
48 గంటల్లోగా క్లుప్తంగా వివరిస్తూ మెయిల్ చేయండి
అమెరికా ఫెడరల్ ఏజెన్సీల సిబ్బందికి అందిన ఈమెయిల్స్
న్యూయార్క్: డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్ష బాధ్యతలు స్వీకరించాక దాదాపు అనధికార అధ్యక్షుడిగా చలామణి అవుతున్న ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ సారథ్యంలో డిపార్ట్‌మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫీషియెన్సీ(డోజ్) విభాగం నుంచి వివాదాస్పద నిర్ణయాల పరంపర కొనసాగుతోంది. తాజాగా వేర్వేరు ప్రభుత్వ విభాగాలైన ఫెడరల్ ఏజెన్సీల్లోని సిబ్బంది పనితీరును క్రోడీకరించే పేరుతో వారి ఉద్యోగాలకు కోత పెట్టే పనిని మొదలెట్టారు.
ఈ మేరకు ఫెడరల్ ఏజెన్సీలోని ఉద్యోగులకు తాజాగా ఒక మెయిల్ వచ్చింది. అందులో ‘‘దయచేసి ప్రభుత్వం నుంచి వచ్చిన ఈ ఈ–మెయిల్‌కు మీ స్పందన తెలియజేయండి. గత వారం మీరంతా విధినిర్వహణలో భాగంగా దేశం కోసం ఏమేం పనులు చేశారు?. ఒక ఐదు కీలకమైన అంశాలను విడివిడిగా కుప్లంగా పేర్కొంటూ ప్రతిస్పందన మెయిల్ పంపించండి. సోమవారం రాత్రి 11.59 గంటలకల్లా మెయిల్‌ను పంపించండి. మీరు గనక ఈ–మెయిల్ పంపించకపోతే మీరు ఉద్యోగానికి రాజీనామా చేసినట్లుగా పరిగణిస్తాం’’అని మెయిల్‌లో ఉంది.
ఆగ్రహం వ్యక్తంచేస్తున్న ప్రభుత్వ ఉద్యోగుల సంఘాలు
గత వారం మొత్తంలో దేశం కోసం ఏమేం చేశారని సంజాయిషీ అడగడమేంటని ప్రభుత్వ ఉద్యోగుల సంఘాల తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశాయి. యూఎస్ ఆఫీస్ ఆఫ్ పర్సనల్ మేనేజ్‌మెంట్(ఓపీఎం) విభాగం నుంచి వచ్చిన ఈ మెయిల్‌ను స్పందనగా మెయిల్‌ను పంపొద్దని తమ సిబ్బందికి అమెరికా జాతీయ వాతావరణ సేవల కేంద్రం తదితర ఏజెన్సీలు సూచించాయి.
‘‘ప్రజల కోసం పనిచేస్తున్న ఉద్యోగులను ఉద్దేశపూర్వకంగా అవమానిస్తున్నారు. దేశవ్యాప్తంగా ఉద్యోగులను చట్టవ్యతిరేకంగా తొలగిస్తే ఊరుకోం. కోర్టుల్లో సవాల్ చేస్తాం. అసలు కనీసం ఒక్క గంట సమయం నిజాయతీగా ప్రజాసేవ చేయని, ఎన్నికల్లో పోటీచేయని ప్రపంచకుబేరుడు మస్క్‌తో ఉద్యోగులకు విధినిర్వహణపై హితబోధ చేయించడాన్ని మించిన అవమానం మరోటి లేదు’’అని అమెరికన్ ఫెడరేషన్ ఆఫ్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ అధ్యక్షుడు ఎవిరెట్ కెల్లీ అన్నారు.
ఇప్పటికే వేలాది మంది ప్రభుత్వ ఉద్యోగులను ఉన్నపళంగా తొలగించడమో లేదంటే కొన్ని నెలల జీతం ముందస్తుగా ఇచ్చి స్వచ్ఛందంగా రాజీనామా చేసినట్లు లేఖలు రాయించుకోవడమే డోస్ చేసింది. మాజీ ఉద్యోగుల వ్యవహరాల విభాగం, రక్షణ, ఆరోగ్యం, మానవీయ సేవలు, అంతర్గత రెవిన్యూ సేవు, జాతీయవనాల విభాగం తదితర ఏజెన్సీల్లోని చాలా మంది తాత్కాలిక, శాశ్వత ఉద్యోగులపై వేటువేసిన సంగతి విదితమే. ఉద్యోగుల సంఖ్యను భారీగా కుదించడమే లక్ష్యంగా డోజ్ వ్యవహరిస్తున్న విషయం తెల్సిందే.
Comments
Please login to add a commentAdd a comment