జోన్ ఊసే లేదు
రైల్వే లైన్లకు అరకొర నిధులు
కాజీపేట-విజయవాడ మధ్య మూడో లైన్
రైళ్లలో మహిళల భద్రతకు 182
సరకు చార్జీల పెంపుపై అసంతృప్తి
విజయవాడ : నవ్యాంధ్రప్రదేశ్ నూతన రాజధాని విజయవాడకు రైల్వే బడ్జెట్‌లో సముచిత స్థానం లభిస్తుందని భావించిన జిల్లావాసులకు నిరాశే మిగిలింది. కొత్త జోన్ కావాలనే ఈ ప్రాంత ప్రజల డిమాండ్ ఈసారీ నెరవేరలేదు. రాబోయే రోజుల్లో రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుంచి నూతన రాజధానికి ప్రయాణికులు రాకపోకలు సాగించే అవకాశం ఉన్నందున ఈ ప్రాంతంలో కొత్త రైళ్లు, పెండింగ్‌లో ఉన్న లైన్లకు నిధులు మంజూరు చేయాలంటూ వచ్చిన ప్రతిపాదనలను రైల్వేమంత్రి సురేష్ ప్రభు పట్టించుకున్న దాఖలాలు లేవు. విజయవాడ రైల్వేస్టేషన్‌పై ఒత్తిడి పెరుగుతున్న నేపథ్యంలో ఇక్కడ శాటిలైట్ స్టేషన్ ఏర్పాటు, రైళ్లు నిలుపుదల చేసేందుకు మార్షలింగ్ యార్డును నిర్మించాలనే ప్రతిపాదన లు కాగితాలకే పరిమితం చేశారు. బడ్జెట్‌లో నిధుల కేటాయింపులు జరగలేదు. విజయవాడ రైల్వేస్టేషన్‌లో రూట్ రిలే ఇంటర్‌లాకింగ్ సిస్టమ్ (ఆర్‌ఆర్‌ఐ) పనులు సాంకేతిక కారణాల వల్ల నిలిచిపోయాయి. ఈ పనులు పూర్తయితే స్టేషన్‌లోని పది ప్లాట్‌ఫారాల్లోనూ 24 బోగీలు ఉన్న రైళ్లను నిలపవచ్చు. దీనికి కావాల్సిన నిధుల గురించి ప్రస్తావించలేదు. దక్షిణ మధ్య రైల్వే జోన్‌కు కేటాయించిన నిధుల్లో ఆర్‌ఆర్‌ఐకి నిధులు కేటాయిస్తారేమో చూడాలని అధికారులు చెబుతున్నారు.
కాజీపేట-విజయవాడ మధ్య మూడో లైనుకు రైల్వేమంత్రి సురేష్ ప్రభు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఇది ఒక్కటే ఈ ప్రాంత ప్రజలకు ఊరట కలిగించే అంశం. దీనికి సుమారు రూ.400 కోట్లు ఖర్చవుతుందని అధికారులు భావిస్తుండగా, ఈ ఏడాది బడ్జెట్‌లో రూ.100 కోట్లు కేటాయించినట్లు రైల్వే వర్గాలు చెబుతున్నాయి.
విజయవాడ - గుడివాడ - మచిలీపట్నం - భీమవరం లైను డబ్లింగ్, ఎలక్ట్రిఫికేషన్‌కు సుమారు రూ.1,100 కోట్ల వరకు ఖర్చవుతుంది. నిధుల కొరత కారణంగా ఈ పనులు నత్తనడకన సాగుతున్నాయి. ఈ బడ్జెట్‌లో కేవలం రూ.100 కోట్లు కేటాయించడంతో ఈ ఏడాది పనులు వేగవంతంగా జరిగే అవకాశం కనిపించడంలేదు. జగ్గయ్యపేట-విష్ణుపురం లైనుకు రూ.100 కోట్లు కేటాయించారు. ఈ లైను పనులు మలిదశకు చేరడంతో ఈ నిధులతో పనులు వేగవంతం చేసే అవకాశం ఉంది.
ఇకనుంచి రైల్వేస్టేషన్లలో తక్కువ ధరకే మంచినీరు అందిస్తామని కేంద్రమంత్రి ప్రకటించారు. కృష్ణా కెనాల్ వద్ద రైల్‌నీర్ ప్రాజెక్టుకు గత ఏడాది గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారు. రూ.10 కోట్లు కేటాయిస్తే ఈ ప్రాజెక్టు పూర్తవుతుంది. ఐఆర్‌సీటీసీ అధికారులు బీవోటీ పద్ధతిలో దీన్ని నిర్మించాలని భావిస్తున్నారు. తక్కువ ధరకు స్వచ్ఛమైన నీరు అందించాలంటే ఈ ప్రాజెక్టును ఈ ఏడాది పూర్తి చేయాల్సి ఉంటుంది.
రైల్వే చార్జీలు పెంచకపోవడం ప్రయాణికులకు ఊరట కలిగించే అంశం. దీనిపై వారినుంచి హర్షం వ్యక్తమవుతోంది. బస్సు చార్జీలు చుక్కలనంటుతున్న నేపథ్యంలో పేద, మధ్యతరగతి ప్రయాణికులు రైళ్లనే ఆశ్రయిస్తున్నారు. చార్జీలు పెంచకపోవడంతో పాటు కొన్ని ముఖ్యమైన రైళ్లలో జనరల్ బోగీలు పెంచడం ప్రజలకు ఊరటనిచ్చే అంశం. సరకు రవాణా చార్జీలను దూరాన్ని బట్టి పదిశాతం పెంచడం పరోక్షంగా ప్రయాణికులపైనే భారం పడుతుందని చెబుతున్నారు.
రైళ్లలో ప్రయాణించే మహిళలకు భద్రత కల్పించేందుకు టోల్‌ఫ్రీ నంబర్ 182 ఏర్పాటు చేయడంపై మహిళా సంఘాలు హర్షం వ్యక్తం చేస్తున్నప్పటికీ.. ఇప్పటికే ఆర్‌పీఎఫ్‌లో తగినంత మంది పోలీసు సిబ్బంది లేరని, దీనిని ఎలా అమలు చేస్తారని ప్రశ్నిస్తున్నారు.
మరోసారీ వెయిటింగే
Published Fri, Feb 27 2015 1:54 AM | Last Updated on Sat, Sep 2 2017 9:58 PM
Advertisement
Advertisement