రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ బుధవారం ఉత్తర కొరియాలో పర్యటిస్తున్నారు. ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ ఆహ్వానం మేరకు రెండు రోజులు (ఈనెల18,19) అక్కడ పుతిన్ పర్యటిస్తున్నారు. ప్యోంగ్యాంగ్ విమానాశ్రయానికి స్వయంగా వెళ్లిన కిమ్, పుతిన్‌కు ఆహ్వానం పలికారు. అనంతరం ప్యోంగ్యాంగ్లో నిర్వహించిన కార్యక్రమంలో ఇరువురు పాల్గొన్నారు. ఇరు దేశాల మధ్య బంధాన్ని మరింత బలోపేతం చేసేందుకు ద్వైపాక్షిక చర్చలు జరిపారు.
ఉక్రెయిన్‌తో యుద్ధం కొనసాగుతున్న నేపథ్యంలో రష్యాకు తమ పూర్తి మద్ధతు ఉంటుందని కిమ్ హామీ ఇచ్చారు. ఇరుదేశాల మధ్య బంధాన్ని మరింత బలోపేతం చేయడానికి, అమెరికా ఆధిప్యత విధానాలకు వ్యతిరేకంగా పోరేండేందుకు ఓ ఒప్పందాన్ని కుదుర్చుకోనున్నట్లు పుతిన్ పేర్కొన్నారు. ఇరు దేశాల మద్య ఆర్థిక, సైనిక సహకారాన్ని విస్తరించేందుకు అంగీకరించినట్లు తెలిపారు.
యుద్ధంలో తమ పాలసీలకు మద్ధతు ప్రకటించడంపై కిమ్‌కు పుతిన్ ధన్యవాదాలు తెలిపారు. అయితే యుద్ధంలో తమకు ఆయుధాలను పంపాలని కిమ్‌ను కోరినట్టు తెలుస్తోంది. దీనికి బదులుగా ఉత్తర కొరియాకు ఆర్థికంగా, సాంకేతికంగా రష్యా సాయం చేయనున్నట్టు సమాచారం.
ఇక ఉక్రెయిన్‌పై రష్యా దండయాత్ర సమయంలో పుతిన్ పర్యటనకు రావడం.. అమెరికా సహా దాని మిత్రదేశాలను ఆందోళనకు గురిచేసింది. అణ్వాయుధాలు, క్షిపణి పరీక్షలతో నిత్యం శత్రు దేశాలను కవ్వించే ఉత్తర కొరియా చేతికి రష్యా అత్యాధునిక సాంకేతికత అందితే మరింత ప్రమాదమని పశ్చిమ దేశాల్లో ఆందోళన నెలకొంది.
ఇదిల ఉండగా అంతర్జాతీయంగా ఇరుదేశాలపై కఠిన ఆంక్షలు కొనసాగుతున్నాయి. ఒకవైపు.. ఉక్రెయిన్‌పై రష్యా దాడులు కొనసాగిస్తోంది. మరోవైపు.. ఉత్తర కొరియా ఆయుధ పరీక్షలు, ఇతర దుందుడుకు చర్యలకు పాల్పడుతోంది. ఈ పరిణామాల నడుమ.. వీరి భేటీ ప్రాధాన్యం సంతరించుకుంది. ఉత్తర కొరియాలో పుతిన్ పర్యటించడం 24 ఏళ్లలో ఇదే తొలిసారి. కాగా గత ఏడాది సెప్టెంబరులో కిమ్ జోంగ్ ఉన్ రష్యాలో పర్యటించిన సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment