ప్రధాని మోదీ, యూఏఈ యువరాజు నిర్ణయం
న్యూఢిల్లీ: ఇంధన రంగంలో పరస్పర సహకారాన్ని మరింత ముందుకు తీసుకెళ్లాలని, ఇరు దేశాల మధ్య సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని పెంపొందించుకోవాలని భారత్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్(యూఏఈ) నిర్ణయించుకున్నాయి. భారత ప్రధాని నరేంద్ర మోదీ, అబుదాబీ యువరాజు షేక్ ఖలీద్ బిన్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్–నహ్యాన్ సోమవారం ఢిల్లీలో సమావేశమయ్యారు.
భారత్, యూఏఈ మధ్య సంబంధాలతోపాటు ఇరుదేశాల ప్రయోజనాలతో ముడిపడి ఉన్న అంశాలపై విస్తృతంగా చర్చించారు. గాజాలోని తాజా పరిస్థితులతోపాటు ప్రాంతీయ, అంతర్జాతీయ పరిణామాలపై అభిప్రాయాలు పంచుకున్నారు. ఈ సందర్భంగా ఇంధన రంగంలో సహకారానికి సంబంధించి భారత్, యూఏఈ నాలుగు కీలక ఒప్పందాలపై సంతకాలు చేశాయి.
అబుదాబీ నేషనల్ ఆయిల్ కంపెనీ(అండోక్)– ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్(ఐఓసీఎల్), అండోక్–ఇండియా స్ట్రాటజిక్ పెట్రోలియం రిజర్వ్ లిమిటెడ్(ఐఎస్‌పీఆర్‌ఎల్) మధ్య దీర్ఘకాలం ఇంధన సరఫరాకు ఒప్పందాలు కుదిరాయి. అలాగే అబుదాబీలోని బరాఖా అణువిద్యుత్ కేంద్రం నిర్వహణ కోసం ఎమిరేట్స్ న్యూక్లియర్ ఎనర్జీ కంపెనీ(ఈఎన్‌ఈసీ)–న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్(ఎన్‌పీసీఐఎల్) మధ్య మరో ఒప్పందం కుదిరింది.
అండోక్–ఊర్జా భారత్ మధ్య ప్రొడక్షన్ కన్సెషన్ అగ్రిమెంట్ కుదిరింది. అంతేకాకుండా భారత్‌లో ఫుడ్‌పార్కుల ఏర్పాటు కోసం గుజరాత్ రాష్ట్ర ప్రభుత్వం, అబుదాబీ డెవలప్‌మెంట్ హోల్డింగ్ కంపెనీ పీజేఎస్సీ మధ్య ప్రత్యేక ఒప్పందం కుదుర్చుకున్నాయి. అబుదాబీ యువరాజు భారత పర్యటన కోసం ఆదివారం ఢిల్లీకి చేరుకున్నారు.
సోమవారం ప్రధాని నరేంద్ర మోదీతో సమావేశం అనంతరం రాజ్‌ఘాట్‌ను సందర్శించాయి. జాతిపిత మహాత్మాగాంధీకి నివాళులరి్పంచారు. యువరాజు షేక్ ఖలీద్ బిన్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్–నహ్యాన్ రాష్ట్రపతి భవన్‌లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో భేటీ అయ్యారు. వేర్వేరు రంగాల్లో పరస్పర సహకారం ద్వారా భారత్, యూఏఈ మధ్య సంబంధాలు నానాటికీ బలోపేతం అవతుండడం పట్ల రాష్ట్రపతి ఈ సందర్భంగా హర్షం వ్యక్తంచేశారు.
Comments
Please login to add a commentAdd a comment