గత కొద్ది రోజులుగా ఉత్తర- దక్షిణ కొరియా దేశాల మధ్య తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్నాయి. దక్షిణ కొరియాకు చెందిన డ్రోన్లు తమ దేశంలోకి వచ్చాయని ఆరోపిస్తూ నార్త్ కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ కఠిన చర్యలు దిగుతున్నారు. ఈ క్రమంలో తాజాగా ఉత్తర కొరియా కీలక నిర్ణయం తీసుకుంది.
దక్షిణకొరియాను శత్రుదేశంగా పరిగణిస్తూ తమ రాజ్యాంగంలో మార్పులు చేపట్టినట్లు ఉత్తర కొరియా అధికారికంగా ప్రకటించింది. ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ ఆదేశాల మేరకు రాజ్యాంగంలో మార్పులు చేసినట్లు పాగ్యాంగ్ వెల్లడించింది. దక్షిణ కొరియాను శత్రుదేశంగా పరిగణించడం అనివార్యమైన, న్యాయపరమైన చర్యగా కిమ్ సర్కార్ పేర్కొంది. 1991లో ఉత్తర- దక్షిణకొరియా దేశాల మధ్య జరిగిన కీలక ఒప్పందాన్ని రద్దు చేసుకోవాలని నిర్ణయించింది. అయితే రాజ్యాంగ మార్పుల గురించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
రెండు కొరియా దేశాల మధ్య సంబంధాలు అత్యల్ప స్థాయికి చేరుకున్నాయి. ఈ క్రమంలోనే దక్షిణ కొరియాతో తమకున్న సరిహద్దును పూర్తిగా మూసివేస్తున్నట్లు కిమ్ సర్కారు నిర్ణయించింది. అంతేగాక ఈ ఏడాది జనవరిలో కిమ్ దక్షిణ కొరియాను తమ దేశానికి ప్రధాన శత్రువుగా నిర్వచించారు. అధ్యక్షుడు పిలుపునిచ్చిన చట్టపరమైన మార్పులను ప్యోంగ్యాంగ్ మొదటిసారిగా గుర్తించింది.
కాగా ఇటీవల దక్షిణ కొరియాను అనుసంఘానం చేసే సరిహద్దులోని రోడ్లను, రైల్వేలను కిమ్ సైన్యం బాంబులతో పేల్చివేసిన అనంతరం ఈ ప్రకటన వెలువడింది. తమ దేశంలోకి సౌత్ కొరియాకు చెందిన ఏ ఒక్క డ్రోన్ వచ్చినా తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని కిమ్ హెచ్చరించారు. తమ ప్రజల భద్రత విషయంలో ఎలాంటి రాజీ ఉండబోదన్నారు. కవ్వింపు చర్యలు మానుకోవాలని పొరుగు దేశానికి సూచించారు.
Comments
Please login to add a commentAdd a comment