పల్లెకు 3.0 ధమాకా | Again huge funding for employment guarantee in the budget | Sakshi
Sakshi News home page

పల్లెకు 3.0 ధమాకా

Published Wed, Jul 24 2024 5:26 AM | Last Updated on Wed, Jul 24 2024 6:08 AM

Again huge funding for employment guarantee in the budget

ఉపాధికి మళ్లీ ‘హామీ’..

అదనంగా 3 కోట్ల ఇళ్ల నిర్మాణం..

గ్రామీణ రోడ్లు రయ్‌ రయ్‌...

కేంద్రంలో మూడోసారి కొలువుదీరిన మోదీ 3.0 సర్కారు.. గ్రామీణ ఆర్థిక వ్యవస్థను పరుగులు పెట్టించేందుకు నడుం బిగించింది. కీలకమైన కేంద్ర ప్రభుత్వ పథకాల (ఫ్లాగ్‌షిప్‌)కు ఈసారి బడ్జెట్లో దండిగానే నిధులు కేటాయించింది. గత ఆర్థిక సంవత్సరం (2023–24)లో గ్రామీణాభివృద్ధికి (మౌలిక సదుపాయాలతో సహా) రూ. 2,38,204 కోట్లు కేటాయించగా (సవరించిన అంచనా రూ. 2,38,984 కోట్లు).. ఈ సారి బడ్జెట్లో (2024–25) దీన్ని రూ. 2,65,808 కోట్లకు పెంచుతున్నట్లు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ప్రకటించారు. ముఖ్యంగా ఉపాధి హామీకి మళ్లీ భారీగా నిధులతో పాటు గ్రామీణ రోడ్ల కోసం నాలుగో దశ, అదనంగా మరో 3 కోట్ల ఇళ్ల నిర్మాణం (పట్టణ, గ్రామీణ)పై ఫోకస్‌ చేయడం విశేషం!

జోరుగా ‘ఉపాధి’..
2024–25 కేటాయింపు: రూ.86,000 కోట్లు
2023–24 కేటాయింపు: రూ.60,000 కోట్లు 
గతేడాది బడ్జెట్లో నిధుల కోతకు గురైన మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకానికి (ఎంజీఎన్‌ఆర్‌ ఈజీఏ) మళ్లీ కేటాయింపులు జోరందుకున్నాయి. ముఖ్యంగా మోదీ సర్కారు ఈ పథకాన్ని నీరుగారుస్తుందన్న విమర్శల నేపథ్యంలో 2024–25 బడ్జెట్లో కేటాయింపులు 40 శాతం మేర పెరగడం విశేషం. అయితే, 2023–24 సవరించిన అంచనాల (రూ. 86,000 కోట్లు)తో పోలిస్తే దాదాపు అదే స్థాయిలో ఉన్నాయి.

గ్రామీణ రోడ్లు.. నాలుగో దశ షురూ
2024–25 కేటాయింపు:రూ.19,000 కోట్లు
2023–24 కేటాయింపు: రూ.17,000 కోట్లు (సవరించిన అంచనా)
గ్రామీణ ప్రాంతాల్లో రోడ్ల నిర్మాణం కోసం అమలు చేస్తున్న ఈ ఫ్లాగ్‌షిప్‌ స్కీమ్‌ (ప్రధాన మంత్రి గ్రామీణ సడక్‌ యోజన పీఎంజీఎస్‌వై)కు ఈసారి బడ్జెట్లో ప్రాధాన్యం లభించింది. ఈ స్కీమ్‌ నాలుగో దశను సీతారామన్‌ ప్రకటించారు. ‘పీఎంజీఎస్‌వై ఫేజ్‌–4లో భాగంగా 25,000 పల్లె ప్రాంతాలను పక్కా రోడ్లతో అనుసంధానం చేయనున్నాం. ఆయా ప్రాంతాల్లో జనాభా పెరుగుదలకు అనుగుణంగా రోడ్లను అభి­వృ­ద్ధి చేస్తాం’ అని మంత్రి పేర్కొ­న్నారు. 

2023–24 సవరించిన అంచనాలు రూ. 17,000 కోట్లతో పోలిస్తే, 2024–25 పూర్తి స్థాయి బడ్జెట్లో కేటాయింపులు దా­దా­పు 12 శాతం పెరగడం గమనార్హం. స్కీమ్‌ మొదలైన­ప్పటి నుంచి ఈ ఏడాది జన­వరి వరకు మొత్తం 8,15,072 కిలోమీటర్ల పొడవైన రోడ్లకు అనుమ­తులు మంజూరు కా­గా, 7,51,163 కిలోమీటర్ల రోడ్ల నిర్మాణం పూర్తయింది.

సొంతింటికి దన్ను (పీఎంఏవై)
2024–25 కేటాయింపులు: రూ.80,671 కోట్లు
2023–24 కేటాయింపులు: రూ.54,103 కోట్లు  (సవరించిన అంచనా)
ఠిపేదలు, మధ్య తరగతి వర్గాలకు సొంతింటి కల నెరవేర్చేలా బడ్జెట్లో ఈ పథకానికి నిధులు భారీగా పెంచారు. గ్రామీణ ప్రాంతాల్లో పేద, బలహీన వర్గాలకు 2.95 కోట్ల ఇళ్లను నిర్మించాలనేది లక్ష్యం కాగా, 2023 మార్చి నాటికి 2.94 కోట్ల ఇళ్ల నిర్మాణం పూర్తయింది. కాగా, గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో వచ్చే ఐదేళ్లలో అదనంగా మరో 3 కోట్ల ఇళ్ల నిర్మాణాన్ని ఈ స్కీమ్‌ కింద చేపట్టనున్నట్లు తాజా బడ్జెట్లో ఆర్థిక మంత్రి ప్రకటించారు. 

ఇందులో రెండు కోట్ల ఇళ్లను గ్రామాల్లో, కోటి ఇళ్లను పట్టణ పేదలు, మధ్య తరగతి కుటుంబాలకు అందించనున్నట్లు పేర్కొన్నారు. పీఎంఏవై (అర్బన్‌) 2.0 స్కీమ్‌ కోసం ఐదేళ్లలో రూ.10 లక్షల కోట్ల పెట్టుబడి పెట్టనున్నట్లు సీతారామన్‌ వివరించారు. ఇందులో భాగంగా వడ్డీ రాయితీ, చౌక రుణాల రూపంలో రూ. 2.2 లక్షల కోట్ల సాయం అందిస్తామని చెప్పారు. రుణ ఆధారిత సబ్సిడీ స్కీమ్‌ (సీఎల్‌ఎస్‌ఎస్‌) కోసం ఈ బడ్జెట్లో రూ.4,000 కోట్లను కేంద్రం కేటాయించింది. మొత్తం మీద పీఎంఏవై (అర్బన్‌)కు ఈ బడ్జెట్లో రూ.30,170 కోట్లు దక్కాయి. 2023–24తో పోలిస్తే ఇది 20.19 శాతం ఎక్కువ.

స్వచ్ఛ భారత్‌ మిషన్‌..
2024–25 కేటాయింపు: రూ. 12,192 కోట్లు
2023–24 కేటాయింపు: రూ.9,550 కోట్లు (సవరించిన అంచనా)
దేశంలో బహిరంగ మలమూత్ర విసర్జనను పూర్తిగా తుడిచిపెట్టడానికి (ఓడీఎఫ్‌) 2014లో ఆరంభమైన ఈ స్వచ్ఛ భారత్‌ పథకం (ఎస్బీఎం) కిందికి ఘన వ్యర్ధాల (చెత్త నిర్మూలన), జల వ్యర్థాల నిర్వహణను కూడా తీసుకొచ్చారు. ఈ మిషన్‌ కింద, గ్రామీణ ప్రాంతాల్లో ఓడీఎఫ్‌ స్టేటస్‌ను పూర్తిగా సాధించినట్లు కేంద్రం ప్రకటించింది. దీన్ని స్థిరంగా కొనసాగించడంతో పాటు అన్ని గ్రామాల్లోనూ ఘన వ్యర్థాల నిర్వహణ, మురుగు నీటి నిర్వహణను అమలు చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. 

స్వచ్ఛ భారత్‌ (అర్బన్‌) పథకానికి ఈ బడ్జెట్లో రూ.5,000 కోట్లు కేటాయించారు. 2023–24 బడ్జెట్‌ అంచనా (రూ.5,000 కోట్లు)తో పోలిస్తే అదే స్థాయిలో ఉన్నప్పటికీ, సవరించిన అంచనా (రూ.2,550 కోట్లు)తో పోలిస్తే నిధులు రెట్టింపయ్యాయి. ఇక స్వచ్ఛభారత్‌ (గ్రామీణ) స్కీమ్‌కు రూ.7,192 కోట్లు కేటాయించారు. సవరించిన అంచనా (రూ.7,000 కోట్లు)తో పోలిస్తే స్వల్పంగా పెరిగింది.

తాగునీటికి కాస్త పెంపు.. 
2024–25 కేటాయింపు: రూ.69,927 కోట్లు
2023–24 కేటాయింపు: రూ.69,846 కోట్లు (సవరించిన అంచనా)
గ్రామీణ కుటుంబాలన్నింటికీ స్వచ్ఛమై­న తాగునీటిని అందరికీ అందించేందుకు 2019–20లో జల్‌ జీవన్‌ మిషన్‌ ఫ్లాగ్షిప్‌ ప్రోగ్రామ్‌ను  ప్రకటించారు. 2024 నాటికి దీన్ని సాధించాలనేది కేంద్రం లక్ష్యం. కాగా, దేశంలోని మొత్తం 19.26 కోట్ల గ్రామీణ కుటుంబాలకు గాను ఇప్పటివరకు 14.22 కోట్ల కుటుంబాలకు తాగు నీటి సదుపాయం (కుళా­యి కనెక్షన్లు) కల్పించినట్లు అంచనా.


పట్టణ పేదల ఇళ్లకు.. 2.2 లక్షల కోట్లు
» సరసమైన రేట్లకు రుణాలు.. వడ్డీ రాయితీ
»  మొత్తం రూ.10 లక్షల కోట్లతో పీఎంఏవై అర్బన్‌ 2.0
»  రెంటల్‌ హౌసింగ్‌ మార్కెట్లకు ప్రోత్సాహం
»  పారిశ్రామిక కార్మికుల కోసం అద్దె ఇళ్లు
మహిళలు కొనే ఆస్తులపై సుంకం తగ్గింపు!న్యూఢిల్లీ: ప్రధానమంత్రి ఆవాస్‌ యోజన–అర్బన్‌  పథకం కింద వచ్చే ఐదేళ్లలో కోటి మంది పట్టణ పేదలు, మధ్యతరగతి కుటుంబాలకు గృహ నిర్మాణాల నిమిత్తం రూ.2.2 లక్షల కోట్ల సాయం అందించాలని కేంద్రం నిర్ణయించింది. సరసమైన రేట్లతో రుణాలు అందించేందుకు వీలుగా వడ్డీ రాయితీని కూడా ప్రతిపాదించింది. మంగళవారం బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ఈ మేరకు ప్రకటన చేశారు. ప్రధానమంత్రి ఆవాస్‌ యోజన పథకం (పీఎంఏవై) కింద 3 కోట్ల అదనపు గృహాలను ప్రకటించిన విషయాన్ని ఆమె గుర్తు చేశారు. 

ఈ మేరకు నిధుల కేటాయింపు జరుపుతున్నామని చెప్పారు. కేంద్రసాయం రూ.2.2 లక్షల కోట్లతో కలిపి మొత్తం రూ.10 లక్షల కోట్ల పెట్టుబడితో పీఎంఏవై అర్బన్‌ 2.0 పథకాన్ని చేపడతామని తెలిపారు. రెంటల్‌ హౌసింగ్‌ మార్కెట్లను ప్రోత్సహించేందుకు వీలుగా కేంద్రం విధానాలను రూపొందిస్తుందని చెప్పారు. అద్దె ఇళ్ల లభ్యతను పెంచడంతో పాటు నాణ్యత, పారదర్శకతకు అవసరమైన విధానాలు, నియమ నిబంధనలు రూపొందిస్తామని తెలిపారు. పారిశ్రామిక కార్మికుల కోసం డార్మెటరీ తరహా వసతులతో అద్దె గృహాలు నిర్మిస్తామని ఆర్థికమంత్రి వెల్లడించారు. ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంతో దీనిని చేపడతామన్నారు. 

రాష్ట్రాలు స్టాంప్‌ డ్యూటీ తగ్గించాలి
మహిళలు కొనుగోలు చేసే ఆస్తులపై సుంకాన్ని మరింత తగ్గించే అంశంపై కేంద్రం దృష్టి సారిస్తున్నట్లు ఆర్థిక మంత్రి తెలిపారు. పట్టణాభివృద్ధి పథకాల్లో దీనినొక తప్పనిసరి అంశంగా చేయనున్నట్లు చెప్పారు. అధిక స్టాంప్‌ డ్యూటీ వసూలు చేసే రాష్ట్రాలు వాటిని తగ్గించే అంశాన్ని పరిశీలించాలని సూచించారు. ఆస్తుల కొనుగోలు లావాదేవీలపై రాష్ట్రాలు విధించే పన్నును స్టాంప్‌ డ్యూటీగా పేర్కొంటారు. 

ఆస్తుల రిజిస్ట్రేషన్‌ సమయంలో దీనిని చెల్లించడం జరుగు­తుంది. రాష్ట్ర ప్రభుత్వాలకు ఇదొక ప్రధాన ఆదాయ వనరు. ఇలావుండగా పన్ను ప్రయోజ­నాల విషయంలో ఆధార్‌ నంబర్‌కు బదులుగా ఆధార్‌ నమోదు ఐడీ వినియో­గాన్ని నిలిపివేయాలని సీతారామన్‌ ప్రతిపాదించారు.  

పెద్ద నగరాలకు రవాణా ఆధారిత అభివృద్ధి ప్రణాళిక
దేశంలో 30 లక్షలకు పైగా జనాభా కలిగిన 14 పెద్ద నగరాలకు రవాణా ఆధారిత అభివృద్ధి ప్రణాళికను కేంద్రం ప్రతిపాదించింది. నగరాల సృజనాత్మకతో కూడిన పునర్‌ అభివృద్ధి కోసం ఓ ఫ్రేమ్‌వర్క్‌ను రూపొందిస్తామని తెలిపింది. నగరాలను అభివృద్ధి కేంద్రాలు (గ్రోత్‌ హబ్‌లు)గా తీర్చిదిద్దేందుకు వీలుగా రాష్ట్రాలతో కలిసి పనిచేస్తామని కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌ తన బడ్జెట్‌ ప్రసంగంలో వెల్లడించారు. టౌన్‌ ప్లానింగ్‌ పథకాల వినియోగంతో నగర చుట్టుపక్కల ప్రాంతాల అభివృద్ధి, ఆర్థిక, రవాణా ప్రణాళిక ద్వారా దీనిని సాధిస్తామని చెప్పారు.    

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement