
భారతదేశం 2047 నాటికి ప్రతిష్టాత్మకంగా 100 గిగావాట్ల అణు ఇంధన లక్ష్యాన్ని సాధించడంలో కీలక పాత్ర పోషించాలని లార్సెన్ అండ్ టుబ్రో (ఎల్ అండ్ టీ) దృష్టి సారించింది. భారత ప్రభుత్వం ప్రకటించిన ఈ లక్ష్యం దేశ అణు విద్యుత్ సామర్థ్యాన్ని గణనీయంగా పెంచేందుకు, స్థిరమైన ఇంధన సరఫరాను అందించాలని లక్ష్యంగా పెట్టుకుంది.
ఎల్ అండ్ టీ వ్యూహాత్మక విజన్
భారత అణు విద్యుత్ వృద్ధికి దోహదపడేందుకు కంపెనీ కట్టుబడి ఉందని ఎల్ అండ్ టీ హోల్ టైమ్ డైరెక్టర్, ఎనర్జీ ప్రెసిడెంట్ సుబ్రమణియన్ శర్మ స్పష్టం చేశారు. గ్రీన్ హైడ్రోజన్, ఎలక్ట్రోలైజర్ తయారీ, బ్లూ అమ్మోనియా ప్రాజెక్టుల్లో అవకాశాలను అన్వేషిస్తూ అణు రంగంలో తన ఉనికిని విస్తరించాలని ఎల్ అండ్ టీ యోచిస్తోంది. భవిష్యత్ ప్రాజెక్టుల కోసం సహకారం, భూసేకరణ కోసం చర్చలు జరుపుతోంది. అణువిద్యుత్ రంగంలో విభిన్న సేవలందించాలని ఎల్ అండ్ టీ లక్ష్యంగా పెట్టుకుంది. అణు రియాక్టర్ల తయారీదారుగా ఇది కీలకమైన రియాక్టర్లు, విడిభాగాలను అందిస్తోంది. ప్రభుత్వ భవిష్యత్తు లక్ష్యాలకు అనుగుణంగా భారత్ స్మాల్ రియాక్టర్ల ఏర్పాటుకు న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాతో ఎల్ అండ్ టీ చర్చలు జరుపుతోంది.
ఇదీ చదవండి: మెటా ఇండియా-యూఎస్ సముద్రగర్భ కేబుల్ ప్రాజెక్ట్
క్రియాశీల వైఖరి
గ్లోబల్ మార్కెట్‌లోకి ప్రవేశించడంతో భారత్‌తోపాటు విదేశాల్లో అవకాశాలను సద్వినియోగం చేసుకునేందుకు ఎల్ అండ్ టీ ప్రయత్నిస్తోంది. కంపెనీ గుజరాత్‌లోని కాండ్లాలో భూమి కొనుగోలు చేసింది. ఇది ఎగుమతుల కోసం ఓడరేవుల సమీపంలో సౌకర్యాలకు అనువుగా ఉంటుందని భావిస్తుంది. ఒడిషాలో కొంత భూమి కొనుగోలు చేయాలని చూస్తోంది. ఎల్ అండ్ టీ క్రియాశీల వైఖరి దేశ అణు శక్తి లక్ష్యాలకు గణనీయంగా దోహదం చేస్తుందని అధికారులు తెలిపారు.