నిధులకు నిరీక్ష.. కూటమికి పరీక్ష | The Centre will present the budget in Parliament tomorrow | Sakshi
Sakshi News home page

నిధులకు నిరీక్ష.. కూటమికి పరీక్ష

Jan 31 2025 4:32 AM | Updated on Jan 31 2025 4:31 AM

The Centre will present the budget in Parliament tomorrow

‘ఉపాధి’, వ్యవసాయం, రైల్వేకు కేటాయింపులపై గంపెడాశలు

ఏటా బడ్జెట్‌లో ‘ఉపాధి’కి డిమాండ్‌ కన్నా తక్కువ నిధులు

ఏడాది చివరలో అనుబంధ బడ్జెట్‌తోనే అదనపు నిధులు

తద్వారా జనవరి–మార్చిలో కూలీల వేతనాల చెల్లింపుల్లో తీవ్ర ఆలస్యం

వ్యవసాయ, అనుబంధ రంగాలను గ్రోత్‌ ఇంజన్స్‌గా గుర్తించాలి

పీఎం కిసాన్‌ సాయం రెట్టింపు చేయాలి

ఎరువులు, విత్తన నాణ్యతపై పటిష్ట నిఘా వ్యవస్థ ఏర్పాటు చేయాలి 

కీలక రైల్వే లైన్ల నిర్మాణంపై దృష్టి పెట్టాలి

కేంద్రం రేపు పార్లమెంట్‌లో ప్రవేశ పెట్టనున్న 2025–26 ఆర్థిక సంవత్సరం బడ్జెట్లో ‘ఉపాధి’, వ్యవసాయం, రైల్వేకు కేటాయింపులపై జనం గంపెడాశలు పెట్టుకున్నారు. ఉపాధి హామీ పథకం ద్వారా ఒక్కో కుటుంబానికి ఏటా గరిష్టంగా 150 పని దినాలు కల్పిస్తూ కేంద్రం బడ్జెట్‌లో ప్రకటన చేయాలని, పథకం అమలుకు సరిపడినన్ని నిధులను ముందుగానే కేటాయించాలని కోరుతున్నారు. ఏటా కేటాయింపులు తక్కువగా ఉండటంతో సరైన సమయానికి నిధులు విడుదల కాక రాష్ట్రాల్లో పేదలకు పనుల కల్పన తగ్గిపోతోందని చెబుతున్నారు. 

మన రాష్ట్రంలో గత ఏడాది సగటున ఒక్కో కుటుంబానికి 55 రోజుల చొప్పున పనులు కల్పించగా, ఈ ఏడాది ఆ సంఖ్య 47కు తగ్గిపోయిందని గుర్తు చేస్తున్నారు. మరోవైపు వ్యవసాయ రంగానికి ఈ దఫా కేటాయింపులు భారీగా పెంచాలని అన్నదాతలు డిమాండ్‌ చేస్తున్నారు. దేశంలో 68 శాతం జనాభా ఈ రంగంపైనే ఆధారపడి జీవిస్తున్న తరుణంలో గతేడాది బడ్జెట్‌లో కేవలం రూ.1.52 లక్షల కోట్లు మాత్రమే కేటాయించారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 

మొత్తం బడ్జెట్‌లో ఇది 3.1 శాతం మాత్రమేనని చెబుతున్నారు. ఇతర రంగాలకు జరిపే కేటాయింపులతో పోల్చి చూస్తే వ్యవసాయ అనుబంధ రంగాలకు జరిపే కేటాయింపులు కూడా చాలా తక్కువని నిపుణులు చెబుతున్నారు. ఇక రాష్ట్రంలో రైల్వే గురించి ఎంత తక్కువగా చెప్పుకుంటే అంతమంచిదని ఆ రంగ ఉద్యోగులే వాపోతున్నారు. కొత్త రైల్వే లైన్లు, ఆధునికీకరణపై ఈసారైనా దృష్టి సారించాలని ప్రజలు కోరుకుంటున్నారు. – సాక్షి, అమరావతి

కనీసం 150 పని దినాలు కల్పించాలి
ఉపాధి హామీ పథకం అమలుకు ఆర్థిక ఏడాది చివరిలో నిధుల కొరత తలెత్తకుండా కేంద్రం ఫిబ్రవరి ఒకటిన ప్రవేశపెట్టే 2025–26 ఆర్థిక సంవత్సరం బడ్జెట్‌(Budget)లోనైనా నిధులు కేటాయించాలని దేశ వ్యాప్తంగా కోట్లాది మంది ఉపాధి హామీ పథకం(Employment Guarantee Scheme) జాబ్‌కార్డుదారులు కోరుకుంటున్నారు. దేశ వ్యాప్తంగా ఈ పథకం కింద మొత్తం ఖర్చులో 90 శాతం కేంద్రమే భరించాల్సి ఉంటుంది. 

ఆయా రాష్ట్రాల్లో పథకం అమలు పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వ పర్యవేక్షణలో కొనసాగుతుంది. చట్టం నిబంధన ప్రకారం పని అడిగిన ప్రతి కూలీ కుటుంబానికి ప్రభుత్వం ఉపాధి కల్పించాల్సి ఉంటుంది. అయితే, కొన్నేళ్లుగా దేశ వ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో ఈ పథకం అమలులో డిమాండ్‌కు తగ్గట్టుగా కేంద్రం వార్షిక బడ్జెట్‌లో నిధులు కేటాయించడం లేదు. దీంతో ప్రతి ఏటా ఆర్థిక ఏడాది చివరిలో జనవరి–మార్చి నెలల మధ్య పని చేసిన కూలీలకు వేతనాల చెల్లింపులు నెలల తరబడి ఆలస్యమవుతున్నాయి. 

దీనికి తోడు మ్యాచింగ్‌గా మెటీరియల్‌ కేటగిరిలో రాష్ట్రాలకు విడుదల చేయాల్సిన నిధులను ఆలస్యంగా విడుదల చేస్తున్న కారణంగా అభివృద్ధి పనుల నిర్వహణపై ప్రభావం పడుతోంది. ప్రస్తుత 2024–25 వార్షిక బడ్జెట్‌లో దేశ వ్యాప్తంగా ఉపాధి హామీ పథకం అమలుకు కేంద్రం రూ.86 వేల కోట్లు కేటాయించింది. అయితే, జనవరి 26వ తేదీ (సోమవారం) నాటికే అన్ని రాష్ట్రాల్లో జరిగిన పనులకు రూ.87,865 కోట్లు ఖర్చయింది. 

ఈ లెక్కన ఈ ఆర్థిక ఏడాదిలో ఇంకా మిగిలి ఉన్న ఫిబ్రవరి, మార్చి నెలల్లో పని చేసే కూలీలకు వేతనాలు చెల్లించడానికి అదనపు నిధులు కేటాయించాల్సి ఉంటుంది. మరోవైపు కూలీల వేతనం ఏటా పెరుగుతున్నా, ఆ మేరకు బడ్జెట్‌ కేటాయింపులు పెంచడం లేదని నిపుణులు పేర్కొంటున్నారు. ప్రధానంగా పని దినాల సంఖ్య 100 నుంచి 150కి పెంచాలని పేదలు, వివిధ ఎన్జీవో సంఘాలు, రాజకీయ వర్గాల నుంచి బలంగా డిమాండ్‌ వినిపిస్తోంది.  

పెద్దపీటతోనే ‘సాగు’ క్షేమం
వ్యవసాయ రంగానికి ఈ దఫా కేటాయింపులు భారీగా పెంచాలన్న డిమాండ్‌ రైతుల నుంచి వ్యక్తమవుతోంది. దేశ జీడీపీలో 15 శాతానికి పైగా ఈ రంగం నుంచే వస్తోంది. ఏటా ప్రకటిస్తున్న కనీస మద్దతు ధరలపై రైతు సంఘాలు పెదవి విరుస్తున్నాయి. ఫసల్‌ బీమా యోజన, పీఎం కిసాన్‌ వంటి పథకాలకు 2023–24తో పోలిస్తే 2024–25లో భారీగా కోత విధించారు. 

ఈసారి మొత్తం బడ్జెట్‌లో వ్యవసాయ అనుబంధ రంగాలకు కనీసం 5–10 శాతానికి తక్కువ కాకుండా కేటాయింపులు జరపాలనే డిమాండ్‌ విన్పిస్తోంది. పీఎం కిసాన్‌ ద్వారా ఇచ్చే సాయం రెట్టింపు చేయాలని రైతులు కోరుతున్నారు. ఫసల్‌ బీమా యోజనకు కేటాయింపులు పెంచడమే కాదు.. ప్రీమియం చెల్లింపు భారం రైతులపై మోపకుండా పూర్తిగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సమానంగా భరించేలా మార్పులు తీసుకు రావాలని రైతులు డిమాండ్‌ చేస్తున్నారు. 

ఆర్గానిక్‌ ప్రొడక్ట్స్‌ను ప్రమోట్‌ చేసేందుకు ప్రత్యేక వ్యవస్థను, జాతీయ స్థాయిలో సర్టిఫికేషన్‌ ఏజెన్సీని ఏర్పాటు చేయాలని కోరుతున్నారు. ఎక్స్‌పోర్ట్‌ ఓరియంటెడ్‌ ప్రొడక్ట్స్‌గా వీటిని ప్రోత్సహించేందుకు ఎఫ్‌పీవోలు, ఎస్‌హెచ్‌సీలను ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. ఏపీలో ఆయిల్‌ పామ్‌ మరింతగా విస్తరణ, రైతు ఉత్పత్తిదారుల సంఘాల ద్వారా కూరగాయల ఉత్పత్తి, సరఫరా చైన్‌ను ఏర్పాటు చేయడం, వీటి నిల్వ కోసం గ్రామ స్థాయిలో స్టోరేజ్, మార్కెటింగ్‌ సౌకర్యాల కల్పనకు చేయూతనివ్వాలి. 

బడ్జెట్‌లో వ్యవసాయ, అనుబంధ రంగాలకు ప్రాధాన్యత ఇవ్వాలి. యంత్ర పరికరాలతో పాటు డ్రోన్స్‌ వినియోగాన్ని ప్రోత్సహించాలి. సేంద్రియ ఉత్పత్తులను ప్రోత్సహించేలా జాతీయస్థాయిలో వ్యవస్థ  ఏర్పాటు చేయాలి. ఉద్యాన, మత్స్య, పాడి రంగాల్లో కూడా ఆర్గానిక్‌ ఉత్పత్తులను ప్రోత్సహించేలా రాయితీలు ప్రకటించాలి. అపరాలు, నూనె గింజల సాగును ప్రోత్సహించాలి. పరిశోధన కేంద్రాలకు నిధులు పెంచాలి.

పట్టాలెక్కని రైల్వే ప్రాజెక్టులు
రాష్ట్రంలో రైల్వే ప్రాజెక్టులపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మాటలు కోటలు దాటినా నిధుల కేటాయింపు మాత్రం కేంద్ర ప్రభుత్వ ఖజానా దాటడం లేదు. టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి ప్రభుత్వం ఉన్న నేపథ్యంలో 2025–26 వార్షిక బడ్జెట్‌లో అయినా రాష్ట్రంలోని రైల్వే ప్రాజెక్టులకు తగినన్ని నిధులు రాబట్టడంలో సఫలమవుతారా లేదా అన్నది ప్రస్తుతం చర్చనీయాంశమైంది. 

గుంటూరు జిల్లా నంబూరు నుంచి అమరావతి మీదుగా ఎర్రుపాలెం వరకు రైల్వేలైన్‌ నిర్మాణం కోసం 2014లోనే రైల్వేశాఖ ఆమోదించినట్లు ప్రకటించింది. ఆ ఐదేళ్లలో కనీసం సర్వే కూడా పూర్తిచేయలేదు. ఇప్పుడు మరోసారి అమరావతి రైల్వే లైన్‌పై మాటల గారడి చేస్తున్నాయి. రైల్వేకు సంబంధించి ప్రధాన డిమాండ్లు ఇలా ఉన్నాయి.  

» కాకినాడ–పిఠాపురం (21.51 కి.మీ.), మాచర్ల–నల్గొండ (92 కి.మీ.), కంభం–ప్రొద్దుటూరు (142కి.మీ.), గూడూ రు–దుగ్గరా జుపట్నం (41.55 కి.మీ.) రైల్వేలైన్ల నిర్మాణాన్ని పట్టాలెక్కించాలి. కొండపల్లి– కొత్తగూడెం (125 కి.మీ.), భద్రాచలం–కొవ్వూరు (151 కి.మీ.) లైన్ల నిర్మాణం సంగతి తేల్చాలి.
»   కడప–బెంగళూరు (255 కి.మీ), కోటిపల్లి–నర్సాపురం రైల్వే లైన్ల నిర్మాణాన్ని త్వరితగతిన పూర్తి చేయాలి. 
» నడికుడి–శ్రీకాళహస్తి, డోన్‌–అంకోలా, విజయవాడ–ఖరగ్‌పూర్, విజయ­వాడ–నాగ్‌­పూర్‌ డెడికేటెడ్‌ ఫ్రైట్‌ కారిడార్లు వెంటనే పూర్తి చేసేలా నిధులు మంజూరు చేయాలి.
» కర్నూలు జిల్లాలో రూ.440 కోట్లతో నిర్మిస్తున్న కోచ్‌ ఫ్యాక్టరీ పనులు సకాలంలో పూర్తి చేయాలి.
»  తిరుపతి కేంద్రంగా బాలాజీ డివిజన్‌ను ఏర్పాటుచేయాలి. జయవాడ–గూడూరు మధ్య నాలుగో లైన్‌ నిర్మించాలి. కడప–బెంగళూరు రైల్వేలైన్‌ అలైన్‌మెంట్‌ మార్చాలి. ఇప్పటికే ఆమోదించిన మచిలీపట్నం–రేపల్లె రైల్వేలైన్‌ను బాపట్ల వరకు పొడిగించాలి.
»  ఓబులవారిపల్లి–కృష్ణపట్నం రైలు మార్గంలో పాసింజర్‌ రైలును నడపాలి. నందలూరు రన్నింగ్‌ స్టాఫ్‌ సెంటర్‌ను మరింత అభివృద్ధి చేయాలి. అన్ని ఎక్స్‌ప్రెస్‌ రైళ్లకు ఒంటిమిట్టలో హాల్టింగ్‌ కల్పించాలి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement