రైల్వే బడ్జెట్ విలీనానికి ఓకే | OK to dilute the railway budget | Sakshi
Sakshi News home page

రైల్వే బడ్జెట్ విలీనానికి ఓకే

Published Thu, Sep 22 2016 2:15 AM | Last Updated on Sat, Aug 25 2018 4:30 PM

రైల్వే బడ్జెట్ విలీనానికి ఓకే - Sakshi

రైల్వే బడ్జెట్ విలీనానికి ఓకే

ఫిబ్రవరి 1నే సాధారణ బడ్జెట్
- యూపీ ఎన్నికల తేదీల ఆధారంగా 2017-18 ఏడాది బడ్జెట్ తేదీ ప్రకటన
- వివేక్ దేవ్‌రాయ్ కమిటీ నివేదికకు కేంద్ర కేబినెట్ ఆమోదం
- ప్రణాళిక, ప్రణాళికేతర వ్యయం విధానానికీ చెల్లుచీటి
 
 న్యూఢిల్లీ: దాదాపు శతాబ్దకాలంగా(92 ఏళ్లుగా) అమల్లో ఉన్న విధానానికి తెరదించుతూ.. వేరుగా ఉండే రైల్వే బడ్జెట్‌ను సాధారణ బడ్జెట్‌తో కలిపి ప్రవేశపెట్టేందుకు కేంద్ర కేబినెట్ ఆమోదముద్ర వేసింది. దీంతో దేశ ఆర్థిక పరిస్థితి మరింత మెరుగుపడుతుందని కేబినెట్ అభిప్రాయపడింది. ప్రధాని మోదీ అధ్యక్షతన  బుధవారం సమావేశమైన మంత్రివర్గం.. కేంద్ర బడ్జెట్ విధానంలో కీలక మార్పులు తీసుకొచ్చేందుకు.. ప్రణాళిక, ప్రణాళికేతర వ్యయాల విధానానికి స్వస్తి చెప్పాలని దీని ద్వారా బడ్జెట్‌ను మరింత సరళతరం చేయాలని నిర్ణయించింది. కేబినెట్ భేటీ వివరాలను మీడియాకు వెల్లడించిన ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ..

ఫిబ్రవరి నెల చివరి రోజున బడ్జెట్ ప్రవేశపెట్టాలనే విధానాన్ని పక్కన పెట్టి.. ఈ తేదీని ఫిబ్రవరి 1కి మార్చాలని నిర్ణయించినట్లు తెలిపారు. అయితే 2017-18 ఆర్థిక సంవత్సరం నుంచి ఏ తేదీన బడ్జెట్ ప్రవేశపెడతారనే అంశాన్ని వచ్చే ఏడాది జరిగే యూపీ ఎన్నికల షెడ్యూల్ ఆధారంగా వెల్లడిస్తామన్నారు. ఒకే బడ్జెట్ వల్ల దేశ ఆర్థిక స్థితిని సమగ్రంగా ఆవిష్కరించేందుకు అవకాశం ఉంటుందన్నారు. నీతి ఆయోగ్ సభ్యుడైన వివేక్ దేవ్‌రాయ్ నేతృత్వంలోని కమిటీ ఇచ్చిన నివేదిక ఆధారంగా విలీనంపై నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ఈ విలీనం ద్వారా రైల్వేల గుర్తింపు పోకుండా వ్యవహరిస్తామన్నారు.  

 రైల్వేలకు లాభమే: సాధారణ బడ్జెట్‌లో రైల్వే బడ్జెట్ విలీనం వల్ల రైల్వే శాఖకు ఎలాంటి నష్టమూ రాదని ఆ శాఖ మంత్రి సురేశ్ ప్రభు తెలిపారు. అంతే కాకుండా రైల్వేల మూలధన వ్యయం పెంచుకోవచ్చన్నారు. ఆర్థిక, రైల్వే శాఖల మధ్య మరింత సమన్వయం ఏర్పడుతుందన్నారు. రైల్వేలు ప్రభుత్వానికి డివిడెండు చెల్లించనక్కర్లేదన్నారు.అయితే ప్రస్తుతానికి 7వ వేతన కమిషన్ అమలు చేసేందుకు రైల్వేలపై రూ. 40వేల కోట్లు, ప్రయాణికులకు సబ్సిడీల రూపంలో మరో రూ. 35వేల కోట్ల భారాన్ని రైల్వే శాఖ మోయాల్సిందే.
 ‘నమామి గంగే’ వేగవంతం: ‘నమామి గంగే’ అమలుకోసం కార్యాచరణను వేగవంతం చేయాలని కేబినెట్ నిర్ణయించింది. జాతీయ గంగానది బేసిన్ అథారిటీ స్థానంలో గంగానది జాతీయ కౌన్సిల్ ఏర్పాటు చేయనుంది.కేంద్ర జలవనరుల మంత్రి ఉమాభారతి ఈ టాస్క్‌ఫోర్స్‌కు అధ్యక్షురాలిగా ఉంటారు. గంగానది నీటిని కలుషితం చేసేవారిపై చట్టపరంగా శిక్ష తీసుకునేలా.. స్వచ్ఛ గంగా జాతీయ మిషన్‌కు అథారిటీ హోదా ఇవ్వాలని కేబినెట్ నిర్ణయించింది.  

 మరిన్ని కేబినెట్ నిర్ణయాలు..
► స్వాతంత్య్ర సమరయోధులకిచ్చే పింఛనును కేంద్రం  గణనీయంగా పెంచింది. అండమాన్‌తోపాటు భారత్ వెలుపల జైళ్లలో శిక్ష అనుభవించినవారి బంధువుల(భార్య, పిల్లలు) పింఛన్‌ను రూ. 5వేలు పెంచుతూ కేబినెట్ నిర్ణయం తీసుకుంది. సమరయోధుల పింఛను (అన్నిరకాల), పొందుతున్న వారికి అదనంగా 20 % పెంపును కల్పించనున్నట్లు తెలిపింది. ఈ పెంపు(డియర్‌నెస్ రిలీఫ్) 2016 ఆగస్టు 15 నుంచి అమల్లోకి రానుంది.

► పప్పుధాన్యాలు, నూనెలు, నూనె గింజల నిల్వ విషయంలో వ్యాపారులు, దళారులపై విధించిన నిల్వ పరిమితిని మరో ఏడాది కొనసాగించాలని కేబినెట్ నిర్ణయించింది. ఈ నెలాఖరుతో ఈ పరిమితి గడువు ముగియనుంది.
► నౌకాయాన మంత్రిత్వ శాఖ ప్రతిపాదించిన అడిమిరల్టీ(షిప్పింగ్ వివాదాల్లో న్యాయ పరిధి, ఒప్పందం, తీరప్రాంత సమస్యలు) బిల్లు, 2016ను కూడా ఆమోదించింది.
► అండమాన్ నికోబార్ దీవుల్లో టెలికం సేవలను విస్తరించేందుకు రూ. 1,102.38 కోట్లతో చెన్నై నుంచి అండమాన్‌కు కేబుల్ లింక్ ఏర్పాటు చేయడానికి  కేబినెట్ ఆమోదం తెలిపింది. 2018 కల్లా ఈ ప్రాజెక్టు పూర్తికావాలని ఆదేశించింది.
 సపర్యాటక రంగ పురోగతి కోసం దేశంలోని వివిధ ప్రాంతాల్లో గుర్తించిన 26 దీవులను (తొలివిడతగా)వేగంగా అభివృద్ధి చేయాలని కూడా ఈ సమావేశంలో నిర్ణయించారు.  
 కాగా, బడ్జెట్‌ల విలీనం వల్ల రైల్వేల స్వయం ప్రతిపత్తికి భంగం కలుగుతున్నందని, ఇది సరైన నిర్ణయం కాదని మాజీ రైల్వే మంత్రి, బిహార్ సీఎం నితీశ్ కుమార్ అన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement