
ప్రపంచ కుబేరుడు, దిగ్గజ వ్యాపారవేత్త ఎలాన్ మస్క్ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పాలనలో చేపట్టిన డిపార్ట్‌మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియెన్సీ(డోజ్)లో తన ప్రమేయాన్ని గణనీయంగా తగ్గిస్తున్నట్లు ప్రకటించారు. డోజ్‌కు కేటాయిస్తున్న సమయాన్ని వచ్చే నెల నుంచి తగ్గించబోతున్నట్లు చెప్పారు. టెస్లాపై దృష్టి సారించాలనే ఉద్దేశంతో వారానికి ఒకటి నుంచి రెండు రోజులు మాత్రమే డోజ్‌కు సమయం కేటాయిస్తానని మస్క్ పేర్కొన్నారు.
టెస్లాపై దృష్టి సారిస్తూ అధిక సమయం దానికే కేటాయించబోతున్నట్లు మస్క్ తీసుకున్న నిర్ణయంపై అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పందించారు. ఎలాన్ మస్క్ డోజ్ బాధ్యతలకు అధిక సమయం కేటాయించనప్పటికీ ట్రంప్ మస్క్‌పై ప్రశంసలు కురిపించారు. ఈమేరకు అమెరికాలోని ఓవల్ కార్యాలయంలో ఎగ్జిక్యూటివ్ ఆర్డర్‌పై సంతకం చేసిన సందర్భంగా మస్క్ తెలివితేటలు, దేశభక్తిని కొనియాడారు. ఫెడరల్ సంస్కరణల్లో ఆయన చేసిన కృషిని సమర్థించారు.
నిజమైన దేశభక్తుడు..
మస్క్ తన ప్రభుత్వ పాత్ర కంటే టెస్లా వ్యాపారానికే అధిక ప్రాధాన్యత ఇస్తారని అందరికీ తెలుసునని ట్రంప్ అన్నారు. డోజ్‌లో మస్క్ పాత్ర వివాదాన్ని రేకెత్తించినప్పటికీ టెక్నాలజీలో తాను ఎంతో కృషి చేశారని చెప్పారు. రాజకీయ విభేదాల వల్ల తన ఆవిష్కరణల ప్రాధాన్యతను తగ్గించకూడదన్నారు. తాను నిజమైన దేశభక్తుడన్నారు. స్పేస్ఎక్స్‌తో మస్క్ ఏరోస్పేస్ విభాగంలో చేసిన ఆవిష్కరణలను గుర్తు చేసుకున్నారు. స్పేస్‌ఎక్స్ రాకెట్లు నింగిలో దూసుకెళ్లి, తిరిగి క్షేమంగా ల్యాండ్ అవ్వడం ఒక అద్భుతం అన్నారు. ఇది కేవలం మస్క్‌తోనే సాధ్యమైందని చెప్పారు. తిరిగి తాను త్వరలోనే డోజ్‌కు అధిక సమయం కేటాయించాలని ఆశిస్తున్నట్లు పేర్కొన్నారు.
ఇదీ చదవండి: 7.39 లక్షల మందికి కొత్తగా ఈపీఎఫ్
2025 మొదటి త్రైమాసికంలో టెస్లా లాభాలు 71% క్షీణించాయి. మస్క్ సంపద తగ్గడానికి తాన వ్యాపారాల్లో పెరుగుతున్న రాజకీయ ప్రమేయమే కారణమని తెలుస్తోంది. ట్రంప్ ఎన్నికల ప్రచారానికి మస్క్ భారీగా ఖర్చు చేశారు. దీంతో అమెరికా కొత్త ప్రభుత్వం ఏర్పడిన తరువాత.. డిపార్ట్‌మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియన్సీ (DOGE) అధిపతిగా బాధ్యతలు స్వీకరించారు.