బడ్జెట్ ప్రసంగంలో స్పష్టం చేసిన కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్
వివిధ ఏజెన్సీల ద్వారా నిధులు సమకూరుస్తాం
రానున్న రోజుల్లో మరిన్ని నిధులు అందజేస్తాం
ఉత్తరాంధ్ర, రాయలసీమ, ప్రకాశం జిల్లాలకు ప్రత్యేక ప్యాకేజీ కింద నిధులు
తూర్పుతీర రాష్ట్రాలైన ఏపీ, ఒడిశా, పశ్చిమబెంగాల్‌లకు ‘పూర్వోదయ’
సాక్షి, న్యూఢిల్లీ : ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి అభివృద్ధికి ప్రస్తుత బడ్జెట్‌లో రూ.15 వేల కోట్లు ఆర్థిక సాయం చేయనున్నట్లు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. ఆ నిధులను బహుపాక్షిక అభివృద్ధి ఏజెన్సీల ద్వారా ఇస్తామని తెలిపారు. ‘ఏపీ పునర్ వ్యవస్థీకరణ చట్టంలోని హామీలను నెరవేర్చేందుకు మా ప్రభుత్వం అన్ని ప్రయత్నాలు చేసింది. రాష్ట్రానికి రాజధాని అవసరాన్ని గుర్తిస్తూ వివిధ అభివృద్ధి సంస్థల ద్వారా ప్రత్యేక ఆర్థిక సాయాన్ని సమకూరుస్తాం.
ప్రస్తుత ఆర్థిక ఏడాదిలో రూ.15 వేల కోట్లు, రానున్న రోజుల్లో అదనపు మొత్తాలను అందచేస్తాం’ అని ఆమె తన బడ్జెట్ ప్రసంగంలో స్పష్టం చేశారు. మంగళవారం 2024–25 వార్షిక బడ్జెట్‌లో భాగంగా ఆమె తన ప్రసంగంలో ఏపీ పునర్విభజన చట్టం, అందులో పేర్కొన్న అంశాలను ప్రస్తావించారు. రాష్ట్ర ప్రజల జీవనాడి అయిన పోలవరం ప్రాజెక్టును పూర్తి చేయడానికి కేంద్రం కట్టుబడి ఉందని, అందుకోసం ఆర్థిక సాయం చేస్తామని తెలిపారు.
భారత ఆహార భద్రతకు పోలవరం ప్రాజెక్టు ఎంతో కీలకం అని చెప్పారు. రానున్న రోజుల్లో రాష్ట్ర అభివృద్ధికి అదనపు నిధులను ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. ఏపీతో పాటు బీహార్‌కు కూడా రూ.11,500 కోట్ల నిధులు కేటాయించామన్నారు. వారణాసిలోని విశ్వనాథుని ఆలయం తరహాలో బీహార్‌లోని బుద్దగయాలో ఒకటి ఏర్పాటు చేస్తామని తెలిపారు. బీహార్‌లో పారిశ్రామిక కారిడర్ అభివృద్ధికి కేంద్రం కట్టుబడి ఉందని అన్నారు.
వెనుకబడిన జిల్లాలకు ప్రత్యేక ప్యాకేజీ
ఏపీ అభివృద్ధికి కేంద్రం కట్టుబడి ఉందని నిర్మలా సీతారామన్ తెలిపారు. అందులో భాగంగా రాష్ట్రంలోని వెనుకబడిన ఉత్తరాంధ్ర, రాయలసీమ, ప్రకాశం జిల్లాలకు ప్రత్యేక ప్యాకేజీ కింద నిధులు మంజూరు చేస్తామని చెప్పారు. విభజన చట్టం ప్రకారం.. పారిశ్రామిక రంగం అభివృద్ధికి ప్రత్యేక సహకారం అందిస్తాం అన్నారు. హైదరాబాద్–బెంగుళూరు పారిశ్రామిక కారిడార్ అభివృద్ధికి ప్రత్యేక నిధులు ఇవ్వనున్నట్లు తెలిపారు.
విశాఖపట్నం–చెన్నై పారిశ్రామిక కారిడార్‌లోని నోడ్‌లకు ప్రత్యేకంగా సాయం చేస్తామన్నారు. కొప్పర్తి, ఓర్వకల్లు పారిశ్రామిక కేంద్రాలకు నీళ్లు, విద్యుత్, రోడ్లు, రైల్వేలు, హైవేల అభివృద్ధికి నిధులు కేటాయిస్తామని ప్రకటించారు. చెన్నై కారిడార్‌లో కొప్పర్తికి, హైదరాబాద్–బెంగళూరు కారిడార్‌లో ఓర్వకల్లుకు నిధులు ఇస్తామని చెప్పారు.
తూర్పు తీర ప్రాంతాలైన ఏపీ, ఒడిశా, పశ్చిమ బెంగాల్, జార్ఖండ్, బీహార్ రాష్ట్రాలను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు నిర్ణయించుకున్నట్లు నిర్మలా సీతారామన్ తెలిపారు. విద్య, మౌలిక వసతులు, ఆర్థిక అవకాశాలు కల్పించి వికసిత్ భారత్‌కు ఈ ప్రాంతాలు గ్రోత్ ఇంజన్ అయ్యేలా కృషి చేస్తామన్నారు. దీనికి పూర్వోదయ అనే ప్రణాళిక రూపొందిస్తున్నట్లు వివరించారు.
ఆ నిధులు ప్రపంచ బ్యాంకు నుంచి..
‘బడ్జెట్ ప్రసంగంలో చెప్పినట్లుగా అమరావతి కోసం రూ.15 వేల కోట్లను వివిధ బ్యాంకుల ద్వారా అప్పుగా (రుణాలు) తీసుకుంటాం. ఏడీబీ లేక ఏఐబీ లేక ప్రపంచ బ్యాంకు నుంచి తీసుకుంటాం’ అని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ మరింత స్పష్టత ఇచ్చారు. బడ్జెట్ ప్రసంగం అనంతరం ఆమె మీడియా సమావేశంలో మాట్లాడారు. తన ప్రసంగంలో చెప్పినట్లుగా భవిష్యత్‌లోనూ సాయాన్ని కొనసాగిస్తామని తెలిపారు.
అయితే ఆ మొత్తం ఎంత అన్నది చెప్పలేమని, పునర్విభజన చట్టం ప్రకారం రాజధాని నిర్మాణానికి కేంద్రమే సాయం చేయాలన్నారు. దానికి కేంద్రం కట్టుబడి ఉంది అని చెప్పారు. దేశంలోని జాతీయ ప్రాజెక్టులను కేంద్రం నిర్మిస్తుండగా.. పోలవరం మాత్రం అక్కడి రాష్ట్ర ప్రభుత్వం నిర్మిస్తున్నట్లు తెలిపారు. ఇందుకు తాము గతంలోనే ఒప్పుకున్నామని గుర్తు చేశారు.
పోలవరం, రాజధాని నిర్మాణంపై మీడియా అడిగిన పలు ప్రశ్నలకు నిర్మలా సీతారామన్ తెలుగులో జవాబు ఇచ్చారు. కేబినెట్ ద్వారా ఎంత అప్రూవల్ అయ్యిందో దానిమేరకు ఇప్పటి వరకు నిధులను ఇస్తూనే ఉన్నామని తెలిపారు. ప్రాజెక్టు నిర్మాణ విషయంలో ఒప్పందానికి లోబడి నిధులు ఇస్తామని స్పష్టం చేశారు. అయితే ఇటీవల కొన్ని కొత్త సమస్యలు వచ్చాయని, ప్రసుత్తం వాటి జోలికి వెళ్లడం లేదన్నారు.
Comments
Please login to add a commentAdd a comment