ఆర్థిక శక్తి | Bigger in the budget to promote the development of women in the country | Sakshi
Sakshi News home page

ఆర్థిక శక్తి

Published Wed, Jul 24 2024 4:27 AM | Last Updated on Wed, Jul 24 2024 6:06 AM

Bigger in the budget to promote the development of women in the country

వివిధ మంత్రిత్వశాఖలు, పథకాల కింద బాలికలు,మహిళల కోసం రూ.3 లక్షల కోట్లు కేటాయింపు

న్యూఢిల్లీ: దేశంలో మహిళల అభివృద్ధిని ప్రోత్సహించేందుకు 2024–25 బడ్జెట్‌ లో పెద్దపీట వేసినట్లు కేంద్రం తెలిపింది. వివిధ మంత్రిత్వశాఖలు, పథకాల కింద బాలికలు, మహిళల కోసం రూ. 3 లక్షల కోట్లకుపైగా కేటాయింపులు చేసినట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ చెప్పారు. దేశ ఆర్థికాభివృద్ధిలో మహిళలు పోషిస్తున్న పాత్రను మరింత పెంచాలన్న ప్రభుత్వ చిత్తశుద్ధికి ఈ కేటాయింపులే నిదర్శనమన్నారు. 

ముఖ్యంగా మహిళలు అధిక సంఖ్యలో ఉద్యోగాల్లో చేరేలా ప్రోత్సహించేందుకు దేశంలో మహిళా హాస్టళ్లను ఏర్పాటు చేస్తామని నిర్మలా సీతారామన్‌ తెలిపారు. పనిచేసే తల్లులకు ఆలంబనగా ఉండేందుకు పని ప్రదేశాల్లో శిశు సంరక్షణ కేంద్రాలను నిర్మిస్తామన్నారు. ఈ విషయంలో పరిశ్రమల సహకారం తీసుకుంటామని వివరించారు. మహిళలకు ప్రత్యేకంగా నైపుణ్య శిక్షణ, స్వయం సహాయక బృందాలకు మార్కెట్‌ అవకాశాలు లభించేలా చూస్తామని నిర్మలా సీతారామన్‌ చెప్పారు.

..: పెరిగిన మహిళా ఉద్యోగులు :..
దేశంలో మహిళా ఉద్యోగుల సంఖ్య పెరిగిందని కేంద్రం తెలిపింది. ఈ ఏడాది మే నాటికి కొత్తగా 2.4 లక్షల మంది మహిళలు ఉద్యోగాల్లో చేరారని చెప్పింది. ఇది గతేడాది గణాంకాలతో పోలిస్తే 12.1% అధి కమని వివరించింది. అలాగే 2024 ఆర్థిక సంవత్సర రెండో త్రైమాసికంలో మహిళా కార్మికశక్తి 24 శాతానికి పెరిగినట్లు కేంద్రం వెల్లడించింది. గతేడాదితో పోలిస్తే మొత్తమీద 17.2% మహిళా ఉద్యోగులు పెరిగారని.. సమ్మిళిత కార్మికశక్తి దిశగా ఇది సానుకూల పరిణామమని పేర్కొంది.

స్త్రీ, శిశు సంక్షేమానికి కేటాయింపులు ఇలా..
» స్త్రీ, శిశు సంక్షేమానికి రూ. 26,092 కోట్లుకేటాయించింది. ఇది గతేడాది సవరించినఅంచనాలు రూ. 25,448 కోట్ల కంటే 2.5 శాతం అధికం.
» చిన్నారుల్లో పౌష్టికాహార లోపాన్ని నివారించేందుకు ఉద్దేశించిన సాక్షంఅంగన్‌వాడీ, పోషణ్‌ 2.0 పథకాలకు అత్యధికంగా రూ. 21,200 కోట్లు
» శిశు సంరక్షణ సేవలు,సంక్షేమానికి ఉద్దేశించిన మిషన్‌ వాత్సల్య కార్యక్రమానికి గతేడాది తరహాలోనే రూ. 1,472 కోట్లు.
» సంబాల్, సామర్థ్య ఉప పథకాలతో కూడిన మిషన్‌ శక్తి పథకానికి రూ. 3,145 కోట్లు.ఇందులో బేటీ బచావో.. బేటీ పఢావో లాంటి పథకాలతో కూడిన సంబాల్‌ పథకానికి రూ. 629 కోట్లు.
» పిల్లల అభివృద్ధి, శిక్షణ, పరిశోధనా సంస్థ ఎన్‌ఐపీసీసీడీకిరూ. 88.87 కోట్లు, చిన్నారుల దత్తతను పర్యవేక్షించేసీఏఆర్‌ఏ (కారా)కు రూ. 11.40 కోట్లు.
» మహిళా భద్రతను పెంచేందుకు ఉద్దేశించిన నిర్భయా ఫండ్‌కురూ. 500 కోట్లు.
» ఐక్యరాజ్య సమితిఅనుబంధ సంస్థ యూనిసెఫ్‌కు 5.60 కోట్లు.

కేటాయింపులు హర్షణీయం
‘ఏ దేశానికైనా మహిళలే వెన్నెముక.దేశ సుస్థిరాభివృద్ధికి మహిళా సాధికారత, భాగస్వామ్యం కీలకం.కేంద్ర బడ్జెట్‌లో మహిళలకు రూ.3 లక్షల కోట్లకుపైగా కేటాయించడంఈ వాస్తవాన్ని ప్రతిబింబిస్తోంది. మహిళా హాస్టళ్లు, శిశుసంరక్షణ కేంద్రాల ఏర్పాటు, అతివలకు నైపుణ్య శిక్షణలాంటి ప్రతిపాదనలు హర్షణీయం. - రేఖా శర్మ జాతీయ మహిళా కమిషన్‌ చైర్‌పర్సన్‌  

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement