ఎన్నో ఆశలను రేకెత్తించిన రైల్వే బడ్జెట్ నిరుత్సాహపర్చింది. జిల్లా ప్రజల ఆశలపై నీళ్లుచల్లింది. రైల్వేపరంగా ఒక్క సమస్యకూ పరిష్కారం లభించలేదు. కనీసం జిల్లా డిమాండ్లపై కన్నెత్తయినా చూడలేదు. కొత్త రైలు కూత కూడా వినిపించలేదు. ఏళ్ల తరబడి ఎదురుచూసిన రైళ్లను పొడించనూ లేదు. ఎంతో ఊరించిన రైల్వే జోన్ ప్రస్తావన లేకపోవడం నిరుద్యోగ యువతను నీరుగార్చింది. ఈ ప్రాంతం నుంచి లోక్‌సభకు ప్రాతినిధ్యం వహించిన నేతలు ఒక్క హామీని కూడా నెరవేర్చుకోలేకపోయారు. ప్రతిపాదనల సమర్పణకే పరిమితమయ్యారని జిల్లాప్రజానీకం నిరసిస్తోంది. సదుపాయాల విషయంలో ప్రకటించిన అంశాలు ఆచరణలో కనిపించవని గతం నిరూపించింది. అదే పునరావృతమవుతుందని ప్రయాణికులు పెదవి విరుస్తున్నారు. కనీసం వెనుకబడిన జిల్లాపై కూడా కరుణ చూపకపోవడంపై నిరసన ధ్వనులు వినిపిస్తున్నాయి.
శ్రీకాకుళం టౌన్: కేంద్రరేల్వేమంత్రి సురేష్ ప్రభు పార్లమెంటులో గురువారం ప్రవేశపెట్టిన రేల్వేబడ్జెట్‌లో ఉత్తరాంధ్రకు మరోసారి మొండిచేయి చూపారు. విశాఖ రేల్వేజోన్ ఊసేలేకుండా కొత్తబడ్జెట్‌ను ప్రవేశపెట్టి ప్రయాణికుల ఆశలపైనీళ్లు చల్లారు. దీనికి తోడు శ్రీకాకుళం జిల్లాకు ఈసారి కొత్తగా ఎటువంటి మంజూర్లు తీసుకురాలేకపో యారు. కేంద్రమంత్రిగా అశోక్‌గజపతిరా జు, ఎంపీలుగా కింజరాపు రామ్మోహననాయు డు, కొత్తపల్లి గీతలు ప్రాతినిథ్యం వహిస్తున్న ఈ జిల్లాలో ప్రజల అవసరాలకు తగ్గట్టుగా కొత్తగా ఏ ఒక్క ప్రాజెక్టును సాధించుకోలేక పోయారు.
విశాఖ జోన్ ఏర్పాటైతే కొత్తగా 6 వేలమందికి ఉద్యోగాలు వస్తాయని ఆశపడ్డ నిరుద్యోగులకు నిరాశ మిగిలింది. జిల్లాలను ఉత్తరాది రాష్ట్రాల్లో కలపడం వల్ల ఇక్కడున్న నిరుద్యోగులకు అవకాశాలు రాకుండా పోయాయి. ఉత్తరాది యువకులకు జిల్లా వ్యాప్తంగా గ్యాంగ్ మెన్‌లు, ట్రాక్‌మెన్‌లు, గేట్‌మెన్‌లుగా నియమించుకున్నారు. ఈప్రాంతంలో పెద్దసంఖ్యలో వారే విధులు నిర్వర్తిస్తున్నారు. ఇక స్టేషన్ మాస్టరు, టీటీ, రేల్వేకానిస్టేబుళ్లు అంతా వారే పనిచేస్తున్నారు. కొత్తజోన్ వస్తే ఆ అవకాశాలన్నీ తెలుగువారికే దక్కుతాయని ఆశపడ్డా రేల్వే మంత్రి నెరవేర్చలేదు.
కొత్త రైళ్ల జాడే లేదు...
ఉత్తరాది రాష్ట్రాలను కలుపుతూ కొత్తరైళ్లకు ఈ బడ్జెట్‌లో కేటాయింపులు జరగలేదు. నౌపడా- రాయఘడ్ మార్గాన్ని కలిపేందుకు పర్లాకిమిడినుంచి కొత్తలైన్ మార్గం ఏర్పాటుకు కేటాయింపులు జరగలేదు. జి.సిగడాం నుంచి రాజాం మీదుగా విజయనగరంకు రైలు మార్గం ఏర్పాటు కలగానే మిగిలిపోయింది.
జిల్లాలో కొత్త రేల్వేహాల్ట్‌లు ఇవ్వలేదు. కేవలం రేల్వేస్టేషన్లలో సీసీ కెమెరాలు ఏర్పాటు, ఎల్‌సీడీ టీవీలు ఏర్పాటుకు బడ్జెట్‌లో కేటాయింపులు చేశారు. పలాస, బెండిగేటు, పొందూరు రేల్వే క్రాసింగ్‌ల వద్ద నిర్మాణంలో ఉన్న ఫ్లైఓవర్ల పనులు పూర్తిచేసేందుకు మాత్రమే నిధులు కేటాయించారు. రేల్వేస్టేషన్ల ఆధునీకరణ ఊసేలేదు.
కొత్తరైళ్ల మంజూరు లేనట్టే..
జిల్లా మీదుగా ప్రయాణించేందుకు పాతరైళ్లు మినహా కొత్తరైళ్లు ఈ బడ్జెట్‌లో కేటాయించలేదు. పాతవాటికి హాల్ట్‌లైనా మంజూరవుతాయని ఆశపడ్డ ప్రయాణికులకు నిరాశే మిగిలింది. రైళ్ల వేగం పెంచుతామని మంత్రి ప్రకటించినప్పటికి ఏఏ రైళ్లు వేగం పెరుగుతాయో అందులో పొందుపరచలేదు. కొత్తగా లైన్ల ఏర్పాటు లేకుండా వేగం పెంచడానికి ఎలా వీలౌతుందని రేల్వే ఉద్యోగులే ప్రశ్నిస్తున్నారు.
సిక్కోలు ఆశలపై నీళ్లు
Published Fri, Feb 26 2016 12:50 AM | Last Updated on Sun, Sep 3 2017 6:25 PM
Advertisement
Advertisement