
వాషింగ్టన్: అమెరికా ప్రభుత్వ బాధ్యతల నుంచి, డిపార్ట్‌మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియెన్సీ (డోజ్) సారథ్యం నుంచి వైదొలగుతున్నట్లు వస్తున్న వార్తలను టెక్ దిగ్గజం ఎలాన్ మస్క్ ఖండించారు. ‘‘అవన్నీ పుకార్లే. పని పూర్తయ్యేదాకా పదవిలో కొనసాగుతా’’అని ఎక్స్ పోస్టులో స్పష్టం చేశారు. వైట్‌హౌస్ కూడా ఈ వార్తలను ఖండించింది. ‘‘అవన్నీ చెత్త వార్తల. పదవీకాలం పూర్తయ్యాకే మస్క్ తన బాధ్యతల నుంచి వైదొలుగుతారు.
మస్క్, అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇద్దరూ ఈ మేరకు గతంలోనే బహిరంగంగా ప్రకటించారు’’అని వైట్‌హౌస్ ప్రెస్ సెక్రటరీ కరోలిన్ లివిట్ అన్నారు. ట్రంప్ అంతర్గత వ్యవహారాల నుంచి మస్క్ పూర్తిగా తప్పుకుంటారని ఎవరైనా అనుకుంటే అది వాళ్లను వాళ్లు మోసగించుకోవడమేనని సీనియర్ అడ్మినిస్ట్రేషన్ అధికారి ఒకరన్నారు. డోజ్ నుంచి మస్క్ కొద్ది వారాల్లో తప్పుకుంటారని ట్రంప్ స్వయంగా కేబినెట్‌కు తెలిపినట్లు పొలిటికో నివేదిక పేర్కొనడం తెలిసిందే.
‘‘ఆయన త్వరలో సొంత వ్యాపారాలపై పూర్తిగా దృష్టి పెట్టనున్నారు. అందుకు ట్రంప్ కూడా అంగీకరించారు. మస్క్ ఇక అనధికారిక సలహాదారు పాత్ర పోషిస్తారు’’అని చెప్పుకొచ్చింది. జనవరిలో డోజ్ బాధ్యతలు చేపట్టిన మస్క్ ఫెడరల్ వ్యయాలను తగ్గింపు, ప్రభుత్వోద్యోగుల ఉద్వాసనలో దూకుడుగా వ్యవహరిస్తున్నారు. అమెరికాను సమూలంగా మెరుగు పరచడానికి ఈ చర్యలు అవసరమంటున్నారు.
ఆయన నాయకత్వంలో డోజ్ ఇప్పటికే ప్రభుత్వ కాంట్రాక్టులు, శ్రామిక శక్తిలో భారీ కోతలు పెట్టింది. ఇవన్నీ అంతిమంగా ప్రభుత్వానికి లక్ష కోట్ల డాలర్ల దాకా ఆదా చేయగలవని పలు నివేదికలు అంచనా వేస్తునఆనయి. ప్రత్యేక ప్రభుత్వోద్యోగిగా మస్క్ పదవీకాలం మే నెలాఖరుతో ముగియనుందని భావిస్తున్నారు. ఆలోగా ఫెడరల్ వ్యయాన్ని లక్ష కోట్ల డాలర్ల మేరకు తగ్గించే పనిని పూర్తి చేయగలనని ఆయన చెబుతున్నారు.