
ఢిల్లీ: మహిళా దినోత్సవం రోజున బీజేపీ నేతృత్వంలోని ఢిల్లీ ప్రభుత్వం ఆ రాష్ట్ర మహిళలకు తీపి కబురు అందించింది. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు మహిళలకు ఉచితంగా నెలకు రూ. 2,500 చొప్పున అందిస్తామని ఢిల్లీ సర్కార్ స్పష్టం చేసింది. ‘మహిళా సమృద్ధి యోజనా’ పథకంలో భాగంగా ఈ హామీని అమలు చేయాలని ఢిల్లీ క్యాబినెట్ నిర్ణయం తీసుకుంది. ముఖ్యమంత్రి రేఖా గుప్తా ఆధ్వర్యంలో జరిగిన ఈ క్యాబినెట్ భేటీలో మహిళలకు రూ. 2500 స్కీమ్‌కు ఆమోద ముద్ర పడింది.
దీనిపై సీఎం రేఖా గుప్తా మాట్లాడుతూ.. ‘ ఈరోజు మహిళల దినోత్సవం. మన క్యాబినెట్ సమావేశం కూడా అందుకే ఈరోజున పెట్టాం. మహిళా సమృద్ధి యోజనా పథకానికి క్యాబినెట్ ఆమోదం తెలిపింది. ఈ హామీని ఢిల్లీ ఎన్నికల ప్రచారంలో ప్రజలకు ఇచ్చాం. దాన్ని ఇప్పుడు అమలు చేయబోతున్నాం’ అని ఆమె తెలిపారు. ఈ స్కీమ్ కోసం రూ. 5,100 కోట్ల బడ్జెట్ ను కేటాయించినట్లు సీఎం రేఖా గుప్తా తెలిపారు. ఇందుకోసం ఒక కమిటీని తన నేతృత్వంలోనే ఏర్పాటు చేసి మరీ పథకాన్ని అమలు చేయడానికి శ్రీకారం చుట్టామన్నారు. ఇందుకోసం ఒక వెబ్ పోర్టల్ ను త్వరలోనే ఏర్పాటు చేస్తామని, ఈ పథకం కోసం రిజిస్ట్రేషన్లు అతి త్వరలోనే ప్రారంభమవుతాయన్నారు రేఖా గుప్తా.
మహిళా సమృద్ధి యోజనా పథకానికి ఆమోద ముద్ర పడింది. ఇందుకోసం పోర్టల్ త్వరలోనే మీ ముందుకు తీసుకొస్తాం. ఇక్కడ నుంచి అర్హులైన మహిళలు దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తుకు సంబంధించిన వివరాలను పోర్టల్ పొందుపరుస్తాం. దీనికి ముగ్గురు మంత్రుల కమిటీ ఉంది. కపిల్ శర్మ, అశిష్ సూద్, పర్వేష్ వర్మలతో కూడిన కమిటీని ఏర్పాటు చేశాం. ఈ సందర్భంగా అందరికీ కృతజ్ఞతలు తెలుపుతున్నాను’ అని మంత్రి మన్ జిందర్ సింగ్ సిర్సా పేర్కొన్నారు.