ఉత్తర కొరియా యుద్ధానికి దిగుతుందా?
న్యూయార్క్: నేడు ఉత్తర కొరియా మాటి మాటికి అణు బాంబులు ప్రయోగిస్తామంటూ ప్రపంచ దేశాలను భయపెడుతోంది. అమెరికా, ఆస్ట్రేలియా దేశాలు కూడా భయపడాల్సి వస్తోంది ? ఆ దేశం వద్ద అన్ని అణ్వస్త్రాలు ఉన్నాయా ? ఉన్నా అన్నంత పనిచేస్తుందా? ఉత్తర కొరియా వద్ద శక్తివంతమైన అణ్వస్త్రాలు ఉండడమే కాకుండా ఆ దేశ నియంత కిమ్ జాంగ్ ఉన్ అన్నంత పనిచేసే దుందుడుకు స్వభావి అవడం కూడా భయానికి కారణం అవుతుంది.
2006, 2009, 2012 సంవత్సరాల్లో వరుసగా అణ్వస్త్ర ప్రయోగాలు నిర్వహించిన ఉత్తర కొరియా ఒక్క 2016లోనే రెండోసార్లు అణ్వస్త్ర ప్రయోగాలను నిర్వహించింది. అంతేకాకుండా హైడ్రోజన్ బాంబును కూడా విజయవంతంగా ప్రయోగించి చూసింది. సుదూర లక్ష్యాలను ఛేదించే ఖండాంతర క్షిపణలు కలిగిన ఈ దేశం వద్ద అపార సైనిక శక్తి ఉంది. వరుసగా దక్షిణ కొరియాతో యుద్ధాలు జరుగుతుండడం వల్ల ఈ దేశం అపార సైనిక సంపత్తిని సమకూర్చుకుంది.
‘ఉత్తర కొరియా నుంచి మున్నెన్నడూ లేనంతగా ముప్పు పొంచి ఉంది. ఆ దేశం బెదిరింపులను మా ప్రభుత్వం మాత్రం తీవ్రంగానే పరిగణిస్తోంది’ ఆస్ట్రేలియా ప్రధాని మాల్కమ్ టర్న్‌బుల్ వ్యాఖ్యానించారు. ఉత్తర కొరియాతో అతిపెద్ద యుద్ధం జరిగే అవకాశం పూర్తిగా ఉందని అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ కూడా ఇటీవల తన ఓవల్ ఆఫీసు నుంచి రాయిటర్స్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు. ఉత్తర కొరియా అన్నంత పనిచేస్తుందన్నది వీరిద్దరి మాటల్లో వ్యక్తం అవుతోంది.
మాజీ సోవియట్ యూనియన్ సహకారంతో ఉత్తర కొరియా తన అణు పరిశోధనలు 1950 దశకం నుంచే ప్రారంభించింది. ప్రచ్ఛన్న యుద్ధం ముగిసిన రెండేళ్ల తర్వాత, అంటే 1993లో ప్రపంచ అణ్వస్త్ర వ్యాప్తి నిరోధక ఒప్పందం (ఎన్‌పీటీ) నుంచి ఉత్తర కొరియా తప్పుకుంది. అప్పటి నుంచి అమెరికా, ఇతర ప్రపంచ దేశాలతోని ఉత్తర కొరియా సంబంధాలు క్షీణిస్తూ వచ్చాయి.