
మరిచిపోలేని దుర్ఘటన: చెర్నోబిల్ అణువిద్యుత్ కేంద్రం
విశ్లేషణ
‘అణువు గుండెను చీల్చి
అమిత శక్తిని పేల్చి
నరుడు తన్నును బాల్చి
ఓ కూనలమ్మా’ అన్నాడు ప్రముఖ కవి ఆరుద్ర.
1945 ఆగస్టు 6, 9 తేదీల్లో జపాన్ మీద అమెరికా జరిపిన అణుదాడుల్లో లక్షలాది మంది మరణించారు. అప్పటి నుంచి అణు శక్తికి వ్యతిరేకంగా ప్రపంచ వ్యాప్తంగా ఆందోళనలు జరుగుతూనే ఉన్నాయి. 1979లో అమెరికాలోని త్రీమైల్ ఐలాండ్, 1986లో ఆనాటి సోవియట్ యూనియన్‌లోని చెర్నోబిల్, 2011లో జపాన్‌లోని ఫుకుషిమా అణువిద్యుత్ కేంద్రాల్లో జరిగిన దుర్ఘటనల కారణంగా ప్రపంచ వ్యాప్తంగా అణు విద్యుత్ కేంద్రాల ఏర్పాటు బాగా తగ్గిపోయింది.
చెర్నోబిల్ అణు దుర్ఘటన జరిగిన రోజున మరణించిన వారి సంఖ్య తక్కువే అయినా, ఆ రియాక్టర్ నుంచి విడుదలైన ప్రమాదకర రేడియేషన్ కారణంగా తర్వాతి కాలంలో లక్ష మంది మృత్యువాత పడ్డారు. యూరప్‌లోని 40 శాతం భూభాగం అణు దుష్ఫలితాల ప్రభావానికి గురైంది. ఈ ఉదంతం తర్వాత 22 దేశాల్లో 108 అణువిద్యుత్ ప్రాజెక్టులను నిలిపివేశారు.
అందరూ వద్దనుకుంటుంటే...
ఊరందరిదీ ఒక దారి అయితే ఉలిపికట్టెది ఒకదారి అన్నట్టు – ప్రపంచమంతా అణు విద్యుత్ కేంద్రాలపై ఆధారపడటం తగ్గించి వేస్తుంటే ఆంధ్రప్రదేశ్‌లోని కూటమి పాలకులు మాత్రం ఇంకా అణు విద్యుత్ వైపే మొగ్గు చూపుతున్నారు. ఇతర దేశాలు, ఇతర రాష్ట్రాలు తిరస్కరించిన అణు విద్యుత్ కేంద్రాలను మన రాష్ట్ర తీర ప్రాంతంలో ఏర్పాటు చేయడానికి 2014–19 మధ్య చంద్రబాబు ప్రభుత్వం ప్రయత్నించింది. అప్పట్లో ఆంధ్రా తీరంలోని శ్రీకాకుళం, నెల్లూరు జిల్లాల్లో నిర్మించాలనుకున్న 12 భారీ అణు విద్యుత్ కేంద్రాల కోసం చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఆగమేఘాల మీద వేలాది ఎక రాలు రైతుల నుంచి సేకరించింది.
ఆ భూములు అలానే నిరుపయో గంగా ఉండగా, తాజాగా అనకాపల్లి జిల్లాలో ఎన్.టి.పి.సి. ఆధ్వ ర్యాన 2,800 మెగావాట్ల అణు విద్యుత్ కేంద్రానికి సుమారు రెండు వేల ఎకరాల భూమి సేకరించాలని కేంద్రం నిర్ణయించింది. అంతే కాకుండా భూసేకరణ బాధ్యతను రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వానికి మోదీ సర్కార్ అప్పగించింది. మోదీ మోజులో ఉన్న కూటమి పెద్దలు ఇకపై అణువిద్యుత్ కేంద్రాల ఏర్పాటు ఆవశ్యకతను ప్రజలకు చెప్పే ప్రయత్నం చేస్తారు. ఇప్పటికే సేకరించిన భూమి గురించి మాట్లా డరు, కానీ అనకాపల్లిలో మరో రెండు వేల ఎకరాల సేకరణకు త్వర లోనే నడుం బిగిస్తారు.
కొన్ని ఇతర దేశాలతో పాటు మన దేశంలోని గుజరాత్, తమిళ నాడు, పశ్చిమ బెంగాల్, మహరాష్ట్ర ప్రజలు తిరస్కరించిన ఈ అణు విద్యుత్ కేంద్రాలను మన రాష్ట్రంలో ఏర్పాటు చేస్తే సామాజిక, పర్యా వరణ సమస్యలతో పాటు తీర ప్రాంతంలో భద్రతా పరమైన సమస్యలు కూడా ఉత్పన్నమయ్యే ప్రమాదం ఉంది.
ఆంధ్రా తీరప్రాంత జిల్లాల్లో నిర్మించాలనుకుంటున్న అణు విద్యుత్ కేంద్రాలపై అంతర్జాతీయ సంస్థలైన మెక్ ఆర్థర్ ఫౌండేషన్, ఎన్.ఆర్.డి.సి. (నేషనల్ రిసోర్సెస్ డిఫెన్స్ కౌన్సిల్) గతంలో పలు అనుమానాలను వ్యక్తం చేశాయి. ఈ సంస్థలు సంయుక్తంగా విడుదల చేసిన ‘ద వరల్డ్ న్యూక్లియర్ ఇండస్ట్రీ స్టేటస్ రిపోర్ట్’లో ఆంధ్రాలో ఏర్పాటు చేయాలనుకుంటున్న అణు విద్యుత్ కేంద్రాల గురించి ప్రముఖంగా ప్రస్తావించాయి. ఆంధ్రప్రదేశ్‌లో ఏర్పాటు చేయాలను కుంటున్న అణువిద్యుత్ కేంద్రాల వ్యయం సౌర విద్యుత్ కేంద్రాల ఏర్పాటు వ్యయం కన్నా 10 నుంచి 12 రెట్లు ఎక్కువగా ఉంటుందనీ, యూనిట్ విద్యుత్ ధర సుమారు 12 నుంచి15 రూపాయల వరకూ ఉంటుంది కాబట్టి ఇవి ఆర్థికంగా ఏ మాత్రం లాభసాటి కాదనీ ఆ నివేదికలో పేర్కొన్నారు.
భద్రతా సమస్యలు
ఇప్పటికే మనకు పాకిస్తాన్, చైనాలతో సరిహద్దు సమస్యలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంతంలో అణు విద్యుత్ కేంద్రాలను ఏర్పాటు చేయడం భద్రతా పరంగా కూడా ప్రమాదకరమే. 1971 యుద్ధ సమయంలో పాకిస్తాన్‌కు చెందిన పి.ఎన్.ఎస్. ఘాజీ అనే జలాంతర్గామి దాడి చేయడానికి విశాఖ తీరం వరకూ వచ్చిందన్న విషయం విస్మరించకూడదు.
తీరానికి దగ్గరగా ఏర్పాటు చేసే ఈ అణు విద్యుత్ కేంద్రాలపై శత్రుదేశాలు దాడి చేస్తే జరిగే నష్టం అపారంగా ఉంటుంది. అణు కేంద్రాలపై దాడి అనంతరం విడుదలయ్యే రేడియో ధార్మిక శక్తి కారణంగా అపార జన నష్టం సంభవిస్తుంది. దీనికి తోడు ఆంధ్ర తీర ప్రాంత జిల్లాలు తరచుగా తుపానులకు గురవుతున్నాయి. ఇటువంటి ప్రదేశాల్లో భారీ అణు రియాక్టర్లను ఏర్పాటు చేయాలనుకోవడం ప్రమాదకరమైన నిర్ణయ మవుతుంది.
సాంకేతిక సమస్యలు
1996లో ప్రపంచ వ్యాప్తంగా అణు విద్యుత్ వాటా 17 శాతం ఉండగా, అది 2022వ సంవత్సరంలో 10 శాతానికి పడిపోయింది. తాజా గణాంకాల ప్రకారం, దేశంలో 6,780 మెగావాట్ల సామర్థ్యం గల 22 అణు రియాక్టర్లు ఉంటే, వాటిలో తారాపూర్‌లో రెండు, కైగాలో రెండు, నరోరాలో రెండు, రాజస్థాన్‌లో ఒకటి, మద్రాస్‌లో ఒక యూనిట్ పూర్తిగానో, పాక్షికంగానో మూత పడ్డాయి. మన దేశ అణు రియాక్టర్లు నిత్యం సాంకేతిక లోపాలు ఎదుర్కొంటూ ఏనాడూ పూర్తి ఉత్పాదక సామర్థ్యంతో పనిచేయలేదు. మన దేశంలో థర్మల్ పవర్ ప్లాంట్లు 90 నుంచి 95 శాతం ఉత్పాదక సామర్థ్యంతో పని చేస్తుండగా అణు విద్యుత్ కేంద్రాలు తమ ఉత్పాదక సామర్థ్యంలో 40 శాతం మాత్రమే పని చేస్తున్నాయి.
ఆంధ్రప్రదేశ్ ఇప్పటికే విద్యుత్ రంగంలో స్వయం సమృద్ధి సాధించింది. అందువల్ల ఈ అణు విద్యుత్ కేంద్రాలను తీరప్రాంతంలో ఏర్పాటు చేయడం వల్ల రాష్ట్రానికి ఒనగూరే పెద్ద ప్రయో జనాలేమీ ఉండకపోగా నష్టాలే ఎక్కువగా ఉంటాయి. అందువల్ల వీటి ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం సహకరించకపోవడమే మేలు!
వి.వి.ఆర్.కృష్ణంరాజు
వ్యాసకర్త ఎ.పి. ఎడిటర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు
మొబైల్: 89859 41411
Comments
Please login to add a commentAdd a comment