Railway Budget
-
రైల్వేబడ్జెట్‌లో తెలంగాణకు రూ.4,400 కోట్లు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో రైల్వే అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తోందని.. ఈసారి రైల్వేబడ్జెట్‌లో రూ.4,400 కోట్లు కేటాయించామని రైల్వేశాఖ మంత్రి అశ్వనీ వైష్ణవ్ తెలిపారు. ప్రపంచ స్థాయి స్టేషన్‌గా సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌ను అభివృద్ధి చేస్తున్నామన్నారు. తెలంగాణ, ఏపీలకు రెండు వందే భారత్ రైళ్లను అందించామని చెప్పారు. శనివారం సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌లో జరిగిన బహిరంగ సభలో అశ్వనీ వైష్ణవ్ మాట్లాడారు. ‘సబ్కా సాత్.. సబ్కా వికాస్, సబ్కా విశ్వాస్.. సబ్కా ప్రయాస్’పేరుతో ప్రధాని మోదీ దేశాన్ని అభివృద్ధి చేస్తున్నారని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా రైల్వేల అభివృద్ధికి సహకరించాల్సిన అవసరం ఉందని వ్యాఖ్యానించారు. శ్రీవెంకటేశ్వర స్వామి సులభతర దర్శనం కోసమే వందేభారత్ రైలును ప్రారంభించినట్లు చెప్పారు. తెలంగాణను అన్ని రకాలుగా ఆదుకుంటున్నారు: కిషన్‌రెడ్డి తెలంగాణను అన్ని రంగాల్లో అభివృద్ధి చేయాలన్నదే ప్రధాని మోదీ ఆలోచన అని.. మంచి మౌలిక వసతులు కల్పించేందుకే మోదీ హైదరాబాద్‌కు వచ్చారని కేంద్ర పర్యాటక శాఖ మంత్రి జి. కిషన్‌రెడ్డి పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వ నిధులతో తెలంగాణతో పాటు దేశవ్యాప్తంగా భారీ ఎత్తున అభివృద్ధి పనులు సాగుతున్నాయని చెప్పారు. తెలంగాణలోని 32 జిల్లాలను జాతీయ రహదారులతో అనుసంధానం చేశామన్నారు. ఇప్పటివరకు దేశంలో 14 వందే భారత్ రైళ్లను ప్రారంభించామని, అందులో రెండింటిని తెలంగాణకు ప్రధాని మోదీ బహుమతిగా ఇచ్చారని పేర్కొన్నారు. రూ.714 కోట్లతో సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌ను అంతర్జాతీయ స్థాయిలో అభివృద్ధి చేస్తుండటం గర్వకారణమన్నారు. రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల కొంతకాలం ఎంఎంటీఎస్ సెకండ్ ఫేజ్ ఆగిపోయిందని.. బీజేపీ ఎంపీలు వెళ్లి ప్రధానికి విజ్ఞప్తి చేయగా.. కేంద్రం చొరవ తీసుకుని మేడ్చల్ వరకు ఎంఎంటీఎస్‌ను, 13 కొత్త ఎంఎంటీఎస్ రైళ్లను ప్రారంభిస్తోందని చెప్పారు. తెలంగాణను అన్నిరకాలుగా ఆదుకుంటున్న ప్రధాని మోదీని రాష్ట్ర ప్రజలందరూ ఆశీర్వదించాలని కోరారు. -
పాత ప్రాజెక్టులకే పచ్చజెండా
సాక్షి, హైదరాబాద్: కేంద్ర బడ్జెట్లోని రైల్వే పద్దులో మోదీ ప్రభుత్వం ఈసారి తెలంగాణకు కొత్తగా ఎలాంటి ప్రాజెక్టులు ప్రకటించలేదు. కనీసం కొత్త లైన్లు, సర్వేలను సైతం ప్రస్తావించలేదు. కేవలం పాత ప్రాజెక్టులకు నిధులు కేటాయింపులతోనే సరిపెట్టింది. అయితే ప్రస్తుతం రాష్ట్రంలో కొనసాగుతున్న ప్రాజెక్టులకు గత బడ్జెట్‌తో పోలిస్తే కేటాయింపులు మెరుగ్గా ఉండటం ఊరటనిచ్చే అంశం. ఈసారి దక్షిణ మధ్య రైల్వేకు రూ.13,786.19 కోట్లను కేంద్రం కేటాయించింది. ఇది గతేడాది కేటాయించిన రూ. 8,349.75లతో పోలిస్తే 60 శాతం ఎక్కువ. ఇందులో తెలంగాణ పరిధిలోని ప్రాజెక్టులు, ఇతర పనులకు రూ. 4,418 కోట్లు లభించాయి. ఈ మొత్తం గతేడాది కేటాయింపు (రూ. 3,048 కోట్లు)ల కంటే 45 శాతం ఎక్కువ కావడం విశేషం. దక్షిణమధ్య రైల్వే పరిధిలోకే వచ్చే ఏపీలో జరుగుతున్న ప్రాజెక్టులకు కేంద్రం రూ. 8,406 కోట్లు కేటాయించింది. ఇది గతేడాది కేటాయింపు (రూ. 7,032)ల కంటే 20 శాతం ఎక్కువ. గతం కన్నా రూ. 5,437 కోట్లు ఎక్కువ.. ఈసారి దక్షిణమధ్య రైల్వే జోన్‌కు గత బడ్జెట్ కంటే ఏకంగా రూ. 5,437 కోట్లు ఎక్కువగా కేటాయించారు. తెలుగు రాష్ట్రాలతోపాటు జోన్ పరిధిలోకి వచ్చే కర్ణాటక, మహారాష్ట్రలో రైల్వే లైన్ల ఏర్పాటుకు కూడా ఈ కేటాయింపులు ఊతమిస్తాయి. సికింద్రాబాద్ స్టేషన్ అభివృద్ధి పనులతోపాటు జోన్ పరిధిలో మరో 105 స్టేషన్లను అభివృద్ధి చేయబోతున్నాం. నగరానికి అత్యంత కీలకమైన ఎంఎంటీఎస్ రెండో దశ పనులు పూర్తి చేసేలా ఏకంగా రూ. 600 కోట్లు కేటాయింపు ఆ ప్రాజెక్టుకు పెద్ద మలుపు కానుంది. – అరుణ్‌కుమార్‌జైన్, జీఎం దక్షిణ మధ్య రైల్వే -
దక్షిణ కోస్తా రైల్వే జోన్‌పై నోరు మెదపని రైల్వే బడ్జెట్
సాక్షి, అమరావతి: ఈ ఏడాది రైల్వే బడ్జెట్లోనూ విశాఖపట్నం రైల్వే జోన్ కూత వినిపించలేదు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ లోక్‌సభలో బుధవారం 2023–24 వార్షిక బడ్జెట్లో అంతర్భాగంగా ప్రవేశపెట్టిన రైల్వే బడ్జెట్ రాష్ట్రానికి తీవ్ర నిరాశ కలిగించింది. రాష్ట్ర ప్రజల దీర్ఘకాలిక డిమాండ్ అయిన విశాఖపట్నం కేంద్రంగా దక్షిణ కోస్తా రైల్వే జోన్‌ను ఆచరణలోకి తీసుకువచ్చే అంశంపై కేంద్రం మౌనం దాల్చింది. రాష్ట్ర విభజన చట్టంలో స్పష్టంగా ఇచ్చిన హామీకి కట్టుబడి రైల్వే జోన్‌ను ఆచరణలోకి తేవాలని రాష్ట్ర ప్రభుత్వం, వైఎస్సార్సీపీ ఎంపీలు కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. రైల్వే ప్రాజెక్టుల్లో రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయాన్ని ప్రస్తావించారు. రైల్వే ప్రాజెక్టుల్లో రాష్ట్రానికి తగిన ప్రాధాన్యం కల్పించాలని నివేదించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా కీలక ప్రతిపాదనలతో కూడిన నివేదికను కేంద్రానికి సమర్పించింది. అయినప్పటికీ కేంద్ర వైఖరిలో ఏమాత్రం మార్పు రాలేదు. బడ్జెట్లో రైల్వేశాఖకు కేటాయింపులపై పూర్తి వివరాలతో బ్లూ బుక్ వస్తే గానీ రాష్ట్రంలో ఇతర రైల్వే ప్రాజెక్టులపై కేంద్రం విధానమేమిటన్నది స్పష్టం కాదు. ‘బ్లూ బుక్’ వస్తేనే.. కేంద్ర బడ్జెట్లో రైల్వే శాఖకు కేటాయింపులపై సమగ్ర వివరాలతో ‘బ్లూ బుక్’ శుక్రవారం విజయవాడలోని రైల్వే డీఆర్ఎం కార్యాలయానికి చేరుతుంది. అది వస్తేగానీ రాష్ట్రంలో రైల్వే ప్రాజెక్టులపై కేంద్రం కేటాయింపులు ఏమిటన్నది తెలియదు. రాష్ట్రంలో రైల్వే ప్రాజెక్టులకు నిధుల కేటాయింపులు, కొత్త లైన్ల కోసం సర్వేలు, కొత్త ఆర్వోబీల నిర్మాణం, ప్రత్యేక ఫ్రైట్ కారిడార్ ఏర్పాటు, కొత్త రైళ్ల కేటాయింపులు మొదలైన అంశాలపై అప్పుడే స్పష్టత వస్తుంది. స్పష్టత ఇవ్వని కేంద్రం.. రైల్వే జోన్ ఏర్పాటు ప్రక్రియను కొన్ని నెలల క్రితమే సూత్రప్రాయంగా ప్రారంభించినప్పటికీ.. జోన్ వాస్తవంగా ఆచరణలోకి ఎప్పుడు వస్తుందన్న దానిపై ఈసారి కేంద్ర బడ్జెట్లో అయినా స్పష్టత వస్తుందని అంతా ఆశించారు. కానీ ఎలాంటి స్పష్టతను కేంద్రం ఇవ్వలేదు. ఇప్పటికే విశాఖ కేంద్రంగా ‘దక్షిణ కోస్తా రైల్వే జోన్’ ఏర్పాటు కోసం సమగ్ర ప్రాజెక్టు నివేదిక(డీపీఆర్)ను రైల్వే శాఖ రూపొందించింది. భవనాలు, ఇతర అవసరాలకోసం విశాఖలో దాదాపు 950 ఎకరాలు అందుబాటులో ఉందని పేర్కొంది. రాష్ట్ర ప్రభుత్వ ఒత్తిడితో విశాఖపట్నంలో రైల్వే జోన్ కార్యాలయాల నిర్మాణానికి ఇటీవల రూ.170 కోట్లు కేటాయించింది కూడా. కానీ రైల్వే జోన్ ఆచరణలోకి రావాలంటే సాంకేతికంగా కీలక అంశాలపై కేంద్రం మౌనం వహిస్తోంది. భువనేశ్వర్ కేంద్రంగా ఉన్న తూర్పు కోస్తా రైల్వే జోన్, సికింద్రాబాద్ కేంద్రంగా ఉన్న దక్షిణ మధ్య రైల్వే జోన్లతో ఏపీ పరిధిలో ఆస్తుల పంపకం, కొత్త డివిజన్ల ఏర్పాటు, ఉద్యోగుల కేటాయింపు, కొత్త కార్యాలయాల ఏర్పాటు తదితర అంశాలను ఓ కొలిక్కి తీసుకువచ్చి దక్షిణ కోస్తా రైల్వే జోన్‌ను ఆచరణలోకి తీసుకురావాలి. కానీ.. కేంద్ర ప్రభుత్వం బడ్జెట్లో ఈ విషయాలేవీ కనీసం ప్రస్తావించలేదు. ఒడిశాలో రాజకీయ ప్రయోజనాల కోసమేనా! ఒడిశాలో బీజేపీ రాజకీయ ప్రయోజనాల కోసమే ఏపీ విషయంలో కేంద్రం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని పరిశీలకులు విమర్శిస్తున్నారు. ప్రధానంగా విశాఖ కేంద్రంగా వాల్తేర్ రైల్వే డివిజన్‌ను కొనసాగించాలని రాష్ట్ర ప్రభుత్వం, ప్రజలు డిమాండ్ చేస్తుండగా.. వాల్తేర్ రైల్వే డివిజన్‌ను రద్దు చేసి.. విశాఖపట్నం, విజయవాడ, గుంటూరు, గుంతకల్ రైల్వే డివిజన్లతోనే కొత్త జోన్ ఏర్పాటుపై డీపీఆర్‌లో ప్రస్తావించారు. దీనిపై విశాఖపట్నంతోపాటు యావత్ రాష్ట్రంలో తీవ్ర విమర్శలు వ్యక్తమయ్యాయి. విజయవాడ నుంచి విశాఖపట్నం 350 కి.మీ. దూరంలో ఉండగా.. రాష్ట్ర సరిహద్దులో ఉన్న ఇచ్చాపురం 580 కి.మీ. దూరంలో ఉంది. అంతవరకు విజయవాడ రైల్వే డివిజన్‌గా ఏర్పాటు చేస్తే పరిపాలన నిర్వహణ సమస్యలు ఏర్పడతాయి. అందుకే వాల్తేర్ రైల్వే డివిజన్‌ను కొనసాగిస్తూనే విశాఖపట్నం కేంద్రంగా రైల్వే జోన్ కావాలని రాష్ట్ర ప్రభుత్వం, ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. కానీ ప్రస్తుతం తూర్పు కోస్తా జోన్లో అత్యధిక రాబడి ఉన్న వాల్తేర్ డివిజన్‌ను ఏకంగా రద్దు చేయాలని కేంద్రం భావిస్తోంది. తద్వారా భువనేశ్వర్ కేంద్రంగా ఉన్న తూర్పు కోస్తా రైల్వే జోన్ ఆర్థిక ప్రయోజనాలకు పెద్దపీట వేస్తోంది. ఒడిశాలో బీజేపీకి రాజకీయంగా ప్రయోజనం కలిగించేందుకే ఇలా వ్యవహరిస్తోంది. కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ ఒడిశా క్యాడర్‌కు చెందిన మాజీ ఐఏఎస్ అధికారి కావడం గమనార్హం. ఆయన కూడా ఒడిశాకు అనుకూలంగా వ్యవహరిస్తూ విశాఖపట్నం రైల్వే జోన్ అంశాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారని పరిశీలకులు విమర్శిస్తున్నారు. -
బడ్జెట్ రైలు ఆగేనా!
రాజంపేట: పార్లమెంట్లో నేడు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. ఏటా ప్రవేశపెడుతున్న బడ్జెట్లో ఉమ్మడి వైఎస్సార్ జిల్లా పరిధిలో రైల్వేలకు అనుకున్న స్థాయిలో నిధులు కేటాయించడం లేదు. గత బడ్జెట్లో కేవలం పాత ప్రాజెక్టులకే నిధులు కేటాయించి చేతులు దులుపుకున్నారు. దక్షిణ మధ్య రైల్వేలో ఆదాయపరంగా ముందంజలో ఉన్నా రైళ్ల కేటాయింపులోగానీ, పొడిగింపుల్లో కానీ తగిన ప్రాధాన్యత ఇవ్వడం లేదని ఈ ప్రాంత వాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నత్తనడకన సాగుతున్న ప్రాజెక్టులు కడప–బెంగళూరుల మధ్య కొత్త ప్రాజెక్టుకు 2008–09లో ప్రణాళికలు తయారు చేసి రూ.2706 కోట్లు కేటాయిస్తూ పనులు ప్రారంభించారు. మొత్తం 255 కి.మీల పొడవు కల్గిన ఈ మార్గంలో ఇప్పటివరకు కేవలం 21 కి.మీలు కడప–పెండ్లిమర్రి మార్గం మాత్రమే పూర్తయింది. గత బడ్టెట్‌లో రూ.289 కోట్లు కేటాయించారు. దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి పట్టుబట్టి దక్కించుకున్న ఈ ప్రాజెక్టు పూర్తయితే కడప, అనంతపురం జిల్లా వాసులకు బెంగళూరు నగరం మరింత దగ్గరవుతుంది. కలగానే బాలాజీ డివిజన్ ప్రతిపాదన డివిజన్ కేంద్రంగా తిరుపతిని చేస్తే కాట్పాడి నుంచి గుంతకల్, నెల్లూరులో గూడూరు , వైఎస్సార్, అన్నమయ్య జిల్లా పరిధిలో 700 కిలోమీటర్ల దూరం వస్తుంది. 400 కిలోమీటర్ల పరిధి ఉంటే డివిజన్‌గా ప్రకటించవచ్చని రైల్వే నిపుణులు అంటున్నారు. బాలాజీ డివిజన్ ఏర్పాటైతే అనుకూలంగా ఉంటుందని నివేదికలు ఉన్నాయి. ఇందులో తిరుపతి–గూడూరు (92.96కి.మీ), తిరుపతి–కాట్పాడి (104.39కి.మీ), పాకాల–మదనపల్లె (83కి.మీ), రేణిగుంట–కడప (125 కి.మీ)లైను కలిపే అంశాన్ని గతంలోనే రైల్వే అధికారులు పరిశీలించారు. బడ్జెట్లో ఆమోదం..సర్వేకే పరిమితం ∙కడప–గుంతకల్లు–బళ్లారి ∙కంభం–ప్రొద్దుటూరు ∙భాకరాపేట–గిద్దలూరు ∙ముద్దనూరు–ముదిగుబ్బ నందలూరు రైల్వేకు ఏదీ పూర్వవైభవం నందలూరు రైల్వేకు పూర్వవైభవం కోసం ఐకేపీఎస్ ఆధ్వర్యంలో యూపీఏ పాలన హయాంలో చేపట్టిన ఉద్యమం దేశరాజధాని ఢిల్లీకి చేరుకుంది. అప్పటి రైల్వేమంత్రి లాలూప్రసాద్ కూడా రాజ్యసభలో నందలూరులో రైల్వే ప్రత్యామ్నాయ పరిశ్రమ ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. ఆ« తర్వాత ఈ ప్రతిపాదనలు అటకెక్కాయి. మాట తప్పిన బీజేపీ నేతలు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నందలూరు రైల్వే పూర్వవైభవం కోసం కృషిచేస్తామన్న బీజెపీ అగ్రనేతలు ఆ తర్వాత అధికారంలోకి వచ్చాక ఈ సమస్యను విస్మరించారు. పరిశ్రమ కాదు..ఉన్న రన్నింగ్ స్టాఫ్ క్రూసెంటర్‌ను, వివిధ రైళ్లకు ఉన్న స్టాపింగ్స్‌ను కూడా ఎత్తివేసే క్రమంలో రైల్వే శాఖ తీసుకున్న నిర్ణయాలు వివాదాస్పదంగా మారుతున్నాయి. స్టాపింగ్స్‌కు ఎర్నింగ్ అడ్డంకి.. పలురైళ్ల స్టాపింగ్స్‌కు ఎర్నింగ్స్‌ను అడ్డంకిగా చూపుతున్నారు. ప్రజాసేవను దూరంపెట్టేసింది. కేవలం లాభార్జన పరంగా ముందుకువెళ్లడంతో పలురైళ్లు జిల్లా వాసులకు దూరమయ్యాయి. కమలాపురం, రాజంపేట, నందలూరు, రైల్వేకోడూరుతో పాటు కొన్ని నియోజకవర్గ కేంద్రాలలో కూడా కొన్ని రైళ్ల స్టాపింగ్‌కు ఎర్నింగ్ అడ్డంకిగా చూపుతున్నారు. పుణ్యక్షేత్రాల స్టేషన్లపై శీతకన్ను జిల్లాలో ఉన్న పుణ్యక్షేత్రాల రైల్వేస్టేషన్లపై రైల్వేశాఖ శీతకన్ను వేసింది. రాష్ట్ర విభజన తర్వాత పుణ్యక్షేత్రంగా రాష్ట్రస్థాయిలో గుర్తింపు పొందిన ఒంటిమిట్ట రైల్వేస్టేషన్లో ఎక్స్‌ప్రెస్ రైళ్లకు స్టాపింగ్స్ లేదు. అలాగే మరో పుణ్యక్షేత్రమైన నందలూరు(సౌమ్యనాథాలయం) స్టేషన్లో కూడా తెలంగాణ, తమిళనాడు, మహారాష్ట్రల రాజధానుల నుంచి నడిచే ఎక్స్‌ప్రెస్‌రైళ్లకు స్టాపింగ్స్ లేవు. ఈ పుణ్యక్షేత్రాలకు దూరప్రాంతాల నుంచి వచ్చే రైలు ప్రయాణికులకు సౌకర్యం కల్పించడంలో రైల్వేశాఖ నిర్లక్ష్యం వహిస్తోంది. కనీసం బుధవారం ప్రవేశపెట్టనున్న బడ్జెట్లోనైనా ఉమ్మడి వైఎస్సార్ జిల్లాకు రైల్వే పరంగా కొద్దివరకైనా న్యాయం జరుగుతుందో లేక మళ్లీ మొండి చేయి చూపుతారో వేచి చూడాల్సిందే. కన్నెత్తిచూడని కొత్తరైళ్లు.. ఉమ్మడి వైఎస్సార్ జిల్లాను కలుపుతూ నెల్లూరుకు డైలీ డెమో రైలును తీసుకురావాలని ప్రయాణికులు కోరుతున్నారు. విజయవాడ, తెనాలి, ఒంగోలు, నెల్లూరు, రాపూరు, ఓబులవారిపల్లె, రాజంపేట, నందలూరు మీదుగా కడప వరకు ఎక్స్‌ప్రెస్ రైలును తీసుకువస్తే అనుకూలంగా ఉంటుందని భావిస్తున్నారు. పెన్నా ఎక్స్‌ప్రెస్ పేరుతో హిందుపూరం నుంచి వయా ధర్మవరం, అనంతపురం గుత్తి, డోన్, నంద్యాల, జమ్మలమడుగు, ప్రొద్దుటూరు, కడప, నందలూరు, రాజంపేట, ఓబులవారిపల్లె మీదుగా నెల్లూరు వరకు రైలును తీసుకొస్తే సీమలోని కడప, అనంతపురం, నెల్లూరు జిల్లా మధ్య రాకపోకలకు సులభమవుతుంది. ∙నంద్యాల–కడప మధ్య నడిచే డెమో ఎక్స్ప్రెస్రైలును రేణిగుంట వరకు పొడిగింపు నిర్ణయం తీసుకున్నా ఇంతవరకు అమలుకాలేదు. ∙ముంబయి–చెన్నై రైలు మార్గంలో రాత్రి వేళలో నడిచే నైన్ మెయిల్, టెన్ మెయిల్ రైళ్లు ఇప్పుడు లేకుండా చేశారు. పగటిపూట మాత్రమే అడపాదడపా రైళ్లు నడుస్తున్నాయి.. ∙మచిలీపట్నం–తిరుపతి మధ్య నడిచే ఎక్స్‌ప్రెస్ రైలును కడప వరకు పొడిగించే ప్రతిపాదన కార్యరూపందాల్చేలా చూడాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. జిల్లాలు: వైఎస్సార్, అన్నమయ్య ప్రధానరైల్వేకేంద్రం: నందలూరు ప్రధానస్టేషన్లు: కడప, ఎర్రగుంట్ల, ఓబులవారిపల్లె ఉమ్మడి వైఎస్సార్ జిల్లాలమీదుగా నడిచే రైళ్లు: 30 (డౌన్, అప్) గూడ్స్రైళ్లు: 40 స్టేషన్లు: 25 కార్మికులు: 4000 కిలోమీటర్లు: 180 -
కేంద్ర బడ్జెట్ 2022: మీకు ఈ విషయాలు తెలుసా..
మళ్లీ కేంద్ర బడ్జెట్ వచ్చేసింది. కేంద్రం ఎవరెవరికి ఉపశమనం కలిగిస్తుంది, ఎవరిపై భారం పెరుగుతుందన్నది ఆసక్తిగా మారింది. ఇప్పుడేకాదు ఏటా బడ్జెట్ వచ్చిందంటే ఉత్కంఠగానే ఉంటుంది. అయితే బడ్జెట్లో లెక్కలే కాకుండా.. మరెన్నో విశేషాలు కూడా ఉంటుంటాయి. అలాంటి కొన్ని విశేషాలు తెలుసుకుందామా? నెహ్రూ.. ఇందిర.. రాజీవ్ 1958లో అప్పటి ఆర్థికమంత్రి టి.టి.కృష్ణమాచారి రాజీనామా చేసినప్పుడు, జవహర్లాల్ నెహ్రూ బడ్జెట్‌ను సమర్పించి అలా చేసిన మొదటి ప్రధానమంత్రిగా నిలిచారు. 1970లో ఇందిరాగాంధీ బడ్జెట్ ప్రవేశపెట్టినప్పుడు అప్పటి ఆర్థికమంత్రి మొరార్జీ దేశాయ్ రాజీనామా చేసి ఉన్నారు. 1987–88లో ఆర్థికమంత్రి వీపీ సింగ్ రాజీనామా చేసినప్పుడు, అప్పటి ప్రధాని రాజీవ్‌గాంధీ బడ్జెట్‌ను సమర్పించారు. తెల్లారింది లేవండోయ్.. 2000 సంవత్సరం వరకు, ఫిబ్రవరి నెల చివరి పనిదినం సాయంత్రం 5 గంటలకు బడ్జెట్‌ను సమర్పించేవారు. అయితే, అప్పటి ఆర్థిక మంత్రి యశ్వంత్ సిన్హా బడ్జెట్ సమర్పణ సమయాన్ని ఉదయం 11 గంటలకు, సభలో మొదటి కార్యక్రమంగా మార్చారు. 2014లో అప్పటి ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ బడ్జెట్‌ను సమర్పించినప్పుడు, 2.5 గంటలపాటు సుదీర్ఘమైన బడ్జెట్ ప్రసంగం చేశారు. దీనిని బడ్జెట్ సమర్పణలలో సుదీర్ఘ ప్రసంగాలలో ఒకటిగా పరిగణిస్తారు. రైల్వేను కలిపేశారు.. 2017 వరకు, ప్రతి సంవత్సరం రెండు వేర్వేరు బడ్జెట్లు సమర్పించేవారు. ఆర్థిక బడ్జెట్‌ను ఆర్థికమంత్రి, రైల్వే బడ్జెట్‌ను రైల్వే మంత్రి సమర్పించడం ఆనవాయితీగా ఉండేది. నరేంద్రమోదీ ప్రభుత్వం రెండు బడ్జెట్లను కలిపి ఉమ్మడి బడ్జెట్‌ను తీసుకొచ్చింది. 2017లో అప్పటి ఆర్థికమంత్రి అరుణ్ జైటీ తొలి ఉమ్మడి బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. మొదటి బడ్జెట్‌కు 162 ఏళ్లు.. మొదట్లో బ్రిటిష్ ఈస్టిండియా కంపెనీ పాలనలో ఉన్న మన దేశాన్ని.. 1857 సిపాయిల తిరుగుబాటు తర్వాత బ్రిటన్ నేరుగా పాలించడం మొదలుపెట్టింది. ఆ సమయంలోనే మన దేశానికంటూ మొదటిసారిగా 1860 ఏప్రిల్ 7న బడ్జెట్ ప్రవేశపెట్టారు. బ్రిటిష్ ఇండియా ప్రభుత్వం తరఫున స్కాటిష్ ఆర్థికవేత్త, రాజకీయ నాయకుడు జేమ్స్ విల్సన్ ఆ బడ్జెట్ రూపొందించి, బ్రిటిష్ పార్లమెంట్‌కు సమర్పించారు. స్వాతంత్య్ర భారతంలో 1947 నవంబర్ 26న అప్పటి కేంద్ర ఆర్థిక మంత్రి ఆర్కే షణ్ముగం శెట్టి తొలి బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. రహస్యంగా..ప్రింటింగ్‌నే మార్చేసి కేంద్ర బడ్జెట్ రూపకల్పన, పత్రాల ముద్రణ అత్యంత రహస్యంగా సాగుతుంది. బడ్జెట్లోని అంశాలు ముందే తెలిస్తే.. ఎవరైనా వాటిని మార్చేలా ప్రభావితం చేయడానికి వీలు ఉంటుందన్నదే దీనికి కారణం. అందుకే బడ్జెట్ పత్రాలను ముద్రించినన్ని రోజులు సిబ్బంది ఎవరినీ బయటికి వెళ్లనివ్వరు. 1950 వరకు రాష్ట్రపతి భవన్లో బడ్జెట్ పత్రాలు ముద్రించేవారు. ఆ ఏడాది బడ్జెట్ రహస్యాలు ముందే లీకవడంతో ముద్రణను ఢిల్లీలోని మింట్ రోడ్లో ఉన్న ప్రింటింగ్ ప్రెస్‌కు మార్చారు. 1980 నుంచి కేంద్ర ఆర్థికశాఖ కార్యాలయం ఉండే నార్త్‌బ్లాక్‌లో బడ్జెట్ పత్రాలను ముద్రిస్తున్నారు. -
లైన్లకే గ్రీన్‌సిగ్నల్
సాక్షి, హైదరాబాద్: కొత్త రైళ్ల బాధ్యతను ప్రైవేటుకు అప్పగించి మౌలిక వసతుల కల్పనపై రైల్వే శాఖ దృష్టి సారించింది. వీలైనన్ని ప్రైవేటు రైళ్లను పట్టాలెక్కించేందుకు సిద్ధమైన రైల్వేశాఖ దక్షిణమధ్య రైల్వేకు సంబంధించి 11మార్గాలను గుర్తించింది. ఆ మార్గా ల్లో ప్రైవేటు రైళ్లను పరుగు పెట్టించేందుకు కావాల్సిన ప్రణాళికలను రైల్వే బోర్డు పరిశీలిస్తోంది. సొంతంగా నిర్వహించే ఒక్క కొత్త రైలు ప్రస్తావన కూడా లేకుండానే తాజా బడ్జెట్‌ను రూపొందించారు. అయితే ఇప్పటికే మొదలైన కొత్త లైన్లు, డబ్లింగ్, మూడో లైన్ల నిర్మాణాలకు భారీగానే నిధులు కేటాయించారు. తాజా బడ్జెట్లో దక్షిణమధ్య రైల్వేకు రూ.6,846 కోట్లను కేటాయించారు. ఇది గత ఏడాది కంటే రూ.922 కోట్లు ఎక్కువ. ప్రారంభమైన లైన్లు పూర్తి చేశాకే కొత్తవి మొదలుపెట్టాలన్న ప్రధాని మోదీ ఆలోచన బడ్జెట్లో స్పష్టంగా కనిపించింది. ఇక రాష్ట్ర ప్రభుత్వంతో సంయుక్తంగా చేపడుతున్న కొన్ని ప్రాజెక్టులకు నామమాత్రపు నిధులతో సరిపెట్టింది. తాజా బడ్జెట్లో దక్షిణమధ్య రైల్వే జోన్‌కు కేటాయింపుల వివరాలను బుధవారం జీఎం గజానన్ మాల్యా రైల్ నిలయంలో మీడియాకు వెల్లడించారు. ఈ ప్రాజెక్టులు ఇక పరుగు పెట్టినట్టే... మనోహరాబాద్–కొత్తపల్లి: రూ.235 కోట్లు.. హైదరాబాద్‌తో కరీంనగర్ పట్టణాన్ని రైల్వే ద్వారా అనుసంధానించే కీలక ప్రాజెక్టు మనోహరాబాద్–కొత్తపల్లికి రూ.235 కోట్లు కేటాయించారు. ఈ మార్చినాటికి గజ్వేల్ వరకు ఈ మార్గంలో రైలును నడిపేందుకు సిద్ధమైన అధికారులు, భూసేకరణ సమస్యలను అధిగమించి సిద్దిపేట వరకు వేగంగా పనులు పూర్తి చేసే యోచనలో ఉన్నారు. 2006–07లో మంజూరైన 151 కి.మీ. ఈ ప్రాజెక్టు గత రెండేళ్లుగా పరుగుపెడుతోంది. రూ.1,160 కోట్ల అంచనాతో ఇది ప్రారంభమైంది. మునీరాబాద్–మహబూబ్‌నగర్: రూ.240 కోట్లు ఈ ప్రాజెక్టుకు రూ.240 కోట్లు కేటాయించారు. ప్రస్తుతం ఈ మార్గంలో కాచిగూడ నుంచి జక్లేర్ వరకు డెమో రైలు నడుస్తోంది. ఆ తర్వాత భూసేకరణలో జరిగిన జాప్యంతో పనుల్లో కొంత ఆటంకం ఏర్పడింది. 243 కి.మీ. ఈ మార్గం పనులు రూ.1,723 కోట్ల అంచనాతో మొదలయ్యాయి. ఇందులో 66 కి.మీ. పరిధి తెలంగాణలో ఉండగా, మిగతాది కర్ణాటక పరిధిలో ఉంది. ద.మ. రైల్వే పరిధికి సంబంధించి జక్లేర్–మక్తల్, కృష్ణ–మాగనూరు మధ్య పనులు జరుగుతున్నాయి. భద్రాచలం–సత్తుపల్లి: రూ.520 కోట్లు దక్షిణమధ్య రైల్వేకు ప్రధాన ఆదాయ వనరు అయిన బొగ్గు తరలింపుపై ఆ శాఖ ప్రత్యేక దృష్టి సారించింది. కొత్త గనులతో రైల్వేను అనుసంధానించే క్రమంలో భద్రాచలం–సత్తుపల్లి కొత్త లైను నిర్మాణం చివరి దశకు వచి్చంది. గత బడ్జెట్లో రూ.405 కోట్లు కేటాయించగా, ఈసారి రూ.115 కోట్లు ఎక్కువగా కేటాయించింది. ఈ సంవత్సరం పనులు పూర్తి చేసే లక్ష్యంతో ఉంది. 54 కి.మీ.ల ఈ మార్గంలో భూసేకరణ వ్యయాన్ని రైల్వే భరించనుండగా, ప్రాజెక్టు నిర్మాణ ఖర్చు (రూ.704 కోట్లు)ను సింగరేణి సంస్థ భరించాల్సి ఉంది. ఎంఎంటీఎస్‌కు రూ.40 కోట్లు... ఈ ఆర్థిక సంవత్సరం ఎంఎంటీఎస్ రెండో దశకు మరో రూ.40 కోట్లను కేటాయించారు. రాష్ట్ర ప్రభుత్వ భాగస్వామ్యంతో చేపట్టిన ఈ ప్రాజెక్టు వ్యయంలో రాష్ట్రం తన వాటాగా 2/3 వంతు చొప్పున సుమారు రూ.450 కోట్ల వరకు అందజేయవలసి ఉంది. ఈ నిధుల విడుదలలో జాప్యంతో సికింద్రాబాద్–»ొల్లారం, పటాన్చెరు–తెల్లాపూర్ తదితర మార్గాల్లో లైన్ల నిర్మాణం, విద్యుదీకరణ, స్టేషన్ల ఏర్పాటు పనులు పూర్తయినప్పటికీ రైళ్లను కొనుగోలు చేయలేకపోతున్నారు. ఇక రూ.150 కోట్ల అంచనాలతో మూడేళ్ల క్రితం ప్రతిపాదించిన చర్లపల్లి టర్మినల్ విస్తరణకు రాష్ట్ర ప్రభుత్వం వంద ఎకరాల భూమిని కేటాయించవలసి ఉంది. ఇప్పటి వరకు ఆ భూమి ఇవ్వకపోవడంతో రైల్వేకు ఉన్న 50 ఎకరాల్లోనే రూ.80 కోట్లతో గత ఏడాది టరి్మనల్ విస్తరణ చేపట్టారు. ఈ ప్రాజెక్టు కోసం ప్రస్తుతం రూ.5 కోట్లు కేటాయించారు. ఘట్కేసర్–యాదాద్రి ఎంఎంటీఎస్ ప్రాజెక్టు అంచనా వ్యయం రూ.412 కోట్లు. రాష్ట్ర ప్రభుత్వంతో కలసి చేపడుతున్న ఈ ప్రాజెక్టుకు రాష్ట్రం ఇప్పటి వరకు నిధులు ఇవ్వలేదు. కేంద్రం మాత్రం ఈ బడ్జెట్లో రూ.10 లక్షలతో సరిపెట్టింది. డబ్లింగ్, మూడో లైన్లకు మహర్దశ... రైళ్ల రద్దీ ఎక్కువగా ఉండే మార్గాల్లో అదనపు లైను నిర్మాణం రైల్వేకు పెద్ద సవాలు. కాజీపేట–బల్లార్షా మూడోలైన్‌కు తాజా బడ్జెట్లో ఏకంగా రూ.483 కోట్లు కేటాయించారు. ఇది గత బడ్జెట్ కంటే రూ.118 కోట్లు ఎక్కువ. రెండు లైన్లు ఉన్నప్పటికీ సామర్థ్యం కంటే 130 శాతం అధికంగా రైళ్లను నడుపుతున్నారు. ఇప్పటికే ఈ మార్గంలో రాఘవాపురం–పోట్కపల్లి, బిసుగిర్షరీఫ్–ఉప్పల్, విరూర్–మాణిక్‌ఘర్ మధ్య మూడోలైన్ చివరి దశలో ఉండటంతో త్వరలో పూర్తి చేయనుంది. మిగతా చోట్ల పనులను వేగంగా పూర్తి చేసేందుకు ఇప్పుడు భారీగా నిధులు కేటాయించింది. ఇక కాజీపేట–విజయవాడ మూడో లైన్ పనులకోసం రూ.404 కోట్లు కేటాయించారు. గత బడ్జెట్లో ఇచ్చింది రూ.110కోట్లే. ఫలితంగా ఈ సారి పనుల్లో వేగం పెరగనుంది. ఈ మార్గంలో కొంతమేర భూసేకరణ సమస్య ఉన్నందున దీన్ని తొందరగా పరిష్కరించాలని ఇప్పటికే స్థానిక అధికారులకు ఆదేశాలు అందాయి. సికింద్రాబాద్–మహబూబ్‌నగర్ మధ్య 85 కి.మీ. మేర డబ్లింగ్ పనులకు గాను రూ.185 కోట్లు కేటాయించారు. గతేడాది కేటాయించిన రూ.200 కోట్లతో పనులు వేగంగా జరుగుతున్నాయి. షాద్‌నగర్–గొల్లపల్లి మధ్య 29 కి.మీ. మార్గం పూర్తి కావచి్చంది. త్వరలో దాన్ని అందుబాటులోకి తెచ్చి రైళ్లను నడిపే ఆలోచనలో అధికారులు ఉన్నారు. కాజీపేట వర్క్‌షాపు అంతేనా.. కాజీపేటలో నిర్మించతలపెట్టిన పీరియాడికల్ ఓవర్‌హాలింగ్ వర్క్‌షాప్ పరిస్థితి డోలాయమానంలో పడ్డట్టు కనిపిస్తోంది. గత బడ్జెట్లో రూ.కోటిన్నర మంజూరు చేసిన రైల్వే ఈసారి నయాపైసా ప్రకటించకపోవటం పట్ల అనుమానాలు తలెత్తుతున్నాయి. అయితే, భూ సమస్య పరిష్కారం కాగానే పనులు చేపట్టేందుకు తాము సిద్ధంగా ఉన్నామని బుధవారం విలేఖరులు అడిగిన ప్రశ్నకు సమాధానంగా రైల్వే జీఎం గజానన్ మాల్యా చెప్పటం విశేషం. ఎయిర్‌లైన్స్ తరహాలో ప్రైవేట్ రైళ్లు... ఎయిర్‌లైన్స్ తరహాలో ప్రైవేట్ రైళ్లు అందుబాటులోకి రానున్నాయి. ఈ క్రమంలోనే హైదరాబాద్ నుంచి వివిధ మార్గాల్లో ప్రైవేట్ రైళ్లు పట్టాలెక్కనున్నాయి. చర్లపల్లి టరి్మనల్ నుంచి ఈ రైళ్లను నడిపేందుకు దక్షిణమధ్య రైల్వే ప్రణాళికలను రూపొందిస్తోంది. చర్లపల్లి–శ్రీకాకుళం, చర్లపల్లి–వారణాసి, చర్లపల్లి–పన్వేల్, లింగంపల్లి–తిరుపతి, సికింద్రాబాద్–గౌహతి, చర్లపల్లి–చెన్నై, చర్లపల్లి–షాలిమార్, విజయవాడ–విశాఖ, తిరుపతి–విశాఖ తదితర ప్రాంతాల మధ్య ప్రైవేట్ రైళ్లు అందుబాటులోకి రానున్నాయి. అలాగే ఐఆర్సీటీసీ ఆధ్వర్యంలో లింగంపల్లి–గుంటూరు, ఔరంగాబాద్–పన్వేల్ మధ్య తేజాస్ రైళ్లను నడుపుతారు. ఈ రైళ్ల కోసం త్వరలో ఓపెన్ టెండర్లను ఆహా్వనించనున్నారు. -
బడ్జెట్లో కూతపెట్టని రైల్వే!
సాక్షి, హైదరాబాద్: రైల్వే బడ్జెట్ అనగానే యావత్తు దేశం ఎదురుచూసేది.. ఏ ప్రాంతానికి ఏ రైలు వస్తుంది, కొత్త రైల్వే లైన్లు ఏ ప్రాంతానికి మంజూరవుతాయి అని ప్రజలు టీవీలకు అతుక్కుపోయేవారు. కానీ, శనివారం కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంటులో ప్రవేశపెట్టిన వార్షిక బడ్జెట్లో రైల్వే ప్రస్తావనకు కేటాయించిన సమయం రెండుమూడు నిమిషాలు మాత్రమే.అందులోనే కొన్ని విషయాలు ప్రస్తావించారే తప్ప కొత్త రైళ్లు, లైన్లు, సర్వేలు వంటి వాటి ఊసే లేదు. రైల్వే బడ్జెట్‌ను విడిగా ప్రవేశపెట్టకుండా సాధారణ బడ్జెట్లో కలిపేసిన తర్వాత, రైల్వేకు చెందిన వివరాలను సంక్షిప్తంగా వెల్లడిస్తున్నారు. కానీ తాజా బడ్జెట్ ప్రసంగంలో నామమాత్రపు ప్రస్తావనతోనే సరిపుచ్చటం పట్ల విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. స్థూలంగా నాలుగైదు విషయాలతో సరిపుచ్చినప్పటికీ, జోన్ల వారీగా వివరాలను ఆ తర్వాత కూడా వెల్లడించలేదు. పింక్‌బుక్ పేరుతో ఉండే పూర్తి వివరాల పుస్తకాన్ని మరుసటి రోజో, ఆ తర్వాతనో విడుదల చేసేవారు. ఈసారి ఆ పింక్ బుక్‌ను ఐదో తేదీన విడుదల చేస్తారని చెబుతున్నారు. అంటే అప్పటి వరకు జోన్ల వారీగా కేటాయింపుల విషయాలు వెల్లడయ్యే అవకాశం ఉండదు. రైల్‌నిలయానికి సమాచారం లేదు దక్షిణ మధ్య రైల్వేకు చేసిన కేటాయింపులకు సంబంధించి రైల్ నిలయంకు ఎలాంటి సమాచారం అందలేదు. ‘బడ్జెట్లో రైల్వేలకు సం బంధించి కనీస వివరాలు కూడా వెల్లడించకపోవటాన్ని తొలిసారి చూస్తున్నాం. కొన్ని ప్రధాన ప్రాజెక్టులు, చేపట్టబోయే కొత్త సంస్కరణలు, కొత్త రైళ్లు లాంటి వివరాలైనా వెల్లడించాల్సింది. ఇక జోన్ల వారీగా కేటాయింపు లు ఎప్పుడిస్తారో కూడా సమాచారం లేదు. ఢిల్లీలోని ప్రధాన కార్యాలయానికి ఫోన్ చేసి అడిగినా చెప్పలేదు. ఐదో తేదీన పార్లమెంటు లో పింక్‌బుక్‌ను విడుదల చేసిన తర్వాత వివరాలు వెల్లడించే అవకాశం ఉంది’అని ఓ ఉన్నతాధికారి పేర్కొన్నారు. దక్షిణ మధ్య రైల్వేకు దాదాపు రూ.6,100 కోట్ల మేర నిధులు కేటాయించారని, ప్రస్తుతం పనులు జరుగుతున్న మనోహరాబాద్–కొత్తపల్లి, మహబూబ్‌నగర్ డబ్లింగ్, కాజీపేట–బల్లార్షా, కాజీపేట–విజయవాడ మూడో లైన్ పనులు, మెదక్–అక్కన్నపేట, భద్రాచలం–సత్తుపల్లి ప్రాజెక్టులకు రూ.1,200 కోట్ల మేర కేటాయింపులున్నాయని సమాచారం. ఓ హైస్పీడ్ కారిడార్, రెండు రైళ్ల ప్రస్తావన ఉందని చెబుతున్నారు. -
మౌలిక సదుపాయాల అభివృద్ధికి రూ. 1.7 లక్షల కోట్లు...
-
వచ్చే నాలుగేళ్లలో 100 కొత్త ఎయిర్‌పోర్టులు..
న్యూఢిల్లీ: రవాణా రంగంలో మౌలిక సదుపాయాల అభివృద్ధికి కేంద్ర బడ్జెట్లో రూ. 1.7 లక్షల కోట్లు కేటాయించినట్లు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. 2020-21 సంవత్సరానికి గాను కేంద్ర బడ్జెట్‌ను శనివారం నిర్మల పార్లమెంట్లో ప్రవేశపెడుతున్నారు. ఈ సందర్భంగా ప్రసంగిస్తూ.. 2023 కల్లా ఢిల్లీ- ముంబై ఎక్స్‌ప్రెస్ హైవే నిర్మాణం పూర్తి చేస్తామని.. చెన్నె- బెంగళూరు ఎక్స్‌ప్రెస్ వే నిర్మాణం త్వరలోనే ప్రారంభమవుతుందని పేర్కొన్నారు. ముంబై- అహ్మదాబాద్ మధ్య త్వరలో హైస్పీడ్ రైలు ప్రారంభం కానుందన్నారు. రైల్వేల్లో సోలార్ విద్యుత్ వినియోగం పెంచి.. రైల్వే లైన్ విద్యుదీకరణ చేపడతామని తెలిపారు. అదే విధంగా బెంగళూరులో సబర్బన్ రైల్వే ప్రాజెక్టు కోసం రూ. 1800 కోట్లు కేటాయించినట్లు తెలిపారు. పర్యాటక అభివృద్ధికై తేజాస్ వంటి మరిన్ని రైళ్లను అందుబాటులోకి తెస్తామని వెల్లడించారు. రైల్వేల్లో మరింత ప్రైవేటీకరణ దిశగా అడుగులు వేస్తున్నామని... ప్రభుత్వ- ప్రైవేటు భాగస్వామ్య(పీపీపీ) పద్ధతిలో 150 రైళ్లు అందుబాటులోకి రానున్నాయని పేర్కొన్నారు.(మరింత ఈజీగా జీఎస్టీ...) అదే విధంగా ఉడాన్ పథకం కింద 2024 నాటికి వంద ఎయిర్‌పోర్టులను అభివృద్ధి చేస్తామని తెలిపారు. నేషనల్ గ్యాస్ గ్రిడ్‌ను విస్తరిస్తామని పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా డేటా సెంటర్ పార్కులు ఏర్పాటు చేస్తున్నామని.. లక్ష గ్రామ పంచాయతీలకు ఆప్టికల్ ఫైబర్ అందుబాటులోకి రానుందని తెలిపారు. విద్యుత్ రంగానికి రూ. 22, 000 కోట్లు కేటాయించినట్లు వెల్లడించారు.(బడ్జెట్ 2020 : కేంద్ర బడ్జెట్ హైలైట్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
బడ్జెట్ రైలు ఆగేనా?
సాక్షి, అమరావతి: పార్లమెంట్లో నేడు రైల్వే బడ్జెట్ ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో ఈసారైనా కేంద్రం కరుణిస్తేనే పలు కీలక ప్రాజెక్టులు పట్టాలెక్కే అవకాశం ఉంది. దక్షిణ మధ్య రైల్వేలో అధిక శాతం ఆదాయం ఏపీ నుంచే లభిస్తున్నా ఆ మేరకు న్యాయం జరగడం లేదు. విశాఖ కేంద్రంగా రైల్వే జోన్ ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించినా నిధులు, విధులు తేలక అయోమయం నెలకొంది. రాష్ట్రంలో ప్రాధాన్య ప్రాజెక్టులన్నీ కాస్ట్ షేరింగ్ విధానంలో మంజూరయ్యాయి. రాష్ట్రం తన వాటాగా భూ సేకరణ జరిపి భూమిని అప్పగిస్తే రైల్వే శాఖ నిధులు మంజూరు చేసి ప్రాజెక్టులు పూర్తి చేయాలి. నడికుడి–శ్రీకాళహస్తి రైల్వే లైన్ అంచనా వ్యయం పెరగకముందే నిధులు కేటాయించి ప్రాజెక్టును త్వరితగతిన పూర్తి చేయాలని కోరుతున్నారు. కోటిపల్లి–నరసాపురం, కడప–బెంగళూరు, డబ్లింగ్ ప్రాజెక్టులు, మూడో లైన్ల పూర్తికి కేంద్రం ఏ మేరకు సహకరిస్తుందో చూడాల్సిందే. ఇక 2012, 2013లోనే మంజూరైన భద్రాచలం–కొవ్వూరు, కొండపల్లి–కొత్తగూడెం ప్రాజెక్టులు పూర్తి కావాలంటే నిధులు అత్యవసరం. పట్టాలెక్కని ప్రతిపాదనలు! స్టేషన్ రీ డెవలప్మెంట్ కింద తిరుపతి, విజయవాడ, నెల్లూరు, గుంటూరు, కర్నూలు, గుంతకల్ స్టేషన్లను అభివృద్ధి చేసేందుకు రైల్వే శాఖ గతంలో అంగీకరించింది. విజయవాడను శాటిలైట్ స్టేషన్‌గా తీర్చిదిద్దాలని ఏన్నో ఏళ్ల నుంచి ప్రతిపాదనలున్నాయి. గతంలో గుంతకల్ డివిజన్లో చంద్రగిరి, గుంటూరు డివిజన్లో న్యూ గుంటూరు, ఫిరంగిపురం, విజయవాడ డివిజన్లో రామవరప్పాడు స్టేషన్లను మహిళా స్టేషన్లుగా ప్రకటించారు. మొత్తం మహిళా సిబ్బంది ఈ స్టేషన్లలో విధులు నిర్వహించేలా రైల్వే శాఖ ఆదేశాలిచ్చింది. వీటిని అభివృద్ధి చేయాల్సి ఉంది. కొత్త రైల్వే లైన్లపై కరుణించేనా? నరసరావుపేట–మచిలీపట్నం, కంభం–ఒంగోలు, చిత్తూరు–కుప్పం వయా పలమనేరు, ఓబులవారిపల్లె–వాయల్పాడు రైల్వే లైన్ల సర్వేపై బోర్డు ఏమీ తేల్చడం లేదు. మచిలీపట్నం–బాపట్ల కనెక్టివిటీ కోసం సర్వే చేసి అంచనా వ్యయం రూ.793 కోట్లుగా తేల్చినా నివేదికను పక్కన పెట్టారు. ప్రైవేట్ రైళ్ల ప్రతిపాదనలు.. విజయవాడ–దువ్వాడ మధ్య 335 కి.మీ. మేర మూడో లైన్‌ను నిర్మించాలి. విశాఖకు కనెక్టివిటీ పెంచేందుకు 2015–16లోనే రూ.3,873 కోట్ల అంచనాతో ప్రతిపాదనలు రూపొందించారు. ఈ బడ్జెట్లో మూడో లైన్‌కు నిధులు కేటాయించాలని కోరుతున్నారు. తేజాస్ తరహాలో తిరుపతి–విశాఖ, సికింద్రాబాద్–విశాఖ మధ్య ప్రైవేట్ రైళ్ల ప్రతిపాదనలున్నాయి. -
అదిగదిగో.. ఆశల బండి కూత
వైఎస్ఆర్ జిల్లా,రాజంపేట: కేంద్ర ప్రభుత్వం రేపు రైల్వే బడ్జెట్‌ను ప్రవేశపెడుతోంది. ఏటా మాదిరిగానే జిల్లా ప్రజానీకం ఈ బడ్జెట్ అయినా తమ ఆకాంక్షలను నెరవేరుస్తుందా అని ఎదురుచూస్తున్నారు. వారి ఆశలపై నీళ్లు చల్లుతుందో..తీపి కబురు చెబుతుందో తెలియడానికి మరో రోజు మాత్రమే మిగిలి ఉంది. గతేడాది రైల్వేబడ్జెట్ జిల్లా ప్రజలను నిరాశ పరిచింది. నిధుల కేటాయింపులో కోతలు విధించింది. జిల్లాలో రైల్వేపరమైన అభివృద్ధి విషయంలో వివక్ష కొనసాగుతోందనేది జనం భావన. ఏళ్లతరబడి ప్రాజెక్టులు పెండింగులోనే కొనసాగుతూనే ఉన్నాయి. మూడుదశాబ్దాల తర్వాత నంద్యాల–ఎర్రగుంట్ల రైల్వేలైన్ అందుబాటులోకి వచ్చినా కొత్తరైళ్లు జిల్లా వైపు కన్నెత్తి చూడటంలేదు. కడప, రాజంపేట, నందలూరు, ఎర్రగుంట్ల, రైల్వేకోడూరు రైల్వేస్టేషన్లలో మౌలిక వసతులు అంతంత మాత్రంగా ఉన్నాయి. పలురైళ్లు జిల్లాలో ఆగకుండానే వెళుతున్నాయి. తెలంగాణ, ఆంధ్రా, తమిళనాడు రాజధానికి లింక్‌గా డీఎంయు రైళ్లను నడిపించాల్సిన అవసరముందనేది దీర్ఘకాలిక కోరిక. అదీ నెరవేరడం లేదు. వీక్లీ, బైవీక్లీ లాంటి రైళ్లకు స్టాపింగ్ ఇవ్వాలన్న వినతులు రైల్వే ఉన్నతాధికారులు పెడచెవిన పెడుతున్నారు. రాజంపేట, రైల్వేకోడూరులో ఆర్‌యూబీలునిర్మాణంలో జాప్యం కొనసాగుతోంది. కొన్ని రైల్వేస్టేషన్లో ఫుట్ఓవర్ బ్రిడ్జిలు లేవు. ప్రయాణీకుల సౌకర్యాలు అరకొరగానే ఉన్నాయి. జిల్లా కు రైల్వేపరిశ్రమ కలేనా.. నందలూరు రైల్వేకేంద్రంలో ప్రత్యామ్నాయ రైల్వేపరిశ్రమ ఏర్పాటు కలగానే మిగిలింది. ఎన్డీఏ హయాంలో ఇది కార్యరూపం దాల్చుతుందని జిల్లా వాసులు ఆశించారు. కేంద్రంలో ప్రభు త్వాలేవి మారినా ఈ పరిశ్రమ ఊసెత్తడంలేదు. నందలూరులో రైల్వేపరిశ్రమ ఏర్పాటుచేయాలని కొన్నేళ్లుగా నానుతు న్న విషయం. రాజంపేట ఎంపీ మిధునరెడ్డి లోక్‌సభలో దీనిపై ప్రస్తావించారు. 250 క్వార్టర్స్‌తో పాటు 150 ఎకరాలు రైల్వేభూమి ఉంది. భూమి విషయంలో ఉన్నతాధికారులకు తప్పుడు సమాచారం ఇచ్చారు. గతంలో రైల్వేమంత్రిగా పనిచేసిన లాలు ప్రసాద్‌యాదవ్ వ్యాగన్ రిపేరువర్క్‌షాపు పెడతామని ప్రకటించారు. కానీ తర్వాత విస్మరించారు. బెంగళూరు లైన్ నిర్మాణం ముందుకెళ్లేదెపుడో... 2008–09 రైల్వేబడ్జెట్‌లో కడప–బెంగళూరు రైల్వేలైను రైలుమార్గాన్ని ప్రకటించారు. ఈ మార్గం పూర్తికావడానికి అంచనా రూ.2050 కోట్లకు చేరుకుంది. 2010 సెప్టెంబరులో అప్పటి రైల్వేమంత్రి మునియప్ప శంకుస్ధాపన చేశారు. 21.8కిలోమీటర్ల మేర తొలిదశపనులు పూర్తయ్యాయి. అక్కడి వరకు డెమోరైలు నడిపిస్తున్నారు. రెండో వదశలో పెండ్లిమర్రి నుంచి రాయచోటి, లక్కిరెడ్డిపల్లె మీదుగా చిత్తూరు జిల్లా వాయల్పాడువరకు పనులు చేయాల్సి ఉంది. 102వ లైను చేపట్టాల్సి ఉంది. ప్రస్తుతం ఈమార్గంలో పదిశాతం పనులే జరిగాయి. ప్రయాణీకుల రవాణకు నోచుకోనికృష్ణపట్నం రైల్వేలైన్ వైఎస్సార్ జిల్లా, నెల్లూరు జిల్లాలను కలిపే కృష్ణపట్నం–ఓబులవారిపల్లె రైల్వేలైన్ సరకు రవాణకే పరిమితమైంది. ప్రయాణీకులకు ఈ మార్గంలో వెళ్లే అవకాశం లెేఛీజీ ఈ రైల్వేలైన్‌కు ఇప్పటి వరకు రూ.1186కోట్లు ఖర్చు చేశారు. ఇది కూడా అంచనా రూ.1646కోట్లకు చేరుకుంది. వెంకటాచలం–ఓబులవారిపల్లె మధ్య మార్గం పూర్తయి గూడ్స్‌రైళ్లకే పరిమితమైంది. సర్వేలకే రైలుమార్గాలు ♦ కంభం–ప్రొద్దుటూరు రైల్వేలైన్ సర్వే కు గతబడ్జెట్‌లో.1లక్ష మాత్రమే కేటాయించారు. ఈ లైన్ సర్వే దశను దాట ♦ భాకరాపేట–గిద్దలూరు రైల్వేలైన్ గురించి గత బడ్జెట్లో ప్రస్తావనే లేదు. జిల్లాలో రెండు కొత్త రైలుమార్గాలు సర్వేలకే పరిమితమైయ్యాయి. ♦ కడప–గుంతకల్లు–బళ్లారి రైల్వేలైన్ సర్వేకు బడ్జెట్ ఆమోదం తెలిపింది. ఇప్పటికే కడప–గుంతకల్లు మధ్య డబుల్‌లైన్ నిర్మితమైంది. ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాలకు సంబంధించి ఈ లైను అనువుగా ఉంటుంది. సర్వే చేపట్టేందుకు ఆమోదం లభించినా అడుగు ముందుకు పడలేదు. ♦ భాకరాపేట–గిద్దలూరు రైల్వేలైన్ కూడా సర్వేలకే పరిమితమైంది. ఈ కొత్త రైలుమార్గం పురోగతి ప్రశ్నార్ధకరంగా మారింది. ♦ జిల్లా కేంద్రంతో సంబంధం లేకుండా ఎర్రగుంట్ల–నంద్యాల రైల్వేలైన్‌లో రాజధానికి రైలునడుస్తోంది. ♦ జిల్లా కేంద్రం నుంచి రాజధానికి రేణిగుంట మీదుగా వెళ్లే తిరుమల ఎక్స్‌ప్రెస్ రైలు ఒక్కటే దిక్కయింది. నంద్యాల రైల్వేలైన్విద్యుద్దీకరణ ఎప్పుడో.. ♦ కర్నూలు, వైఎస్సార్జిల్లాలను కలుపుతూఏర్పాటైన ఎర్రగుంట్ల–నంద్యాల రైల్వేలైన్నువిద్యుద్దీకరణ (ట్రాక్షన్) చేయనున్నారు. రూ.20కోట్లు కేటాయించారు. 123 కిలోమీటర్ల మార్గంలో దీనివల్ల కరెంటురైలింజన్లు నడిచే అవకాశాలకు మార్గం ఏర్పడుతుంది. ట్రాక్షన్ పూర్తి కావాలంటే రూ111.48కోట్లు వ్యయం చేయాలి. ఇంకా సర్వేదశలోఈ మార్గం విద్యుద్దీకరణ పనులున్నాయి. -
బడ్జెట్ రైలు ఆగేనా ?
సాక్షి, కాజీపేట : కేంద్రంలో ప్రవేశపెట్టె బడ్జెట్లో రైల్వే పరంగా ఈసారైనా న్యాయం జరిగేనా అని జిల్లా ప్రజలు ఎదురుచూస్తున్నారు. పార్లమెంట్లో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ శుక్రవారం ప్రవేశపెట్టే బడ్జెట్లో కాజీపేట జంక్షన్‌కు న్యాయం జరగాలని జిల్లా ప్రజలు, రైల్వే కార్మికులు ఆకాంక్షిస్తున్నారు. నిజాం రైల్వే కాలంలో 1094లో ఏర్పాటైన కాజీపేట దినాదినాభివృద్ధి చెంది కాజీపేట జంక్షన్‌గా ఏర్పడి ఇప్పుడు దేశంలోని ఉత్తర, దక్షిణ ప్రాంతాలకు గేట్వేగా విలసిల్లుతోంది. అయితే, గతంలో ప్రవేశపెట్టే రైల్వే బడ్జెట్లు, ఇప్పుడు ఉమ్మడిగా ప్రవేశపెడుతున్న సాధారణ బడ్జెట్లకు సంబంధించి ఏటా నిరాశే ఎదురవుతోంది. ఈసారైనా కాజీపేట జంక్షన్ పరిధిలో పెండింగ్‌లో ఉన్న యూనిట్ల నిర్మాణం, రైల్వే లైన్ల నిర్మాణంతో పాటు ఇతర సమస్యల పరిష్కారానికి అడుగులు పడుతాయని భావిస్తున్నారు. ఫిట్‌లైన్ నుండి కొత్త రైళ్లు కాజీపేటలో రూ.15 కోట్ల వ్యయంతో నిర్మాణమవుతున్న ఫిట్‌లైన్ పనులను త్వరగా పూర్తి చేసి కాజీపేట కేంద్రంగా కొత్త రైళ్లు ప్రారంభించాలని జిల్లా వాసులు డిమాండ్ చేస్తున్నారు. ఇదే జరిగితే కాజీపేట జంక్షన్ నుంచి ముంబై, తిరుపతి, సికింద్రాబాద్ రూట్లలో కొత్త రైళ్లను ఇక్కడి నుంచే ప్రారంభించవచ్చు. తద్వారా కార్మికుల సంఖ్య పెరగడంతో పాటు కొత్తగా రైల్వే కార్యాలయాలు వస్తాయి. మూడో లేన్ కాజీపేట జంక్షన్ మీదుగా బల్లార్షా – విజయవాడ వరకు నిర్మాణంలో ఉన్న మూడో రైల్వే లైన్‌ను పూర్తి చేసేందుకు ఈసారి బడ్జెట్లో పూర్తి స్థాయి కేటాయింపులు చేయాలని ప్రజలు కోరుతున్నారు. ఈ లేన్ పూర్తయితే అయితే న్యూఢిల్లీ, విజయవాడ, హైదరాబాద్ మార్గాల్లో ట్రాఫిక్ తగ్గిపోతుంది. అలాగే, ఆలస్యాన్ని నివారించచ్చు. వడ్డేపల్లి చెరువు కట్లపై రైల్వే లైన్ కాజీపేట వడ్డేపల్లి చెరువు కట్టపై 200 మీటర్ల మేర సర్వే అయిన రేల్ అండర్ రైల్ లైన్ నిర్మాణం, కాజీపేట – బల్లార్షా వరకు సర్వే అయిన నాలుగో లేన్ నిర్మాణానికి బడ్జెట్ కేటాయించాలని స్థానికులు కోరుతున్నారు. సర్వే పూర్తయిన మణుగూరు – రామగుండం లేన్‌కు నిధులు, ఘన్పూర్ – సూర్యాపేట వరకు వయా పాలకుర్తి, కొడకండ్ల మీదుగా సర్వే అయిన లేన్ నిర్మాణానికి ఈ బడ్జెట్లో నిధులు మంజూరు చేయాలని, భూపాలపల్లి రైల్వే లేన్ నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్ ఇస్తారని జిల్లా ప్రజలు గంపెడాశలతో ఎదురుచూస్తున్నారు. కొత్త రైళ్లు, రైళ్ల పొడిగింపు కాజీపేట జంక్షన్ మీదుగా ఈసారి బడ్జెట్లో కొత్త రైళ్లు ఉంటాయా, లేదా అనే చర్చ సాగుతోంది. ఇంకా పద్మావతి ఎక్స్‌ప్రెస్, కరీంనగర్ – తిరుపతి ఎక్స్‌ప్రెస్, షిర్డీ ఎక్స్‌ప్రెస్‌లను డెయిలీగా మార్చాలనే డిమాండ్ ఉంది. అంతేకాకుండా కాజీపేట జంక్షన్ మీదుగా వెళ్లే పలు ఎక్స్‌ప్రెస్ రైళ్లకు హాల్టింగ్ కల్పిస్తూ నిర్ణయం తీసుకోవాలని కోరుతున్నారు. డివిజన్ కల నెరవేరేనా? 1904 సంవత్సరంలో ఏర్పాటైన కాజీపేట రైల్వే స్టేషన్ 115 ఏళ్ల ప్రస్థానంలో డివిజన్ కేంద్రంగా ఏర్పాటు కావాలనేది జిల్లా ప్రజలు, ఇక్కడ పని చేస్తున్న కార్మికుల చిరకాల కోరిక. ఇది ఈసారి బడ్జెట్లో నెరవేరుతుందని అనుకుంటున్నారు. కేంద్ర ప్రభుత్వం విశాఖ రైల్వే జోన్‌ను డివిజన్‌గా అప్‌గ్రేడ్ చేసినా కాజీపేట జంక్షన్‌ను చేయకపోవడంపై సర్వత్రా నిరసన వ్యక్తమవుతోంది. డివిజన్ ఏర్పాటైతే ఈ ప్రాంత అభివృద్దితో పాటు కొత్త రైల్వే పరిశ్రమలు వస్తాయి. పాలన అందరి చెంతకు చేరుతుంది. కొత్త రైళ్లను ఇక్కడకు ప్రారంభించేందుకు వెసలుబాటు కలుగుతుంది. డివిజన్ స్థాయి రైల్వే భవనాలు, అధికారులు వస్తారు. వ్యాగన్ పీఓహెచ్ షెడ్ కాజీపేట కేంద్రంగా పదేళ్ల క్రితం మంజూరైన రైల్వే వ్యాగన్ల తయారీ పరిశ్రమ.. ఆ తర్వాత దీని స్థానంలో మంజూరైన వ్యాగన్ పీరియాడికల్ ఓవరాలింగ్ షెడ్(పీఓహెచ్ షెడ్) నిర్మాణానికి అనేక అడ్డంకులు ఎదురవుతున్నాయి. ఈసారైనా ఇవి తొలగిపోయి బడ్జెట్లో నిధులు కేటాయిస్తారని, శంకుస్థాపన జరుగుతుం దని జిల్లా ప్రజలు ఎదురుచూస్తున్నారు. వ్యాగన్ పీఓహెచ్ షెడ్ వస్తే కాజీపేట అభివృద్ధి చెందడమే కాకుండా ప్రాధాన్యత పెరుగుతుంది. కొంత మేరకు నిరుద్యోగం తగ్గుతుంది. దీనికి తోడు అనుబంధంగా చిన్నచిన్న పరిశ్రమలు ఏర్పాటవుతాయి. -
పాతపని పూర్తిచేసేందుకే!
సాక్షి, హైదరాబాద్: ఈసారి బడ్జెట్లో పెండింగ్‌లో ఉన్న పాత ప్రాజెక్టులను పూర్తిచేసేందుకే కేంద్రం ఎక్కువ ఆసక్తి చూపించింది. కొత్త ప్రాజెక్టుల గురించి ఎలాంటి ప్రకటన చేయకుండా.. పాత వాటికి నిధుల కేటాయింపునకే పెద్దపీట వేసింది. సుదీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న కాజీపేట డివిజన్ హోదా, వట్టినాగులపల్లి టెర్మినల్ నిర్మాణం తదితర డిమాండ్లు ఈ బడ్జెట్లోనూ తీరని కోరికలుగానే మిగిలిపోయాయి. కాజీపేట–బల్లార్షా మూడో లైనుకు ఈ ఏడాది కూడా మోక్షం లభించలేదు. మరోవైపు అక్కన్నపేట–మెదక్ రైలు మార్గం ఈఏడాది ప్రారంభమయ్యే అవకాశాలున్నాయి. కొత్తపల్లి–మనోహరాబాద్‌కు మార్గంలోనూ మనోహరాబాద్–గజ్వేల్ వరకు ట్రయల్ రన్‌కు అధికారులు సిద్ధమవుతుండటం శుభసూచకం. శుక్రవారం దక్షిణ మధ్య రైల్వే కేంద్రమైన సికింద్రాబాద్‌లోని రైల్ నిలయంలో దక్షిణ మధ్య రైల్వే అడిషనల్ జనరల్ మేనేజర్ జాన్ థామస్ బడ్జెట్ వివరాలు వెల్లడించారు. కీలక ప్రాజెక్టులకు కేటాయింపులు.. 1. మనోహరాబాద్ కొత్తపల్లి ప్రాజెక్టుకు రూ.200 కోట్లు 2. మునీరాబాద్–మహబూబ్‌నగర్ మార్గానికి రూ.275 కోట్లు 3. భద్రాచలం–సత్తుపల్లి లైన్‌కు రూ.405 కోట్లు 4. కాజీపేట–బల్లార్షా మూడో లైన్‌కు రూ.265 కోట్లు 5. సికింద్రాబాద్–మహబూబ్‌నగర్ డబ్లింగ్‌కు రూ.200 కోట్లు 6. కాజీపేట–విజయవాడ మూడోలైన్‌కు రూ.110 కోట్లు 7. ఘట్కేసర్–యాదాద్రి ఎంఎంటీఎస్ ఫేజ్–2కు రూ.20 కోట్లు 8. చర్లపల్లి శాటిలైట్ స్టేషన్‌కు రూ.5 కోట్లు 9. కాజీపేట ఓవర్ హాలింగ్ వర్క్‌షాప్‌కు రూ.10 కోట్లు 10. మౌలాలిలో ఇన్స్టిట్యూట్ ఆఫ్ రైల్వే ఫైనాన్స్ మేనేజ్మెంట్ ఏర్పాటుకు రూ.1.5 కోట్లు తీరని కలలు... 1980 నుంచి తీరని కలగా మిగిలిన కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీకి ఈసారి కూడా మోక్షం దక్కలేదు. కాజీపేటను డివిజన్‌గా మార్చాలన్న డిమాండ్, లాలాగూడలో మెడికల్ కాలేజీ నిర్మించాలన్న డిమాండ్ ప్రస్తుతానికి పెండింగ్‌లోనే ఉన్నాయి. దక్షిణమధ్య రైల్వే పరిధిలోని చర్లపల్లి, వట్టినాగులపల్లి టెర్మినళ్ల నిర్మాణం ఇంకా సాకారం కావడం లేదు. ఇక్కడ తెలంగాణ ప్రభుత్వం స్థలం కేటాయించడంలో జాప్యం చేస్తున్నందునే ఇది ఆలస్యమవుతోంది. ఈ సర్వే పనులకు టెండర్లు పిలుస్తారా? 1. పటాన్చెరు–సంగారెడ్డి–జోగిపేట–మెదక్ 95 కిలోమీటర్లు 2. నిజామాబాద్–నిర్మల్–ఆదిలాబాద్ రూ.125 కోట్లు 3. కరీంనగర్–హుజూరాబాద్–ఎల్కతుర్తి: 60 కిమీ ‘ఓట్ల కోసమే ఈ బడ్జెట్ ’ కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్ కేవలం ఓట్ల కోసమే పెట్టినట్టుందని కాంగ్రెస్ ఆరోపించింది. పేదలను వదిలి వ్యాపారుల మన్ననలు పొందేలా ఉన్న ఈ బడ్జెట్‌తో బీజేపీ వ్యాపారస్తుల పార్టీ అని మరోమారు తేలిపోయిందని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ పొన్నం ప్రభాకర్ వ్యాఖ్యానించారు. శుక్రవారం గాంధీభవన్‌లో ఏఐసీసీ కిసాన్‌సెల్ ఉపాధ్యక్షుడు ఎం.కోదండరెడ్డితో కలసి మాట్లాడుతూ.. కేంద్ర బడ్జెట్లో వ్యక్తిగత ఆదాయపు పన్నును మినహాయించినట్టు ప్రకటించి వచ్చే ఏడాది నుంచి అమలు చేస్తామని చెప్పడం దారుణమన్నారు. బడాబాబులకు ఐటీ తగ్గించి పేదలను పట్టించుకోకుండా అంకెలు చూపెట్టారని, మోదీ వల్ల దేశానికి ఒరిగిందేమీ లేదని, రాబోయే ఎన్నికల్లో మోదీ సర్కారును గద్దెదింపేందుకు దేశ ప్రజలు సిద్ధంగా ఉన్నారని అన్నారు. ఇది పూర్తిగా ఎన్నికల బడ్జెట్ ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి సాక్షి, న్యూఢిల్లీ: కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్ త్వరలో జరిగే సాధారణ ఎన్నికలకు ప్రచారం మాదిరిగా ఉందని ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి అన్నారు. శుక్రవారం కేంద్ర ఆర్థిక మంత్రి లోక్‌సభలో బడ్జెట్ ప్రవేశపెట్టిన అనంతరం కొండా విశ్వేశ్వరరెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. ఈ బడ్జెట్ ద్వారా గతంలో తాను ప్రవేశపెట్టిన అన్ని పథకాలు విఫలమైనట్లుగా కేంద్ర ప్రభుత్వం ఒప్పుకున్నట్టు అయిందన్నారు. రైతుల ఆదాయం రెట్టింపు, మద్దతు ధర, ఈనామ్ లాంటివన్నీ విఫలమవడంతో ఇప్పుడు కొత్తగా రైతులకు పెట్టుబడి సాయం పేరుతో ముందుకొచ్చారని విమర్శించారు. ఆదాయ పన్ను పరిమితి పెంపు మంచిదని పేర్కొన్నారు. అయితే, దీన్ని గత ఐదేళ్లలో ఎందుకు చేయలేదని ప్రశ్నించారు. కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్ పూర్తిగా ఎన్నికల కోణంలో ఉందన్నారు. -
ప్రగతికి ‘పట్టాలు’!
న్యూఢిల్లీ: మరో మూడు నెలల్లో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఊహించినట్లుగానే రైల్వే చార్జీల పెంపు లేకుండానే తాజా బడ్జెట్ వచ్చింది. అంతేకాకుండా గతంలో ఎన్నడూ లేనంత మూలధన వ్యయాన్ని ఈ బడ్జెట్లో రైల్వేకు కేటాయించారు. గతేడాది అరుణ్ జైట్లీ ఆర్థిక మంత్రిగా ఉండగా రూ. 1.48 లక్షల కోట్లను రైల్వేకు కేటాయించగా, ప్రస్తుతం దాన్ని మరో పది వేల కోట్లు పెంచి రూ. 1,58,658 కోట్లకు పియూష్ గోయల్ చేర్చారు. అలాగే బడ్జెట్ నుంచి మూలధన సాయంగా రూ.64,587 కోట్లను రైల్వేలకు కేటాయించారు. ఇప్పటివరకు రైల్వే చరిత్రలో 2018–19 సంవత్సరమే అత్యంత సురక్షితమైనదనీ, బ్రాడ్‌గేజ్ పట్టాలపై వెంట ఉన్ని కాపలా లేని రైల్వే గేట్లను సంపూర్ణంగా తొలగించామని రైల్వే, ఆర్థిక శాఖల మంత్రి పియూష్ చెప్పారు. బడ్జెట్ ప్రసంగంలో ఆయన మాట్లాడుతూ ‘వచ్చే ఏడాదికి రైల్వేకు కేటాయించిన మూలధన వ్యయం చరిత్రలోనే అత్యధికం. ఆ మొత్తం రూ. 1.58 లక్షల కోట్లు. దేశీయంగా తయారైన పాక్షిక అత్యంత వేగవంతమైన రైలు వందే భారత్ ఎక్స్‌ప్రెస్ (ట్రైన్ 18) భారతీయ ప్రయాణికులకు ప్రపంచ స్థాయి అనుభవాన్ని ఇవ్వనుంది. పూర్తిగా మన ఇంజినీర్లే తయారు చేసిన ఈ రైలుతో మనం సాంకేతికతలో మరో పెద్ద అడుగు ముందుకేశాం’అని వివరించారు. రైల్వేకు వచ్చే ఆర్థిక ఏడాదిలో రూ. 2.73 లక్షల కోట్ల ఆదాయం వస్తుందని బడ్జెట్లో అంచనా వేశారు. గతేడాది ఈ అంచనా రూ. 2.5 లక్షల కోట్లుగా ఉంది. కొత్త మార్గాల నిర్మాణాలకు రూ. 7,255 కోట్లు, గేజ్ మార్పిడికి రూ. 2,200 కోట్లు, డబ్లింగ్ పనులకు రూ. 700 కోట్లు, ఇంజిన్లు, బోగీలు తదితరాలకు రూ. 6,114.82 కోట్లు, సిగ్నల్ వ్యవస్థ, టెలికాంలకు కలిపి రూ. 1,750 కోట్లు, ప్రయాణికులకు సౌర్యాలను మెరుగుపరిచేందుకు రూ. 3,422 కోట్లను ఈ బడ్జెట్లో కేటాయించారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో నిర్వహణ నిష్పత్తి 96.2కు మెరుగుపడిందనీ, వచ్చే ఏడాదికి దీనిని 95 శాతానికి తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకున్నామని గోయల్ చెప్పారు. త్వరలో అధునాతన బోగీలు ఇంజిన్లు, బోగీలు తదితరాల కోసం గతేడాది కన్నా ఈ ఏడాది బడ్జెట్లో 64 శాతం అధిక కేటాయింపులకు చేశారు. 2018–19 బడ్జెట్లో ఈ కేటగిరీ కోసం రూ. 3,724.93 కోట్లు కేటాయించగా, తాజా ఆ బడ్జెట్లో ఆ మొత్తం రూ. 6,114.82 కోట్లుగా ఉంది. దీంతో త్వరలోనే అధునాతన బోగీలు రైల్వే ప్రయాణికులకు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. రైలు బోగీల మార్కెట్లో ప్రపంచ వ్యాప్తంగా 200 బిలియన్ డాలర్ల వ్యాపారం చేయాలన్న ప్రభుత్వ లక్ష్యాన్ని చేరుకునేందుకు తాజా బడ్జెట్ కేటాయింపులు ఉపకరించనున్నాయి. భారత్‌లో అత్యంత వేగవంతమైన రైలు ట్రైన్ 18 (వందే భారత్ ఎక్స్‌ప్రెస్), కొత్త ఏసీ కోచ్‌లు, మెట్రో కోచ్‌లు తదితరాల తయారీ విజయవంతం అవ్వడంతో అదే ఉత్సాహంతో 2021 వరకు తయారీ ప్రణాళికలను రైల్వే అధికారులు ఇప్పటికే సిద్ధం చేశారు. ఇవి సరిగ్గా అమలైతే వచ్చే రెండేళ్లలో దేశంలోని వివిధ రైల్వే ఫ్యాక్టరీలు కలిసి దాదాపు 15 వేల బోగీలను తయారు చేయనున్నాయి. ప్రస్తుతం వివిధ నగరాల్లో తిరుగుతున్న ఈమూ, మెమూ రైళ్లకు బదులుగా కొత్త బోగీలను ప్రవేశపెట్టనున్నారు. త్వరలోనే మరో 6 ట్రైన్ 18లను తయారు చేయాలని ఇప్పటికే నిర్ణయించారు. ఫస్ట్ యాక్సిడెంట్.. ప్రపంచంలో తొలిసారి రైలు చక్రాల కింద నలిగిపోయిన అభాగ్యుడెవరో తెలుసా? ఈయనే. పేరు విలియం హస్కిసన్, బ్రిటన్ ఎంపీ. 1830 సెప్టెంబర్ 15న బ్రిటన్‌లోని లివర్‌పూల్, మాంచెస్టర్ రైల్వేలైన్‌ను ప్రారంభించేందుకు వెళ్లి ప్రమాదవశాత్తూ రైలు కింద పడి మరణించారు. ఇదే కార్యక్రమానికి వచ్చిన డ్యూక్ ఆఫ్ వెల్లింగ్టన్ ఆర్థర్ వెలస్లీతో మాట్లాడేందుకు పక్కనే ఉన్న పట్టాలపై నడుచుకుంటూ ముందుకు వెళ్లారు. అయితే అదే సమయంలో ఆ పట్టాలపై మరో రైలు వస్తోంది. రైలు దగ్గరికి రాగానే తడబడుతూ పట్టాలపై పడిపోయారు. అందరూ చూస్తుండగానే ఘోరం జరిగిపోయింది. ఓల్డ్ ఈజ్ గోల్డ్ 1850 తొలినాళ్లలో మన దేశంలో ఇలా ఎడ్లే ఇంజిన్లుగా అప్పటి న్యారో గేజ్ రైలును లాగేవి. -
రైల్వే బడ్జెట్లో ఉమ్మడి జిల్లాపై శీతకన్ను
రైల్వే బడ్జెట్లో ఉమ్మడి నల్లగొండ జిల్లాపై కేంద్రం శీతకన్ను వహించింది. దశాబ్దాలుగా ఎదురుచూస్తున్న సికింద్రాబాద్ – కాజీపేట మార్గంలో మూడో లేన్ ఊసే లేకపోగా.. బీబీనగర్–నడికుడి డబ్లింగ్ పనులకు మోక్షం కలగలేదు. ఇక సూర్యాపేటకు రైలు మార్గానికి సంబంధించిన ప్రతిపాదనలు ఈసారీ పట్టాలెక్కలేదు. రైల్వే శాఖకు అత్యధిక ఆదాయం సమకూర్చుతున్న విష్ణుపురం మార్గంపైనా జాలి చూపలేదు. రైల్వే ప్రాజెక్టులకు మోక్షం లభిస్తుందని ఎంతో ఆశతో ఎదురుచూసిన ఉమ్మడి జిల్లా వాసులకు నిరాశే మిగిలింది. సాక్షి, యాదాద్రి : ఉమ్మడి నల్లగొండ జిల్లాకు 2018–19 బడ్జెట్లో రైల్వే ప్రాజెక్టులకు న్యాయం జరుగలేదు. ఎన్నికల బడ్జెట్లో జిల్లాకు సంబంధించిన రైల్వే ప్రాజెక్టులకు మోక్షం కలుగుతుందని.. ప్రజలు ఎంతో ఆశగా ఎదురు చూశారు. ప్రస్తుత కేటాయింపులపై ప్రజలు పెదవి విరుస్తున్నారు. యాదాద్రి వరకు ఎంఎంటీఎస్ పొడిగింపు, బీబీనగర్ నడికుడి డబ్లింగ్ పనులకు మోక్షం లభించలేదు. సూర్యాపేట ప్రాంత ప్రజలు ఎదురుచూస్తున్న ఎక్స్‌ప్రెస్ హైవే రైలు మార్గ ప్రతిపాదనలు ఈ సారి కూడా పట్టాలెక్కలేదు. యాదాద్రి వరకు ఎంఎంటీఎస్ లైను పొడిగింపునకు అరకొర నిధులు కేటాయించారు. మల్టీ మోడల్ ట్రాన్స్‌పోర్టు సిస్టం (ఎంఎంటీఎస్) రైలు వస్తుందని భావించిన వారికి మరో ఏడాది పైగా నిరీక్షించకతప్పని పరిస్థితి. ఎంఎంటీఎస్ ఫేజ్–2కు మొత్తం ప్రాజెక్టు అంచనా వ్యయం రూ.330కోట్లుకాగా.. రూ.21.25కోట్లు మంజూరు చేశారు. సికింద్రాబాద్ –కాజీపేట మార్గంలో మూడో లైన్ ఊసే లేకుండా పోయింది. ఈ ప్రాజెక్టు కోసం దశాబ్ధాలుగా ఎదురుచూపులు తప్పడం లేదు. గతంలో సర్వే చేసిన అధికారులు ఇప్పుడు దాన్ని మరిచిపోయారు. దక్షిణమధ్య రైల్వే గుంటూరు డివిజన్లో గల బీబీనగర్– నడికుడి (252 కిలో మీటర్లు) డబ్లింగ్ పనులకు ఈ బడ్జెట్లో నిధులు కేటాయిస్తారని ఎంతో ఆశగా చూశారు. ఈ మార్గానికి నిధులు కేటాయింపే జరగలేదు. పగిడిపల్లి నుంచి నల్లగొండ, మిర్యాలగూడ మీదుగా నడికుడి జంక్షన్ వరకు రైలు మార్గాన్ని డబ్లింగ్ చేయాలనేది ఈ ప్రాంత ప్రజల డిమాండ్ ఉంది. దక్షిణ, తూర్పు రైల్వే ప్రాంత ప్రజలకు ఈ మార్గం ద్వారా రైలు ప్రయాణం సాగుతోంది. క్రాసింగ్‌లతో ఎక్స్‌ప్రెస్, సూపర్‌ఫాస్ట్ రైళ్లను సైతం ఆపక తప్పడం లేదు. గంటల తరబడి క్రాసింగ్‌లతో ప్రయాణకాలం పెరిగి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. తెలంగాణ పాటు ఆంధ్రప్రదేశ్, కేరళ, తమిళనాడు, ఒడిశా, పశ్చిమబంగా, కర్ణాటక రాష్ట్రాలతో అనుసంధానం గల ఈ మార్గంపై నిర్లక్ష్యం కొనసాగడం ప్రయాణికులను వేదనకు గురిచేస్తోంది. పగిడిపల్లి నుంచి నల్లపాడు వరకు విద్యుద్దీకరణ పనులకు రూ.291.75కోట్లు మంజూరు చేశారు. ఇందులో మొదటి విడుతగా నల్లపాడు నుంచి రెడ్డిగూడెం వరకు రైల్వే లైన్ విద్యుదీకరణ ఈ ఆర్థిక సంవత్సరంలో పూర్తి చేస్తారు. రెడ్డిగూడెం నుంచి పగిడిపల్లి వరకు వచ్చే ఆర్థిక సంవత్సరం 2018–19లో పూర్తి చేస్తారు. సూర్యాపేట రైలు మార్గం ఎక్కడ..? హైదరాబాద్– అమరావతి ఎక్స్‌ప్రెస్ రైల్వే కోసం జిల్లాలోని సూర్యాపేట, కోదాడ ప్రజలు ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్నారు. ఈ బడ్జెట్లో దాని పేరెత్తలేదు. ప్రస్తుతం ఉన్న జాతీయరహదారి 65కు అనుబంధంగా అమరావతి వరకు నూతన రైలు మార్గాన్ని ప్రతిపాదించారు. దీంతోపాటు మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ నుంచి మిర్యాలగూడ వరకు (వయా సూర్యాపేట) మార్గానికి 2013–14లో కొత్త లైన్ ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు. దీనికి బడ్జెట్లో ఏ మాత్రం ప్రాధాన్యతను ఇవ్వలేదు. గుంటూరు రైల్వే డివిజన్లో రైల్వే శాఖకు అత్యధిక ఆదాయం వస్తున్న విష్ణుపురం మార్గంపైనా కేంద్రం జాలి చూపలేదు. మఠంపల్లి నుంచి జాన్‌పహాడ్ వరకు ఉన్న 18 కిలోమీటర్లు మార్గాన్ని పూర్తి చేస్తే జగ్గయ్యపేట నుంచి విష్ణుపురం రైలు మార్గం ప్రజలకు అందుబాటులోకి వస్తుంది. యాదగిరిగుట్ట వరకు పొడిగిస్తే బాగుండేది. రైల్వే బడ్జెట్లో భువనగిరి ప్రాంతానికి తీవ్ర అన్యాయం జరిగింది. ఘట్కేసర్ – యాదాద్రి (రాయగిరి) వరకు ఎంఎంటీఎస్–2కు రూ.21.25కోట్లు కేటాయించడం బాధాకరం. ఈ ప్రాంతానికి ఎంఎంటీఎస్ తీసుకువచ్చే ప్రయత్నంలో పూర్తిస్థాయి బడ్జెట్ కేటాయిస్తే బాగుండేది. ఘట్కేసర్ నుంచి రాయగిరి వరకు కాకుండా 3 కిలోమీటర్ల దూరంలో ఉన్న యాదగిరిగుట్ట పట్టణం వరకు పొడగిస్తే ప్రయాణికులు సంతోషించే వారు. ఎంఎంటీఎస్–2ను ఘట్కేసర్ నుంచి యాదగిరిగుట్ట వరకు పొడగించి, మరిన్ని నిధులు కేటాయించి పూర్తి చేయాలి. – ఎండీ అతీఫ్, యాదగిరిగుట్ట రాష్ట్రానికి మొండిచేయి.. కేంద్ర ప్రభుత్వం ఈసారి రైల్వే బడ్జెట్లో రాష్ట్రానికి మెండి చేయి చూపారు. రూ.1,813 కోట్ల నిధులు కేటాయించడం దారనుణం. పాత ప్రాజెక్టుల పనులకు మాత్రమే నిధులు కేటాయించారు. కొత్త ప్రాజెక్టులకు కేటాయించలేదు. నామమాత్రం నిధుల కేటాయింపు వల్ల పనుల్లో జాప్యం జరగవచ్చు. – బాలచందర్, మాజీ వైస్ ఎంపీపీ, బీబీనగర్ -
రైల్వే కేటాయింపుల్లో తీవ్ర నిరాశ..
సాక్షి, హైదరాబాద్ ఒక్క కొత్త రైలు రాలేదు.. కీలక మార్గాల్లో కొత్త్త లైన్ ఒక్కటీ లేదు.. భారీ ప్రాజెక్టులూ లేవు.. వెరసి మోదీ రైలు తెలంగాణలో ఆగకుండానే దూసుకుపోయింది! కోటి ఆశలతో కేంద్రం వైపు కళ్లు కాయలు కాసేలా ఎదురుచూస్తున్న రాష్ట్రానికి తీవ్ర నిరాశే మిగిల్చింది. రైల్వే లైన్లు పరిమితంగా ఉన్న తెలంగాణ ప్రతిసారీ రైల్వే బడ్జెట్ అనగానే కేంద్రం వైపు ఎంతో ఆశతో చూస్తోంది. ప్రతిసారీ ఎంతో కొంత విదిల్చి నిరుత్సాహపరిచే కేంద్రం ఈసారి మరింత పిసినారితనాన్ని ప్రదర్శించింది. బడ్జెట్లో రైల్వేకు తొలిసారి రూ.లక్ష కోట్లను మించి (రూ.1,46,500 కోట్లు) నిధులు కేటాయించినా.. అందులో రాష్ట్రానికి విదిల్చింది కేవలం రూ.1,813 కోట్లు. మొత్తం కేటాయింపులో ఇది కేవలం 1.23 శాతం! బడ్జెట్ విధానాన్ని మార్చినందున కచ్చితంగా కొత్త ప్రాజెక్టులు మంజూరు చేయాలన్న నిర్ణయం ఉండదని, సంవత్సరంలో ఎప్పుడైనా మంజూరు చేయొచ్చంటున్న కేంద్రం.. ఇప్పటికే పనులు జరుగుతున్న ప్రాజెక్టులకన్నా భారీగా నిధులు ఇచ్చిందా అంటే అదీ లేదు. అత్తెసరు నిధులు విదిల్చి ఆ పనులు ఇప్పట్లో పూర్తి కావనే సంకేతాలనిచ్చింది. పండుగల సమయంలో లక్షల మంది ప్రయాణికులు పోటెత్తినా చాలినన్ని ప్రత్యేక రైళ్లు నడిపే శక్తి దక్షిణ మధ్య రైల్వేకు లేదు. డిమాండ్‌ను తట్టుకునే స్థాయిలో రైల్వే లైన్లు లేకపోవటమే ఇందుకు కారణమని రైల్వేనే చెబుతోంది. రెండు, మూడో లైన్ల నిర్మాణం, కీలక మార్గాల్లో కొత్త లైన్లకు నిధులిస్తే ఈ సమస్య తీరేంది. కానీ ఆ ప్రయత్నం కూడా జరగలేదని బడ్జెట్ లెక్కలు స్పష్టం చేస్తున్నాయి. మొత్తంగా సాధారణ కేటాయింపులతో కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ రాష్ట్రానికి మొండిచేయి చూపారు. ఇలాగైతే పదేళ్లయినా పూర్తి కావు దక్షిణ మధ్య రైల్వే పరిధిలో ప్రస్తుతం 2,623 కి.మీ. మేర కొత్త రైల్వే లైన్లకు ఉద్దేశించిన 22 ప్రాజెక్టులు వివిధ దశల్లో ఉన్నాయి. వీటి మొత్తం ప్రాజెక్టు వ్యయం రూ.19,983 కోట్లు. కానీ రాష్ట్రం ఆవిర్భవించినప్పట్నుంచీ ఇప్పటి వరకు వీటిపై చేసిన ఖర్చు రూ.3,026 కోట్లు మాత్రమే. వాటికి తాజా బడ్జెట్లో కేటాయించిన మొత్తం రూ.1,757 కోట్లు. అందులో తెలంగాణ వాటా కేవలం రూ.675 కోట్లు. ఇదేరకంగా నిధులు కేటాయిస్తూ పోతే ఆ ప్రాజెక్టులు పూర్తయ్యేందుకు పదేళ్ల కాలం పడుతుంది. ఇక కొత్త లైన్ల సంగతి చెప్పేదేముంది. జరిగిన పనులు 8.2 శాతమే.. పెరుగుతున్న డిమాండ్, రైళ్ల ట్రాఫిక్ నేపథ్యంలో ప్రస్తుతం రెండు, మూడో లైన్ నిర్మాణం ఎంతో అవసరం. దక్షిణ మధ్య రైల్వే పరిధిలో 2,268 కి.మీ. మేర ఈ పనులు సాగుతున్నాయి. వీటి అంచనా వ్యయం రూ.19,647 కోట్లు. కానీ 2014 నుంచి ఇప్పటివరకు రూ.1,626 కోట్లు మాత్రమే వ్యయం చేశారు. అంటే.. 8.2 శాతం పనులే జరిగాయని ఈ లెక్కలు చెబుతున్నాయి. తాజాగా అందుకు ఇచ్చిన మొత్తం రూ.611 కోట్లు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇప్పటి వరకు కొత్త లైన్లకు సంబంధించి 113 కి.మీ., డబ్లింగ్, ట్రిప్లింగ్‌కు సంబంధించి 24.50 కి.మీ. మాత్రమే పూర్తి చేయగలిగారు. నిధుల కేటాయింపుల్లో పెరుగుదల ఏది? రైల్వే వసతి అతి తక్కువ ఉన్న రాష్ట్రంలో ఆది నుంచి బడ్జెట్ కేటాయింపులు అత్తెసరే. కానీ 2014లో మోదీ ప్రభుత్వం కొలువు దీరిన తర్వాత కాస్త ఆశలు పెరిగాయి. అప్పటి వరకు ఉన్న నామమాత్రపు కేటాయింపులను కొంత పెంచటమే ఇందుకు కారణం. వరుసగా మూడేళ్లపాటు ఆ పెంపు ఓ మోస్తరుగా ఉండటంతో.. ఎన్నికలకు ముందు ప్రవేశపెట్టిన ఈ చివరి బడ్జెట్లో అది మరింత ఆశాజనకంగా ఉంటుందని ఆశించారు. కానీ నామమాత్రపు పెంపుతో నీళ్లు చల్లారు. బడ్జెట్లో కేటాయింపులివీ.. ఇక అన్నీ ఎలక్ట్రిక్.. : దక్షిణ మధ్య రైల్వేను పూర్తిగా కరెంటు మార్గంగా చేయబోతున్నారు. ఈ జోన్ పరిధిలోని బీదర్–గుల్బర్గా మార్గం మినహా యావత్తు ద.మ. రైల్వేను ఎలక్ట్రికల్ మార్గంగా చేయబోతున్నట్టు బడ్జెట్లో ప్రకటించారు. ఇందుకు తాజా బడ్జెట్లో 1,261 కి.మీ. మార్గాన్ని విద్యుద్దీకరించేందుకు రూ.1,172 కోట్లు ఖర్చు చేయనున్నట్టు ప్రకటించారు. ఈ ఏడాది మాత్రం ఇందుకు రూ.72 కోట్లు మంజూరు చేశారు. ఇందులో తెలంగాణ వాటా మార్గాలు... లింగంపేట–జగిత్యాల–నిజామాబాద్– 95 కి.మీ.(రూ.80.29 కోట్లు) వికారాబాద్–పర్లివైజ్నాథ్–269 కి.మీ.(రూ.262.12 కోట్లు) పింపల్‌కుట్టి–ముద్ఖేడ్–పర్లి– 246 కి.మీ.(రూ.224.17 కోట్లు) సికింద్రాబాద్ ‘జిగేల్’.. రెండేళ్ల తర్వాతే.. దేశంలోని ప్రధాన స్టేషన్లను పూర్తిస్థాయిలో అభివృద్ధి చేసే ప్రాజెక్టుకు కేంద్రం గత బడ్జెట్లో శ్రీకారం చుట్టింది. తొలిదశలో 25 స్టేషన్లను ఎంచుకోగా అందులో సికింద్రాబాద్ చోటు దక్కించుకుంది. పీపీపీ పద్ధతిలో వాటిని అభివృద్ధి చేస్తారు. గత సంవత్సరమే రైల్వే టెండర్లు పిలిచింది. కానీ నిబంధనలు చూసిన తర్వాత బిడ్డర్లు వెనకడుగు వేశారు. ఈ ప్రాజెక్టులో లీజు గడువు 40 ఏళ్లుగా రైల్వే నిర్ధారించింది. దాన్ని మారిస్తేనే ముందుకొస్తామని బిడ్డర్లు తేల్చి చెప్పారు. ఫలితంగా ఆ ప్రాజెక్టు దాదాపు ఆగిపోయింది. దీంతో తాజాగా కేంద్రం లీజు సమయాన్ని 99 ఏళ్లకు పెంచాలని నిర్ణయించింది. బిడ్ల తంతు పూర్తి చేసి వచ్చే సంవత్సరం పనులు ప్రారంభించే అవకాశం ఉందని ద.మ. రైల్వే జీఎం వినోద్‌కుమార్ యాదవ్ వివరించారు. రాష్ట్ర ప్రభుత్వ వైఖరితోనే ‘కాజీపేట’ జాప్యం కొంతకాలం నడిచిన తర్వాత బోగీలను తిరిగి కండీషన్లోకి తెచ్చేందుకు ఉద్దేశించిన వ్యాగన్ ఓవర్‌హాలింగ్ వర్క్‌షాపు ప్రాజెక్టులో రాష్ట్ర ప్రభుత్వ వైఖరితో పనుల్లో జాప్యం జరుగుతోంది. దీనికి కావాల్సిన 150 ఎకరాల భూమిని రాష్ట్ర ప్రభుత్వం కేటాయించింది. కానీ అది దేవాదాయశాఖ భూమి కావటంతో కోర్టుల్లో కేసులు దాఖలయ్యాయి. దీంతో గత బడ్జెట్లో రైల్వే శాఖ నిధులు కేటాయించినా పనులు చేపట్టలేకపోయింది. ఇప్పటికీ ఆ భూమి మధ్యలో ఓ బిట్‌పై ఇంకా కేసు కొనసాగుతుండటంతో దాన్ని రైల్వేకు స్వాధీనం చేయలేకపోయారు. తాజా బడ్జెట్లో కేంద్రం దానికి రూ.200 కోట్లు కేటాయించింది. రాష్ట్ర ప్రభుత్వం భూమిని అప్పగించిన 18 నెలల్లో వర్క్‌షాపు పూర్తి చేస్తామని దక్షిణ మధ్య రైల్వే జీఎం తెలిపారు. మరిన్ని విశేషాలు.. ⇒ నిత్యం 25 వేల మంది వరకు ప్రయాణికుల తాకిడి ఉండే అన్ని రైల్వే స్టేషన్లలో ఎస్కలేటర్లు ఏర్పాటు చేయబోతున్నారు. ఈ సంవత్సరం హఫీజ్‌పేట, ఖమ్మంలలో ఏర్పాటు చేస్తారు. ⇒ అన్ని రైల్వే స్టేషన్లలో ఎల్ఈడీ లైట్లను ఏర్పాటు చేస్తారు. స్టేషన్ భవనాలపైన సౌరఫలకాలు ఏర్పాటు చేసి సౌర విద్యుత్‌ను అందిపుచ్చుకుంటారు. ⇒ కొత్తగా 2 ఆర్ఓబీలు, 9 ఆర్‌యూబీలను రూ.195 కోట్ల వ్యయంతో నిర్మిస్తారు. ఇందులో రైల్వే రూ.73.14 కోట్లు భరించనుండగా మిగతా మొత్తాన్ని రాష్ట్రప్రభుత్వం కేటాయించాల్సి ఉంది. ⇒ సికింద్రాబాద్–కరీంనగర్‌ను రైల్వేతో అనుసంధానించేందుకు ఉద్దేశించిన మనోహరాబాద్–కొత్తపల్లి ప్రాజెక్టుకు ఈసారి రూ.125 కోట్లు కేటాయించారు. వీటితో మనోహరాబాద్–గజ్వేల్ మధ్య రైల్వే లైన్ ఏర్పాటు చేస్తారు. చర్లపల్లి శాటిలైట్ స్టేషన్‌కు భూమి ఏది? సికింద్రాబాద్ స్టేషన్లో కొత్త ప్లాట్‌ఫామ్స్ నిర్మించేందుకు స్థలం లేక రైళ్లను శివార్లలో నిలపాల్సి రావటం ప్రయాణికులకు శాపంగా మారడంతో చర్లపల్లిలో ఆ«ధునిక శాటిలైట్ టెర్మినల్ నిర్మించాలని రైల్వే శాఖ రెండేళ్ల క్రితం నిర్ణయించింది. దీనికి 150 ఎకరాల స్థలం కావాలంటూ రాష్ట్ర ప్రభుత్వాన్ని లిఖితపూర్వకంగా కోరింది. కానీ స్థలం లభించక పనులు మొదలు పెట్టలేకపోయింది. ఎన్నిసార్లు రాష్ట్రప్రభుత్వాన్ని కోరినా స్పందన లేకపోవటంతో ఇక అక్కడ తనకు ఉన్న 50 ఎకరాల స్థలంలోనే పనులు చేపట్టాలని రైల్వే నిర్ణయించింది. ఉన్న నిధులతో పనులు వేగంగా చేస్తాం గత నాలుగేళ్ల క్రితంతో పోలిస్తే దక్షిణ మధ్య రైల్వేకు మెరుగ్గానే నిధుల కేటాయింపు జరిగింది. వీటితో కొత్త లైన్లు, రెండు, మూడో లైన్ల నిర్మాణంపై దృష్టి పెడతాం. ముఖ్యంగా ఆర్ఓబీ, ఆర్యూబీల నిర్మాణం, కాపలా లేని లెవల్ క్రాసింగ్స్ తొలగింపు, హైలెవల్ ప్లాట్‌ఫామ్‌ల నిర్మాణాలకు ప్రాధాన్యమిస్తున్నాం. జోన్‌కు కేటాయించిన నిధులను అవసరమైతే మంజూరైన ఇతర పనులకు సర్దుబాటు చేసే అధికారాన్ని జీఎంలకు కల్పించటం శుభపరిణామం. దీంతో ఏదైనా సమస్య వల్ల నిర్ధారిత పనులు ఆగిపోతే ఆ నిధులు వెనక్కు పోకుండా అవసరమైన ఇతర పనులకు ఖర్చు చేసే వెసులుబాటు కలుగుతుంది. ఈ సంవత్సరం సెప్టెంబర్ నాటికి కాపలాదారులేని లెవల్ క్రాసింగ్స్ లేకుండా చేస్తాం. అలాంటివి 214 ఉన్నట్టు గుర్తించాం. యాదాద్రి ఎంఎంటీఎస్‌కు ఈ నెలలోనే టెండర్లను ఆహ్వానిస్తాం. –వినోద్‌కుమార్ యాదవ్. జీఎం, దక్షిణ మధ్య రైల్వే -
పట్టాలెక్కని డిమాండ్లు
తిరుపతి మెయిన్ రైల్వేస్టేషన్లో ప్రయాణికుల రద్దీ నేపథ్యంలో అనుబంధంగా ఉన్న వెస్ట్, రేణిగుంట, తిరుచానూరు రైల్వేస్టేషన్లను ప్రత్యామ్నాయంగా అభివృద్ధి చేసేందుకు తయారు చేసిన డిజైన్లు, ప్రాజెక్ట్ రిపోర్టుల కన్సల్టెన్సీలకే పుణ్య కాలం హరించుకుపోతోంది. గడచిన 12 ఏళ్లలో సుమారు రూ.15 కోట్లమేర ఇందుకోసం రైల్వేశాఖ ఖర్చు చేసింది. ఇప్పటికీ రూపురేఖలు మారకపోవడం ఒక ఎత్తయితే.. మౌలిక వసతులు కల్పించకపోవడంపై ప్రయాణికులు పెదవి విరుస్తున్నారు. ఈ నేపథ్యంలో గురువారం రైల్వే బడ్జెట్‌పై జనం ఆశతో ఉన్నారు. తిరుపతి అర్బన్: దశాబ్దాల తరబడి జిల్లాకు రైల్వేపరంగా సరైన ప్రాధాన్యం లభించడం లేదు. ఫలితంగా అనేక డిమాండ్లు అమలుకు నోచుకోవడం లేదు. నేటికీ రద్దీ మేరకు రైళ్లు లేకపోగా, తిరుపతికి వస్తున్న యాత్రికులకు కనీస వసతులు కల్పించకపోవడంపై సర్వత్రా ఆగ్రహం వ్యక్తమవుతోంది. తొలి రెండున్నరేళ్లపాటు రైల్వేమంత్రిగా కొనసాగిన సురేష్‌ప్రభుతో జిల్లా ఎంపీలు పలుమార్లు సంప్రదించి నివేదిం చిన అంశాల్లో కొన్నింటికి గ్రీన్ సిగ్నల్ పడ్డాయి. చాలా అంశాలు నేటికీ ఊరిస్తూ ...ఉసూరుమనిపిస్తూ కాలగమనంలో పడిలేస్తున్నాయి. కొత్త రైళ్లు ఏర్పాటు చేయకపోగా, మీటర్‌గేజ్ ఉన్నప్పుడు నడుస్తున్న పాత రైళ్లనైనా పునరుద్ధరించాలన్న డిమాం డ్లకు మోక్షం రావడం లేదు. కానరాని వరల్డ్‌క్లాస్....ఊరిస్తున్న మోడల్ క్లాస్ దక్షిణమధ్య రైల్వే జోన్లోనే అత్యధిక రద్దీ, ఆదాయం సమకూరుస్తున్న రెండో రైల్వేస్టేషన్ తిరుపతి. అందుకు అనుగుణంగా 2008లో అప్పటి రైల్వే మంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ తిరుపతిని వరల్డ్‌క్లాస్ స్థాయికి తీసుకువెళ్తామంటూ బడ్జెట్లో ప్రకటించారు. అనంతరం రైల్వేమంత్రి మారడం, ఉన్నతాధికారుల పర్యటనల్లో మార్పులు సూచించడం వంటి కారణాలతోనే పదేళ్లు గడచిపోయాయి. ఇప్పటికీ వరల్డ్‌క్లాస్ హోదా లేదు. ప్రస్తుత రైల్వే జీఎం వినోద్‌కుమార్ యాదవ్ మాత్రం వరల్డ్‌క్లాస్ ఫైల్ ముగిసిపోలేదని చెబుతున్నప్పటికీ ఆ స్థాయిలో పనులకు అడుగు పడటం లేదు. మూడేళ్ల క్రితం మోడల్క్లాస్ స్థాయికి చేస్తామంటూ రైల్వేబోర్డు ఉన్నతాధికారులు ప్రకటించారు. ఇప్పుడు తిరుపతి రైల్వే వెలుపల గోడలకు మినహా మిగిలిన ప్రాంతాల్లో ఆ ఊసేలేదు. అదికూడా ఎప్పుడో 60 ఏళ్లక్రితం నిర్మించిన గోడలకే రంగులు అద్దడం విశేషం. దక్షిణం వైపు రూ.500 కోట్లతో మల్టీప్లెక్స్‌లు, సినిమా హాళ్లు, అన్నిరకాల కమర్షి యల్ కాంప్లెక్స్‌లు నిర్మించేస్తామంటూ రెండేళ్లుగా ఊరిస్తున్నారు. ఈ ప్రాజెక్ట్ పనులకు కూడా ఈసారి బడ్జెట్లో నిధులు చాలినన్ని మంజూరు చేస్తారా...? అనేది ప్రశ్నార్థకంగా నిలుస్తోంది. పాత రైళ్లనైనా పునరుద్ధరించేనా...? 15 ఏళ్లక్రితం వరకు ఉన్న మీటర్‌గేజ్ కాలంలో అనేక రైళ్లను ఆ తర్వాత బ్రాడ్‌గేజ్ వచ్చాక నిలిపేశారు. ప్రస్తుతం ఆయా మార్గాల్లో పెరిగిపోతున్న రద్దీని దష్టిలో ఉంచుకుని గడచిన మూడేళ్లుగా పాతరైళ్ల పునరుద్ధరణకు ఒత్తిడి పెరిగింది. ఆ దిశగానైనా ఈసారి బడ్జెట్లో ఆమోదం వచ్చి గ్రీన్ సిగ్నల్ పడాలని ఎదురు చూస్తున్నారు. పాత రైళ్లు, పెండింగ్ డిమాండ్లు ♦ తిరుపతి నుంచి రామేశ్వరం వరకు 15ఏళ్ల క్రితం నడుస్తున్న డైలీ ఎక్స్‌ప్రెస్ ♦ తిరుపతి నుంచి పాకాల–ధర్మవరం మీదుగా హైదరాబాద్‌కు రోజూ ఒకే సమయంలో నడుస్తున్న వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్ ♦ తిరుపతి నుంచి వారణాసికి 12 ఏళ్లక్రితం వరకు నడుస్తున్న ఎక్స్‌ప్రెస్ రైలు ♦ తిరుపతి నుంచి చెన్నైకి రాత్రివేళల్లో నడుస్తుండిన ఎక్స్‌ప్రెస్ రైలు ♦ ప్రస్తుతం కోయంబత్తూరు మార్గంలో నడుస్తున్న ఇంటర్‌సిటీని డైలీగా మార్పు చేయాల న్న నాలుగేళ్ల డిమాండ్‌కు మోక్షం కల్పించాలి. ♦ చిత్తూరు జాతీయ రహదారిలో ఎం.బండపల్లి వద్ద రైల్వే ఓవర్ బ్రిడ్జి నిర్మాణం పెండింగ్‌లో ఉంది. ♦ రేణిగుంట మీదుగా చెన్నైకి నడుస్తున్న దాదర్ ఎక్స్‌ప్రెస్ రైలుకు నగరిలో హాల్ట్ ఇవ్వాలన్న డిమాండ్‌కు 6 ఏళ్లుగా ఆచరణ రావడం లేదు. -
రైల్వే మంత్రిగారూ.. దయచేసి వినండి
సాక్షి ప్రతినిధి, కాకినాడ : రైల్వే బడ్జెట్ ప్రతిసారీ ఊరించి ఉస్సూరనిపిస్తోంది. కొత్త రైళ్ల ఊసే ఉండడం లేదు. కొత్త రైల్వే లైన్ల పరిస్థితి కూడా అంతే. జిల్లా ఎంపీల నుంచి ప్రతిపాదనలు వెళ్తున్నా రైల్వేశాఖ పట్టించుకోవడం లేదు. రైల్వే స్టేషన్లలో సమస్యల కూతలు వినిపిస్తున్నాయి. ఏటా కొత్త బడ్జెట్ ప్రవేశపెడుతున్నా స్టేషన్ల అభివృద్ధి ‘ఎక్కడ వేసిన గొంగళి అక్కడే’ అన్న చందంగా ఉంది. బడ్జెట్లో ప్రకటనలు తప్ప ఆచరణకు నోచుకోవడం లేదన్న విమర్శలూ లేకపోలేదు. ప్రధానమైన ప్రతిపాదనలివీ... కాకినాడ–కోటిపల్లి రైల్వేను లైన్ నర్సాపురం వరకు విస్తరించేందుకు మరో రూ. 600 కోట్లు రైల్వే శాఖ నుంచి రావల్సి ఉంది. అవి వస్తే తప్ప కోటిపల్లి నుంచి రైల్వే పనులు ప్రారంభంకావు. వీటి విషయంలో అమలాపురం ఎంపీ రవీంద్రబాబు రైల్వే అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. ఈ బడ్జెట్లో వస్తాయని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ♦ 30 ఏళ్ల క్రితం నివేదిక ఆధారంగా పిఠాపురం– కాకినాడ మెయిన్ లైన్ సాధ్యం కాదని రైల్వే అధికారులు నిర్ణయం తీసుకున్నారు. కానీ ప్రస్తుత పరిస్థితి మారింది. రద్దీ పెరిగింది. కొత్తగా కోటిపల్లి– నర్సాపురం లైన్ వేస్తుండటంతో ఈ మెయిన్ లైన్ ఎంతో ప్రయోజనకరంగా ఉంటుందని నేరుగా ప్రధానమంత్రి మోదీ దృష్టికి ఎంపీ తోట నర్సింహం తీసుకెళ్లారు. గత బడ్జెట్లో 200 కేటాయించినందున దీన్ని పూర్తి చేయాలని కోరారు. ఎంపీ తోట నర్సింహం పరువు నిలుపుతారో లేదో చూడాలి. ♦ రాజమహేంద్రవరం రైల్వే స్టేషన్లో 3,4 ప్లాట్‌ఫారమ్‌ల అభివృద్ధి కోసం గత బడ్జెట్లో రూ.29 కోట్లు మంజూరయ్యాయి. కానీ ఇంతవరకు ఆ నిధులు రాలేదు. పనులు మొదలు కాలేదు. ♦ కోటిపల్లి నుంచి నర్సాపురం వరకు లైన్ వేసేందుకు టెండర్ల ప్రక్రియ పూర్తయింది. ఇంకాస్త ప్రయోజనకరంగా, పూర్తి స్థాయిలో వినియోగంలోకి రావాలంటే నర్సాపురం నుంచి మచిలీపట్నం, రేపెల్లె, నిజాంపట్నం మీదుగా బాపట్ల వరకు కలిపే కోస్తా రైలు మార్గం అవుతుందని,ప్రయాణికులకు అందుబాటులో ఉంటుందన్న ప్రతిపాదన ఉంది. ♦ జిల్లాలో ఏ ఒక్క రైల్వే స్టేషన్లో ‘వైఫై’ సదుపాయం లేదు. ఇక నూతన రైల్వే లైన్ల ఊసే ఉండటం లేదు. కొత్తగా రైళ్లు రావడం లేదు. ఎంపీలు కోరడమే తప్ప ప్రభుత్వం స్పందించడం లేదు. వీటికి ఈ బడ్జెట్లో మోక్షం కలుగుతుందో లేదంటే ఎప్పటిలాగే ప్రతిపాదనలు పక్కన పెట్టేస్తుందో చూడాలి. గతంలో ప్రకటించిన నిధులు ఈసారైనా విడుదల చేస్తుందో లేదో చూడాలి. దేశ వ్యాప్తంగా ప్రకటించినట్టుగా మన రైల్వే స్టేషన్ల అభివృద్ధి, సౌకర్యాల కోసం ప్రత్యేకంగా నిధులు కేటాయిస్తుందో? గత బడ్జెట్ మాదిరిగా మొండి చేయి చూపుతుందో అన్నదానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకుంది. -
సర్కారు సగమిస్తేనే..!
ఎనిమిది దశాబ్దాల కలకు.. ‘బంగారు తెలంగాణ’లోనూ మోక్షం కలగడం లేదు. బోధన్–బీదర్ రైల్వే లైన్ పొడిగింపు అడుగు ముందుకు పడట్లేదు. 1938లో నిజాం హయాంలో ప్రతిపాదించిన ఈ రైల్వే మార్గం.. ఇప్పటికీ పట్టాలెక్కలేదు. 2014లో సర్వే పూర్తయినా నిధుల కేటాయింపు లేక ‘లైన్ క్లియర్’ కావట్లేదు. ఈ ‘మార్గం’ సుగమం కావాలంటే రాష్ట్ర ప్రభుత్వం రూ.వెయ్యి కోట్లు కేటాయిస్తే, కేంద్రం కూడా ఆ మేరకు నిధులు ఇవ్వనుంది. అయితే, ఈసారి ప్రవేశపెట్టనున్న బడ్జెట్లోనైనా రాష్ట్ర ప్రభుత్వం నిధులు కేటాయిస్తుందా..? దశాబ్దాల కల సాకారమవుతుందా? అన్న దానిపై ఆసక్తి నెలకొంది. బాన్సువాడ: అసంపూర్తిగా ఉన్న బోధన్ రైల్వే లైన్‌ను బీదర్ వరకు పొడిగిస్తే వెనుకబడిన ప్రాంతాలకు ఎంతో లబ్ధి చేకూరనుంది. ఆయా ప్రాంతాలకు రవాణా వసతులు పెరిగి అభివృద్ధి బాట పట్టే అవకాశముంది. అయితే, సర్కారు నిర్లక్ష్యం కారణంగా ఆయా ప్రాంతాలకు ఇప్పట్లో ‘రైలు బండి’ వచ్చే పరిస్థితి కనిపించట్లేదు. నిధుల కేటాయింపులో నిర్లక్ష్యం కారణంగా ఈ ప్రాజెక్టు కార్యరూపం దాల్చట్లేదు. 201లో రూ.1,029 కోట్ల వ్యయంతో రూపొందిన ఈ ప్రాజెక్టు.. జాప్యం కారణంగా ప్రస్తుత అంచనా వ్యయం రెట్టింపయింది. అయితే, మారిన నిబంధనల ప్రకారం ఈ రైల్వే లైన్ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంతో చేపట్టాల్సి ఉంది. ఈ లైన్ ప్రస్తుతం పట్టాలెక్కాలంటే సుమారు రూ.2 వేల కోట్ల వ్యయం కానుంది. ఇందులో రాష్ట్ర ప్రభుత్వం సగం కేటాయిస్తే, కేంద్రం సగం కేటాయించనుంది. అయితే, రాష్ట్ర ప్రభుత్వం నిధులు కేటాయించని కారణంగా ఈ ‘మార్గానికి’ మోక్షం కలగట్లేదు. ఎనిమిది దశాబ్దాల కల.. బోధన్–బీదర్ రైల్వే లైన్‌ను పొడిగించేందుకు 1938లోనే నిజాం సర్కార్ హయాంలో ప్రతిపాదనలు చేశారు. స్వాతంత్య్రం వచ్చిన తర్వాత, ప్రత్యేక రాష్ట్రం ఏర్పడినప్పటికీ ఈ ప్రాంత ప్రజల ఆకాంక్ష అయిన రైల్వే లైన్ నిర్మాణం కలగానే మారింది. బోధన్–బాన్సువాడ–బీదర్ ప్రాంత ప్రజల కోరిక మేరకు 2010లో అప్పటి రైల్వే మంత్రి మమతాబెనర్జీ ఈ మార్గానికి ‘లైన్ క్లీయర్’ చేశారు. దశాబ్దాల కల అయిన బోధన్–బీదర్ రైల్వే లైన్‌కు సర్వే కోసం పచ్చజెండా ఊపిన మమతా బెనర్జీ.. ఆదిలాబాద్–పటాన్చెరు మధ్య కొత్తగా మరో రైల్వే లైన్ కోసం సర్వే చేసేందుకు పచ్చ జెండా ఊపారు. దీంతో ఈ ప్రాంతం మీదుగా ఒకేసారి రెండు రైల్వే లైన్ల కోసం సర్వే చేయించేందుకు అనుమతి లభించడంతో అందరూ ఎంతో సంబర పడ్డారు. కానీ ఈ ప్రతిపాదనలు పట్టాలెక్కకుండానే కనుమరుగయ్యాయి. 2014లో సర్వే పూర్తి! 2010లో రైల్వే బడ్జెట్లో రెండు లైన్లకు లభించిన సర్వే అనుమతుల దృష్ట్యా సర్వే అయితే పూర్తి చేశారు. 138 కిలోమీటర్ల బోధన్–బీదర్ రైల్వే లైన్ కోసం 2011 ఏప్రిల్‌లో ప్రారంభమైన సర్వే 2014లో పూర్తయింది. బోధన్ నుంచి రుద్రూర్, వర్ని, నస్రుల్లాబాద్, బాన్సువాడ, పిట్లం మీదుగా నారాయణఖేడ్, బీదర్ వరకు వారు సర్వే నిర్వహించారు. సర్వే ప్రకారం మార్గమధ్యలో భారీ వంతెనలు లేవని తేలింది. కేవలం రూ.1,029 వ్యయంతో లైన్ వేయవచ్చని అధికారులు తేల్చారు. బాన్సువాడ–బోధన్ ప్రధాన రోడ్డుకు ఆవలి వైపు సుమారు 3 కిలోమీటర్ల వ్యత్యాసంలో సర్వే నిర్వహించి, హద్దు రాళ్లను పాతారు. ఈ మేరకు హద్దు రాళ్లు ఆయా పంట పొలాలు, అడవుల్లో ఇప్పటికీ ఉన్నాయి. దశల వారీగా నిర్వహించిన ఈ సర్వేలో మార్గ మధ్యలో వచ్చే నదులపై వంతెనలు, ఎత్తుపల్లాలు ఇతర అన్ని రకాల భౌగోళిక పరిస్థితులపై అంచనా వేసి రైల్వే శాఖ ఉన్నతాధికారులకు నివేదికను సమర్పించారు. నిధుల కేటాయింపుపై సందిగ్ధత 2014లో సర్వే పూర్తవడంతో ఏటా రైల్వే బడ్జెట్లో ఎంతో కొంత నిధులు మంజూరవుతాయని అంతా భావించారు. కానీ ఇప్పటివరకు మూడు బడ్జెట్లు పూర్తయినా పైసా కూడా మంజూరు కాలేదు. తెలంగాణలోని కొన్ని కొత్త మార్గాల్లో మెండుగా నిధులు కేటాయించిన కేంద్రం.. దశాబ్దాలుగా పెండింగ్‌లో ఉన్న బోధన్–బీదర్ రైల్వే లైన్‌కు మొండి చేయి చూపింది. అయితే, రాష్ట్ర ప్రభుత్వం స్పందిస్తేనే ఈ లైన్ పట్టాలెక్కే అవకాశముంది. ఈ మార్గంలో సర్వే పూర్తయినందున రాష్ట్రప్రభుత్వం 50 శాతం నిధులు కేటాయిస్తే, మరో 50శాతం కేంద్రం కేటాయించనుంది. సుమారు రూ.2వేల కోట్ల అంచనా వ్యయం కాగా, ఇందులో 50శాతం నిధులను రాష్ట్రం కేటాయిస్తేనే కేంద్రం తన వాటా 50 శాతం నిధులు మంజూరు చేయనుం దని అధికారులు చెబుతున్నారు. కానీ రాష్ట్ర ప్రభుత్వం నుంచి మాత్రం స్పందన కరువైంది. ఇప్పటివరకు ప్రవేశపెట్టిన బడ్జెట్లలో రూపా యి కూడా కేటాయించలేదు. త్వరలో ప్రవేశపెట్టనున్న బడ్జెట్లోనైనా నిధులు కేటాయిం చాలని ఈ ప్రాంత వాసులు కోరుతున్నారు. 50 శాతం నిధులిస్తే.. బోధన్–బీదర్ రైలు మార్గానికి సర్వే పూర్త యింది. రూ.2వేల కోట్ల తో ఈ ప్రాజెక్టు చేపట్టా ల్సి ఉంది. మారిన నిబంధనల ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం 50 శాతం నిధులు కేటాయిస్తే 50 శాతం నిధులను కేంద్రం మంజూరు చేస్తుంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంతోనే ప్రాజెక్టు ముందుకు సాగుతుంది. రాష్ట్ర ప్రభుత్వం నిధుల కేటాయింపుపైనే ప్రాజెక్టు భవితవ్యం ఆధారపడి ఉంది. – బీబీ పాటిల్, జహీరాబాద్ ఎంపీ ♦ బోధన్–బీదర్ రైల్వేలైన్ ప్రతిపాదించింది 1938 నిజాం హయాంలో ♦ రైల్వే లైన్ పొడవు 138 కిలో మీటర్లు (తెలంగాణలో 90 కి.మీ., మహారాష్ట్ర, కర్ణాటకలో 48 కి.మీ.) ♦ లబ్ధి పొందే జిల్లాలు నిజామాబాద్, కామారెడ్డి, సంగారెడ్డి, బీదర్ ♦ సర్వే పూర్తయినది 2014లో ♦ అప్పట్లో అంచనా వ్యయం రూ.1,029 కోట్లు ♦ ప్రస్తుత అంచనా రూ.2 వేల కోట్లు -
పూర్తి ఏసీతో డబుల్ డెకర్ రైళ్లు
ఇంతకుముందు ప్రవేశపెట్టిన డబుల్ డెకర్ రైళ్లకు ఆదరణ లభించకపోవడంతో.. భారతీయ రైల్వేలు సరికొత్త ప్రయోగం చేస్తున్నాయి. ఎక్కువ డిమాండ్ ఉండే రూట్లలో పూర్తి ఏసీ, వై-ఫై సదుపాయంతో కొత్తగా ఉత్కృష్ట్ డబుల్ డెకర్ ఏఎక్స్ యారీ (ఉదయ్) రైళ్లను నడిపించనున్నాయి. ఇవి జూలై నుంచిప్రారంభం అవుతాయని రైల్వేశాఖ తెలిపింది. ఒక్కో కోచ్‌లో వెనక్కి వాలగలిగేలా 120 సీట్లు ఉంటాయి. ప్రయాణసమయంలో ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకునేలా ఆటోమేటిక్ టీ/కాఫీ/ కూల్ డ్రింక్ వెండింగ్ మిషన్లు కూడా ప్రతి బోగీలో ఉంటాయి. ఢిల్లీ-లక్నో లాంటి బాగా డిమాండ్ ఉండే మార్గాల్లో ఇవి నడుస్తాయి. మామూలు రైళ్లలో ఉండే థర్డ్ ఏసీ కంటే వీటిలో చార్జి తక్కువగానే ఉంటుందని అంటున్నారు. ప్రతి బోగీలోనూ ఎల్సీడీ స్క్రీన్లు, వై-ఫై స్పీకర్ సిస్టం కూడా ఉంటాయి. మామూలు రైళ్ల కంటే సీట్ల సామర్థ్యం 40 శాతం ఎక్కువగా ఉండటంతో రద్దీని తట్టుకోడానికి ఇవి ఉపయోగపడతాయని రైల్వే అధికారులు చెబుతున్నారు. అయితే.. రాత్రిపూట ప్రయాణించే రైళ్లయినా వీటిలో బెర్తులు లేకపోవడం మాత్రం కొంత ఇబ్బందికరమే అంటున్నారు. దాంతో అదనపు సదుపాయాలతో ప్రయాణాన్ని సుఖవంతం చేస్తున్నామని అధికారులు తెలిపారు. రాత్రిపూట వెనక్కి వాలి, కాళ్లు చాపుకునేలా తగినంత లెగ్ స్పేస్ ఉంటుంది. గంటకు 110 కిలోమీటర్ల వేగంతో వెళ్లే ఈ రైళ్ల గురించి 2016-17 రైల్వే బడ్జెట్లో ప్రకటించారు. -
అమరావతికి లైన్ క్లియర్
రాజధానికి రైలు మార్గం రూ.2,680 కోట్ల నిధులు కేటాయింపు విజయవాడ – అమరావతి – గుంటూరు కలిపి రైల్వే లైను 106 కిలోమీటర్ల మేర నిర్మాణానికి గ్రీన్‌సిగ్నల్ నడికుడి – శ్రీకాళహస్తి పనులకు రూ.340 కోట్లు మంజూరు తెనాలి–గుంతకల్ డబ్లింగ్ పనులకు రూ.174 కోట్లు మచిలీపట్నం పోర్టు వరకు గుడివాడ రైల్వే లైన్ పొడిగింపు కాజీపేట–విజయవాడ మధ్య నాలుగో లైన్ సర్వేకు అనుమతి సాక్షి, విజయవాడ : రాష్ట్ర నూతన రాజధాని అమరావతి ప్రాంతానికి రైలు మార్గం ఖరారైంది. రాజధానిగా ప్రకటించినప్పటి నుంచి ప్రభుత్వం చేసిన వినతులకు ఎట్టకేలకు కేంద్ర రైల్వే శాఖ సానుకూలంగా స్పందించింది. ఈ క్రమంలో రైల్వే బడ్జెట్లో గుంటూరు, కృష్ణా జిల్లాలకు పలు ప్రాజెక్టులకు సంబంధించి నిధులు కేటాయించారు. విజయవాడ, గుంటూరు రైల్వే డివిజన్ల పరిధిలో ఇప్పటికే కొన్ని పనులు కొనసాగుతున్నాయి. వాటికి నిధుల కేటాయింపుతో పాటు, కొత్త ప్రాజెక్టులు మంజూరు చేశారు. ప్రధానంగా విజయవాడ – అమరావతి – గుంటూరులను కలుపుతూ 106 కిలోమీటర్ల మేర రైల్వే లైను నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. స్వల్పంగా పెరిగిన కేటాయింపులు... కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ బుధవారం సాధారణ బడ్జెట్‌తో పాటు రైల్వే బడ్జెట్‌ను పార్లమెంటులో ప్రవేశపెట్టారు. గుంటూరు, కృష్ణా జిల్లాల పార్లమెంటు సభ్యులు పలు ప్రతిపాదనలను రైల్వే బోర్డుకు, కేంద్ర మంత్రికి అందజేశారు. ఈ క్రమంలో వాటిలో కొంతమేర కేటాయింపులు జరిగాయి. గత ఏడాది కంటే కేటాయింపుల సంఖ్య కొంత పెరిగింది. గత రైల్వే బడ్జెట్లో రాష్ట్రానికి రూ.2,195 కోట్ల విలువైన ప్రాజెక్టులు కేటాయించగా, ఈసారి రూ.3,406 కోట్ల నిధులు కేటాయించారు. రాజధానికి రైల్వే లైన్... రైల్వే బడ్జెట్లో ప్రధానంగా రాజధాని ప్రాంతమైన అమరావతికి రైలు మంజూరైంది. సీఎం చంద్రబాబు సహా రెండు జిల్లాల ఎంపీలు రైలు మార్గం కోసం అనేక పర్యాయాలు వినతి పత్రాలు ప్రభుత్వానికి అందజేశారు. విజయవాడలో నిర్మించనున్న మెట్రో రైలు మార్గాన్ని రాజధాని వరకు కొనసాగించే విషయంపైనా తర్జనభర్జనలు, పరిశీలన జరిగింది. ఈ పరిణామాల క్రమంలో రైల్వే బడ్జెట్లో కొత్త రైలు మార్గానికి నిధులు మంజూరయ్యాయి. విజయవాడ నుంచి రాజధాని ప్రాంతమైన అమరావతి (తుళ్లూరు), అక్కడి నుంచి గుంటూరుకు సర్క్యూట్ రైలు తరహాలో రాకపోకలు నిర్వహించడానికి వీలుగా రైల్వే లైను నిర్మించనున్నారు. మొత్తం 106 కిలోమీటర్ల నిర్మించే లైనుకు రూ.2,680 కోట్లు నిర్మాణ వ్యయంగా నిర్ణయించి కేటాయింపులు జరిపారు. ప్రాజెక్టు ఖరారు చేసి బడ్జెట్లో కేటాయింపులు జరగడంతో మరో రెండు నెలల కాలవ్యవధిలో టెండర్ల దశ దాటి పనులు మొదలయ్యే అవకాశం ఉంటుంది. నడికుడి లైనుకు రూ.340 కోట్లు నిర్మాణ పనులు ప్రారంభమైన నడికుడి– శ్రీకాళహస్తి రైల్వేలైనుకు 2017–18 సంవత్సరానికి రూ.340 కోట్లు కేటాయించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంతో రూ.2,330 కోట్ల అంచనా వ్యయంతో ప్రారంభమైన ఈ ప్రాజెక్టుకు గత రెండు బడ్జెట్లు కలిపి రూ.290 కోట్లు కేటాయించారు. దీనిలో భాగంగా గుంటూరు జిల్లాలో 42 కిలోమీటర్ల మేర నిర్మించనున్న రైలు మార్గానికి సంబంధించి ఇద్దరు కాంట్రాక్టర్లకు రెండు వర్కులుగా విభజించి కేటాయించారు. అయితే స్థానిక అధికార పార్టీ ప్రజాప్రతినిధి మామూళ్ళ వేధింపులతో ప్రాజెక్టు పనులు పూర్తిగా నిలిచిపోయాయి. ఈ వ్యవహారం కేంద్ర రైల్వే శాఖ దృష్టికి వెళ్ళింది. గత నెల రోజులుగా పనులు నిలిచిపోయిన క్రమంలో బడ్జెట్లో కేటాయింపులు జరగడం ప్రాధాన్యత సంతరించుకుంది. కేటాయింపులు ఇవే... విజయవాడ – గుడివాడ లైనును మచిలీపట్నం పోర్టు వరకు పొడిగించాలని నిర్ణయించి దానికి రూ.130 కోట్లు కేటాయించారు. దీనివల్ల మచిలీపట్నం పోర్టు నుంచి సరకు రవాణా సులభం అవుతుంది. పది కిలోమీటర్ల మేర నిర్మించే ఈ రైలు మార్గాలు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా చేస్తాయి. ► కాజీపేట–విజయవాడ మధ్య మూడో లైను ఇప్పటికే మూడొంతులు పూర్తయింది. దీనికి రూ.100 కోట్లు కేటాయించారు. అంతేగాక కాజీపేట–విజయవాడ మధ్య నాలుగో లైను ఏర్పాటుకు సర్వే చేయించేందుకు రైల్వేశాఖ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ► విజయవాడ – భీమవరం – నిడదవోలు మధ్య 221 కిలోమీటర్ల డబ్లింగ్, ఎలక్ట్రిఫికేషన్‌కు రూ.122 కోట్లు కేటాయించారు. ► విజయవాడ – గూడూరు మధ్య 287.67 కిలోమీటర్ల మేర మూడో ట్రాక్ నిర్మాణానికి సంబంధించి రూ.100 కోట్లు కేటాయింపు ► కొండపల్లి – కిరండోల్ మధ్య రైల్వే లైనుకు అనుమతి లభించింది. ► కోటిపల్లి– నర్సాపురం– మచిలీపట్నం మార్గానికి రూ.430 కోట్లు కేటాయించారు. ► గుంటూరు– తెనాలి రైల్వే లైన్ మధ్య 24.38 కిలోమీటర్లు డబ్లింగ్, ఎలక్ట్రిఫికేషన్ పనులకు రూ.36 కోట్లు కేటాయింపు ► గుంటూరు – గుంతకల్లు మధ్య 463 కిలోమీటర్ల మేర డబ్లింగ్ పనులకు రూ.124 కోట్ల కేటాయింపు ► రాయనపాడు రైల్వే కోచ్ మెయింటెనెన్స్ పనులకు రూ.8.7 కోట్లు కేటాయింపు ► గుంటూరు రైల్వే డివిజన్ పరిధిలో 72 రైల్వే స్టేషన్లలో సుమారు రూ.1.2 కోట్ల నిధులతో ఎల్ఈడీ లైట్ల ఏర్పాటు ► రూ.79 కోట్లతో జగ్గయ్యపేట, మేళ్ళచెరువు, జాన్ఫహాడ్ల మధ్య 24 కిలోమీటర్ల రైల్వే లైను నిర్మాణానికి అనుమతి -
అమరావతి రైలు మార్గానికి 2,680 కోట్లు
తాజా రైల్వే బడ్జెట్లో కేటాయింపు సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ నూతన రాజధాని అమరావతిని అనుసంధానిస్తూ నూతన రైల్వే మార్గం నిర్మాణానికి తాజా రైల్వే బడ్జెట్లో రూ.2,680 కోట్లు మంజూరయ్యాయి. ఆ మేరకు విజయవాడ–అమరావతి–గుంటూరులను కలుపుతూ 106 కిలోమీటర్ల మేరకు రైల్వే ట్రాక్ నిర్మించనున్నారు. 2016–17 బడ్జెట్లో ఈ రైల్వే లైన్‌కు సర్వే మంజూరవగా.. ఇటీవలే రైల్ వికాస్ నిగమ్ లిమిటెడ్ (ఆర్వీఎన్ఎల్) సర్వే పూర్తి చేసి రైల్వే బోర్డుకు నివేదిక అందించింది. ఈ నేపథ్యంలో తాజా బడ్జెట్లో ఈ మార్గానికి నిధులు కేటాయించడంతో నాలుగేళ్లలో రైల్వే లైన్ నిర్మాణం పూర్తి కానుంది. ఏపీ ప్రభుత్వం రైల్వేశాఖతో ఇటీవలే కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం వివిధ ప్రాజెక్టులకు కేటాయింపులు జరిగాయి. ఆ మేరకు నడికుడి–శ్రీకాళహస్తి, కడప–బెంగళూరు, కోటిపల్లి–నర్సాపురం, అమరావతికి రైల్వే కనెక్టివిటీ... ఈ నాలుగు ప్రాజెక్టులకు నిధులు కేటాయించారు. -
పట్టాలు పడుతున్నాయి
రాష్ట్ర పరిధిలోని రైల్వే లైన్లకు భారీగా నిధులు • మొత్తంగా ప్రాజెక్టులకు రూ.1,729 కోట్లు • సీఎం కలల ప్రాజెక్టు కొత్తపల్లి– మనోహరాబాద్‌కి రూ.350 కోట్లు • బల్లార్షా–కాజీపేట–విజయవాడ మూడో లైన్‌కు రూ.260 కోట్లు సాక్షి, హైదరాబాద్: ఈ సారి రైల్వే బడ్జెట్లో రాష్ట్రానికి తగినంత ప్రాధాన్యం లభించింది. పలు పెండింగ్ ప్రాజెక్టులు సహా కొత్త రైల్వే మార్గాలకు సైతం ఆశించిన స్థాయిలో నిధులు కేటాయించారు. ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు కలల ప్రాజెక్టు అయిన కొత్తపల్లి–మనోహరాబాద్ (కరీంనగర్–హైదరాబాద్) ప్రాజెక్టుకు రూ.350 కోట్లు ఇవ్వడం గమనార్హం. మొత్తంగా దక్షిణ మధ్య రైల్వేకు రూ.5,135 కోట్లను కేటాయించగా.. అందులో తెలంగాణ రాష్ట్ర పరిధిలోని ప్రాజెక్టులకు రూ.1,729 కోట్లు ఇచ్చారు. మొత్తంగా రైల్వే బడ్జెట్లో ఒక్క కొత్త రైలును ప్రకటించకున్నా.. కొత్త లైన్ల ఏర్పాటు, ఉన్న లైన్లకు అదనంగా రెండు, మూడు లైన్ల నిర్మాణానికి భారీగా నిధులు కేటాయించడం గమనార్హం. కొత్త పంథాలో.. దాదాపు తొమ్మిది దశాబ్దాల ఆనవాయితీని పక్కనపెడుతూ సాధారణ బడ్జెట్లోనే రైల్వే బడ్జెట్‌ను కలిపేసిన కేంద్రం.. కేటాయింపుల్లోనూ కొత్త పంథా చూపింది. అయితే బడ్జెట్లో రైల్వేకు సంబంధించి ఏయే ప్రాజెక్టులకు ఎన్ని నిధులిచ్చారనే పూర్తి వివరాలను పేర్కొనలేదు. పింక్బుక్గా వ్యవహరించే ఈ పద్దుల వివరాలను శుక్రవారం పార్లమెంటుకు సమర్పించింది. దీంతో దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ వినోద్‌కుమార్ యాదవ్ ఆ వివరాలను శుక్రవారం సాయంత్రం వెల్లడించారు. ఆయన వెల్లడించిన ప్రకారం.. దక్షిణ మధ్య రైల్వేకు ఈసారి మొత్తంగా రూ.5,135 కోట్లను కేటాయించారు. ఇందులో తెలంగాణ పరిధిలోని ప్రాజెక్టులకు రూ.1,729 కోట్లు కేటాయించారు. ముఖ్యంగా కొత్త లైన్లు, రెండు, మూడో లైన్ నిర్మాణ పనులకు ఎక్కువ నిధులు ఇచ్చారు. బల్లార్షా–కాజీపేట–విజయవాడ మూడో లైన్ నిర్మాణానికి రూ.260 కోట్లు, మునీరాబాద్–మహబూబ్‌నగర్ లైన్‌కు రూ.300 కోట్లు, అక్కన్నపేట–మెదక్‌కు రూ.160 కోట్లు కేటాయించారు. దీంతో ఇంతకాలం నత్తనడకన జరుగుతున్న ఈ పనుల్లో వేగం పెరగబోతోంది. సీఎం కలల ప్రాజెక్టుకు రూ.350 కోట్లు తెలంగాణలో కీలకమైన కరీంనగర్, సిద్దిపేట పట్టణాలకు రాజధానితో రైల్వే అనుసంధానం లేదు. సిద్దిపేటకు అసలు రైల్వే మార్గమే లేదు. దీంతో సికింద్రాబాద్ నుంచి సిద్దిపేట మీదుగా కరీంనగర్‌కు రైల్వే లైన్ నిర్మించాలంటూ కేసీఆర్ రెండు దశాబ్దాలుగా డిమాండ్ చేస్తున్నారు. దాదాపు 13 ఏళ్ల క్రితం కేసీఆర్ కేంద్రమంత్రిగా ఉన్న సమయంలో ఈ ప్రాజెక్టుకు రైల్వే బడ్జెట్లో చోటు దక్కినా.. ముందుకు సాగలేదు. ఇటీవల సీఎం కేసీఆర్ గట్టిగా ప్రయత్నించడంతో కదలిక వచ్చింది. గతేడాది ప్రధాని మోదీ స్వయంగా ఈ రైల్వే లైన్ పనులకు శంకుస్థాపన చేశారు. తాజా బడ్జెట్లో ఏకంగా రూ.350 కోట్లు కేటాయించారు. హైదరాబాద్ శివార్లలోని మనోహరాబాద్ నుంచి ప్రారంభమయ్యే ఈ కొత్త లైన్.. గజ్వేల్, సిద్ధిపేట, సిరిసిల్లల మీదుగా కరీంనగర్ శివారులోని కొత్తపల్లి వరకు 148.9 కిలోమీటర్లు కొనసాగుతుంది. బల్లార్షా–కాజీపేట–విజయవాడ నాలుగో లైన్ అత్యంత రద్దీ మార్గంగా పేరున్న బల్లార్షా–కాజీపేట–విజయవాడ మార్గంలో ప్రస్తుతం మూడో లైన్ నిర్మాణం జరుగుతోంది. అది అందుబాటులోకి రావటానికి మరో రెండేళ్లు పట్టనుంది. అయితే ఆ మార్గంలో నాలుగో లైన్ కూడా అవసరమని భావించిన రైల్వే దానికి సర్వే పనులు చేపట్టనుంది. ఇక ఈ ఏడాదితో పూర్తికానున్న పెద్దపల్లి– కరీంనగర్–నిజామాబాద్ (178 కి.మీ.) లైనుకు రూ.25 కోట్లు కేటాయించారు. ఈ ఏడాదిలోనే ఈ మార్గంలో పూర్తి స్థాయిలో రైళ్లు పరుగెత్తనున్నాయి. టీకాస్‌కు మరిన్ని నిధులు రైళ్లు ఢీ కొనకుండా అభివృద్ధి చేస్తున్న ‘ట్రెయిన్ కొలిజన్ అవాయిడెన్స్ సిస్టం (టీకాస్)’ను మరిన్ని చోట్లకు విస్తరించనున్నారు. దీనిని ఇప్పటికే సికింద్రాబాద్– వాడి–వికారాబాద్–బీదర్ సెక్షన్లలో వినియోగి స్తుండగా.. తాజాగా సికింద్రాబాద్– గద్వాల–డోన్– గుంతకల్ మార్గానికి విస్తరించారు. ఇందుకు రూ.120 కోట్లు కేటాయించారు. కొత్త మార్గం ఆర్మూర్–ఆదిలాబాద్ వయా నిర్మల్ (220 కి.మీ). అంచనా వ్యయం రూ.2,800 కోట్లు. (రాష్ట్ర ప్రభుత్వ భాగస్వామ్యంతో ప్రాజెక్టు) రైళ్ల క్రాసింగ్స్ కోసం కొత్త స్టేషన్ల నిర్మాణం: (అంచనా రూ.15 కోట్లు) – వనపర్తి రోడ్డు–కౌకుంట్ల; మానవపాడు–అలంపూర్ రోడ్డు; ఇటిక్యాల–మానవపాడు కొత్త లైన్ల కోసం సర్వే ⇔ బొల్లారం–ముద్ఖేడ్ డబ్లింగ్ (235 కి.మీ) ⇔ కాజీపేట–బల్లార్షా నాలుగో లైన్(234 కి.మీ) ⇔ కాజీపేట–విజయవాడ నాలుగో లైన్ (219 కి.మీ.) ⇔ మంచిర్యాల–గడ్చిరోలి కొత్త లైన్ (115 కి.మీ.) భద్రతా పరమైన పనులు ⇔ 12 రైల్వే ఓవర్ బ్రిడ్జిలు (ఆర్ఓబీలు), 7 రైల్వే అండర్ బ్రిడ్జిలు (ఆర్యూ బీ). అంచనా వ్యయం రూ.941 కోట్లు. రైల్వే వాటా రూ.383 కోట్లు, రాష్ట్ర ప్రభుత్వ వాటా రూ.558 కోట్లు ⇔ 9 కొత్త వంతెనలకు రూ.31 కోట్లు ⇔ లెవల్ క్రాసింగ్స్, ఇంటర్‌లాకింగ్ పనులకు రూ.69.5 కోట్లు -
ఇవీ దక్షిణ మధ్య రైల్వే కేటాయింపులు
-
ఇవీ దక్షిణ మధ్య రైల్వే కేటాయింపులు
న్యూఢిల్లీ : తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లోని రైల్వే ప్రాజెక్టులకు బడ్జెట్లో నిధులు కేటాయించారు. బుధవారం ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ప్రవేశపెట్టిన సాధారణ బడ్జెట్లో దక్షిణ మధ్య రైల్వేకు రూ.5,135 కోట్లు ప్రకటించారు. శుక్రవారం సభకు సమర్పించిన అనంతరం పూర్తి వివరాలను రైల్వే శాఖ వెల్లడించింది. గత బడ్జెట్లో తెలంగాణకు కేవలం రూ.601 కోట్లు మాత్రమే కేటాయించగా ఈసారి రూ.1,729 కోట్లు, ఆంధ్రప్రదేశ్‌కు గత బడ్జెట్లో రూ.2,195 కోట్లు కేటాయించగా ఈసారి రూ.3,406 కోట్లు కేటాయించటం విశేషం. దక్షిణ మధ్య రైల్వేలో పలు ప్రాజెక్టులకు బడ్జెట్లో మంజూరైన నిధులు... -నడికుడి- శ్రీకాళహస్తి మధ్య రైల్వేలైన్‌కు రూ.340కోట్లు -కడప-బెంగళూరు మధ్య రైల్వేలైన్‌కు రూ.240కోట్లు -కాకినాడ-పిఠాపురం మధ్య రైల్వేలైన్‌కు రూ.150కోట్లు -గుంటూరు-గుంతకల్ మధ్య రైల్వే డబ్లింగ్ పనులకు రూ.124కోట్లు -కోటిపల్లి-నర్సాపూర్ రైల్వేలైన్‌కు రూ.430 కోట్లు -ఓబులవారిపల్లె-కృష్ణపట్నం పోర్టు రైల్వేలైన్‌కు రూ.100 కోట్లు -గుంటూరు-తెనాలి రైల్వేలైన్ డబ్లింగ్ పనులకు రూ.50కోట్లు -తిరుపతిలో విశ్రాంతి గది నిర్మాణానికి రూ.7 కోట్లు -గూడూరులో ఫుట్ ఓవర్ బ్రిడ్జికి రూ.2.7 కోట్లు -విజయవాడ-గుడివాడ లైన్ మచిలీపట్నం పోర్టు వరకు పొడిగింపునకు రూ.130 కోట్లు -తిరుచానూరు రైల్వేస్టేషన్ అభివృద్ధికి రూ.6 కోట్లు -కాజీపేట- విజయవాడ మూడో లైన్‌కు రూ.100 కోట్లు -కాజీపేట-విజయవాడ మధ్య నాలుగో లైన్ సర్వేకు అనుమతి - కొండపల్లి-కిరండోల్ మధ్య రైల్వే లైన్ సర్వేకు అనుమతి - మంత్రాలయం-కర్నూలు మధ్య రైల్వేలైన్ సర్వేకు అనుమతి - హిందూపురం- చిత్రదుర్గం మధ్య రైల్వేలైన్ సర్వేకు అనుమతి -మంత్రాలయం-కర్నూలు మధ్య రైల్వే లైన్ సర్వేకు అనుమతి - ఏపీ, తెలంగాణలో 4 రైల్వే క్రాసింగ్లకు రూ.19 కోట్లు -మునిరాబాద్- మహబూబ్ నగర్ రైల్వే లైన్‌కు రూ. 300 కోట్లు -మనోహరాబాద్- కొత్తపల్లి రైల్వే లైన్‌కు రూ.350 కోట్లు -అక్కన్న పేట-మెదక్ రైల్వే లైన్‌కు రూ. 196 కోట్లు -భద్రాచలం-సత్తుపల్లి రైల్వే లైన్‌కు రూ. 300 కోట్లు -కరీంనగర్-పెద్దపల్లి రైల్వే లైన్‌కు రూ.120 కోట్లు