
ప్రకాష్ యశ్వంత్ అంబేడ్కర్
హైదరాబాద్: దేశ రక్షణ నిమిత్తం హైదరాబాద్‌ను దేశానికి రెండో రాజధానిగా ఏర్పాటు చేయాలని భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ మనవడు ప్రకాష్ యశ్వంత్ అంబేడ్కర్ (prakash yashwant ambedkar) డిమాండ్ చేశారు. దేశ రెండో రాజధానిగా హైదరాబాద్‌ను ఏర్పాటు చేయాలని కోరుతూ సోమవారం సుందరయ్య విజ్ఞానకేంద్రంలో జరిగిన సమావేశంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దేశ రాజధాని ఢిల్లీ పాకిస్తాన్ (Pakistan) సరిహద్దు నుంచి కేవలం 300 కిలోమీటర్ల దూరంలో ఉందని, శత్రుదేశాలు దేశ రాజధానికి దగ్గర ఉండటం దేశ రక్షణకు శ్రేయస్కరం కాదన్నారు. భారతదేశం బలమైన ప్రజాస్వామిక దేశంగా ఎదగాలంటే కులమతాలకు అతీతంగా అందరూ ఐక్యంగా ఉండాలని పిలుపునిచ్చారు.
ఎమ్మెల్సీ కోదండరాం మాట్లాడుతూ హైదరాబాద్ (Hyderabad) రెండో రాజధాని అనే అంశంపట్ల లోతైన చర్చ జరగాల్సిన అవసరం ఉందన్నారు. నదీ జలాలు, యూనివర్సిటీలతోపాటు ప్రతి రంగంలోనూ కేంద్ర ప్రభుత్వం ఆధిపత్యం ధోరణిని కొనసాగిస్తోందని విమర్శించారు. హైదరాబాద్‌లో సుప్రీంకోర్టు ప్రత్యేక బెంచ్‌ని ఏర్పాటు చేయాలని కోరారు. పార్లమెంట్ శీతాకాల సమావేశాలకు హైదరాబాద్ అనుకూలమని, ఈ విషయాన్ని కేంద్ర ప్రభుత్వం గుర్తించాలని సూచించారు.
హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ చంద్రకుమార్ మాట్లాడుతూ కీలకమైన అంశాలపట్ల సమన్యాయం కావాలని, హైదరాబాద్‌కు అన్ని విధాలుగా న్యాయం జరిగేటట్లు ఉండాలని అభిప్రాయపడ్డారు. కాంగ్రెస్ సీనియర్ నేత అద్దంకి దయాకర్ మాట్లాడుతూ.. రాజ్యాంగం ప్రకారం అన్ని రాష్ట్రాలకు సమాన వాటా కల్పించాలన్నారు. ప్రముఖ సామాజిక వేత్త సంపత్ రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో రిటైర్డ్ ఐఆర్‌ఎస్ అధికారి నర్సమ్మ, ప్రొఫెసర్ వెంకట్‌నారాయణ తదితరులు పాల్గొన్నారు.
ఆదివాసీ హక్కుల నేతల అరెస్టు అక్రమం
ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలో మూలవాసీ బచావో మంచ్ మాజీ అధ్యక్షుడు రఘు మదియాని (raghu midiyami)ని ఎన్‌ఐఏ పోలీసులు రాయపూర్‌లో అక్రమంగా అరెస్టు చేయడాన్ని ఆదివాసీ హక్కుల పోరాట సంఘీభావ వేదిక తీవ్రంగా ఖండించింది. ఈ మేరకు సోమవారం హైదర్‌గూడలోని ఎన్‌ఎస్‌ఎస్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పౌర హక్కుల సంఘం నాయకులు ప్రొఫెసర్ లక్ష్మణ్, నారాయణరావు మాట్లాడుతూ అక్రమంగా అరెస్టు చేసిన రఘుతోపాటు గజేంద్ర, లక్ష్మణ్ అనే కార్యకర్తలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.

ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలో మానవ హక్కుల ఉల్లంఘన యథేచ్ఛగా సాగుతోందన్నారు. గత 14 నెలల కాలంలో 434 మందిని కేంద్ర ప్రభుత్వం పొట్టన పెట్టుకుందని ఆరోపించారు. పోలీసుల అప్రజాస్వామికగా చర్యలను బాహ్య ప్రపంచానికి చేరవేస్తున్నారని, పోలీసు క్యాంపులకు వ్యతిరేకంగా పనిచేస్తున్నారని గజేంద్ర, లక్ష్మణ్ అనే కార్యకర్తలను జైలుకు పంపారని అన్నారు. ఛత్తీస్‌గఢ్‌లో వెలసిన పోలీసు క్యాంపులను ఎత్తివేయాలని, పర్యావరణాన్ని కాపాడాలని, ఆదివాసీ మహిళలపై జరుగుతున్న హత్యాచారాలను అరికట్టాలని డిమాండ్ చేశారు. సమావేశంలో నాయకులు చంద్రమౌళి, జాన్, భవాని, పీడీఎం రాజు తదితరులు పాల్గొన్నారు.
చదవండి: ఆనందంగా అమెరికాకు బయలుదేరి.. అంతలోనే విషాదం
Comments
Please login to add a commentAdd a comment