విద్యారంగానికి రూ. 21,292 కోట్లు
గతేడాదికన్నా రూ. 2,199 కోట్లు అదనం
సాక్షి, హైదరాబాద్: విద్యారంగానికి 2024–25 బడ్జెట్‌లో ప్రభుత్వం రూ. 21,292 కోట్లు కేటాయించింది. 2023–24లో కేటాయించిన రూ. 19,093 కోట్లతో పోలిస్తే ఈసారి రూ. 2,199 కోట్లు ఎక్కువ కేటాయింపులు చేయడం విశేషం. మొత్తం బడ్జెట్‌లో గతేడాది విద్యారంగం కేటాయింపులు 6.57 శాతం మేర ఉండగా తాజాగా అవి 7.31 శాతానికి పెరిగాయి. కాంగ్రెస్ మేనిఫెస్టోలో పేర్కొన్న అంతర్జాతీయ పాఠశాలల ఏర్పాటుకు ఈ బడ్జెట్‌లో రూ. 500 కోట్లు కేటాయించారు. విశ్వవిద్యాలయాలకు గతంలో మాదిరిగానే రూ. 500 కోట్లు కేటాయించారు.
విద్య పరిశోధన, శిక్షణ వ్యవహారాల రాష్ట్ర మండలి (ఎస్‌సీఈఆర్‌టీ) నిధులు రూ. 425.54 కోట్ల నుంచి రూ. 705 కోట్లకు పెంచారు. సెకండరీ పాఠశాలలకు కేటాయింపులు రూ. 390 కోట్ల నుంచి రూ. 925 కోట్లకు పెంచారు. గురుకుల విద్యకు 2023లో రూ. 662 కోట్లు కేటాయించగా ఈసారి రూ. 694 కోట్లు కేటాయించారు. మధ్యాహ్న భోజనం వంటి కేంద్ర పథకాలకు కేటాయింపులు దాదాపు రూ. 300 కోట్ల వరకూ పెరిగాయి. కళాశాల విద్యకు స్వల్పంగా రూ. 60 కోట్లు పెంచారు. అయితే పెరిగిన బడ్జెట్‌లో 90 శాతం వేతనాలకే సరిపోతుందని విద్యావేత్తలు అంటున్నారు.
ఈ నిధులు ఏ మూలకు?
విద్యకు 15 శాతం నిధులిస్తామని మేనిఫెస్టోలో చెప్పిన కాంగ్రెస్ ప్రభుత్వం అందులో సగం కూడా కేటాయించలేదు. పాఠశాల భవనాలు శిథిలావస్థకు చేరుకున్నా నిర్మాణాలకు నిధులు ఇవ్వలేదు. 3వ తరగతి వరకు అంగన్‌వాడీల్లో కలపాలన్న ప్రతిపాదన సమర్థనీయం కాదు. – చావా రవి (యూటీఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి)
Comments
Please login to add a commentAdd a comment