రైల్వే కేటాయింపుల్లో తీవ్ర నిరాశ.. | disappointment to Telangana in railway budget allocations | Sakshi
Sakshi News home page

రైల్వే కేటాయింపుల్లో తీవ్ర నిరాశ..

Published Wed, Feb 7 2018 1:39 AM | Last Updated on Wed, Feb 7 2018 4:02 AM

disappointment to Telangana in railway budget allocations - Sakshi

సాక్షి, హైదరాబాద్‌
ఒక్క కొత్త రైలు రాలేదు.. కీలక మార్గాల్లో కొత్త్త లైన్‌ ఒక్కటీ లేదు.. భారీ ప్రాజెక్టులూ లేవు.. వెరసి మోదీ రైలు తెలంగాణలో ఆగకుండానే దూసుకుపోయింది! కోటి ఆశలతో కేంద్రం వైపు కళ్లు కాయలు కాసేలా ఎదురుచూస్తున్న రాష్ట్రానికి తీవ్ర నిరాశే మిగిల్చింది. రైల్వే లైన్లు పరిమితంగా ఉన్న తెలంగాణ ప్రతిసారీ రైల్వే బడ్జెట్‌ అనగానే కేంద్రం వైపు ఎంతో ఆశతో చూస్తోంది. ప్రతిసారీ ఎంతో కొంత విదిల్చి నిరుత్సాహపరిచే కేంద్రం ఈసారి మరింత పిసినారితనాన్ని ప్రదర్శించింది. బడ్జెట్‌లో రైల్వేకు తొలిసారి రూ.లక్ష కోట్లను మించి (రూ.1,46,500 కోట్లు) నిధులు కేటాయించినా.. అందులో రాష్ట్రానికి విదిల్చింది కేవలం రూ.1,813 కోట్లు. మొత్తం కేటాయింపులో ఇది కేవలం 1.23 శాతం! బడ్జెట్‌ విధానాన్ని మార్చినందున కచ్చితంగా కొత్త ప్రాజెక్టులు మంజూరు చేయాలన్న నిర్ణయం ఉండదని, సంవత్సరంలో ఎప్పుడైనా మంజూరు చేయొచ్చంటున్న కేంద్రం.. ఇప్పటికే పనులు జరుగుతున్న ప్రాజెక్టులకన్నా భారీగా నిధులు ఇచ్చిందా అంటే అదీ లేదు. అత్తెసరు నిధులు విదిల్చి ఆ పనులు ఇప్పట్లో పూర్తి కావనే సంకేతాలనిచ్చింది. పండుగల సమయంలో లక్షల మంది ప్రయాణికులు పోటెత్తినా చాలినన్ని ప్రత్యేక రైళ్లు నడిపే శక్తి దక్షిణ మధ్య రైల్వేకు లేదు. డిమాండ్‌ను తట్టుకునే స్థాయిలో రైల్వే లైన్లు లేకపోవటమే ఇందుకు కారణమని రైల్వేనే చెబుతోంది. రెండు, మూడో లైన్ల నిర్మాణం, కీలక మార్గాల్లో కొత్త లైన్లకు నిధులిస్తే ఈ సమస్య తీరేంది. కానీ ఆ ప్రయత్నం కూడా జరగలేదని బడ్జెట్‌ లెక్కలు స్పష్టం చేస్తున్నాయి. మొత్తంగా సాధారణ కేటాయింపులతో కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ రాష్ట్రానికి మొండిచేయి చూపారు.

ఇలాగైతే పదేళ్లయినా పూర్తి కావు
దక్షిణ మధ్య రైల్వే పరిధిలో ప్రస్తుతం 2,623 కి.మీ. మేర కొత్త రైల్వే లైన్లకు ఉద్దేశించిన 22 ప్రాజెక్టులు వివిధ దశల్లో ఉన్నాయి. వీటి మొత్తం ప్రాజెక్టు వ్యయం రూ.19,983 కోట్లు. కానీ రాష్ట్రం ఆవిర్భవించినప్పట్నుంచీ ఇప్పటి వరకు వీటిపై చేసిన ఖర్చు రూ.3,026 కోట్లు మాత్రమే. వాటికి తాజా బడ్జెట్‌లో కేటాయించిన మొత్తం రూ.1,757 కోట్లు. అందులో తెలంగాణ వాటా కేవలం రూ.675 కోట్లు. ఇదేరకంగా నిధులు కేటాయిస్తూ పోతే ఆ ప్రాజెక్టులు పూర్తయ్యేందుకు పదేళ్ల కాలం పడుతుంది. ఇక కొత్త లైన్ల సంగతి చెప్పేదేముంది.

జరిగిన పనులు 8.2 శాతమే..
పెరుగుతున్న డిమాండ్, రైళ్ల ట్రాఫిక్‌ నేపథ్యంలో ప్రస్తుతం రెండు, మూడో లైన్‌ నిర్మాణం ఎంతో అవసరం. దక్షిణ మధ్య రైల్వే పరిధిలో 2,268 కి.మీ. మేర ఈ పనులు సాగుతున్నాయి. వీటి అంచనా వ్యయం రూ.19,647 కోట్లు. కానీ 2014 నుంచి ఇప్పటివరకు రూ.1,626 కోట్లు మాత్రమే వ్యయం చేశారు. అంటే.. 8.2 శాతం పనులే జరిగాయని ఈ లెక్కలు చెబుతున్నాయి. తాజాగా అందుకు ఇచ్చిన మొత్తం రూ.611 కోట్లు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇప్పటి వరకు కొత్త లైన్లకు సంబంధించి 113 కి.మీ., డబ్లింగ్, ట్రిప్లింగ్‌కు సంబంధించి 24.50 కి.మీ. మాత్రమే పూర్తి చేయగలిగారు.

నిధుల కేటాయింపుల్లో పెరుగుదల ఏది?
రైల్వే వసతి అతి తక్కువ ఉన్న రాష్ట్రంలో ఆది నుంచి బడ్జెట్‌ కేటాయింపులు అత్తెసరే. కానీ 2014లో మోదీ ప్రభుత్వం కొలువు దీరిన తర్వాత కాస్త ఆశలు పెరిగాయి. అప్పటి వరకు ఉన్న నామమాత్రపు కేటాయింపులను కొంత పెంచటమే ఇందుకు కారణం. వరుసగా మూడేళ్లపాటు ఆ పెంపు ఓ మోస్తరుగా ఉండటంతో.. ఎన్నికలకు ముందు ప్రవేశపెట్టిన ఈ చివరి బడ్జెట్‌లో అది మరింత ఆశాజనకంగా ఉంటుందని ఆశించారు. కానీ నామమాత్రపు పెంపుతో నీళ్లు చల్లారు.

బడ్జెట్‌లో కేటాయింపులివీ..

ఇక అన్నీ ఎలక్ట్రిక్‌.. : దక్షిణ మధ్య రైల్వేను పూర్తిగా కరెంటు మార్గంగా చేయబోతున్నారు. ఈ జోన్‌ పరిధిలోని బీదర్‌–గుల్బర్గా మార్గం మినహా యావత్తు ద.మ. రైల్వేను ఎలక్ట్రికల్‌ మార్గంగా చేయబోతున్నట్టు బడ్జెట్‌లో ప్రకటించారు. ఇందుకు తాజా బడ్జెట్‌లో 1,261 కి.మీ. మార్గాన్ని విద్యుద్దీకరించేందుకు రూ.1,172 కోట్లు ఖర్చు చేయనున్నట్టు ప్రకటించారు. ఈ ఏడాది మాత్రం ఇందుకు రూ.72 కోట్లు మంజూరు చేశారు.
ఇందులో తెలంగాణ వాటా మార్గాలు...
లింగంపేట–జగిత్యాల–నిజామాబాద్‌– 95 కి.మీ.(రూ.80.29 కోట్లు)
వికారాబాద్‌–పర్లివైజ్‌నాథ్‌–269 కి.మీ.(రూ.262.12 కోట్లు)
పింపల్‌కుట్టి–ముద్ఖేడ్‌–పర్లి– 246 కి.మీ.(రూ.224.17 కోట్లు)

సికింద్రాబాద్‌ ‘జిగేల్‌’.. రెండేళ్ల తర్వాతే..
దేశంలోని ప్రధాన స్టేషన్‌లను పూర్తిస్థాయిలో అభివృద్ధి చేసే ప్రాజెక్టుకు కేంద్రం గత బడ్జెట్‌లో శ్రీకారం చుట్టింది. తొలిదశలో 25 స్టేషన్‌లను ఎంచుకోగా అందులో సికింద్రాబాద్‌ చోటు దక్కించుకుంది. పీపీపీ పద్ధతిలో వాటిని అభివృద్ధి చేస్తారు. గత సంవత్సరమే రైల్వే టెండర్లు పిలిచింది. కానీ నిబంధనలు చూసిన తర్వాత బిడ్డర్లు వెనకడుగు వేశారు. ఈ ప్రాజెక్టులో లీజు గడువు 40 ఏళ్లుగా రైల్వే నిర్ధారించింది. దాన్ని మారిస్తేనే ముందుకొస్తామని బిడ్డర్లు తేల్చి చెప్పారు. ఫలితంగా ఆ ప్రాజెక్టు దాదాపు ఆగిపోయింది. దీంతో తాజాగా కేంద్రం లీజు సమయాన్ని 99 ఏళ్లకు పెంచాలని నిర్ణయించింది. బిడ్ల తంతు పూర్తి చేసి వచ్చే సంవత్సరం పనులు ప్రారంభించే అవకాశం ఉందని ద.మ. రైల్వే జీఎం వినోద్‌కుమార్‌ యాదవ్‌ వివరించారు.

రాష్ట్ర ప్రభుత్వ వైఖరితోనే ‘కాజీపేట’ జాప్యం
కొంతకాలం నడిచిన తర్వాత బోగీలను తిరిగి కండీషన్‌లోకి తెచ్చేందుకు ఉద్దేశించిన వ్యాగన్‌ ఓవర్‌హాలింగ్‌ వర్క్‌షాపు ప్రాజెక్టులో రాష్ట్ర ప్రభుత్వ వైఖరితో పనుల్లో జాప్యం జరుగుతోంది. దీనికి కావాల్సిన 150 ఎకరాల భూమిని రాష్ట్ర ప్రభుత్వం కేటాయించింది. కానీ అది దేవాదాయశాఖ భూమి కావటంతో కోర్టుల్లో కేసులు దాఖలయ్యాయి. దీంతో గత బడ్జెట్‌లో రైల్వే శాఖ నిధులు కేటాయించినా పనులు చేపట్టలేకపోయింది. ఇప్పటికీ ఆ భూమి మధ్యలో ఓ బిట్‌పై ఇంకా కేసు కొనసాగుతుండటంతో దాన్ని రైల్వేకు స్వాధీనం చేయలేకపోయారు. తాజా బడ్జెట్‌లో కేంద్రం దానికి రూ.200 కోట్లు కేటాయించింది. రాష్ట్ర ప్రభుత్వం భూమిని అప్పగించిన 18 నెలల్లో వర్క్‌షాపు పూర్తి చేస్తామని దక్షిణ మధ్య రైల్వే జీఎం తెలిపారు.

మరిన్ని విశేషాలు..
నిత్యం 25 వేల మంది వరకు ప్రయాణికుల తాకిడి ఉండే అన్ని రైల్వే స్టేషన్‌లలో ఎస్కలేటర్లు ఏర్పాటు చేయబోతున్నారు. ఈ సంవత్సరం హఫీజ్‌పేట, ఖమ్మంలలో ఏర్పాటు చేస్తారు.
అన్ని రైల్వే స్టేషన్‌లలో ఎల్‌ఈడీ లైట్లను ఏర్పాటు చేస్తారు. స్టేషన్‌ భవనాలపైన సౌరఫలకాలు ఏర్పాటు చేసి సౌర విద్యుత్‌ను అందిపుచ్చుకుంటారు.
కొత్తగా 2 ఆర్‌ఓబీలు, 9 ఆర్‌యూబీలను రూ.195 కోట్ల వ్యయంతో నిర్మిస్తారు. ఇందులో రైల్వే రూ.73.14 కోట్లు భరించనుండగా మిగతా మొత్తాన్ని రాష్ట్రప్రభుత్వం కేటాయించాల్సి ఉంది.  
సికింద్రాబాద్‌–కరీంనగర్‌ను రైల్వేతో అనుసంధానించేందుకు ఉద్దేశించిన మనోహరాబాద్‌–కొత్తపల్లి ప్రాజెక్టుకు ఈసారి రూ.125 కోట్లు కేటాయించారు. వీటితో మనోహరాబాద్‌–గజ్వేల్‌ మధ్య రైల్వే లైన్‌ ఏర్పాటు చేస్తారు.

చర్లపల్లి శాటిలైట్‌ స్టేషన్‌కు భూమి ఏది?
సికింద్రాబాద్‌ స్టేషన్‌లో కొత్త ప్లాట్‌ఫామ్స్‌ నిర్మించేందుకు స్థలం లేక రైళ్లను శివార్లలో నిలపాల్సి రావటం ప్రయాణికులకు శాపంగా మారడంతో చర్లపల్లిలో ఆ«ధునిక శాటిలైట్‌ టెర్మినల్‌ నిర్మించాలని రైల్వే శాఖ రెండేళ్ల క్రితం నిర్ణయించింది. దీనికి 150 ఎకరాల స్థలం కావాలంటూ రాష్ట్ర ప్రభుత్వాన్ని లిఖితపూర్వకంగా కోరింది. కానీ స్థలం లభించక పనులు మొదలు పెట్టలేకపోయింది. ఎన్నిసార్లు రాష్ట్రప్రభుత్వాన్ని కోరినా స్పందన లేకపోవటంతో ఇక అక్కడ తనకు ఉన్న 50 ఎకరాల స్థలంలోనే పనులు చేపట్టాలని రైల్వే నిర్ణయించింది.

ఉన్న నిధులతో పనులు వేగంగా చేస్తాం
గత నాలుగేళ్ల క్రితంతో పోలిస్తే దక్షిణ మధ్య రైల్వేకు మెరుగ్గానే నిధుల కేటాయింపు జరిగింది. వీటితో కొత్త లైన్లు, రెండు, మూడో లైన్ల నిర్మాణంపై దృష్టి పెడతాం. ముఖ్యంగా ఆర్‌ఓబీ, ఆర్‌యూబీల నిర్మాణం, కాపలా లేని లెవల్‌ క్రాసింగ్స్‌ తొలగింపు, హైలెవల్‌ ప్లాట్‌ఫామ్‌ల నిర్మాణాలకు ప్రాధాన్యమిస్తున్నాం. జోన్‌కు కేటాయించిన నిధులను అవసరమైతే మంజూరైన ఇతర పనులకు సర్దుబాటు చేసే అధికారాన్ని జీఎంలకు కల్పించటం శుభపరిణామం. దీంతో ఏదైనా సమస్య వల్ల నిర్ధారిత పనులు ఆగిపోతే ఆ నిధులు వెనక్కు పోకుండా అవసరమైన ఇతర పనులకు ఖర్చు చేసే వెసులుబాటు కలుగుతుంది. ఈ సంవత్సరం సెప్టెంబర్‌ నాటికి కాపలాదారులేని లెవల్‌ క్రాసింగ్స్‌ లేకుండా చేస్తాం. అలాంటివి 214 ఉన్నట్టు గుర్తించాం. యాదాద్రి ఎంఎంటీఎస్‌కు ఈ నెలలోనే టెండర్‌లను ఆహ్వానిస్తాం. –వినోద్‌కుమార్‌ యాదవ్‌. జీఎం, దక్షిణ మధ్య రైల్వే

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement