సాక్షి, హైదరాబాద్: కేటాయింపుల్లో స్పష్టత ఉండని కేంద్ర ప్రభుత్వ ఓటాన్ అకౌంట్ బడ్జెట్ రాష్ట్రానికి ఆశలు, అంచనాలనే మిగిల్చింది. 2024–25 ఆర్థిక సంవత్సరానికి గాను గురువారం లోక్‌సభలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో రాష్ట్రానికి ఎలాంటి ప్రత్యేక కేటాయింపులు చూపెట్టలేదు. కేవలం దేశ వ్యాప్తంగా అమలు చేయాలని తలపెట్టిన పలు ప్రాజెక్టులు, కార్యక్రమాల ద్వారానే రాష్ట్ర ప్రజానీకం కూడా లబ్ధి పొందనున్నారు.
మధ్యంతర బడ్జెట్ కావడంతో ఇందులో తెలంగాణ రాష్ట్ర విభజన చట్టంలోని హామీల అమలు, సాగునీటి ప్రాజెక్టులకు జాతీయ హోదా లాంటి అంశాలు ప్రస్తావనకు రాలేదు. అయితే దేశ వ్యాప్తంగా అమలు చేయనున్న కార్యక్రమాల ద్వారా తెలంగాణ ప్రజలకు లబ్ధి కలుగుతుందని, ప్రతిపాదించిన నిధుల్లో తెలంగాణకు ఎంత కేటాయిస్తారన్న దానిపై స్పష్టత వస్తేనే ఈ బడ్జెట్ ద్వారా రాష్ట్రానికి ఒనగూరే ప్రయోజనాల లెక్క తేలుతుందని ఆర్థిక నిపుణులు చెపుతున్నారు.
ఇళ్ల నుంచి సౌర విద్యుత్ వరకు
తెలుగింటి కోడలు నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో ప్రతిపాదించిన స్టార్టప్‌లు, ఆయుష్మాన్ భారత్, గృహ నిర్మాణం, ఉపాధి హామీ నిధుల పెంపు, మెట్రో రైళ్లు, 300 యూనిట్ల వరకు గృహ వినియోగానికి ఉచితంగా సోలార్ పవర్ ప్యానెళ్లు లాంటి పథకాలు తెలంగాణకు ఉపయుక్తం కానున్నాయి. ముఖ్యంగా స్టార్టప్‌ల అభివృద్ధిలో దేశంలోనే టాప్ స్థానంలో తెలంగాణ కొనసాగుతోంది. ఒక్క హైదరాబాద్ వేదికగానే 3,500 నుంచి 4,000 స్టార్టప్‌లున్నాయని అంచనా. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే స్టార్టప్‌ల ఏర్పాటులో తెలంగాణ నాలుగు శాతం అదనపు వృద్ధిని నమోదు చేస్తోంది.
ఈ నేపథ్యంలో ఈసారి బడ్జెట్‌లో స్టార్టప్‌ల కోసం కేటాయించిన రూ.43 వేల కోట్ల బడ్జెట్ తెలంగాణ అభివృద్ధికి, హైదరాబాద్‌లో స్టార్టప్‌ల ఏర్పాటుకు మరింత ఊతమిస్తుందని ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు. మరోవైపు కొత్త నగరాల్లో మెట్రో రైళ్లను విస్తరిస్తామని బడ్జెట్ సందర్భంగా కేంద్రం వెల్లడించింది. దీంతోపాటు వందేభారత్ రైళ్ల తరహాలో సాధారణ రైలు బోగీల అభివృద్ధి, రైల్ కారిడార్‌ల ఏర్పాటు కోసం రూ.11.11 లక్షల కోట్లు కేటాయించింది. ఈ కేటాయింపుల్లో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించిన 70 కిలోమీటర్ల మేర మెట్రో విస్తరణ, కొత్త లైన్ల నిర్మాణానికి నిధులు దక్కే అవకాశాలున్నాయి.
ఈసారి దేశ వ్యాప్తంగా 2 కోట్ల మందికి కొత్త గృహాలు నిర్మించే ప్రతిపాదనలను చేసిన నేపథ్యంలో మన రాష్ట్రానికి 6–8 లక్షల గృహాల నిర్మాణానికి ఈ పథకం కింద నిధులు వచ్చే అవకాశముందని తెలుస్తోంది. అదే విధంగా 300 యూనిట్ల వరకు విద్యుత్ కోసం గృహాలకు ఉచితంగా సోలార్‌పవర్ ప్యానెళ్లు అందజేయాలని కేంద్రం ప్రతిపాదించింది. ఈ ఉచిత ప్యానెళ్ల వల్ల కూడా లక్షలాది మంది గృహ వినియోగదారులకు ఊరట కలగనుంది. ఇక రాష్ట్రంలో 61 లక్షల ఉపాధి హామీ కార్డులున్నాయి. ఈసారి బడ్జెట్‌లో కేంద్రం గత ఏడాది కంటే ఉపాధి నిధులను పెంచింది.
దీంతో వచ్చే ఏడాదిలో కార్డుల సంఖ్యతో పాటు ఉపాధి హామీ వేతనం కూడా పెరిగే అవకాశాలున్నాయని గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులు అంచాన వేస్తున్నారు. అదేవిధంగా అంగన్‌వాడీ, ఆశా సిబ్బందిని ఆయుష్మాన్ భారత్ పరిధిలోకి తీసుకురానుండడంతో రాష్ట్రంలోని 35వేల మంది అంగన్‌వాడీ టీచర్లు, మరో 35 వేల మంది హెల్పర్లతో పాటు 25 వేల మంది ఆశా వర్కర్లకు రూ.5 లక్షల వరకు ఉచిత వైద్య సదుపాయం లభించనుంది.
కేటాయింపులు తేలాలి
జాతీయ రహదారులు, స్టార్టప్‌ల కార్పస్ ఫండ్ పేరిట కేటాయించిన నిధుల వల్ల తెలంగాణకు ఏం ప్రయోజనం చేకూరుతుందనేది కేటాయింపుల్లో స్పష్టత వస్తేనే కానీ తేలదని ఆర్థిక శాఖ అధికారులు చెపుతున్నారు. హైవేల నిర్మాణం కోసం కేంద్ర బడ్జెట్‌లో రూ.1.68 లక్షల కోట్లు కేటాయించారు. ప్రస్తుతం రాష్ట్రంలో హైవేల నిమిత్తం 1,200 కిలోమీటర్ల కొత్త ప్రతిపాదనలున్నాయి.
అయితే రాష్ట్రంలోని ఏ రహదారికి ఎంత కేటాయిస్తారనేది కేటాయింపుల్లో స్పష్టత వస్తేనే తేలనుంది. స్టార్టప్‌ల కార్పస్ ఫండ్ కింద కేంద్రం రూ.లక్ష కోట్ల వరకు దీర్ఘకాలిక రుణాలను అందజేస్తామని ప్రకటించింది. ఈ ఫండ్‌ను ఏ రాష్ట్రానికి ఎంత కేటాయిస్తారనే లెక్కలు తేలితేనే మన రాష్ట్రంలోని ఎంత మంది యువత ఈ రుణాలను ఉపయోగించుకుని స్వయం ఉపాధి పొందుతారో తేలనుంది.
మనదీ ఓటాన్ అకౌంటేనా?
కేంద్ర ప్రభుత్వం మధ్యంతర బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన నేపథ్యంలో రాష్ట్రం కూడా అటు వైపే మొగ్గు చూపనున్నట్టు తెలుస్తోంది. ఈ నెల 15 నుంచి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు జరుగుతాయని తెలుస్తోంది. ఈ సమావేశాల్లో భాగంగా పూర్తిస్థాయి బడ్జెట్ పెడతారా? ఓటాన్ అకౌంట్‌కు వెళతారా అన్న దానిపై పూర్తిస్థాయిలో స్పష్టత రాలేదు. వాస్తవానికి కేంద్రం నుంచి రాష్ట్రానికి ఏ మేరకు నిధులు వస్తాయన్న అంచనాలతోనే రాష్ట్ర బడ్జెట్‌ను ప్రతిపాదిస్తారు.
గ్రాంట్ ఇన్‌ఎయిడ్, కేంద్ర పన్నుల్లో వాటాతో పాటు పలు కేంద్ర ప్రభుత్వ ప్రాయోజిత పథకాలకు (సీఎస్‌ఎస్) నిధుల కేటాయింపులను అంచనా వేసుకుని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వాటాను పేర్కొంటూ బడ్జెట్‌ను ప్రతిపాదిస్తారు. అయితే కేంద్రం పెట్టిన ఓటాన్ అకౌంట్‌లో ప్రజలపై వి«ధించే ప్రత్యక్ష, పరోక్ష పన్నుల విధానంలో ఎలాంటి మార్పు లేదని ప్రకటించారు కానీ, రాష్ట్రాలకు ఇచ్చే నిధుల విషయంలో విధాన నిర్ణయాన్ని ప్రకటించలేదు.
దీంతో అసలు కేంద్రం నుంచి ఎన్ని నిధులు వస్తాయన్న దానిపై రాష్ట్ర ఆర్థిక శాఖ కూడా అంచనాకు వచ్చే అవకాశం లేదని, ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం కూడా ఓటాన్ అకౌంట్ వైపే మొగ్గు చూపుతుందని అంటున్నారు. గత పార్లమెంటు ఎన్నికల సందర్భంగా 2019–20 ఆర్థిక సంవత్సరంలోనూ కేంద్రం ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌నే ప్రవేశపెట్టింది. తెలంగాణలో కూడా ఆరు నెలల కాలానికి గాను ఓటాన్ అకౌంట్ పెట్టి ఆ తర్వాత సెపె్టంబర్‌లో జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో పూర్తి స్థాయి బడ్జెట్‌ను ప్రవేశపెట్టడం గమనార్హం.
స్కూళ్లకు నిధులు
యూజీసీకి 60 శాతం కోత
న్యూఢిల్లీ: యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ)కి కేంద్ర ప్రభుత్వం మధ్యంతర బడ్జెట్‌లో గ్రాంట్లను 60.99 శాతం మేర కోత వేసింది. గత ఏడాది సవరించిన అంచనాల ప్రకారం రూ.6,409 కోట్లు కేటాయించగా, ఈసారి కేవలం 2,500 కోట్లు కేటాయించింది. అయితే, 2024–25 బడ్జెట్‌లో స్కూళ్లకు కేటాయింపులు పెంచింది. పాఠశాల విద్యకు గత ఏడాది సవరించిన అంచనాల (రూ.72473.80) కన్నా దాదాపు రూ.500 కోట్ల మేర పెంచి 73008.10 కోట్లు కేటాయించింది. ఉన్నత విద్యకు మాత్రం గత ఏడాది రూ.57244.48 కోట్లు కేటాయించగా, ఈసారి రూ.9,600 కోట్లు కోతవేసి 47619.77 కోట్లు కేటాయించడం గమనార్హం. కేంద్రం ఐఐఎంలకు వరుసగా రెండో ఏడాది కూడా కోత విధించింది.
గత ఏడాది సవరించిన అంచనాల మేరకు రూ.608.23 కోట్లు కేటాయించగా, ఈసారి రూ.300 కోట్లు మాత్రమే కేటాయించారు. అలాగే, ఐఐటీలకు గత ఏడాది సవరించిన అంచనాల మేరకు రూ.10384.21 కోట్లు కేటాయించగా, ఈసారి రూ.10324.50 కోట్లు కేటాయించారు. అలాగే, కేంద్ర విశ్వవిద్యాలయాలకు నిధులను 28 శాతం పెంచారు. వీటికి గత ఏడాది రూ.12000.08 కోట్లు ఇవ్వగా, ఈసారి రూ.15472 కోట్లు కేటాయించడం విశేషం. కాగా, రాష్ట్ర ప్రభుత్వాలకు ఇచ్చే గ్రాంట్లను రూ.8,200 కోట్ల మేర పెంచగా, కేంద్రపాలిత ప్రాంతాలకు రూ.308 కోట్ల మేర పెంచారు.
390 వర్సిటీలు... 3000 ఐటీఐలు
2014 నుంచి ఇప్పటివరకు పదేళ్లలో పెద్ద ఎత్తున ఉన్నత విద్యా సంస్థలను నెలకొలి్పనట్లు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ వెల్లడించారు. 7 ఐఐటీలు, 16 ఐఐఐటీలు, 7 ఐఐఎంలు, 15 ఎయిమ్స్ విద్యాసంస్థలను, 390 యూనివర్సిటీలను ఏర్పాటుచేసినట్లు బడ్జెట్ ప్రసంగంలో చెప్పారు. అలాగే, 3,000 ఐటీఐలను కూడా స్థాపించామన్నారు. యువతను ఎంతవరకు సాధికారికంగా మార్చామన్నదానిపై మన ప్రగతి ఆధారపడి ఉంటుందన్నారు.
సంస్కరణలకు జాతీయ విద్యావిధానం–2020 నాంది పలుకుతోందని, ‘పీఎం శ్రీ’పథకం ద్వారా నాణ్యమైన బోధనను అందించడంతోపాటు విద్యార్థులను మరింత ప్రతిభావంతులుగా తీర్చిదిద్దుతున్నామని చెప్పారు. స్కిల్ ఇండియా మిషన్ కింద మూడువేల ఐటీఐలను ఏర్పాటుచేసి ఇప్పటివరకు 1.4 కోట్ల మందికి శిక్షణ ఇచ్చామని, 54 లక్షల మంది యువకుల ప్రతిభకు మెరుగులు దిద్దామని తెలిపారు.
బడ్జెట్.. ఆశలు.. మధ్యంతరమే!
♦ ‘ఓటాన్ అకౌంట్’ కావడంతో ఎలాంటి మార్పులకూ వెళ్లని ఎన్డీయే సర్కారు
♦ ఆదాయ పన్ను మినహాయింపు పరిమితి పెంచవచ్చని భావించిన ఉద్యోగులు
♦ కొత్త పథకాలపై ఆశలు పెట్టుకున్న పలు వర్గాలు
♦ పెట్రోల్, డీజిల్ ధరల తగ్గింపు ప్రకటించవచ్చనే అంచనాలు
♦ కానీ చిన్న చిన్న మినహాయింపులకేపరిమితమైన కేంద్ర ఆర్థిక మంత్రి
న్యూఢిల్లీ: సుస్థిర ఆర్థిక వృద్ధి లక్ష్యమంటూ మోదీ సర్కారు ప్రవేశపెట్టిన 2024–25 ఓటాన్ అకౌంట్ బడ్జెట్.. అన్ని వర్గాల ఆశలను మధ్యంతరంగానే వదిలేసింది. మరో రెండు నెలల్లో లోక్‌సభ ఎన్నికలున్న నేపథ్యంలో.. ఆదాయ పన్ను మినహాయింపు పరిమితి పెంచవచ్చని, కొత్త పథకాలు ప్రకటించవచ్చని, పెట్రోల్ ధరలు తగ్గించేలా చర్యలు చేపట్టవచ్చని ఎన్నో అంచనాలు వెలువడ్డాయి. కానీ ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్‌లో పన్నులు సహా ఇతర అంశాలు వేటిలోనూ పెద్దగా మార్పులూ చేయలేదు. వేతన జీవులు, వివిధ వర్గాల వారు ఎంతో ఆశ పెట్టుకున్న పన్ను మినహాయింపులు, శ్లాబ్ రేట్ల మార్పు వంటివాటి జోలికి వెళ్లలేదు. ఎలాంటి ఉపశమనం కలి్పంచలేదు. కొత్తగా భారమూ వేయలేదు.
ఆర్థిక వృద్ధి, సంస్కరణలపై ఫోకస్..
కొత్త సంక్షేమ కార్యక్రమాలు, పథకాల ప్రస్తావన పెద్దగా తీసుకురాని కేంద్ర ఆర్థిక మంత్రి.. తన ప్రసంగం పొడవునా ఆర్థిక వృద్ధి దిశగా చేపట్టే చర్యలనే ఎక్కువగా వివరించారు. గత పదేళ్ల పాలనకు సంబంధించి కూడా పన్నుల ఆదాయంలో వృద్ధి, వివిధ రంగాల్లో అభివృద్ధిని ప్రస్తావిస్తూ.. ప్రజల జీవన ప్రమాణాలు మెరుగయ్యాయని చెప్పే ప్రయత్నం చేశారు. ఆర్థికవృద్ధి మరింత వేగం పుంజుకునేలా మూలధన వ్యయానికి రూ.11.1 లక్షల కోట్లను కేటాయించామన్నారు.
వచ్చే ఐదేళ్లలో ఆర్థిక వృద్ధి అనూహ్య స్థాయిలో వేగం పుంజుకుంటుందని.. రాష్ట్రాలతో సంప్రదింపులు జరిపి మరిన్ని సంస్కరణలను అమల్లోకి తెస్తామని ప్రకటించడం గమనార్హం. అంతేకాదు.. భవిష్యత్తులో ద్రవ్యలోటును తగ్గించడంతోపాటు అప్పులు తీసుకోవడాన్ని కూడా తగ్గిస్తూ వెళ్లాలన్న లక్ష్యాన్ని నిర్దేశించుకున్నట్టు వివరించారు. ఎన్డీయే పాలనతో ప్రజలు సంతృప్తితో ఉండటంతోనే రెండోసారి భారీ మెజార్టీ ఇచ్చారని.. ఇప్పుడు మూడోసారి గెలిస్తే సుస్థిర, సమ్మిళిత అభివృద్ధి దిశగా శరవేగంగా చర్యలు చేపడతామని ప్రకటించడం విశేషం.
సబ్సిడీలకు కోత వేస్తూ..
కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న సబ్సిడీలను తగ్గించుకుంటూ వస్తున్న ఎన్డీయే సర్కారు.. దాన్ని ప్రస్తుత బడ్జెట్‌లోనూ కొనసాగించింది. గత బడ్జెట్‌తో పోలిస్తే ఆహారం, ఇంధనం, ఎరువుల సబ్సిడీలకు కేటాయింపులను 8శాతం మేర తగ్గించారు. అయితే గ్రామీణ ఉపాధి హామీ పథకానికి మాత్రం కోత పెట్టలేదు.మరోవైపు మధ్యతరగతి వారి సొంతింటికలను తీర్చేందుకు కొత్తగా పథకాన్ని తెస్తామని ప్రకటించి కాస్త ఊరటనిచ్చారు. వచ్చే ఐదేళ్లలో 2 కోట్ల అందుబాటు ధరల గృహాలను నిర్మిస్తామని ప్రకటించారు.
మౌలిక సదుపాయాల అభివృద్ధి దిశగా..
కేంద్ర ఆర్థిక మంత్రి బడ్జెట్‌లో మౌలిక సదుపాయాల అభివృద్ధికి ప్రాధాన్యం ఇచ్చారు. ఈ రంగానికి కేటాయింపులను 11 శాతం పెంచారు. విమానయానాన్ని మరింత ప్రోత్సహించేలా టైర్–2, 3 స్థాయి నగరాలకూ కొత్తగా విమాన సరీ్వసులతోపాటు ఉడాన్ పథకం కింద 517 కొత్త మార్గాలను ప్రారంభిస్తున్నట్టు ప్రకటించారు. రైల్వేను మరింత మెరుగుపర్చే దిశగా.. 40వేలకుపైగా బోగీల్లో ‘వందే భారత్’ప్రమాణాల స్థాయిలో సౌకర్యాల కల్పనకు నిర్ణయం తీసుకున్నారు.
పర్యాటకాన్ని మరింత ప్రోత్సహించేందుకు, పర్యాటక ప్రాంతాల అభివృద్ధి కోసం రాష్ట్రాలకు వడ్డీ రహిత రుణాలు ఇస్తామని తెలిపారు. దీనితోపాటు మౌలిక సదుపాయాల కల్పన ప్రాజెక్టుల కోసం రాష్ట్రాలకు రూ.1.3లక్షల కోట్ల దీర్ఘకాలిక రుణాలు ఇస్తామని ప్రతిపాదించారు. విద్యుత్ రంగంలో సంస్కరణల్లో భాగంగా రూఫ్‌టాప్ సోలార్ విద్యుత్‌ను ప్రోత్సహించేందుకు చర్యలు ప్రకటించారు.
Comments
Please login to add a commentAdd a comment