కేంద్ర బడ్జెట్‌పై ఐటీ మంత్రి శ్రీధర్‌బాబు ఆగ్రహం
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వరంగ సంస్థల వాటాల విక్రయం (డిజ్ ఇన్వెస్ట్‌మెంట్) ద్వారా ఈ ఏడాది రూ.50 వేల కోట్ల ఆదాయం రాబట్టాలని కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్‌లో ప్రస్తావించడం పట్ల రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖమంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు గురువారం ఒక ప్రకటనలో ఆగ్రహం వ్యక్తంచేశారు. ప్రభుత్వరంగ సంస్థల వాటాల విక్రయమంటే కన్నబిడ్డలను మరొకరికి అమ్ముకోవడమే అని విమర్శించారు. కేంద్ర బడ్జెట్‌పై శ్రీధర్‌బాబు స్పందిస్తూ పీఎస్‌యూలను కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేసిందన్నారు.
కానీ బీజేపీ అధికారంలోకి వచ్చాక కొత్త వాటిని స్థాపించకపోగా, లాభాల్లో ఉన్న సంస్థల వాటాలను అమ్మి సొమ్ము చేసుకుంటోందని ఆరోపించారు. బ్యాంకులు కాకుండా పీఎస్‌యూల వార్షిక లాభాలు రూ.2,64,000 కోట్లుగా ఉన్నాయన్నారు. బ్యాంకులను జాతీయం చేసి పేదల దగ్గరికి చేర్చింది స్వర్గీయ ఇందిరాగాంధీ అని, ఇప్పుడా బ్యాంకుల ద్వారా గతేడాది మోదీ ప్రభుత్వానికి రూ.2.11 లక్షల కోట్ల డివిడెంట్ లభించిందని శ్రీధర్‌బాబు తెలిపారు.
నష్టాల్లో ఉన్న పీఎస్‌యూలకు అపారమైన ఆస్తులున్నాయని, కానీ అవి దివాలా తీశాయని ప్రధాని చెబుతున్నారని విమర్శించారు. వాటి అప్పుల కన్నా ఆస్తుల విలువ ఎక్కువని పేర్కొన్నారు. 13 మహారత్న, 14 నవరత్న, 72 మినీరత్న పీఎస్‌యూలన్నీ లాభాల్లో ఉన్నాయని, వీటిని నిర్వీర్యం చేసి వాటాలు అమ్ముకుంటే కాంగ్రెస్ చూస్తూ ఊరుకోదని శ్రీధర్‌బాబు హెచ్చరించారు.
రక్షణరంగ ఉత్పత్తుల తయారీపై రూ.వెయ్యి కోట్ల పెట్టుబడి
ముందుకొచ్చిన వెమ్ టెక్నాలజీస్: మంత్రి శ్రీధర్‌బాబు
సాక్షి, హైదరాబాద్: రక్షణరంగ పరికరాల ఉత్పత్తి సంస్థ వెమ్ టెక్నాలజీస్ మొదటి దశ ప్రాజెక్టులో భాగంగా రూ.1,000 కోట్ల పెట్టుబడులు పెడుతోందని ఐటీ, పరిశ్రమల శాఖమంత్రి శ్రీధర్‌బాబు తెలిపారు. జహీరాబాద్ నిమ్జ్‌లో 511 ఎకరాల్లో ఏర్పాటవుతున్న ఈ సమీకృత ఉత్పాదన కేంద్రం వచ్చే ఏడాది డిసెంబర్ నాటికి ట్రయల్ ప్రొడక్షన్‌కు సిద్ధమవుతుందని వెల్లడించారు. మొదటి దశ పూర్తయితే 1,000 మందికి ఉద్యోగాలు లభిస్తాయని చెప్పారు.
గురువారం సచివాలయంలో వెమ్ ఇండస్ట్రీస్ ప్రతినిధులు మంత్రితో సమావేశమయ్యారు. సంస్థకు కేటాయించిన భూమిలో ఇంకా స్వాధీనం చేయాల్సిన 43 ఎకరాలకు సంబంధించిన సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని సంగారెడ్డి కలెక్టర్ వల్లూరు క్రాంతికి.. శ్రీధర్‌బాబు సూచించారు. ఉత్పత్తికి 33 కేవీ విద్యుత్ లైన్లను నాలుగు నెలల్లో ఏర్పాటు చేయాలని ట్రాన్స్‌కో అధికారులను ఆదేశించారు. సమావేశంలో వెమ్ టెక్నాలజీస్ సీఎండీ వెంకటరాజు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment