న్యూఢిల్లీ: రానున్న కేంద్ర బడ్జెట్‌లో (Budget 2025) మూలధన వ్యయాలు, పన్ను చట్టాల సరళతరం, వ్యక్తిగత ఆదాయపన్ను (income taxe) తగ్గింపు ప్రతిపాదనలకు చోటు కల్పించొచ్చని ఈవై ఇండియా అంచనా వేసింది. ముఖ్యంగా తక్కువ ఆదాయ వర్గాలకు పన్నుల ఉపశమనం తప్పనిసరి అని పేర్కొంది.
2025–26 ఆర్థిక సంవత్సరం బడ్జెట్‌ను వచ్చే నెల 1న పార్లమెంట్‌లో ప్రవేశపెట్టనుండడం తెలిసిందే. దీంతో బడ్జెట్ అంచనాలతో ఈవై ఇండియా ఒక నోట్‌ను విడుదల చేసింది. 2023–24 ఆర్థిక సంవత్సరం చివరి నాటికి రూ.31 లక్షల కోట్ల మేర ఆదాయపన్ను వివాదాల రూపంలో చిక్కుకుపోయినట్టు చెప్పింది. ఆదాయపన్ను కమిషనర్ (అప్పీళ్లు) సత్వరమే వీటిని పరిష్కరించాలని, ప్రత్యామ్నాయ పరిష్కార యంత్రాంగాలను తీసుకురావాలని సూచించింది.
‘‘ప్రత్యక్ష పన్నుల కోడ్ సమగ్ర సమీక్షకు సమయం తీసుకోవచ్చు. కాకపోతే ఈ దిశగా ఆరంభ నిర్ణయాలకు బడ్జెట్‌లో చోటు ఉండొచ్చు. వ్యక్తిగత ఆదాయపన్నును సైతం తగ్గించొచ్చు. తక్కువ ఆదాయ వర్గాలకు ఉపశమనంతోపాటు డిమాండ్‌కు ఊతం ఇచ్చేందుకు వీలుగా చర్యలు ఉండొచ్చు’’అని ఈవై ఇండియా నేషనల్ ట్యాక్స్ లీడర్ సమీర్ గుప్తా తెలిపారు.
ఆర్థిక వ్యవస్థను ముందుకు నడిపించే విధంగా వ్యూహాత్మక సంస్కరణలపై బడ్జెట్‌లో దృష్టి సారించొచ్చన్నారు. ద్రవ్య స్థిరీకరణకు ప్రాధాన్యం ఇవ్వడం ద్వారా స్థిరమైన ఆర్థిక వృద్ధికి తగిన నిర్మాణాత్మక చర్యలు ఉండొచ్చన్నారు.
పన్ను చెల్లింపుదారులకు మెరుగైన సేవలు..
ముఖ్యంగా పన్నుల విధానాన్ని సులభంగా మార్చడం, కస్టమర్ల సేవలను మెరుగుపరచడం, వివాదాలను తగ్గించడం, పన్ను నిబంధనల అమలును పెంచడం దిశగా ప్రభుత్వం చర్యలు ప్రకటించొచ్చని ఈవై ఇండియా అంచనా వేస్తోంది. పన్ను చట్టాల సులభీకరణ కోసం ప్రభుత్వం ఇప్పటికే ప్రజల నుంచి సూచనలను ఆహ్వానించిన విషయాన్ని గుర్తు చేసింది.
ప్రైవేటు రంగ పెట్టుబడులను ప్రోత్సహించడం, వ్యాపార ఆవిష్కరణలను ప్రోత్సహించడంపై కీలకంగా దృష్టి సారించాలని పేర్కొంది. గత బడ్జెట్‌లో కేంద్ర ప్రభుత్వం మూలధన లాభాల విధానాన్ని హేతుబద్దీకరించడానికి ప్రాధాన్యం ఇచ్చినట్టు చెబుతూ.. ఈ దిశగా మరిన్ని చర్యలు రాబోయే బడ్జెట్‌లో ఉండొచ్చని తెలిపింది. ముఖ్యంగా ఎస్‌ఎంఈలకు పన్నుల సంక్లిష్టతను తగ్గించడం ఎంతో అవసరమని అభిప్రాయపడింది.
Comments
Please login to add a commentAdd a comment