రక్షణ రంగానికి.. రూ.6.22 లక్షల కోట్లు
దేశీయ సైనిక ఉపకరణాల సేకరణకు రూ.1,72,000 కోట్లు
కేంద్ర బడ్జెట్‌లో రక్షణరంగవాటా..12.9 శాతానికి చేరిక
న్యూఢిల్లీ: చైనా కవ్వింపులు, పాక్ ముష్కరుల చొరబాట్లతో సరిహద్దుల వెంట అప్రమత్తంగా ఉండే సైన్యంతోపాటు భూతల, గగనతల రక్షణ వ్యవస్థల మరింత పటిష్టతే లక్ష్యంగా మోదీ సర్కార్ మరోమారు రక్షణ రంగానికి పెద్దపీట వేసింది. 2024–25 ఆర్థికసంవత్సరంలో రక్షణ రంగానికి రూ.6,21,940.85 కోట్లు కేటాయించింది. అత్యాధునిక డ్రోన్లు, యుద్ధవిమా నాలు, నౌకలు, ఆయుధాలు, ఇతర సైనిక ఉపకరణాల కొనుగోలు కోసం ఏకంగా రూ.1,72,000 కోట్లను కేటాయించారు. తాజా కేంద్ర బడ్జెట్‌లో రక్షణరంగ వాటా 12.9 శాతానికి పెరగడం విశేషం.
గత ఆర్థికసంవత్సరంతో పోలిస్తే ఈసారి రక్షణరంగానికి కేటాయింపులు 4.79 శాతం పెంచారు. రక్షణ రంగంలో స్వావలంబనే లక్ష్యంగా సైనిక ఉపకరణాల స్థానిక తయారీని మరింత ప్రోత్సహించేందుకు మోదీ సర్కార్ నడుం బిగించింది. అందుకే స్థానిక ఉపకరణాల సేకరణ కోసం రూ.1,05,518.43 కోట్లను కేటాయించింది. దీంతో బీజేపీ సర్కార్ లక్షిత రక్షణరంగంలో ఆత్మనిర్భరత మరింతగా సాకారంకానుంది.
లక్షల కోట్ల బడ్జెట్‌ను రక్షణరంగానికి కేటాయించిన విత్తమంత్రి నిర్మలకు కృతజ్ఞతలు అంటూ రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ‘ఎక్స్’లో ట్వీట్‌చేశారు. ‘‘ ఆధునిక ఆయుధ సంపత్తి సమీకరణతో త్రివిధ బలగాల శక్తిసామర్థ్యాలు మరింత ద్విగుణీకృతం కానున్నాయి. దేశీయ సంస్థలు తయారుచేసిన సైనిక ఉపకరణాలు, ఆయుధాలతో దేశం రక్షణరంగంలోనూ ఆత్మనిర్భరతను వేగంగా సాధించనుంది’’ అని రాజ్‌నాథ్ అన్నారు.
అగ్నిపథ్ పథకం కోసం రూ.5,980 కోట్లు
గత బడ్జెట్‌తో పోలిస్తే ఈసారి సరహద్దుల వెంట రహదారుల నిర్మాణానికి కేటాయింపులు 30 శాతం పెరగడం విశేషం. బీఆర్‌వోకు కేటాయించిన రూ.6,500 కోట్ల నిధులతో సరిహద్దుల వెంట మౌలికవసతుల కల్పన మెరుగుపడనుంది. రక్షణరంగ పరిశ్రమల్లో అంకుర సంస్థలను ప్రోత్సహించే ఉద్దేశంతో ఐడెక్స్ పథకానికి రూ.518 కోట్లు కేటాయించారు. అంకుర సంస్థలు, సూక్ష్మచిన్నమధ్యతరహా పరిశ్రమలు, ఆవిష్కర్తలు ఇచ్చే కొత్త ఐడియాలను ఆచరణలో పెట్టేందుకు ఈ నిధులను వినియోగించనున్నారు.
కోస్ట్‌గార్డ్ ఆర్గనైజేషన్‌కు రూ.7,651 కోట్లు కేటాయించారు. తేజస్ వంటి తేలికపాటి యుద్ధవిమానాలను తయారుచేస్తూ నూతన విమానాల డిజైన్, రూపకల్పన, తయారీ కోసం కృషిచేసే హిందుస్తాన్ ఏరోనాటిక్స్‌కు రూ.1,600 కోట్లు కేటాయించారు. రాష్ట్రీయ రైఫిల్స్ విభాగం కోసం రూ.10,535 కోట్లు కేటాయించారు. ఎన్‌సీసీ కోసం రూ.2,726 కోట్లు, త్రివిధ దళాల్లో అగ్నిపథ్ పథకం నిర్వహణ కోసం రూ.5,980 కోట్లు కేటాయించారు.
Comments
Please login to add a commentAdd a comment