రైల్వే శాఖ మంత్రి సురేష్ ప్రభు ప్రవేశపెట్టిన రైల్వేబడ్జెట్‌లో రాష్ట్రానికి ఎలాంటి ప్రయోజనాలు అందించలేదని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య అసంతృప్తి వ్యక్తం చేశారు. ‘అంతర్జాతీయ మార్కెట్‌లో ఇంధన ధరలు తగ్గిన నేపథ్యంలో ప్రయాణ ఛార్జీలు తగ్గుతాయని సామాన్యులు ఆశించారు. ఇంధన ధరలు తగ్గినా రైల్వేశాఖ నష్టాల్లో ఉందని సాకులు చెబుతూ ప్రయాణ ఛార్జీలు ఏమాత్రం తగ్గించకపోవడం శోచనీయం. ఇంధన ధరల తగ్గింపు కారణంగా రైల్వే శాఖ దాదాపు 16వేల కోట్ల రూపాయలకు పైగా ఆదా చేస్తోంది. ఈ మొత్తాన్ని ప్రజలకు అందజేసేందుకు కేంద్రం ఎలాంటి ప్రయత్నం చేయకపోవడం ఎంతమాత్రం సరికాదు.’ అని తెలిపారు.
ఇక గత ఏడాది డి.వి.సదానంద గౌడ ప్రవేశపెట్టిన రైల్వే బడ్జెట్‌లో రాష్ట్రానికి 8 రైళ్లను ప్రకటించారని, వీటిలో ఏ ఒక్కటి ఇప్పటికీ అందుబాటులోకి రాలేదని విమర్శించారు. ఇక ఈ బడ్జెట్‌లో సైతం ఈ రైళ్లకు సంబంధించి ప్రస్తావించకపోవడం కన్నడిగులను తీవ్ర నిరాశకు గురిచేసిందని అన్నారు. రైల్వే ప్రాజెక్టుల నిర్మాణానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం 50శాతం నిర్మాణ వ్యయాన్ని భరించాలన్న కేంద్ర ప్రభుత్వ నిర్ణయంలో మార్పులు చేయాల్సిందిగా ఇప్పటికే తాను కోరానని తెలిపారు. రాష్ట్రంలో ప్రాజెక్టుల నిర్మాణానికి అవసరమైన భూములను కేటాయించడంతో పాటు నిర్మాణ వ్యయంలో 50శాతం భరించడం రాష్ట్రానికి భారంగా పరిణమిస్తుందనే విషయాన్ని కేంద్రానికి వివరించానని చెప్పారు.
ప్రయోజనం శూన్యం
Published Fri, Feb 27 2015 1:11 AM | Last Updated on Sat, Sep 2 2017 9:58 PM
Advertisement