Women Development&Child Welfare Dept
-
ఆర్థిక శక్తి
న్యూఢిల్లీ: దేశంలో మహిళల అభివృద్ధిని ప్రోత్సహించేందుకు 2024–25 బడ్జెట్ లో పెద్దపీట వేసినట్లు కేంద్రం తెలిపింది. వివిధ మంత్రిత్వశాఖలు, పథకాల కింద బాలికలు, మహిళల కోసం రూ. 3 లక్షల కోట్లకుపైగా కేటాయింపులు చేసినట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చెప్పారు. దేశ ఆర్థికాభివృద్ధిలో మహిళలు పోషిస్తున్న పాత్రను మరింత పెంచాలన్న ప్రభుత్వ చిత్తశుద్ధికి ఈ కేటాయింపులే నిదర్శనమన్నారు. ముఖ్యంగా మహిళలు అధిక సంఖ్యలో ఉద్యోగాల్లో చేరేలా ప్రోత్సహించేందుకు దేశంలో మహిళా హాస్టళ్లను ఏర్పాటు చేస్తామని నిర్మలా సీతారామన్ తెలిపారు. పనిచేసే తల్లులకు ఆలంబనగా ఉండేందుకు పని ప్రదేశాల్లో శిశు సంరక్షణ కేంద్రాలను నిర్మిస్తామన్నారు. ఈ విషయంలో పరిశ్రమల సహకారం తీసుకుంటామని వివరించారు. మహిళలకు ప్రత్యేకంగా నైపుణ్య శిక్షణ, స్వయం సహాయక బృందాలకు మార్కెట్ అవకాశాలు లభించేలా చూస్తామని నిర్మలా సీతారామన్ చెప్పారు...: పెరిగిన మహిళా ఉద్యోగులు :..దేశంలో మహిళా ఉద్యోగుల సంఖ్య పెరిగిందని కేంద్రం తెలిపింది. ఈ ఏడాది మే నాటికి కొత్తగా 2.4 లక్షల మంది మహిళలు ఉద్యోగాల్లో చేరారని చెప్పింది. ఇది గతేడాది గణాంకాలతో పోలిస్తే 12.1% అధి కమని వివరించింది. అలాగే 2024 ఆర్థిక సంవత్సర రెండో త్రైమాసికంలో మహిళా కార్మికశక్తి 24 శాతానికి పెరిగినట్లు కేంద్రం వెల్లడించింది. గతేడాదితో పోలిస్తే మొత్తమీద 17.2% మహిళా ఉద్యోగులు పెరిగారని.. సమ్మిళిత కార్మికశక్తి దిశగా ఇది సానుకూల పరిణామమని పేర్కొంది.స్త్రీ, శిశు సంక్షేమానికి కేటాయింపులు ఇలా..» స్త్రీ, శిశు సంక్షేమానికి రూ. 26,092 కోట్లుకేటాయించింది. ఇది గతేడాది సవరించినఅంచనాలు రూ. 25,448 కోట్ల కంటే 2.5 శాతం అధికం.» చిన్నారుల్లో పౌష్టికాహార లోపాన్ని నివారించేందుకు ఉద్దేశించిన సాక్షంఅంగన్వాడీ, పోషణ్ 2.0 పథకాలకు అత్యధికంగా రూ. 21,200 కోట్లు» శిశు సంరక్షణ సేవలు,సంక్షేమానికి ఉద్దేశించిన మిషన్ వాత్సల్య కార్యక్రమానికి గతేడాది తరహాలోనే రూ. 1,472 కోట్లు.» సంబాల్, సామర్థ్య ఉప పథకాలతో కూడిన మిషన్ శక్తి పథకానికి రూ. 3,145 కోట్లు.ఇందులో బేటీ బచావో.. బేటీ పఢావో లాంటి పథకాలతో కూడిన సంబాల్ పథకానికి రూ. 629 కోట్లు.» పిల్లల అభివృద్ధి, శిక్షణ, పరిశోధనా సంస్థ ఎన్‌ఐపీసీసీడీకిరూ. 88.87 కోట్లు, చిన్నారుల దత్తతను పర్యవేక్షించేసీఏఆర్ఏ (కారా)కు రూ. 11.40 కోట్లు.» మహిళా భద్రతను పెంచేందుకు ఉద్దేశించిన నిర్భయా ఫండ్కురూ. 500 కోట్లు.» ఐక్యరాజ్య సమితిఅనుబంధ సంస్థ యూనిసెఫ్‌కు 5.60 కోట్లు.కేటాయింపులు హర్షణీయం‘ఏ దేశానికైనా మహిళలే వెన్నెముక.దేశ సుస్థిరాభివృద్ధికి మహిళా సాధికారత, భాగస్వామ్యం కీలకం.కేంద్ర బడ్జెట్లో మహిళలకు రూ.3 లక్షల కోట్లకుపైగా కేటాయించడంఈ వాస్తవాన్ని ప్రతిబింబిస్తోంది. మహిళా హాస్టళ్లు, శిశుసంరక్షణ కేంద్రాల ఏర్పాటు, అతివలకు నైపుణ్య శిక్షణలాంటి ప్రతిపాదనలు హర్షణీయం. - రేఖా శర్మ జాతీయ మహిళా కమిషన్ చైర్పర్సన్ -
ఖాళీగా ఉన్న అంగన్వాడి వర్కర్లు, హెల్పర్ పోస్టులను వెంటనే భర్తీ చేయండి: సీఎం జగన్
సాక్షి, అమరావతి: మహిళాభివృద్ధి, శిశు సంక్షేమంపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సమీక్షా సమావేశం నిర్వహించారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యలయంలో జరిగిన ఈ సమావేశానికి మహిళాభివృద్ధి, శిశు సంక్షేమశాఖ మంత్రి కేవీ ఉషాశ్రీచరణ్, మహిళాభివృద్ధి, శిశు సంక్షేమశాఖ ముఖ్య కార్యదర్శి ముద్దాడ రవిచంద్ర, ఆర్ధికశాఖ కార్యదర్శి కేవీవీ సత్యనారాయణ, పాఠశాల విద్యాశాఖ కమిషనర్ (మౌలిక సదుపాయాలు) కాటమనేని భాస్కర్, ఏపీ స్టేట్ సివిల్ సఫ్లైస్ కార్పొరేషన్ లిమిటెడ్ వీసీ అండ్ ఎండీ వీరపాండ్యన్, ఏపీ డెయిరీ డెవలప్మెంట్ కోపరేటివ్ ఫెడరేషన్ ఎండీ అహమ్మద్ బాబు, మహిళాభివృద్ధి, శిశు సంక్షేమశాఖ డైరెక్టర్ ఎం విజయ సునీత ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు. అంగన్వాడీలలో నాడు – నేడు పనులపై సీఎం జగన్ సమీక్ష ఫౌండేషన్ స్కూళ్లలో భాగంగా మారిన సుమారు 10వేలకుపైగా అంగన్వాడీల్లో పనులు జరుగుతున్నాయని వెల్లడించిన అధికారులు మిగిలిన సుమారు 45వేల అంగన్వాడీలలో కూడా ప్రాధాన్యతా క్రమంలో పనులు చేసుకుంటూ ముందుకెళ్లాలన్న సీఎం అంగన్వాడీ సెంటర్లలో ఏయే సదుపాయాలు ఉన్నాయి? కల్పించాల్సినవి ఏంటి? అన్న దానిపై గ్రామ సచివాలయాల ద్వారా సమాచారం తెప్పించుకోవాలన్న సీఎం ఫ్యాన్లు, లైట్లు, ఫర్నిచర్, టాయిలెట్లు ఇలాంటి సౌకర్యాలపై సమాచారం తెప్పించుకోవాలన్న సీఎం. ప్రతి అంగన్వాడీలో చేపట్టాల్సిన పనులపై ప్రతిపాదనలు తయారుచేసి.. తనకు నివేదిక ఇవ్వాలన్న సీఎం పిల్లల ఎదుగుదలను పర్యవేక్షించే పరికరాలను కూడా అంగన్వాడీల్లో ఉంచుకోవాలన్న సీఎం గ్రోత్ మానిటరింగ్ ఎక్విప్మెంట్ను వెంటనే ఏర్పాటు చేయాలన్న సీఎం ఖాళీగా ఉన్న అంగన్వాడీ వర్కర్లు, అంగన్వాడీ హెల్పర్ పోస్టులను వెంటనే భర్తీచేయాలని సీఎం ఆదేశం. మహిళా శిశుసంక్షేమశాఖలో ఉన్న ఖాళీలను కూడా భర్తీచేయాలన్న సీఎం. సంపూర్ణపోషణ కింద పంపిణీ ప్రక్రియకు సంబంధించి సమర్థవంతమైన ఎస్ఓపీ రూపొందించాలన్న సీఎం. పెన్షన్లు ఎంత పకడ్బందీగా పంపిణీ చేస్తున్నామో.. సంపూర్ణ పోషణ పంపిణీ కూడా అంతే సమర్థవంతంగా చేయాలన్న సీఎం. క్రమం తప్పకుండా అంగన్వాడీలపై పర్యవేక్షణ జరగాలన్న సీఎం. ఎప్పటికప్పుడు అంగన్వాడీ సెంటర్లను పరిశీలిస్తూ.. అక్కడి పరిస్థితులను మెరుగుపరిచేలా చర్యలు తీసుకోవాలన్న సీఎం. అంగన్వాడీల్లో సూపర్ వైజర్లపైన కూడా పర్యవేక్షణ పకడ్బందీగా ఉండాలన్న సీఎం. -
ప్రాథమిక జాబితా ఏది.. కటాఫ్ మార్కులేవి?
సాక్షి, హైదరాబాద్: మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖలో సూపర్వైజర్ పోస్టుల నియామకాలపై ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. నియామకాల ప్రక్రియలో పారదర్శకత లోపించిందని క్షేత్రస్థాయి నుంచి సంబంధిత మంత్రి పేషీ, రాష్ట్ర కార్యాలయానికి ఫిర్యాదులు వస్తున్నాయి. ప్రాథమిక జాబితాను, కటాఫ్ మార్కులను ప్రకటించకుండా ప్రాథమికంగా ఎంపికైన అభ్యర్థుల ధ్రువపత్రాల పరిశీలన పూర్తి చేయడంపై అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. జిల్లాల వారీగా ఎవరెవరు ఎంపికయ్యారో: మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ పరిధిలో 420 ఉద్యోగాల భర్తీకి సంబంధించి ప్రభుత్వం గతేడాది నవంబర్‌లో నోటిఫికేషన్ జారీ చేసింది. అంగన్వాడీ టీచర్‌గా పదేళ్ల సీనియారిటీ, పదో తరగతి విద్యార్హతలను విధించడంతో దాదాపు 24 వేల మంది అభ్యర్థులు జనవరి రెండో తేదీన పరీక్ష రాశారు. రాత పరీక్ష తాలూకు ఫలితాలను ఫిబ్రవరిలో ప్రకటించిన మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ జిల్లాల వారీగా ఉన్న ఖాళీల ప్రకారం 1:2 పద్ధతిలో అభ్యర్థులను ఎంపిక చేసి సర్టిఫికెట్ వెరిఫికేషన్ కోసం వ్యక్తిగతంగా సమాచారం ఇచ్చింది. దీంతో నిర్దేశించిన తేదీల్లో అభ్యర్థులు ధ్రువపత్రాల పరిశీలనకు హాజరయ్యారు. అయితే జిల్లాల వారీగా ఎవరెవరు ప్రాథమికంగా ఎంపికయ్యారో స్పష్టత లేదు. అధికారుల వద్ద జాబితా ఉన్నా ఆ వివరాలను వెబ్సైట్లో లేదా జిల్లా కార్యాల యాల్లో అందుబాటులో ఉంచ కపోవడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. జిల్లాల వారీగా, కేటగిరీల వారీగా కటాఫ్ మార్కులనూ ఆ శాఖ వెల్లడించలేదు. దీంతో తమ కంటే తక్కువ మార్కులు వచ్చిన అభ్యర్థులను ఎంపిక చేశారంటూ ఉన్నతాధికారులకు, సంబంధిత మంత్రి కార్యాలయానికి పలువురు ఫిర్యాదులు చేస్తున్నారు. మరోవైపు మంత్రిని, ఆ శాఖ కమిషనర్‌ను వ్యక్తిగతంగా కలిసి సందేహాలను వ్యక్తపరుస్తున్నారు. ఫిర్యాదుల కోసం హెల్ప్‌లైన్ సూపర్వైజర్ పోస్టుల నియామకాలపై వస్తున్న ఫిర్యాదులను పరిష్కరించేందుకు మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ హెల్ప్‌లైన్ ఏర్పాటు చేసింది. ఫోన్ ద్వారా లేదా వాట్సాప్ ద్వారా ఫిర్యా దులు స్వీకరిస్తోంది. అభ్యర్థుల ప్రశ్నలకు వీలైనంత మేర సమాధానాలిస్తున్నామని చెబుతున్నారు. హెల్ప్‌లైన్ ఏర్పాటుతో మంత్రి పేషీకి, కమిషనరేట్‌కు అభ్యర్థుల తాకిడి తగ్గినా ఫిర్యాదులు మాత్రం తగ్గట్లేదు. కాగా, జిల్లాల వారీగా మెరిట్ జాబితా, ప్రాథమికంగా ఎంపికైన అభ్యర్థుల జాబితా, కేటగిరీల వారీగా కటాఫ్ వివరాలను మాత్రం మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ ఇప్పటికీ ప్రకటించలేదు. -
ఇల్లు చాలా డేంజర్
పనిచేసే చోట జరుగుతున్న వేధింపులపై స్త్రీలు ‘మీటూ’ అంటూ బయటికి వస్తున్నారు. ‘మా ఇంట్లో కూడా’ అని బాధిత మహిళలు బయటికి వచ్చే పరిస్థితి వస్తే కనుక అది కూడా చేజేతులా పురుషులు తెచ్చుకున్నదే అవుతుంది. మహిళలు ధరించే ఆభరణాల బరువును తులాల లెక్కన తూచగలం కానీ, మహిళలు భరించే గృహహింసల్ని ఏ తూనికలు, కొలతలతో తేల్చగలం? అయినప్పటికీ పాపం.. న్యూయార్క్‌లో ఉన్న ఐక్యరాజ్యసమితి, మనదేశంలోని ‘నేషనల్ క్రైమ్ బ్యూరో’ ఏడాదికిన్ని గృహహింసల మరణాలనీ, రోజుకింతమంది మహిళల ప్రాణాలు గాల్లో కలిసి పుట్టింటికి చేరుతున్నాయని చెప్పే ప్రయత్నమైతే చేస్తున్నాయి. ఎందుకీ ప్రయత్నం? దేశాల కోసం. మరింత మెరుగైన నివారణ చర్యలు చేపడతాయేమోనని. ఎందుకీ ప్రయాస? మగాళ్ల కోసం. తప్పు తెలుసుకుని కాస్తయినా మారతారేమోనని! అయినా ఈ గృహహింసల్ని, గృహహింస మరణాల్ని లెక్కేయడం ఎలా సాధ్య మౌతుందనిపిస్తుంది. జనాభా లెక్కల వాళ్లయినా, ఇంటికొచ్చి తలుపు తట్టి ‘ఎంతమంది ఉన్నారు?’ అని అడిగే కదా రాసుకుని వెళతారు. ఏదైనా అంతే. ఇళ్లు, కోళ్లు, కార్లు, స్టౌవ్‌లు, ఫ్రిజ్‌లు, ఫ్యాన్లు.. ఏవైనా. ఇవన్నీ చూసి.. ఉన్నవాళ్లింతమంది, లేనివాళ్లింతమంది అని టిక్ చేసుకుని వెళతారు. ఉండీ లేనట్లు కనిపించేవాళ్లు లెక్కలకు అందరు. గృహబలిమిని ఇలా ఏదో ఒక స్కేల్లో లెక్కేయగలరు గానీ, ‘గృహబలుల్ని’ ఎలానూ లెక్కేయలేరు. భర్త, అత్తమామలు కొడుతున్నారని బాధితురాలు బయటికి రావాలి. భర్త, అత్తమామలు కొట్టి చంపేశారని చనిపోయిన మహిళ అన్నో నాన్నో బయటికి రావాలి. వచ్చి పోలీస్ రిపోర్ట్ ఇవ్వాలి. పోలీస్‌లు ఎఫ్.ఐ.ఆర్. రాయాలి. అప్పుడే ఐరాసకు గానీ, నేషనల్ క్రైమ్ బ్యూరోకి గానీ లెక్క అందుతుంది. ఆ లెక్కల్ని తక్కెడలో వేసి పోయినేడాది కంటే ఈ ఏడాది ఇంత హింస పెరిగిందనీ, లేదంటే ఇంత హింస తగ్గిందనీ, ఆ దేశం ఈ దేశం కంటే బెటరనీ, ఈ దేశం ఆ దేశం కంటే వరస్ట్ అనీ డేటాను విశ్లేషించి, విడుదల చేస్తారు. మరి విశ్లేషణకు అందని డేటా మాటేమి? నాలుగ్గోడల మధ్యే సమాధి అయిపోతుంది.. ఏనాటికీ గొంతెత్తని, గొంతెత్తే పరిస్థితే లేని అసహాయురాలైన మహిళలా! ఇల్లు చాలా డేంజర్. ఎందుకంటే.. నాలుగ్గోడల మధ్య స్త్రీకి రక్షణా ఉంటుంది, రక్షణ లేని విషయాన్ని బయటపడనివ్వని అడ్డూ ఉంటుంది. లోపల అమ్మాయి ఎలా ఉందో లోపలికి వెళ్లకుండా తెలుసుకోలేం. లోపలికి వెళ్లినా అమ్మాయి బయటపడకుంటే అప్పుడూ తెలుసుకోలేం. వెలుగులోనే ఎంత అంధకారం! ‘నా తల్లి నవ్వులో ఎన్ని వెన్నెల పువ్వులో’.. అనుకుంటూ ఆమె కోసం ఊర్నుంచి తెచ్చినవేవో ఇచ్చి, కడుపునిండా తృప్తితో అమ్మానాన్న తిరిగి బసెక్కడానికి వచ్చేస్తే.. వారితో పాటు అమ్మాయి ఆక్రందన బస్సువరకూ వినిపిస్తుందా? ఊహు! స్త్రీకి బయట ఏదైనా జరుగుతుంటే ఏ పుణ్యాత్ములైనా అడ్డుపడే అవకాశం ఉంటుంది. ఏ ధైర్యవంతులైనా పోలీసులకు ఫోన్ చేసి చెప్పే అవకాశం ఉంటుంది. అడ్డుపడేవాళ్లు, పోలీసులకు ఫోన్ చేసేవాళ్లూ ఎవరూ లేకపోయినా ఆ మహిళ ప్రాణరక్షణ కోసం కనీసం పరుగెత్తిపోయే అవకాశమైనా ఉంటుంది.. రోడ్డు మీద నాలుగు గోడలు ఉండవు కాబట్టి. ఇల్లు అలాక్కాదు. ఇల్లు తప్పించుకుపోనివ్వదు. బైట గేట్లేసి ఉంటాయి. లోపల ఇంటి తలుపులు వేసి ఉంటాయి. వెనక దారి ఉంటే అవీ మూసి ఉంటాయి. ఇంకెక్కడికి తప్పించుకోవడం? హాల్లోంచి కిచెన్‌లోకి, కిచెన్‌లోంచి బాత్రూమ్లోకి, బాత్రూమ్లోంచి ఇంకో గదిలోకి, ఆ ఇంకో గదిలోంచి.. బెల్ట్ చేత్తో పట్టుకున్న వాడి దగ్గరకి, వాడి బెల్టు జారకుండా చేత్తో పట్టుకుని ఉన్న వారి దగ్గరికి, కొట్టీ కొట్టీ వాడు అలసిపోతే, వాడిని లేపి కూర్చోబెట్టడానికి సిద్ధంగా ఉన్న వారి దగ్గరికి! కొడుతున్న దెబ్బలు, పెడుతున్న పెడబొబ్బలు పక్కింటికైనా వినిపించవు. ఎవరి గృహహింస వారిదైపోయాక ఇంకేం పక్కిళ్లు! ఈ ఏడాది జూన్‌లో.. ‘స్త్రీకి ప్రపంచంలోకెల్లా మోస్ట్ డేంజరస్ కంట్రీ.. ఇండియా’ అని ఒక రిపోర్ట్ వచ్చింది. లండన్‌లోని ‘థామ్సన్ రాయిటర్స్ ఫౌండేషన్’ ఇచ్చింది ఆ నివేదిక. ‘మీ కోడల్ని చంపుకుతింటున్నారటగా’ అని అడిగితే.. ‘అబ్బెబ్బే ఇంకెవరి కోడలి గురించైనా మీరు విని ఉంటారు’ అని భుజాలు తడుముకున్నట్లు.. ఇండియా వెంటనే ఖండించింది. ‘ఏ దేశాన్ని చూసి ఏ దేశం అనుకున్నారో..’ అని రాయిటర్స్ ఫౌండేషన్ మీద మన ఉమన్ డెవలప్మెంట్ శాఖలోని అధికారులు సెటైర్ వేశారు. ఆర్నెల్ల తర్వాత ఇప్పుడు మరో నివేదిక వచ్చింది. అదే.. ఐరాస వాళ్లది. మహిళకు ప్రపంచంలోకెల్లా మోస్ట్ డేంజరస్.. ఆమె ఇల్లేనట! మనదేశ మహిళకు అని కాదు. ఏ దేశంలోనైనా గృహమే మహిళకు నరక సీమ అని ఐక్యరాజ్య సమితి రూఢీ చేసుకుని ఒక నివేదికను విడుదల చేసింది. ఈ నివేదికను ఎవరూ వ్యతిరేకించలేదు. ఖండించలేదు. మౌనంగా ఉండిపోయారు.. కొత్త విషయం ఏముంది ఇందులో అన్నట్లు. ‘మీ ఇంట్లో ఆడవాళ్లపై హింస జరుగుతోంది’ అని న్యూయార్క్ నుంచి ఐరాస వచ్చి చెప్పాలా? ఇంటాయనకు తెలీదా! ఆయనకు సపోర్టుగా ఆమెను జుట్టు పట్టుకుని కొట్టే ఇంటి మనుషులకు తెలీదా? ఏమిటి దీనికి పరిష్కారం? ఇంట్లోంచి బయటికి వచ్చేయడం. ఒంటిపై.. కనిపించకుండా ఉండి, కుటుంబ గౌరవాన్ని కాపాడుతున్న గాయాలను బయటికి చూపించడం. స్త్రీ మాన మర్యాదల్ని భంగపరిచే ఇంటికి గౌరవం ఉన్నట్లు? దాన్ని దాచాల్సిన అవసరం ఏం ఉన్నట్లు? పనిచేసే చోట జరుగుతున్న వేధింపులపై స్త్రీలు ‘మీటూ’ అంటూ బయటికి వస్తున్నారు. ‘మా ఇంట్లో కూడా’ అని బాధితుల మహిళలు బయటికి వచ్చే పరిస్థితి వస్తే కనుక అది చేజేతులా పురుషులు తెచ్చుకున్నదే అవుతుంది. లెక్కలు కాకుండా ఐరాస ఇంకా ఏం చెప్పింది? ► ఎన్ని చర్యలు తీసుకున్నా మహిళల ‘గృహమరణాలను’ ప్రపంచ దేశాలు ఆపలేకపోతున్నాయి. ► 2012 నుంచి మహిళల గృహమరణాలు మరీ ఎక్కువయ్యాయి. మహిళల గృహమరణాలను తగ్గించడానికి, నిర్మూలించడానికి ఐరాసా ఏం చెయ్యాలంది? ► పోలీసు వ్యవస్థకు, నేర విచారణ వ్యవస్థకు, ఆరోగ్య సేవల వ్యవస్థకు మధ్య సమన్వయం ఉండాలి. ► గృహమరణాల వెనుక ఏ విధమైన ఉద్దేశాలు ఉంటున్నాయో, వాటి మూల కారణాలేమిటో అధ్యయనం చేయాలి. ► గృహమరణాలను తగ్గించడానికి పురుషుల సహాయాన్నీ తీసుకోవాలి. పురుషాధిక్యం, స్రీవిధేయత అనే పూర్వపు భావజాలాలను మార్చే ప్రయత్నం చేయాలి. మన దేశంలో? మామూలే. డౌరీ డెత్స్. వరకట్న మరణాలు! ఇండియాలో సంభవిస్తున్న మహిళల గృహమరణాలలో ఎక్కువ భాగం వరకట్నం వేధింపుల వల్లనేనని యు.ఎన్.ఒ.డి.సి నివేదిక పేర్కొంది. ఇందుకోసం 2016 నాటి సర్వే వివరాలనే పరిగణనలోకి తీసుకుంది. ఆ ఏడాది భారతదేశంలో మహిళల బలవన్మరణాల రేటు 2.8 శాతంగా ఉంది. ఇది.. మహిళల పాలిట నరక దేశాలని మనం భావిస్తున్న కెన్యా కంటే (2.6), టాంజానియా కంటే (2.5), అజర్బైజాన్ కంటే (1.8), జోర్డాన్ కంటే (0.8), తజికిస్తాన్ కంటే (0.4) ఎక్కువ! మరొక సంగతి. 15–45 ఏళ్ల మధ్య వయసులోని భారతీయ మహిళల్లో 33.5 శాతం మంది గృహహింసకు గురవుతున్నారు. మన దేశ ‘నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో’ లెక్కల ప్రకారం ఏటా సంభవిస్తున్న మహిళల గృహ మరణాలలో 40 నుంచి 50 శాతం వరకు వరకట్నం వల్ల సంభవిస్తున్నవే. ప్రపంచవ్యాప్తంగా 2017లో బాలికలు, యువతులు, మహిళల బలవన్మరణాలు 50,000: భర్త లేదా ఇతర కుటుంబ సభ్యుల చేతుల్లో, చేతలవల్ల దుర్మరణం పాలైన మహిళల సంఖ్య. 17,000: పై యాభై వేలల్లో భర్త, లేదా పూర్వపు భర్త పెట్టిన భౌతికహింస తాళలేక దుర్మరణం చెందిన మహిళల సంఖ్య. 87,000: లైంగిక వివక్ష కారణంగా ప్రాణాలు కోల్పోయిన మొత్తం మహిళలు, బాలికల సంఖ్య (పై 50 వేల మందితో కలిపి). 137: గృహహింస కారణంగా చనిపోతున్న మహిళల సంఖ్య.. రోజుకు. నివేదిక ఎవరిది? ఐక్యరాజ్యసమితి ‘ఆఫీస్ ఆన్ డ్రగ్స్ అండ్ క్రైమ్’ (యు.ఎన్.ఒ.డి.సి) ఎప్పుడు విడుదలైంది? నవంబర్ 25న. అంతర్జాతీయ మహిళా హింస నిర్మూలన దినం సందర్భంగా. ఎవరు ఎంత మూట కట్టుకున్నారు? ఆసియన్లు : 20,000 ఆఫ్రికన్లు : 19,000 అమెరికన్లు : 8,000 యూరోపియన్లు : 3,000 ఓషియానియన్లు : 300 ....................................................... లక్షకు మరణాల రేటు ఆఫ్రికా : 3.1 అమెరికా : 1.6 ఆసియా : 0.9 యూరప్ : 0.7 -
305 పోస్టులు.. 3887 మంది అభ్యర్థులు
ఒంగోలు కలెక్టరేట్, న్యూస్‌లైన్: మహిళా శిశు సంక్షేమ శాఖలో పెద్ద సంఖ్యలో సూపర్వైజరు పోస్టులను భర్తీ చేయనున్నారు. ప్రకాశం, గుంటూరు, నెల్లూరు జిల్లాల పరిధిలోని వారికి ఒంగోలులో ఈ నెల 27వ తేదీ రాత పరీక్షలు నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు రాత పరీక్ష నిర్వహించనున్నారు. మూడు జిల్లాల పరిధిలో మొత్తం 305 పోస్టులకుగాను 3887 మంది అభ్యర్థులు దరఖాస్తులు చేసుకున్నారు. ఇందులో ప్రకాశం జిల్లా నుంచి 1214 మంది, గుంటూరు జిల్లా నుంచి 1891 మంది, నెల్లూరు జిల్లా నుంచి 782 మంది అభ్యర్థులు ఉన్నారు. అర్హులైన అంగన్వాడీ కార్యకర్తలు, కాంట్రాక్టు సూపర్వైజర్లు, గ్రేడ్-1, గ్రేడ్-2, అంగన్వాడీ శిక్షణ కేంద్రాల్లో పని చేసే కో-ఆర్డినేటర్లు రెగ్యులర్ సూపర్వైజర్ పోస్టులకు దరఖాస్తు చేసుకున్నారు. ప్రతిభ, రోస్టర్ పద్ధతిన అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు. సూపర్వైజర్ పోస్టులకు సంబంధించిన మార్గదర్శకాలను మహిళా శిశు సంక్షేమ శాఖ రీజనల్ డిప్యూటీ డెరైక్టర్ సీహెచ్ కామేశ్వరమ్మ శనివారం విడుదల చేశారు. పరీక్ష నిర్వహణ సిలబస్ ఆరేళ్లలోపు పిల్లలకు పోషణ, రక్షణ, ఆరోగ్య పరీక్షలు, రిఫరల్ సేవలు, వ్యాధి నిరోధక టీకాలు, ఆహార పదార్థాల పంపిణీ, నిర్వహణ, సాధారణ అవగాహన, పూర్వ ప్రాథమిక విద్య, శిశు అభివృద్ధి, స్త్రీ, శిశువుల రక్షణ, గృహ హింస,మహిళలపై హింస సమగ్ర బాలల పరిరక్షణ పథకం, పోషణ, ఆరోగ్యవిద్య, గర్భిణులు, బాలింతలకు కౌన్సెలింగ్ వంటి అంశాలపై పరీక్షల సిలబస్ ఉంటుంది. పరీక్ష ఎలా నిర్వహిస్తారంటే.. = 45 మార్కులకు (90 ఆబ్జెక్టివ్ టైప్ ప్రశ్నలతో) ఓఎంఆర్ షీట్స్ ద్వారా రాత పరీక్ష నిర్వహించనున్నారు. = 8 తప్పుల సమాధానాలకు ఒక మార్కు మూల్యాంకనంలో తగ్గిస్తారు. = గ్రేడ్-1, గ్రేడ్-2 కాంట్రాక్టు సూపర్వైజర్లకు సర్వీస్ వెయిటేజ్ కింద 15 శాతం, బాలసేవిక శిక్షణ పొందిన వారికి 5 మార్కులు అదనంగా కేటాయించనున్నారు. = ఓఎంఆర్ షీట్స్‌లో సమాధానాలను బ్లూ లేదా బ్లాక్ బాల్ పాయింట్ పెన్నుతో రాయాలి. పరీక్షలు ఎక్కడ జరుగుతాయంటే.. ప్రకాశం జిల్లా నుంచి దరఖాస్తున్న వారిలో 538 మందికి సంతనూతలపాడు సమీపంలోని ఎస్ఎస్ఎన్ ఇంజినీరింగ్ కాలేజీ ఏ-బ్లాక్ , 676 మందికి బీ-బ్లాక్‌లో పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. గుంటూరు జిల్లా నుంచి దరఖాస్తు చేసుకున్న వారిలో 960 మందికి ఒంగోలులోని రావ్ అండ్ నాయుడు ఇంజినీరింగ్ కాలేజీ, 931 మందికి రైజ్ ప్రకాశం గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్లో పరీక్షా కేంద్రాలు కేటాయించారు. నెల్లూరు జిల్లా నుంచి దరఖాస్తు చేసుకున్న వారిలో 336 మందికి ఒంగోలులోని సెయింట్ జేవియర్స్ జూనియర్ కాలేజీ, 288 మందికి సెయింట్ జేవియర్స్ హైస్కూల్, 158 మందికి సంతనూతలపాడు సమీపంలోని ఎస్ఎస్ఎన్ ఇంజినీరింగ్ ఏ-బ్లాక్‌లో పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. దళారుల మాటలు నమ్మి మోసపోవద్దు: ఆర్డీడీ కామేశ్వరమ్మ సూపర్వైజర్ పోస్టులకు ప్రతిభ, రోస్టర్ పద్ధతి ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారని రీజనల్ డిప్యూటీ డెరైక్టర్ కామేశ్వరమ్మ వెల్లడించారు. అభ్యర్థులు దళారు మాటలు నమ్మి మోసపోవద్దని సూచించారు. పరీక్షలు పారదర్శకంగా నిర్వహించనున్నట్లు తెలిపారు. అభ్యర్థులు పరీక్ష రోజు ఉదయం పది గంటలకల్లా కేంద్రాలకు చేరుకోవాలని సూచించారు. అభ్యర్థులకు సంబంధిత సీడీపీఓల ద్వారా వారి కార్యాలయాల్లో హాల్ టికెట్లు అందిస్తామన్నారు. ఓఎంఆర్ షీట్స్ భర్తీ చేయించడం, సిలబస్‌పై తరగతుల నిర్వహించడం ద్వారా పరీక్ష విధానంపై అభ్యర్థులకు అవగాహన కల్పిస్తామని తెలిపారు.