4 వారాలు
అణు వ్యతిరేక ఉద్యమకారులపై కేసుల ఎత్తివేతలో జాప్యాన్ని మద్రాసు హైకోర్టు తీవ్రంగా పరిగణించింది. కేసులు ఎత్తివేయడానికి ప్రభుత్వానికి నాలుగు వారాల గడువు ఇస్తూ గురువారం మద్రాసు హైకోర్టు ప్రధాన బెంచ్ ఆదేశాలు జారీ చేసింది.
సాక్షి, చెన్నై : తిరునల్వేలి జిల్లా కూడంకులంలో అణు విద్యుత్ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఈ కేంద్రానికి వ్యతిరేకంగా మూడేళ్ల పాటు భారీఎత్తున ఉద్యమం సాగింది. నేటికీ కొసాగుతూనే ఉంది. ఉద్యమం ఉధృతంగా సాగుతున్న సమయంలో అటు రాష్ట్ర ప్రభుత్వం, ఇటు కేంద్రం ఉద్యమకారుల్ని టార్గెట్ చేశారుు. ఉద్యమాన్ని నీరుగార్చడం లక్ష్యంగా తీవ్ర సెక్షన్లతో కేసులు నమోదు చేశాయి. ఈ ఉద్యమంలో అత్యధికంగా సముద్ర తీరాల్లోని జాలర్ల గ్రామాల ప్రజలు పాలు పంచుకున్నారు. ప్రతి ఒక్కరిపై ఏదో ఒక కేసు నమోదు అయింది. ఉద్యమ నేతలపై పదుల సంఖ్యలో కేసులు పెట్టారు. ఎట్టకేలకు ఆ ఉద్యమాన్ని ప్రభుత్వం నీరుగార్చింది.
తమ పంతాన్ని నెగ్గించుకునే రీతిలో కూడంకులంలో గత ఏడాది అణు విద్యుత్ ఉత్పత్తి ఆరంభం అయింది. ఉద్యమం చతికిల బడింది. కూడంకులంలో ఏదేని చిన్న పాటి శబ్దం వచ్చినా ఈ ఉద్యమ నేతలు తమ గళాన్ని విప్పడం ఆ తర్వాత మిన్నుకుండిపోవడం పరిపాటిగా మారింది. ఈ నేపథ్యంలో తమ మీద పెట్టిన కేసుల్ని ఎత్తి వేయాలంటూ కోర్టును ఉద్యమకారులు ఆశ్రయించారు. తమతో సాగిన చర్చల్లో కేసుల ఎత్తివేత అంశం ఉందని, అయితే, ఇంత వరకు ఒక్కరిపై కూడా కేసులు ఎత్తి వేయలేదంటూ హైకోర్టును ఆశ్రయించారు. ఇందుకు సానుకూలంగా స్పందించిన న్యాయస్థానం కేసుల ఎత్తివేతకు చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది.
గడువు :కేసుల ఎత్తి వేత ఆదేశాలు వెలువడి నెలలు గడుస్తున్నా, ప్రభుత్వం మాత్రం అందుకు తగ్గ చర్యలు తీసుకోలేదు. దీంతో అణు వ్యతిరేక ఉద్యమకారుల తరపున మళ్లీ కోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి. కేసుల ఎత్తి వేతలో జాప్యం జరుగుతోందని, నిర్లక్ష్యం వహిస్తున్నారని కోర్టు దృష్టికి తెచ్చారు. ఈ పిటిషన్ విచారణ గురువారం ప్రధాన న్యాయమూర్తి సంజయ్ కిషన్ కౌల్, న్యాయమూర్తి సత్యనారాయణల నేతృత్వంలోని ప్రధాన బెంచ్ ముందుకు వచ్చింది. వాదనల అనంతరం కేసుల ఎత్తివేత విషయమై నాలుగు వారాల్లోపు ఉత్తర్వులు జారీ చేయాలని ప్రభుత్వాన్ని బెంచ్ ఆదేశించింది. ఇందుకు తగ్గ వివరాల్ని, ఉత్తర్వుల్ని బెంచ్ దృష్టికి తీసుకురావాలని సూచించారు. తదుపరి విచారణను డిసెంబర్ ఐదో తేదీకి వాయిదా వేశారు.