రక్షణ రంగానికి భారీగా కేటాయింపులు
నగరంలో దేశీయ ఉత్పత్తుల తయారీకి ఊపు
ఆయుధాల తయారీలో అగ్రగామిగా హైదరాబాద్
సాక్షి, హైదరాబాద్: రక్షణ రంగం, ఏరోస్పేస్‌కు హబ్‌గా ఎదుగుతున్న హైదరాబాద్‌కు మరింత ఊతం లభించనుంది. కేంద్ర బడ్జెట్‌లో రక్షణ రంగానికి పెద్ద పీట వేయడంతో ఆ రంగానికి సంబంధించి పరిశోధనలు నగరంలో మరింత ఊపందుకోనున్నాయి. ఇప్పటికే డిఫెన్స్, ఏరోస్పేస్‌కు సంబంధించి హైదరాబాద్‌లోని ప్రభుత్వ రంగ సంస్థలతో పాటు ప్రైవేటు సంస్థలు ఎన్నో ఆవిష్కరణలు తీసుకొచ్చాయి.
డీఆర్‌డీవో, డీఆర్‌డీఎల్, ఆర్‌సీఐ, బీడీఎల్, ఎండీఎన్, ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ, డీఎంఆర్‌ఎల్ వంటి ప్రభుత్వ రంగ సంస్థలు హైదరాబాద్‌లో రక్షణ రంగానికి వన్నె తెస్తున్నాయి. కేంద్రం బడ్జెట్‌లో రక్షణ శాఖకు రూ.6,21,940 కోట్లను కేటాయించిన విషయం విదితమే. కాగా ఈ కేటాయింపుల్లో రూ.1.05 లక్షల కోట్లను దేశీయ ఆయుధ వ్యవస్థల కొనుగోళ్లకే వాడతామని రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ చెప్పడంతో హైదరాబాద్ నుంచి దేశీయ ఉత్పత్తుల తయారీ ఊపందుకునే అవకాశం ఏర్పడింది.
ఆయుధాల తయారీ హబ్‌గా..
ఆయుధాల తయారీలో హైదరాబాద్ ఇప్పటికే అగ్రగామిగా నిలుస్తోంది. అల్రా్టలైట్ రిమోట్ కంట్రోల్ వెపన్ సిస్టమ్‌ను జెన్ టెక్నాలజీస్ అనే సంస్థ ఇప్పటికే అభివృద్ధి పరిచింది. ఇక,హాక్ ఐ, ఎస్‌టీహెచ్‌ఐఆర్ స్టాబ్ 640తో పాటు మిషన్ ప్లానింగ్, నావిగేషన్, ప్రమాదాలను గుర్తించడం, ఉగ్రవాదుల జాడ కనిపెట్టేందుకు ప్రహస్త అనే రోబోటిక్ డాగ్‌ను అభివృద్ధి పరిచారు.
ఆయుధ కొనుగోళ్లు, సంబంధిత ఇతర వ్యవస్థల కొనుగోలుకు కేంద్రం రూ.1.72 లక్షల కోట్లను కేటాయించింది. దేశీయ ఉత్పత్తులను కొనుగోలు చేసేందుకే అత్యధిక మొత్తం ఖర్చుచేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇది హైదరాబాద్‌లోని ఆయుధాల తయారీ సంస్థలకు ఊతమిస్తుందని ఆ రంగ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
అంతరిక్ష పరిశోధన రంగంలో అగ్రగామిగా..
ఎస్‌ఈసీ ఇండస్ట్రీస్ రక్షణ రంగంతో పాటు అంతరిక్ష పరిశోధన రంగంలో దేశానికి ఎన్నో సేవలు అందిస్తోంది. గగన్‌యాన్, చంద్రయాన్‌కు కావాల్సిన ప్రధానమైన విడిభాగాలను తయారు చేస్తోంది. క్రూ మాడ్యుల్‌ను ఇక్కడే తయారు చేస్తున్నారు. ఇక స్కార్పీన్ సబ్‌మెరైన్ ప్రాజెక్టులో కీలక విడిభాగాలైన వెపన్ హ్యాండ్లింగ్, స్టోరేజీ సిస్టమ్, వెపన్ లోడింగ్ సిస్టమ్, థ్రస్ట్ బ్లాక్, బల్లాస్ట్ వెంట్ వాల్‌్వలు, హల్ హాచెస్, కాఫర్ డ్యామ్ డోర్స్, హెచ్‌పీ ఎయిర్ సిలిండర్స్ వంటివి ఇక్కడే తయారయ్యాయి.
Comments
Please login to add a commentAdd a comment