ఎస్‌ఎంఆర్‌లను అధిక విద్యుత్ డిమాండ్ ఉన్న మారుమూల ప్రాంతాలు, పారిశ్రామిక మండలాల్లో సులువుగా ఏర్పాటు చేయవచ్చు. ఇది భారతదేశ ఇంధన అవసరాలకు సరళమైన, సమర్థవంతమైన పరిష్కారాన్ని అందిస్తుంది. 2033 నాటికి కనీసం ఐదు స్వదేశీ పరిజ్ఞానంతో అభివృద్ధి చేసిన ఎస్‌ఎంఆర్‌లను అమలు చేసేందుకు పరిశోధన, అభివృద్ధి(ఆర్‌అండ్‌డీ)కి ప్రభుత్వం రూ.20,000 కోట్లు కేటాయించింది.
ఇంధన డిమాండ్‌కు పరిష్కారం..
పట్టణీకరణ వేగంగా విస్తరించడం, పారిశ్రామిక వృద్ధి, డిజిటల్ ఎకానమీ కారణంగా 2047 నాటికి భారత విద్యుత్ డిమాండ్ నాలుగైదు రెట్లు పెరుగుతుందని అంచనా. సౌర, పవన విద్యుత్ వంటి పునరుత్పాదక ఇంధన వనరులు విస్తరిస్తున్నప్పటికీ అవి మాత్రమే మొత్తం విద్యుత్ అవసరాలను తీర్చలేవు. కర్బన ఉద్గారాలను తగ్గించాలనే లక్ష్యాలు ఉండడంతో థర్మల్ పవర్‌ను క్రమంగా తగ్గించాలనే ప్రతిపాదనలున్నాయి. అందుకు ప్రత్యామ్నాయంగా అణుశక్తి ఈ అంతరాన్ని పూడ్చడంలో కీలక పాత్ర పోషించనుంది.
ఇదీ చదవండి: భారత్‌లో టెస్లా తొలి షోరూమ్.. ఎక్కడంటే..
ఇంధన సామర్థ్యాన్ని పెంచేందుకు జాయింట్ వెంచర్లను కూడా ఏర్పాటు చేయాలని ఈ రోడ్ మ్యాప్ నొక్కి చెప్పే అవకాశం ఉంది. న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (ఎన్‌పీసీఐఎల్) వంటి ప్రభుత్వ రంగ సంస్థలు అధునాతన సాంకేతిక పరిజ్ఞానం, పెట్టుబడులను తీసుకురావడానికి ప్రైవేటు సంస్థలు, అంతర్జాతీయ సంస్థలతో కలిసి పనిచేయాలని భావిస్తున్నాయి. ప్రైవేటు రంగ భాగస్వామ్యాన్ని పెంచేందుకు వీలుగా అణుశక్తి చట్టం, సివిల్ లయబిలిటీ ఫర్ న్యూక్లియర్ డ్యామేజ్ చట్టానికి చట్టపరమైన సవరణలు చేయాలని అధికారులు భావిస్తున్నారు.
సుస్థిరత దిశగా అడుగులు
ప్రభుత్వం చేపడుతున్న ఈ చర్యలు కేవలం ఇంధన డిమాండ్లను తీర్చడం మాత్రమే కాదు.. భారతదేశం సుస్థిరత లక్ష్యాలకు మూలస్తంభంగా నిలువనున్నాయి. అణు ఇంధన తయారీ ఏర్పాట్లను విస్తరించడం ద్వారా శిలాజ ఇంధనాలపై ఆధారపడడం తగ్గించవచ్చు. గ్రీన్ హౌస్ ఉద్గారాలను నియంత్రించవచ్చు. భవిష్యత్ తరాలకు ఇంధన భద్రతను కల్పించవచ్చు. పెరుగుతున్న డిమాండ్‌కు సరిపడా ఇంధన అవరాలను తీర్చుకోవచ్చు.
Comments
Please login to add a commentAdd a comment