కిమ్‌ కొత్త ఎత్తు.. ఇక కల్చరల్‌ వార్‌ | Kim Jong Un Cultural War Against South Korean Pop Culture | Sakshi
Sakshi News home page

కిమ్‌ కొత్త ఎత్తు.. ఇక కల్చరల్‌ వార్‌

Published Sun, Jun 13 2021 3:30 PM | Last Updated on Sun, Jun 13 2021 5:57 PM

Kim Jong Un Cultural War Against South Korean Pop Culture - Sakshi

పొరుగు దేశం దక్షిణ కొరియాపై ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్‌ జోంగ్‌ ఉన్‌ కొత్త యుద్ధం చేయబోతున్నాడు. అణు ఆయుధాలు ఉపయోగించకుండా.. కొత్త చట్టాలతో సౌత్‌ కొరియా ఆర్థిక వ్యవస్థను దెబ్బ కొట్టాలనే ప్రయత్నాలను ముమ్మరం చేశాడు. ఈ క్రమంలో కొరియా పాప్‌ కల్చర్‌పై త్వరలో సంపూర్ణ నిషేధం విధించాలనే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. కొరియన్‌ పాప్‌ కల్చర్‌ను ‘ప్రమాదకరమైన క్యాన్సర్‌ వ్యాధి’గా  పోలుస్తూ ఈ మధ్య ఒక సమావేశంలో కిమ్‌ చేసిన వ్యాఖ్యలే ఇందుకు నిదర్శనం. 

ప్యోంగ్యాంగ్‌: ‘‘ఉత్తర కొరియా యువతపై పొరుగు దేశపు(దక్షిణ కొరియా) సంస్కృతి, సంప్రదాయాల ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది. కాబట్టి, అలాంటి జాడ్యాన్ని అంటగట్టుకునే ప్రయత్నం చేయొద్ద’’ని కిమ్‌ జోంగ్‌ ఉన్‌, అక్కడి యువతను హెచ్చరించినట్లు యోన్‌హప్‌ టీవీ ఛానెల్‌ స్టోరీ టెలికాస్ట్ చేసింది. ఇక ఇదే విషయాన్ని ధృవీకరిస్తూ.. ‘పాప్‌ వేషధారణ, హెయిర్‌స్టైల్‌, ప్రవర్తన.. ప్రతీది ఉత్తర కొరియా సంస్కృతిని నాశనం చేస్తున్నవే’ అని కిమ్‌ వ్యాఖ్యానించినట్లు ది న్యూయార్క్‌ టైమ్స్‌ కూడా ఓ స్టోరీ ప్రచురించింది.

ఎందుకీ మార్పు?
ఒకప్పుడు కొరియన్‌ పాప్‌ కల్చర్‌ను కిమ్‌ కూడా ఆస్వాదించిన వాడే. 2018లో దక్షిణ కొరియాకు చెందిన రెడ్‌ వెల్‌వెట్‌, చో యాంగ్‌ పిల్‌ పాప్‌ బ్యాండ్‌లను పిలిపించుకుని తన రాజధాని ప్యోంగ్యాంగ్‌లో ప్రదర్శలు ఇప్పించుకున్నాడు. డెబ్భై ఏళ్ల కిమ్‌ ఫ్యామిలీ పాలనలో.. ఇలాంటి వేడుకలకు హాజరైన తొలి వ్యక్తి కూడా ఈ నియంతాధ్యక్షుడే. అయితే గత కొంతకాలంగా కొరియన్‌ కల్చర్‌ వల్ల అక్కడి యువతలో విప్లవాత్మక మార్పులు వస్తున్నాయి. ఈ క్రమంలో యూత్‌ మీద పట్టును కోల్పోతాడేమో అనే ఉద్దేశంతోనే కిమ్‌ ఈ నిర్ణయానికి వచ్చి ఉంటాడని, అదే టైంలో కొరియన్‌ పాప్‌ మార్కెట్‌ను దెబ్బతీయొచ్చనే ఆలోచనలో ఉండొచ్చని నిపుణులు భావిస్తున్నారు.

జుట్టు నుంచి మొదలు.. 
ఉత్తర కొరియాలో ఈమధ్య కొన్ని కొత్త చట్టాలకు అధికారిక ముద్ర వేశాడు కిమ్‌. వీటి ప్రకారం.. దేశంలో ఎవరూ జుట్టుకు రంగు వేయకూడదు. అంతేకాదు 215 రకాల హెయిర్‌ స్టైల్స్‌తో ఒక లిస్ట్‌ తయారు చేసి.. వాటిని మాత్రమే అనుసరించాలని ప్రజలకు సూచించారు. స్పైక్‌, ముల్లెట్‌ హెయిర్‌స్టైల్స్‌పై సంఘ వ్యతిరేక ముద్ర వేసి నిషేధించాడు. టైట్‌ జీన్స్‌, ప్రింటెడ్‌ టీషర్టులు వేయడం నిషేధం. ఒకవేళ టీ షర్టులు వేసినా వాటి మీద స్లోగన్లు ఉండకూదు. ముక్కు-పెదాలు కుట్టించుకోవడానికి వీల్లేదు. సౌత్‌ కొరియా సినిమాలు, సంగీతం, వీడియోలు.. బహిరంగ ప్రదేశాల్లో ప్రదర్శిస్తే కఠినంగా శిక్షిస్తారు.

మరణశిక్షకు మార్పు
నార్త్‌ కొరియాలో యాంటీ కె(కొరియా)పాప్‌ ఉద్యమానికి బీజం పోయినేడాది డిసెంబర్‌లోనే బీజం పడింది. ఆ టైంలో కిమ్‌ జోంగ్‌ ఉన్‌ ఓ​కొత్త చట్టం చేశాడు. దాని ప్రకారం.. దక్షిణ కొరియా సినిమాలు, వీడియోలు చూసినా, పాటలు విన్నా సరే (అది రహస్యంగా అయినా).. వాళ్లకు 15 ఏళ్లు కఠిన కారాగార శిక్ష అమలు చేస్తున్నారు. ఒకవేళ చిన్నపిల్లలు ఈ నేరానికి పాల్పడితే.. వాళ్ల తల్లిదండ్రులకు ఆ శిక్ష అమలు చేస్తారు. అయితే తాజా పరిణామాల నేపథ్యంలో పదిహేనేళ్ల శిక్షను.. మరణ శిక్షగా మార్చాలనే ఆలోచనలో కిమ్‌ ఉన్నాడన్న విషయం డెమొక్రటిక్‌ పీపుల్స్‌ రిపబ్లిక్‌ ఆఫ్‌ కొరియా పార్టీ పత్రాల లీకేజీ వ్యవహారంతో వెలుగులోకి వచ్చింది.

  

కొసమెరుపు: కొరియన్‌ పాప్‌ కల్చర్‌ కంటెంట్‌ ఉత్తర కొరియా ప్రజలకు నేరుగా చేరేది 30 శాతం మాత్రమే. అది కూడా ఉత్తర కొరియాలోనే కొందరు స్మగ్లర్లు వాటిని ప్రజలకు చేరవేస్తుంటారు. ఇక చైనా నుంచి ఫ్లాష్‌ లింకుల ద్వారా ఈ అక్రమ వ్యాపారం భారీ లెవల్‌లో జరుగుతుండడం విశేషం.

చదవండి: కిమ్‌ పాలనలో ఆకలి రోదనలు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement