హెల్త్‌కు 90,958 కోట్లు
గత ఏడాది కన్నా 12.96 % పెరిగిన కేటాయింపులు
కేన్సర్ చికిత్సకు వాడే 3 మందులపై కస్టమ్స్ డ్యూటీ మినహాయింపు
న్యూఢిల్లీ: కేంద్ర ఆరోగ్యశాఖకు 2024–25 బడ్జెట్‌లో రూ.90,958.63 కోట్లను కేటాయించారు. ఇది 2023–24 సవరించిన అంచనాల కంటే (రూ.80,517.62 కోట్లు) 12.96 శాతం ఎక్కువ కావడం గమనార్హం. అలాగే ఈ బడ్జెట్‌లో కేన్సర్ చికిత్సకు ఉపయోగించే మూడు కీలక మందుల (ట్రాస్తుజుమబ్ డెరక్స్‌టెకన్, ఒసిమెర్టినిబ్, డుర్వాలుమాబ్)పై కస్టమ్స్ డ్యూటీని పూర్తిగా మినహాయిస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ‘కేన్సర్ రోగులకు ఉపశమనం ఇచ్చేందుకు మరో మూడు మందులపై కస్టమ్స్ డ్యూటీని మినహాయిస్తున్నాం. అలాగే ఎక్స్‌రే ట్యూబ్స్, మెడికల్ ఎక్స్‌రే మిషన్లలో వాడే ఫ్లాట్ ప్యానెల్ డిటెక్టర్లపై బేసిక్ కస్టమ్స్ డ్యూటీ (బీసీడీ)లో మార్పులు చేస్తున్నాం’ అని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు.
ఆయుష్ మంత్రిత్వ శాఖకు గత ఏడాది రూ.3వేల కోట్లు ఇవ్వగా, ఈసారి 3,712.49కోట్లకు పెంచారు. ఆరోగ్య శాఖకు కేటాయించిన మొత్తం రూ.90,958.63 కోట్లలో రూ.87,656.90 కోట్లను ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖకు, ఆరోగ్య పరిశోధన విభాగానికి రూ.3,301.73 కోట్లను కేటాయించారు. గత ఏడాది ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖకు రూ.77,624.79 కోట్లు ఇవ్వగా ఈసారి రూ.100కోట్ల మేర పెరగడం విశేషం. కేంద్ర ప్రాయోజిత పథకాలైన జాతీయ ఆరోగ్య మిషన్‌కు కేటాయింపులు గత ఏడాది రూ.31,550.87 కోట్లు ఉండగా, ఈసారి అది 36,000 కోట్లకు పెరిగింది.
ప్రధానమంత్రి జన్ ఆరోగ్య యోజన (పీఎం జేఏవై)కి కేటాయింపులు రూ. 6,800 కోట్ల నుంచి రూ.7,300 కోట్లకు పెరగడం గమనార్హం. జాతీయ టెలి మెంటల్ హెల్త్ ప్రోగ్రామ్‌కు కేటాయింపులను రూ.65 కోట్ల నుంచి రూ.90 కోట్లకు పెంచారు. నేషనల్ డిజిటల్ హెల్త్ మిషన్‌కు గత ఏడాది మాదిరే రూ.200 కోట్లు కేటాయించారు. స్వయంప్రతిపత్తి విభాగాలకు గత ఏడాది (రూ.17,250.90) కేటాయించిన దాని కంటే స్వల్పంగా పెంచుతూ రూ.18,013.62 కోట్లు కేటాయించారు. ఢిల్లీ ఎయిమ్స్‌కు గత ఏడాది రూ.4,278 కోట్లు కేటాయించగా ఈసారి బడ్జెట్‌లో రూ.4,523 కోట్లు ఇచ్చారు. భారత మెడికల్ కౌన్సిల్‌కు గత ఏడాది రూ.2295.12 కోట్ల ఇవ్వగా ఈసారి రూ.2,732.13 కోట్లు కేటాయించారు.
మూడు కేన్సర్ మందులు 20% మేర తగ్గుతాయి
కేన్సర్ చికిత్సలో వాడే మూడు రకాల మందులపై కస్టమ్స్ సుంకాన్ని మినహాయించడంపై ఆరోగ్యరంగ నిపుణులు హర్షం వ్యక్తంచేశారు. ఈ సుంకం తగ్గింపు వల్ల మందుల ధరలు 10–20 శాతం మేర తగ్గుతాయని ఢిల్లీలోని సీకే బిర్లా ఆస్పత్రికి చెందిన సర్జికల్ ఆంకాలజీ డైరెక్టర్ డాక్టర్ మన్‌దీప్ సింగ్ మల్హోత్రా చెప్పారు. అయితే, ఆరోగ్య సంరక్షణ వ్యయాన్ని జీడీపీలో 2.5 శాతానికి పెంచాలన్న సుదీర్ఘ డిమాండ్‌ను ఈ బడ్జెట్ కూడా నెరవేర్చకపో వడంపై నిపుణులు పెదవి విరుస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment