అధిక ఉత్పాదకతనిచ్చే సరికొత్త వంగడాల దిశగా పరిశోధనలకు ప్రోత్సాహం
అధిక దిగుబడినిచ్చే 109 సరికొత్తవంగడాల విడుదల
ప్రైవేటు రంగానికి సైతం భాగస్వామ్యం
ప్రకృతి వ్యవసాయం వైపు కోటిమంది రైతులు
శాస్త్రీయ సంస్థలు, గ్రామ పంచాయతీల ద్వారా అమలు
భారీస్థాయిలో కూరగాయల ఉత్పత్తి క్లస్టర్లు
పప్పు దినుసులు, నూనెగింజల ఉత్పత్తి,నిల్వ, మార్కెటింగ్ బలోపేతం
400 జిల్లాల్లో డీపీఐ ద్వారా ఖరీఫ్ పంటల డిజిటల్ సర్వే
కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ వెల్లడి
న్యూఢిల్లీ: వ్యవసాయానికి బడ్జెట్‌లో కేంద్రం పెద్దపీట వేసింది. బడ్జెట్‌కు సంబంధించిన తొమ్మిది ప్రాధాన్య అంశాల్లో వ్యవసాయ ఉత్పాదకతను ఒకటిగా చేర్చింది. మధ్యంతర బడ్జెట్‌లో పేర్కొన్న పథకాలను కొనసాగిస్తూనే కొత్త విధానాలకు శ్రీకారం చుట్టింది. సాగు ఉత్పాదకతను పెంచడమే లక్ష్యంగా కేటాయింపులు జరిపింది. వ్యవసాయం దాని అనుబంధ రంగాలకు రూ.1.52 లక్షల కోట్లు కేటాయిస్తున్నట్లు కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ 2024–25బడ్జెట్ ప్రసంగంలోవెల్లడించారు.
పరిశోధనలకు ప్రోత్సాహం
‘వ్యవసాయ పరిశోధనలను సమగ్రంగాసమీక్షించడం ద్వారా ప్రతికూల వాతావరణాన్ని సైతం తట్టుకుని అధిక ఉత్పాదకతనిచ్చే సరికొత్త వంగడాల దిశగా ప్రోత్సహిస్తాం. ఈ మేరకు నిధులు కూడా అందజేస్తాం. ప్రైవేటు రంగానికి కూడా ఇందులో భాగస్వామ్యం కల్పిస్తాం. ప్రభుత్వ, ప్రభుత్వేతర వ్యవసాయ రంగ నిపుణులు ఈ పరిశోధనలను పర్యవేక్షిస్తారు. 32 వ్యవసాయ అలాగే ఉద్యాన పంటలకు సంబంధించి ప్రతికూల వాతావరణ పరిస్థితులను తట్టుకోగలిగే, అధిక దిగుబడినిచ్చే 109 కొత్తవంగడాలను రైతులు సాగుచేసేందుకు వీలుగా విడుదల చేస్తాం.
10 వేల బయో ఇన్‌పుట్ రిసోర్స్ కేంద్రాలు
వచ్చే రెండేళ్లలో దేశవ్యాప్తంగా కోటి మంది రైతులను సర్టిఫికేషన్, బ్రాండింగ్‌తో కూడిన ప్రకృతి వ్యవసాయం దిశగా ప్రోత్సహిస్తాం. శాస్త్రీయ సంస్థలు, ఆసక్తి కలిగిన గ్రామపంచాయతీల ద్వారా దీనిని అమలుచేస్తాం. 10 వేల అవసరాధారిత బయో ఇన్‌పుట్ రిసోర్స్ కేంద్రాలు (సేంద్రియ ఎరువుల కేంద్రాలు) ఏర్పాటు చేస్తాం.
సహకార సంఘాలు,స్టార్టప్‌లకు ప్రోత్సాహం
అధిక వినియోగ కేంద్రాలకు సమీపంలో భారీ స్థాయిలో కూరగాయల ఉత్పత్తి క్లస్టర్లు అభివృద్ధి చేస్తాం. రైతు–ఉత్పత్తిదారు సంఘాలను ప్రోత్సహిస్తాం. అలాగే కూరగాయల సేకరణ, నిల్వ, మార్కెటింగ్‌తో సహా కూరగాయల సరఫరా వ్యవస్థల కోసం సహకార సంఘాలు, స్టార్టప్‌లను ప్రోత్సహిస్తాం.
పప్పు దినుసులు, నూనెగింజల్లో స్వయం సమృద్ధి
పప్పు దినుసులు, నూనెగింజల్లో స్వయం సమృద్ధి సాధన దిశగా వాటి ఉత్పత్తి, నిల్వ, మార్కెటింగ్‌ను బలోపేతం చేస్తాం. మధ్యంతర బడ్జెట్‌లో ప్రకటించిన విధంగా వేరుశనగ, నువ్వులు, సోయాబీన్, పొద్దుతిరుగుడు తదితర నూనెగింజలకు ‘ఆత్మనిర్భరత’ సాధన కోసం ఓ ప్రత్యేక వ్యూహానికి రూపకల్పన చేస్తాం.
డిజిటల్ క్రాప్ సర్వే
పైలట్ ప్రాజెక్టు విజయవంతమైన నేపథ్యంలో కేంద్రం రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో..వచ్చే మూడేళ్లలో దేశవ్యాప్తంగా రైతులు, వారి భూముల కోసం వ్యవసాయంలో డిజిటిల్ పబ్లిక్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ (డీపీఐ) అమలు చేస్తాం. ఈ ఏడాది 400 జిల్లాల్లో డీపీఐ ద్వారా ఖరీఫ్ పంటల డిజిటల్ సర్వే నిర్వహిస్తాం. 6 కోట్ల మంది రైతులు, వారి భూముల వివరాలను రైతు, భూమి రిజిస్ట్రీల్లో పొందుపరుస్తాం. ఐదు రాష్ట్రాల్లో జన్ సమర్థ్ ఆధారిత కిసాన్ క్రెడిట్ కార్డులు జారీ చేస్తాం.
రొయ్యల ఉత్పత్తి ఎగుమతి
రొయ్యల సాగు కేంద్రాల నెట్‌వర్క్ ఏర్పాటుకు ఆర్థిక సాయంఅందజేస్తాం. నాబార్డ్ ద్వారా రొయ్యల సాగు, శుద్ధి, ఎగుమతికి నిధులుఅందజేస్తాం.
జాతీయ సహకార విధానం
సహకార రంగ సర్వతోముఖాభివృద్ధికి వీలుగా జాతీయ సహకార విధానాన్ని కేంద్రం తీసుకువస్తుంది.వేగవంతమైన గ్రామీణ ఆర్థిక వ్యవస్థ, పెద్దయెత్తున ఉపాధి కల్పన, అవకాశాలు లక్ష్యంగా ఈ విధానాన్ని రూపొందిస్తాం..’ అని ఆర్థికమంత్రి వెల్లడించారు.
భూసారం పెంపు,జీవవైవిధ్యానికిదోహదం
సుస్థిర వ్యవసాయ పద్ధతులను ప్రోత్సహించడం, రసాయన ఎరువులు, క్రిమిసంహారాలపై ఆధారపడటాన్ని తగ్గించడం లక్ష్యంగా రైతులను ప్రకృతి వ్యవసాయం వైపు మళ్లించాలని కేంద్రం భావిస్తోంది. ప్రకృతి వ్యవసాయం భూసారాన్ని పెంచడమే కాకుండా జీవవైవిధ్యానికి దోహదపడుతుంది.
రైతుల సాగు ఖర్చులు తగ్గేలా చేయడం ద్వారా వారి లాభదాయకతను పెంపొదిస్తుంది. రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో డిజిటల్ పబ్లిక్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ను ప్రోత్సహిస్తామని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. రైతులు వాతావరణ సూచనలు, పంటలకు సంబంధించిన సలహా సేవలు, మార్కెట్ ధరల గురించిన సమాచారం తెలుసుకునేందుకు ఈ డిజిటిల్ ఫ్రేమ్‌వర్క్ ద్వారా వీలు కలుగుతుంది.
యూరియాకు బడ్జెట్లో సబ్సిడీ తగ్గింపు
సాక్షి, హైదరాబాద్: కేంద్ర బడ్జెట్‌లో యూరియాకు సబ్సిడీ తగ్గింది. 2022–2023లో 1,65,217 కోట్లు సబ్సిడీపై ఖర్చు చేయగా, 2023–24లో రూ. 1,28,594 కోట్లకు తగ్గిపోయింది. 2024–25లో బడ్జెట్‌ను మరింత తగ్గించి 1,19,000 కోట్లు మాత్రమే కేటాయించారు. పోషకాధార ఎరువుల సబ్సిడీ కింద 2022–23లో రూ. 86,122 కోట్లు ఖర్చు చేయగా, 2024–25లో ఇంకా తగ్గించి రూ. 45,000 కోట్లు కేటాయించారు. అంటే కంపెనీలు పెంచే ఎరువుల ధరల భారాన్ని ఇకపై రైతులే భరించాల్సి ఉంటుందని రైతు నేతలు విమర్శిస్తున్నారు.
అలాగే 2019 నుంచి కేంద్ర బడ్జెట్‌లో వ్యవసాయ, అనుబంధ రంగాలకు కేటాయింపులు తగ్గిపోతూ వస్తున్నాయి. 2019–20 సంవత్సర మొత్తం బడ్జెట్లో వ్యవసాయ రంగానికి 5.44 శాతం కేటాయించగా, ఇప్పుడు 2024–2025లో໖ 3.15 శాతానికి పడిపోయింది. ఇక పంటల బీమా పథకానికి కూడా 2023–24లో రూ. 15,000 కోట్ల ఖర్చు అంచనా వేసిన ప్రభుత్వం ఈ ఏడాది దానిని రూ. 14,600 కోట్లకు తగ్గించింది. వ్యవసాయ రుణాలపై వడ్డీ రాయితీకి 2023–24 లో రూ. 23,000 కోట్లు కేటాయించిన ప్రభుత్వం ఈ సంవత్సరం రూ. 22,000 కోట్లు మాత్రమే కేటాయించింది.
మద్దతు ధరలకు చట్టబద్దత ఏదీ?
కన్నెగంటి రవి, రైతు స్వరాజ్య వేదిక, తెలంగాణరాష్ట్ర కమిటీకనీస మద్దతు ధరలకు చట్టబద్ధత కలి్పంచాలని కోరుతూ దేశవ్యాప్తంగా రైతులు గత ఏడేళ్లుగా ఆందోళనలు చేస్తున్నారు. మోదీ ప్రభుత్వం ఈ బడ్జెట్ సందర్భంగా ఈ చట్టం ప్రస్తావన చేయలేదు. పైగా వ్యవసాయ రంగానికి నిధుల కేటాయింపు కూడా తగ్గించింది.
Comments
Please login to add a commentAdd a comment