కేంద్ర ఆర్థిక మంత్రి స్పీచ్‌లో ఎక్కడా కానరాని రాష్ట్రం ప్రస్తావన
‘పాలమూరు’కు జాతీయ హోదా, ఐటీఐఆర్, బయ్యారం స్టీల్ ప్లాంట్, ఐఐఎం ఏర్పాటు అంశాలపై స్పందన కరువు
విభజన చట్టం మేరకు ఏపీకి కాస్త ఊరటనిచ్చినా.. తెలంగాణకు మాత్రం మొండిచేయి
ఒకే చట్టం కింద ఇరు రాష్ట్రాల పట్ల భిన్నంగా వ్యవహరించడమేంటని రాజకీయ పక్షాల మండిపాటు
ఇక కేంద్ర పథకాల అమల్లో భాగంగానే రాష్ట్రానికి నిధులు
సాక్షి, హైదరాబాద్: కేంద్రంలో మూడోసారి అధికారంలోకి వచ్చిన ఎన్డీయే సర్కారు ప్రవేశపెట్టిన పూర్తిస్థాయి బడ్జెట్‌లో తెలంగాణకు మొండిచెయ్యే ఎదురైంది. మంగళవారం కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో ఎక్కడా తెలంగాణ ఊసే కనబడలేదు.
రాష్ట్ర ప్రభుత్వం ఆశలు పెట్టుకున్న ఐటీఐఆర్ ప్రాజెక్టు పునరుద్ధరణ, ‘పాలమూరు’ప్రాజెక్టుకు జాతీయ హోదా, మూసీ రివర్‌ఫ్రంట్‌కు నిధులు, విభజన చట్టం హామీల అమలు, వెనుకబడిన జిల్లాలకు గ్రాంట్లు, స్కిల్ యూనివర్సిటీకి సహకారం, కొత్త నవోదయ పాఠశాలలు.. ఇలా ఏ ఒక్కదానికీ నిధులు కేటాయించలేదు. ఒక్క హైదరాబాద్–బెంగళూరు ఇండ్రస్టియల్ కారిడార్‌లోని ఓర్వకల్లు పరిధిలో నీరు, విద్యుత్, రైల్వేలు, రోడ్లు వంటి మౌలిక సదుపాయాలకు నిధులు మంజూరు చేస్తామని మాత్రమే బడ్జెట్‌లో పేర్కొన్నారు.
ఎన్నిసార్లు విజ్ఞప్తులు చేసుకున్నా..
విభజన చట్టం మేరకు ఆంధ్రప్రదేశ్‌లో అమరావతి నిర్మాణానికి రూ.15వేల కోట్లు ఆర్థిక సాయం అందిస్తామని, పోలవరం ప్రాజెక్టు వేగంగా పూర్తయ్యేలా నిధులిస్తామని బడ్జెట్ ప్రసంగంలో నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు. కానీ అదే చట్టం పరిధిలోని తెలంగాణకు మాత్రం ఎలాంటి నిధులనూ ఇవ్వలేదు. ముఖ్యంగా విభజన చట్టంలో పేర్కొన్న ఐటీఐఆర్‌ను పునరుద్ధరించాలని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రాన్ని కోరుతోంది. ఈ మేరకు సీఎం, మంత్రులు కేంద్ర పెద్దలను పలుమార్లు కలిశారు.
గత పదేళ్లలో జరిగిన రూ.33,712 కోట్ల రెవెన్యూ నష్టాన్ని ఈసారైనా ఇవ్వాలని.. వెనుకబడిన జిల్లాలకు గ్రాంట్ల కింద రూ.2,250 కోట్లు, 14, 15 ఆర్థిక సంఘాలు సిఫార్సు చేసిన రూ.6వేల కోట్లు ఇప్పించాలని, పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వాలని కోరారు. కానీ కేంద్రం ఏ ఒక్కదానినీ పట్టించుకోలేదు. ఎన్డీయే సర్కారు రాజకీయ అవసరాలను బట్టి ఏపీకి నిధులు చూపారని అనుకున్నా... 8 మంది బీజేపీ ఎంపీలు గెలిచిన తెలంగాణను కేంద్రం పట్టించుకోకపోవడం ఏమిటని ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి.
వాటా పెంపు కూడా దక్కలేదు..
కేంద్ర పన్నుల్లో తెలంగాణ వాటాను పెంచుతారని రాష్ట్ర ప్రభుత్వం ఆశించినా అదీ దక్కలేదు. కేంద్ర పన్నుల్లో తెలంగాణకు 2.102 శాతం వాటా కింద రూ.26,216.38 కోట్లు వస్తాయని బడ్జెట్‌లో చూపారు. కానీ గ్రాంట్స్ ఇన్ ఎయిడ్, కేంద్ర ప్రాయోజిత పథకాలు, రైల్వే ప్రాజెక్టులకు నిధుల విషయంలో ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు. ఇక రాష్ట్రాలకు వడ్డీ లేని దీర్ఘకాలిక రుణాల కింద రూ.1.5 లక్షల కోట్లు ఇవ్వనున్నట్టు కేంద్రం బడ్జెట్‌లో పేర్కొంది. ఈ 1.5 లక్షల కోట్లలో ఎఫ్‌ఆర్‌బీఎం నిబంధనల మేరకు రాష్ట్రానికి ఏ మేరకు నిధులు వస్తాయన్నది కీలకంగా మారింది.
ఏమైనా వస్తే.. టోకుగా చూపిన అంశాల్లోనే!
∗ దేశవ్యాప్తంగా 1,000 ఐటీఐల ఆధునీకరణకు బడ్జెట్‌లో నిధులు కేటాయించారు. రాష్ట్రంలోని 60కిపైగా ఐటీఐల ఆధునీకరించాలని రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తోంది. కేంద్రం ప్రతిపాదించిన 1,000 ఐటీఐల్లో మన రాష్ట్రం వాటా కింద ఎన్ని వస్తాయన్నది తేలాల్సి ఉంది.
∗ దేశవ్యాప్తంగా 12 పారిశ్రామికవాడలను అభివృద్ధి చేస్తామన్న ప్రతిపాదనల నేపథ్యంలో తెలంగాణకు ఏదైనా కారిడార్ దక్కుతుందా అన్నది చర్చ జరుగుతోంది.
∗ట్రాన్సిట్ ఓరియెంటెడ్ డెవలప్‌మెంట్ కింద దేశంలో 30 లక్షలకు పైగా జనాభా ఉన్న నగరాలకు ఆర్థిక చేయూత అందిస్తామని కేంద్రం పేర్కొంది. దీని కింద హైదరాబాద్‌కు నిధులు అందే అవకాశముంది.
∗ దేశవ్యాప్తంగా కోటి కుటుంబాలకు రూఫ్‌టాప్ సోలార్‌ను అందిస్తామని కేంద్రం బడ్జెట్‌లో తెలిపింది. రాష్ట్ర ప్రభుత్వం కూడా జీహెచ్‌ఎంసీ పరిధిలో నిర్మించే నూతన గృహాలకు రూఫ్ టాప్ సోలార్ తప్పనిసరి చేయాలన్న యోచనలో ఉంది. కేంద్ర పథకానికి దీనిని లింక్ చేస్తే ప్రయోజనం ఉండవచ్చని నిపుణులు
అంటున్నారు.
∗ దేశంలోని 100 పెద్ద నగరాల్లో నీటి సరఫరా, మురుగునీటి నిర్వహణ కోసం ఆర్థిక సాయం అందిస్తామని కేంద్రం బడ్జెట్‌లో పేర్కొంది. దీనికింద హైదరాబాద్, వరంగల్, కరీంనగర్‌లకు సాయం దక్కవచ్చు.
∗ దేశవ్యాప్తంగా మౌలిక సౌకర్యాల కల్పనకు రూ.11.11 లక్షల కోట్లను ప్రతిపాదించారు. ఇందులో రీజనల్ రింగ్ రోడ్డు (ఆర్‌ఆర్‌ఆర్), పేదలకు గృహ నిర్మాణం వంటి ప్రతిష్టాత్మక ప్రాజెక్టులకు ఏమేర నిధులు రావొచ్చనే చర్చ జరుగుతోంది.
Comments
Please login to add a commentAdd a comment