nuclear energy
-
ఇంధన రంగంలో సహకరించుకుందాం
న్యూఢిల్లీ: ఇంధన రంగంలో పరస్పర సహకారాన్ని మరింత ముందుకు తీసుకెళ్లాలని, ఇరు దేశాల మధ్య సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని పెంపొందించుకోవాలని భారత్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్(యూఏఈ) నిర్ణయించుకున్నాయి. భారత ప్రధాని నరేంద్ర మోదీ, అబుదాబీ యువరాజు షేక్ ఖలీద్ బిన్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్–నహ్యాన్ సోమవారం ఢిల్లీలో సమావేశమయ్యారు. భారత్, యూఏఈ మధ్య సంబంధాలతోపాటు ఇరుదేశాల ప్రయోజనాలతో ముడిపడి ఉన్న అంశాలపై విస్తృతంగా చర్చించారు. గాజాలోని తాజా పరిస్థితులతోపాటు ప్రాంతీయ, అంతర్జాతీయ పరిణామాలపై అభిప్రాయాలు పంచుకున్నారు. ఈ సందర్భంగా ఇంధన రంగంలో సహకారానికి సంబంధించి భారత్, యూఏఈ నాలుగు కీలక ఒప్పందాలపై సంతకాలు చేశాయి. అబుదాబీ నేషనల్ ఆయిల్ కంపెనీ(అండోక్)– ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్(ఐఓసీఎల్), అండోక్–ఇండియా స్ట్రాటజిక్ పెట్రోలియం రిజర్వ్ లిమిటెడ్(ఐఎస్పీఆర్ఎల్) మధ్య దీర్ఘకాలం ఇంధన సరఫరాకు ఒప్పందాలు కుదిరాయి. అలాగే అబుదాబీలోని బరాఖా అణువిద్యుత్ కేంద్రం నిర్వహణ కోసం ఎమిరేట్స్ న్యూక్లియర్ ఎనర్జీ కంపెనీ(ఈఎన్‌ఈసీ)–న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్(ఎన్పీసీఐఎల్) మధ్య మరో ఒప్పందం కుదిరింది. అండోక్–ఊర్జా భారత్ మధ్య ప్రొడక్షన్ కన్సెషన్ అగ్రిమెంట్ కుదిరింది. అంతేకాకుండా భారత్‌లో ఫుడ్‌పార్కుల ఏర్పాటు కోసం గుజరాత్ రాష్ట్ర ప్రభుత్వం, అబుదాబీ డెవలప్మెంట్ హోల్డింగ్ కంపెనీ పీజేఎస్సీ మధ్య ప్రత్యేక ఒప్పందం కుదుర్చుకున్నాయి. అబుదాబీ యువరాజు భారత పర్యటన కోసం ఆదివారం ఢిల్లీకి చేరుకున్నారు. సోమవారం ప్రధాని నరేంద్ర మోదీతో సమావేశం అనంతరం రాజ్‌ఘాట్‌ను సందర్శించాయి. జాతిపిత మహాత్మాగాంధీకి నివాళులరి్పంచారు. యువరాజు షేక్ ఖలీద్ బిన్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్–నహ్యాన్ రాష్ట్రపతి భవన్లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో భేటీ అయ్యారు. వేర్వేరు రంగాల్లో పరస్పర సహకారం ద్వారా భారత్, యూఏఈ మధ్య సంబంధాలు నానాటికీ బలోపేతం అవతుండడం పట్ల రాష్ట్రపతి ఈ సందర్భంగా హర్షం వ్యక్తంచేశారు. -
ఉన్నత పదవుల్లో ఇండో అమెరికన్లు
వాషింగ్టన్: ముగ్గురు భారతీయ అమెరికన్లను కీలక పరిపాలనా స్థానాల్లో నియమించేందుకు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ నామినేట్ చేశారు. ప్రస్తుతం గేట్‌వే ఫర్ యాక్సెలరేటెడ్ ఇన్నోవేషన్ ఇన్ న్యూక్లియర్ (గెయిన్) డైరెక్టర్‌గా ఉన్న రీటా బరన్వాల్ను ఇంధన శాఖ (అణు ఇంధన) అసిస్టెంట్ సెక్రటరీగా, న్యాయవాద అధ్యాపకుడిగా ఉన్న ఆదిత్య బమ్జాయ్‌ని ప్రైవసీ అండ్ సివిల్ లిబర్టీస్ ఓవర్‌సైట్ బోర్డు సభ్యుడిగా, ఫైనాన్షియల్ స్టెబిలిటీ ఓవర్‌సైట్ కౌన్సిల్లో డెప్యూటీ అసిస్టెంట్ సెక్రటరీగా ఉన్న బిమల్ పటేల్‌ను ట్రెజరీ అసిస్టెంట్ సెక్రటరీగా నియమించేందుకు ట్రంప్ ప్రతిపాదించారు. ఈ విషయాన్ని ట్రంప్ ముందుగానే ప్రకటించినప్పటికీ, నామినేషన్లను బుధవారమే శ్వేతసౌధం నుంచి సెనెట్‌కు పంపారు. ఇప్పటికవరకు మొత్తంగా ట్రంప్ 35 మందికి పైగా భారతీయ అమెరికన్లను కీలక స్థానాల్లో నియమించారు. బరన్వాల్ కొత్త బాధ్యతల్లో భాగంగా అణు ఇంధన కార్యాలయ పాలనా వ్యవహారాలతో పాటు, అణు సాంకేతికత పరిశోధన, అభివృద్ధి విభాగం, మౌలిక సదుపాయాల విభాగ యాజమాన్య బాధ్యతలు కూడా చూడాల్సి వుంటుంది. టెక్నాలజీ డెవలప్మెంట్ అండ్ అప్లికేషన్ డైరెక్టర్‌గా, మెటీరియల్స్ టెక్నాలజీ మేనేజర్‌గా బాధ్యతలు నిర్వహించిన ఆమె.. అమెరికా నౌకాదళ రియాక్టర్లకు అవసరమైన అణు ఇంధన మెటీరియల్‌పై పరిశోధన జరిపారు. ఇక యేల్ విశ్వవిద్యాలయంలో ఉన్నత విద్య అభ్యసించిన ఆదిత్యకు సివిల్ ప్రొసీజర్, పాలనాపరమైన శాసనాలు, ఫెడరల్ కోర్టులు, జాతీయ భద్రతా చట్టం, కంప్యూటర్ సంబంధిత నేరాలపై బోధన జరిపిన, రచనలు చేసిన అనుభవముంది. యూఎస్ సుప్రీంకోర్టు జస్టిస్ అంటోనిన్ స్కలియా వద్ద, అప్పీల్స్ కోర్టు (ఆరవ సర్క్యూట్) జడ్జి జెఫ్రీ వద్ద లా క్లర్క్‌గా విధులు నిర్వర్తించారు. అమెరికా న్యాయశాఖలో అటార్నీ అడ్వయిజర్‌గా, ప్రైవేటు రంగంలో అప్పిలేట్ అటార్నీగా కూడా పని చేశారు. మూడో వ్యక్తి బిమల్ పటేల్ ప్రస్తుతం ఆర్థిక స్థిరత్వ వ్యవహారాల పర్యవేక్షణ మండలికి సంబంధించిన ట్రెజరీలో డిప్యూటీ అసిస్టెంటీ సెక్రటరీగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఆర్థిక వ్యవహారాల్లో పలు సంస్థలకు సలహాలిచ్చిన అనుభవముంది. తొలి దక్షిణాసియా వ్యక్తి డెమోక్రటిక్ పార్టీకి చెందిన భారతీయ అమెరికన్ చట్టసభ్యుడు రాజా కృష్ణమూర్తికి నిఘాపై ఏర్పాటైన కాంగ్రెషనల్ కమిటీలో చోటు దక్కింది. ఈ ఘనత సొంతం చేసుకున్న తొలి దక్షిణాసియా వ్యక్తి ఈయనే. అమెరికా జాతీయ భద్రతను పటిష్టం చేయడం ఈ కమిటీ బాధ్యత. కృష్ణమూర్తి (45) ప్రస్తుతం ఇల్లినాయిస్ 8వ కాంగ్రెషనల్ జిల్లాకు ప్రతినిధుల సభలో ప్రాతినిధ్యం వహిస్తున్నారు. కృష్ణమూర్తిని కమిటీలో సభ్యుడిగా నియమిస్తున్నట్లు సభాపతి న్యాన్సీ పెలోసీ బుధవారం ప్రకటించారు. కృష్ణమూర్తి ఢిల్లీలో ఓ తమిళ కుటుంబంలో జన్మించారు. ఆయనకు మూడు మాసాల వయసున్నప్పుడే ఆయన కుటుంబం న్యూయార్క్‌లోని బఫెలో స్థిరపడింది. -
భారతసంతతి మహిళకి అమెరికాలో కీలక పదవి
వాషింగ్టన్: అమెరికాలో ఆధునిక అణు రియాక్టర్ల అభివృద్ధిని వేగవంతం చేయాలని నిర్ణయించిన కొద్ది రోజుల్లోనే అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఆ దిశగా చర్యలు వేగవంతం చేశారు. అణుశక్తి రంగంలో నైపుణ్యం ఉన్న భారత సంతతికి చెందిన రీటా బరన్వాల్ని, అణుశక్తి విభాగంలో కీలకమైన అసిస్టెంట్ సెక్రటరీ పదవికి డొనాల్డ్ ట్రంప్ ఎంపిక చేశారు. ఈ మేరకు వైట్ హౌస్ ఓ ప్రకటన విడుదల చేసింది. ప్రస్తుతం రీటా గేట్‌వే ఫర్ ఆక్సిలరేటెడ్ ఇన్నోవేషన్ ఇన్ న్యూక్లియర్ (జీఏఐఎన్)లో డైరెక్టర్‌గా పనిచేస్తున్నారు. రీటా నియామక ప్రతిపాదనను సెనెట్ ఆమోదించాల్సి ఉంది. మెటీరియల్స్ సైన్స్ ఇంజినీరింగ్‌లో ఎంఐటీ (మసాచుసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ) నుంచి రీటా పట్టా పొందారు. మిచిగాన్ యూనివర్సిటీ నుంచి పీహెచ్డీ పట్టా అందుకున్నారు. ఎంఐటీ మెటీరియల్స్ రీసెర్చ్ ల్యాబ్, బార్క్లీ అణు ఇంజినీరింగ్ విభాగాల సలహాదారుల బోర్డులో గతంలో సేవలందించారు. -
‘అణు’ విమానం
ఈ ఫొటోలో ఉన్నది ఓ విమానం. అంతరిక్షంలోకి వెళ్లే నౌకలా ఉందనుకుంటున్నారా.. అయితే సాధారణ మానవులు ప్రయాణించేందుకే దీన్ని రూపొందించారు. అసలు విశేషమేం టంటే ఇది మామూలు విమానాలు నడిచే ఇంధనంతో కాకుండా అణుశక్తితో నడుస్తుంది. అంటే విమానయాన రంగంలో ఇదొక సంచలనంగా చెప్పుకోవచ్చు. దీని వేగం ఎంతో తెలుసా? గంటకు 1,852 కిలోమీటర్ల వేగంతో దూసుకుపోతుందట. దీని నుంచి కొంచెం కూడా కార్బన్ వెలువడదట. ఈ విమానాన్ని డిజైనర్ ఆస్కార్ వినల్స్ రూపొందించారు. దీనికి పెట్టిన పేరు ‘మాగ్నావమ్’ అంటే పెద్ద పక్షి అని అర్థం. ప్రస్తుతం సాధారణ విమానాల్లో లండన్ నుంచి న్యూయార్క్‌కు 3 గంటల్లోనే ఈ రెండు నగరాల మధ్య ప్రయాణం సాగించొచ్చట. రియాక్టర్ దీనికి కావాల్సిన ఇంధనాన్ని సమకూరుస్తుందట. ఇందులో దాదాపు 500 మంది ప్రయాణికులు ప్రయాణించొచ్చని చెబుతున్నారు. అయితే ఇది మన ముందుకు రావాలంటే ఇంకో పదేళ్లు పడుతుందట. -
భారత్‌కు అణు మద్దతివ్వండి: అమెరికా
అణు సరఫరాదార్ల కూటమి దేశాలను కోరిన అమెరికా - ముందే మద్దతు ప్రకటించిన బ్రిటన్ - భారత్ ప్రయత్నాలకు అడ్డుపడుతున్న ఆ ఐదు దేశాలు వాషింగ్టన్: అణు సరఫరాదారుల కూటమి (ఎన్ఎస్జీ)లో చేరేందుకు భారత్ చేస్తున్న ప్రయత్నాలకు మద్దతివ్వాలని ఎన్ఎస్జీ సభ్యదేశాలను అమెరికా కోరింది. ఈ అంశంపై అమెరికా అంతర్గత భద్రత అధికార ప్రతినిధి జాన్ కిర్బీ గురువారం మీడియాతో మాట్లాడారు. ఈ నెల 24న సియోల్‌లో జరగనున్న ఎన్ఎస్జీ ప్లీనరీ సమావేశం నేపథ్యంలో సభ్య దేశాలకు అమెరికా ఈ విజ్ఞప్తి చేయడం భారత్‌కు లాభించనుంది. భారత్ చేస్తున్న ప్రయత్నాలను అడ్డుకోవద్దంటూ ఇటీవలే అమెరికా రక్షణ మంత్రి జాన్ కెర్రీ ఎన్ఎస్జీ సభ్య దేశాలకు లేఖను కూడా రాశారు. ఇదిలా ఉండగా భారత ప్రయత్నాలకు అమెరికాతోపాటు తమ నుంచి కూడా పూర్తి మద్దతు ఉంటుందని బ్రిటన్ ప్రధాని డేవిడ్ కామెరాన్ హామీఇచ్చారు. ఆయన గురువారం ప్రధాని మోదీకి ఫోన్ చేసి ఈ అంశంపై సుదీర్ఘంగా మాట్లాడినట్లు బ్రిటన్ అధికార ప్రతినిధి మీడియాకు వెల్లడించారు. ఎన్ఎస్జీలో మొత్తం 48 సభ్యదేశాలున్నాయి. ఈ గ్రూపులో సభ్యత్వం కోసం భారత్ చేస్తున్న ప్రయత్నాలకు చైనా, ఆస్ట్రియా, ఐర్లాండ్, టర్కీ, దక్షిణాఫ్రికా దేశాలు అడ్డుపడుతున్నాయి. అణ్వస్త్ర వ్యాప్తి నిరోధక ఒప్పందం(ఎన్పీటీ)పై భారత్ సంతకం చేయనందున ఎన్ఎస్జీలో చేరేందుకు తమకు అభ్యంతరాలున్నాయని చైనా వాదిస్తోంది. భారత్‌కు ఎన్ఎస్జీలో ప్రవేశం కల్పించినట్లయితే పాకిస్తాన్‌కు కూడా ప్రవేశం కల్పించాలని చైనా కోరుతోంది. ఎన్ఎస్జీతో పెద్దగా లాభం లేదు: నిపుణులు న్యూఢిల్లీ: అణు సరఫరా బృందం (ఎన్ఎస్జీ)లో సభ్యత్వం తీసుకోవటం ద్వారా భారత్‌కు పెద్దగా ఒరిగేదేమీ ఉండదని.. ప్రముఖ అణు శక్తి నిపుణుడు జి. బాలచంద్రన్ శుక్రవారం తెలిపారు. ‘భారత్-ఎన్ఎస్జీ సభ్యత్వం’ అనే అంశంపై ఢిల్లీలో జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. సభ్యత్వం వల్ల అణుశక్తి పెట్టుబడులను బలోపేతం చేసుకోవచ్చు కానీ.. అంతకుమించి భారత అణుశక్తి కార్యక్రమంలో పెద్దగా లాభనష్టాలేమీ ఉండవన్నారు. భవిష్యత్తులో పాకిస్తాన్ సభ్యత్వానికి అడ్డుచెప్పకుండా ఉండేందుకే భారత సభ్యత్వానికి చైనా అడ్డుపడుతోందన్నారు. -
భారత్‌కు యురేనియం సరఫరాను పరిశీలిస్తాం
- నమీబియా అధ్యక్షుడు హేజ్ వెల్లడి - రాష్ట్రపతి ప్రణబ్‌కు విందు విండ్‌హాక్ (నమీబియా): అణు శక్తిని ప్రపంచ శాంతి కోసం వినియోగిస్తే భారత్‌కు యురేనియంను సరఫరా చేసే విషయంలో ఉండే చట్టపరమైన మార్గాలను అన్వేషిస్తామని నమీబియా తెలిపింది. నమీబియాలో పర్యటిస్తున్న రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి ఆ దేశాధ్యక్షుడు హేజ్ గీంగోబ్ విందులో ఈమేరకు చెప్పారు. ‘నమీబియాలో వనరులు పుష్కలంగా ఉన్నాయి. కానీ మా వద్ద ఎలాంటి అణ్వాయుధాలు లే వు. అందుకే వాటిని వినియోగించుకోవడం లేదు. శాంతి నిమిత్తం ఉపయోగించే భారత్‌లాంటి దేశానికి మా యురేనియం వనరులను సరఫరా చేసేందుకు కావాల్సిన చట్టపరమైన మార్గాలను పరిశీలిస్తాం’ అని ఆయన అన్నారు. తమ దేశంలో భారత కంపెనీలు పెట్టుబడులు పెట్టాల్సిందిగా హేజ్ ఆహ్వానించారు. ఇరు దేశాల మధ్య ఉన్న ద్వైపాక్షిక సంబంధాలకు భారత్ అధిక ప్రాధాన్యతనిస్తోందని ప్రణబ్ తెలిపారు. ప్రస్తుత గ్లోబలైజేషన్ ప్రపంచంలో ఆఫ్రికా, భారత్‌లు కీలకంగా మారాయని తద్వారా ప్రపంచ శాంతి, భద్రత, అభివృద్ధికి ఇరు దేశాలు కృషి చేయాలని చెప్పారు. నమీబియా సైన్స్ అండ్ టెక్నాలజీ యూనివర్సిటీలోనూ ప్రణబ్ మాట్లాడారు. -
భవిష్యత్ అవసరాలకు అణుశక్తి తప్పనిసరి
డెంకాడ, న్యూస్‌లైన్: దేశంలో విద్యుత్‌తో పాటు ఇతర రంగాల అవసరాలు తీరాలంటే అణుశక్తి తప్పనిసరి అని అణుశక్తి కమిషన్ మాజీ చైర్మన్ డాక్టర్ ఎస్.బెనర్జీ అన్నారు. గురువారం డెంకాడ మండలంలోని చింతలవలస ఎంవీజీఆర్ ఇంజినీరింగ్ కళాశాలలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. 2030 నాటికి దేశంలో 60వేల బిలియన్ వాట్ల విద్యుత్ అవసరం ఉంటుందన్నారు. అందువల్ల ఈ అవసరాలను తీర్చాలంటే తప్పనిసరిగా అణు విద్యు త్ను ఉత్పత్తి చేయాల్సిన అవసరం ఉందన్నారు. నీరు లేకపోతే జలవిద్యుత్ ఉత్పత్తి అయ్యే పరిస్థితి లేదన్నారు. అలాగే బొగ్గు ఆధారిత విద్యుత్ ప్లాంట్లకు కూడా రానురాను బొగ్గు నాణ్యత లేకపోవడం, పర్యావరణ సమస్యలు ఉత్పన్నమయ్యే అవకాశం ఉందన్నారు. సౌర విద్యుత్‌కు వచ్చేసరికి ఎండ ఉంటే తప్ప చార్జింగ్ అవదన్నారు. అందువల్ల అణువిద్యుత్ అవసరం తప్పని సరి కానుందన్నారు. విశాఖపట్నం జిల్లా అచ్యుతాపురంలో కొత్తప్లాంట్ ఏర్పాటు జరుగుతోందన్నారు. శ్రీకాకుళం జిల్లా కొవ్వాడ అణువిద్యుత్ ప్లాంట్‌కు మెజార్టీ ప్రజలు ఆమోదిస్తున్నప్పటికీ ఇంకా అక్కడ కొంత మందికి అనేక అనుమానాలు ఉన్నాయన్నారు. ఈ అనుమానాలపై వారికి అవగాహన కల్పించి, వారిని కూడా ఒప్పించాల్సిన బాధ్యత ఉందన్నారు. పరిశ్రమలకు, ఇతర అవసరాలకు నిరంతరం విద్యుత్ సరఫరా చేయాల్సిన అవసరం ఉందని, అలా చేయకపోవడం వల్ల దేశ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం పడుతుందన్నారు. సమావేశంలో కళాశాల ఇంజినీరింగ్ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ కేవీ.ఎల్ రాజు తదితరులు పాల్గొన్నారు.