రిజర్వేషన్ ప్రయాణికులకు 3 రైళ్లు | 3 Trains to the reservation passengers | Sakshi
Sakshi News home page

రిజర్వేషన్ ప్రయాణికులకు 3 రైళ్లు

Published Fri, Feb 26 2016 4:35 AM | Last Updated on Sun, Sep 3 2017 6:25 PM

రిజర్వేషన్ ప్రయాణికులకు 3 రైళ్లు

రిజర్వేషన్ ప్రయాణికులకు 3 రైళ్లు

♦ హమ్‌సఫర్, తేజస్, ఉదయ్‌గా నామకరణం
♦ అన్‌రిజర్వ్‌డ్ ప్రయాణికుల కోసం అంత్యోదయ ఎక్స్‌ప్రెస్
♦ దూరప్రాంత రైళ్లలో 2-4 దీన్ దయాళ్ అన్‌రిజర్వ్‌డ్ బోగీలు
♦ రైల్వే బడ్జెట్ ప్రసంగంలో సురేశ్ ప్రభు ప్రకటన
 
 న్యూఢిల్లీ
 రిజర్వేషన్ ప్రయాణికుల సౌకర్యం, సంతృప్తికి పెద్దపీట వేస్తూ రైల్వే మంత్రి సురేశ్ ప్రభు తన బడ్జెట్ ప్రసంగంలో మూడు రైళ్లను ప్రకటించారు. హమ్‌సఫర్, తేజస్, ఉదయ్ పేరిట ఈ సర్వీసులను నడపనున్నట్లు తెలిపారు. ‘‘ప్రతి వినియోగదారుడు మా బ్రాండ్ అంబాసిడర్. మా (రైల్వే) ఉనికికి కారణం వారే. అందుకే అతను/ఆమె ప్రయాణించే ప్రతిసారీ వారి ప్రయాణ సంతృప్తి పెరగాలి. రైలు ప్రయాణాన్ని సంతోషించదగ్గదిగా చేసేందుకు ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలను కొనసాగిస్తూనే ఉంటాం. ఏటా రైళ్లలో ప్రయాణించే 700 కోట్ల మంది ప్రయాణికుల్లో ప్రతిఒక్కరి సంతృప్తి కోసం నిరంతరం శ్రమిస్తాం’’ అని సురేశ్ ప్రభు చెప్పారు.

 రిజర్వేషన్ ప్రయాణికుల కోసం...
► హమ్‌సఫర్: పూర్తిగా థర్డ్ ఏసీ సర్వీసు. కోరుకున్న ప్రయాణికులకు భోజన సదుపాయం.
► తేజస్: దేశ రైలు ప్రయాణ భవిష్యత్తును చాటిచెప్పేలా గంటకు 130 కిలోమీటర్లు, అంతకన్నా ఎక్కవ వేగంతో ప్రయాణం. రైల్లో వినోదం, స్థానిక రుచులు, వైఫై సేవలు.
► ఉదయ్: అత్యంత రద్దీ మార్గాల్లో రాత్రిపూట నడిచే ఉత్కృష్ట్ డబుల్ డెకర్ ఎయిర్ కండిషన్డ్ యాత్రీ (ఉదయ్) ఎక్స్‌ప్రెస్. ప్రయాణికుల తరలింపు సామర్థ్యాన్ని 40% వరకు పెంచగల సామర్థ్యం దీనికి ఉంది. టారిఫ్, టారిఫ్‌యేతర చర్యల ద్వారా హమ్‌సఫర్, తేజస్‌ల ఖర్చును తిరిగి రాబడతారు.

 అన్‌రిజర్వ్‌డ్ ప్రయాణికుల కోసం...
► సామాన్యుల కోసం దూరప్రాంతాలకు పూర్తిగా అన్‌రిజర్వ్‌డ్ బోగీలతో అంత్యోదయ సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్. రద్దీ మార్గాల్లో అందుబాటులో సేవలు.
► ఎక్కువ మంది అన్‌రిజర్వ్‌డ్ ప్రయాణికులకు చోటు కల్పించేందుకు వీలుగా దూరప్రాంత రైళ్లలో రెండు నుంచి నాలుగు వరకు దీన్ దయాళ్ బోగీలు.
► ఈ బోగీల్లో అందుబాటులోకి తాగునీరు, మరిన్ని మొబైల్ చార్జింగ్ పాయింట్లు.
 
 
 రైల్వే పుష్టికి ‘సప్త’ పది..
 న్యూఢిల్లీ: రైల్వే వ్యవస్థను మరింత సమర్థంగా తయారుచేసేందుకు, ఆర్థికంగా నిలదొక్కుకునేందుకు మంత్రి సురేశ్ ప్రభు తన బడ్జెట్‌లో ఏడు లక్ష్యాలను ప్రకటించారు. అవేంటంటే..

 మిషన్ రఫ్తార్: సరుకు రవాణా రైళ్ల సగటు వేగాన్ని రెట్టింపు చేయడం దీని ఉద్దేశం. వచ్చే ఐదేళ్లలో సూపర్ ఫాస్ట్ మెయిల్/ఎక్స్‌ప్రెస్‌ల సగటు వేగాన్ని గంటకు 25 కి.మీ మేర పెంచడం కూడా ఈ మిషన్ లక్ష్యం.
 
 మిషన్ 25 టన్నులు: సరుకు రవాణా సామర్థ్యం పెంచి అధిక ఆదాయం ఆర్జించడం దీని ఉద్దేశం. 2016-17లో 25 టన్నుల యాక్సిల్ లోడ్ వ్యాగన్ల ద్వారా 10-20% సరుకును రవాణా చేయాలని లక్ష్యంగా పెట్టారు. 2019-20 నాటికి 70% సరుకును ఈ వ్యాగన్ల ద్వారా రవాణా చేయాలి.
 
 మిషన్ 100: సైడ్ ట్రాక్‌లు, సరుకు రవాణా కేంద్రాల సంఖ్య పెంచడం దీని లక్ష్యం. ప్రస్తుతం వివిధ చోట్ల వీటి ఏర్పాటుకు 400 ప్రతిపాదనలు ఉన్నాయి. వాటిలో రెండేళ్లలో వంద సైడింగ్స్‌ను ఏర్పాటు చేయాలన్నది లక్ష్యం.
 
 మిషన్ జీరో యాక్సిడెంట్: రైలు ప్రమాదాలను పూర్తిగా నివారించడం దీని లక్ష్యం. వచ్చే రెండుమూడేళ్లలో కాపలా లేని క్రాసింగ్‌లు లేకుండా చేస్తారు. రైళ్లు ఢీకొనకుండా ప్రత్యేక టెక్నాలజీని వినియోగిస్తారు.
 
 మిషన్ పేస్(ప్రొక్యూర్‌మెంట్ అండ్ కన్జప్షన్ ఎఫిషియెన్సీ): రైల్వే పరికరాల కొనుగోలు, సేవల్లో నాణ్యతను పెంచడం దీని లక్ష్యం. దీనిద్వారా 2016-17లో రూ.1,500 కోట్ల ఆదాయం సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.
 
 మిషన్ బియాండ్ బుక్-కీపింగ్: రైల్వేలో ఖాతాల తనిఖీని పక్కాగా నిర్వహించడం దీని ఉద్దేశం.

 మిషన్ కెపాసిటీ యుటిలైజేషన్: 2019నాటికల్లా సిద్ధం కాబోయే ఢిల్లీ-ముంబై, ఢిల్లీ-కోల్‌కతా రవాణా కారిడార్‌ను పూర్తిస్థాయిలో వినియోగించుకొని అధిక ఆదాయం ఆర్జించడం ఈ కార్యక్రమం లక్ష్యం.
 
 ప్రాజెక్టుల పరిశీలనకు డ్రోన్లు..
 న్యూఢిల్లీ: రైల్వేలోని ప్రధానమైన ప్రాజెక్టుల పురోగతిని పరిశీలించేందుకు అడ్రోన్లు, జియో స్పేసియల్ శాటిలైట్ వ్యవస్థను వినియోగించుకోవాలని రైల్వే శాఖ నిర్ణయించింది. ప్రాజెక్టుల నిర్వహణ, పర్యవేక్షణకు సాంకేతికతపై ఆధారపడకూడదని నిర్ణయించినట్లు రైల్వే మంత్రి సురేశ్ ప్రభు పేర్కొన్నారు. అలాగే సరుకు రవాణా కారిడార్ పురోగతిని సమీక్షించేందుకు వచ్చే ఆర్థిక సంవత్సరంలో ఈ విధానాన్ని వినియోగిస్తామని ప్రకటించారు.
 
 పర్యాటకం ప్రాముఖ్యత
 రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంతో ఆయా రాష్ట్రాల్లోని పర్యాటక కేంద్రాలతో ఓ సర్క్యూట్‌ను ఏర్పాటు చేసి దీన్ని నేషనల్ రైల్ మ్యూజియంతో అనుసంధానం చేసి.. యునెస్కో ద్వారా పర్యాటకాన్ని మరింత అభివృద్ధి చేయనున్నారు. ఈ సర్క్యూట్ ప్యాకేజీలో జాతీయ జంతువైన పులులుండే అభయారణ్యాలైన కన్హా, పెంచ్, బాంధవ్‌గఢ్‌లను కలపనున్నారు.

 ఆరోగ్యమే మహాభాగ్యం
 కేంద్రం ఆరోగ్య శాఖతో ఒప్పందం కుదుర్చుకుని రైల్వే ఆసుపత్రులు, ప్రభుత్వ ఆసుపత్రులను అనుసంధానం చేయనున్నాయి. దీని ద్వారా రైలు ప్రయాణికులకు దారి పొడవునా ఎక్కడైనా అత్యవసర వైద్యసేవలందేలా చొరవతీసుకుంటారు. గ్యాంగ్‌మెన్‌లకు రక్షక్ పథకం పేరుతో.. ప్రత్యేక సదుపాయాలు కల్పించటం, ట్రాక్ రక్షణ (పెట్రోలింగ్)లో వీళ్లు వాడే పరికరాల బరువు తగ్గించేందుకు ఏర్పాట్లు.

 వినియోగదారుల సేవలో..
 ప్రధాన వ్యాపార భాగస్వాములతోపాటు చిరు వ్యాపారులకు ఇబ్బందులు కలగకుండా.. వారి సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించేందుకు ప్రతి జోనల్ రైల్వే పరిధిలో కస్టమర్ కమిట్‌మెంట్ కేంద్రాన్ని ఏర్పాటు చేయనున్నారు. వ్యాగన్లను లీజుకు ఇచ్చే వ్యవస్థను సులభతరం చేయనున్నారు.

 యువత కోసం..
 ప్రతి ఏడాది వందమంది ఎంబీఏ, ఇంజనీరింగ్ విద్యార్థులకు ఆహ్వానం పలికి 2-6 నెలలపాటు ఇంటర్న్‌న్‌షిప్ ఇవ్వాలని నిర్ణయించారు. దీంతోపాటు నైపుణ్యాభివృద్ధి మంత్రిత్వ శాఖతో సమన్వయం చేసుకుని రైల్వే పరిధిలో స్కిల్ డెవలప్‌మెంట్‌కు కార్యక్రమాలు నిర్వహించనున్నారు.

 విద్యుత్, నీటిని ఆదా చేసేందుకు..
 శక్తి వినియోగాన్ని 10 నుంచి 15 శాతం తగ్గించాలనే లక్ష్యంతోపాటు విద్యుత్‌ను ఆదా చేసేందుకు వచ్చే రెండు మూడేళ్లలో దేశవ్యాప్తంగా రైల్వేస్టేషన్లను ఎల్‌ఈడీ లైట్లతో ముస్తాబు చేయనున్నారు.
► రైళ్లు, రైల్వే స్టేషన్లో నీటి వినియోగాన్ని అవసరమైనంతమేరకే పరిమితం చేసి.. వృథాను అరికట్టేందుకు ఏర్పాట్లు. 2వేలకు పైగా రైల్వే స్టేషన్లలో వర్షపునీటిని సద్వినియోగపరుచుకునేలా ఏర్పాట్లు చేసేందుకు నిధులు ఇవ్వాలని నిర్ణయించారు.
► గిర్డర్ బ్రిడ్జెస్‌లో స్టీల్ స్లీపర్స్‌కు బదులుగా పర్యావరణానికి అనుకూలంగా ఉండే రీసైకిల్ ప్లాస్టిక్‌తో చేసిన స్లీపర్స్‌ను వినియోగించాలని నిర్ణయం.
► భవిష్యత్తులో 32 స్టేషన్లు, 10 కోచింగ్ డిపోల్లో నీటి రీసైక్లింగ్ డిపోలను ఏర్పాటుచేయటం.

 మొబైల్ యాప్స్..
 టికెటింగ్ సమస్యలు, ఫిర్యాదులు-సూచనలకోసం రెండు యాప్‌లను రూపొందించటం.
 రైలు మిత్ర సేవ...
 కొంకణ్ రైల్వేలో వయోవృద్ధులు, వికలాంగుల కోసం ఉన్న ‘సారథి సేవ’ను బలోపేతం చేయటంతోపాటు రైలు మిత్ర సేవ పేరుతో దేశవ్యాప్తంగా అమలుచేయ టం. దీని ద్వారా బ్యాటరీ ఆధారిత కారు, పోర్టర్ సేవలను విస్తృత పరచటం. సాంకేతికంగా స్టేషన్లను ఆధునీకరించి.. రెండువేల స్టేషన్లలో 20వేల స్క్రీన్స్‌ను ఏర్పాటు చేసి ప్రయాణికులకు ఎప్పటికప్పుడు సూచనలు చేయటం ఇందులో భాగం.

 దివ్యాంగుల కోసం..
 దివ్యాంగులకు అన్ని సౌకర్యాలుండేలా స్టేషన్ల ఆధునీకరణ. ఏ1 క్లాసు స్టేషన్లలో దివ్యాంగులను టాయిలెట్ తీసుకెళ్లేందుకు సహాయకుల ఏర్పాటు.

 ప్రయాణ బీమా
 బుకింగ్ సమయంలోనే ప్రయాణికులకు ప్రయాణ బీమా కల్పించేలా ఏర్పాటు.
 ట్రెయిన్ నం. 2016 బడ్జెట్ బండిలో ఏముందంటే..?
 
 రైల్వే మంత్రి సురేశ్ ప్రభు బడ్జెట్‌లో అన్ని వర్గాలను సంతృప్తిపరిచేందుకు యత్నించినట్లు కనిపించింది. ప్రధాని మోదీ మానసపుత్రికలైన ‘స్వచ్ఛభారత్’, ‘డిజిటల్ ఇండియా’కు బడ్జెట్‌లో పెద్దపీట వేశారు. మౌలిక వసతులకూ ప్రాధాన్యం ఇచ్చారు. చిరు వ్యాపారులకు కస్టమర్ కేంద్రం నుంచిప్రయాణికులకు బీమా వరకు పలు కొత్త కార్యక్రమాలను ప్రతిపాదించారు. ఆ విశేషాలేమిటంటే..
 
 యాత్రాస్థలాలను కలుపుతూ...
► అజ్మీర్, అమృత్‌సర్, బిహార్ షరీఫ్, చెంగనూర్, ద్వారక, గయ, హరిద్వార్, మథుర, నాగపట్నం, నాందేడ్, నాసిక్, పాలి, పారస్‌నాథ్, పూరి, తిరుపతి, వైలకన్ని, వారణాసి, వాస్కో వంటి యాత్రాస్థలాలను కలుపుతూ ‘ఆస్థా సర్క్యూట్’ను ప్రారంభించటంతోపాటు.. ఆయా రైల్వే స్టేషన్లను సుందరంగా తీర్చిదిద్దనున్నారు.
► పోర్టర్లకు కొత్త యూనిఫామ్‌లను సమకూర్చటంతోపాటు వారికి సాఫ్ట్‌స్కిల్స్‌ను నేర్పించి సహాయకులుగా పిలవనున్నారు.
► జపాన్ ప్రభుత్వ సహకారంతో అహ్మదాబాద్-ముంబై మధ్య హైస్పీడ్ రైలు కారిడార్ ఏర్పాటు. దీని ద్వారా భారతీయ రైల్వే సాంకేతికంగా పురోగతి సాధించటంతోపాటు తయారీ సామర్థ్యాన్ని పెంచుతుంది.
► రైళ్లలో వినోదాన్ని అందించేందుకు ఎఫ్‌ఎం రేడియో స్టేషన్లను ఆహ్వానించటం, అన్ని భారతీయ భాషల్లో ‘రైలు బంధు’ను అన్ని రిజర్వ్‌డ్ క్లాసులకు వర్తింపచేయటం.
► ‘క్లీన్ మై కోచ్’ సేవ ద్వారా ఎస్‌ఎంఎస్ పంపగానే.. బోగీని శుభ్రపరిచే వ్యవస్థ.
► హైటెక్ హంగులతో స్మార్ట్ కోచ్‌ల ఏర్పాటు
► సామాన్యుడికి లాభం చేకూర్చేలా పనిచేస్తున్న అన్ని రైల్వే స్టేషన్లలో రైలు ఆగేలా చర్యలు
 
 
 పెట్టుబడుల ‘సూత్ర’ం..ప్రభు మంత్రం

 న్యూఢిల్లీ: రైల్వే శాఖలో పెట్టుబడులు ఆకర్షించేందుకు విశ్లేషించి నిర్ణయించేందుకు ఆ శాఖ ఓ కొత్త బృందాన్ని ఏర్పాటు చేసింది. ఈ బృం దంలోని ఉద్యోగులకు వేతనాలు, స్టార్టప్ కంపెనీల కోసం రైల్వే బడ్జెట్‌లో రూ.50 కోట్లు కేటాయించింది. స్పెషల్ యూనిట్ ఫర్ ట్రాన్స్‌పోర్టేషన్ రీసెర్చ్, అనలిటిక్స్ (సూత్ర) పేరుతో ఓ బృందాన్ని నియమించినట్లు రైల్వే మంత్రి సురేశ్ ప్రభు ప్రకటించారు. సూత్రలో ప్రముఖ విశ్లేషకులు ఉంటారని చెప్పారు. రైల్వే శాఖకు ఏటా 100 టెరా బైట్ల సమాచారం వస్తుందని, అయితే దీన్ని వ్యాపారపరంగా విశ్లేషించి లబ్ధిపొందే పరి స్థితి ఇప్పటి వరకూ లేదన్నారు.

కొత్త ఆవిష్కరణలను ప్రోత్సహించేందుకు సూత్ర కోసం కేటాయించిన నిధులు వినియోగిస్తామన్నారు. భారత రైల్వే ఎదుర్కొంటున్న కీలకమైన సమస్యలకు కొత్త ఆవిష్కరణల ద్వారా పరిష్కారాలు కనుగొంటామని పేర్కొన్నారు. రతన్ టాటా నేతృత్వంలో రైల్వేల పర్యవేక్షణకు ‘కాయకల్ప్’ అనే ఇన్నోవేటివ్ కౌన్సిల్‌ను సురేశ్ ప్రభు ఏర్పాటు చేస్తారు. దేశంలోని ప్రఖ్యాత పెట్టుబడిదారులు, జాతీయ రైల్వే అకాడమీ, రైల్వే బోర్డు ప్రతినిధులు సభ్యులుగా ఉంటారని చెప్పారు. రైల్వే వ్యవస్థ పనితీరు మెరుగుపడేందుకు ఈ కౌన్సిల్ నుంచి సలహాలు, సూచనలు తీసుకుంటామని ప్రభు పేర్కొన్నారు. రైల్వే వర్క్‌షాప్‌లు, ఉత్పత్తి కర్మాగారాల్లోని సిబ్బంది సరికొత్త ఆవిష్కరణలు చేసేందుకు వీలుగా ప్రోత్సహించేందుకు ల్యాబ్‌లను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు.
 
 రైల్ డెవలప్‌మెంట్ అథారిటీ..
 మెరుగైన సేవలు, పోటీ తత్వం పెంచటం, వినియోగదారుల హక్కులను కాపాడటం, సేవల్లో ప్రమాణాలు పాటించటం వంటి అంశాలపై భాగస్వామ్య పక్షాలతో చర్చించాక నిర్ణయం తీసుకోవటం.
 
► నవారంభ్, నవీనీకరణ్: రైల్వే బోర్డును పునర్‌వ్యవస్థీకరించటంతోపాటు బోర్డు చైర్మన్‌కు విశేషాధికారాలను కల్పించాలని నిర్ణయం. బోర్డులో దేశవ్యాప్త డెరైక్టరేట్లను ఏర్పాటుచేసి వెనకబడ్డ జోన్లలో లాభాలు తెచ్చే యత్నాలను ప్రోత్సహించటం. రైల్వేల్లో అధికారుల నియామకాలు చేపట్టడంతోపాటు రైల్వేల వ్యాపారం పెరిగేందుకు పబ్లిక్, ప్రైవేట్ భాగస్వామ్యాలను ప్రోత్సహించటం.
సశస్తీకరణ్: రైల్వేల్లో దీర్ఘకాల(10 ఏళ్లు), మధ్యమ ప్రణాళికలను నిర్దేశించుకుని వాటిని ప్రణాళికాబద్ధంగా అమలు చేసేందుకు ప్లానింగ్, ఇన్వెస్ట్‌మెంట్ ఆర్గనైజేషన్‌ను స్థాపించటం. దేశవ్యాప్తంగా రైలు సేవలను మెరుగుపరిచేందుకు నేషనల్ రైల్ ప్లాన్‌ను రూపొందించుకోవటం.
► ఏకీకరణ్: రైల్వే శాఖ నిర్వహిస్తున్న అన్ని కంపెనీలను ఒకే గొడుగు కిందకు తీసుకు రావటం.
► శోధ్ ఔర్ వికాస్: భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకుని రైల్వేల అభివృద్ధి కోసం ప్రయోగాలు చేసేందుకు.. వ్యూహాత్మక సాంకేతికత, సమగ్రాభివృద్ధికి ప్రత్యేక రైల్వే వ్యవస్థ (శ్రేష్ఠ)ను ఏర్పాటుచేసుకోవటం ఇందులో భాగం. ప్రస్తుతమున్న ఆర్డీఎస్‌వో రోజువారీ విషయాలను చూసుకుంటే.. శ్రేష్ఠ దీర్ఘకాలిక అవసరాలపై దృష్టి సారిస్తుంది.
► విశ్లేషణ్: వ్యూహాత్మక పెట్టుబడులు, కార్యక్రమాల అమలును పర్యవేక్షించేందుకు స్పెషల్ యూనిట్ ఫర్ ట్రాన్స్‌పోర్టేషన్ రీసెర్చ్ అండ్ అనలిటిక్స్ (సూత్ర)ను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు.
► నవ్చ్రన: సంస్థ ఉద్యోగులు, చిరు వ్యాపారులు, స్టార్టప్‌లకోసం రూ. 50 కోట్ల మూలధనాన్ని సమకూర్చటం
 
 ఈ రైళ్లు యమా ఫాస్ట్...
  ప్రపంచంలో అత్యంత వేగంగా దూసుకెళ్లే రైళ్లు ఏయే దేశాల్లో ఉన్నాయి? అవి గంటకు ఎంత స్పీడుతో వెళ్తాయి? ఓ లుక్కేద్దామా?

 430 కి.మీ షాంఘై మగ్లేవ్- చైనా
 లోంగ్యాంగ్‌లోని మెట్రోలైన్ స్టేషన్ నుంచి షాంఘై పుడాంగ్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టు మధ్య ఈ రైలు దూసుకెళ్తుంది. ఏప్రిల్ 2004 నుంచి పట్టాల ‘పైన’ పరుగులు పెడుతోంది.
 
 380 కి.మీ హార్మోనీ సీఆర్‌హెచ్- చైనా
 ఈ సూపర్‌ఫాస్ట్ రైలు బీజింగ్-షాంఘై మధ్య పరుగులు పెడుతుంది. 2010 అక్టోబర్‌లో పట్టాలెక్కింది. చైనాలోనే వుహాన్-గ్వాంగ్‌జో మధ్య కూడా ఈ రకానికి చెందిన రైలు నడుస్తుంది.
 
 360 కి.మీ ఏజీవీ ఇటాలో- ఇటలీ
 యూరోప్‌లో అత్యంత అధునాతనమైన రైలు ఇదే. ప్రస్తుతం ఈ రైలు ఇటలీలోని నపోలీ-రోమా- ఫిరెంజ్- బొలాగ్నా- మిలాన్ కారిడార్ మధ్య నడుస్తోంది. 2012 నుంచి ఇది సేవలు అందిస్తోంది.
 
 350 కి.మీ సీమెన్స్ వెలారో ఇ-స్పెయిన్
 ఇది స్పెయిన్‌లోని బార్సిలోనా-మాడ్రిడ్ మధ్య పరుగెడుతోంది. ఈ ట్రెయిన్‌ను తయారు చేసివ్వాలని స్పెయిన్ రైల్వే.. సీమెన్స్ కంపెనీకి ఆర్డర్ ఇచ్చింది. 2007 నుంచి ఈ రైలు పరుగులు తీస్తోంది.
 
 మన ‘బుల్లెట్’ ఎప్పుడో?
 దేశంలోనే తొలిసారిగా ముంబై-అహ్మదాబాద్ మధ్య (534 కి.మీ.) బుల్లెట్ రైలును కిందటి బడ్జెట్‌లో ప్రకటించారు. ఇది గంటకు 320 కి.మీ. వేగంతో ప్రయాణించనుంది. ఈ ప్రత్యేక కారిడార్ నిర్మాణానికి రూ.90 వేల కోట్లు అవసరమని అంచనా.
 
 ఈ చరిత్ర రైలు పట్టాలపై..
 చరిత్రలో కొన్ని మరుపురాని సంఘటనలు ఉంటాయి. మరికొన్ని చరిత్రనే మలుపు తిప్పిన ఘటనలు ఉంటాయి! అలా రైల్వే కూడా చరిత్రపుటల్లో తనకంటూ ఓ పేజీని లిఖించింది. అలాంటి కొన్ని సంఘటనల సమాహారం..
 
 1893
 అది జాత్యహంకారానికి పరాకాష్ట! నల్లవాడన్న ఒకే ఒక్కకారణంతో మహాత్మా గాంధీకి దక్షిణాఫ్రికాలో 1893లో జరిగిన అవమానం!! ఆ అవమానమే ఆయన్ను.. జీవితాంతం అన్యాయాన్ని ప్రశ్నించేలా చేసింది. డర్బన్ నుంచి ప్రిటోరియా వెళ్లే రైల్లో ఫస్ట్‌క్లాస్ బోగీలో ఎక్కారంటూ గాంధీని పీటర్‌మారిట్జ్‌బర్గ్ వద్ద నిర్దాక్షిణ్యంగా ప్లాట్‌ఫాంపైకి తోసివేశారు. అలా ఆ రైలు ఘటన చరిత్రలో నిలిచిపోయింది!
 
 1901
 
 ‘‘నా జీవితంలో ఇకపై ఎప్పుడు రెలైక్కినా.. నిరుపేదలు వెళ్లే మూడో తరగతి కంపార్టుమెంటుల్లోనే ప్రయాణం చేస్తా...!’’  కలకత్తాలో కాంగ్రెస్ మహాసభల అనంతరం మహాత్మాగాంధీ తీసుకున్న గొప్ప నిర్ణయమిదీ! అన్నట్టుగానే బతికి ఉన్నంతకాలం దేశంలో రైల్లో ఎక్కడికి వెళ్లినా మూడో తరగతిలోనే ప్రయాణం చేశారు. చివరికి ఆయన చితాభస్మాన్ని కూడా అలహాబాద్‌కు మూడో తరగతిలోనే తరలించారు.
 
 1947
 రైల్లో జనం.. రైలుపైన జనం.. డోర్లు.. కిటికీలు పట్టుకుని వేలాడుతూ జనం.. ఒక్క మాటలో చెప్పాలంటే అది రైలు కాదు.. జనప్రవాహం! దేశ విభజన సమయంలో కొత్తగా ఏర్పడిన పాకిస్తాన్ వెళ్లేందుకు.. ఆ దేశం నుంచి భారత్ వచ్చేందుకు ప్రజలు పోటెత్తారు.
 
 1975
 జనవరి 2. బిహార్‌లోని సమస్తిపూర్. అప్పటి రైల్వేమంత్రి ఎల్‌ఎన్ మిశ్రా ఓ రైల్వేలైన్ ప్రారంభించడానికి  వచ్చారు. ఒక్కసారిగా భారీ పేలుడు. శర్మతోపాటు చాలామంది చనిపోయారు. అసలు ఈ బాంబు పేలుడుకు కారణ మెవరు? మంత్రిని ఎందుకు హతమార్చారు? ఈ మిస్టరీ ఇప్పటికీ తేలలేదు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement